కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

భర్తపట్ల విశ్వాసంగా ఉన్న ఒక క్రైస్తవ స్త్రీ, తన భర్త విడాకుల కోసం దాఖలు చేసుకున్నప్పుడు దాన్ని ఎంతమేరకు నిరోధించాలి?

మానవ వివాహ ఏర్పాటు ప్రారంభమైనప్పుడు, భార్యాభర్తలిరువురూ ఒకరినొకరు ‘హత్తుకొని’ ఉండాలని దేవుడు చెప్పాడు. (ఆదికాండము 2:​18-24) మానవులు అపరిపూర్ణులుగా మారారు, దాంతో చాలా వివాహాలు సమస్యలతో నిండిపోయాయి, అయినప్పటికీ వివాహ జత ఒకరినొకరు హత్తుకునే ఉండాలన్నది దేవుని కోరిక. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధానపడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.”​—⁠1 కొరింథీయులు 7:10, 11.

అపరిపూర్ణ మానవులు కొన్నిసార్లు తమ వివాహ భాగస్వాములను విడిచిపెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారని ఆ మాటలు ఒప్పుకుంటున్నాయి. ఉదాహరణకు, ఒక వివాహ భాగస్వామి విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటే ఇద్దరూ “పెండ్లిచేసికొనకుండవలెను” అని పౌలు చెప్తున్నాడు. ఎందుకు? ఒక భాగస్వామి వెళ్ళిపోవడం జరిగినప్పటికీ, దేవుని దృష్టిలో వారిద్దరూ ఒకరితో ఒకరు కలిసేవున్నారు. పౌలు ఇలా ఎందుకు చెప్పగలిగాడంటే, క్రైస్తవ వివాహానికి ప్రమాణాన్ని యేసు నియమించాడు: “వ్యభిచారము [గ్రీకు, పోర్నియా] నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నా[డు].” (మత్తయి 19:⁠9) అవును, ఒక వివాహానికి అంతాన్ని తీసుకువచ్చే విడాకులకు ఉన్న ఒకే ఒక ఆధారం “వ్యభిచారము,” అంటే లైంగిక అవినీతి. పౌలు చెబుతున్న దృష్టాంతంలో అటు భార్య గానీ ఇటు భర్త గానీ లైంగిక దుర్నీతికి పాల్పడలేదు, కాబట్టి భర్త గానీ భార్య గానీ ఎడబాసినప్పుడు దేవుని దృష్టిలో ఆ వివాహం అంతం కాలేదు.

ఆ తర్వాత పౌలు, ఒక నిజ క్రైస్తవుడికి/రాలికి అవిశ్వాసి అయిన వివాహ భాగస్వామి ఉన్నప్పటి పరిస్థితిని గూర్చి మాట్లాడాడు. పౌలు నిర్దేశాల్ని పరిశీలించండి: “అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు.” (1 కొరింథీయులు 7:​12-16) తన భర్తపట్ల విశ్వాసంగా ఉన్న భార్యను, అవిశ్వాసి అయిన భర్త విడిచిపెట్టినట్లయితే, ఆమె నుండి చట్టబద్ధమైన విడాకులు కూడా కోరుతుంటే అప్పుడు ఆమె ఏం చేయవచ్చు?

ఆయన తనతోనే ఉండాలని ఆమె ఎంపిక చేసుకోవచ్చు. ఆమె ఆయనను ఇంకా ప్రేమిస్తుండవచ్చు, పరస్పరం ఒకరిపట్ల ఒకరికున్న భావోద్వేగ అలాగే లైంగిక అవసరాల్ని గ్రహిస్తుండవచ్చు, తనకూ అలాగే బహుశ తనకున్న మైనర్‌ పిల్లలకు వస్తుసంబంధమైన పోషణ అవసరమని ఆమెకు తెలిసివుండవచ్చు. కొంతకాలానికి తన భర్త కూడా విశ్వాసియై రక్షించబడవచ్చని కూడా ఆమె నిరీక్షిస్తుండవచ్చు. అయినప్పటికీ ఆ భర్త, తమ వివాహబంధాన్ని (లేఖనాధారంకాని కారణాల మూలంగా) త్రెంచుకొనే ప్రయత్నాలను చేస్తుంటే, పౌలు వ్రాసినట్లుగా ఆమె తన భర్తను “ఎడబాయవచ్చును.” అలాగే అవిశ్వాసి అయిన భార్య ఉన్న విశ్వాసి అయిన భర్త, వివాహ విషయంలో దేవుని దృక్పథాన్ని నిర్లక్ష్యం చేస్తూ విడిచివెళ్ళేందుకు పట్టుపడుతున్నట్లయితే అదే సూత్రం వర్తిస్తుంది.

