కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు దాన్ని నమ్మాలా?

మీరు దాన్ని నమ్మాలా?

మీరు దాన్ని నమ్మాలా?

పన్నెండేళ్ళ ఆ విద్యార్థి ఆల్జీబ్రాలోని మౌలిక సూత్రాల్ని గ్రహించడానికి కుస్తీపట్లు పడుతున్నాడు. క్లాసులోని వారందరికీ ఉపాధ్యాయుడు ఒక ఆల్జీబ్రా లెక్క ఇచ్చాడు, దాన్ని చూస్తుంటే చాలా సరళంగానే కన్పిస్తుంది.

ఆయన లెక్కను ఇలా ప్రారంభించాడు, “X=Y అనుకోండి, ఒక్కొక్కదాని విలువ 1 అనుకోండి.”

‘ఇంతవరకు బాగానే ఉంది’ అనుకున్నాడు విద్యార్థి.

లెక్క నాలుగు లైన్లు దాటింది, ఇంకా అంతా సరళంగానే ఉంది. కానీ చివరికి ఉపాధ్యాయుడు ఒక ఆశ్చర్యకరమైన ఫలితానికి చేరుకున్నాడు: “కాబట్టి, 2=1!”

“ఇది తప్పని రుజువు చేయండి చూద్దాం” తికమకలో పడిపోయిన విద్యార్థుల్ని ఆయన సవాలు చేశాడు.

ఆల్జీబ్రా లెక్కలు అంతగా రాని ఆ విద్యార్థికి, దాన్ని తప్పని ఎలా రుజువు చేయాలో అర్థంకాలేదు. లెక్కలోని ఏ ఒక్క లైనులోను ఏమాత్రమూ తప్పు కన్పించలేదు. మరి, తను ఈ ఫలితాన్ని నమ్మేయాలా? ఎంతైనా, మ్యాథమేటిక్స్‌లో తనకన్నా తన ఉపాధ్యాయుడే ప్రవీణుడు కదా. అయినా సరే కుదరదు, దీన్ని ఎంతమాత్రమూ నమ్మరాదు! ‘దీన్ని నేను తప్పని రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫలితం అర్థవిహీనమైనదని ఇంగిత జ్ఞానం నాకు చెబుతుంది’ తనలో తాను అనుకున్నాడా విద్యార్థి. (సామెతలు 14:​15, 18) ఆ ఉపాధ్యాయుడు గానీ, తన తోటి విద్యార్థులు గానీ ఒక్క డాలరుకి బదులుగా రెండు డాలర్లు ఇవ్వరని తనకు బాగా తెలుసు!

కొంతకాలానికి ఆ విద్యార్థి ఆ లెక్కలో ఉన్న తప్పేమిటో కనుక్కున్నాడు. ఈ అనుభవం మాత్రం అతనికి ఒక విలువైన పాఠాన్ని నేర్పించింది. తనకన్నా ఎంతో గొప్ప జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా, ఎంతో జాగ్రత్తగా ఒక వాదనను రూపొందించి, అందులో సందేహానికి తావే లేదు అనిపించే ఒక మూర్ఖమైన ముగింపును చేరుకున్నప్పుడు, దాన్ని అప్పటికప్పుడు తప్పని రుజువుచేయలేనంత మాత్రాన దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. నిజానికి ఈయన 1 యోహాను 4:1 లోని ఎంతో ఆచరణాత్మకమైన బైబిలు సూత్రాన్ని పాటిస్తున్నాడు​—⁠మీరు వినే ప్రతీదాన్ని వెంటనే నమ్మేయవద్దు, అది ఒక అధికారికమైన మూలం నుండి వస్తున్నదని అనిపించినప్పటికీను.

