కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అలసినవారిని యెహోవా బలపరుస్తాడు

అలసినవారిని యెహోవా బలపరుస్తాడు

అలసినవారిని యెహోవా బలపరుస్తాడు

“సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు [యెహోవాయే]; శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.”​—⁠యెషయా 40:⁠29.

1. దేవుడు సృష్టించినవాటిలో నిక్షిప్తమైవున్న శక్తి గురించి సోదాహరణంగా చెప్పండి.

యెహోవాకున్న బలం అపరిమితమైనది. ఆయన సృష్టించినవాటిలో ఎంత అపారమైన శక్తి ఉందోకదా! విశ్వంలోని సమస్త వస్తువులూ అతి సూక్ష్మమైన పరమాణువులతో రూపొందించబడ్డాయి; పరమాణువు ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే, ఒక్క నీటి బొట్టులో పది లక్షల కోట్ల కోట్లు పరమాణువులు ఉంటాయి. * మన భూగోళంపైనున్న సమస్త జీవకోటి, సూర్యునిలో జరిగే అణు చర్యలవల్ల ఉత్పత్తి అయ్యే శక్తిపై ఆధారపడుతుంది. అయితే భూమిపైనున్న జీవకోటిని కాపాడేందుకు ఎంత సూర్యశక్తి అవసరం? సూర్యుడు ఉత్పత్తి చేసే శక్తిలోనుండి, కేవలం కొన్ని కోట్లవ వంతు శక్తి మాత్రమే భూమిని చేరుతుంది. అయినప్పటికీ, “భూమిని చేరే అతికొద్ది సూర్యశక్తి సహితం . . . ప్రపంచంలోని పరిశ్రమలు ఉపయోగించే శక్తి మొత్తం కన్నా 1,00,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది” అని సర్‌ గణితశాస్త్ర పండితుడైన ఫ్రెడ్‌ హోయ్‌ల్‌ ఖగోళశాస్త్రం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో చెప్తున్నాడు.

2. ప్రాథమికంగా, యెహోవాకున్న బలం గురించి యెషయా 40:⁠26 ఏమి చెప్తుంది?

2 మనం పరమాణువు గురించి ఆలోచించినా లేక సువిశాల విశ్వం వైపు మన అవధానాన్ని మరల్చినా, వెల్లడయ్యే యెహోవాకున్న అసాధారణమైన శక్తిని బట్టి మనం ముగ్ధులమైపోతాం. ఆయనిలా చెప్పగలిగాడంటే అందులో ఆశ్చర్యం లేదు: “మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు”! (యెషయా 40:​26) అవును, యెహోవా “బలాతిశయము” గలవాడు, ఈ విశ్వమంతటినీ ఉనికిలోకి తీసుకురావడానికి ఉపయోగించబడిన “అధికశక్తి”కి ఆయనే మూలమై ఉన్నాడు.

అసాధారణమైన బలం అవసరం

3, 4. (ఎ) మనం అలసిపోయేలా చేసే కొన్ని విషయాలు ఏవి? (బి) ఏ ప్రశ్నను పరిశీలించవలసిన అవసరం ఉంది?

3 దేవుని బలం అపరిమితమైనది, మానవులను మాత్రం అలసట ఆవరిస్తూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్లినా అలసిపోయివున్న ప్రజలను చూస్తుంటాము. వాళ్లు నిద్రలేచే సరికే అలసిపోయి ఉంటారు, అలసటతోనే పనికీ స్కూలుకూ వెళ్తారు, అలసిపోయే ఇంటికి తిరిగి వస్తారు, ఇక నిద్రకు ఉపక్రమించే సమయానికి వాళ్లు అలసిపోవడమే కాదుగానీ పూర్తిగా డస్సిపోయి ఉంటారు. కొందరైతే ఎక్కడికైనా వెళ్లిపోయి కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుండునని ఎంతో ఆశిస్తారు. యెహోవా సేవకులముగా మనం కూడా అలసిపోతుంటాం, ఎందుకంటే దైవభక్తితో కూడిన జీవితాన్ని గడపటానికి తీవ్రంగా పోరాడవలసి ఉంటుంది. (మార్కు 6:30, 31; లూకా 13:24; 1 తిమోతి 4:⁠8) అంతేగాక, మన శక్తిని పిండేసే అనేక ఇతర విషయాలు కూడా ఉన్నాయి.

