కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరెందుకు ప్రార్థన చేయాలి?

మీరెందుకు ప్రార్థన చేయాలి?

మీరెందుకు ప్రార్థన చేయాలి?

“మీరడిగినను . . . దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” (యాకోబు 4:​3, 8) మనం ఏ ఉద్దేశంతో ప్రార్థిస్తున్నామనే దానిని పరిశీలించుకొనేందుకు యేసు శిష్యుడైన యాకోబు చెప్పిన ఆ మాటలు మనల్ని పురికొల్పవచ్చు.

ప్రార్థన అంటే కేవలం మన అవసరాలు ఏమిటో దేవునికి చెప్పుకోవడం మాత్రమే కాదు. ప్రఖ్యాతిగాంచిన కొండమీది ప్రసంగంలో యేసు ఇలా చెప్పాడు: “మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును.” అయినప్పటికి యేసు ఇలా కూడా చెప్పాడు: “అడుగుడి మీకియ్యబడును.” (మత్తయి 6:8; 7:⁠7) కాబట్టి మనకు ఏమి అవసరమని మనం భావిస్తున్నామో వాటి గురించి యెహోవాకు చెప్పాలని ఆయన కోరుతున్నాడని అర్థమౌతుంది. కానీ ప్రార్థనలో అంతకంటే ఎక్కువే ఇమిడివుంది.

నిజమైన స్నేహితులు తమకు ఏదైనా అవసరమున్నప్పుడు మాత్రమే మాట్లాడుకునేవారిగా ఉండరు. వారు ఒకరిపై ఒకరు శ్రద్ధ కలిగివుంటారు, అలా వారి భావాలను వారు వ్యక్తపరచుకున్నప్పుడే వారి స్నేహం అధికమవుతుంది. అలాగే ప్రార్థనలో కేవలం అవసరాల కోసం అడగడం కంటే ఎక్కువే ఇమిడివుంది. మన హృదయపూర్వక భక్తిని వ్యక్తపరచడం ద్వారా యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలపరచుకునేందుకు అది మనకొక అవకాశాన్ని కల్పిస్తుంది.

అవును, మనం యెహోవాకు సన్నిహితులమవుతామనే ఆయన మనకు ప్రార్థన అనే ఆధిక్యతను ఇచ్చాడు. బట్టీపట్టిన ప్రార్థనలు చేయడానికి బదులు మనం వ్యక్తిగతంగా మన భావాలను ప్రార్థనలో వ్యక్తపరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. యెహోవాతో ప్రార్థనలో మాట్లాడడం ఎంతటి ఆనందకరమైన విషయం! అంతేకాక, బైబిలు సామెత ఇలా చెప్తుంది: “యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.”​—⁠సామెతలు 15:⁠8.

“నాకైతే దేవుని పొందు ధన్యకరము” అని కీర్తన గ్రంథకర్త అయిన ఆసాపు పాడాడు. (కీర్తన 73:​28) కానీ దేవునికి సన్నిహితులమవ్వాలంటే కేవలం ప్రార్థన మాత్రమే సరిపోదు. దానిని గూర్చి ఈ క్రింది వృత్తాంతము ఏమని చెప్తుందో గమనించండి:

“[యేసు] శిష్యులలో ఒకడు ప్రభువా, . . . మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను.” దానికి సమాధానంగా యేసు ఇలా చెప్పాడు: “మీరు ప్రార్థన చేయునప్పుడు​—⁠తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక . . . అని పలుకు[డి].” (లూకా 11:​1-4) దేవుని పేరు ఏమిటో, దానిని ఎలా పరిశుద్ధపర్చాలో మొదట తెలుసుకోకుండానే మనం అర్థవంతంగా ప్రార్థించగలమా? దేవుని రాజ్యమంటే ఏమిటో మనం అర్థం చేసుకోకుండానే మనం యేసు మాటలకు అనుగుణంగా ప్రార్థించగలమా? మనం బైబిలును జాగ్రత్తగా పరిశీలించినట్లైతే ఈ విషయాలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. దాని ద్వారా పొందిన జ్ఞానము దేవుణ్ని తెలుసుకొని ఆయన మార్గాలను అర్థం చేసుకొనేందుకు సహాయం చేస్తుంది. అంతేకాక, యెహోవాను గూర్చి బాగా తెలుసుకునేకొలది మనం ఆయనకు మరింత సన్నిహితులమైనట్లుగా లేదా ఆయనకు మరింత అంకితభావంతో సేవచేస్తున్నట్లుగా భావించేలా చేస్తుంది. అంతేకాక, ప్రార్థనలో ఇంకా స్వేచ్ఛగా ఆయనతో మాట్లాడేలా సహాయం చేస్తుంది.

