కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘అటువలె పరుగెత్తుడి’

‘అటువలె పరుగెత్తుడి’

అటువలె పరుగెత్తుడి’ 

ఉత్తేజభరితులైన ప్రజలతో కిక్కిరిసి ఉన్న ఒక స్పోర్ట్స్‌ స్టేడియంలో మీరున్నారని ఊహించుకోండి. అథ్లెట్లు క్రీడా మైదానంలోకి ప్రవేశిస్తారు. తమ తమ అభిమాన హీరోలు కన్పించగానే జనం బిగ్గరగా అరుస్తారు. క్రీడా నియమాలను అమలుచేసేందుకు జడ్జీలు సిద్ధంగా ఉంటారు. సంఘటనల పరంపర కొనసాగుతుండగా విజయోత్సాహపు అరుపుల హోరులో నిరుత్సాహపు రోదనలు కలిసిపోతాయి. చెవులు చిల్లులు పడే హర్షధ్వానాలు విజేతలను అభినందిస్తాయి!

మీరు ఆధునిక క్రీడలకు కాదుగానీ, దాదాపు 2,000 సంవత్సరాల క్రితం కొరింథుకు దగ్గర్లో జరిగిన క్రీడలకు హాజరయ్యారు. అక్కడ, సా.శ.పూ. ఆరవ శతాబ్దం నుంచి సా.శ. నాలుగవ శతాబ్దం వరకు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి ప్రసిద్ధి చెందిన ఇస్త్‌మియన్‌ క్రీడలు జరిగేవి. చాలారోజుల వరకు ఆ పోటీలు గ్రీసులోని అందరి ఆసక్తిని ఆకట్టుకున్నాయి. ఆ ఆటలు మామూలు అథ్లెట్ల పోటీలకన్నా క్లిష్టమైనవి. అథ్లెట్లు సైనిక సంసిద్ధతకు చిహ్నంగా ఉండేవారు. విజేతలు ఆరాధ్య హీరోలయ్యేవారు, చెట్ల ఆకులతో చేసిన కిరీటాలను అందుకునేవారు. వారిపై బహుమతుల వర్షం కురిసేది, అప్పటి నుంచి జీవితాంతం వారికి ఉపకార వేతనాన్ని పెద్ద మొత్తంలో నగరం అందించేది.

అపొస్తలుడైన పౌలుకు కొరింథు నగరం దగ్గర జరిగే ఇస్త్‌మియన్‌ ఆటలు సుపరిచితమే, ఆయన క్రైస్తవ జీవిత విధానాన్ని అథ్లెట్ల పోటీతో పోల్చాడు. పరుగెత్తేవారినీ, కుస్తీ పట్టేవారినీ, బాక్సింగ్‌ చేసేవారినీ ప్రస్తావించడం ద్వారా, ఆయన మంచి శిక్షణ వల్ల, మంచి నిర్దేశిత ప్రయత్నాల వల్ల, సహనం వల్ల వచ్చే బహుమతులను గురించి తగిన విధంగానే ఉపమానీకరించాడు. నిజమే, ఆయన ఎవరి కోసమైతే వ్రాశాడో ఆ క్రైస్తవులకు కూడా ఈ ఆటల గురించి తెలుసు. వారిలో కొందరు స్టేడియంలో అరుపులు పెడబొబ్బలు పెడుతున్న జనసమూహంలో నిస్సందేహంగా ఉండి ఉంటారు. కాబట్టి వారు పౌలు ఉపమానాలను సులభంగా గ్రహించగలరు. నేడు మన సంగతేమిటి? మనం కూడా నిత్యజీవం కోసం చేసే పరుగు పందెంలో ఉన్నాం. పౌలు సూచించిన ఆ పోటీల నుంచి మనమెలా ప్రయోజనం పొందగలం?

