కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు మన జీవితాలకు ఒక మార్గదర్శిని

బైబిలు మన జీవితాలకు ఒక మార్గదర్శిని

బైబిలు మన జీవితాలకు ఒక మార్గదర్శిని

“దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, . . . హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (హెబ్రీయులు 4:​12) ఈ వర్ణన, దేవుని వాక్యం ఏమి నెరవేరుస్తుందో తెలియజేస్తూ బైబిలు కేవలం ఒక మంచి పుస్తకం మాత్రమే కాదని నిరూపిస్తోంది.

“దీని సందేశం ఎంత ప్రాముఖ్యమైనదంటే, మన జీవితానికి ఊపిరి లాంటిది” అని ఒక మత రచయిత క్లుప్తంగా చెప్పాడు. ఆయనింకా ఇలా అన్నాడు: “నేడు మనం క్షేమంగా ఉండాలని ఎంత తీవ్రంగా కోరుకుంటున్నామో, ఆ సంక్షేమ అవసరాన్ని ఎంతగా గుర్తిస్తున్నామో గ్రహించి, ఈ గ్రహింపు వెలుగులో బైబిలును చదివితే చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి.” తేజోవంతమైన ఒక దీపంలాగా, బైబిలు ఆధునిక కాలపు సంక్లిష్టమైన అనేక వివాదాలపై, జీవితంలోని సమస్యలపై తన వెలుగును ప్రకాశింపజేస్తుంది.​—⁠కీర్తన 119:​105.

మన ఆలోచనలను మలచడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందజేయడానికి, మన జీవితాలను మెరుగు పరుచుకోవడానికి, మనం మార్చలేని పరిస్థితులను ఎదుర్కొనే నైపుణ్యతను అందించడానికి నిజమైన శక్తి బైబిల్లో వెల్లడి చేయబడిన జ్ఞానానికి ఉంది. ప్రాముఖ్యంగా, బైబిలు మనం దేవుడ్ని తెలుసుకోవడాన్ని, ఆయనను ప్రేమించడాన్ని సాధ్యం చేస్తుంది.

జీవితానికి ఒక సంకల్పాన్నిచ్చే పుస్తకం

బైబిలు మూలకర్తయైన యెహోవా దేవునికి, ‘మన చర్యలన్నీ బాగుగా తెలుసు.’ ఆయనకు మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాల గురించి మనకంటే బాగా తెలుసు. (కీర్తన 139:​1-3) మానవుల ప్రవర్తన విషయంలో స్పష్టమైన హద్దులను ఆయన ఆలోచించి పెట్టాడు. (మీకా 6:⁠8) ఆ హద్దులను సూచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, వాటిని అనుసరిస్తూ జీవించడాన్ని నేర్చుకోవడం జ్ఞానవంతమైనది. “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు [వాడు]” ధన్యుడు అని కీర్తనల రచయిత చెబుతున్నాడు. “అతడు చేయునదంతయు సఫలమగును.” (కీర్తన 1:​1-3) భవిష్యత్తులో అలా జరిగే అవకాశమే ఉంటే, బైబిలు నిశ్చయంగా మన పరిశీలనకు యోగ్యమైనది.

ఒక పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేసిన మౌరిస్‌, బైబిలు కొంత చారిత్రాత్మకమైన, సాహిత్య విలువలు గల పుస్తకమని ఎప్పుడూ నమ్మేవాడు. అయితే, అది దైవ ప్రేరితమైనదనే విషయాన్ని మాత్రం అతను సందేహించేవాడు. దేవుడు, తన లిఖితమైన వాక్యాన్ని మానవులకు ఎందుకు ఇచ్చాడన్న విషయంపై ఒక వివరణ విన్న తరువాత, మౌరిస్‌ వివిధ బైబిలు ప్రవచనాలను పరిశీలించాడు. యువకుడిగా ఉన్నప్పుడు, అతను ప్రాచీన చరిత్ర, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, భూగోళ శాస్త్రం చదివాడు. తాను తన దృష్టిలో తాను తెలివిమంతుడిగా భావించాడని, ఆ లౌకిక జ్ఞానం వల్ల, బైబిలు విశ్వసనీయమైనదని మద్దతునిచ్చే అనేకమైన ఉదాహరణలను గమనించలేనంతగా అంధుడయ్యాడని, అతను ఒప్పుకున్నాడు. “జీవితానికి సౌఖ్యాన్నిస్తాయని గ్రుడ్డిగా భోగభాగ్యాల వెంట పరుగులెత్తి నేను చిక్కుకుపోయాను. విచారకరంగా, ఇప్పటి వరకు వ్రాయబడనటువంటి ఒక గొప్ప పుస్తకం యొక్క చక్కదనం, సత్యశీలతలను గురించి తెలుసుకోలేకపోయాను.”