4 మనం క్రైస్తవులమే అయినప్పటికీ, సాధారణ ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు మనం అతీతులమేమీ కాదు. (యోబు 14:⁠1) అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు లేదా జీవితంలో సర్వసాధారణంగా వచ్చే ఇతర కష్టాలు మనల్ని బలహీనం చేసి నిరుత్సాహపర్చవచ్చు. ఈ సవాళ్లకు తోడు, నీతి నిమిత్తం హింసించబడేవారికి ఎదురయ్యే శ్రమలు ఉండనే ఉన్నాయి. (2 తిమోతి 3:12; 1 పేతురు 3:​14) లోకం నుండి ఎదురయ్యే అనుదిన ఒత్తిళ్ళ వల్ల, మన రాజ్య ప్రకటనా పనికి ఎదురయ్యే వ్యతిరేకతల వల్ల మనలో కొంతమందిమి యెహోవా సేవలో వెనుకబడిపోయేంతగా అలసిపోతుంటాం. అంతేగాక, మనం దేవునిపట్ల యథార్థంగా ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో అపవాదియైన సాతాను తనకు అందుబాటులో ఉన్న ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాడు. మరి మనం పూర్తిగా అలసిపోయి మన యథార్థతను కోల్పోకుండా ఉండేందుకు అవసరమైన ఆధ్యాత్మిక శక్తిని మనం ఎక్కడి నుండి పొందగలం?

5. క్రైస్తవ పరిచర్యను కొనసాగించడానికి మానవ శక్తికి మించిన శక్తి ఎందుకు అవసరం?

5 ఆధ్యాత్మిక బలం కోసం మనం, సర్వశక్తిమంతుడైన మన సృష్టికర్తయైన యెహోవా మీద ఆధారపడాలి. క్రైస్తవ పరిచర్యను కొనసాగించడానికి అపరిపూర్ణ మానవులకుండే సాధారణ శక్తికన్నా ఎక్కువ శక్తి అవసరమని అపొస్తలుడైన పౌలు నొక్కిచెప్పాడు. ఆయనిలా వ్రాశాడు: “ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.” (2 కొరింథీయులు 4:⁠7) అభిషిక్త క్రైస్తవులు భూనిరీక్షణగల తమ సహవాసుల మద్దతుతో ‘సమాధాన పరిచర్యను’ కొనసాగిస్తున్నారు. (2 కొరింథీయులు 5:18; యోహాను 10:16; ప్రకటన 7:⁠9) అపరిపూర్ణ మానవులమైన మనం హింసలనెదుర్కొంటూ దేవుని పనిని చేస్తున్నాము గనుక, దాన్ని మనం మన స్వంత శక్తితో చేయలేము. యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేస్తాడు, అలా మన బలహీనత వల్ల ఆయన శక్తి ఘనపర్చబడుతుంది. “నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు” అనే హామీని బట్టి మనమెంత ఓదార్పును పొందుతామో కదా!​—⁠కీర్తన 37:⁠17.

‘యెహోవాయే మన బలం’

6. యెహోవా మన బలానికి మూలమని లేఖనాలు మనకు ఎలా హామీ ఇస్తున్నాయి?

6 మన పరలోక తండ్రి “బలాతిశయము” గలవాడు గనుక మనల్ని బలపర్చడం ఆయనకు సులభం. నిజానికి, “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు [యెహోవాయే]; శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు, యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు.” (యెషయా 40:​29-31) అధికమౌతున్న ఒత్తిళ్ళ వల్ల మనం కొన్నిసార్లు, అడుగుతీసి అడుగు వేయలేనంతగా అలసిపోయిన ఆటగాడిలా ఉన్నట్లు భావించవచ్చు. కానీ మనం పరుగుపందెం ముగింపుకు చేరుకోబోతున్నాం గనుక మనం విడిచిపెట్టకూడదు. (2 దినవృత్తాంతములు 29:​11) మన శత్రువైన అపవాది “గర్జించు సింహమువలె” తిరుగుతున్నాడు, అతడు మనల్ని ఆపేయాలని చూస్తున్నాడు. (1 పేతురు 5:⁠8) ‘యెహోవా మన ఆశ్రయము, మన కేడెము’ అని మనం గుర్తుంచుకుందాం, ‘అలసినవారికి బలమివ్వడానికి’ ఆయన ఎన్నో ఏర్పాట్లు చేశాడు.​—⁠కీర్తన 28:⁠7.