‘నియమాల ప్రకారం పోరాడడం’

ప్రాచీన ఆటల్లో పాల్గొనడానికి సంబంధించిన ప్రవేశార్హతలు చాలా కఠినంగా ఉండేవి. ఒక అధికారి ప్రతి క్రీడాకారుడ్ని ప్రేక్షకుల ముందుకు పిలిచి ఇలా అరిచేవాడు: ‘ఏ నేరానికైనా పాల్పడ్డాడని ఈ వ్యక్తి మీద నిందారోపణచేసే వారు ఎవరైనా ఉన్నారా? ఈయన దొంగా లేక అవినీతిపరుడా, దుశ్శీలుడా, సంస్కారహీనుడా?’ ఆర్కియోలోజియా గ్రీకా అనే పుస్తకం ప్రకారం, “పేరుమోసిన నేరస్థుడ్నిగానీ అలాంటి ఏ నేరస్థునితోనైనా [సన్నిహిత] సంబంధంగల వ్యక్తినిగానీ పోటీలో ప్రవేశించడానికి అనుమతించేవారు కాదు.” అలాగే, ఆటల నియమావళిని అతిక్రమించిన వారిని పోటీలలో నుంచి తొలగించడం ద్వారా కఠినంగా శిక్షించేవారు.

“జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు” అని పౌలు చెప్పినదాన్ని అర్థంచేసుకోవడానికి ఆ వాస్తవం మనకు సహాయం చేస్తోంది. (2 తిమోతి 2:⁠5) అదే విధంగా, జీవం కోసమైన పరుగు పందెంలో పరుగెత్తాలంటే బైబిల్లో ఉన్న యెహోవా దేవుని ఉన్నత నైతిక ప్రమాణాలకు అనుగుణంగా జీవిస్తూ ఆయన కోరేవాటిని చేరుకోవాలి. అయినా బైబిలు మనల్నిలా హెచ్చరిస్తోంది: “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది.” (ఆదికాండము 8:​21) కాబట్టి, పందెంలో ఒకసారి ప్రవేశించిన తర్వాత కూడా, ఎడతెగక యెహోవా దేవుని అంగీకారాన్ని పొందుతూ, నిత్యజీవం పొందడానికి, మనం నియమావళి ప్రకారంగా పోరాడుతూ ఉండడంలో జాగ్రత్త వహించాలి.

ఆ విధంగా పోరాడేందుకు ఉన్న అత్యంత గొప్ప సహాయమేమిటంటే దేవుని పట్ల ఉన్న ప్రేమే. (మార్కు 12:​29-31) అలాంటి ప్రేమ, మనం యెహోవాను సంతోషపరచాలనీ, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలనీ కోరుకునేలా చేస్తుంది.​—⁠1 యోహాను 5:⁠3.

‘ప్రతిభారమును విడిచిపెట్టండి’

ప్రాచీన ఆటల్లో, పరుగెత్తేవారు దుస్తుల బరువుతోగానీ, ఉపకరణాల బరువుతోగానీ తమ శరీర భారాన్ని ఎక్కువ చేసుకునేవారు కాదు. “పరుగు పందాల్లో, . . . పోటీదారులు పూర్తి నగ్నంగా హాజరయ్యేవారు” అని గ్రీకుల, రోమన్ల జీవితం (ఆంగ్లం) అనే పుస్తకం చెబుతోంది. వంటిపై దుస్తుల్లేకపోవడంతో, అథ్లెట్లు చురుగ్గా తేలిగ్గా వేగంగా పరుగెత్తగలుగుతారు. వంటిపై అనవసరమైన బరువు లేకపోవడంతో శక్తి వృథా అవ్వదు. పౌలు హెబ్రీ క్రైస్తవులకు వ్రాసినప్పుడు ఆయన మనసులో బహుశా ఇదే ఉండి ఉంటుంది: “ప్రతిభారమును, . . . విడిచిపెట్టి, . . .మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.”​—⁠హెబ్రీయులు 12:⁠1.

జీవం కోసమైన పరుగు పందెంలో ఎటువంటి భారం మనలను ఆటంకపరచగలదు? ఒక భారం ఏమిటంటే అనవసరమైన వస్తుసంపదలను సమకూర్చుకోవాలనే లేక ఆడంబరమైన జీవిత విధానాన్ని కొనసాగించాలనే కోరికై ఉండవచ్చు. కొందరు భద్రత కోసం సంపదవైపు దృష్టి సారించవచ్చు లేదా దాన్ని సంతోషానికి ఒక మూలంగా భావించవచ్చు. అలాంటి అధిక “భారము,” జీవం కోసమైన పరుగుపందెంలో పరుగెత్తే ఒక వ్యక్తిని చివరకు తనకు దేవుని గురించి నిజంగా పట్టించుకోవాల్సినంత పెద్ద విషయంకాదనే స్థాయికి కుంటుపడిపోయేలా చేయవచ్చు. (లూకా 12:​16-21) నిత్యజీవమనేది సుదూరంగా ఉన్న ఒక నిరీక్షణలా అనిపించవచ్చు. ‘నూతన లోకము ఎప్పుడో వస్తుంది, కానీ ఈ మధ్యకాలంలో మనం ఈ లోకం అందించే వాటినుంచి కూడా ప్రయోజనం పొందవచ్చు’ అని ఒక వ్యక్తి వాదించవచ్చు. (1 తిమోతి 6:​17-19) అలాంటి వస్తుదాయకమైన దృక్పథం, ఒక వ్యక్తిని జీవం కోసమైన పరుగు పందెం నుంచి చాలా సులభంగా పక్కకు మళ్ళిస్తుంది లేదా ఆ పరుగు పందెం ప్రారంభించకుండానే అడ్డుపడుతుంది.

