కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“రేపేమి సంభవించునో మీకు తెలియదు”

“రేపేమి సంభవించునో మీకు తెలియదు”

జీవిత కథ

“రేపేమి సంభవించునో మీకు తెలియదు”

హెర్బర్ట్‌ జెన్నింగ్స్‌ చెప్పినది

“నేను, ఓడరేవు నగరమైన టేమా నుంచి, ఘానాలో ఉన్న వాచ్‌ టవర్‌ సొసైటీ బ్రాంచ్‌ ఆఫీసుకు తిరిగి వస్తున్నాను. పట్టణంలోకి వెళ్ళడానికి లిఫ్ట్‌ అడుగుతున్న ఒక యౌవనస్థుడ్ని ట్రక్కులోకి ఎక్కించుకుందామని దార్లో ఆగాను. అతనికి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని నేను చేజిక్కించుకున్నాను. నేను మంచిగా సాక్ష్యమిస్తున్నానని అనుకున్నాను! అయితే, ఈ యౌవనస్థుడు దిగే స్థలాన్ని మేము చేరుకోగానే, అతను ట్రక్కులోనుండి బయటకు దూకి పారిపోయాడు.”

సంభవించకూడనిదేదో నా జీవితంలో సంభవిస్తున్నదనడానికి పైన చెప్పిన సంఘటన నాకొక సంకేతాన్నిస్తుంది. అసలు ఏమి జరిగిందో చెప్పడానికి ముందు కెనడా వాస్తవ్యుడనైన నేను ఘానాకు ఎలా వచ్చానో చెప్పనివ్వండి.

అది 1947 డిసెంబరు, కెనడాలోని టొరొంటో నగరశివారు ప్రాంతం. ఒక క్రొత్త ఇంటికి నీటి సరఫరా కోసం మంచులో గడ్డకట్టివున్న నేలను దాదాపు ఒక మీటరు లోతుకు మేము అప్పుడే త్రవ్వాము. ట్రక్కులో వెళ్ళిపోడానికి వేచివున్న మా పని వాళ్ళంతా, బాగా అలసిపోయి ఉండడంతో, బయట చలిగా ఉండడంతో చలిమంట చుట్టూ చేరారు. ఉన్నట్టుండి, పని వాళ్ళలో ఒకడైన అర్నాల్డ్‌ లోర్టన్‌ “యుద్ధాలు, యుద్ధ సమాచారాల” గురించి, “లోకాంతం” గురించి, ఇంకా నాకసలు తెలియని ఇతర విషయాలను గురించి చెప్పడం ప్రారంభించాడు. వెంటనే అందరూ మాట్లాడడం ఆపేసి మొహాలు ఇబ్బందిగా పెట్టారు, మరి కొంతమందయితే అతనిపై కోపపడ్డారు కూడా. ‘ఇతను చాలా ధైర్యశాలే! వినడానికి ఇక్కడెవ్వరూ సుముఖంగా లేకపోయినా అతను చెబుతూనే ఉన్నాడే’ అని నేను అనుకోవడం నాకు బాగా గుర్తుంది. అతను చెప్పింది మాత్రం నాలో అనుకూల ప్రతిస్పందనను కలుగజేసింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి కేవలం కొన్ని సంవత్సరాలే అయింది, అనేక తరాలుగా మా కుటుంబం సహవసిస్తున్న క్రిస్టడెల్ఫియన్‌ మతంలో నేనెప్పుడూ అలాంటి విషయాలను వినలేదు. అతని వివరణలకు ముగ్ధుడినై జాగ్రత్తగా విన్నాను.

