కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్నేహితులను మీరెలా సంపాదించుకోగలరు

స్నేహితులను మీరెలా సంపాదించుకోగలరు

స్నేహితులను మీరెలా సంపాదించుకోగలరు

“జీవితంలో ఒక స్నేహితుడు ఉండడమే ఎక్కువ; ఇద్దరు మరీ ఎక్కువ; ముగ్గురు అసాధ్యం.”​—⁠హెన్రీ బ్రూక్స్‌ ఆడమ్స్‌.

నిజ స్నేహితులు చాలా అరుదు అని అలాంటి వ్యాఖ్యానాలు నిరూపిస్తాయి. “నాకు ఎవరూ లేరు” “నేను ఎవరినీ నమ్మలేను” “నా కుక్కే నా ప్రాణ స్నేహితురాలు” వంటి మాటలను ఒంటరివారిగా ఉండి స్నేహం కోసం ఆకాంక్షించేవారు అంటుంటారు.

స్నేహితులను సంపాదించుకొని వారిని చివరి వరకూ స్నేహితులుగా కాపాడుకోవడం సవాలుతో కూడినది. “అమెరికాలో 25 శాతంమంది ‘తీవ్రమైన ఒంటరితనానికి’ గురవుతున్నారు, . . . ఫ్రాన్స్‌లో సగంమంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు” అని ఒక సర్వే బయల్పరచింది. డేటింగ్‌ క్లబ్బులు, కంప్యూటర్‌ ఛాట్‌ రూమ్‌లు, సాహచర్యం కోసం వార్తాపత్రికల్లోని ప్రకటనలు అధికమవ్వడం చూస్తుంటే ప్రజలు మానవ సంబంధాల కోసం పరితపిస్తున్నారని తెలుస్తుంది.

ఒంటరితనం ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిపై మాత్రమేకాక శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని వాదిస్తూ న్యూరోసైకాలజిస్ట్‌ అయిన డాక్టర్‌ డేవిడ్‌ వీక్స్‌ ఇలా అంటున్నాడు: “ఫోబియాలతోనూ ఒత్తిళ్ళతోనూ బాధపడే రోగులు ఎంతోమంది నా దగ్గరకు వస్తుంటారు, వీరందరూ ఒంటరితనంతో బాధపడుతున్నారని చెప్పవచ్చు. తీవ్రమైన ఒత్తిడికి, తీవ్రమైన ఒంటరితనానికి మధ్య చాలా సంబంధం ఉంది.”

విడాకులు, కుటుంబాలు విడిపోవడం లాంటివి అనేకమంది ప్రజలు ఒంటరివారిగా జీవించేలా శాసిస్తున్నాయి. బ్రిటన్‌లో నిర్వహించబడిన ఒక సర్వే ప్రకారం 21వ శతాబ్దం ప్రారంభానికల్లా ఆ దేశంలో దాదాపు 30 శాతం ఒంటరి-వ్యక్తుల కుటుంబాలు ఉంటాయి.

“అంత్యదినములలో” స్వార్థ దృక్ఫథం అధికంగా వ్యాప్తి చెందుతుందని ప్రేరేపిత లేఖనాలు ముందే తెలియజేశాయి. (2 తిమోతి 3:​1-5) చాలామంది ఇతరులతో సంబంధాలను కలిగివుండడం కన్నా ఇళ్ళు, కార్లు, ఉద్యోగాలు వంటివాటిపట్ల అంటే వస్తు సంపాదనల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగివున్నట్లు కనిపిస్తుంది. ఒక రచయిత అయిన ఆంథోని స్టార్‌ తాను గమనించిన దాని గూర్చి ఇలా చెప్తున్నాడు: “తమ వివాహ భాగస్వామి పట్ల పిల్లల పట్ల తమ అవధానాన్ని నిలిపే బదులు ఆఫీసులకే తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారు.”

