కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శాంతి సువార్త చియాపస్‌ పర్వత ప్రాంతాలకు చేరడం

శాంతి సువార్త చియాపస్‌ పర్వత ప్రాంతాలకు చేరడం

శాంతి సువార్త చియాపస్‌ పర్వత ప్రాంతాలకు చేరడం

“చియాపస్‌ రాష్ట్ర నివాసుల్లోని ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వచ్చే భయానకమైన హత్యాకాండలో సాయుధదారుల ఒక గుంపు చేతిలో 13 మంది పసిపిల్లలతో పాటు మొత్తం 45 మంది నిస్సహాయులైన రైతులు వధించబడ్డారు.” “ఎల్‌ యూనివర్సల్‌” అనే దినపత్రిక, డిసెంబరు 22, 1997నాటి సంచికలో, చియాపస్‌ రాష్ట్రంలోని సమాజంలో ఏం జరిగిందన్న విషయాన్ని ఆ విధంగా నివేదించింది.

చియాపస్‌, మెక్సికోకు ఆగ్నేయ దిశగా గౌటిమాల సరిహద్దును ఆనుకొని ఉన్న రాష్ట్రం. బీదరికం, లేమితనాల సుదీర్ఘచరిత్ర గల స్థానిక నివాసులైన మాయ అనే ఆదిమవాసుల గుంపొకటి, ఎజెర్సిటో జపాతిస్త ది లిబెరేషియోన్‌ (ఈజెడ్‌ఎల్‌ఎన్‌, నేషనల్‌ లిబరేషన్‌ జపాటిస్ట ఆర్మీ) మద్దతుతో, 1994 జనవరిలో సాయుధ తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం అటువంటి ఘర్షణలకు శాంతియుతమైన ఒక పరిష్కారాన్ని సాధించడానికి ప్రయత్నించినా, చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అటు తిరుగుబాటుదార్లు, ఇటు ప్రభుత్వ సైనికులు ఆకస్మిక దాడులు జరిపారు. దాని ఫలితమే తీవ్ర రక్తపాతం, మరణాలు. ఆ అల్లకల్లోలం కారణంగా, అక్కడి రైతులు అనేకమంది ప్రాణభయంతో పారిపోయారు.

అలాంటి అనిశ్చిత పరిస్థితుల మధ్య కూడా రాజకీయ పోరాటాల్లో తటస్థ వైఖరిని అవలంభించిన శాంతి కాముకుల గుంపొకటుంది. స్థానికంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ఒకే ఒక నిరీక్షణ దేవుని రాజ్యమని తెలియజేసి, ఉత్సాహపూరితంగా వాళ్ళు ఆ రాజ్యం వైపుకు ప్రజల అవధానాన్ని మళ్ళిస్తారు. (దానియేలు 2:​44) ఎవరు వాళ్ళు? యెహోవాసాక్షులు. యేసు ఆజ్ఞకు విధేయత చూపుతూ వాళ్ళు చియాపస్‌లోని పర్వతప్రాంతాల మారుమూల భాగాల్లోకి దేవుని రాజ్య సువార్తను తీసుకు వెళ్ళడానికి ప్రయాస పడుతున్నారు. (మత్తయి 24:⁠14) అటువంటి పరిస్థితుల్లో ప్రకటనా పని ఎలా జరిగింది, దాని ఫలితాలేమిటి?

“నేను ఒక యెహోవాసాక్షిని”

అడోల్ఫొ, కొత్తగా రాజ్య ప్రచారకుడైన ఒక యువకుడు. ఈయన ఒకోసింగ్‌లోని రేడియో స్టేషన్‌లో పనిచేస్తుండేవాడు. హఠాత్తుగా ఒకరోజు, గట్టిగా తలుపు బాదుతున్న శబ్దం వినబడింది. దాని వెంటనే సాయుధులైన కొందరు మనుష్యులు లోపలికి దూసుకువచ్చి, తుపాకులను ఆయన తలవైపు గురిపెట్టారు. వాళ్ళు రేడియో ట్రాన్స్‌మిషన్‌ గదిలోకి చొరబడి పరికరాలను స్వాధీనం చేసుకొని, రేడియో ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించారు.