మౌరిస్‌ ఇప్పుడు తన 70వ పడిలో, యేసు అపొస్తలుడైన తోమాకు ప్రత్యక్షమైన సంఘటనను పరోక్షంగా సూచిస్తూ కృతజ్ఞతతో ఇలా అంటున్నాడు: “‘రక్తంకారే గాయం’ మీద నా వేలును పెట్టి చూచినట్లుగా, నా మనసు నుంచి సందేహాలన్నీ తుడుచుకుపోయి బైబిలు సత్యమని పూర్తి విశ్వాసం కలిగింది.” (యోహాను 20:​24-29) అపొస్తలుడైన పౌలు చెప్పినట్టే బైబిలు, హృదయాలోచనలను బయలు పరుస్తుంది, జీవితానికి ఒక అర్థాన్నిస్తుంది. అది నిజంగా మన జీవితాలకు ఒక మార్గదర్శినే.

సమస్యలతో నిండిన ఒక జీవితానికి స్థిరత్వాన్నివ్వడం

చెడు అలవాట్లను మానుకోవాలనుకునే వారికి కూడా బైబిలు తన సలహా ద్వారా సహాయాన్నందిస్తుంది. డానియేల్‌ పొగత్రాగే చెడు అలవాటును జయించగలిగాడు, విచ్చలవిడి పార్టీలు, మితిమీరి మద్యం సేవించడం కూడా మానేశాడు. (రోమీయులు 13:13; 2 కొరింథీయులు 7:1; గలతీయులు 5:​19-21) వాస్తవికంగా, అలాంటి దురలవాట్లను మానుకోవడానికి “నవీనస్వభావమును” ధరించడానికి గట్టిగా కృషిసల్పాల్సి ఉంటుంది. (ఎఫెసీయులు 4:​22-24) “మనం అసంపూర్ణులం కాబట్టి, అది ఒక సవాలు” అని డానియేల్‌ అంటున్నాడు. అయినప్పటికీ, ఆయన సాధించాడు. ఇప్పుడు డానియేల్‌ ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతాడు, అది ఆయనను యెహోవాకు దగ్గరగా ఉంచుతుంది.

డానియేల్‌ పెరిగి పెద్దవాడవుతుండగా, బైబిలు పట్ల ఎప్పుడూ ప్రగాఢమైన గౌరవాన్ని కలిగివుండేవాడు​—⁠ఆయన దాన్ని చదవనప్పటికీ​—⁠ప్రతి రాత్రి దేవునికి ప్రార్థన చేసేవాడు. అయినా ఏదో కొరతగా ఉండేది. ఆయనకు సంతోషం లేకుండా పోయింది. బైబిల్లో మొదటిసారిగా ఆయన దేవుని పేరును చూసినప్పుడు, ఆయన జీవితం ఒక మలుపు తిరిగింది. (నిర్గమకాండము 6:⁠3; కీర్తన 83:​18) అప్పటినుండి, ప్రార్థన చేసేటప్పుడు ఆయన యెహోవా పేరును ఉపయోగించడం ప్రారంభించాడు, అప్పుడాయన ప్రార్థనలు మరింత అర్థవంతమయ్యాయి. “యెహోవా నాకు అత్యంత సన్నిహిత వ్యక్తి అయ్యాడు, ఆయనిప్పటికీ అత్యంత సన్నిహిత స్నేహితుడే” అని అంటున్నాడు.

