కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ ప్రేమ ఎంత మేరకు విస్తరిస్తుంది?

మీ ప్రేమ ఎంత మేరకు విస్తరిస్తుంది?

మీ ప్రేమ ఎంత మేరకు విస్తరిస్తుంది?

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలె[ను].” ​—⁠మత్తయి 22:⁠39.

1. మనం యెహోవాను ప్రేమిస్తే, మన పొరుగువారిని కూడా ఎందుకు ప్రేమించాలి?

ఆజ్ఞలలోకెల్లా ప్రధానమైనది ఏదని యేసును అడిగినప్పుడు, ఆయనిలా సమాధానమిచ్చాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే.” తర్వాత, ఆయన దానిని పోలిన ఈ రెండవ ఆజ్ఞను ఎత్తి చెప్పాడు: “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలె[ను].” (మత్తయి 22:​37, 39) అవును, పొరుగువారిపట్ల ప్రేమ క్రైస్తవత్వానికి ఒక గుర్తు. వాస్తవానికి, మనం యెహోవాను ప్రేమిస్తున్నట్లయితే మనం మన పొరుగువారిని కూడా ప్రేమించాలి. ఎందుకు? ఎందుకంటే మనం దేవుని వాక్యానికి విధేయత చూపించడం ద్వారా ఆయన పట్ల ప్రేమను ప్రదర్శిస్తాము, ఆయన వాక్యం పొరుగువారిని ప్రేమించమని మనకు ఆజ్ఞాపిస్తుంది. కాబట్టి, మనం మన సహోదర సహోదరీలను ప్రేమించకపోతే, దేవునిపట్ల మనకున్న ప్రేమ నిజమైనదై ఉండదు.​—⁠రోమీయులు 13:⁠8; 1 యోహాను 2:⁠5; 4:​20, 21.

2. మన పొరుగువారి పట్ల మనం ఏ విధమైన ప్రేమ కల్గివుండాలి?

2 మనం మన పొరుగువారిని ప్రేమించాలని యేసు చెప్పినప్పుడు, ఆయన స్నేహం చేయడంకన్నా మించినదాని గురించి మాట్లాడాడు. కుటుంబాల మధ్య లేక స్త్రీ పురుషుల మధ్య సహజంగా ఉండే ప్రేమకు భిన్నంగా ఉండే ప్రేమ గురించి ఆయన ప్రస్తావించాడు. తన సమర్పిత సేవకుల పట్ల యెహోవాకూ, యెహోవా పట్ల వారికీ ఉన్న ప్రేమ గురించే ఆయన మాట్లాడాడు. (యోహాను 17:26; 1 యోహాను 4:​11, 19) “పూర్ణ హృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణబలముతోను” దేవుడ్ని ప్రేమించాలనే విషయంలో యూదుడైన ఒక శాస్త్రి యేసుతో ఏకీభవించాడు, అతడు వివేకముగా మాట్లాడుతున్నాడని యేసు గ్రహించాడు. (మార్కు 12:​28-34) అతడన్నది సరియే. ఒక క్రైస్తవుడు దేవుని పట్లా, పొరుగువారి పట్లా పెంపొందింపజేసుకునే ప్రేమలో అతని భావోద్వేగాలు, అతని మేధ ఇమిడివుంటాయి. ఆ ప్రేమ హృదయంలో పుట్టాలి; మనస్సు దాన్ని నడిపించాలి.

3. (ఎ) తన పొరుగువాడు ఎవరనేదాని గురించి విస్తృతమైన దృక్కోణం కల్గివుండాలని యేసు ఒక ‘ధర్మశాస్త్రోపదేశకునికి’ ఎలా బోధించాడు? (బి) యేసు చెప్పిన ఉపమానం నేడు క్రైస్తవులకు ఎలా అన్వయిస్తుంది?