అయితే దీనర్థం మీకు మునుపు ఉన్న తలంపులనే మొండిగా పట్టుకుని వేలాడాలని కాదు. మనం పొరబడి నమ్మతూవున్న విషయాలను సరిదిద్దే సమాచారాన్ని వినటానికి నిరాకరించడం తప్పు. కానీ అదే సమయంలో, తనకు చాలా విస్తారమైన జ్ఞానం లేదా అధికారం ఉన్నదని చెప్పుకునే ఒక వ్యక్తి మీపై ఒత్తిడి తెచ్చినప్పుడు “మీరు త్వరపడి చంచలమనస్కులు” కూడా కాకూడదు. (2 థెస్సలొనీకయులు 2:⁠2) పై ఉదాహరణలోని ఉపాధ్యాయుడు తన విద్యార్థులను కావాలనే తికమకపెట్టాడు. అయితే అందరూ అలా సరదాకి మాత్రమే చేయరు. ప్రజలు ఘోరమైన “వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను” కూడా చేయగలరు.​—⁠ఎఫెసీయులు 4:​14; 2 తిమోతి 2:14, 23-26.

నిపుణులు చెప్పేది ఎప్పుడూ ఒప్పేనా?

ఏ రంగంలోని నిపుణులైనా వారికెంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఒకరికి విరుద్ధమైన తలంపుల్ని మరొకరు కలిగివుంటారు. వారి అభిప్రాయాలు కూడా మారుతూనే ఉంటాయి, నిలకడగా ఉండవు. ఉదాహరణకు, అతి సామాన్యమైన విషయాన్నే తీసుకోండి; ప్రస్తుతం వ్యాధికారకాల గురించి వైద్యశాస్త్రంలో ఎన్నో వాదోపవాదాలు జరుగుతున్నాయి. “వ్యాధులకు ప్రకృతి కారణమా, పెరిగిన వాతావరణమూ పెంపకమూ కారణమా అన్నది శాస్త్రజ్ఞుల్లో తీవ్రమైన వాదోపవాదాలు జరగడానికి కారణమౌతున్నది” అని హార్వార్డ్‌ యూనివర్సిటీలోని వైద్య విభాగంలో పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్‌ వ్రాస్తున్నాడు. నియతివాదుల గుంపు అనే పక్షంవారు, మనం అనేకానేక వ్యాధులకు లోనుకావడంలో మన జీన్స్‌ [జన్యువులు] ఎంతో నిర్ణయాత్మక పాత్రను వహిస్తాయని చాలా గట్టిగా నమ్ముతున్నారు. అయితే విపక్షంవారి వాదన ప్రకారం, మనం పెరిగిన వాతావరణం, జీవనరీతులు మానవ వ్యాధులకు అతి పెద్ద కారకాలుగా ఉంటున్నాయి. ఈ రెండు పక్షాల వారూ తమ వాదనలకు మద్దతుగా ఎన్నో అధ్యయనాల్నీ గణాంకాల్నీ తీసి చూపిస్తారు. వాదోపవాదాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి.

వారి కాలంలో వారు బోధించిన దానికి విరుద్ధమైన బోధ ఎంతమాత్రం లేకపోయినప్పటికీ, అతి ప్రసిద్ధమైన తాత్త్వికులు బోధించినది సహితం తప్పని ఎన్నోమార్లు రుజువైంది. “తత్త్వవేత్తలందరిలోకి అతి ప్రసిద్ధుడు” అరిస్టాటిల్‌ అని తత్త్వవేత్త అయిన బెర్ట్రాండ్‌ రస్సెల్‌ చెప్పాడు. అయితే, అరిస్టాటిల్‌ సిద్ధాంతాల్లో అనేకం “శుద్ధ తప్పని” కూడా రస్సెల్‌ చెప్పాడు. ఆయనిలా వ్రాశాడు: “ఆధునిక కాలమంతట్లో విజ్ఞానశాస్త్రంలోను, తర్కశాస్త్రంలోను, లేదా తత్త్వశాస్త్రంలోను జరిగిన దాదాపు ప్రతి పురోభివృద్ధి అరిస్టాటిల్‌ మద్దతుదారులు వ్యతిరేకిస్తుండగానే జరిగింది.”​—⁠పాశ్చాత్య తత్త్వశాస్త్ర చరిత్ర (ఆంగ్లం).

“జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన[వి]”

గ్రీసులోని ప్రసిద్ధ తత్త్వవేత్తలైన సోక్రటీస్‌, ప్లేటో, అరిస్టాటిల్‌ వంటివారి శిష్యులనేకమందిని తొలి క్రైస్తవులు తప్పకుండా కలిసేవుంటారు. ఆ కాలాల్లోని విద్యాధికులు చాలామంది క్రైస్తవులకంటె తామే మేధాపరంగా ఉన్నతులమని పరిగణించుకున్నారు. యేసు శిష్యుల్లో అనేకులు “లోకరీతిని జ్ఞానులై” ఉన్నట్లు పరిగణించబడలేదు. (1 కొరింథీయులు 1:​26) నిజానికి, ఆ కాలంలోని తత్త్వజ్ఞానంలో విద్యను సముపార్జించిన వారికి, క్రైస్తవులు నమ్ముతున్నవి “వెఱ్ఱితనముగా” లేదా “మతిలేనివిగా” కనిపించాయి.​—⁠1 కొరింథీయులు 1:​23, 24; ఫిలిప్స్‌.

మీరు గనుక ఆ తొలి క్రైస్తవుల్లో ఉండివుంటే, అప్పటి మేధావులు చేసే వాదనలు విని వాటిలో కొట్టుకుపోతారా, లేదా వారి జ్ఞానప్రదర్శనను చూసి సంభ్రమపడిపోతారా? (కొలొస్సయులు 2:⁠4) అపొస్తలుడైన పౌలు చెబుతున్న దాని ప్రకారం, వారి విజ్ఞానాన్ని చూసి సమ్మోహితులు కావడానికి ఏ కారణమూ లేదు. ఆ కాలంలోని “జ్ఞానుల జ్ఞానము” “వివేకుల వివేకము” యెహోవా దృష్టిలో వెఱ్ఱితనమని ఆయన క్రైస్తవులకు గుర్తుచేశాడు. (1 కొరింథీయులు 1:​19) “ఈ లోకపు తత్త్వవేత్తలు, రచయితలు, విమర్శకులు తమ జ్ఞానాన్ని ప్రదర్శించి ఏమి సాధించారు?” (1 కొరింథీయులు 1:​20, ఫిలిప్స్‌) వారికి మేధాపరమైన ప్రజ్ఞ ఎంత ఉన్నప్పటికీ, పౌలు కాలంలోని తత్త్వవేత్తలు, రచయితలు, విమర్శకులు మానవజాతి సమస్యలకు ఎటువంటి నిజమైన పరిష్కారాన్నీ చూపించలేకపోయారు.

కాబట్టి, “జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదము”లని అపొస్తలుడైన పౌలు చెప్పినవాటిని క్రైస్తవులు నివారించడం నేర్చుకున్నారు. (1 తిమోతి 6:​20) అటువంటి జ్ఞానాన్ని పౌలు ‘అబద్ధమని’ చెప్పడానికి కారణమేమిటంటే, అందులో కీలకమైన ఒక అంశం లేదు​—⁠అంటే దానికి మూలం దేవుడు కాకపోవడం, లేదా దేవుని ప్రస్తావనే అందులో లేకపోవడం; ఆ కీలకాంశం ఉన్నట్లైతే ఆ సిద్ధాంతాల్ని వారు పరీక్షించివుండేవారు. (యోబు 28:​12; సామెతలు 1:⁠7) అది లేకపోవడంతో, అదే సమయంలో మహా మోసగాడైన సాతానుచేత అంధత్వానికి లోనుకావడంతో, అలాంటి జ్ఞానానికి అంటిపెట్టుకుని ఉన్నవారు సత్యాన్ని కనుగొనే అవకాశాలు శూన్యమే.​—⁠1 కొరింథీయులు 2:6-8, 14; 3:​18-20; 2 కొరింథీయులు 4:⁠4; 11:​14; ప్రకటన 12:⁠9.