7, 8. యెహోవా దావీదు, హబక్కూకు, పౌలులను బలపరిచాడనటానికి ఏ రుజువు ఉంది?

7 ఎంతో పెద్ద పెద్ద అడ్డంకులు వచ్చినప్పుడు కూడా కొనసాగడానికి అవసరమైన బలాన్ని యెహోవా దావీదుకు ఇచ్చాడు. అందుకే పూర్ణ విశ్వాసంతోనూ, నమ్మకంతోనూ దావీదు ఇలా వ్రాశాడు: “దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.” (కీర్తన 60:​12) ప్రవక్తగా తన నియామకాన్ని తుదికంటా కొనసాగించడానికి యెహోవా హబక్కూకుకు కూడా శక్తినిచ్చాడు. హబక్కూకు 3:⁠19 ఇలా చెప్తుంది: “ప్రభువగు యెహోవాయే నాకు బలము; ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును, ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.” పౌలు ఉదాహరణ కూడా గమనించదగినది, ఆయనిలా వ్రాశాడు: “నన్ను బలపరచు [దేవుని]యందే నేను సమస్తమును చేయగలను.”​—⁠ఫిలిప్పీయులు 4:⁠13.

8 దావీదు, హబక్కూకు, పౌలుల వలే, మనల్ని బలపర్చడానికి దేవునికున్న సామర్థ్యమందూ మనల్ని రక్షించడానికి ఆయనకున్న శక్తియందూ మనం విశ్వాసం ఉంచాలి. “బలము”కు మూలం సర్వోన్నత ప్రభువైన యెహోవాయేనని తెలుసుకుని, ఆధ్యాత్మిక శక్తిని పొందేందుకు ఆయన సమృద్ధిగా చేస్తున్న ఏర్పాట్లలో కొన్నింటిని మనం ఇప్పుడు పరిశీలిద్దాం.

మనల్ని చైతన్యవంతుల్ని చేసే ఆధ్యాత్మిక ఏర్పాట్లు

9. మన ఆధ్యాత్మిక బలాన్ని కాపాడుకునే విషయంలో క్రైస్తవ ప్రచురణలు ఏ పాత్ర నిర్వహిస్తాయి?

9 క్రైస్తవ ప్రచురణల సహాయంతో లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేయడం మనల్ని చైతన్యవంతుల్ని చేసి, బలపర్చగలదు. కీర్తన గ్రంథకర్త ఇలా ఆలపించాడు: “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును, అతడు చేయునదంతయు సఫలమగును.” (కీర్తన 1:​2, 3) మనం మన శారీరక బలాన్ని కాపాడుకోవడానికి ఎలాగైతే భౌతిక ఆహారాన్ని తీసుకుంటామో అలాగే మన ఆధ్యాత్మిక బలాన్ని కాపాడుకోవడానికి కూడా, దేవుడు తన వాక్యం ద్వారా, క్రైస్తవ ప్రచురణల ద్వారా అందజేస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి, అర్థవంతమైన అధ్యయనమూ ధ్యానమూ చాలా అవసరం.

10. మనం అధ్యయనం, ధ్యానం ఏ సమయంలో చేయవచ్చు?

