కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రిస్మస్‌ ఆచారాలు అవి క్రైస్తవులవేనా?

క్రిస్మస్‌ ఆచారాలు అవి క్రైస్తవులవేనా?

క్రిస్మస్‌ ఆచారాలు అవి క్రైస్తవులవేనా?

ఇదిగో క్రిస్మస్‌ కాలం వచ్చేసింది. మీకు, మీ కుటుంబానికి, మీ సహవాసులకు దాని భావమేమిటి? అది ఒక ఆధ్యాత్మిక సందర్భమా లేక కేవలం ఉల్లాసంగా వేడుక జరుపుకొనే కాలమా? అది యేసుక్రీస్తు జననాన్ని గురించి తలపోసుకునే సమయమా లేక క్రైస్తవ పద్ధతులను గురించి పట్టించుకోనవసరంలేని సమయమా?”

ఈ ప్రశ్నలను పరిశీలించేటప్పుడు, క్రిస్మస్‌ ఆచారాలు మీరు నివసిస్తున్న ప్రాంతం నుండి భిన్నంగా ఉండవచ్చని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, మెక్సికో మరియు ఇతర లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో, దాని పేరు కూడా భిన్నంగా ఉంటుంది. క్రిస్మస్‌ అనే ఈ ఇంగ్లీష్‌ పదం “క్రీస్తు జన్మ దినోత్సవం అని అర్థం వచ్చే మధ్య యుగాల్లోని ఇంగ్లీష్‌ క్రిస్‌తెస్‌మస్‌ అనే పదం నుండి వచ్చింది” అని ఒక ఎన్‌సైక్లోపీడియా సూచిస్తోంది. అయినప్పటికీ, లాటిన్‌ అమెరికన్‌ ప్రాంతాల్లో ఇది లా నవిదాద్‌ అని పిలువబడుతూ క్రీస్తు జననాన్ని సూచిస్తుంది. మెక్సికోలో జరిగే ఈ పండగను గురించిన కొన్ని వివరాలను పరిశీలించడానికి కాస్త సమయాన్ని తీసుకోండి. ఈ పండగ కాలం గురించిన మీ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి బహుశా మీకిది సహాయపడవచ్చు.

పోసదాస్‌, “ముగ్గురు జ్ఞానులు,” మరియు నాసిమ్యెంతో

ఈ వేడుకలు డిసెంబరు 16న పోసదాస్‌తో మొదలౌతాయి. మెక్సికన్ల జీవితపు పండగలు అనే పుస్తకం ఇలా వ్యాఖ్యానిస్తోంది: “ఇది పోసదాస్‌ అంటే క్రిస్మస్‌కు ముందు ప్రజలను మంత్రముగ్ధులను చేసే తొమ్మిది రోజుల సమయం, [అది] బేత్లెహేము పట్టణంలో యోసేపు, మరియలు దయాపూర్వక సహాయాన్ని వెదకడాన్ని, నిలువనీడ కోసం ఒంటరిగా సంచరించడాన్ని, చివరికి దాన్ని కనుగొనే తరుణాన్ని వేడుక చేసుకునే సమయం. క్రీస్తు జననానికి ముందు రోజుల్లో జరిగిన సంఘటలను అభినయించడానికి కుటుంబ సభ్యులూ, స్నేహితులూ ప్రతి రాత్రి సమకూడతారు.”

