కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండండి

సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండండి

సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండండి

“మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యతడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.”​—⁠కొలొస్సయులు 4:⁠12.

1, 2. (ఎ) తొలి క్రైస్తవుల్లో బయటివారు దేనిని గమనించారు? (బి) కొలొస్సయులకు వ్రాసిన పత్రిక ప్రేమపూర్వకమైన ఆసక్తిని ఎలా ప్రతిబింబిస్తుంది?

యేసు అనుచరులు తమ తోటి ఆరాధకులంటే ఎంతో ప్రగాఢమైన ఆసక్తి కల్గివుండేవారు. అనాధలపట్ల, పేదవారిపట్ల, వృద్ధులపట్ల వారు చూపించిన దయ గురించి టెర్టూలియన్‌ (సా.శ. రెండు మూడు శతాబ్దాల నాటి రచయిత) చెప్పాడు. ప్రేమకు నిదర్శనాలైన ఆ క్రియలు అవిశ్వాసులను ఎంతగా ప్రభావితం చేశాయంటే, వారిలో కొందరు, ‘చూడండి వారు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటారో’ అని ఈ క్రైస్తవుల గురించి అన్నారు.

2 కొలొస్సయులకు వ్రాసిన పత్రిక, కొలొస్సయిలోని సహోదర సహోదరీలపట్ల అపొస్తలుడైన పౌలు, ఆయన సహచరుడైన ఎపఫ్రాలకు ఉన్న ప్రేమపూర్వకమైన ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. పౌలు వారికిలా వ్రాశాడు: ‘మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని ఎపఫ్రా ఎల్లప్పుడును మీ కోసం తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.’ ‘ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండండి’ అని చెప్తున్న కొలొస్సయులు 4:⁠12, యెహోవాసాక్షులకు 2001 సంవత్సరపు వార్షిక వచనంగా ఉంటుంది.

3. ఎపఫ్రా ఏ రెండు అంశాల కోసం ప్రార్థించాడు?

3 ఎపఫ్రా తన ప్రియమైన వారి కోసం చేసిన ప్రార్థనల్లో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయని మీరు చూడవచ్చు: (1) వారు ‘సంపూర్ణులుగా నిలకడగా ఉండాలి,’ (2) వారు ‘దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత కల్గివుండాలి.’ ఈ సమాచారం మన ప్రయోజనం నిమిత్తమే లేఖనాల్లో పొందుపర్చబడింది. కాబట్టి మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘నేను నిలకడగా ఉండి, దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత కల్గివుండడానికి వ్యక్తిగతంగా ఏమి చేయవలసిన అవసరం ఉంది? నేనలా చేస్తుండగా, దాని ప్రభావం ఏమై ఉండగలదు?’ మనం చూద్దాం.

‘సంపూర్ణులుగా నిలకడగా ఉండడానికి’ కృషి చేయండి

4. కొలొస్సయులు ఏ భావంలో ‘సంపూర్ణులై’ ఉండవలసిన అవసరం ఉంది?

4 కొలొస్సయిలోని తన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు ‘సంపూర్ణులుగా నిలకడగా ఉండాలని’ ఎపఫ్రా ఎంతగానో కోరుకున్నాడు. ఇక్కడ ‘సంపూర్ణులు’ అని అనువదించబడిన దాని కోసం పౌలు ఉపయోగించిన గ్రీకు పదానికి పరిపూర్ణమైన, పూర్తిగా ఎదిగిన, లేక పరిణతి చెందిన అనే భావం ఉండగలదు. (మత్తయి 19:21; హెబ్రీయులు 5:14; యాకోబు 1:​4, 25) ఒకరు బాప్తిస్మం తీసుకున్న యెహోవా సాక్షి అయినంత మాత్రాన ఆ వ్యక్తి పూర్తిగా ఎదిగిన క్రైస్తవుడై ఉండవలసిన అవసరం లేదని మీకు తెలిసే ఉండవచ్చు. ‘అందరూ విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది, సంపూర్ణపురుషులు అయ్యేందుకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారయ్యేందుకు’ సహాయం చేయడానికి కాపరులూ, బోధకులూ ప్రయత్నించాలని కొలొస్సయికి పశ్చిమాన నివసిస్తున్న ఎఫెసీయులకు పౌలు వ్రాశాడు. “బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి” అని మరోచోట పౌలు క్రైస్తవులకు ఉద్బోధించాడు.​—⁠ఎఫెసీయులు 4:8-13; 1 కొరింథీయులు 14:⁠20.