ప్రార్థన సమస్యలను పరిష్కరించగలదు

యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవడం మూలంగా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఈ క్రింద ఇవ్వబడిన ప్రతి సందర్భంలోనూ అదెలా సాధ్యమైందో గమనించండి. ప్రార్థన చేసినవారందరూ యెహోవాతో తమకున్న సంబంధాన్ని బలపరచుకోగల్గారని అవి స్పష్టం చేస్తున్నాయి.

బ్రెజిల్‌లో మరీయా సహాయం కొరకు దేవునిని ప్రార్థించింది. సమాజంలోని వేషధారణను బట్టి ఆమె సమాజంలోని ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా తిరుగుబాటు చేయాలని కోరుకుంది. మరీయా తన భర్తను పిల్లలను ఇంటిని కూడా వదలిపెట్టేసింది. మాదకద్రవ్యాలను ఉపయోగించడం కూడా మొదలుపెట్టింది. సంతోషాన్ని కనుగొనడంలో విఫలమైనప్పుడు ఆమె దేవుని ఎదుట తన భావాలను వ్యక్తపరుస్తూ తన హృదయాన్ని కుమ్మరించి సహాయం కోసం ప్రార్థించింది.

త్వరలోనే ఇద్దరు యెహోవాసాక్షులు ఆమె ఇంటిని సందర్శించి దైవిక నడిపింపును అనుసరించడంలోని విలువను గూర్చిన సమాచారం ఉన్న కావలికోట పత్రికను ఆమెకిచ్చారు. అది ఆమె హృదయాన్ని స్పృశించింది, ఆ రోజునే ఆమె ఆ సాక్షులతో పఠనాన్ని ప్రారంభించింది. ఇది ఆమె కుటుంబ జీవితాన్నే పూర్తిగా పునర్నిర్మించుకునేందుకు నడిపించింది. ఆమె యెహోవాను గూర్చి నేర్చుకుంటుండగానే ఆమె ఆయనపట్ల తనకున్న ప్రేమను వ్యక్తపర్చాలని కోరుకుంది. “నేను నా ప్రవర్తనలో మార్పులు చేసుకున్నాను,” అని మరీయా చెబుతుంది, “నేను బైబిలు పఠించడాన్ని నా భర్త, నా కుటుంబంలోని వారు మొదట వ్యతిరేకించారు. కానీ నేను చేసుకుంటున్న మార్పులను చూసి క్రమేణా వాళ్ళు నన్ను ప్రోత్సహించడం ప్రారంభించారు” అని చెప్పింది. ప్రార్థన ఆలకించేవానిని సేవించే దృక్పథంతో ఆమె తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొంది.