బైబిలు​—⁠ప్రేరేపిత మార్గదర్శకం

దేవుడు తన చిత్తాన్ని, సంకల్పాన్ని, సూత్రాల్ని లేఖనాల్లో తెలియజేశాడన్న విషయాన్ని తొలి క్రైస్తవులు ఎన్నడూ సందేహించలేదు. (2 తిమోతి 3:​16, 17) ఇది, ‘మనుష్యుల పారంపర్యాచారముచేత, మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత చెరపట్టుకొని పోబడడం’ నుండి వారిని కాపాడింది. (కొలొస్సయులు 2:⁠8) నేడు కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. తికమకకు గురిచేసే, పరస్పర విరుద్ధంగా ఉండే మనుష్యుల అభిప్రాయాలకు భిన్నంగా, దేవుని ప్రేరేపిత వాక్యం మనకు గట్టి ఆధారాన్ని ఇస్తుంది, మనం ఆ పునాదిని మన నమ్మకాలకు ఆధారం చేసుకోవచ్చు. (యోహాను 17:​17; 1 థెస్సలొనీకయులు 2:​13; 2 పేతురు 1:​21) అదే లేకపోయినట్లైతే, చంచలమైన మానవ సిద్ధాంతాలూ, తత్త్వజ్ఞానం అనే ఇసుకపై స్థిరనివాసాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించడంలా ఉంటుంది మన పరిస్థితి; అది అసాధ్యం.​—⁠మత్తయి 7:24-27.

‘ఒక్క నిమిషం ఆగండి, మరి విజ్ఞానశాస్త్రం కనుగొన్న వాస్తవాలు బైబిలు తప్పని రుజువు చేసేశాయి కదా? మారుతూవుండే మనుష్యుల తత్త్వజ్ఞానంలానే అది కూడా అంత నమ్మదగ్గది కాదని తేలిపోయింది కదా?’ అని ఎవరైనా సందేహం వ్యక్తం చేయవచ్చు. ఉదాహరణకు, “కాపర్నికస్‌, కెప్లర్‌, గెలీలియో వంటివారు మన భూమి ఈ విశ్వానికి కేంద్రంగా లేదన్న తలంపుని రూఢిపర్చడానికి అరిస్టాటిల్‌కూ అలాగే బైబిలుకూ విరుద్ధంగా పోరాడాల్సివచ్చింది” అని బెర్ట్రాండ్‌ రస్సెల్‌ ఆరోపించాడు. (ఇటాలిక్కులు మావి.) మరొక ఉదాహరణగా, భూమి వయస్సు వందల కోట్ల సంవత్సరాలు ఉంటుందని వాస్తవాలన్నీ చూపిస్తుంటే ఒక్కొక్కటి 24 గంటలతో కూడిన ఏడు రోజుల్లోనే సృష్టించబడిందని బైబిలు బోధిస్తోందని నేటి సృష్టివాదులు పిడివాదం చేయడంలేదూ?

నిజానికి, మన భూమి ఈ విశ్వానికి కేంద్రంగా ఉన్నదని బైబిలు చెప్పడం లేదు. అది చర్చి నాయకుల బోధ, వారు దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోయారు. ఆదికాండములోని సృష్టి వృత్తాంతం, ఈ భూమికి వందల కోట్ల సంవత్సరాల వయస్సు ఉందని నమ్మడానికి అవకాశాన్ని కల్పిస్తుంది, అంతేగాక అందులోని ఒక్కొక్క సృష్టి దినాన్ని కేవలం 24 గంటలకే పరిమితం చేయడంలేదు. (ఆదికాండము 1:1, 5, 8, 13, 19, 23, 31; 2:​3, 4) బైబిలును నిష్కపటంగా పరిశీలిస్తే అదొక విజ్ఞానశాస్త్రపు పాఠ్యగ్రంథం కాదనీ, అదే సమయంలో అది ‘మతిలేని’ విధంగా ఎంతమాత్రం మాట్లాడడం లేదనీ అర్థమౌతుంది. నిజానికది ఇప్పటిదాకా రుజువులున్న సైన్సు విషయాలతో పూర్తి అనుగుణ్యంగా ఉంది. *

“తర్కనా శక్తి”