3 లూకా నివేదించినట్లుగా, మనం మన పొరుగువారిని ప్రేమించాలని యేసు చెప్పినప్పుడు, “నా పొరుగువాడెవడని” “ధర్మశాస్త్రోపదేశకుడొకడు” అడిగాడు. యేసు ఒక ఉపమానంతో సమాధానమిచ్చాడు. దొంగలు ఒక వ్యక్తిని కొట్టి, దోచుకుని, కొన ఊపిరితో త్రోవప్రక్కన పడేశారు. మొదట ఒక యాజకుడు, ఆ తర్వాత ఒక లేవీయుడు ఆ త్రోవన వెళ్లారు. ఇద్దరూ అతడ్ని పట్టించుకోలేదు. చివరికి, ఒక సమరయుడు వచ్చాడు, గాయాలతో పడివున్న వ్యక్తిని చూసి అతని పట్ల ఎంతో దయతో వ్యవహరించాడు. గాయపడిన ఆ వ్యక్తికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడు? జవాబు స్పష్టం. (లూకా 10:​25-37) యాజకుని కన్నా, లేవీయుని కన్నా సమరయుడు మంచి పొరుగువాడు కాగలడని యేసు చెప్పడం విని ధర్మశాస్త్రోపదేశకుడు ఆశ్చర్యపోయి ఉండవచ్చు. మరింత విస్తృతమైన విధంగా తన పొరుగువారిని ప్రేమించేందుకు యేసు ఆ వ్యక్తికి సహాయం చేస్తున్నాడని స్పష్టమౌతుంది. క్రైస్తవులు కూడా అదే విధంగా ప్రేమిస్తారు. వారు ఎవరెవరిని ప్రేమిస్తారో పరిశీలించండి.

కుటుంబంలో ప్రేమ

4. ఒక క్రైస్తవుడు మొదట ఎక్కడ ప్రేమను అలవర్చుకోవాలి?

4 క్రైస్తవులు తమ కుటుంబ సభ్యులను ప్రేమిస్తారు​—⁠భార్యలు భర్తలను ప్రేమిస్తారు, భర్తలు భార్యలను ప్రేమిస్తారు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు. (ప్రసంగి 9:9; ఎఫెసీయులు 5:33; తీతు 2:⁠3) నిజమే, సహజ ప్రేమానుబంధాలు దాదాపు అన్ని కుటుంబాల్లోనూ ఉంటాయి. అయితే, విచ్ఛిన్నమైపోయిన వివాహాలు, భార్యలపై శారీరక దౌర్జన్యం, నిర్లక్ష్యం చేయబడిన లేక దుర్‌వ్యవహారానికి గురైన పిల్లల గురించిన నివేదికలు కుటుంబం నేడు ఒత్తిడి నెదుర్కుంటోందనీ, దాన్ని ఐక్యంగా ఉంచేందుకు కేవలం సహజమైన కుటుంబ భావాలు మాత్రమే సరిపోకపోవచ్చుననీ చూపిస్తున్నాయి. (2 తిమోతి 3:​1-3) తమ కుటుంబ జీవితాన్ని నిజంగా విజయవంతం చేసుకునేందుకు, క్రైస్తవులు యెహోవా యేసులకు ఉన్నటువంటి ప్రేమను అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది.​—⁠ఎఫెసీయులు 5:21-27.

5. తమ పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులు సహాయం కోసం ఎవరివైపు చూడాలి, అనేకులకు ఎటువంటి ఫలితాలు లభించాయి?

5 క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలను యెహోవా తమకు అప్పగించిన అమూల్యమైన నిధిగా దృష్టిస్తారు, వారిని పెంచడంలో సహాయం కోసం వారు ఆయనవైపు చూస్తారు. (కీర్తన 127:3-5; సామెతలు 22:⁠6) ఈ విధంగా వారు క్రైస్తవ ప్రేమను వృద్ధి చేసుకుంటారు, యౌవనస్థులు బలికాగల కలుషితపర్చే ప్రభావాల నుండి తమ పిల్లలను కాపాడేందుకు అది వారికి సహాయం చేస్తుంది. ఫలితంగా, చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులు నెదర్లాండ్స్‌లోని ఒక తల్లి అనుభవించిన లాంటి ఆనందాన్నే అనుభవించారు. గత సంవత్సరం నెదర్లాండ్స్‌లో బాప్తిస్మం తీసుకున్న 575 మందిలో ఒకడిగా తన కుమారుడు బాప్తిస్మం తీసుకోవడాన్ని చూసిన తర్వాత ఆమె ఈ క్రింది విధంగా వ్రాసింది: “ఈ క్షణంలో, గత ఇరవై యేళ్ల నా పెట్టుబడికి ఫలితం లభించింది. నేను వెచ్చించిన సమయం, శక్తి, అలాగే నేను అనుభవించిన బాధ, చేసిన కృషి, పడిన వేదన అన్నీ ఇప్పుడిక జ్ఞాపకంలేవు.” తన కుమారుడు తనకు తానుగా యెహోవా సేవ చేయాలని ఎంపిక చేసుకున్నందుకు ఆమె ఎంతగా ఆనందిస్తుందో కదా. నెదర్లాండులో గత సంవత్సరం నివేదించిన శిఖరాగ్ర సంఖ్యయైన 31,089 మంది ప్రచారకుల్లో అనేకులు, యెహోవాను ప్రేమించడాన్ని తమ తల్లిదండ్రుల నుండి నేర్చుకున్నవారే.

