కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదటి మానవ దంపతుల నుంచి మనం నేర్చుకోవచ్చు

మొదటి మానవ దంపతుల నుంచి మనం నేర్చుకోవచ్చు

మొదటి మానవ దంపతుల నుంచి మనం నేర్చుకోవచ్చు

దేవుడు భూమండలాన్ని సర్వే చేశాడు. ఆయన దాన్ని మానవ నివాసం కోసం సిద్ధం చేస్తున్నాడు. ఆయన తను చేస్తున్నదంతా మంచిగా ఉందని చూశాడు. వాస్తవానికి, ఆయన ఆ పని పూర్తయినప్పుడు, “చాలమంచిదిగ” ఉందని వ్యక్తపరిచాడు. (ఆదికాండము 1:12, 18, 21, 25, 31) అయితే, ఆ నిర్దిష్టమైన ముగింపుకు రావడానికి ముందుగా, దేవుడు ఒక విషయం గురించి “మంచిది కాదు” అని అన్నాడు. నిజమే, దేవుడు అసంపూర్ణంగా దేనినీ చేయలేదు. అప్పటికింకా ఆయన సృష్టించడం పూర్తి కాలేదు, అంతే. “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు,” అని యెహోవా అన్నాడు, “వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదు[ను].” (ఇటాలిక్కులు మావి.)​—⁠ఆదికాండము 2:​18.

మానవ సమాజం ఆరోగ్యంగా, ఆనందంగా, సమృద్ధితో భూపరదైసులో నిరంతరం జీవించాలనేది యెహోవా ఉద్దేశం. మొత్తం మానవజాతికి తండ్రి ఆదాము. ఆయన భార్య హవ్వ, “జీవముగల ప్రతివానికిని తల్లి” అయింది. (ఆదికాండము 3:​20) వారి వందల కోట్ల సంతానంతో భూమి ఇప్పుడు నిండి ఉన్నప్పటికీ, నిర్వివాదంగా మానవులు పరిపూర్ణులు కాదు.

ఆదాము, హవ్వల కథ సుప్రసిద్ధమైనదే. కాని దానివల్ల మనకు ఎటువంటి ఆచరణ యోగ్యమైన ప్రయోజనముంది? మొదటి మానవ దంపతుల అనుభవాల నుంచి మనమేమి నేర్చుకోగలం?

“స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను”

ఆదాము జంతువులకు పేర్లు పెట్టేటప్పుడు, వాటికి తోటి జతలు ఉన్నాయి, కాని తనకు లేదు అని గమనించాడు. అందుకే, యెహోవా తన ప్రక్కటెముకతో రూపొందించిన అందమైన ప్రాణిని చూసినప్పుడు, ఆయన చాలా ఆనందించాడు. ఆమె తనలోని అసమానమైన భాగమని తెలుసుకొని ఆనందోత్సాహంతో ఇలా అన్నాడు: “నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.”​—⁠ఆదికాండము 2:18-23.

పురుషునికి “సహాయము” అవసరమైంది. ఇప్పుడు ఆయన దగ్గర సాటియైన సహాయకురాలుంది. హవ్వ, ఆదాముకు పూరకంగా సరిగ్గా సరిపోయింది​—⁠వారి నివాసమైన తోటను, అందులోని జంతుజాలాన్ని చూసుకోవడానికి, సంతానోత్పత్తికి, వివేకవంతమైన, ప్రోత్సాహకరమైన, సహాయకరమైన నిజమైన సహచరి ఆమె.​—⁠ఆదికాండము 1:26-30.

ఆ జంట సహేతుకంగా కోరుకొనే వాటన్నింటినీ యెహోవా అందజేశాడు. హవ్వను ఆమె భర్త దగ్గరకు తీసుకురావడం ద్వారా వారు కలిసి ఉండడానికి ఒక క్రమబద్ధమైన ఆజ్ఞను సూచిస్తూ భవిష్యత్తులోని వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలకు నిబంధనలను సంస్థాపించాడు. ఆదికాండములోని వృత్తాంతం ఇలా వ్యక్తం చేస్తోంది: “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైయుందురు.” యెహోవా మొదటి వివాహ జంటను ఆశీర్వదించి, ఫలించుమని చెప్పినప్పుడు, పుట్టే ప్రతి శిశువుపట్ల శ్రద్ధ చూపించే, అండగా ఉండే తల్లీ, తండ్రీ ఉండాలని ఆయన స్పష్టంగా తెలియజేశాడు.​—⁠ఆదికాండము 1:​28; 2:​24.