10 “దేవుని మర్మముల” గురించి ధ్యానించడం నిజంగా ప్రతిఫలదాయకమైనది. (1 కొరింథీయులు 2:​10) కానీ మనం ధ్యానించటానికి సమయాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు, ‘సాయంకాలమున పొలములో ధ్యానించటానికి వెళ్లాడు.’ (ఆదికాండము 24:​63-67) కీర్తన గ్రంథకర్తయైన దావీదు ‘రాత్రి జాములయందు దేవుడ్ని ధ్యానించాడు.’ (కీర్తన 63:⁠4) మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి, దాని గురించి ఉదయం, సాయంకాలం, రాత్రి, నిజానికి ఏ సమయంలోనైనా సరే ధ్యానించవచ్చు. అలాంటి అధ్యయనమూ, ధ్యానమూ ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చేందుకు యెహోవా అనుగ్రహించే మరో ఏర్పాటుకు మనల్ని నడిపిస్తుంది, అదే ప్రార్థన.

11. క్రమంగా ప్రార్థించడానికి మనం ఎందుకంత ప్రాముఖ్యతను ఇవ్వాలి?

11 క్రమంగా ప్రార్థించడం మనల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది. కాబట్టి మనం “ప్రార్థనయందు పట్టుదల కలిగి” ఉందాం. (రోమీయులు 12:​12) కొన్నిసార్లు, ఏదైనా ఒక శ్రమను సహించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, బలాన్ని ఇవ్వమని మనం ప్రత్యేకించి విజ్ఞప్తి చేయవలసి ఉంటుంది. (యాకోబు 1:​5-8) ఆయన సంకల్పాలు నెరవేరడాన్ని లేదా తన సేవలో కొనసాగేలా ఆయన మనల్ని బలపర్చడాన్ని చూసినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి, ఆయనను స్తుతిద్దాం. (ఫిలిప్పీయులు 4:​6, 7) మనం ప్రార్థనలో యెహోవాకు సన్నిహితమైతే, ఆయన మనల్ని ఎన్నడూ ఎడబాయడు. “ఇదిగో దేవుడే నాకు సహాయకుడు” అని దావీదు పాడాడు.​—⁠కీర్తన 54:⁠4.

12. మనం దేవుని పరిశుద్ధాత్మ కోసం ఎందుకు అడగాలి?

12 మన పరలోక తండ్రి తన పరిశుద్ధాత్మ ద్వారా, అంటే తన చురుకైన శక్తి ద్వారా మనల్ని చైతన్యవంతుల్ని చేసి, బలపరుస్తాడు. పౌలు ఇలా వ్రాశాడు: “తండ్రియెదుట నేను మోకాళ్లూని మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను . . . తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.” (ఎఫెసీయులు 3:​14-19) మనం పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి, యెహోవా మనకు దాన్ని తప్పక అనుగ్రహిస్తాడన్న పూర్తి నమ్మకంతో ప్రార్థించాలి. యేసు తర్కసహితంగా ఇలా అన్నాడు: ఒక పిల్లవాడు చేపకోసం అడిగితే, ప్రేమగల తండ్రి వాడికి పామును ఇస్తాడా? ఎంతమాత్రం ఇవ్వడు. కాబట్టి, ఆయనిలా ముగించాడు: “మీరు [పాపులైనందున అంతో ఇంతో] చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు[ను].” (లూకా 11:​11-13) కాబట్టి మనం అలాంటి నమ్మకంతో ప్రార్థిస్తూ, దేవుని నమ్మకమైన సేవకులు ఆయన ఆత్మ ద్వారా “శక్తి”ని పొందగలరని మనం ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకుందాం.

సంఘం​—⁠బలపర్చే సహాయకం

13. క్రైస్తవ కూటాలను మనం ఎలా దృష్టించాలి?

13 క్రైస్తవ సంఘ కూటాల ద్వారా యెహోవా మనల్ని చైతన్యవంతుల్ని చేస్తాడు. “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని” యేసు చెప్పాడు. (మత్తయి 18:​20) యేసు ఆ వాగ్దానం చేసినప్పుడు, సంఘంలో నాయకత్వం వహించే వారి అవధానానికి రావలసిన విషయాలను గురించి చర్చిస్తున్నాడు. (మత్తయి 18:​15-19) అయితే, ఆయన నామమున ప్రార్థించడంతో ప్రారంభమై, అదేవిధంగా ప్రార్థనతోనే ముగిసే మన కూటాలూ సమావేశాలన్నింటికీ ఆయన మాటలు సూత్రబద్ధంగా అన్వయిస్తాయి. (యోహాను 14:​14) కాబట్టి అలాంటి క్రైస్తవ కూటాలకు కొద్దిమంది వచ్చినా లేక వేలాదిమంది వచ్చినా వాటికి మనం హాజరు కాగల్గడం ఒక ఆధిక్యత. కాబట్టి మనల్ని ఆధ్యాత్మికంగా బలపర్చేందుకు, ప్రేమించడానికీ సత్కార్యాలు చేయడానికీ మనల్ని పురికొల్పేందుకు రూపొందించబడిన ఈ ఏర్పాట్లనుబట్టి మనం మన కృతజ్ఞతను వ్యక్తపరుద్దాం.​—⁠హెబ్రీయులు 10:24, 25.