నిజ స్నేహితులు అమూల్యమైనవారు

మీ జీవిత నాణ్యత ఎక్కువగా మీ స్నేహ నాణ్యతపై ఆధారపడివుంటుంది. తమ కోసమే జీవించేవారు సంతోషంగా ఉండరు ఎందుకంటే వారి పరిస్థితులను గానీ వారి ఆలోచనలను గానీ పంచుకొనే స్నేహితులెవరూ వారికి ఉండరు. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసుక్రీస్తు చెప్పిన మాటలు వాస్తవం. (అపొస్తలుల కార్యములు 20:​35) దాన్ని ప్రతిధ్వనిస్తూ ఆంగ్ల కవి అయిన జార్జ్‌ బైరన్‌ ఇలా వ్రాశాడు: “ఆనందాన్ని పొందేవారందరూ దాన్ని పంచుకోవాలి.”

స్నేహితుడు అంటే ఎవరు? “ప్రేమతోనూ గౌరవంతోనూ ఒకరికి సన్నిహితంగా ఉండే వ్యక్తి” స్నేహితుడు అని ఒక నిఘంటువు వర్ణిస్తుంది. నిజమైన స్నేహితుడు మీ ఆలోచనలు ప్రయోజనకరమైన విషయాలపైకి మళ్ళేందుకు సహాయపడతాడు. అతడు మిమ్మల్ని ప్రోత్సహించి అవసరమైనప్పుడు మీకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాడు. మీ దుఃఖాన్ని కూడా అతడు పంచుకుంటాడు. “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును” అని రాజైన సొలొమోను తెలియజేశాడు. (సామెతలు 17:​17) సమయం గతించే కొలది వస్తువులు తమ విలువను కోల్పోతాయి, కానీ సమయము గడిచే కొలది నిజమైన స్నేహం ఎదిగి వర్ధిల్లుతుంది.

తమ ప్రేమను “విశాలపరచుకొను”మని లేఖనాలు క్రైస్తవులకు బోధిస్తున్నాయి. (2 కొరింథీయులు 6:​13) అందుకని ఇతరులను సమీపించడం జ్ఞానయుక్తమైనది. ప్రసంగి 11:1, 2 వచనాల్లో మనమిలా చదువుతాము: “నీ ఆహారమును నీళ్లమీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము, భూమిమీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు.” ఈ సూత్రం స్నేహానికి ఎలా వర్తిస్తుంది? మీరు అనేకమందితో స్నేహాన్ని పెంపొందించుకున్నట్లయితే వారిలో కొంతమంది మీకు ఆపత్కాలంలో సహాయం చేయవచ్చు.

నిజమైన స్నేహితులు మీకు మరో విధంగా కూడా రక్షణ కల్పించే వారిగా ఉండగలరు. “మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును” అని సామెతలు 27:6 చెప్తుంది. మిమ్మల్ని అనేకమంది పొగిడినా, నిజమైన స్నేహితులు మాత్రం మిమ్మల్ని అతిగా అంచనా వేయకుండా మీలో ఎక్కడ గంభీరమైన లోపాలున్నాయో చూసి ప్రేమపూర్వకమైన రీతిలో నిర్మాణాత్మకమైన సలహాలను ఇస్తారు.​—⁠సామెతలు 28:⁠23.

మంచివారు, సన్నిహితులు అయిన స్నేహితులు మీపై ఆశీర్వాదాలు కుమ్మరించగల అరుదైన వరాల్లాంటి వారు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో తన ప్రార్థనలు వినబడినవని దూత ద్వారా తెలుసుకున్న రోమా శతాధిపతియైన కొర్నేలీని గూర్చిన సంఘటనను చదువుతాము. అపొస్తలుడైన పేతురు సందర్శనాన్ని గూర్చి ఎదురుచూస్తున్న కొర్నేలీ తన “బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపిం[చాడు].” ఆ కొర్నేలీ సన్నిహిత స్నేహితులు సువార్తను స్వీకరించి దేవుని రాజ్యములో క్రీస్తుతోపాటు పరిపాలించబోయే మొట్టమొదటి సున్నతి పొందని అన్యులైవున్నారు. కొర్నేలీ సన్నిహిత స్నేహితులకు ఎంత చక్కని ఆశీర్వాదమో కదా!​—⁠అపొస్తలుల కార్యములు 10:​24, 44.