“దేవుని స్వరూపమందు”

ఆదాము పరిపూర్ణుడైన దేవుని కుమారుడిగా ఉండేవాడు, ఆయన దేవుని ‘స్వరూపమందు, ఆయన పోలికె చొప్పున’ సృష్టించబడ్డాడు. కానీ “దేవుడు ఆత్మ” గనుక పోలి ఉండడం అనేది శరీరాకృతిలో కాదు. (ఆదికాండము 1:​26; యోహాను 4:​24) పోలిక అనేది, జంతువుల కంటే మనిషిని ఎంతో ఉన్నత స్థాయికి పెంచిన లక్షణాల్లో ఉంది. అవును, ప్రారంభం నుండి ప్రేమ, బుద్ధి, శక్తి, న్యాయం అనే లక్షణాలు మనిషిలో నాటబడ్డాయి. ఆయనకు స్వేచ్ఛా చిత్తాన్ని, ఆధ్యాత్మికత కోసం సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయనలో జన్మతః ఉన్న నైతికతను గుర్తించే జ్ఞానేంద్రియం, అంటే మనస్సాక్షి, మంచి చెడులను గుర్తించేందుకు సాధ్యం చేస్తుంది. మనిషికి మేధాశక్తి ఉంది, అది మానవుల ఉనికి గురించిన కారణాన్ని ధ్యానించడానికి, సృష్టికర్తను గురించిన జ్ఞానాన్ని వృద్ధిచేసుకొని ఆయనతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ఆయనకు సాధ్యం చేస్తుంది. ఆ విధంగా, దేవుడు భూమిపై చేసిన హస్తకృత్యాలన్నింటిపై ఆదాము కార్యనిర్వాహకుడుగా ఉండడానికి ఆయనకు కావాల్సిన వాటన్నింటితో తయారుచేయబడ్డాడు.

హవ్వ అతిక్రమణ

నిస్సందేహంగా, యెహోవా విధించిన నిషేధం గురించి ఆదాము వెంటనే హవ్వకు తెలియజేశాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం తప్ప​—⁠వారు తోటలోనున్న అన్ని వృక్ష ఫలాలను తినవచ్చు. కాని వారు దాని ఫలాన్ని తినకూడదు. ఒకవేళ వాళ్లు తింటే, అదే రోజున చనిపోతారు.​—⁠ఆదికాండము 2:16, 17.

కొద్దికాలంలోనే, నిషేధించబడిన ఫలం గురించిన ఒక వివాదం తలెత్తింది. ఒక అదృశ్య ఆత్మ తన పక్షాన మాట్లాడడానికి సాధనంగా వాడుకున్న ఒక సర్పం, హవ్వను కలిసి వాదించడం ప్రారంభించింది. అమాయకమనిపించే రీతిలో, సర్పమిలా అడిగింది: “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” దానికి హవ్వ, ఒక్క వృక్ష ఫలాలను తప్ప అన్ని వృక్ష ఫలాలను తినడానికి అనుమతి ఉందని జవాబిచ్చింది. కాని సర్పం దేవునికి విరుద్ధంగా స్త్రీతో ఇలా చెప్పింది: “మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియు[ను].” ఆ స్త్రీ ఇప్పుడు, నిషేధించబడిన వృక్షాన్ని భిన్నమైన కోణంలో నుంచి చూడడం ప్రారంభించింది. ఆమెకిప్పుడు “ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది”గాను తోచింది. హవ్వ పూర్తిగా మోసపోయింది, దేవుని నియమాన్ని అతిక్రమించింది.​—⁠ఆదికాండము 3:1-6; 1 తిమోతి 2:​14.