సాంప్రదాయంగా, ప్రజల గుంపొకటి మరియ యోసేపుల విగ్రహాలను ఒక ఇంటికి తీసుకువెళ్ళి ఆశ్రయాన్నిమ్మని అంటే పొసాదానివ్వమని పాడుతూ అడుగుతుంటారు. బదులుగా ఆ ఇంట్లోని వారు జవాబుగా పాడుతూ చివరికి, వచ్చిన వారిని ప్రవేశించడానికి అనుమతిస్తారు. అప్పుడిక వేడుక ప్రారంభమవుతుంది, ఆ వేడుకలో కళ్ళకు గంతలు కట్టుకుని ఒక కర్రను చేతపట్టుకున్న కొంతమంది వ్యక్తులు, పినాతాను అంటే పైకప్పు నుంచి వ్రేలాడే ఒక అలంకరింపబడిన పెద్ద మట్టి కుండను పగులకొట్టడానికి వంతులవారీగా ప్రయత్నిస్తారు. ఆ పాత్ర పగిలిపోయిన తర్వాత దానిలో ఉన్న వాటిని (మిఠాయిలు, పళ్ళు లాంటివి) వేడుక జరుపుకునేవారు ఏరుకుంటారు. దాని తర్వాత ఆహారం, పానీయాలు, సంగీతం, నృత్యాలు ఉంటాయి. డిసెంబరు 16 నుంచి 23 వరకు ఎనిమిది పొసాదా విందులు జరుగుతాయి. 24న, నోకెబ్వేనా (క్రిస్మస్‌కు ముందు రాత్రి) వేడుక చేసుకుంటారు, అప్పుడు ఒక ప్రత్యేక విందు భోజనాన్ని ఆరగించడానికి ఆయా కుటుంబాల వారంతా సమకూడడానికి ప్రయత్నిస్తారు.

వారం తిరగకుండానే నూతన సంవత్సర దినం వస్తుంది, దాన్ని చాలా సందడిగా విలాసోత్సవాలతో చేసుకుంటారు. జనవరి 5 సాయంత్రాన, ట్రెస్‌ రేయెస్‌ మగోస్‌ (“ముగ్గురు జ్ఞానులు”) పిల్లలకు బొమ్మలను తీసుకు వస్తారని ఎదురు చూడడం జరుగుతుంది. జనవరి 6న రొస్కా డి రేయెస్‌ (ఉంగరం ఆకారంలోనున్న కేకు) వడ్డించడంతో వేడుక పరాకాష్టకు చేరుకుంటుంది. ఆ కేకును తింటుండగా వారిలో ఒకరికి తమ కేకు ముక్కలో బాలయేసును సూచించే ఒక చిన్న బొమ్మ దొరుకుతుంది. ఎవరి కేకులో ఆ బొమ్మ దొరుకుతుందో ఆ వ్యక్తి, ఫిబ్రవరి 2న చివరి వేడుక జరిపేందుకు ఏర్పాట్లు చేయడానికి ఆతిథ్యమివ్వడానికి బద్ధుడౌతాడు. (కొన్ని స్థలాల్లో “ముగ్గురు జ్ఞానుల” సూచనగా మూడు చిన్న బొమ్మలుంటాయి.”) ఈ విధంగా, క్రిస్మస్‌కు సంబంధించిన వేడుకలు అలా కొనసాగుతూనే ఉంటాయి.

ఈ సందర్భాల్లో, నాసిమ్యెంతో (క్రీస్తు జన్మించినప్పటి దృశ్యం) చాలా ప్రాముఖ్యమైనది. దీంట్లో ఏమి ఇమిడి ఉంది? బహిరంగ స్థలాల్లో, చర్చీల్లో, ఇండ్లలో కనిపించే ఈ దృశ్యాల్లో సిరమిక్‌తో, కఱ్ఱతో, లేదా మట్టితో చేసిన బొమ్మలు (పెద్దవి లేక చిన్నవి) పెడతారు. అవి కొత్తగా జన్మించిన ఒక శిశువు ఉన్న పశువుల తొట్టి ముందు మోకరిల్లిన యోసేపు, మరియలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. వారితో పాటు తరచుగా గొర్రెల కాపర్లు, లొస్‌ రేయెస్‌ మగోస్‌ (“జ్ఞానులు”) కూడా ఉంటారు. ఈ దృశ్యంలో వీరు తప్పనిసరి, కొన్ని జంతువులను చేర్చడం ఆ దృశ్యానికి పరిపూర్ణతను తీసుకు రావచ్చు. అయితే, ఆ దృశ్యంలో కీలకమైన స్థానం నవజాత శిశువుదే. దాన్ని స్పానిష్‌లో ఎల్‌ నిన్యో దెద్యోస్‌ (పిల్ల దేవుడు) అని పిలుస్తారు. కీలకమైన ఆ బొమ్మను ఆ దృశ్యాన్ని ఏర్పాటు చేసిన స్థలంలో బహుశా క్రిస్మస్‌ ముందు రోజు పెడతారు.

