కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు ఆదరించబడింది, అణచివేయబడింది

బైబిలు ఆదరించబడింది, అణచివేయబడింది

బైబిలు ఆదరించబడింది, అణచివేయబడింది

“పవిత్ర పుస్తకాలను అన్ని భాషల్లోకి అనువదించాలని నేను కోరుకుంటాను,” అని 16వ శతాబ్దానికి చెందిన డెసిడేరియస్‌ ఎరాస్మస్‌ అనే ఒక ప్రఖ్యాత డచ్‌ పండితుడు వ్రాశాడు.

ప్రజలందరూ లేఖనాలను చదివి అర్థం చేసుకోగలగాలని ఎరాస్మస్‌ గాఢంగా ఆకాంక్షించాడు. అయితే, బైబిలు విరోధులు ఆ ఆలోచనను తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి, ఆ కాలంలో యూరప్‌, బైబిల్లోని విషయాల పట్ల కొంచెం కుతూహలం కనపరిచేవారికి సహితం అత్యంత ప్రమాదకరమైన స్థలంగా ఉండేది. ఇంగ్లాండులో విధించబడిన ఒక శాసనసభ చట్టం ఇలా చెబుతుంది: “ఎవరైనా లేఖనాలను ఇంగ్లీషులో చదివితే, తమ ఆస్తిని, చరాస్తులను, ప్రాణాలను నష్టపోవాల్సివస్తుంది . . . ఒకవేళ వారు మొండిగా కొనసాగినా లేక క్షమించి వదిలిపెట్టిన తరువాత తిరిగి ప్రారంభించినా మొదట రాజద్రోహానికి శిక్షగా ఉరితీయబడతారు, తరువాత దైవ విరుద్ధానికి శిక్షగా కాల్చివేయబడతారు.”

ఇంగ్లాండు విడిచి, మిగతా యూరప్‌లో చూస్తే, క్యాథలిక్‌ మతవిచారణ సభ “ధర్మవిరోధులు” అని నిందించబడిన ఫ్రెంచ్‌ వాల్డెన్సెస్‌ లాంటి మతవర్గాలను నిర్దయగా వేటాడింది. “పాదిరీలు కాని సాధారణ మనుష్యులు పరిశుద్ధ లేఖనాలను ప్రకటించడంగానీ వివరించడంగానీ పూర్తిగా నిషిద్ధం. కాబట్టి, . . . సువార్తలను, గ్రీకు లేఖనాల్లోని లేఖలను ఇతర పవిత్ర లేఖనాలను” ప్రకటించే అలవాటున్న వీరిని వెతికి పట్టుకుని మరీ హింసించింది. బైబిలుపై తమకున్న ప్రేమ కారణంగా లెక్కలేనంత మంది భయంకరమైన చిత్రహింసల పాలయ్యారు, చనిపోయారు. వారు పరలోక ప్రార్థనను లేక పది ఆజ్ఞలను కేవలం కంఠస్థం చేసినందుకే, వారి పిల్లలకు నేర్పించినందుకే హింసాత్మకమైన శిక్షలను అనుభవించారు.

దేవుని వాక్యం పట్ల అటువంటి శ్రద్ధాసక్తులు, ఉత్తర అమెరికాకు ఓడలో వలస వచ్చిన అనేక ప్యూరిటన్ల మనస్సుల్లోనూ కొనసాగాయి. తొలి అమెరికన్లలో, “చదవడం, మతం ఒకదానికొకటి విడదీయలేనంతగా అల్లుకుపోయి ఉండేవి. ముఖ్యంగా బైబిలుతో మంచిగా పరిచితమవడం పైనే వారి సంస్కృతి మొత్తం ఆధారపడివుంది,” అని ఒక వ్యక్తిగత జీవితాల చరిత్ర​—⁠పునర్జాగారణోద్యమపు గాఢమైన కోరికలు అనే పుస్తకం చెబుతోంది. వాస్తవానికి, 1767 లో బోస్టన్‌లో ప్రచురించబడిన ఒక వ్యాసంలో ఇలా సూచించబడింది: “పరిశుద్ధ లేఖనాలను చదవడంలో కృషిచేయండి. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం మీ బైబిలు నుంచి ఒక అధ్యాయం తప్పకుండా చదవండి.”