5. సంపూర్ణతను మనం మన కీలక లక్ష్యంగా ఎలా చేసుకోవచ్చు?

5 కొలొస్సయిలోని కొందరు ఆధ్యాత్మికంగా ఇంకా పూర్తిగా ఎదగకపోతే, లేక పరిణతి చెందకపోతే దాన్ని సాధించాలన్నది వారి లక్ష్యమై ఉండవలసిన అవసరం ఉంది. నేడు కూడా అదే నిజమై ఉండవద్దా? మనం దశాబ్దాల క్రితం బాప్తిస్మం తీసుకున్నా లేక ఇటీవల సంవత్సరాల్లో బాప్తిస్మం తీసుకున్నా, మనం మన తర్క సామర్థ్యంలోనూ, దృక్కోణాల్లోనూ స్పష్టంగా పురోభివృద్ధి సాధించామని చూడగల్గుతున్నామా? మనం నిర్ణయాలు తీసుకునే ముందు బైబిలు సూత్రాలను పరిశీలిస్తామా? దేవునికి, సంఘానికి సంబంధించిన విషయాలకు మన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరుగుతోందా లేక కేవలం యాదృచ్ఛికంగా చేసేస్తున్నామా? సంపూర్ణత వైపుకు నడిపే అలాంటి ఎదుగుదలను ప్రతిబింబించే మార్గాలన్నిటిని మేము ఇక్కడ సోదాహరణంగా చెప్పలేకపోయినప్పటికీ, రెండు ఉదాహరణలను పరిశీలించండి.

6. యెహోవావలే పరిపూర్ణులుగా ఉండగలిగేందుకు అభివృద్ధి సాధించవలసిన ఒక అంశం ఏది?

6 మొదటి ఉదాహరణ: మరో జాతి పట్లా, దేశంపట్లా, లేక ప్రాంత ప్రజల పట్లా దురభిమానానికి లేక ప్రతికూల అభిప్రాయాలకు పేరెన్నికగన్న వాతావరణంలో మనం పెరిగామనుకుందాం. దేవుడు పక్షపాతి కాడనీ, మనం కూడా పక్షపాతం చూపించకూడదనీ మనకిప్పుడు తెలుసు. (అపొస్తలుల కార్యములు 10:14, 15, 34, 35) మన సంఘంలోగానీ లేక సర్క్యూట్‌లోగానీ అలాంటి వేరే పూర్వరంగాలకు చెందిన వారు ఉండవచ్చు, మనం వారి మధ్యనే ఉంటున్నాము. అయితే, అలాంటి పూర్వరంగం గల ప్రజల పట్ల ప్రతికూల భావాలను లేక అనుమానాలను మనలో అంతర్గతంగా ఎంతమేరకు ఉంచుకుంటున్నాము? అలాంటి పూర్వరంగం గలవారు మనపట్ల ఏదైనా చిన్న పొరపాటు చేసినా లేక తప్పు చేసినా మనం వెంటనే వారి గురించి ప్రతికూలంగా భావిస్తామా? మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘దేవునికున్నటువంటి నిష్పక్షపాత దృక్కోణాన్నే నేనూ కల్గివుండడానికి మరింత అభివృద్ధి సాధించవలసిన అవసరం ఉందా?’

7. క్రైస్తవులంగా సంపూర్ణులమవ్వడంలో, ఇతరుల గురించి ఏ దృక్కోణాన్ని కల్గివుండడం ఇమిడి ఉంది?