క్రీస్తు జన్మదిన ఆచారాలపై సునిశిత పరిశీలన

ప్రపంచ వ్యాప్తంగా సాధారణంగా తెలిసిన క్రిస్మస్‌ వేడుకల గురించి ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా ఇలా చెబుతోంది: “క్రిస్మస్‌తో ముడిపడి ఉన్న ఆచారాల్లో చాలా మటుకు, మొదటి నుంచి ఉన్నవేమీ కావు. అవి క్రైస్తవులకు ముందున్న, క్రైస్తవులు కాని మతాల ఆచారాలను క్రైస్తవ చర్చీలు తీసుకు వచ్చినవే. రోమన్లు డిసెంబరు మధ్యలో వేడుక చేసుకునే ఒక పండుగైన శాటర్నేలియా, క్రిస్మస్‌కు సంబంధించిన ఉల్లాసకరమైన అనేక ఆచారాలకు నమూనాగా మారింది. ఉదాహరణకు, ఈ వేడుక నుంచే గొప్ప గొప్ప విందులు చేసుకోవడాలు, బహుమతులు ఇచ్చుకోవడాలు, క్రొవ్వొత్తులను వెలిగించడాలు ఉద్భవించాయి.”

లాటిన్‌ అమెరికాలో, బహుశా క్రీస్తు జన్మదిన మూలాచారాలకే అదనంగా కొన్నింటిని చేర్చి పాటిస్తున్నారు. ‘ఏ మూలాధారం నుంచి’ అని మీరు అడగవచ్చు. వాస్తవానికి, బైబిలును సన్నిహితంగా అనుసరించే అనేకమంది, ఈ ఆచారాలలో కొన్ని పూర్తిగా అజ్టెక్‌ మత సంబంధమైనవేనని గుర్తిస్తారు. మెక్సికోలోని ఎల్‌ యూనివర్సల్‌ అనే ఒక దిన పత్రిక ఇలా వ్యాఖ్యానించింది: “ఆదివాసి [అజ్టెక్‌] మతాచరణ [తారీఖులను తెలియజేసే] పుస్తకంలోని వేడుకలు, క్యాథలిక్కుల మతాచరణ [తారీఖులను తెలియజేసే] పుస్తకంలోని వేడుకలతో ఏకీభవిస్తున్నాయన్న వాస్తవాన్ని భిన్న మత వర్గాలకు చెందిన [క్యాథలిక్‌] సన్యాసులు తమకు ప్రయోజనకరంగా చేసుకొని, దాన్ని తమ సువార్త పనికీ, మిషనరీ పనికీ మద్దతుగా ఉపయోగించుకున్నారు. వారు హిస్పానిక్‌ పూర్వకాలంనాటి దేవతల స్మారకోత్సవాల స్థానంలో క్రైస్తవ దైవత్వ వేడుకలను ఉంచారు; యూరోపియన్ల వేడుకలనూ, కార్యకలాపాలనూ పరిచయం చేశారు, అంతేకాక అజ్టెక్‌ జాతి వారి వేడుకలను కూడా కలిపారు. ఆ విధంగా అవి సాంస్కృతిక మిశ్రమ ఆచారాలకు దారితీశాయి, దాని నుంచి ప్రామాణిక మెక్సికన్‌ పద్ధతులు వచ్చాయి.”

ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా ఇలా వివరిస్తోంది: “క్రీస్తు జన్మదిన నాటకాలు మొదట్లో క్రిస్మస్‌ వేడుకల్లో ఒక భాగం అయ్యాయి . . . చర్చీలో పశువుల తొట్టె ఏర్పాటును సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ప్రారంభించాడని వినికిడి.” క్రీస్తు జననాన్ని సూచించే ఈ నాటకాలు, మెక్సికన్లు వలస వచ్చినప్పటినుంచే చర్చీల్లో ప్రదర్శించబడేవి. ఫ్రాన్సిస్కన్‌ సన్యాసులు, అమెరికన్‌ ఇండియన్లకు క్రీస్తు జన్మదిన ఆచారాల గురించి నేర్పించడానికి వాటిని ఏర్పాటు చేసేవారు. అటు తరువాత పోసదాస్‌ మరింత ప్రఖ్యాతి గాంచింది. వీటి వెనకాల ప్రాథమికంగా ఎటువంటి ఉద్దేశమున్నా గానీ, నేడు పొసదాస్‌లు ప్రదర్శించబడే విధానం వాటి నిజ స్వరూపాన్ని బయల్పరుస్తోంది. ఇవి ప్రదర్శించబడే సమయంలో గనుక మీరు మెక్సికోలో ఉంటే, ఎల్‌ యూనివర్సల్‌ రచయిత తన వ్యాఖ్యానంలో ఉన్నతపర్చిన విషయాన్ని మీరు చూడగలరు లేదా గమనించగలరు: “యేసు తల్లిదండ్రులు పిల్ల దేవుడు జన్మించబోయే స్థలాన్ని వెతికే యాత్రను గుర్తుచేయడానికి ఒక మార్గంగా ఉండే పోసదాస్‌ దినాలు, నేడు తప్పతాగి, పీకలదాకా మెక్కి, విచ్చలవిడిగా ప్రవర్తించే, నిరర్ధకంగాసాగే, మరిన్ని నేరాలకు పాల్పడే రోజులుగా మాత్రమే ఉన్నాయి.”

నాసిమ్యెంతోను గురించిన తలంపు, మెక్సికన్లు వలస వచ్చినప్పటి కాలంలో చర్చీల్లో జరిపే తొలి నాటకాల నుంచి పుట్టుకొచ్చింది. కొందరికిది ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, బైబిలు చెబుతున్నదానితో దీనికి ఏమైనా పొత్తుందా? ఇది ఒక విలువైన ప్రశ్న. ముగ్గురు జ్ఞానులు అని పిలువబడేవారు​—⁠వాస్తవానికి జ్యోతిష్కులు​—⁠యేసును, ఆయన కుటుంబాన్ని సందర్శించేటప్పటికి వారు పశువులశాలలో లేరు. కాలం గడిచింది, వారు ఒక ఇంట్లో నివసిస్తున్నారు. మత్తయి 2:​1,10,11 వచనాల్లోని ప్రేరేపిత నివేదికలో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మీరు కనుగొంటారు. జ్యోతిష్కులు ఎంతమంది అన్న విషయాన్ని బైబిలు చెప్పడం లేదని కూడా మీరు గమనించగలరు. *

లాటిన్‌ అమెరికాలో, ఆ ముగ్గురు జ్ఞానుల స్థానంలో క్రిస్మస్‌ తాత రూపొందాడు. ఇప్పటికీ, ఇతర దేశాల్లో జరపబడుతున్నట్టుగానే, అనేకమంది తల్లిదండ్రులు ఇళ్ళలో బొమ్మలను దాచిపెడతారు. ఆ తరువాత జనవరి 6వ తేదీ ఉదయాన, ముగ్గురు జ్ఞానులు తమ కోసం బొమ్మలు తెచ్చినట్టుగా పిల్లలు తలంచి వాటికోసం వెతుకుతారు. బొమ్మలు అమ్ముకునే వారికది మంచి లాభదాయకమైన సమయం. యథార్థ హృదయులైన అనేకమంది ప్రజలు ఊహా కల్పితమైనదని గుర్తించిన దానిపై కొందరు సొమ్ము చేసుకున్నారు. ముగ్గురు జ్ఞానులను గురించిన కల్పిత కథ చెప్పుకోదగినంత మంది విశ్వసనీయతను కోల్పోతోంది. చివరికి పిల్లల్లో కూడా. ఈ కల్పిత గాథ విశ్వాసులను పోగొట్టుకుంటోందని కొందరు బాధపడుతున్నప్పటికీ, కేవలం సాంప్రదాయం కోసం, వ్యాపార ప్రయోజనం కోసం మాత్రమే కొనసాగే ఈ ఊహా కల్పిత ఆచారం నుంచి అంతకన్నా ఎక్కువ ఎవరు మాత్రం ఎదురు చూడగలరు?