ఆ సాయుధులు అడోల్ఫొ వైపు తిరిగి, తమ ఉద్యమంలో చేరమని ఆజ్ఞాపించారు. అడోల్ఫొ అప్పటికింకా బాప్తిస్మం తీసుకోకపోయినప్పటికీ, ఆయన “నేను ఒక యెహోవాసాక్షిని,” అని బదులిచ్చాడు. శాంతి నెలకొల్పబడడానికున్న ఏకైక నిరీక్షణ దేవుని రాజ్యమేనని వివరించి, వారిచ్చిన యూనిఫామ్‌ను, తుపాకిని తిరస్కరించాడు. ఆయన నిశ్చితాభిప్రాయాన్ని చూసి, వారు ఆయనను వదిలేశారు. ఆ సంఘటనను మననం చేసుకుంటూ అడోల్ఫొ ఇలా అంటున్నాడు: “ఆ సంఘటన నా విశ్వాసాన్ని నిజంగా బలపరిచింది.”

చివరికి పరిస్థితి అదుపులోకి వచ్చినా, ఆ ప్రాంతం ఇంకా సైనికుల అదుపులోనే ఉంది. అలా ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలో ఉన్న ఐసోలేటెడ్‌ క్రైస్తవుల గుంపుతో కలిసి పని చేయమని స్థానిక సంఘపెద్దల దగ్గర నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అడోల్ఫొ సంతోషంగా స్వీకరించాడు. మార్గం మధ్యలో అక్కడక్కడా ఎదురైన తనిఖీ స్థలాల దగ్గర తనను తాను యెహోవాసాక్షిగా తెలియజేసుకున్నాడు, వాళ్ళు ఆయనకు గౌరవం చూపించారు. తరువాత ఆయన బాప్తిస్మం పొందాడు. ఈ ఐసోలేటెడ్‌ గుంపు, యెహోవాసాక్షుల సంఘంగా తయారవ్వడంలో సహాయపడ్డానన్న సంతృప్తి ఆయనకు ఉంది. “నేను ఇప్పుడు బాప్తిస్మం పొందాను”, అని అంటూ అడోల్ఫొ ఇలా ప్రకటించాడు: “నేను ఒక యెహోవాసాక్షిని అని మనోనిశ్చయతతో చెప్పగలను!”

“యెహోవా మమ్మల్ని బలపరిచాడు”

ఈజెడ్‌ఎల్‌ఎన్‌ తిరుగుబాటు సంస్థ, ప్రభుత్వంపై యుద్ధాన్ని రేడియో ద్వారా ప్రకటించిన వెంటనే ఆ పట్టణ ప్రజలు పారిపోయారు. పూర్తికాల పరిచారకుడు అంటే పయినీరుగా సేవ చేస్తున్న ఫ్రాన్సిస్కొ, తాను తన భార్య ఎదుర్కొన్న సంఘటనల్లో యెహోవా తమను ఎలా బలపరిచాడో ఆయనిలా వివరించాడు:

“అక్కడి నుంచి నడిచివెళ్తే మూడు గంటల్లో చేరుకోగల ఒక ప్రాంతంలో తలదాచుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అక్కడ ఒక సంఘం ఉండేది కాబట్టి, మేము సహోదరులతో కలిసి ఉండవచ్చు. త్వరలోనే, పాలెంక్‌లో జరగబోయే ప్రాంతీయ సమావేశానికి సమయం ఆసన్నమైంది. పయినీర్ల కోసం జరిగే ప్రత్యేక సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని నేనూ నా భార్యా అనుకున్నాం, కానీ సమావేశానికి వెళ్ళే మార్గాన్ని ఈజెడ్‌ఎల్‌ఎన్‌ తిరుగుబాటు సంస్థ ఆక్రమించింది. కాబట్టి అడవి మార్గం గుండా వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం, గమ్యస్థానం చేరుకోవడానికి తొమ్మిది గంటలు పట్టింది. మేము పయినీరు మీటింగుకు హాజరయ్యేలా సమయానికి చేరుకోగలిగాం. దాంతోపాటు సమావేశ కార్యక్రమం అంతటినీ మేమెంతగానో ఆనందించాం.