ఇంకా ఎక్కువగా తెలుసుకోవడం కోసం నేను అర్నాల్డ్‌ను వెంటనే కలిశాను. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే, 19 ఏళ్ళ అనుభవశాలినికాని నాపై అతనూ, అతని భార్య జీన్‌ ఎంతగా సహనాన్ని, దయను కనబరిచారో నాకు గుర్తుకు వస్తుంది. వాళ్ళతో మాట్లాడడానికని చెప్పి నేను చాలా సార్లు వాళ్ళ ఇంటికి చెప్పకుండా, వాళ్ళు పిలవనిదే వెళ్ళేవాడిని. వాళ్ళు నన్ను సరియైన మార్గంలో పెట్టి, నా లేత మనస్సులో నైతికత విషయంలోను, ప్రమాణాల విషయంలోను జరుగుతున్న సంఘర్షణలను ఒక కొలిక్కి తీసుకురావడానికి సహాయం చేశారు. రోడ్డుప్రక్కన చలిమంట ద్వారా కల్గిన అనుభవానికి పది నెలల తర్వాత, అంటే 1950, అక్టోబరు 22న నేను బాప్తిస్మం పొంది ఒక యెహోవాసాక్షిని అయ్యాను, టొరొంటోలో ఇప్పుడు భాగమై ఉన్న నార్త్‌ యార్క్‌లోని విల్లోడేల్‌ సంఘంతో నేను నా సహవాసాన్ని ప్రారంభించాను.

తోటి ఆరాధకులతో ముందుకు సాగడం

క్రొత్తగా నేను కనుగొన్న సత్యాన్ని స్వీకరించాలన్న నిర్ణయం తీసుకున్నానని మా నాన్నగారు గ్రహించినప్పుడు ఇంటిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకనాడు ఎదురుగా వస్తున్న వాహనంలోని డ్రైవరు తాగి నడిపిస్తుండడంతో యాక్సిడెంట్‌ జరిగి ఇటీవల నాన్నకు దెబ్బలు తగిలాయి. ఆయన తరచుగా దేనికీ ఒప్పుకొనే మనిషి కాదు. అమ్మ, నా తమ్ముళ్ళు ఇద్దరూ, నా చెల్లెళ్ళిద్దరూ, చాలా కష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. బైబిలు సత్యాల విషయమై ఇంట్లో ఉద్రిక్తత పెరిగింది. అయితే, నా తల్లిదండ్రులతో సమాధానంగా ఉండడం కోసం, నాకు నేనుగా “సత్యమార్గము”లో స్థిరపడడం కోసం ఇల్లు విడిచిపెట్టడం జ్ఞానయుక్తమని నాకనిపించింది.​—⁠2 పేతురు 2:⁠2.

1951 వేసవికాలం చివర్లో, ఆల్బర్టా నందలి కోల్మన్‌లోని ఒక చిన్న సంఘంతో సహవసించడం ప్రారంభించాను. అక్కడ రాస్‌ హంట్‌, కీత్‌ రాబిన్స్‌ అనే ఇద్దరు యౌవనులు క్రమపయినీరు సేవ అని పిలువబడే పూర్తికాల పరిచర్యను చేస్తున్నారు. అదే స్వచ్ఛంద సేవను నేనూ చేసేలా వారు నాకు సహాయం చేశారు. 1952, మార్చి 1న నేను క్రమ పయినీరుగా చేరాను.

నాకు లభించిన ప్రోత్సాహాన్ని నేను మెప్పుదలతో గుర్తుచేసుకుంటున్నాను. అయితే, నేను నేర్చుకోవలసింది చాలా ఉంది, ఈ పయినీరు సేవా రంగంలో నన్ను నేను మెరుగుపర్చుకోవాలని తీర్మానించుకున్నాను. అటు తర్వాత, దాదాపు ఒక సంవత్సరం పాటు ఆల్బర్టాలోని లెథ్‌బ్రిడ్జ్‌ సంఘంతో గడిపిన తర్వాత ప్రయాణ పైవిచారణకర్తగా సేవ చేయమన్న ఊహించని ఆహ్వానాన్ని నేను అందుకున్నాను. కెనడానందలి న్యూ బ్రూన్స్‌విక్‌లోని మాంక్‌టన్‌ నుంచి క్యూబెక్‌ నందలి గేస్పీ వరకూ ఉన్న కోస్తా ప్రాంతాల్లో ఉన్న యెహోవాసాక్షుల సంఘాలన్నింటినీ నేను సందర్శించాలి.