7 రెండవ ఉదాహరణ: ఫిలిప్పీయులు 2:3 ప్రకారం, మనం ‘కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారమై ఒకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుకోవాలి.’ ఈ విషయంలో మనమెలా అభివృద్ధి సాధిస్తున్నాము? ప్రతి వ్యక్తికీ బలహీనతలు, బలాలు ఉంటాయి. గతంలో మనం ఇతరుల బలహీనతలను చాలా త్వరగా గమనించే వారమై ఉంటే, ఇప్పుడు మనం అభివృద్ధి సాధించి, వారు ‘పరిపూర్ణులై’ ఉండాలని అపేక్షించడం మానుకున్నామా? (యాకోబు 3:⁠2) ఇప్పుడు మునుపటికంటే ఎక్కువగా, ఇతరులు మనకంటే ఏ యే విధాల్లో ఉన్నతులో చూడగల్గుతున్నామా, చూస్తున్నామా? ‘ఈ సహోదరి సహనం విషయంలో నాకంటే ఉన్నతమైనదని నేను అంగీకరించవలసిందే.’ ‘ఆ వ్యక్తికి నా కన్నా ఎక్కువ ఆశాపూర్వకమైన దృఢవిశ్వాసం ఉంది.’ ‘నిక్కచ్చిగా చెప్పాలంటే, ఆయన నాకంటే మంచి బోధకుడు.’ ‘తన కోపాన్ని అదుపు చేసుకోవడంలో ఆమె నాకంటే ఉన్నతురాలు.’ బహుశా కొంతమంది కొలొస్సయులు ఈ విషయాల్లో అభివృద్ధి సాధించవలసిన అవసరం ఉండవచ్చు. మనకూ అలాంటి అవసరం ఉందా?

8, 9. (ఎ) కొలొస్సయులు ఏ భావంలో ‘సంపూర్ణులై’ ఉండాలని ఎపఫ్రా ప్రార్థించాడు? (బి)  ‘సంపూర్ణులై ఉండడం’ అన్న పదబంధం భవిష్యత్తుకు సంబంధించి ఏ భావాన్ని ఇస్తుంది?

8 కొలొస్సయులు “సంపూర్ణాత్మ నిశ్చయత” కల్గివుండాలని ఎపఫ్రా ప్రార్థించాడు. అయితే కొలొస్సయులు కొంతమేరకు సంపూర్ణతను పొంది, పరిణతి చెంది, ఎదిగిన క్రైస్తవులయ్యారు, వారు వెనక్కి మళ్లకుండా ఉండాలని ఎపఫ్రా దేవునికి ప్రార్థిస్తున్నాడన్నది స్పష్టమౌతుంది.

9 క్రైస్తవుడయ్యే ప్రతి వ్యక్తి, చివరికి పరిణతి చెందిన వ్యక్తి కూడా ముందుకు అలాగే కొనసాగగలడని మనం చెప్పలేము. దేవుని కుమారుడైన ఒక దేవదూత సహితం ‘సత్యమందు నిలిచి ఉండలేదని’ యేసు చెప్పాడు. (యోహాను 8:​44) గతంలో కొంతకాలంపాటు యెహోవా సేవ చేసి ఆ తర్వాత అలాగే కొనసాగలేకపోయిన కొంతమంది గురించి పౌలు కొరింథీయులకు జ్ఞాపకం చేశాడు. ఆయన ఆత్మాభిషిక్త సహోదరులను ఇలా హెచ్చరించాడు: “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కొరింథీయులు 10:​12) కొలొస్సయులు ‘సంపూర్ణాత్మ నిశ్చయత కల్గివుండాలని’ చేయబడిన ప్రార్థనకు ఇది బలాన్ని చేకూరుస్తుంది. వారొకసారి సంపూర్ణంగా, పూర్తిగా ఎదిగిన తర్వాత, వారు ఇక మందగించకుండా, ప్రక్కకు తొలగిపోకుండా, లేక వెనక్కి మళ్లకుండా అలాగే నిలిచి ఉండవలసిన అవసరం ఉంది. (హెబ్రీయులు 2:1; 3:12; 6:​5,6; 10:39; 12:​25) అలా వారు తాము పరీక్షించబడే దినానికి, చివరి ఆమోదం పొందే సమయానికి ‘సంపూర్ణులౌతారు.’​—⁠2 కొరింథీయులు 5:10; 1 పేతురు 2:​12.

10, 11. (ఎ) ప్రార్థనకు సంబంధించి ఎపఫ్రా మనకోసం ఏ మాదిరిని ఉంచాడు? (బి) ఎపఫ్రా చేసిన దానికి అనుగుణంగా, మీరు ఏమి చేయాలని నిశ్చయించుకుంటున్నారు?