క్రిస్మస్‌ను లేక క్రీస్తు జన్మదినాన్ని తొలి క్రైస్తవులు ఆచరించలేదు. దీని గురించి ఒక ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతుంది: “ప్రముఖ వ్యక్తుల పుట్టినరోజుకు బదులుగా మరణదినాన్ని ఆచరించడమనేది సాధారణంగా క్రైస్తవ వ్యవహారంగా ఉండేది కాబట్టి, మొదటి శతాబ్దాల్లోని క్రైస్తవ చర్చీ ఆ వేడుకను జరుపుకోలేదు.” దేవుని సత్యారాధికులతో గాక అన్యమతాలతోనే జన్మదిన వేడుకలు సంబంధాన్ని కల్గివున్నాయని బైబిలు చెబుతోంది.​—⁠మత్తయి 14:​6-10.

అలాగని, దేవుని కుమారుని జననంలో చేరివున్న యథార్థ సంఘటనలను గురించి తెలుసుకోవడం, వాటిని గుర్తుచేసుకోవడం నిష్ప్రయోజనమని దానర్థం కాదు. వాస్తవిక బైబిలు వృత్తాంతం, దేవుని చిత్తాన్ని చేయాలనుకునే వారందరికీ ముఖ్యమైన అంతర్దృష్టినీ, పాఠాలనూ అందిస్తోంది.

బైబిలు ప్రకారం యేసు జననం

యేసు జననం గురించిన నమ్మదగిన సమాచారం, మత్తయి లూకా సువార్తల్లో మీకు దొరుకుతుంది. గలిలయ పట్టణమైన నజరేతులో నివసించే మరియ అనే పేరుగల అవివాహిత కన్యను గబ్రియేలు దూత సందర్శించాడని ఆ సువార్తలు చూపిస్తాయి. ఆయన ఏ సందేశాన్ని వెల్లడించాడు? “ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండు[ను.]”​—⁠లూకా 1:​31-33.

ఈ సందేశం మరియను ఎంతగానో ఆశ్చర్యపర్చింది. పెళ్ళి కాని యువతి కనుక ఆమె ఇలా అంది: “నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగు[ను]?” అందుకు దేవదూత ఇలా జవాబిచ్చాడు: “పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.” దేవుని చిత్తమదేనని గ్రహించినదై మరియ ఇలా అంది: “ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక.”​—⁠లూకా 1:​34-38.

మరియ గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమెను విడిచిపెట్టాలని యోచిస్తున్న యోసేపుతో ఒక దేవదూత, ఆ అద్భుత జననం గురించి చెప్పాడు. అది ఆయన మరియను విడిచిపెట్టకుండా ఉండేలా చేసింది. అప్పుడు యోసేపు దేవుని కుమారుని బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టపడ్డాడు.​—⁠మత్తయి 1:​18-25.

తరువాత, కైసరు ఔగుస్తు ఇచ్చిన ప్రజాసంఖ్య వ్రాయవలెననే ఒక ఆజ్ఞ వలన, తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి యోసేపు మరియలు గలిలయలోని నజరేతునుంచి తమ పూర్వీకుల ఊరైన యూదయలోని బేత్లెహేముకు వారు ప్రయాణించవలసి వచ్చింది. “వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.”​—⁠లూకా 2:​1-7.

తరువాత ఏమి జరిగిందో లూకా 2:​8-14 లో ఇలా వర్ణించబడింది: “ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. అయతే ఆ దూత—భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొకతొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి​—⁠సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.”