అప్పుడు నాకు 24 సంవత్సరాలు మాత్రమే. పైగా, సత్యంలో క్రొత్త కావడం వల్ల ముఖ్యంగా నేను సేవచేయబోయే పరిపక్వతగల సాక్షులతో పోలిస్తే నేను సమర్థుడ్ని కానని భావించాను. తర్వాతి కొన్ని నెలలు నేను చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాను. అటుతర్వాత మరొక సర్ప్రైజ్‌ నాకోసం వేచివుంది.

గిలియడ్‌ స్కూలు, గోల్డ్‌ కోస్ట్‌కి వెళ్ళడం

న్యూయార్క్‌ నందలి సౌత్‌ లాన్సింగ్‌లో, దాదాపు వందమంది ఇతర విద్యార్థులుతో కూడిన వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 26వ తరగతిలో చేరమని నేను 1955 సెప్టెంబరులో ఆహ్వానించబడ్డాను. తీవ్రమైన తర్ఫీదు, పఠనాల కోసం ఐదు నెలలు గడపాల్సివుంటుంది, నాకు నిజంగా కావల్సింది అదే. అధిక పురికొల్పునిచ్చే గుంపుతో కలిసి ఉండడం వల్ల నాలో ఆసక్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో, నా జీవితంలో జరిగిన ఇంకొక సంఘటన యొక్క ఫలితాన్ని ఈనాటి వరకూ నేను ఆస్వాదిస్తున్నాను.

మిషనరీ పనికి సిద్ధమౌతున్న విద్యార్థుల్లో ఐలీన్‌ స్టబ్స్‌ అనే ఒక యౌవన సహోదరి ఉంది. ఐలీన్‌లోని స్థిరత్వాన్ని, సౌమ్యత్వాన్ని, వినయాన్ని, ఎల్లప్పుడు నవ్వు ముఖంతో ఉండడాన్ని నేను చూశాను. ఆమెకు నా అభిప్రాయాల్ని వెల్లడిచేసి ఆమెను భయపెట్టాననుకుంటాను. అయితే, ఆమె పారిపోలేదు లెండి! పరస్పర అంగీకారంతో, కోస్టా రికాలోని తన మిషనరీ నియామకానికి ఐలీన్‌, నేనేమో పశ్చిమాఫ్రికాలోని గోల్ట్‌ కోస్ట్‌కి (ఇప్పటి ఘానాకు) వెళ్ళాము.

1956 మే నెలలోని ఓ ఉదయకాల సమయాన, న్యూ యార్క్‌ నందలి బ్రూక్లిన్‌లోని ఒక బిల్డింగ్‌లోని పదవ అంతస్థులో ఉన్న సహోదరుడు నేథన్‌ నార్‌ ఆఫీసులో ఆయన ముందు నిలబడి ఉన్నాను. అప్పట్లో ఆయన వాచ్‌ టవర్‌ సొసైటీ అధ్యక్షుడు. గోల్డ్‌ కోస్ట్‌, టోగోలాండ్‌ (ఇప్పడు టోగో), ఐవరీ కోస్ట్‌ (ఇప్పడు కోటే డీ ఐవరీ), అప్పర్‌ వోల్టా (ఇప్పడు బుర్కీన ఫాసో), జాంబియాలలో ప్రకటనా పనిని పర్యవేక్షించేందుకు గాను నేను బ్రాంచి సేవకునిగా నియమించబడ్డాను.

సహోదరుడు నార్‌ చెప్పిన మాటలు నాకింకా నిన్న చెప్పినట్టుగానే గుర్తున్నాయి. “నీవు ఇప్పటికిప్పుడే ఈ బాధ్యతను చేపట్టవలసిన అవసరం లేదు, కావల్సినంత సమయం తీసుకో, అక్కడ ఉన్న అనుభవజ్ఞులైన సహోదరుల నుండి నేర్చుకో. నీవు దీనికి సిద్ధమని అనుకున్నప్పుడే బ్రాంచి సేవకుడుగా సేవ చేయడం ప్రారంభించు. . . . నీ నియామక పత్రం ఇదిగో. అక్కడకు చేరుకున్న ఏడు రోజులకు నీవు ఈ బాధ్యతను చేపట్టాలి.” అని అతను చెప్పాడు.