14. క్రైస్తవ పెద్దలు చేసే కృషి నుండి మనం ఏ ప్రయోజనాన్ని పొందుతాం?

14 క్రైస్తవ పెద్దలు ఆధ్యాత్మిక సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందజేస్తారు. (1 పేతురు 5:​2, 3) పౌలు తాను ఏ యే సంఘాల్లోనైతే సేవ చేశాడో వాటికి సహాయాన్నందించి వాటిని ప్రోత్సహించాడు, ప్రయాణ పైవిచారణకర్తలు నేడు అలాగే చేస్తున్నారు. వాస్తవానికి, పరస్పరం ప్రోత్సహించుకోగలిగేలా తన తోటి విశ్వాసులతో కలసివుండాలని పౌలు ఎంతగానో ఆకాంక్షించాడు. (అపొస్తలుల కార్యములు 14:19-22; రోమీయులు 1:​11, 12) మనల్ని ఆధ్యాత్మికంగా బలపర్చే మన స్థానిక పెద్దల పట్ల, ఇతర క్రైస్తవ పైవిచారణకర్తల పట్ల మనం ఎల్లప్పుడూ మెప్పును చూపిద్దాం.

15.మన సంఘంలోని తోటి విశ్వాసులు “ఆదరణ”కు ఎలా మూలం కాగలరు?

15 క్రైస్తవ సంఘంగా రూపొందిన మన తోటి విశ్వాసులు “ఆదరణ”కు మూలం కాగలరు. (కొలొస్సయులు 4:​10, 11) ‘నిజమైన స్నేహితులుగా’ వాళ్లు మనకు కష్టసమయాల్లో సహాయం చేయగలరు. (సామెతలు 17:​17) ఉదాహరణకు దీన్ని పరిశీలించండి: నాజీ గార్డుల నిర్బంధంలో ఉన్న సాక్సెన్‌హవుసన్‌ కాన్సన్‌ట్రేషన్‌ శిబిరం నుండి 1945 లో విడుదల చేయబడిన వేలాదిమంది 200 కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణించవలసి వచ్చింది, వారిలో 220 మంది దేవుని సేవకులు ఉన్నారు. వీరు ఒక గుంపుగా వెళ్తూ బలంగా ఉన్నవారు బలహీనంగా ఉన్నవారిని చిన్న చిన్న బళ్లలో కూర్చోబెట్టి తీసుకువెళ్లారు. ఫలితం? ఆ మరణ యాత్రలో 10,000 మంది ఇతరులు మరణించారు గానీ ఒక్క యెహోవాసాక్షి కూడా మరణించలేదు. యెహోవా సాక్షుల వార్షిక పుస్తకం, యెహోవా సాక్షులు​—⁠దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) వంటి పుస్తకాలతో సహా వాచ్‌ టవర్‌ ప్రచురణల్లో కనిపించే అలాంటి వృత్తాంతాలు తన ప్రజలు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండగలిగేలా దేవుడు వారిని బలపరుస్తాడని రుజువు చేస్తున్నాయి. *​—⁠గలతీయులు 6:⁠9.

పరిచర్య ద్వారా బలపర్చబడడం

16. పరిచర్యలో క్రమంగా పాల్గొనడం మనల్ని ఆధ్యాత్మికంగా ఎలా బలపరుస్తుంది?