బొలీవియాలో హోసేకి అందమైన భార్య, లాభసాటి అయిన వ్యాపారమున్నప్పటికీ అతను చాలా అసంతోషంగా ఉన్నాడు. అతనికున్న అక్రమసంబంధాన్ని బట్టి అతని భార్య అతణ్ణి విడిచిపెట్టేసింది. అతిగా త్రాగుతూ ఎందుకూ పనికిరాని వ్యక్తినని ఆయన భావించేవాడు. హోసే ఇలా చెప్తున్నాడు: “నేను దేవునిని సంతోషపరచాలంటే ఏమి చేయాలని అడుగుతూ నేను నా పూర్ణహృదయంతో దేవునికి ప్రార్థించడం ప్రారంభించాను. అలా చేసిన వెంటనే నా వ్యాపార స్థలం దగ్గరకు యెహోవాసాక్షులు నాకు ఉచిత గృహ బైబిలు పఠనాన్ని చేస్తామని చెప్తూ వచ్చారు, కానీ నేను వారిని వెనక్కి పంపించేశాను. అలా మూడుసార్లు జరిగింది. నేనెప్పుడు సహాయం కోసం ప్రార్థించినా వాళ్ళు వచ్చేవారు. చివరికి నేను వారు చెప్పేది వినాలని నిశ్చయించుకున్నాను. నేను బైబిలును పూర్తిగా చదివేశాను, చాలా ప్రశ్నలు తలెత్తాయి, వాటికి వారు సమాధానమిచ్చినప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉండేది. యెహోవాను గురించి తెలుసుకోవడం నా జీవితానికి ఒక క్రొత్త సంకల్పాన్నిచ్చింది, సాక్షుల్లోని నా స్నేహితులు నాకు గొప్ప ప్రోత్సాహకరమైన మాదిరులుగా ఉన్నారు! నేను నా స్నేహితురాలిని త్రాగుబోతు స్నేహాలను కూడా విడిచిపెట్టాను. త్వరలోనే నేను నా భార్యతోనూ పిల్లలతోనూ కలిసాను. నేను 1999 లో బాప్తిస్మం పొందాను.”

ఇటలీలో టమారా అనే స్త్రీ వివాహం విచ్ఛిన్నమయ్యే స్థితిలో ఉంది, కాబట్టి ఆమె తనకు జ్ఞానాన్ని ప్రసాదించుమని ప్రార్థించింది. 14 ఏళ్ళ వయసులోనే ఆమె కుటుంబం ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టింది, దానితో ఆమె జగడాలమారి అయింది. టమారా ఇలా చెబుతుంది: “నాకు ఒక బైబిలు దొరికింది, దానిని చదవడం ప్రారంభించాను. ఒకరోజు సాయంత్రం ‘జ్ఞానాన్ని కనుగొనడం దాచబడిన ధనాన్ని కనుగొన్నట్లు’ అని ఉండడం నేను చదివాను. నేను ఆ జ్ఞానం కొరకు ప్రార్థించాను. (సామెతలు 2:​1-6) ఆ తర్వాత రోజు ఉదయం యెహోవాసాక్షులు సందర్శించారు. వారితో బైబిలును పఠించడం ప్రారంభించాను, నేను నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టింది. చివరికి నేను క్రైస్తవ జీవన మార్గాన్ని అవలంబించేందుకు నిశ్చయించుకొని బాప్తిస్మం పొందాను. ఇప్పుడు నా భర్తతో పాటు దేవుని జ్ఞానం నుండి ఇతరులు ప్రయోజనం పొందేందుకు సహాయం చేస్తున్నాను.”

బియాట్రిస్‌ వెనిజులాలోని కారాకాస్‌లోని చాలా ఉన్నత సమాజానికి చెందిన వ్యక్తి. అయినప్పటికీ ఆమె విడాకులు తీసుకుని ఎంతో కృంగుదలకు లోనైవుంది. నిరాశానిస్పృహలతో ఉన్న ఈమె ఒకసారి ప్రార్థనలో గంటల తరబడి గడిపింది. ఆ తర్వాతి రోజు తన ఇంటి తలుపును ఎవరో కొట్టారు. చిరాకుతో ఆమె తలుపు రంధ్రంలోనుండి చూసినప్పుడు బయట ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో ఉన్నారు. తాను ఇంట్లో లేనట్టు నటించింది, అప్పుడు ఆ దంపతులు వెళ్ళడానికి ముందు ఒక హ్యాండ్‌బిల్లును తలుపు క్రింద నుండి లోపలికి తోశారు. “బైబిల్లో ఏముందో తెలుసుకోండి” అని దాంట్లో ఉంది. క్రితం రాత్రి ఆమె చేసిన ప్రార్థనకు వారామెను సందర్శించేందుకు ఎలాంటి సంబంధమైనా ఉందా? ఆమె వాళ్ళను వెనక్కి రమ్మని పిలిచింది. త్వరలోనే ఆమె బైబిలు పఠనాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఆమె బాప్తిస్మం పొందింది. ఎట్టకేలకు ఆనందాన్ని కనుగొన్న బియాట్రిస్‌ ఇప్పుడు ఇతరులు ఆనందాన్ని ఎలా కనుగొనాలో బోధిస్తుంది.