“మేం తిరిగి వచ్చేసరికి, మా ఇంటిని తగులబెట్టేశారు, పాడి పశువులనన్నింటిని ఎత్తుకుపోయారు. మిగిలిందల్లా బట్టలున్న ఒక చిన్న సంచి మాత్రమే. జరిగిన నష్టానికి మేమెంతో బాధపడ్డాం, అయితే ఒకోసింగొలోని సహోదరులు మమ్మల్ని ఎంతో దయతో తమ ఇండ్లకు తీసుకువెళ్ళారు. వ్యవసాయదారులమైన మేము ఇంతకు ముందు ఎన్నడూ చేయని పనులను ఎలా చేయాలో కూడా చూపించారు. ఒక సహోదరుడు ఫోటోలను తీయడం నేర్పించాడు, మరొక సహోదరుడు బూట్లను రిపేరు చేయడం నేర్పించాడు. ఆ విధంగా నేనూ నా భార్యా మమ్మల్ని మేము పోషించుకుంటూ ఇప్పటి వరకూ పయినీరు సేవను ఆపివేయకుండా చేస్తున్నాం. జరిగిన వాటిని అవలోకనం చేసుకుంటే, సహించడం మాకంత సులభం కాలేదు గానీ యెహోవాయే మమ్మల్ని బలపరిచాడన్నది స్పష్టంగా అర్థమౌతుంది.”

ప్రకటనా పని యొక్క ప్రతిఫలం

చియాపస్‌ రాష్ట్రంలోని సాక్షులు, ఆ ప్రాంతంలోని ప్రజలకు సువార్తను చేరవేయడానికి చేసే ప్రత్యేక ప్రయత్నాల్లో భాగం వహించకుండా ఆటంకపరచడానికి తాము ఎదుర్కొంటున్న కష్టాలను, అపాయాలను అనుమతించలేదు. ఉదాహరణకు, గత 1995 ఏప్రిల్‌, మే నెలల్లో, జీవితం ఎందుకు ఇంతగా సమస్యలతో నిండివుంది? అనే ఆకట్టుకునే పేరు గల రాజ్య వార్త నెం. 34ను పంచిపెట్టే కాంపెయిన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ తోటి సహోదరులతోపాటు వారూ పాల్గొన్నారు.

ఈ కాంపెయిన్‌ సమయంలో సీరొ అనే రెగ్యులర్‌ పయినీరు, ప్యూబ్లొ న్యూవొ అని పిలిచే స్థలంలో ఆసక్తి గల ఒక కుటుంబాన్ని కలిశాడు. మూడు రోజుల తరువాత పునర్దర్శనానికి వెళ్ళిన ఆ సహోదరుడు వారితో బైబిలు పఠనం ప్రారంభించగలిగాడు. అయితే సీరొ, మరొక సహోదరుడు కలిసి బైబిలు పఠనాన్ని కొనసాగించేందుకు వాళ్ళింటికి వెళ్ళేసరికి, కుటుంబ పెద్ద ఇంట్లో లేడు. బదులుగా, ముసుగులు ధరించిన గుంపొకటి ఆయనకు కీడు తలపెట్టాలనే ఉద్దేశంతో ఆయన కోసం ఎదురు చూస్తోంది. సీరొ, అతని వెంట వెళ్ళిన సహోదరుడ్ని మీరు దేనికోసం వచ్చారు, మిమ్మల్ని చంపేస్తామని వాళ్ళు బెదిరించారు. మనసులోనే ప్రార్థన చేసుకున్న తర్వాత, తాము ఆ కుటుంబానికి బైబిలు నేర్పించడానికి వచ్చామని ఆ ఇద్దరు క్రైస్తవులూ ధైర్యంగా వివరించారు. దాంతో ఆ సాయుధులు వారిని అక్కడి నుంచి తిరిగి వెళ్ళనిచ్చారు. కొన్ని కారణాల వల్ల, ఆ కుటుంబ పెద్ద ఆ రోజు ఇంటికి రాలేదు.