కేవలం ఏడు రోజులేనా’ అని నేననుకున్నాను. ‘“కావల్సినంత సమయం తీసుకో” అన్న మాట సంగతేమిటి?’ ఆ ఇంటర్వ్యూనుండి నేను తేరుకోలేకపోయాను.

ఆ కొన్ని రోజులూ చాలా త్వరగా గడిచిపోయాయి. నేను సరుకుల ఓడలో గోల్డ్‌ కోస్ట్‌కు 21 రోజుల ప్రయాణాన్ని ప్రారంభించాను. ఓడలో ఈస్ట్‌ రివర్‌ గుండా ప్రయాణిస్తూ సొసైటీ యొక్క బ్రూక్లిన్‌ ఆఫీస్‌లను చూశాను.

ఐలీన్‌, నేను సముద్రాంతర ఉత్తరాలు చాలా వ్రాసుకున్నాం, అలా తపాలా వారిని బిజీగా ఉంచాము. మేము 1958 లో తిరిగి కలుసుకుని, అదే సంవత్సం ఆగస్టు 23న పెళ్ళి చేసుకున్నాం. అంత మంచి సహకారి లభించినందుకు నేను ఎప్పుడూ యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తాను.

తోటి మిషనరీలతో, సొసైటీ బ్రాంచ్‌ ఆఫీస్‌లో ఉన్న నా ఆఫ్రికా సహోదర, సహోదరీలతో 19 సంవత్సారాలు కలిసి పనిచేసే ఆధిక్యతను నేను ఎంతో మెప్పుదలతో చూస్తాను. అప్పట్లో, కేవలం కొద్ది మంది మాత్రమే ఉన్న బేతేలు కుటుంబం తర్వాత దాదాపు 25 మందికి పెరిగింది. అవి మాకు సవాలుదాయకమైన, ప్రాముఖ్యమైన, ఫలవంతమైన దినాలు. నిజం చెప్పాలంటే, నాకు వేడి, తేమగల వాతావరణాన్ని తట్టుకోవడం చాలా కష్టమయ్యేది. నేను అస్తమానం చెమటకార్చుతూనో, ఎప్పుడూ జిడ్డోడుతూనో ఉండేవాడిని, కొన్నిసార్లు నాకు విసుగు పుట్టేది. అయినప్పటికీ, ఘానాలో 1956 లో కేవలం 6,000 కంటే కొంచెం ఎక్కువగా ఉన్న రాజ్య ప్రచారకుల సంఖ్య 1975 నాటికల్లా 21,000కు పెరగడం నిజంగా సంతోషాన్ని తెచ్చింది. 60,000పైగా ఉన్న చురుకైన సాక్షులు నేడక్కడ ఉండడం చూడడం నా రెట్టింపు ఆనందానికి కారణమౌతుంది.

మేము ఎదురుచూడని ‘రేపు’

దాదాపు 1970 లో, గుర్తుపట్టడానికి కూడా చాలా కష్టమైన ఒక అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొన్నాను. అన్ని వైద్య పరీక్షలూ అయ్యాయి, డాక్టర్లందరూ నేను “మంచి ఆరోగ్యంతోనే” ఉన్నానని చెప్పారు. అలాగయితే, ఎందుకు నేను ఎప్పడూ చాలా నీరసంగా, ఆయాసపడుతూ, విశ్రాంతి లేకుండా ఉంటున్నాను? రెండు సంఘటనలు దానికి జవాబిచ్చాయి, ఆ సంఘటనలు నాలో దిగులు పుట్టించాయి. నిజానికి, యాకోబు వ్రాసినట్లే: “రేపేమి సంభవించునో మీకు తెలియదు.”​—⁠యాకోబు 4:⁠14.

