కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తన ప్రజలకు విశ్రమస్థానాన్ని ఏర్పరుస్తాడు

యెహోవా తన ప్రజలకు విశ్రమస్థానాన్ని ఏర్పరుస్తాడు

రాజ్య ప్రచారకుల నివేదిక

యెహోవా తన ప్రజలకు విశ్రమస్థానాన్ని ఏర్పరుస్తాడు

కొండమార్గంలో ప్రయాణించి అలసిపోయిన ఒక వ్యక్తికి నీడగావున్న ప్రదేశం సేదదీర్చడానికి ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. నేపాల్‌లో అలాంటి విశ్రమస్థలాలను చౌతారాలు అని పిలుస్తారు. ఈ చౌతారాలు సాధారణంగా బాగా గుబురుగా ఉన్న మర్రి చెట్టు ప్రక్కన ఉంటాయి, నీడగా ఉన్న ఆ చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు. చౌతారాని ఏర్పాటు చేయడం దయతో కూడినది, ఆ విధంగా సహాయం చేసిన వారు తమ పేరును తెలియనివ్వరు.

ఈ విధానంలో అలసిపోయిన “ప్రయాణికులకు” ఆనందాన్నీ ఆధ్యాత్మిక విశ్రాంతినీ యెహోవా దేవుడు ఎలా కలుగజేస్తున్నాడన్న విషయాన్ని నేపాల్‌లోని అనుభవాలు చూపిస్తున్నాయి.​—⁠కీర్తన 23:⁠2.

• అందమైన పట్టణమైన పొఖారాలో హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడివున్న మనోహరమైన దృశ్యం కనిపిస్తుంది. లిల్‌ కుమారి నివసిస్తున్నది ఆ పట్టణంలోనే. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల లిల్‌ కుమారి చాలా బాధలుపడుతూ, నిరాశ చెంది ఉంది. ఒక యెహోవాసాక్షి ఆమెను దర్శించినప్పుడు బైబిలు యొక్క ప్రజ్వలమైన నిరీక్షణను బట్టి కదిలించబడి, వెంటనే గృహ బైబిలు పఠనాన్ని కోరింది.

లిల్‌ కుమారి పఠనాన్ని ఆనందిస్తున్నప్పటికీ కుటుంబ వ్యతిరేకత అధికంగా ఉండడంవల్ల ఆ పఠనాన్ని కొనసాగించడం అంత సులభమేమీ కాలేదు. అయినప్పటికీ ఆమె నిరుత్సాహపడలేదు. క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవుతూ ఆమె నేర్చుకున్నవాటిని ఆచరణలో పెట్టింది, ముఖ్యంగా భార్యగా విధేయత చూపించే విషయంలో. ఫలితంగా, లిల్‌ కుమారి బైబిలు పఠనం చేయడం, కుటుంబమంతటికీ ప్రయోజనాన్ని తీసుకువస్తున్నదని ఆమె భర్త, ఆమె తల్లి గుర్తించారు.

ఆమె భర్త, వారి బంధువులు అనేకమంది ఇప్పుడు దేవుని వాక్యాన్ని పఠిస్తున్నారు. ఇటీవల పొఖారాలో జరిగిన సమావేశ కార్యక్రమానికి లిల్‌ కుమారి, అలాగే ఆమె బంధువుల్లో 15 మంది హాజరై ఆనందించారు. “మా గృహం విశ్రమస్థానంగా మారింది, ఎందుకంటే మా కుటుంబమంతా సత్యారాధనలో ఐక్యమయ్యింది, నేను నిజమైన మనశ్శాంతిని కనుగొన్నాను” అని ఆమె చెబుతుంది.

• నేపాల్‌లో కులవిచక్షణ చట్టరహితమైనప్పటికీ దాని శక్తివంతమైన ప్రభావం ఇంకా ప్రజల జీవితాలను అదుపు చేస్తూనే ఉంది. అందుకే సమానత్వం, నిష్పక్షపాతం వంటి వాటిని గురించి బైబిలు ఏమి చెప్తుందనే విషయంలో అనేకమంది ఆసక్తి కలిగివున్నారు. “దేవుడు పక్షపాతి కాడని” తెలుసుకోవడం సూర్య మాయను, ఆమె కుటుంబ సభ్యులను ఎంతగానో మార్చింది.​—⁠అపొస్తలుల కార్యములు 10:⁠34.

కులవిచక్షణతో కూడిన అన్యాయం వల్ల, లోతుగా పేరుకుపోయిన సాంప్రదాయాల ఆచారాల వల్ల సూర్య మాయ బాగా ఆందోళన చెంది ఉంది. నిష్ఠగల స్త్రీగా సూర్య మాయ సంవత్సరాల తరబడి సహాయం కోసం విగ్రహ దేవుళ్ళను పూజిస్తూనే ఉంది. కానీ ఆమె పూజలకు సమాధానం లభించలేదు. ఒకరోజు ఆమె సహాయం కోసం ఏడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు “ఏమీ చేయలేని విగ్రహాల ముందు కూర్చొని సహాయం కోసం ఎందుకు ఏడుస్తున్నావు” అని ఆమె మనుమరాలైన ఆరు సంవత్సరాల బబితా అడిగింది.

బబితా వాళ్ళ అమ్మ అప్పటికే యెహోవాసాక్షులతో పఠనం చేస్తుంది. బబితా తన అమ్మమ్మను క్రైస్తవ కూటానికి రమ్మని అత్యుత్సాహంతో ఆహ్వానించింది. సూర్య మాయ హాజరైనప్పుడు అక్కడ ఉన్న రకరకాల కులాల ప్రజలంతా ఎలాంటి దుర్భావనలు లేకుండా ఒకరి సాహచర్యాన్ని మరొకరు ఆనందించడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమె గృహ బైబిలు పఠనం కావాలని కోరింది. తన పొరుగువారు వెలివేసినప్పటికీ ఆమె నిరుత్సాహపడలేదు. అలాగే చదవడం వ్రాయడం తగుమాత్రంగానే వచ్చినప్పటికీ అది కూడా ఆమె ఆధ్యాత్మిక ఎదుగుదలను నిలిపివేయలేకపోయింది.

ఎనిమిది సంవత్సరాలు గతించాయి, ఆమె కుటుంబంలో ఆమె భర్త, ముగ్గురు పిల్లలతోపాటు ఆరుగురు యెహోవాసాక్షులయ్యారు. సూర్య మాయ ఇప్పుడు క్రమపయినీరుగా పూర్తికాల పరిచర్యను చేస్తుంది, యెహోవా మాత్రమే అందించగల విశ్రమస్థానం దగ్గర తమ బరువైన భారాల్ని దించుకునేలా ఆమె అనేకమందికి సహాయపడుతుంది.