కొండమీది ప్రసంగంలో యేసు ఇలా తెలియజేశాడు: “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.” తరువాత జంతువుల అవసరాలనూ, మొక్కల అవసరాలనూ తీర్చడంలో యెహోవా చూపించే శ్రద్ధను గురించి చెప్పిన తర్వాత వాటికంటె మానవులు మరింత విలువైనవారని చెబుతూ, ఆయనిలా ఉద్బోధించాడు: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”​—⁠మత్తయి 6:​24-33.

‘ఓపికతో పరుగెత్తండి’

ప్రాచీన పరుగు పందాలన్నీ కొద్ది దూరం పరుగెత్తేవి మాత్రమే కావు. దోలిఖోస్‌ అనే ఒక పరుగు పందెం సుమారు నాలుగు కిలో మీటర్ల దూరం ఉండేది. అది శక్తి ఓపికలకొక సవాలుగా నిలిచే పరీక్షగా ఉండేది. సా.శ.పూ. 328 లో అగియాస్‌ అనే పేరుగల ఒక క్రీడాకారుడు ఈ పందెంలో గెలిచిన తరువాత, పారంపర్యాచారరీత్యా తన విజయాన్ని ప్రకటించుకునేందుకు తన సొంత నగరమైన అర్గోస్‌ వరకూ పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ రోజు ఆయన దాదాపు 110 కిలో మీటర్లు పరుగెత్తాడు!

క్రైస్తవ పందెం కూడా మన ఓపికను పరీక్షించే సుదూరమైన ఒక పరుగు పందెం. యెహోవా సమ్మతిని, నిత్యజీవపు బహుమతిని పొందాలంటే, ఈ పరుగు పందెంలో చివరి వరకు ఓపిక వహించడం అవసరం. పౌలు ఈ పందెంలో అలాగే పరుగెత్తాడు. ఆయన తన జీవితపు చరమాంకంలో ఇలా అనగలిగాడు: “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది.” (2 తిమోతి 4:​7, 8) పౌలులాగే మన పరుగును ‘కడ ముట్టించేంత వరకు’ పరుగెత్తాలి. పరుగు పందెం మొదట్లో మనం అనుకున్నదానికంటే కాస్తంత ఎక్కువ దూరం ఉండడం వల్లనే మన ఓపిక క్షీణించిపోతే, మనం బహుమానాన్ని కోల్పోతాం. (హెబ్రీయులు 11:⁠6) పరుగు పందెం ముగింపుకు అతి చేరువలో ఉన్న మనకది ఎంత విషాదకరమవుతుందో కదా!

బహుమతి

ప్రాచీన గ్రీకు అథ్లెట్ల పోటీల్లో గెలిచిన వారికి, సాధారణంగా చెట్ల ఆకులతో చేసి పూలతో అలంకరించబడిన దండలను బహూకరించేవారు. పైథియన్‌ ఆటల్లో, గెలుపొందిన వారు తమాల పత్రాలతో చేసిన కిరీటాన్ని పొందేవారు. ఇస్త్‌మియన్‌ ఆటల్లో గెలుపొందినవారికి దేవదారు వృక్షజాతికి చెందిన ఆకులతో చేసిన కిరీటాలను ఇవ్వగా, ఒలింపియన్‌ ఆటల్లో గెలుపొందిన వారికి అడవి ఆలివ్‌ చెట్టు ఆకుల కిరీటాలను బహూకరించేవారు. “పోటీలో ఉన్నవారి ఉత్సాహాన్ని పురికొల్పడానికి, పోటీ జరుగుతున్న సమయంలో వారికి పూర్తిగా కనపడేలా స్టేడియంలో ముక్కాలి పీటపైన అంటే బల్లపైన గెలుపొందేవారి బహుమతులైన కిరీటాలనూ, ఖర్జూరపు మట్టలనూ ఉంచేవారు” అని ఒక బైబిలు విద్వాంసుడు పేర్కొన్నాడు. విజయం సాధించినవానికి, కిరీటాన్ని ధరించడమంటే ఒక గొప్ప ప్రతిష్ఠకు సూచన. అతడు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు, రథంలో అతనిని విజయోత్సాహంతో నగరంలోకి తీసుకెళ్తారు.