దాదాపు మూడు సంవత్సరాలు గడిచిన తరువాత ఒకరోజున, ఆ ఇంటాయనను తన ఇంటి గుమ్మం దగ్గర చూసి సీరొ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడాయన కుటుంబంలోని వారందరు బాప్తిస్మం పొందారనీ, ప్రస్తుతం గౌటిమాల సంఘంలో కూటాలకు హాజరవుతున్నారనీ తెలుసుకుని సీరొ ఆనందించాడు! ఆయన కూతురొకామె రెగ్యులర్‌ పయినీరుగా సేవ చేస్తుందట కూడా.

ఆధ్యాత్మిక ఆహారం పట్ల ప్రశంస

చియాపస్‌లో దుర్భరకాలం కొనసాగుతున్నప్పటికీ, ఆ ప్రాంతంలోని సాక్షులు కూటాలకు హాజరవడం యొక్క ప్రాముఖ్యతను ఎంతో ప్రశంసిస్తారని ఒక జిల్లా పై విచారణకర్త తెలియజేస్తున్నారు. (హెబ్రీయులు 10:​24, 25) ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశపు రోజున ఏం జరిగిందో ఆయన తెలియజేశారు. హాజరైనవారు చీకటి పడకముందే సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకోగలిగేలా, ఆ సమావేశం ఉదయం త్వరగా ప్రారంభించాలని ప్రణాళిక వేయడం జరిగింది. వారిలో చాలామంది సమావేశ స్థలానికి చేరుకోవడానికి మూడు గంటలకు పైగా అడవి మార్గాన నడిచి రావాల్సి వచ్చినా, ప్రతి ఒక్కరు ఉదయం 7 గంటలకల్లా తమ తమ సీట్లలో కూర్చొని ఉన్నారు. ప్రేక్షకుల్లో ఈజెడ్‌ఎల్‌ఎన్‌ తిరుగుబాటు గుంపుకు చెందిన ఆరుగురు సభ్యులు ఉన్నారు, వాళ్ళు కార్యక్రమాన్ని వింటూ కరతాళ ధ్వనులు చేస్తూ కార్యక్రమాన్ని ఆనందిస్తున్నారన్నది వ్యక్తమైంది. సమావేశానికి హాజరయ్యేందుకు వాళ్ళు కూడా మూడు గంటలపాటు నడిచి వచ్చారు. స్థానిక రాజ్యమందిరంలో జరిగిన యేసు మరణ జ్ఞాపకార్థ దినానికి కూడా వాళ్ళలో ఇరవై మంది హాజరయ్యారు.

గెరిల్లా కార్యకలాపాలను సాగించే సంస్థకు చెందిన మరొక యువకుడు, అడవిలోని ఒకానొక ప్రాంతంలో గస్తీ తిరగడానికి తన పై అధికారులచే నియమించబడ్డాడు. ఆయన ఆ ప్రాంతానికి చేరుకునేటప్పటికి, అక్కడి నివాసులందరు ఇళ్ళు వదిలి పారిపోయారు. వాళ్ళలో ఎక్కువ మంది యెహోవాసాక్షులే. అలా వదిలి వెళ్ళిన ఒక ఇంట్లో ఈయన మకాం పెట్టాడు. చేసేదేమీ లేదు గనుక అక్కడున్న పుస్తకాల్లో కొన్నింటిని తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. అవి ఆ ఇంటిలోని సాక్షులు వదిలి వెళ్ళిన వాచ్‌టవర్‌ ప్రచురణలు. ఏకాంతంగా ఉండడం మూలంగా తాను చదువుతున్న వాటి గురించి ధ్యానించడానికి సమయం దొరికిందా యువకునికి. తన జీవితాన్ని తప్పకుండా మార్చుకోవాలని, ఆయుధాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. త్వరలోనే ఆయన యెహోవాసాక్షులను కలుసుకుని బైబిలు పఠనాన్ని ప్రారంభించాడు. ఆరు నెలల్లో, ఆయన ఇతరులతో సువార్తను గురించి మాట్లాడడం మొదలెట్టాడు. ఆయనా, గెరిల్లాకు మద్దతుదార్లుగా ఉండే ఆయన కుటుంబ సభ్యుల్లోని మరొక ముగ్గురూ ఇప్పుడు బాప్తిస్మం పొందిన క్రైస్తవులయ్యారు.