జ్యోతిష్కులు

జ్ఞానులని పిలువబడిన జ్యోతిష్కులు తూర్పు దేశంనుంచి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజు పుట్టిన స్థలాన్ని వెతుకుతున్నారని మత్తయి సువార్తలో పేర్కొనబడింది. రాజైన హేరోదు ఆ విషయమందు చాలా ఆసక్తి కలిగివున్నాడు​—⁠అయితే సదుద్దేశంతో మాత్రం కాదు. “మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.” జ్యోతిష్కులు ఆ బాలుని కనుగొని “తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.” కాని వారు తిరిగి హేరోదు దగ్గరకు పోలేదు. “హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబ[డ్డారు].” హేరోదు ఉద్దేశాలను గురించి యేసేపును హెచ్చరించడానికి దేవుడు ఒక దేవదూతను ఉపయోగించాడు. తరువాత యోసేపు మరియలు తమ కుమారుడ్ని తీసుకుని ఐగుప్తుకు పారిపోయారు. దాని తరువాత, కొత్త రాజును నాశనంచేసే ప్రయత్నంలో క్రూర రాజైన హేరోదు, బేత్లెహేము దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని మగపిల్లలను చంపమని ఆజ్ఞాపించాడు. ఏ ప్రాయంలోని మగపిల్లల్ని? రెండు సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల్నందరినీ.​—⁠మత్తయి 2:​1-16.

ఈ వృత్తాంతం నుంచి మనమేం నేర్చుకొనగలం?

సందర్శించిన వ్యక్తులు ఎంతమందైనాగానీ వాళ్లు జ్యోతిష్కులు. వాళ్లు సత్య దేవుని ఆరాధకులు కాదు. లా న్యూవా బిబ్లియ లాటినొఅమెరికా (1989వ సంచిక) అనే బైబిలు వర్షన్‌లోని పాదసూచిక ఇలా వ్యక్తపరుస్తోంది: “ఆ మగీలు, రాజులు కాదుగానీ జ్యోతిష్యం చెప్పేవారు, అన్య మతగురువులు.” తాము పూజించే నక్షత్రాలను గురించిన పరిజ్ఞానాన్నిబట్టి వాళ్లు వచ్చారు. దేవుడు వారిని పసి పిల్లవాడి దగ్గరకు నడిపించాలనుకుంటే, వాళ్లు మొదట యెరూషలేముకూ, తరువాత హేరోదు రాజ భవనానికీ వెళ్ళే అవసరం లేకుండానే నేరుగా సరైన స్థలానికి నడిపించబడి ఉండేవారు. అయితే అటు తర్వాత, పిల్లవాడ్ని రక్షించేందుకు వారిని వేరొక మార్గాన్ని పంపించడంలో దేవుడు జోక్యంచేసుకున్నాడు.

మరియకు, గొర్రెల కాపరులకు ప్రకటించబడిన, ఈ శిశువు గొప్ప రాజు అవుతాడనే అత్యంత ముఖ్యమైన విషయం, క్రిస్మస్‌ సమయంలో తరుచుగా మరుగైపోయేలా, కల్పితమైన, భావనాత్మకమైన వాతావరణంతో ఆవరించుకుపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత మాత్రం శిశువు కాదు, చిన్న పిల్లవాడు అంతకంటే కాదు. ఆయనిప్పుడు దేవుని రాజ్యాన్ని ఏలుతున్న రాజు. ఆ రాజ్యం త్వరలోనే దేవుని చిత్తాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వాలన్నింటిని నిర్మూలిస్తుంది. ఆయన మానవజాతి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాడు. ప్రభువు ప్రార్థనలో మనం అడిగే రాజ్యమదే!​—⁠దానియేలు 2:​44; మత్తయి 6:​9, 10.

దేవదూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేయబడినదాన్ని బట్టి, సువార్త సందేశాన్ని వినడానికి మొగ్గు చూపే వారందరికీ రక్షణ పొందే మార్గం తెరవబడిందని మనం తెలుసుకున్నాం. దేవుని అనుగ్రహం పొందినవారు “ఆయన కిష్టులైన” వారవుతారు. యేసుక్రీస్తు రాజ్యం ద్వారా ప్రపంచమంతటా శాంతి నెలకొల్పబడుతుందనే అద్భుతమైన నిరీక్షణలు భవిష్యత్తులో ఉన్నాయి, కానీ దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రజలు ఇష్టపడాలి. క్రిస్మస్‌ కాలం అలాంటి వాతావరణాన్ని పెంపొందిస్తుందా, అలాంటి కోరికను ఉత్పన్నం చేస్తుందా? బైబిలును అనుసరించాలనుకునే యథార్థవంతులైన అనేకమంది ప్రజలకు జవాబు తేటతెల్లమే.​—⁠లూకా 2:​10, 11, 14.

[అధస్సూచి]

^ పేరా 13 ఉపేక్షించరాని మరొక వివరణ: మెక్సికన్‌ నాసిమ్యెంతోలో పసిబిడ్డను, దేవుడే పసివాడి రూపంలో భూమిపైకి వచ్చాడనే తలంపుతో “పిల్ల దేవుడు” అని సూచించేవారు. అయితే యేసు భూమ్మీద జన్మించిన దేవుని కుమారుడనీ, సర్వశక్తిమంతుడగు దేవుడైన యెహోవా ఆయనా ఒక్కటి కాదనీ లేక దేవునితో సమానుడు కాడనీ బైబిలు వ్యక్తం చేస్తోంది. దీని గురించి లూకా 1:​35; యోహాను 3:​16; 5:​37; 14:⁠1, 6, 9, 28; 17:⁠1, 3; 20:⁠17 వచనాల్లో వ్యక్తపరచబడిన సత్యాన్ని పరిశీలించండి.

[4వ పేజీలోని బాక్సు]

కొందరు ఆశ్చర్యపడవచ్చు

క్రిస్మస్‌పై చేసిన పరిశోధనలలో అనేక సంవత్సరాలు గడిపిన తరువాత టామ్‌ ఫ్లిన్‌ గ్రంథకర్త క్రిస్మస్‌తో నిరుత్సాహం అనే తన పుస్తకంలో ఈ నిర్ధారణకు వచ్చాడు:

“మనం ఇప్పుడు క్రిస్మస్‌తో ముడిపెడుతున్న అనేక ఆచారాలు, క్రైస్తవ పూర్వ కాలంనాటి అన్యమత ఆచారాల నుంచి పుట్టినవే. వాటిలో కొన్ని ఆచారాలకు సామాజికపరమైన, లైంగికపరమైన లేదా ప్రకృతితత్వపరమైన అర్థాలు ఉన్నాయి. అవి, విద్యావంతులూ, సాంస్కృతిక స్పృహ కలిగిన వారూ అయిన ఆధునికులు ఆ ఆచారాల మూలాన్ని సుస్పష్టంగా అర్థంచేసుకున్న వెంటనే వాటిని విడిచిపెట్టేలా [వారిని] నడిపించవచ్చు.”

సమర్థించే విస్తృతమైన సమాచారాన్ని అందించిన తరువాత, ఫ్లిన్‌ ముఖ్యమైన విషయం వైపుకు మళ్ళాడు: “క్రిస్మస్‌లోని ఆచారాల్లో లేశమైనా క్రైస్తవులకు సంబంధించినది ఏదైనా ఉందా అనేది ఒక గొప్ప హాస్యాస్పద విషయం. ఒకసారి మనం క్రైస్తవులకు ముందున్న ఆచారాలను వదిలేస్తే మిగిలినవి క్రైస్తవులకు నమ్మదగినవి, మూలమైనవి కాకుండా వాటిలో అత్యధికం క్రైస్తవేతర మతాలకు చెందినవే.”​—⁠155వ పేజీ.

[7వ పేజీలోని చిత్రం]

యేసు పుట్టుకను గురించిన ప్రకటన, దేవుడు నియమించిన రాజుగా ఆయన భవిష్య పాత్రకు ఆధారాన్నిస్తోంది.