కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రార్థన చేయడం ఏమైనా మంచిని చేకూర్చగలదా?

ప్రార్థన చేయడం ఏమైనా మంచిని చేకూర్చగలదా?

ప్రార్థన చేయడం ఏమైనా మంచిని చేకూర్చగలదా?

దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ప్రార్థించాలన్న కోరిక ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది. వాస్తవానికి ప్రతి మతంలోని ప్రజలూ వారి మత నమ్మకాల ప్రకారం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారు. ఉదాహరణకు, రోజుకు కొన్ని వేలసార్లు ఒక బౌద్ధమతస్థుడు “నేను అమీడా బుద్ధాపై నా విశ్వాసాన్నుంచుతున్నాను” అని చెప్తాడు.

భూ వ్యాప్తంగా ఉన్న తీరని సమస్యల దృష్ట్యా, ప్రార్థన చేయడం ద్వారా ప్రజలు అసలు ఏమి సాధించాలనుకుంటున్నారు అని అడగడం సహేతుకమైనదే. అసలు ఈ ప్రార్థనలన్నీ ఏమైనా మంచిని చేకూర్చగలవా?

ప్రజలెందుకు ప్రార్థన చేస్తారు?

చాలామంది ప్రాచ్య దేశస్థులు తమ పూర్వికులను, షింటో లేదా టావో అనే మతాల్లోని దేవుళ్ళను ఆరాధిస్తారు. స్కూల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలనో, మంచి పంటలు పండాలనో, వ్యాధుల నుండి రక్షణ కోసమో వాళ్ళు ప్రార్థిస్తారు. తమ ప్రయత్నాలవల్ల బౌద్ధులు జ్ఞానోదయం పొందుతామని నిరీక్షిస్తారు. జ్ఞానము, సంపద, కాపుదల కోసం హిందువులు భక్తిపూర్వకంగా తమ ఇష్టదేవుళ్ళను, దేవతలను ఆరాధిస్తారు.

క్యాథలిక్కు సన్యాసులు, సన్యాసినులు మఠాల్లోనూ కాన్వెంట్లలోనూ ఉంటూ ఎడతెగక ప్రార్థించడం వల్ల మానవజాతికి ప్రయోజనాన్ని చేకూరుస్తున్నామని తలస్తారు, వారికి సాధారణంగా బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. కోట్లాదిమంది క్యాథలిక్కులు బహుశా జపమాల పూసల సహాయంతో బట్టీపట్టిన ప్రార్థనలు చేయడం ద్వారా మరియ అనుగ్రహాన్ని పొందాలని ఎదురుచూస్తుంటారు. ప్రాచ్య దేశాల్లో చాలామంది ప్రజలు ప్రార్థన చక్రాలను ఉపయోగిస్తారు. అలాగే కొంతమంది ప్రొటెస్టంట్లు, తమ స్వంత భావాలను వ్యక్తపరచినప్పటికీ పరలోక ప్రార్థనలోని మాటలను అప్పజెబుతుంటారు. చాలామంది యూదులు జెరూసలేమ్‌లోని వెస్టర్న్‌ వాల్‌ దగ్గర ప్రార్థన చేయడానికి చాలాదూరం ప్రయాణించి వెళ్తారు, ఆలయ పునర్నిర్మాణం జరగాలనీ, శాంతి సౌభాగ్యాలుండే ఒక నూతన యుగం కావాలనీ ప్రార్థిస్తారు.

అలా కోట్లాదిమంది తీవ్రంగా ప్రార్థనలు చేస్తున్నప్పటికీ పేదరికం, బానిసత్వం, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం వంటివి మహమ్మారుల్లా మానవ సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఈ ప్రజలందరూ సరైన మార్గంలో ప్రార్థించడం లేదన్నదే దానికి గల కారణం కావచ్చా? ఆ విషయానికి వస్తే అసలు నిజంగా ప్రార్థనలు వినేవారు ఎవరైనా ఉన్నారా?

ప్రార్థనలు ఎవరైనా వింటారా?

మన విన్నపాలను ఎవరైనా వింటేనేగానీ అవి ఎలాంటి మంచినీ చేయలేవు. ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నప్పుడు, అదృశ్య లోకాన్నుండి ఎవరో ఆయన ప్రార్థన వింటున్నారన్న నమ్మకాన్ని కలిగివుంటాడు. అయితే, ప్రార్థనలు కేవలం శబ్ద తరంగాల ద్వారా మాత్రమే దేవునికి చేరవు. ప్రార్థిస్తున్నవారి తలంపులను సహితం ఒకరు చదవగలరని అనేకమంది నమ్ముతారు. అలాంటివ్యక్తి ఎవరైవుండవచ్చు?