6. వివాహ బంధాన్ని బలపరిచేందుకు క్రైస్తవ ప్రేమ ఎలా సహాయం చేయగలదు?

6 ప్రేమ “పరిపూర్ణతకు అనుబంధమైన”దని పౌలు అన్నాడు, కల్లోలభరితమైన సమయాల్లో కూడా అది వివాహ బంధాన్ని కాపాడగలదు. (కొలొస్సయులు 3:14, 18, 19; 1 పేతురు 3:​1-7) తహితికి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీపమైన రురుటులో ఒక వ్యక్తి యెహోవాసాక్షులతో బైబిలు చదవడం ప్రారంభించినప్పుడు, ఆయన భార్య తీవ్రంగా వ్యతిరేకించింది. చివరికి, ఆమె పిల్లలను తీసుకుని ఆయనను విడిచి వెళ్లి తహితిలో నివసించడం మొదలుపెట్టింది. క్రమంగా వాళ్లకు డబ్బు పంపడం ద్వారా అలాగే ఆమెకు గానీ పిల్లలకు గానీ ఏదైనా అవసరం ఉందా అని తెలుసుకునేందుకు ఫోన్‌ చేయడం ద్వారా ఆయన తన ప్రేమను చూపించాడు. అలా ఆయన తన క్రైస్తవ బాధ్యతలను నెరవేర్చడానికి తనకు సాధ్యమైనదంతా చేశాడు. (1 తిమోతి 5:⁠8) తన కుటుంబం తిరిగి కలుసుకోవాలని ఆయన విడువక ప్రార్థన చేశాడు, చివరికి ఆయన భార్య తిరిగి వచ్చింది. ఆమె తిరిగి వచ్చినప్పుడు, ఆయన ఆమెపట్ల “ప్రేమను ఓర్పును సాత్వికమును” చూపించాడు. (1 తిమోతి 6:​11) ఆయన 1998 లో బాప్తిస్మం తీసుకున్నాడు, తన భార్య బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించినప్పుడు ఆయన ఎంతగానో ఉప్పొంగిపోయాడు. తహితి బ్రాంచి క్రిందనున్న ప్రాంతంలో గత సంవత్సరంలో నిర్వహించబడిన 1,351 పఠనాల్లో అది ఒకటి.

7. జర్మనీలోని ఒక వ్యక్తి చెప్తున్న దాని ప్రకారం, ఆయన వివాహాన్ని ఏది బలపర్చింది?

7 జర్మనీలో ఒక వ్యక్తి బైబిలు సత్యమందు తన భార్యకున్న ఆసక్తినిబట్టి వ్యతిరేకించాడు; యెహోవాసాక్షులు ఆమెను మోసగించాలని చూస్తున్నారనే ముగింపుకు వచ్చాడు. అయితే తర్వాత ఆయన తన భార్యను మొదట కలిసిన వ్యక్తికి ఇలా వ్రాశాడు: “నా భార్యను యెహోవాసాక్షులకు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. మొదట్లో నేను చాలా కలవరపడ్డాను ఎందుకంటే నేను వారి గురించి చాలా ప్రతికూలమైన విషయాలు విన్నాను. కానీ ఇప్పుడు, నా భార్యతో కలిసి కూటాలకు హాజరైన తర్వాత, నేనెంత పొరబడ్డానో గ్రహిస్తున్నాను. నేను సత్యం వింటున్నానని నాకు తెలుసు, అది మా వివాహాన్ని మరింత బలపర్చింది.” తహితి బ్రాంచి క్రిందనున్న ద్వీపాల్లోని 1,773 మందితో సహా జర్మనీలో ఉన్న 1,62,932 మంది యెహోవాసాక్షుల్లో, దైవిక ప్రేమలో ఐక్యమైయున్న అనేక కుటుంబాలు ఉన్నాయి.