అయితే మీరు స్నేహితులను ఎలా సంపాదించుకోగలరు? స్నేహాన్ని గూర్చి ఎంతో చెప్పిన బైబిలే దానికి ఆచరణాత్మకమైన సలహాను కూడా సమాధానంగా అందిస్తుంది. (క్రిందనున్న బాక్సు చూడండి)

నిజమైన స్నేహితులను మీరు ఎక్కడ సంపాదించుకోగలరు

నిజమైన స్నేహితులను సంపాదించుకొనేందుకు శ్రేష్ఠమైన స్థలం క్రైస్తవసంఘం. మొదటిగా మీరు మీ సృష్టికర్త, పరలోక తండ్రియైన యెహోవాతో, మీ రక్షకుడైన యేసుక్రీస్తుతో మీ స్నేహాన్ని పెంచుకొనే అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. మిమ్మల్ని తన స్నేహితులుగా ఉండేందుకు ఆహ్వానిస్తున్న యేసు ఇలా చెప్పాడు: “తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు.” (యోహాను 15:​13, 15) యెహోవానూ యేసుక్రీస్తునూ స్నేహితులుగా చేసుకున్నప్పుడు వారు తమ “నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందు”రన్న నమ్మకాన్ని మీరు కలిగివుండవచ్చు. అవును, యెహోవానూ యేసుక్రీస్తునూ స్నేహితులుగా చేసుకోవడం అంటే నిత్యజీవమని అర్థం.​—⁠లూకా 16:9; యోహాను 17:⁠3.

హృదయాన్ని రంజింపజేసే వారి స్నేహాన్ని మీరు ఎలా పొందగలరు? యెహోవా స్నేహితులుగా, ఆయన గుడారంలో అతిథులు ఉండాలంటే ఏమి అవసరమో 15వ కీర్తన చెప్తుంది. బైబిలును తెరచి ఆ కీర్తనలోని మొదటి ఐదు లేఖనాలను చదవండి. అదనంగా యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.”​—⁠యోహాను 15:​14.

అవును, దేవుని వాక్యమైన బైబిలును మనస్సాక్షి పూర్వకంగా పఠించి, దాని ఉపదేశాన్ని అన్వయించుకుంటే మీరు యెహోవాకు, యేసుక్రీస్తుకు స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నారని చూపిస్తారు. దాన్ని సాధించేందుకు యెహోవా దేవుని గూర్చిన జ్ఞానము లభించే క్రైస్తవకూటాలకు క్రమంగా హాజరవ్వాలి. యెహోవా చెప్పేది వినేందుకు మీరు నమ్మకంగా కృషి చేయండి, అప్పుడు ఆయనకు, ఆయన కుమారునికి సన్నిహితులౌతారు.

యెహోవాను ప్రేమించి, తమ జీవితాల్లో ఆత్మ ఫలాలను​—⁠ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము​—⁠ఫలించే వ్యక్తులను మీరు కూటాల్లో కనుగొనగలరు. (గలతీయులు 5:22, 23) మీరు స్నేహితులను సంపాదించుకోవాలనీ ఒంటరితనాన్ని అధిగమించాలనీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లయితే ప్రతీవారం క్రైస్తవకూటాలకు హాజరవ్వండి. అలా చేయడం ద్వారా ఆశీర్వదించబడిన, దేవుని ప్రజలతో నిరంతరం నిలిచే స్నేహాన్ని పెంపొందించుకోవడానికి సరైన స్థలంలో, సరైన సమయంలో మీరు ఉంటారు.

నిరంతరమూ ఉండే స్నేహితులు

నిజమైన స్నేహం యెహోవా ఇచ్చిన అద్భుతమైన వరమైవుంది. అది ఆయన స్వంత వ్యక్తిత్వంలోనే ఒక భాగం. ఆయనకున్న ప్రేమా, ఉదారతలవల్ల మీరు స్నేహాన్ని పెంపొందించుకొనేలా తెలివైన ప్రాణులతో ఈ భూమిని నింపాడు. తోటి క్రైస్తవులతో సాంగత్యం చేయండి. వారిని ప్రోత్సహించండి. పరిచర్యలో వారితో కలిసి పనిచేయండి. వారితో ప్రార్థించండి, వారి కోసం ప్రార్థించండి. అప్పుడు మీరు యెహోవాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తును అనుసరించిన వారౌతారు.