కోట్లాది నాడీకణాలతో నిండివున్న మన మెదడులోని వెలుపలి పొరలో నుండి తలంపులు ఎలా ఉద్భవిస్తాయో తెలుసుకోవడం పరిశోధకులకు ఒక పెద్ద మిస్టరీగా తయారయింది. అయితే ఆ మెదడునే తయారుచేసిన వ్యక్తి అటువంటి తలంపులను చదువగలడనడం సహేతుకం. అది యెహోవా తప్ప మరెవరూ కారు. (కీర్తన 83:18; ప్రకటన 4:10, 11) ప్రార్థనలు ఆయనకు మాత్రమే చేయాలి. కానీ మరి ఆ ప్రార్థనలనన్నింటికీ యెహోవా అవధానాన్నిస్తాడా?

ప్రార్థనలన్నీ ఆలకింపబడతాయా?

ప్రాచీన ఇశ్రాయేలీయుల రాజైన దావీదు ప్రార్థనాపరుడు. దైవ ప్రేరేపిత కీర్తనల రచయితగా ఆయనిలా పాడాడు: “ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు.” (కీర్తన 65:⁠2) మానవజాతి మాట్లాడే వేలాది భాషల్లో, ఏ భాషలో ప్రార్థించినప్పటికీ యెహోవా అర్థం చేసుకోగలడు. ఏ మానవ మెదడు కూడా అంతటి సమాచారాన్ని ప్రాసెస్‌ చేయలేదు గనుక దేవుడు కూడా ఆయనకు అంగీకారయుక్తంగా ప్రార్థించేవారందరి ప్రార్థనలను వినలేడని అర్థంకాదు.

ప్రార్థనాపరుడైన మరొక వ్యక్తి అయిన యేసు అన్ని ప్రార్థనలు దేవుని సంతోషపరచవని బయల్పర్చాడు. అప్పట్లో కంఠతా పట్టిన ప్రార్థనలను మళ్ళీ మళ్ళీ చెప్పే అందరికీ తెలిసిన ఒక ఆచారం గురించి యేసు ఏమి చెప్పాడో చూడండి. ఆయన చెప్పిన విషయాన్ని గురించి పవిత్ర గ్రంథము క్యాతలిక్‌ అనువాదము ఇలా చెప్తుంది: “అన్యులవలె అనేక వ్యర్థపదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినగాని, దేవుడు తమ మొఱనాలకింపడని వారు భావింతురు.” (మత్తయి 6:⁠7) మన భావాలను నిజంగా వ్యక్తపర్చని ప్రార్థనలను యెహోవా వినాలని మనం ఎదురుచూడకూడదు.

కొన్ని ప్రార్థనలు దేవుణ్ణి ఎందుకు సంతోషపరచవన్న విషయాన్ని గూర్చి బైబిలులోని ఒక సామెత ఇలా చెప్తుంది: “ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము.” (సామెతలు 28:⁠9) మరో సామెత ఇలా చెప్తుంది: “భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.” (సామెతలు 15:​29) ప్రాచీన యూదా నాయకులు ఘోరమైన పాపం చేసినప్పుడు, యెహోవా ఇలా ప్రకటించాడు: “మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను; మీ చేతులు రక్తముతో నిండియున్నవి.”​—⁠యెషయా 1:1, 15.

ప్రార్థనలు దేవునికి అనంగీకారమైనదిగా చేసేది ఒకటి ఉందని అపొస్తలుడైన పేతురు పేర్కొన్నాడు. “అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి” అని పేతురు వ్రాశాడు. (1 పేతురు 3:⁠7) అలాంటి హెచ్చరికను లక్ష్యపెట్టని ఆ వ్యక్తి ప్రార్థనలు ఇంటి పైకప్పును కూడా దాటవు!

స్పష్టంగా, ప్రార్థనలు ఆలకింపబడాలంటే కొన్ని అర్హతలను చేరుకోవాలి. అయితే, ప్రార్థించేవారిలో అనేకమంది దేవుడు తమ నుండి ఏమి కోరుతున్నాడన్నదాని విషయంలో ఏమాత్రం పట్టింపును కలిగివుండరు. అందుకే ఎంతో పట్టుదలతో చేసే ప్రార్థనలైనప్పటికీ ఒక మంచి లోకాన్ని తీసుకురాలేకపోతున్నాయి.

కాబట్టి, దేవునికి మన ప్రార్థనలు వినబడాలంటే మనం ఏమి చేయాల్సివుంది? మనం అసలు ప్రార్థన ఎందుకు చేస్తామన్న దానిపైనే దానికి జవాబు ఆధారపడివుంది. వాస్తవానికి ప్రార్థనలు ఏదైనా మంచిని చేయగలవా లేదా అని తెలుసుకోవాలంటే ముందు మనం వాటి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. యెహోవా, మనం ఆయనతో మాట్లాడడాన్ని ఎందుకు సాధ్యమయ్యేలా చేశాడు?

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

G.P.O., Jerusalem