అయితే అలాంటి పరిస్థితిలో, ఆమె తననూ తన పిల్లలనూ చట్టబద్ధంగా కాపాడుకోవలసిన అవసరం ఉండవచ్చు. ఎందుకని? తన ప్రియమైన పిల్లల సంరక్షణా బాధ్యతను తాను చేపట్టాలని ఆమె కోరుకుంటుండవచ్చు. అలా తాను వారికి నిరాటంకంగా మాతృప్రేమను అందించగలదు. వారికి నైతిక శిక్షణను ఇవ్వగలదు. వారిలో చక్కని బైబిలు బోధల ఆధారంగా విశ్వాసాన్ని పెంపొందింపజేయగలదు. (2 తిమోతి 3:​14, 15) విడాకులు ఆమె హక్కులకు అపాయాన్ని కలిగించవచ్చు. అందుకని, తన పిల్లల్ని కలుసుకునే హక్కును కాపాడుకోవడానికీ, ఆయన విడనాడుతున్న తన కుటుంబానికి పోషణను అందించే బాధ్యత తన భర్తకు ఉన్నదన్న హామీని పొందడానికీ అధికారుల ఎదుట తనకు సరైన ప్రాతినిధ్యం లభించేలా ఆమె కొన్ని చర్యలను తీసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో, భర్త కోరుతున్న విడాకులకు సమ్మతించాల్సిన అవసరం లేకుండానే, పిల్లల సంరక్షణా బాధ్యతలకు సంబంధించిన ఏర్పాట్లూ, ఆర్థిక మద్దతుల కొరకైన ఏర్పాట్లూ చేరివున్న చట్టపరమైన డాక్యుమెంట్లపై విడాకుల కేసులో పోరాడుతున్న స్త్రీ సంతకాలు చేయవచ్చు. మరితర ప్రాంతాల్లో, పత్రాల్లోని మాటలు ఆమె విడాకులకు అంగీకరిస్తున్నట్లు సూచిస్తాయి; అందుకని, భర్త వ్యభిచారం విషయంలో దోషి అయినట్లైతే భార్య వాటిపై సంతకాలు చేయడంలో భావం ఆమె ఆయన్ను తిరస్కరిస్తున్నదన్నట్లే.

విడాకులు లేఖనాధార కారణాల మూలంగా తీసుకోవడం జరిగిందా లేదా వంటి అనేక వివరాలు బయట సమాజంలోనూ లోపల సంఘంలోనూ అనేకమందికి తెలియవు. కాబట్టి విషయాలు అంత దూరం వెళ్ళడానికి ముందే, భార్య స్థానిక సంఘంలోని పైవిచారణకర్తకూ మరొక పెద్దకూ వాస్తవాలను గురించి తెలియజేయడం మంచిది (వ్రాతపూర్వకంగా అయితే బాగుంటుంది). ఆ విధంగా చేస్తే, అప్పడు గానీ అటు తర్వాత గానీ ఏమైనా ప్రశ్నలు తలెత్తినట్లైతే ఆ వాస్తవాలు అందుబాటులో ఉంటాయి.

మనం మళ్ళీ యేసు వ్యాఖ్యానం దగ్గరకు వద్దాం: “వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నా[డు].” ఒకవేళ భర్త లైంగిక అనైతికతకు పాల్పడి నిజంగానే దోషియై, తన భార్యతో వైవాహిక సంబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటే, అప్పుడు (యేసు ఇచ్చిన ఉదాహరణలోని పాపం చేయని) స్త్రీ, తాను ఆయన్ను క్షమించి వైవాహిక పాన్పును ఆయనతో పంచుకోవాలా లేక ఆయన్ను తిరస్కరించాలా అన్నది నిర్ణయించుకోవాలి. ఆమె ఆయన్ను క్షమించి చట్టబద్ధమైన తన భర్తతో కొనసాగడానికి ఇష్టపడినట్లైతే, అలా చేయడం ఆమె అనైతికతకు పాల్పడుతున్నట్లు కాదు.​—⁠హోషేయ 1:1-3; 3:1-3.