యేసు శిష్యుల్లో చాలామంది సాదాసీదా ప్రజలైనప్పటికీ, వారు బహుశా అంతగా విద్యావంతులు కాకపోయినప్పటికీ, వారి వద్ద దేవుడిచ్చిన ఒక గొప్ప ఉపకరణం ఉంది. వారు ఎటువంటి నేపథ్యం నుండి వచ్చినవారైనా వారందరికీ తర్కనా శక్తి, ఆలోచనా సామర్థ్యాలు ఉన్నాయి. తమ “తర్కనా శక్తి”ని పూర్తిగా వినియోగిస్తూ “ఉత్తమమైన, అనుకూలమైన దేవుని చిత్తమేదో [తమకై తాముగా] పరీక్షించి తెలుసుకోమని” అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులను ప్రోత్సహించాడు.​—⁠రోమీయులు 12:​1, 2, NW.

తమ వద్ద దైవదత్తమైన “తర్కనా శక్తి” ఉండడంతో తొలి క్రైస్తవులు, తమకు విశదపర్చబడిన దేవుని వాక్యానికి అనుగుణ్యంగా లేని ఎటువంటి తత్త్వజ్ఞానాన్నైనా లేదా బోధనైనా నిష్ప్రయోజనమైనవని స్పష్టంగా గుర్తించగలిగారు. నిజానికి కొన్ని సందర్భాల్లో వారి కాలంలోని జ్ఞానులు, ‘సత్యాన్ని అడ్డగిస్తూ,’ దేవుడు ఉన్నాడనడానికి తమ చుట్టూ ఉన్న రుజువుల్ని అలక్ష్యం చేస్తూ వచ్చారు. “తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. నిజానికి, వారు దేవుణ్ణి గురించిన ఆయన సంకల్పాన్ని గురించిన సత్యాన్ని తిరస్కరించినందున “వారి అవివేక హృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు [వారు] బుద్ధిహీనులైరి.”​—⁠రోమీయులు 1:​18-22; యిర్మీయా 8:8, 9.

తాము జ్ఞానులమని బల్లగుద్ది మరీ చెప్పుకునేవారు సాధారణంగా, “దేవుడు లేడు” అనో లేదా, “బైబిల్ని నమ్మకూడదు” అనో లేదా, “ఇవి ‘అంత్యదినాలు’ కావు” అనో ఒక ముగింపుకు వస్తుంటారు. అటువంటి తలంపులు దేవుని దృష్టిలో ఎంత మూర్ఖమైనవంటే, “2=1” అని చెప్పడమంత మూర్ఖమైనవే. (1 కొరింథీయులు 3:​19) ప్రజలు తమకు అధికారమున్నదని ఎంత గట్టిగా చెప్పుకున్నప్పటికీ వారి ముగింపులు గనుక దేవునికి విరుద్ధంగా ఉంటే, ఆయన వాక్యాన్ని అలక్ష్యం చేస్తుంటే, మన ఇంగిత జ్ఞానానికి వ్యతిరేకమైనది చెప్తుంటే, మీరు వారి అభిప్రాయాల్ని స్వీకరించాల్సిన అవసరం లేదు. చివర్లో చెప్పేదేమిటంటే, “ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు” అన్నదే ఎల్లప్పుడు జ్ఞానయుక్తమైన మార్గం.​—⁠రోమీయులు 3:⁠4.

[అధస్సూచి]

^ పేరా 20 మరిన్ని వివరాల కోసం, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన, ద బైబిల్‌​—⁠గాడ్స్‌ వర్డ్‌ ఆర్‌ మ్యాన్స్‌? మరియు ఈజ్‌ దేర్‌ ఎ క్రియేటర్‌ హు కేర్స్‌ ఎబవుట్‌ యు? అనే పుస్తకాలు చూడండి.

[31వ పేజీలోని చిత్రాలు]

నిలకడగా లేని మానవుల అభిప్రాయాల్లా కాక, బైబిలు నమ్మకానికి సుస్థిరమైన ఆధారాన్ని అందిస్తుంది

[చిత్రసౌజన్యం]

Left, Epicurus: Photograph taken by courtesy of the British Museum; upper middle, Plato: National Archaeological Museum, Athens, Greece; right, Socrates: Roma, Musei Capitolini