మొదటి సంఘటన, పట్టణంలోకి లిఫ్ట్‌ ఇస్తూ ఆ యౌవనస్థునికి సాక్ష్యమిచ్చినప్పుడు కల్గిన అనుభవం. ఎప్పుడూ ఏకధాటిగా మాట్లాడుతూ ఉంటాననీ, గుక్క తిప్పుకోకుండా క్షణక్షణానికీ వేగాన్ని తీవ్రతరం చేస్తాననీ నేనసలు గుర్తించనే లేదు. మేము ఈ యౌవనస్థుని గమ్యస్థానాన్ని చేరుకున్న తర్వాత, తను ట్రక్కులోంచి దిగి పరుగులంకించుకోవడం చూసి నేను నిర్ఘాంతపోయాను. దాదాపు ఘానా వాసులందరూ మృదువైన వారై, దయగలవారై, త్వరగా కలతచెందని వారై ఉంటారు. కానీ అతని ప్రతిస్పందనలో ఇలాంటి ఏ లక్షణాలూ కన్పించలేదు. నేను ఆలోచనలో పడ్డాను. ఏదో సమస్య ఉందన్నది నేను గుర్తించాను. అది ఏ సమస్యనో తెలియదు గాని సమస్య మాత్రం నాలో ఖచ్చితంగా ఉంది.

రెండవది, ప్రత్యేకించి ఒక ఆత్మ పరిశీలనతో కూడిన చర్చ జరిగిన తర్వాత ఐలీన్‌ ఇలా చెప్పింది: “ఇది శారీరక సమస్య కాకపోయినట్లయితే, మనస్సుకు సంబంధించినదై ఉండాలి.” రోగలక్షణాలన్నింటినీ జాగ్రత్తగా నేను వ్రాసిపెట్టుకొని మానసిక వైద్యుని దగ్గరకు వెళ్ళాను. నేను నా రోగ లక్షణాలను చదివి వినిపించిన తర్వాత, “ఇది ఒక విలక్షణమైన స్థితి, నీవు మేనియక్‌ డిప్రెస్సివ్‌ సైకోసిస్‌తో బాధపడ్తున్నావు” అని ఆయన చెప్పాడు.

నాకు నోటంట మాటరాలేదు! ఇది క్రమంగా పెరుగుతూ ఉండటం వల్ల నేను రెండు సంవత్సరాల వరకూ బాధను సహిస్తూ రావలసి వచ్చింది. నేను పరిష్కారాన్ని వెతుకుతూనే ఉన్నాను. కానీ ఏమి చెయ్యాలో నిజంగా ఎవ్వరికీ తెలియలేదు. ఓహ్‌, ఆ శ్రమ ఎంతటి నిరాశానిస్పృహల్ని కల్గించిందో కదా

మా జీవితాంతం పూర్తి కాల సేవలోనే కొనసాగుతూ ఉండాలని మేము ఆశిస్తూ ఉండేవాళ్ళం. నేను, చాలాసార్లు హృదయపూర్వకమైన, తీవ్రమైన ప్రార్థనలు చేశాను: ‘యెహోవా చిత్తమైతే నేను బ్రదికి ఉండి ఇది చేతును’ అని అనుకున్నాను. (యాకోబు 4:​15) కానీ అలా జరగలేదు. గనుక, వాస్తవాన్ని ఎదుర్కొంటూ మేము జూన్‌ 1975 లో ఘానానూ, అనేకమంది సన్నిహిత స్నేహితులనూ విడిచిపెట్టి కెనడాకు వెళ్ళిపోవాలని ఏర్పాట్లు చేసుకున్నాము!

యెహోవా తన ప్రజల ద్వారా సహాయాన్నందిస్తాడు

నేను వ్యర్థమైనవాడిని కాననీ, ఇలాంటి సమస్యతో బాధపడేది నేను ఒక్కడినే కాదనీ త్వరలోనే తెలుసుకున్నాను. “లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని” తెలుసుకోండని చెబుతున్న 1 పేతురు 5:9 లోని మాటలు నాకు అర్థవంతంగా అనిపించాయి. అనూహ్యమైన మార్పు జరిగినప్పటికీ, యెహోవా నిజంగా మా ఇరువురికీ ఎలా మద్దతు ఇచ్చాడో నేను గ్రహించగల్గాను. అనేక విధాల్లో మాకు ‘సహోదరులు’ ఎంతగా సహాయం చేశారో కదా!