అనైతికతకు పాల్పడిన భర్త విడాకులు కోరుతున్న సందర్భంలో భార్య, ఆయన్ను తిరిగి సంపాదించుకోవచ్చుననే ఆశతో క్షమించడానికి ఇంకా ఇష్టపడుతుండవచ్చు. తన మనస్సాక్షి ఆధారంగా, పరిస్థితుల ఆధారంగా ఆ విడాకుల కేసుకు విరుద్ధంగా పోరాడాలా వద్దా అన్నది నిర్ణయించుకోవల్సిన బాధ్యత ఆమెదే. కొన్ని ప్రాంతాల్లో, విడాకులకు విరుద్ధంగా పోరాడుతున్న స్త్రీ తాను విడాకులకు సమ్మతిస్తున్నట్లు సూచించకుండానే, పిల్లల సంరక్షణా బాధ్యతలకు సంబంధించిన ఏర్పాట్లూ, ఆర్థిక మద్దతుల కోసమైన ఏర్పాట్లూ చేరివున్న డాక్యుమెంట్లపై సంతకాలు చేయగల్గే అవకాశం ఉంది; ఆమె అలాంటి కాగితాలపై సంతకాలు చేయడం తాను ఆయన్ను తిరస్కరిస్తున్నట్లు సూచించదు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో విడాకులకు విరుద్ధంగా పోరాడుతున్న భార్యను, తాను విడాకులకు సమ్మతిస్తున్నట్లు సూచించే పత్రాలపై సంతకాలు చేయమని అడుగుతుండవచ్చు; అటువంటి కాగితాలపై సంతకాలు చేయడం దోషియైన తన భర్తను తాను తిరస్కరిస్తున్నదని స్పష్టంగా చూపిస్తుంది.

అపార్థం చేసుకునే అవకాశాన్ని నివారించడానికి గాను ఇలాంటి సందర్భంలో సహితం భార్య, ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతోందో, వాటి వెనుక ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయో వివరిస్తూ సంఘ పెద్దలకు ఒక ఉత్తరాన్ని వ్రాసి ఇవ్వడం మంచిది. తాను తన భర్తను క్షమించడానికీ ఆయనకు భార్యగా ఉండడానికీ ఇష్టపడుతోందని తాను ఆయనకు చెప్పినట్లు ఆమె ఆ ఉత్తరంలో పేర్కొనవచ్చును. అంటే, ఆమె అభీష్టానికి విరుద్ధంగా విడాకులు తీసుకోవడం జరుగుతోందని దానర్థం; ఆమె తన భర్తను తిరస్కరించడానికి బదులుగా ఇంకా క్షమించడానికి సిద్ధంగా ఉందనీ దానర్థం. తాను క్షమించడానికీ, వివాహితగా ఉండడానికీ సిద్ధంగా ఉందని స్పష్టపర్చిన తర్వాత, ఆమె కేవలం ఆర్థిక బాధ్యతలు మరియు/లేదా సంరక్షణా బాధ్యతలు వంటి అంశాల పరిష్కారం చేరివున్న పత్రాలపై సంతకాలు చేయడం ఆమె తన భర్తను తిరస్కరిస్తోందని సూచించదు. *

విడాకుల తర్వాత కూడా తాను క్షమించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టపర్చిన తర్వాత, ఆమె గానీ ఆమె భర్త గానీ వేరే వ్యక్తుల్ని వివాహం చేసుకునే వీలులేదు. క్షమించాలన్న తన ప్రతిపాదన తిప్పికొట్టబడినప్పుడు దోషికాని ఆమె అటుతర్వాత ఆయన్ను అనైతికత కారణంగా తిరస్కరించినట్లైతే, ఇద్దరూ వేరే వ్యక్తుల్ని వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. అలాంటి నిర్ణయం తీసుకునే హక్కు దోషికాని వివాహ భాగస్వామికి ఉన్నదని యేసు చూపించాడు.​—⁠మత్తయి 5:32; 19:9; లూకా 16:⁠18.

[అధస్సూచి]

^ పేరా 11 చట్టపరమైన ప్రక్రియలు, కాగితాలు ఒక్కో ప్రాంతానికి వేర్వేరుగా ఉంటాయి. సంతకాలు చేయడానికి ముందు చట్టపరమైన కాగితాల్లో పేర్కొనబడిన షరతుల్ని జాగ్రత్తగా పరిశీలించాలి. దోషికాని వివాహ భాగస్వామి, తాను విడాకులకు అభ్యంతరం తెలపడం లేదని సూచించే కాగితాలపై సంతకాలు చేయడం తన వివాహ భాగస్వామిని తిరస్కరించడంతో సమానం అవుతుంది.​—⁠మత్తయి 5:⁠37.