10 యెహోవా ఇతరులకు సహాయం చేయాలని, వారిని ఓదార్చాలని, ఆశీర్వదించాలని, వారికి పరిశుద్ధాత్మను ఇవ్వాలని మనం నిర్దిష్టంగా అడుగుతూ వారి పేరు తీసుకుని వారి కోసం ప్రార్థించడం యొక్క ప్రాముఖ్యతను మనం ఇప్పటికే చర్చించాం. ఎపఫ్రా కొలొస్సయుల కోసం చేసిన ప్రార్థనలు అటువంటివే. మనం ప్రార్థనలో యెహోవా ఎదుటకు ఏ విషయాన్ని తీసుకువస్తామనే దాని గురించి ఒక విలువైన సలహాను ఆయన చేసిన ప్రార్థనలోని ఆ పదాల్లో మనం కనుగొనవచ్చు, వాస్తవానికి మనం కనుగొనాలి. మనం వ్యక్తిగతంగా ‘చివరికి సంపూర్ణాత్మ నిశ్చయత కల్గివుండేలా’ యెహోవా సహాయం కోసం అడిగి తీరాలి. మీరు అడుగుతారా?

11 మీ పరిస్థితి గురించి ప్రార్థనలో ఎందుకు ప్రస్తావించకూడదు? ‘సంపూర్ణులై’ ఉండడం, పూర్తిగా ఎదగడం, పరిణతి చెందడం వైపుగా మీరు ఇంతవరకు సాధించిన పురోభివృద్ధి గురించి దేవునితో మాట్లాడండి. మీరు ఇంకా ఏ యే ప్రాంతాల్లో ఆధ్యాత్మికంగా ఎదగవలసి ఉందో గుర్తించటానికి సహాయం చేయమని ఆయనను వేడుకోండి. (కీర్తన 17:3; 139:​23, 24) నిస్సందేహంగా, మీకు అలాంటి కొన్ని ప్రాంతాలు ఉండనే ఉంటాయి. అప్పుడు, వాటి విషయమై నిరుత్సాహపడే బదులు, పురోభివృద్ధి సాధించడానికి సహాయం చేయమని స్పష్టంగా, సూటిగా దేవునికి విన్నవించుకోండి. ఒకటికంటే ఎక్కువసార్లు అలా చేయండి. వాస్తవానికి, మీరు ‘చివరికి సంపూర్ణంగా నిలబడగలిగేలా’ ఈ రాబోయే వారంలో కొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను అని ఎందుకు నిశ్చయించుకోకూడదు. వార్షిక లేఖనాన్ని పరిశీలించేటప్పుడు మీరు మరింతగా అలా చేయాలని నిశ్చయించుకోండి. మీ ప్రార్థనల్లో, వెనుకంజ వేసేలా, అలసిపోయేలా లేక దేవుని సేవ నుండి దూరంగా వెళ్లిపోయేలా మీకు కలిగే భావాలపైనా, అలాంటి వాటిని ఎలా విడనాడవచ్చనే దానిపైనా అవధానం నిలపండి.​—⁠ఎఫెసీయులు 6:11, 13, 14, 18.

దృఢ నిశ్చయత కోసం ప్రార్థించండి

12. ప్రాముఖ్యంగా కొలొస్సయులకు “సంపూర్ణాత్మ నిశ్చయత” ఎందుకు అవసరం?