వస్తుపరంగా మాకు ఏమంత ఎక్కువ లేకపోయినప్పటికీ యెహోవా మమ్మల్ని విడిచిపెట్టలేదు. మాకు వస్తుపరంగానూ, ఇతర విధాలుగానూ సహాయం చేయడానికని ఘానాలోని మా స్నేహితులను ఆయన ప్రేరేపించాడు. సమ్మిళితమైన, లోతైన భావాలతో మేము ఎవరి మీదనైతే మక్కువను పెంచుకున్నామో వాళ్ళను విడిచిపెట్టి ‘రేపు’ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో తిరిగి కెనడాకు వచ్చాము.

ఐలీన్‌ అక్కయైన లెనోరా, ఆమె భర్తయైన ఆల్విన్‌ ఫ్రైసెన్‌లు మమ్మల్ని తమ ఇంటికి తీసుకువెళ్ళి, ఉదారంగా అనేక నెలలు తమతోపాటు అక్కడే ఉంచుకున్నారు. ఒక ప్రముఖ మానసిక వైద్యుడు, “ఆరు నెలల్లో నీవు పూర్తిగా బాగైపోతావు” అని నమ్మకంతో హామీ ఇచ్చాడు. బహుశా నాలో నమ్మకాన్ని పెంచడానికని అలా చెప్పివుండవచ్చు, గాని ఆయన ఇచ్చిన హామీ ఆరు సంవత్సరాలకు కూడా నెరవేరలేదు. నేడు మర్యాదగా పిలవబడే బైపోలార్‌ మూడ్‌ డిజార్డర్‌తో ఈనాటి వరకూ బాధపడ్తూనే ఉన్నాను. ఇది మర్యాదైన పేరే కావచ్చు కాని ఈ జబ్బుతో బాధపడేవాళ్ళకు తెలుసు, ఒక దయగల పేరును పెట్టినంత మాత్రాన ఈ జబ్బుకున్న లక్షణాలను తీసివేయలేమని.

అదే సమయంలో, సహోదరుడు నార్‌ ఒక జబ్బుతో బాధపడుతూ ఉండడం వల్ల చివరకు ఆయన జూన్‌ 1977 లో మరణించాడు. అలా జబ్బుతో బాధపడుతూ ఉన్నప్పటికీ, నాకు ఓదార్పును, సలహాను ఇచ్చే ప్రోత్సాహకరమైన పొడవైన ఉత్తరాలను వ్రాయడానికి ఆయన సమయాన్నీ, శక్తినీ వెచ్చించాడు. అవి నా దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. కారణసహితం కాని భావాలను అర్థంచేసుకుని నన్ను నేను నిగ్రహించుకోవడానికి ఆయన మాటలు నాకు చాలా సహాయం చేశాయి.

1975 చివర్లో, నా ఆరోగ్యాన్ని స్థిరపరచుకోవడానికి గాను మేము మా పూర్తికాల సేవాధిక్యతను విడిచిపెట్టవలసి వచ్చింది. పగటిపూట వెలుగుకే నా కళ్ళు నొప్పులు పుట్టేవి. ఒక్కసారిగా పెద్ద శబ్దం వింటే తుపాకి గుండు పేలినట్టుగా అనిపించేది. గుంపుల్ని చూస్తే చాలు ఉక్కిరిబిక్కిరి అయిపోయేవాడిని. క్రైస్తవ కూటాలకు హాజరవ్వడానికి కూడా చాలా కష్టపడవలసి వచ్చేది. అయినప్పటికీ, ఆధ్యాత్మిక సహవాసం యొక్క విలువను నేను పూర్తిగా గుణగ్రహిస్తూనే ఉన్నాను. దీనిని అధిగమించడానికి గాను, నేను రాజ్య మందిరానికి జనం వచ్చి కూర్చొన్న తర్వాత వెళ్ళేవాడిని, కార్యక్రమం ముగింపులో జనం లేచి వెళ్ళడానికి కొంచెం ముందు లేచి వచ్చేసే వాడిని.