హవ్వ చేసిన పాపం అనివార్యమైనదేనా? ఎంతమాత్రం కాదు! మిమ్మల్ని ఆమె స్థానంలో పెట్టుకోండి. సర్పం వాదన, దేవుడూ ఆదామూ చెప్పినదాన్ని పూర్తిగా వక్రీకరించేసింది. ముక్కూ మొఖం తెలియని ఒక వ్యక్తి వచ్చి, మీకు ఎంతో ప్రేమ, నమ్మకం గల వ్యక్తిని నిజాయితీ లేనివాడు అంటే, మీరెలా భావిస్తారు? హవ్వ ఇంకో విధంగా ప్రతిస్పందించి ఉండాల్సింది. వినడానికి ఏవగింపు, కోపం, నిరాకరణ చూపించాల్సింది. ఎంతైనా, దేవుని నీతినీ, ఆమె భర్త చెప్పిన దానినీ ప్రశ్నించడానికి, అసలు సర్పమెవరు? శిరస్సత్వానికివ్వాల్సిన గౌరవానికి సూచనగా, ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందుగా సలహా కోసం హవ్వ తన భర్తను అర్థించి ఉండాల్సింది. ఒకవేళ దేవుడిచ్చిన సూచనలకు వ్యతిరేకమైన సమాచారాన్ని మనం ఎప్పుడైనా ఎదుర్కొంటే మనం అనుసరించాల్సిన విధానం అదే. అయినా, హవ్వ శోధకుడి మాటలనే నమ్మింది, ఏది మంచో ఏది చెడో తనకు తాను స్వయంగా నిర్ణయించుకోవాలనుకుంది. ఎంత ఎక్కువగా ఆ ఆలోచనపై మనసు లగ్నంచేసిందో, ఆమెకు అంత ఆకర్షణీయంగా అనిపించిందది. తన మనస్సు నుండి ఆ తప్పుడు ఆలోచనను తీసివేసుకోకుండా లేదా కుటుంబ శిరస్సుతో మాట్లాడకుండా ఆ తప్పుడు ఆలోచనను మనస్సులోనే పెట్టుకుని ఆమె ఎంత తప్పు చేసింది!​—⁠1 కొరింథీయులు 11:⁠3; యాకోబు 1:​14, 15.

ఆదాము తన భార్య మాట వినడం

హవ్వ వెంటనే ఆదామును ప్రేరేపించి తనతో పాటు పాపంలో కలిసేలా చేస్తుంది. ఆమెతో ఏకీభవించడానికి అతని అస్థిరత్వాన్ని మనమేమని వివరించగలం? (ఆదికాండము 3:​6, 17) ఆదాము యథార్థతల విషయమై సందిగ్ధంలో పడ్డాడు. ఆయన, తన ప్రియమైన సహచరియైన హవ్వతో పాటు అన్నీ ఇచ్చిన తన సృష్టికర్తకు విధేయత చూపిస్తాడా? ఇప్పుడు తనేమి చేయాలని ఆదాము దేవుని నడిపింపును కోరుతాడా? లేక తన భార్యతో పాటు ఆ పాపంలో కలిసిపోతాడా? నిషేధించిన ఫలాన్ని తిని ఆమె ఏమి పొందుతానని అనుకుందో అది వట్టి భ్రమ అని ఆదాముకు బాగా తెలుసు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “ఆదాము మోసపరచబడలేదుగాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను.” (1 తిమోతి 2:​14) ఆ విధంగా ఆదాము ఉద్దేశపూర్వకంగా యెహోవాను ధిక్కరించాడు. పరిస్థితిని సరిదిద్దగల దేవుని సామర్థ్యం మీది విశ్వాసం కంటే తన భార్య నుంచి విడిపోతానన్న భయమే ఆయనకు ఎక్కువైందన్న విషయం తేటతెల్లమవుతుంది.

ఆదాము తీసుకున్న చర్య ఆత్మహత్య లాంటిదే. మరణానికి కారణభూతమైన పాపంతో అందరూ జన్మించేలా చేయడం ద్వారా, తను తండ్రి కావడానికి యెహోవా అనుమతించి దయతో తనకిచ్చిన సంతతినంతటినీ హత్య చేయడంతో సమానం కూడా ఆ చర్య. (రోమీయులు 5:⁠12) స్వార్థపూరితమైన అవిధేయతకు ఎంత భారీ మూల్యం చెల్లించాల్సివచ్చింది!