12 కొలొస్సయులు, చివరికి దేవునికి అంగీకారమైన విధంగా నిలబడగలిగేందుకు ఆవశ్యకమైన మరో విషయం గురించి కూడా ఎపఫ్రా ప్రార్థించాడు. అది మనకు కూడా అంతే ఆవశ్యకం. అదేమిటి? వారు ‘దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత కల్గివుండాలని’ ఆయన ప్రార్థించాడు. వారి చుట్టూ వితండవాదమూ, హానికరమైన తత్వశాస్త్రాలూ అల్లుకుని ఉన్నాయి, వాటిలో కొన్నింటికి సత్యారాధనకు సంబంధించిన మోసకరమైన ముసుగు ఉంది. ఉదాహరణకు, ఒకప్పుడు యూదామత సంబంధిత ఆరాధనలో ఉన్నట్లుగా ఉపవాసాలతో లేక వేడుకలతో ప్రత్యేక దినాలను ఆచరించాలని కొలొస్సయులు ఒత్తిడి చేయబడేవారు. ధర్మశాస్త్రాన్ని మోషేకు అందజేయడానికి ఉపయోగించబడిన శక్తివంతమైన ఆత్మలైన దేవదూతలపై అబద్ధ బోధకులు తమ అవధానాన్ని నిలిపారు. అలాంటి ఒత్తిడులకు లొంగిపోవడం గురించి ఊహించండి! అక్కడ పరస్పర విరుద్ధ తలంపుల గందరగోళం ఉంది.​—⁠గలతీయులు 3:19; కొలొస్సయులు 2:8, 16-19.

13. ఏ అంశాన్ని గుర్తించడం కొలొస్సయులకు సహాయం చేయగలిగింది, అది మనకెలా సహాయం చేయగలదు?

13 యేసుక్రీస్తు పాత్రను నొక్కిచెప్పడం ద్వారా పౌలు దాన్ని త్రిప్పికొట్టాడు. “మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యంటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడు[డి].” అవును, దేవుని సంకల్పంలోనూ, మన జీవితంలోనూ క్రీస్తు పాత్రను గూర్చిన సంపూర్ణ నిశ్చయతను పొందాల్సిన అవసరత (కొలొస్సయులకు, మనకు) ఉంది. పౌలు ఇలా వివరించాడు: “దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; మరియు ఆయనయందు మీరును సంపూర్ణులైయున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై యున్నాడు.”​—⁠కొలొస్సయులు 2:6-10.

14. కొలొస్సయిలో ఉన్నవారికి నిరీక్షణ ఎందుకు ఒక వాస్తవిక విషయమై ఉండినది?

14 కొలొస్సయులు ఆత్మాభిషిక్త క్రైస్తవులు. వారికి పరలోక జీవితమనే విశేషమైన నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణను ఉజ్వలంగా ఉంచుకోవడానికి వారికి ప్రతి కారణం ఉంది. (కొలొస్సయులు 1:⁠5) తమ నిరీక్షణ యొక్క కచ్చితత్వం గురించి వారు దృఢ నిశ్చయత కల్గివుండాలన్నది “దేవుని చిత్తము.” వారిలో ఎవరైనా ఆ నిరీక్షణను సందేహించి ఉంటారా? ఎంతమాత్రం సందేహించి ఉండరు! భూపరదైసులో జీవించాలని దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణగలవారి విషయంలో అది నేడు ఏమైనా భిన్నంగా ఉండాలా? ఎంతమాత్రం ఉండకూడదు! ఆ విలువైన నిరీక్షణ స్పష్టంగా “దేవుని చిత్తము”లో ఒక భాగం. ఇప్పుడు ఈ ప్రశ్నలను పరిశీలించండి: మీరు “మహా శ్రమను” తప్పించుకునే “గొప్ప సమూహము”నకు చెందిన వారిగా ఉండాలని కృషి చేస్తుంటే, మీ నిరీక్షణ ఎంత వాస్తవమైనదిగా ఉంది? (ప్రకటన 7:9,14) అది, ‘దేవుని చిత్తమును గూర్చిన మీ సంపూర్ణాత్మ నిశ్చయతలో’ ఒక భాగమేనా?

15. నిరీక్షణకు సంబంధించిన ఏ పరంపరను పౌలు సంక్షిప్తంగా చెప్పాడు?

15 “నిరీక్షణ” అంటే మన ఉద్దేశం అస్పష్టమైన కోరికలేక పగటికల ఎంతమాత్రం కాదు. పౌలు మునుపు రోమీయులకు అందజేసిన విషయాల పరంపర నుండి మనం దీన్ని గ్రహించవచ్చు. ఆ పరంపరలో, ప్రస్తావించబడిన ప్రతిదీ మరోదానితో సంబంధం కల్గివుంది లేక మరోదానికి దారితీస్తుంది. పౌలు తన తర్కంలో “నిరీక్షణ”ను ఏ స్ధానంలో ఉంచాడో గమనించండి: “శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను [“అంగీకృత స్థితిని,” NW], పరీక్ష [“అంగీకృత స్థితి,” NW] నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.”​—⁠రోమీయులు 5:3-5.