బహిరంగ పరిచర్యలో పాల్గొనాలన్నా ఒక గొప్ప సవాలుగానే ఉండేది. కొన్నిసార్లు, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత డోర్‌బెల్‌ను కొట్టాలన్నా కూడా నాకు ధైర్యం సరిపోయేది కాదు. అయినా మానలేదు, ఎందుకంటే మన పరిచర్యకు అనుకూలంగా ప్రతిస్పందించిన వారిని రక్షించుకోవడమే పరిచర్య సంకల్పం అని నేను గుర్తించాను. (1 తిమోతి 4:​16) కొద్ది సేపటికి, నా భావోద్రేకాలను అదుపు చేసుకుంటూ ఇంకొక ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసేవాడిని. పరిచర్యలో క్రమంగా భాగం వహించడం ద్వారా నేను నా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగాను, అది, నేను నా సమస్యను తాళుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని అధికం చేసింది.

బైపోలార్‌ మూడ్‌ డిజార్డర్‌కి దీర్ఘకాలం ఉండే లక్షణం ఉంది గనుక ఈ ప్రస్తుత విధానం ఉన్నంతకాలం నాకు ఈ వ్యాధి ఉంటుందని నేను గ్రహించాను. 1981 తేజరిల్లు!లో దీని విషయమై చక్కని ఆర్టికల్స్‌ వచ్చాయి. * వాటిద్వారా నేను ఈ వ్యాధి లక్షణాల్ని పూర్తిగా అర్థం చేసుకొని, వాటిని తాళుకోవడానికి కావలసిన ప్రభావవంతమైన మెలకువలను నేర్చుకొన్నాను.

తాళుకోవడాన్ని నేర్చుకోవడం

దీనికంతటికీ నా భార్య చేసిన త్యాగం, సర్దుబాట్లు ఎంతో అవసరమయ్యాయి. మీరు ఎప్పుడైనా ఆమెలాంటి పరిస్థితుల్లో ఉండి శ్రద్ధ కనపర్చిన వారయినట్లయితే ఆమె వ్యాఖ్యానాలను మీరు గుణగ్రహించగలరు:

“మూడ్‌ డిజార్డర్‌తో బాధపడే వ్యక్తి వ్యక్తిత్వం ఆకస్మికంగా మార్పు చెందుతుంది. కొన్ని గంటల్లోనే కొత్త కొత్త పథకాలతో, భావాలతో ఉన్న ఉత్సాహవంతమైన ప్రోత్సహకరమైన వ్యక్తి నుండి నీరసపడిపోయిన, ప్రతికూల భావాలతో కూడిన, కోపిష్టి అయిన వ్యక్తిగా తయారవుతాడు. దాన్ని ఒక జబ్బుగా దృష్టించకపోతే, ఇతరుల్లో ఉద్రేకాన్ని రేకెత్తించి, ఆందోళనకు గురిచేస్తుంది. చెయ్యాలనుకున్న పనుల్ని వెంటనే మార్చవలసి ఉంటుంది, నిరాశ లేక తృణీకరించబడ్డాం వంటి భావాలు కూడా ఏర్పడతాయి.”

నా విషయానికి వస్తే, నేను ప్రశాంతంగా ఉన్నాననిపిస్తే చాలు నాకు భయం పుట్టుకొచ్చేది. నాకు చాలా “బాగా” అన్పిస్తే, దాని తర్వాత చాలా “ఘోరం” అన్పించే సమయం వస్తుంది. అందుకనే “బాగా” అన్పించడం కన్నా “ఘోరం” అన్పించడం మేలని నేను అనుకుంటుంటాను. ఎందుకంటే “ఘోరంగా” ఉన్నప్పుడు నేను అనేక రోజులు ఎక్కడకూ కదలకుండా, ఏ అనుచితమైన విషయాల్లోనూ జోక్యం చేసుకునే వాడిని కాదు. నాలో ఉత్సాహం మరీ ఎక్కువైనప్పుడు ఐలీన్‌ నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, నేను క్రుంగిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు నన్ను ఓదారుస్తూ నాకు తోడుగా ఉంటుంది.