బైబిలును గురించి తెలుసుకోవడానికి ముందు, భవిష్యత్తు పట్ల డానియేల్‌ దృక్కోణం నిస్తేజంగా ఉండేది. “ఒక సాధారణమైన వ్యక్తి కూడా ఈ లోకం దిగజారిపోతున్న విషయాన్ని గ్రహించగలడు” అని అంటూ, ఇంకా ఆయనిలా అంటున్నాడు: “నేను భీతిచెందాను, ఆ భయం నా మనసును ఆవహించకుండా ఉండేందుకు గాను నేను ఎప్పుడూ బిజీగా ఉండడానికి ప్రయత్నించేవాడిని.” తరువాత ఆయన, దేవుడు పరిశుభ్రపర్చబడిన భూమిని స్థాపించి దానిపై అందరికీ న్యాయాన్ని చేకూరుస్తాడని, అక్కడ విధేయతగల మానవులు నిరంతరం శాంతి, సంతోషాలను అనుభవిస్తారని తెలుసుకున్నాడు. (కీర్తన 37:10, 11; దానియేలు 2:44; ప్రకటన 21:​3, 4) ఇప్పుడు డానియేల్‌కు ఒక కచ్చితమైన నిరీక్షణ ఉంది. బైబిలుకున్న స్థిరత్వాన్నిచ్చే ప్రభావం ఆయన ఆశావాదంతో జీవించడాన్ని సాధ్యం చేసింది.

మానసిక సమస్యలను అధిగమించడంలో సహాయం

జార్జ్‌కు ఏడేళ్ళప్పుడు వాళ్ళమ్మ చనిపోయింది. మరుసటి రోజు లేస్తానో లేదో అని, రాత్రులు పడుకోవడానికి ఆయన భయపడేవాడు. తరువాత ఆయన మరణం, పునరుత్థానాల గురించి యేసు చెప్పిన ఈ మాటలను చదివాడు: “ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్నవారందరు [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.” ఈ మాటలు కూడా ఆయన హృదయాన్ని స్పృశించాయి: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.” (యోహాను 5:​28, 29; 11:​25) ఇవి సహేతుకంగా, తార్కికంగా, ఓదార్పునిచ్చేవిగా అనిపించాయి. “ఈ సత్యం, మనసును ఆకర్షించడమే కాదుగానీ హృదయాన్ని కూడా స్పృశిస్తుంది” అని జార్జ్‌ అంటున్నాడు.

మునుపు పేర్కొనబడిన డానియేల్‌కి కూడా భయాలుండేవి. వాళ్ళమ్మ ఒక్కర్తే ఆయనను పెంచలేకపోయింది. ఆయన అనేక అనాధాశ్రమాల్లో జీవించడానికి పంపించబడ్డాడు. అక్కడ ఆయనెప్పుడూ తాను బయటివాడిననే భావించేవాడు, ప్రేమగల ఒక కుటుంబ సంరక్షణలో పెరగాలని ఎప్పుడూ కోరుకునేవాడు. చివరికి, తను చేసే బైబిలు పఠనం ద్వారా ఆయన కోరుకున్నది ఆయనకు దొరికింది. డానియేల్‌, యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘంతో సహవసించడం ద్వారా, ఒక ఆధ్యాత్మిక కుటుంబంలో భాగమయ్యాడు. అది తన స్వంత కుటుంబమని, వారిచే ప్రేమించబడుతున్నానని భావించి ఎంతో ఆనందించాడు. బైబిలు మానసిక సంతృప్తినిచ్చే మార్గంలో నడిపిస్తుంది, అది నిజంగా ఆచరణాత్మకమైనది, ప్రయోజనకరమైనది.

యెహోవా మన మనసులో ఏముందో చూడగలడని, మనం ఏం కావాలని కోరుకుంటున్నామో తెలుసుకోగలడని గుర్తుంచుకోండి. దేవుడు “హృదయములను పరిశీలన చేయువాడు,” ఆయనే “ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున” ఇస్తాడు.​—⁠సామెతలు 21:⁠2; యిర్మీయా 17:​10.