పేదరికంతో తను చేస్తున్న పోరాటాన్ని గురించి కార్మెన్‌ ప్రార్థించింది. ఆమెకు ఒక త్రాగుబోతు భర్త రఫేల్‌, పదిమంది పిల్లలు ఉన్నారు. “నేను బట్టలు ఉతికి డబ్బు సంపాదించేదానిని” అని కార్మెన్‌ చెబుతుంది. కానీ రఫేల్‌కు త్రాగుడు అలవాటు ఇంకా ఎక్కువైంది. “యెహోవాసాక్షులతో మేము బైబిలు పఠనం ప్రారంభించేంతవరకూ ఆయన మారలేదు, ఆ తర్వాతే నా భర్త నెమ్మదిగా మారడం ప్రారంభించాడు. యెహోవా త్వరలోనే పేదరికాన్ని ఒత్తిళ్ళను నిర్మూలించబోయే ఆయన రాజ్య వాగ్దానాన్ని గూర్చి తెలుసుకున్నాము. దేవునికి నేను చేసిన ప్రార్థనలకు చివరికి సమాధానం లభించింది!” యెహోవా మార్గాలను గురించి తెలుసుకోవడం రఫేల్‌కు త్రాగుడు మానేసి, “నవీనస్వభావమును” ధరించుకొనేందుకు సహాయం చేశాయి. (ఎఫెసీయులు 4:​24) ఆయనా, ఆయన కుటుంబ సభ్యులు వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపర్చుకోగలిగారు. “మేము ధనవంతులం కాకపోయినా మాకు ఒక స్వంత గృహం లేకపోయినా మేము మా జీవితావసరాలను తీర్చకోగలుగుతున్నాము, మేము సంతోషంగా ఉన్నాము” అని రఫేల్‌ చెప్తున్నాడు.

ప్రార్థనలన్నింటికీ సమాధానం లభించినప్పుడు

ఈ ప్రజలు ప్రార్థించడం వారికేమైనా మంచిని చేకూర్చిందా? నిశ్చయంగా! క్రైస్తవ సంఘంలోని ఒక వ్యక్తి వెళ్ళి వారితో బైబిలు అధ్యయనం చేయడం ద్వారా దేవునికి సన్నిహితులయ్యేందుకు సహాయం చేసినప్పుడే వారిలోని చాలామంది ప్రార్థనలకు సమాధానం ఇవ్వబడిందని పై సందర్భాల్లో మీరు గమనించారా?​—⁠అపొస్తలుల కార్యములు 9:⁠11.

అందుకే మనకు ప్రార్థించేందుకు మంచి కారణాలున్నాయి. దేవుని రాజ్యం రావాలని, భూమిపై ఆయన చిత్తం నెరవేరాలని చేసే ప్రార్థనలకు త్వరలోనే సమాధానమివ్వబడుతుంది. (మత్తయి 6:⁠9, 10) తనను వ్యతిరేకించేవారందరిని తీసివేసి దేవుడు ఈ భూగ్రహాన్ని శుభ్రపరచిన అనంతరం “లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” (యెషయా 11:⁠9) ఆ తర్వాత ఎవరైతే యెహోవాను ప్రేమిస్తారో వారు “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము”ను అనుభవిస్తారు, వారి ప్రార్థనలకు నిశ్చయంగా సమాధానమివ్వబడుతుంది.​—⁠రోమీయులు 8:18-21.

[7వ పేజీలోని చిత్రం]

మనమెందుకు ప్రార్థించాలో మీకు తెలుసా?