16. మీరు బైబిలు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, మీరు ఏ నిరీక్షణను పొందారు?

16 యెహోవాసాక్షులు మొదటిసారిగా మీతో బైబిలు సందేశాన్ని పంచుకున్నప్పుడు, మృతుల పరిస్థితి లేక పునరుత్థానం వంటి ఏదైనా ఒక సత్యం మీ ఆసక్తిని చూరగొని ఉండవచ్చు. చాలామంది విషయంలో, భూ పరదైసులో జీవించే బైబిలు ఆధారిత సాధ్యతే, ప్రాథమికంగా క్రొత్త గ్రహింపైవుంది. మీరు ఆ బోధను మొదటగా విన్నప్పటి సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎంత అద్భుతమైన నిరీక్షణ​—⁠అనారోగ్యం, వృద్ధాప్యం ఇక ఉండవు, మీరు మీ కష్టఫలాన్ని అనుభవించవచ్చు, జంతువుల మధ్య కూడా సమాధానం ఉంటుంది! (ప్రసంగి 9:5, 10; యెషయా 65:17-25; యోహాను 5:28, 29; ప్రకటన 21:​3, 4) మీకు ఒక అత్యద్భుతమైన నిరీక్షణ లభించింది!

17, 18. (ఎ) పౌలు రోమీయులకు అందజేసిన పరంపర నిరీక్షణకు ఎలా దారితీస్తుంది? (బి) రోమీయులు 5:​3-5 నందు ఏ విధమైన నిరీక్షణా భావమివ్వబడింది, మీకు అలాంటి నిరీక్షణ ఉందా?

17 ఆ తర్వాత మీరు కొంత వ్యతిరేకతను లేక హింసను ఎదుర్కొని ఉండవచ్చు. (మత్తయి 10:34-39; 24:⁠9) ఇటీవల కాలాల్లో కూడా, అనేక దేశాల్లో ఉన్న సాక్షుల గృహాలు కొల్లగొట్టబడ్డాయి, లేక శరణార్ధులుగా చేయబడ్డారు. కొంతమంది దాడికి గురయ్యారు, వారి బైబిలు సాహిత్యాలు స్వాధీనం చేసుకోబడ్డాయి. లేక ప్రచార మాధ్యమాలలోని అబద్ధ నివేదికలకు లక్ష్యంగా చేయబడ్డారు. మీరు ఎలాంటి హింసను ఎదుర్కొన్నప్పటికీ రోమీయులు 5:​3,4 చెప్తున్నట్లుగా, మీరు శ్రమలయందు అతిశయపడగల్గారు, అది చక్కని ఫలితాన్ని తెచ్చింది. పౌలు వ్రాసినట్లుగానే, శ్రమ మీలో ఓర్పును ఉత్పన్నం చేసింది. అప్పుడు ఓర్పు అంగీకృత స్థితిని తెచ్చింది. మీరు దేవుని చిత్తాన్ని చేస్తున్నారు గనుక మీరు సరైనది చేస్తున్నారని మీకు తెలుసు, కాబట్టి మీకు అంగీకారం ఉంటుందనీ మీకు తెలుసు. పౌలు మాటల్లో చెప్పాలంటే, మీరు ‘అంగీకృత స్థితిలో’ ఉన్నట్లు గ్రహించారు. ఇంకా కొనసాగిస్తూ పౌలు ఇలా వ్రాశాడు: ‘అంగీకృత స్థితి నిరీక్షణను కలుగజేస్తుంది.’ ఇది కాస్త వింతగా అనిపించవచ్చు. పౌలు ఈ పరంపరలో “నిరీక్షణ”ను ఇక్కడ ఎందుకు చేర్చాడు? మీకు ఎప్పుడో, అంటే మీరు మొదట సువార్త విన్నప్పుడే మీకు నిరీక్షణ లేదా?