అనుకూలత వైపు దృష్టిని సారించడం

అక్కడి అల్లకల్లోల పరిస్థితి వల్ల ఏర్పడిన సమస్యలను ఎదుర్కోవడం ఎంతో కష్టతరమైనప్పటికీ, వాస్తవానికి ఆ పరిస్థితి ప్రకటనా పనిపట్ల ప్రజల దృక్పథంపై అనుకూలమైన ప్రభావాన్ని చూపింది. గొడవలు ప్రారంభమైన ఆ పట్టణంలో నివసిస్తున్న ఒక పెద్ద ఇలా చెప్పాడు: “అల్లర్లు మొదలైన అయిదు రోజుల తరువాత, మేము ప్రకటనా పనిని పట్టణం బయటా లోపలా చేయాలని ప్రణాళిక వేసుకున్నాం. ప్రజలు వినడానికి ఎంతో ఆసక్తిని కనబర్చారు. మేము బైబిలు ప్రచురణలను చాలా పంచగలిగాం, అనేక బైబిలు పఠనాలను కూడా ప్రారంభించాం. ఒక ప్రాంతంలో, ఒకప్పుడు సత్యాన్ని వ్యతిరేకించిన చాలామంది, గొడవల మూలంగా ఇప్పుడు సువార్తను వింటున్నారు, బైబిలు పఠనం చేస్తున్నారు, కూటములకు సమావేశాలకు హాజరవుతున్నారు.”

అల్లకల్లోలిత పరిస్థితుల మధ్య కూడా దైవిక కార్యకలాపాలను కొనసాగించగలగడం సహోదరులకు సంతోషం కలుగజేసింది. తమ కార్యకలాపాల గురించి ప్రభుత్వానికి, ఈజెడ్‌ఎల్‌ఎన్‌ తిరుగుబాటు సంస్థకు తెలిసినప్పటికీ, వాళ్ళు తమను ఆధ్యాత్మికంగా బలపరిచే సమావేశాలను నిలిపివేయకుండా జరుపుకున్నారు. ప్రయాణ పైవిచారణకర్త సందర్శనాలు, ప్రకటనా పనిలో కొనసాగడానికి ఒక శక్తివంతమైన ప్రేరణనిచ్చాయి కూడా. ఆసక్తికరంగా, అక్కడి గొడవల్లో పాల్గొన్నవారు కూడా సాక్షులను ప్రోత్సహించేవారు. ప్రకటనా పనిని కొనసాగించమని తరచుగా వారు సాక్షులను కోరేవారు.

కాలక్రమేణా చియాపస్‌లోని ప్రజలకు శోధనలు, కష్టాలు కాస్త తగ్గినప్పటికీ, పూర్తిగా తొలగిపోలేదు. ఏది ఏమైనా దేవుని వాక్యమైన బైబిలునుంచి శాంతి సువార్తను ప్రజలందరికి చేరవేయడానికి ప్రయత్నించడంలో నిర్విరామంగా కొనసాగాలని యెహోవాసాక్షులు దృఢంగా నిశ్చయించుకున్నారనే విషయం మాత్రం సుస్పష్టం. (అపొస్తలుల కార్యములు 10:​34-36; ఎఫెసీయులు 6:​15) “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని” ప్రవక్త అయిన యిర్మీయా తెలియజేసిన విషయాన్ని వారు గుర్తిస్తారు. (యిర్మీయా 10:​23) దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చేతుల్లో ఉన్న దేవుని రాజ్యం మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్న అన్యాయాన్నీ, పేదరికాన్నీ పరిష్కరించగలదు.​—⁠మత్తయి 6:​9,10.

[9వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

మెక్సికో సముద్రభాగం

చియాపస్‌

గౌటిమాల

పసిఫిక్‌ మహాసముద్రం

[చిత్రసౌజన్యం]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[9వ పేజీలోని చిత్రం]

చియాపస్‌ పర్వత ప్రాంతాల్లో పరచర్యకు వెళ్తున్న సాక్షులు