పాపపు ఫలితాలు

పాపం వల్ల కలిగిన తక్షణ ప్రభావం సిగ్గు. యెహోవాతో మాట్లాడడానికి ఆనందంగా పరిగెత్తడానికి బదులుగా, ఎదుటికి రాకుండా వాళ్ళిద్దరు దాక్కున్నారు. (ఆదికాండము 3:⁠8) దేవుడితో వారికున్న స్నేహబంధం తెగిపోయింది. ఏమి చేశారని వారిని అడిగినప్పుడు, దేవుని నియమాన్ని ఉల్లంఘించామని ఇద్దరికీ తెలిసుండి కూడా వాళ్ళు ఏ మాత్రం పశ్చాత్తాపం చూపించలేదు. నిషేధించబడిన ఫలాన్ని తినడం ద్వారా వారు దేవుని మంచితనాన్ని తిరస్కరించారు.

దాని ఫలితంగా, పిల్లల్ని కనేటప్పుడు అధికమైన వేదన ఉంటుందని దేవుడు సూచించాడు. హవ్వకు తన భర్తపై వాంఛ కలుగుతుంది, ఆయన ఆమెపై అధికారం చెలాయిస్తాడు. స్వాతంత్ర్యాన్ని పొందాలని ఆమె చేసిన ప్రయత్నం పూర్తి వ్యతిరేకమైన ఫలితాన్నిచ్చింది. ఏదెనులో ఎటువంటి శ్రమ లేకుండా తన ఆకలిని తీర్చుకోవడానికి బదులుగా, ఆదాము ఇప్పుడు ప్రయాసతో నేలనుండి పంట పండించుకొని తినాలి. తను చేయబడిన మట్టిలో తిరిగి కలిసేంతవరకు ఆయన తన జీవితావసరాల కోసం చెమటోడ్చి ప్రయాసపడాలి.​—⁠ఆదికాండము 3:​16-19.

చివరికి ఆదాము, హవ్వలు ఏదెను తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. యెహోవా ఇలా అన్నాడు: “ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో . . . .” గోర్డన్‌ వెన్‌హమ్‌ అనే ఒక పండితుడు “ఇక్కడి వాక్యం అర్థాంతరంగా ముగిసింది” అని అంటున్నాడు, దేవుని మిగతా ఆలోచనను పూర్తి చేసుకునే పని ఇక మనపై వదిలివేయబడింది​—⁠బహుశ మనం, “తోటలో నుంచి ఆయనను వెళ్ళగొడతాను” అనే భావించుకోవచ్చు. సాధారణంగా, ఒక బైబిలు రచయిత దేవుని పూర్తి ఆలోచనను తెలియజేస్తాడు. కాని వెన్‌హమ్‌ ఇంకా ఇలా అంటున్నాడు, ఇక్కడ “ముగింపును వదిలి వేయడం దేవుని వేగవంతమైన చర్యను తెలుపుతోంది. ఆయన మాట్లాడడం పూర్తైందో లేదో వెంటనే వారిని తోటలో నుంచి వెళ్ళగొట్టాడు.” (ఆదికాండము 3:​22, 23 NW) దాంతో, మొదటి దంపతులు యెహోవాతో మాట్లాడే సదవకాశాన్ని కోల్పోయారన్నది స్పష్టం.

ఆదాము, హవ్వలు భౌతికంగా ఆ 24 గంటల్లోనే చనిపోలేదు. అయినా, వారు ఆధ్యాత్మిక భావంలో వెంటనే చనిపోయారు. జీవ మూలాధారం నుంచి నయం చేయలేని విధంగా దూరమయ్యారు, మరణం ఒడిలోకి వారు ఒరిగిపోవడం ప్రారంభించారు. ఊహించండి, వారు మొదటిసారి మరణాన్ని చూసినప్పుడు​—⁠వారి రెండవ కొడుకు హేబెలు, మొదటి కొడుకు కయీనుచే హత్యచేయబడ్డప్పుడు​—⁠ఎంతటి వేదనను అనుభవించి ఉంటారో!​—⁠ఆదికాండము 4:​1-16.