కుటుంబ జీవితంలో ఆచరణాత్మకమైన సలహా

బైబిలు మానవ సంబంధాల విషయంలో ఆచరణాత్మకమైన సలహానిస్తుంది. జార్జ్‌ ఇలా అంటున్నాడు: “వ్యక్తిత్వాల సంఘర్షణ లేక అపార్థాలు అనేవి జీవితంలో ఎంతో ఒత్తిడిగల పరిస్థితులను కలుగజేయగలవు.” వాటితో ఆయనెలా ప్రవర్తిస్తాడు? “ఒకవేళ, ఎవరైనా నాతో ఏ విషయంలోనైనా విరోధంగా ఉన్నట్టనిపిస్తే, నేను మత్తయి 5:​23, 24 వచనాల్లోని సూటిగావున్న సలహాను పాటిస్తాను: ‘నీ సహోదరునితో సమాధానపడుము.’ ఆ విరోధం గురించి నేను మాట్లాడగలను అన్న సరళమైన వాస్తవమే ఫలితాలు తీసుకువస్తుంది. బైబిలు చెబుతున్న దేవుని శాంతిని నేను గ్రహించగలుగుతాను. అది పనిచేస్తుంది, అది ఎంతో ఆచరణాత్మకమైనది.”​—⁠ఫిలిప్పీయులు 4:​6, 7.

భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, ఇద్దరూ ‘వినుటకు వేగిరపడువారై, మాటలాడుటకు నిదానించువారై, కోపించుటకు నిదానించువారై ఉండాలి.’ (యాకోబు 1:​19) అటువంటి సలహా సంభాషణను మెరుగు పరుస్తుంది. జార్జ్‌ ఇలా అంటున్నాడు: “నా స్వంత శరీరంవలెనే నా భార్యను ప్రేమించవలెననే సలహాను పాటించినప్పుడు, ఫలితాలు చాలా త్వరగా చూశాను. నన్ను గౌరవించడానికి ఆమెకు అదెంతో సులభతరం చేసింది. (ఎఫెసీయులు 5:​28-33) అవును, మన అసంపూర్ణతలను అంగీకరించి వాటికి తగిన విధంగా ఎలా మెలుగుకోవాలో, ఇతరుల అసంపూర్ణతలను ఎదుర్కొన్నప్పుడు మంచి ఫలితాలెలా పొందాలో బైబిలు మనకు నేర్పిస్తుంది.

కలకాలం నిలిచే సలహా

జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా అన్నాడు: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామెతలు 3:​5, 6) ఎంత సరళమైన మాటలు, అయినా ఆ మాటలు ఎంతో గంభీరమైనవి!

బైబిలు, మంచిని చేయడానికి శక్తినిస్తుంది. దేవుడ్ని ప్రేమించే వారు, తమ జీవితంలో ఆయన చిత్తానుసారంగా నడవడాన్ని, “యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొ[ని]” సంతోషాన్ని పొందడాన్ని అది సాధ్యం చేస్తుంది. (కీర్తన 119:⁠1) మన పరిస్థితులు ఎలాంటివైనప్పటికి, మనకు కావల్సిన నడిపింపును, సలహాలను బైబిలు కలిగివుంది. (యెషయా 48:​17, 18) ప్రతిరోజు దాన్ని చదవండి, మీరు చదివిన దాన్ని ధ్యానించండి, దాన్ని పాటించండి. అది మీ మనసులను స్వచ్ఛంగా ఉంచుతుంది, శుద్ధమైన ఆరోగ్యవంతమైన వాటిపై మనసుండేలా చేస్తుంది. (ఫిలిప్పీయులు 4:​8, 9) మీరు ఎలా జీవించాలి, ఆనందించాలి అన్నవి నేర్చుకోవడమే కాకుండా, జీవానికి సృష్టికర్త అయిన వానిని ఎలా ప్రేమించాలి అన్నది కూడా నేర్చుకుంటారు.

అలాంటి మార్గాన్ని పాటించడం ద్వారా, బైబిలు మీకు​—⁠లక్షలాది ఇతరులకు కూడా అయినట్టు​—⁠ఒక మంచి పుస్తకం కంటే ఎక్కువే అవుతుంది. అది మన జీవితానికి నిజంగా ఒక మార్గదర్శిని అవుతుంది!

[6వ పేజీలోని చిత్రం]

దురలవాట్లను మానుకోవాలనే ఒకరి నిర్ణయాన్ని బైబిలు బలపర్చగలదు

[7వ పేజీలోని చిత్రం]

దేవునికి ఎలా దగ్గరవ్వాలో బైబిలు మీకు నేర్పిస్తుంది