16 రాజ్య-ప్రకటన పనిలో క్రమంగా పాల్గొనడం మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. అంతేగాక, దేవుని రాజ్యంపై మన మనస్సును కేంద్రీకరించడానికి, నిత్యత్వాన్నీ అది తెచ్చే భవిష్యద్‌ ఆశీర్వాదాలనూ దృష్టిలో ఉంచుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. (యూదా 20, 21) మనం మన పరిచర్యలో ప్రస్తావించే లేఖనాధార వాగ్దానాలు మనకు నిరీక్షణను ఇచ్చి, ప్రవక్తయైన మీకాకున్నంతటి దృఢ నిశ్చయతను కల్గివుండేలా చేయగలవు, ఆయన ఇలా అన్నాడు: “మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.”​—⁠మీకా 4:⁠5.

17. గృహ బైబిలు పఠనాల గురించి ఏ సలహాలు ఇవ్వబడ్డాయి?

17 ఇతరులకు బోధించడంలో మనం లేఖనాలను ఎక్కువగా ఉపయోగిస్తుండగా యెహోవాతో మనకున్న సంబంధం బలపర్చబడుతుంది. ఉదాహరణకు, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం సహాయంతో మనం బైబిలు పఠనాలు నిర్వహించేటప్పుడు, ఎత్తివ్రాయబడిన అనేక లేఖనాలను చదవడం, చర్చించడం జ్ఞానయుక్తంగా ఉంటుంది. ఇది విద్యార్థికి సహాయం చేయడమేగాక మన ఆధ్యాత్మిక అవగాహనను కూడా బలపరుస్తుంది. ఒక విద్యార్థికి ఒక బైబిలు బోధను గానీ ఉపమానాన్ని గానీ అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే, జ్ఞానము పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని ముగించడానికి ఒకటి కన్నా ఎక్కువ వారాలు తీసుకోవచ్చు. మనం బాగా సిద్ధపడి, ఇతరులు దేవునికి సన్నిహితం కావడానికి వారికి సహాయం చేయగలిగేలా మనం అదనపు కృషి చేసేందుకు ఎంత సంతోషిస్తామో కదా!

18. జ్ఞానము పుస్తకం ప్రభావవంతంగా ఎలా ఉపయోగించబడుతుందో సోదాహరణంగా చూపించండి.

18 ప్రతి సంవత్సరం వేలాదిమంది యెహోవా సమర్పిత సేవకులయ్యేలా సహాయాన్ని అందించడానికి జ్ఞానము పుస్తకం ప్రభావవంతంగా ఉపయోగించబడుతుంది, అలాంటివారిలో బైబిలు గురించి ఎక్కువగా తెలియని అనేకులు కూడా ఉన్నారు. ఉదాహరణకు, శ్రీలంకలోని ఒక హైందవుడు తన బాల్యంలో, ఒక సాక్షి పరదైసు గురించి మాట్లాడడం విన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు ఆమె దగ్గరికి వెళ్లాడు, త్వరలోనే ఆమె భర్త అతనితో బైబిలు పఠనం ప్రారంభించాడు. నిజానికి, ఆ యౌవనస్థుడు ప్రతిరోజు అధ్యయనం కోసం వచ్చేవాడు, జ్ఞానము పుస్తక పఠనం చాలా తక్కువ సమయంలోనే పూర్తయ్యింది. అతడు అన్ని కూటాలకు హాజరవ్వడం ప్రారంభించాడు, తన మునుపటి మతంతో సంబంధాలు తెంచేసుకుని రాజ్య ప్రచారకుడయ్యాడు. ఆయన బాప్తిస్మం తీసుకునే సమయానికి అప్పటికే ఒక పరిచయస్థుడితో గృహ బైబిలు పఠనం నిర్వహిస్తున్నాడు.

19. మనం రాజ్యానికి మొదటిస్థానం ఇస్తుండగా, మనం దేని గురించి నిశ్చయత కల్గివుండవచ్చు?