18 పౌలు ఇక్కడ మనకు పరిపూర్ణ జీవిత నిరీక్షణ పట్ల మొదటిసారిగా కల్గిన భావం గురించి ప్రస్తావించడంలేదని స్పష్టమౌతుంది. ఆయన ప్రస్తావిస్తున్నది దానికి మించినది; అది లోతైనది, మరింత ప్రేరణాత్మకమైనది. మనం నమ్మకంగా సహించి, తద్వారా మనకు దేవుని అంగీకారం ఉందని గ్రహించినప్పుడు, అది మనకున్న మొదటి నిరీక్షణను దృఢపర్చి, దాన్ని బలపర్చే ప్రగాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మనకు ఇప్పుడున్న నిరీక్షణ ఇప్పుడు మరింత వాస్తవమైనదిగా, పటిష్టమైనదిగా, వ్యక్తిగతమైనదిగా తయారౌతుంది. ప్రగాఢమైన ఈ నిరీక్షణ మరింత ఉజ్వలమౌతుంది. అది మనలో వ్యాపిస్తుంది, మన అణువణువునా ఇంకిపోతుంది. “నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.”

19. మీ నిరీక్షణ మీరు క్రమంగా చేసే ప్రార్థనల్లో ఎలా ఒక భాగమై ఉండాలి?

19 కొలొస్సయిలోని తన సహోదర సహోదరీలు తమ ఎదుట ఉన్న నిరీక్షణతో కదిలించబడాలని, ఒప్పించబడాలని, ‘దేవుని చిత్తంలో సంపూర్ణాత్మ నిశ్చయత’ కల్గివుండాలని ఎపఫ్రా పట్టుదలతో ప్రార్థించాడు. మనలో ప్రతి ఒక్కరం కూడా మన నిరీక్షణ గురించి అలాగే దేవునికి క్రమంగా ప్రార్థిద్దాం. మీ వ్యక్తిగత ప్రార్థనల్లో, నూతన లోకాన్ని గురించిన నిరీక్షణను చేర్చండి. అది తప్పక వస్తుందన్న సంపూర్ణ నిశ్చయతతో దాని కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో యెహోవా ఎదుట వ్యక్తం చేయండి. మీ నిశ్చయతను ప్రగాఢమైనదిగా చేయమనీ, దాన్ని దృఢపర్చమనీ ఆయనను వేడుకోండి. కొలొస్సయులు ‘దేవుని చిత్తమంతటిలో సంపూర్ణాత్మ నిశ్చయత కల్గివుండాలని’ ఎపఫ్రా ప్రార్థించినట్లుగానే, మీరూ ప్రార్థించండి. తరచూ అలా ప్రార్థించండి.

20. సాపేక్షికంగా కొంతమంది క్రైస్తవ మార్గం నుండి తప్పిపోతే, అది మనం నిరుత్సాహపడడానికి ఎందుకు కారణం కాకూడదు?

20 అందరూ నిలకడగా ఉండలేరు, దృఢ నిశ్చయత కల్గివుండలేరు అన్న వాస్తవాన్ని బట్టి కలవరపడకండి లేక నిరుత్సాహపడకండి. కొందరు విఫలమైపోవచ్చు, పక్కకు తొలగిపోవచ్చు, లేక మొత్తానికే వదిలివేయవచ్చు. యేసుకు ఎంతో సన్నిహితులైన ఆయన అపొస్తలులకే అలా జరిగింది. అయితే యూదా ద్రోహిగా మారినప్పుడు, ఇతర అపొస్తలులు వెనుకబడిపోవడం గానీ వదిలిపోవడం గానీ చేశారా? అలా ఎంతమాత్రం చేయలేదు! పేతురు కీర్తన 109:8వ వచనాన్ని, మరొకరు యూదా స్థానాన్ని తీసుకుంటారని చూపించడానికి అన్వయించాడు. అతని స్థానంలో మరొకరు ఎన్నుకోబడ్డారు, దేవుని యథార్థవంతులు తమ ప్రకటనా నియామకాల్లో చురుగ్గా కొనసాగారు. (అపొస్తలుల కార్యములు 1:​15-26) వారు దృఢ నిశ్చయతతో సంపూర్ణంగా నిలబడాలని నిశ్చయించుకున్నారు.

21, 22. మీరు సంపూర్ణ నిశ్చయతతో నిలకడగా ఉండడం ఏ భావంలో గమనించబడుతుంది?