దాన్ని మనసులో పెట్టుకుని పౌలు కొరింథు పాఠకులను ఇలా అడిగాడు: “పందెపు రంగమందు పరుగెత్తు వారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. . . . వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.” (1 కొరింథీయులు 9:​24, 25; 1 పేతురు 1:​3, 4) ఎంత వ్యత్యాసం! జీవం కోసమైన పరుగు పందెంలో చివరి వరకు పరుగెత్తేవారి కోసం వేచివున్న బహుమానం ప్రాచీన ఆటల్లోని వడలిపోయే కిరీటాల్లా కాక అది ఎప్పటికీ నశించిపోదు.

ఈ శ్రేష్ఠమైన కిరీటం గురించి అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.” (1 పేతురు 5:⁠4) క్రీస్తుతో పరలోక మహిమలో అక్షయమైన జీవితమనే బహుమానమైన అమర్త్యతతో ఈ లోకమందించే ఏ బహుమతైనా సాటిరాగలదా?

నేడు, జీవం కోసమైన పరుగు పందెంలో ఉన్న క్రైస్తవుల్లో అనేకమంది, దేవుని ఆధ్యాత్మిక కుమారులుగా ఉండేందుకు ఆయనచే అభిషేకించబడలేదు, పరలోక నిరీక్షణను కలిగిలేరు. వారు అమర్త్య జీవమనే బహుమతి కోసం పరుగెత్తడంలేదు. అయినప్పటికీ, దేవుడు సాటిలేని ఒక బహుమతిని వారిముందు కూడా పెట్టాడు. అది పరలోకరాజ్యం క్రింద పరదైసు భూమిపై పరిపూర్ణతతో కూడిన నిత్యజీవం. పరుగెత్తే క్రైస్తవుని దృష్టి ఏ బహుమతి మీదున్నా, ఆయన గొప్ప నిశ్చయంతో, అథ్లెట్ల పోటీలో పరుగెత్తేవారికంటే శక్తివంతంగా పరుగెత్తాలి. ఎందుకు? ఎందుకంటే ఆ బహుమతి ఎన్నటికీ వాడిపోదు: “నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.”​—⁠1 యోహాను 2:​25.

దేనితోనూ పోల్చలేనటువంటి బహుమానం పరుగెత్తే క్రైస్తవుని ముందు ఉండగా, ఈ లోకపు ప్రలోభాల విషయంలో ఆయనకు ఎటువంటి దృక్పథం ఉండాలి? “నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను” అని పౌలు తెలియజేసిన దృక్పథాన్నే కల్గివుండాలి. దాని ప్రకారం చూస్తే, పౌలు ఎంత పట్టుదలతో పరుగెత్తాడో! “సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు . . . బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.” (ఫిలిప్పీయులు 3:8, 13, 14) పౌలు తన దృష్టిని బహుమతిపైనే స్థిరంగా నిలిపి పరుగెత్తాడు. మనమూ అలాగే పరుగెత్తుదాం.

మన అత్యుత్తమ మాదిరి

ప్రాచీన ఆటల్లో ఛాంపియన్లను అందరూ అబ్బురంగా చూసేవారు. వారి గురించి కవులు వ్రాశారు, శిల్పులు వారి విగ్రహాలను చెక్కారు. వ్యేర ఒలీవోవా అనే చరిత్రకారుడు ఏమన్నాడంటే, వారు “ఘనతలో మునిగితేలారు, అపారమైన పేరు ప్రఖ్యాతులను పొందారు.” అంతేగాక, వారు యువతరపు ఛాంపియన్లకు ఆదర్శప్రాయులుగా కూడా ఉండేవారు.