19 రాజ్యానికి ప్రధమ స్థానం ఇవ్వడం వల్ల కలిగే ఆనందం మనల్ని బలపరుస్తుంది. (మత్తయి 6:​33) మనం ఎన్ని శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ, సువార్తను ప్రకటించడంలో సంతోషంగా, ఆసక్తితో కొనసాగుతాము. (తీతు 2:​14) మనలో చాలామందిమి పూర్తికాల పయినీర్‌ సేవలో కొనసాగగల్గుతున్నాము, మరి కొంతమంది సువార్తికుల అవసరం ఎక్కువగా ఉన్న స్థలాల్లో సేవ చేయగల్గుతున్నారు. ఈ విధాలుగానైనా లేక మరితర విధాలుగానైనా మనం రాజ్యాసక్తులను ఆనందంగా ఉన్నతపర్చినప్పుడు, యెహోవా మన పనినీ ఆయన నామం పట్ల మనం చూపించే ప్రేమనూ మర్చిపోడని మనం నిశ్చయత కల్గివుండవచ్చు.​—⁠హెబ్రీయులు 6:10-12.

యెహోవా బలంతో కొనసాగండి

20. బలం కోసం మనం యెహోవాపై ఆధారపడతామని ఎలా చూపించగలము?

20 మనం యెహోవాయందు నిరీక్షణ కల్గివున్నామనీ, బలం కోసం ఆయనపై ఆధారపడతామనీ చూపిద్దాము. ఆయన ‘నమ్మకమైన దాసుని’ ద్వారా చేస్తున్న ఆధ్యాత్మిక ఏర్పాట్ల నుండి పూర్తిగా ప్రయోజనం పొందడం ద్వారా మనమలా చూపించవచ్చు. (మత్తయి 24:​45) క్రైస్తవ ప్రచురణల సహాయంతో దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగానూ సంఘంగానూ అధ్యయనం చేయడం, హృదయపూర్వకంగా ప్రార్థించడం, పెద్దలిచ్చే ఆధ్యాత్మిక సహాయం, నమ్మకమైన తోటి విశ్వాసుల చక్కని మాదిరులు, పరిచర్యలో క్రమంగా పాల్గొనడం వంటివి యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలపర్చి ఆయన పరిశుద్ధ సేవలో కొనసాగేందుకు మనకు శక్తినిచ్చే ఏర్పాట్లలో భాగాలే.

21. అపొస్తలులైన పేతురు, పౌలు దేవుడిచ్చే శక్తి అవసరమని ఎలా తెలియజేశారు?

21 మానవులముగా మనం దుర్బలులమే అయినప్పటికీ, మనం సహాయం కోసం యెహోవాపై ఆధారపడితే తన చిత్తాన్ని చేయడానికి ఆయన మనల్ని బలపరుస్తాడు. అలాంటి సహాయం అవసరమన్న విషయాన్ని గుర్తెరిగి, అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను.” (1 పేతురు 4:​11) “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను” అని చెప్పినప్పుడు పౌలు తాను దేవుడిచ్చే శక్తిపై ఆధారపడుతున్నానని చూపించాడు. (2 కొరింథీయులు 12:​10) మనం కూడా అలాంటి నిశ్చయతనే చూపిస్తూ, అలసినవారిని బలపర్చే సర్వశక్తిగల ప్రభువైన యెహోవాకు ఘనతను తెద్దాం.​—⁠యెషయా 12:⁠2.

[అధస్సూచీలు]

^ పేరా 1 ఈ సంఖ్యలో, ఒకటి ప్రక్కన 20 సున్నాలు ఉంటాయి.

^ పేరా 15 వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినవి.

మీరెలా సమాధానమిస్తారు?

• సాధారణమైన దానికన్నా ఎక్కువ బలం యెహోవా ప్రజలకు ఎందుకు అవసరం?

• దేవుడు తన సేవకులను బలపరుస్తాడనటానికి ఏ లేఖనాధార నిదర్శనం ఉంది?

• మనల్ని బలపర్చడానికి యెహోవా చేసిన కొన్ని ఆధ్యాత్మిక ఏర్పాట్లు ఏవి?

• మనం బలం కోసం దేవునిపై ఆధారపడతామని ఎలా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[12వ పేజీలోని చిత్రం]

ఇతరులకు బోధించడానికి మనం బైబిలును ఉపయోగించినప్పుడు యెహోవాతో మనకున్న సంబంధం బలపర్చబడుతుంది