21 మీరు దేవుని చిత్తమంతటిలో సంపూర్ణాత్మ నిశ్చయతతో నిలకడగా ఉండడం గమనించబడక పోదన్న నిశ్చయతను కల్గివుండవచ్చు. అది తప్పక గమనించబడి, మెచ్చుకొనబడుతుంది. ఎవరిచే?

22 మీరు తెలిసిన, మిమ్మల్ని ప్రేమించే మీ సహోదర సహోదరీలు గమనిస్తారు. చాలామంది దాన్ని మాటల్లో చెప్పకపోయినప్పటికీ, దాని ప్రభావం మనం 1 థెస్సలొనీకయులు 1:2-6 నందు చదివేదాని వంటిదే అయ్యుంటుంది, అక్కడిలా ఉంది: “విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా . . . మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. . . . మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.” మీ చుట్టూ ఉన్న యథార్థవంతులైన క్రైస్తవులు, మీరు ‘దేవుని చిత్తమంతటిలో సంపూర్ణాత్మ నిశ్చయతతో నిలకడగా ఉన్నారని’ గమనించినప్పుడు అలాగే భావిస్తారు.​—⁠కొలొస్సయులు 1:⁠23.

23. రాబోయే ఈ సంవత్సరంలో, మీ నిశ్చయత ఏమై ఉండాలి?

23 అలాగే మీ పరలోక తండ్రి కూడా దాన్ని కచ్చితంగా గమనించి, ఎంతో ఆనందిస్తాడు. అలా గమనించి ఆనందిస్తాడన్న నమ్మకం కల్గివుండండి. ఎందుకు? ఎందుకంటే, మీరు ‘దేవుని చిత్తమంతటిలో’ సంపూర్ణాత్మ నిశ్చయత కల్గి నిలకడగా ఉంటున్నారు గనుక. కొలొస్సయులు ‘అన్ని విషయములలో యెహోవాను సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకోవడం’ గురించి పౌలు వారికి ప్రోత్సాహకరమైన విధంగా వ్రాశాడు. (కొలొస్సయులు 1:​9-12) అవును, అపరిపూర్ణులైన మానవులు ఆయనను సంపూర్ణంగా సంతోషపెట్టడం సాధ్యమే. కొలొస్సయిలోని మీ సహోదర సహోదరీలు అలాగే చేశారు. మీ చుట్టూ ఉన్న క్రైస్తవులూ ఇప్పుడు అలాగే చేస్తున్నారు. మీరు కూడా అలాగే చేయగలరు! కాబట్టి, రాబోయే ఈ సంవత్సరమంతటిలో, మీ అనుదిన ప్రార్థనలు, మీ క్రమమైన చర్యలు మీరు ‘దేవుని చిత్తమంతటిలో సంపూర్ణాత్మ నిశ్చయతతో నిలకడగా ఉండాలని’ నిశ్చయించుకున్నారని నిరూపించేవై ఉండాలి.

మీరు గుర్తు తెచ్చుకోగలరా?

• మీరు ‘నిలకడగా ఉండడంలో’ ఏమి ఇమిడి ఉంది?

• మిమ్మల్ని గురించిన ఏ విషయాలను మీరు మీ ప్రార్థనల్లో చేర్చాలి?

రోమీయులు 5:4, 5 నందు సూచించబడినట్లుగా, మీరు ఎలాంటి నిరీక్షణ కల్గి ఉండాలనుకుంటున్నారు?

• రాబోయే సంవత్సరంలో ఏ లక్ష్యం కల్గివుండేలా మన అధ్యయనం మిమ్మల్ని పురికొల్పింది?

[అధ్యయన ప్రశ్నలు]

[20వ పేజీలోని చిత్రం]

తన సహోదరులు క్రీస్తును గూర్చిన, తమ నిరీక్షణను గూర్చిన దృఢ నిశ్చయతతో ఉండాలని ఎపఫ్రా ప్రార్థించాడు

[23వ పేజీలోని చిత్రాలు]

మీకున్న కచ్చితమైన నిరీక్షణ, దృఢ నిశ్చయత లక్షలాదిమంది ఇతరులకు కూడా ఉంది