జబ్బు తీవ్రంగా ఉన్నప్పుడు అందర్నీ పక్కన పెట్టి స్వార్థపరుడిగా తయారయ్యే ప్రమాదం ఉంది. క్రుంగుదల ఉన్నప్పుడు అసలు ఎవ్వరూ గుర్తుండకపోవడం లేక మేనిక్‌ ఎపిసోడ్‌లో ఉన్నప్పుడు ఇతరుల భావాలూ, ప్రతిస్పందనలూ గుర్తించలేకపోవడం జరగవచ్చు. గతంలో, నా మానసిక, భావోద్రేక సమస్యలకున్న రుజువుల్ని గుర్తించడం నాకు కష్టంగా ఉండేది. నా ఆలోచనతో పోరాడవలసి వచ్చేది, నా సమస్య బాహ్యమైనదనీ, నేనెక్కడో వైఫల్యం చెందాననీ, లేక ఎవరో వేరొక వ్యక్తి సమస్య అనీ అనుకొనే వాడిని. నేను మళ్ళీ మళ్ళీ ‘నా చుట్టూ ఏమీ మారలేదు, అది బాహ్యమైనది కాదుగాని నాలోనే ఉన్న సమస్య’ అని గుర్తుచేసుకుంటాను. క్రమంగా నా ఆలోచనా విధానాన్ని సరిచేసుకుంటాను.

గడిచిన ఈ సంవత్సరాలన్నింట్లో మాలో మేము మాట్లాడుకునేటప్పుడూ, ఇతరులతో మా గురించి తెలుపుతున్నప్పుడూ ఏ విషయాన్నీ దాచకుండా నిజాయితీగా ఉండడం మేమిద్దరం నేర్చుకున్నాం. జబ్బు మా జీవితాలపై ఆధిపత్యం చేయడానికి అనుమతించకుండా మేము ఆశావాదంతో కొనసాగాం.

శ్రేష్ఠమైన ‘రేపు’

తీవ్రమైన ప్రార్థనలు, ఇతరనేక ప్రయత్నాలతో, యెహోవా ఆశీర్వాద మద్దతుతో మేము ప్రయోజనం పొందాం. మేము ఇద్దరమూ ఇప్పుడు వృద్దాప్యంలో ఉన్నాం. నేను తగుమోతాదులో మందులు వాడుతూ క్రమంగా వైద్య సంబంధమైన పర్యవేక్షణలో ఉన్నాను, ప్రస్తుతం నేను ఆరోగ్యంతోనే ఉన్నాను. మాకు మునుపున్న సేవాధిక్యతల విషయమై మెప్పుదల కల్గివున్నాం. నేను సంఘ పెద్దగా కొనసాగుతూ ఉన్నాను. విశ్వాసంలో ఇతరులకు మద్దతును ఇచ్చేవారిగా ఉండాలని మేము ఎప్పుడూ ప్రయత్నించాం.

నిజమే, యాకోబు 4:⁠14 తెలుపుతున్నట్టుగా: “రేపేమి సంభవించునో మీకు తెలియదు.” ఈ విధానం గతించేంత వరకూ అది అలాగే ఉంటుంది. అయితే, “శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును,” అని చెప్పిన యాకోబు 1:⁠12 మాటలు కూడా నిజమౌతాయి. మనం ఈ రోజు స్థిరంగా నిలబడి, రేపు కోసం యెహోవా సిద్ధంగా ఉంచిన ఆశీర్వాదాలను అనుభవిద్దాం.

[అధస్సూచి]

^ పేరా 35 ఆగస్టు 8, 1981 తేజరిల్లు! (ఆంగ్లం) సంచికలోని “మీరు జీవిత సమస్యల్ని తాళుకోగలరు;” సెప్టెంబరు 8, 1981 (ఆంగ్లం) సంచికలోని “డిప్రెషన్‌ను మీరు ఎలా ఎదుర్కోవచ్చు;” అక్టోబరు 22, 1981 (ఆంగ్లం) సంచికలోని “తీవ్రమైన డిప్రెషన్‌ను ఎదుర్కొనే విధానం” అనే ఆర్టికల్స్‌ను చూడండి.

[26వ పేజీలోని చిత్రం]

ఏకాంతాన్ని అనుభవిస్తూ, నా ఆర్ట్‌ స్టూడియోలో

[26వ పేజీలోని చిత్రం]

నా భార్య ఐలీన్‌తో

[28వ పేజీలోని చిత్రం]

1963 లో ఘానాలోని టేమాలో నిర్వహించబడిన “నిత్య సువార్త” సమావేశంవద్ద