క్రైస్తవులకు అత్యుత్తమ మాదిరిగా ఉన్న “ఛాంపియన్‌” ఎవరు? దానికి పౌలు ఇలా సమాధానమిస్తున్నాడు: “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.” (హెబ్రీయులు 12:​1, 2) అవును, నిత్యజీవం కోసమైన పరుగు పందెంలో మనం గెలుపొందాలంటే, మనకు మాదిరియైన యేసుక్రీస్తు వైపు ఏకాగ్రతతో చూడాల్సిన అవసరముంది. క్రమంగా సువార్త వృత్తాంతాలను చదవడం ద్వారా, ఆయనను అనుకరించే మార్గాలను గురించి ధ్యానించడం ద్వారా మనమిది చేయవచ్చు. యేసుక్రీస్తు దేవునికి విధేయుడిగా ఉన్నాడనీ, ఆయన సహనాన్ని చూపించడం ద్వారా తన విశ్వాసనాణ్యతను నిరూపించుకున్నాడనీ గ్రహించేందుకు మనకు అటువంటి పఠనం సహాయం చేస్తుంది. ఆయన చూపించిన సహనానికొక బహుమానంగా, ఎన్నో అద్భుతమైన ఆధిక్యతలతోపాటు యెహోవా దేవుని అంగీకారాన్ని పొందాడు.​—⁠ఫిలిప్పీయులు 2:​9-11.

నిజమే, యేసు యొక్క అత్యంత విశిష్టమైన లక్షణం ప్రేమ. “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.” (యోహాను 15:​13) మన శత్రువులను కూడా ప్రేమించమని చెప్పడం ద్వారా “ప్రేమ” అనే పదానికి ఆయన చాలా లోతైన అర్థాన్నిచ్చాడు. (మత్తయి 5:​43-48) ఎందుకంటే ఆయన తన పరలోకపు తండ్రిని ప్రేమించాడు, యేసు తన తండ్రి చిత్తాన్ని చేయడంలో ఆనందాన్ని కనుగొన్నాడు. (కీర్తన 40:⁠9, 10; సామెతలు 27:​11) యేసును మన మాదిరికర్తగానూ, జీవం కోసమైన సంక్లిష్ట పరుగు పందెంలో మన వేగనిర్దేశకునిగానూ చూడడం, మనం దేవునినీ, పొరుగువారినీ ప్రేమించేలా, మన పవిత్రమైన సేవలో నిజమైన ఆనందాన్ని కనుగొనేలా కదిలిస్తుంది. (మత్తయి 22:​37-39; యోహాను 13:​34; 1 పేతురు 2:​21) అసాధ్యమైన దాన్ని చేయమని యేసు అడగడని గుర్తుంచుకోండి. ఆయన మనకిలా హామీ ఇస్తున్నాడు: “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను . . . మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”​—⁠మత్తయి 11:​28-30.

యేసులానే మనం, అంతం వరకు సహించిన వారందరి కోసం దాచబడిన బహుమతిమీద మన దృష్టి నిలపాల్సిన అవసరముంది. (మత్తయి 24:​13) మనం నియమాల ప్రకారం పోరాడుతూ, ప్రతి భారాన్ని పక్కన పెట్టి, సహనంతో పరుగెడితే మనకు విజయం తథ్యమన్న నమ్మకాన్ని కలిగివుండవచ్చు. చేరువలో ఉన్న గమ్య స్థానం, మనలను ముందుకు రమ్మంటోంది! అది మనలో కలిగించే ఆనందం వల్ల, మన శక్తి పునరుద్ధరించబడుతుంది, ఆ ఆనందం మన ముందరున్న మార్గంలో పరిగెట్టడాన్ని సులభతరం చేస్తుంది.

[29వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ పరుగు పందెం, సుదూర పరుగు పందెం —దానికి సహనం కావాలి

[30వ పేజీలోని చిత్రం]

కిరీటాల్ని పొందిన అథ్లెట్లలా కాక, క్రైస్తవులు నశించిపోని బహుమానం కోసం ఎదురు చూడగలరు

[31వ పేజీలోని చిత్రం]

బహుమానం, చివరి వరకు సహించిన వారందరికీ దక్కుతుంది

[28వ పేజీలోని చిత్రసౌజన్యం]

Copyright British Museum