దాని తరువాత, మొదటి మానవ దంపతుల గురించి చాలా తక్కువగా తెలపబడింది. వారి మూడవ కొడుకు షేతు, ఆదాముకు 130 ఏళ్ళ వయస్సున్నప్పుడు జన్మించాడు. అటు తరువాత 800 సంవత్సరాల్లో ఇంకా “కుమారులను కుమార్తెలను” కని, తన 930వ ఏట ఆదాము చనిపోయాడు.​—⁠ఆదికాండము 4:​25; 5:​3-5

మనకొక గుణపాఠం

మానవ సమాజపు నేటి పరిస్థితికి కారణాన్ని వెల్లడి చేయడంతోపాటు, మొదటి వివాహిత జంట యొక్క సంఘటన మనకొక ప్రధానమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఎవరైనా యెహోవా దేవుని నుంచి స్వాతంత్ర్యం కావాలని నిశ్చయించుకుంటే అది పూర్తిగా అవివేకమైనదే. నిజంగా వివేకవంతులైనవారు, స్వయంతృప్తినిచ్చే తమ జ్ఞానంపై కాకుండా యెహోవా వాక్యమందు విశ్వాసముంచుతారు. మంచి చెడులను నిర్ణయించేది యెహోవాయే, మనం చేసేవాటన్నింటిలో ఆయనకు విధేయత చూపించడమే మంచి. ఆయన నియమాలను ఉల్లంఘించడం, ఆయన సూత్రాలను నిర్లక్ష్యం చేయడమే చెడు.

మానవులు కోరుకునేవన్నీ దేవుడు ఇచ్చాడు, ఇంకా ఇస్తాడు​—⁠నిరంతర జీవితం, స్వాతంత్ర్యం, సంతృప్తి, సంతోషం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం, ఇంకా క్రొత్త క్రొత్త విషయాలను కనుక్కోవడం. అయినప్పటికీ, వీటన్నిటిని ఆనందించాలంటే మన పరలోకపు తండ్రియైన యెహోవాపై మనం పూర్తిగా ఆధారపడాలని గుర్తించడం అవసరం.​—⁠ప్రసంగి 3:10-13; యెషయా 55:​6-13.

[26వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఆదాము హవ్వలు—⁠కేవలం కల్పితమా?

పాపం కారణంగా మొదటి పరదైసును కోల్పోయామనే నమ్మకం ప్రాచీన బబులోనీయుల్లో, అష్షూరీయుల్లో, ఐగుప్తీయుల్లో, ఇంకా ఇతరుల్లో వ్యాపించి ఉంది. నిత్యజీవాన్ని పొందే ఫలాలను ఇచ్చే జీవవృక్షం అనేక వృత్తాంతాల్లో సర్వసాధారణంగా ఉండే ఒక విషయం. కాబట్టి, ఏదెనులో ఏదో విషాదకరమైన సంఘటన జరిగిందని మానవులకు జ్ఞాపకముందని అర్థమౌతుంది.

నేడు, చాలామంది ఆదాము హవ్వల బైబిలు వృత్తాంతం కేవలం కల్పితమని త్రోసిపుచ్చుతారు. అయినప్పటికీ, చాలామంది శాస్త్రజ్ఞులు మానవజాతి, మొదటి జంట అయిన ఒకే కుటుంబంనుంచి ఉద్భవించిందని ఒప్పుకుంటారు. మన పూర్వికుడు చేసిన పాపపు ప్రభావం మానవజాతంతటికీ వ్యాప్తి చెందిందనే విషయాన్ని కాదనడం అనేకమంది దైవశాస్త్ర పండితులకు అసాధ్యంగా ఉంది. మానవులు ఒక దంపతుల కంటే ఎక్కువ సంఖ్యలోని దంపతుల నుంచి అభివృద్ధి చెందారని గనుక వారు నమ్మితే, తొలి పాపం ఒకరి కంటే ఎక్కువమంది పూర్వికులు చేశారని వాళ్ళు చెప్పాల్సివస్తుంది. అలాగైతే అది, “చివరి ఆదాము” అయిన క్రీస్తు, మానవజాతిని విమోచించలేదని చెప్పడానికి వారిని బలవంతం చేస్తుంది. కానీ యేసు, ఆయన శిష్యులు అటువంటి సందిగ్ధాన్ని ఎదుర్కోలేదు. వారు ఆదికాండములోని వృత్తాంతాన్ని వాస్తవమని గుర్తించారు.​—⁠1 కొరింథీయులు 15:​22, 45; ఆదికాండము 1:​27; 2:​24; మత్తయి 19:⁠4, 5; రోమీయులు 5:​12-19.