కాలిఫోర్నియాలోని వెంచురాలోనున్న బార్నా పరిశోధన గుంపు నివేదిక ప్రకారం, 90 శాతంకంటె ఎక్కువ మంది అమెరికన్లలో ఒక్కొక్కరి దగ్గర కనీసం మూడు బైబిళ్లు ఉన్నాయి. ఆ దేశంలో బైబిలును ఇప్పటికీ ఉన్నతంగా ఎంచినప్పటికీ ఇటీవల జరిగిన ఒక అధ్యయనమిలా చెబుతోంది: “దాన్ని చదవడానికి, అధ్యయనం చేయడానికి సమయాన్ని వెచ్చించడం, జీవితంలో అమలుపర్చడం . . . అనేది గతంలోని మాట.” బైబిల్లోని విషయాలతో కేవలం నామమాత్రపు పరిచయం కలిగినవారే అత్యధికంగా ఉన్నారు. ఒక వార్తా పత్రికకు చెందిన శీర్షికా రచయిత తన అభిప్రాయాన్నిలా ప్రకటించాడు: “ప్రస్తుత సమస్యలపై, వ్యవహారాలపై [బైబిలు] ఇప్పటికీ చక్కని సలహాలనివ్వగలదన్న ఆలోచన సాధారణంగా ప్రజల మనస్సుల్లోకి రాదు.”

లౌకిక ఆలోచనల వెల్లువ

సహేతుకతతో, మానవుల సహకారంతో మాత్రమే జీవితంలో మనం విజయవంతం అవుతామన్నది నేడు వ్యాప్తిలో ఉన్న ఒక నమ్మకం. బైబిలు సత్యమని, వాస్తవాలతో నిండివున్న ఒక పుస్తకమని కాకుండా మతాభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవాలు మాత్రం ఉన్న అనేక పుస్తకాల్లో బైబిలూ ఒకటని పరిగణిస్తున్నారు.

అలాగైతే ఎంతోమంది ప్రజలు, తమ జీవితంలో దినదినం పెరుగుతున్న కష్టాలతో, సమస్యలతో ఎలా వ్యవహరిస్తున్నారు? సరియైన నైతికపరమైన మతపరమైన నిర్దేశాలూ మార్గదర్శకాలూ లేకుండా వారు ఆధ్యాత్మికత లేని శూన్యంలో జీవితాల్ని సాగిస్తారు. “మనుష్యుల ప్రతి బోధతో వారు ముందుకూ వెనక్కూ ఊగారు, . . . మనుష్యుల మోసం, కుట్రలతో వారు చుక్కానిలేని ఓడల్లాగా అయ్యారు.”​—⁠ఎఫెసీయులు 4:​14, ద ట్వంటియత్‌ సెంచురీ న్యూ టెస్టమెంట్‌.

అలాగైతే మనమిలా ప్రశ్నించుకోవాలి, బైబిలు కేవలం మతసంబంధమైన పుస్తకం మాత్రమేనా? లేక అది నిజంగా ఆచరణాత్మకమైన, అత్యవసర సమాచారమున్న దేవుని వాక్యమా? (2 తిమోతి 3:​16, 17) బైబిలు మనం పరిశీలించాల్సినంత యోగ్యమైనదేనా? దీని తరువాతి భాగంలో ఈ ప్రశ్నలు చర్చించబడతాయి.

[3వ పేజీలోని చిత్రం]

డెసిడేరియస్‌ ఎరాస్మస్‌

[చిత్రసౌజన్యం]

From the book Deutsche Kulturgeschichte

[4వ పేజీలోని చిత్రం]

లేఖనాల నుంచి ప్రకటిస్తున్న కారణంగా వాల్డెన్సెస్‌లు వేటాడబడ్డారు

[చిత్రసౌజన్యం]

Stichting Atlas van Stolk, Rotterdam