స్నేహం ఒక వరం. ఆ వరాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు, ఇతరులకు అందివ్వవచ్చు. సమీప భవిష్యత్తులో మీ స్నేహాలను విస్తృతపర్చుకొనే అవకాశం మీకు ఉంది. ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమందిని మీరు స్నేహితులుగా చేసుకోగలరు, అంతేకాదు ప్రస్తుతం మరణమందు నిద్రిస్తూ ఆ “మరణం ఇక ఉండ[ని]” సమయంలో పునరుత్థానం కోసం వేచివున్న, గతించిన తరాల వారనేకమందిని కూడా మీ స్నేహితులుగా చేసుకోగలరు. (ప్రకటన 21:4; యోహాను 5:​28, 29) ఇప్పుడు స్నేహాలను పెంచుకొనేందుకు కృషి చేయండి, అదీ యెహోవాను ప్రేమించేవారినే స్నేహితులుగా చేసుకోండి. దేవుని ప్రేరేపిత వాక్యాన్ని వినడం ద్వారా యెహోవా, యేసుక్రీస్తుల సహాయం కోసం ఎదురుచూడండి. అప్పుడు మీరు ఎప్పటికీ ఒంటరివారు కారు.

[22, 23వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

నిరంతరం నిలిచే స్నేహానికి ఆరు మెట్లు

1. స్నేహితునిగా ఉండండి. స్థిరమైన తన విశ్వాసము మూలంగా, అలాగే దేవునిపై తనకున్న ప్రేమ మూలంగా అబ్రాహాము ‘యెహోవా స్నేహితుడు’ అని పిలువబడ్డాడు. (యాకోబు 2:​23; 2 దినవృత్తాంతములు 20:⁠7) తానే చొరవ తీసుకొని తన భావాలు యెహోవాకు తెలియజేశాడు. (ఆదికాండము 18:​20-33) అవును, మీ స్నేహాన్ని రుజువు చేసుకోవడానికి చొరవ కూడా అవసరం. “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును” అని యేసు చెప్పాడు. (లూకా 6:​38) ప్రోత్సాహంతో కూడిన ఒక మాట, సహృదయంతో కూడిన చేయూత వంటివి ఒక గొప్ప స్నేహానికి మూలం కావచ్చు. “ఒక స్నేహితుడ్ని పొందాలంటే స్నేహితునిగా ఉండడమే ఏకైక మార్గం” అని అమెరికా వ్యాసరచయిత అయిన రాల్ఫ్‌ వాల్డో ఎమర్‌సన్‌ చెప్పాడు.

2. స్నేహాన్ని పెంచుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. చాలామంది ప్రజలు స్నేహం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందాలని కోరుకుంటారు. అయితే దానికి కావలసిన సమయాన్ని మాత్రం వెచ్చించరు. రోమీయులు 12:15, 16 వచనాలు ఇతరుల సంతోష సాఫల్యాల్లోనూ, నిరాశా నిస్పృహల్లోనూ పాలు పొందమని మనలను ప్రోత్సహిస్తుంది. అదిలా చెప్తుంది: “సంతోషించు వారితో సంతోషించుడి; ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి.” యేసుక్రీస్తు చాలా పనిరద్దీ కలిగివున్నప్పటికీ తన స్నేహితుల కొరకు కొంత సమయాన్ని ఎల్లప్పుడూ వెచ్చించాడు. (మార్కు 6:​31-34) స్నేహం పుష్పించే మొక్కలాంటిది, దానికి నీరు పోయాలి, పుష్పించేందుకు పోషకాలు అందించాలి​—⁠అందుకు సమయం పడుతుంది.

3. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అవధానాన్ని నిలపండి. మంచి అవధానంతో వినే అలవాటు గలవారు, స్నేహితులను కలిగివుండడం సులభమని కనుగొంటారు. అందుకే “ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడు”గా ఉండాలని శిష్యుడైన యాకోబు అన్నాడు. (యాకోబు 1:​19) మీరు ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు వారి భావాల పట్ల వ్యక్తిగత శ్రద్ధను కనపర్చండి. వారి గురించి వారు మాట్లాడేలా వారిని ప్రోత్సహించండి. ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకోండి. (రోమీయులు 12:​10) అప్పుడు వారు మీతో ఉండాలని కోరుకుంటారు. దానికి భిన్నంగా సంభాషణ అంతా మీరే చేస్తున్నా లేక అదే పనిగా దృష్టిని మీపైనే కేంద్రీకరింపజేసుకుంటున్నా మీరు చెప్పేది వినే వారుగానీ మీ భావాల విషయంలో, అవసరాల విషయంలో శ్రద్ధ చూపించేవారు గానీ మీకు దొరకరు.

4. క్షమించువారిగా ఉండండి. “డెబ్బది ఏళ్ల మారులమట్టు”కు క్షమించేందుకు సిద్ధంగా ఉండాలని యేసు పేతురుతో ఒకసారి చెప్పాడు. (మత్తయి 18:​21, 22) నిజమైన స్నేహితుడు చిన్న చిన్న లోపాలను చూసీచూడనట్టుగా ఉంటాడు. ఉదాహరణకు, కొంతమంది చిన్న చిన్న విత్తనాలు ఉండడం మూలంగా రాస్ప్‌బెర్రీ పండ్లను తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే, ఈ పండును ఇష్టపూర్వకంగా ఆస్వాదించేవారు ఆ గింజలను గమనించనే గమనించరు. నిజ స్నేహితులు వారి మంచి లక్షణాలను బట్టి ప్రేమించబడతారు; వారిలోని చిన్న చిన్న లోపాలు కనపడవు. “ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి” అని పౌలు మనకు బోధించాడు. (కొలొస్సయులు 3:​13) క్షమించడం నేర్చుకొనేవాళ్ళు తమ స్నేహితులను కాపాడుకోగలరు.

5. ఇతరుల ఏకాంతాన్ని గౌరవించండి. ప్రతి ఒక్కరూ ఏకాంతాన్ని కోరుకుంటారు, మీ స్నేహితులు కూడాను. సామెతలు 25:⁠17 లో జ్ఞానయుక్తంగానే ఇలా చెబుతుంది: “మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము అతడు నీవలన విసికి నిన్ను ద్వేషించునేమో.” అందుకే స్నేహితులను దర్శించేటప్పుడు మీరు ఎంత తరచుగా దర్శిస్తున్నారు ఎంతసేపు వారితో గడుపుతున్నారు అనే వాటి విషయాల్లో సహేతుకంగా ఉండండి. మీ స్నేహితుడు మీకే సొంతం అన్న భావాన్ని విడిచిపెట్టండి, అది అసూయకు కారణం కాగలదు. కొన్ని విషయాలపై మీ వ్యక్తిగత అభిరుచులను, అభిప్రాయాలను వ్యక్తపరచేటప్పుడు మంచి వివేచనను ఉపయోగించండి. ఇది ఎంతో సేదదీర్పునిచ్చేదిగానూ హృదయరంజకమైనదిగానూ ఉండే స్నేహానికి దోహదపడుతుంది.

6. ఉదారంగా ఉండండి. స్నేహాలు ఔదార్యం ద్వారా వృద్ధి చెందుతాయి. “ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని” అపొస్తలుడైన పౌలు సలహానిస్తున్నాడు. (1 తిమోతి 6:​18, 19) ఉదాహరణకు, ప్రోత్సాహకరమైన మాటలను ఇతరులతో పంచుకోండి. (సామెతలు 11:​25) ఔదార్యంతో మెచ్చుకోండి, సాధ్యమైనప్పుడు క్షేమాభివృద్ధికరంగా మాట్లాడండి. ఇతరుల సంక్షేమం పట్ల మీరు యథార్థమైన శ్రద్ధను కనపర్చినట్లయితే, వారు మీకు సన్నిహితులౌతారు. వారు మీకేమి చేయగలరు అని ఆలోచించేందుకు బదులుగా వారికి మీరేమి చేయగలరు అన్నదాని గురించి ఆలోచించండి.