మన క్రైస్తవ సహోదరుల పట్ల ప్రేమ

8, 9. (ఎ) మన సహోదరులను ప్రేమించడం మనకు ఎవరు నేర్పిస్తారు, ప్రేమ ఏమి చేయడానికి మనల్ని పురికొల్పుతుంది? (బి) సహోదరులు పరస్పరం సహకరించుకోవడానికి ప్రేమ ఎలా సహాయం చేయగలదో చూపించే ఉదాహరణను చెప్పండి.

8 థెస్సలోనీకలోని క్రైస్తవులకు పౌలు ఇలా చెప్పాడు: “మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.” (1 థెస్సలొనీకయులు 4:⁠9) అవును, “యెహోవాచేత ఉపదేశము” నొందినవారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. (యెషయా 54:​13) “ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి” అని చెప్పినప్పుడు పౌలు చూపించినట్లుగా, వారి ప్రేమ క్రియల్లో వ్యక్తపర్చబడుతుంది. (గలతీయులు 5:13; 1 యోహాను 3:​18) ఉదాహరణకు, వారు అనారోగ్యంతో ఉన్న తమ సహోదర సహోదరీలను దర్శించి, కలత చెందినవారిని ప్రోత్సహించి, బలహీనులకు మద్దతునిచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. (1 థెస్సలొనీకయులు 5:​14) మన నిజమైన క్రైస్తవ ప్రేమ మన ఆధ్యాత్మిక పరదైసు పురోభివృద్ధికి దోహదపడుతుంది.

9 ఈక్వెడార్‌లో ఉన్న 544 సంఘాల్లో ఒకటైన ఆన్కోన్‌ సంఘంలో, సహోదరులు తమ ప్రేమను ఆచరణాత్మకమైన విధంగా చూపించారు. ఒక ఆర్థిక సంక్షోభం వల్ల వారికి పనీ, డబ్బూ లేకుండా పోయాయి, కాబట్టి స్థానిక జాలరులు రాత్రంతా చేపలు పట్టి ఉదయాన్నే ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారికి ఆహారాన్ని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించుకోవాలని ప్రచారకులు నిర్ణయించుకున్నారు. పిల్లలతో సహా అందరూ సహకరించారు. జాలరులు తిరిగి వచ్చే సమయానికి అంటే ఉదయం నాలుగు గంటలకల్లా భోజనం సిద్ధంగా ఉంచేందుకు వాళ్లు రాత్రి ఒంటిగంటకే పని ప్రారంభించాలి. అలా సంపాదించుకున్న డబ్బును సహోదరులు తమ అవసరాలకు అనుగుణ్యంగా పంచుకునేవారు. అలాంటి పరస్పర సహాయం నిజమైన క్రైస్తవ ప్రేమను ప్రదర్శించింది.

10, 11. మనకు వ్యక్తిగతంగా తెలియని సహోదరుల పట్ల మనం ప్రేమను ఎలా చూపించవచ్చు?

10 అయితే మన ప్రేమ మనకు వ్యక్తిగతంగా తెలిసిన వారికి మాత్రం పరిమితం కాదు. “యావత్‌ సహోదర సహవాసం పట్లా ప్రేమను కల్గివుండండి” అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (1 పేతురు 2:​17, NW) మన సహోదర సహోదరీలందరూ యెహోవా దేవుని తోటి ఆరాధకులు గనుక మనం వారిని ప్రేమిస్తాము. క్లిష్టసమయాలు ఈ ప్రేమను ప్రదర్శించడానికి ఒక అవకాశాన్ని అందజేస్తాయి. ఉదాహరణకు, 2000 సేవా సంవత్సరంలో, తీవ్రమైన వరదలు మొజాంబిక్‌ను ముంచెత్తాయి, అంగోలాలో ఎడతెగని ప్రచ్ఛన్న యుద్ధం మూలంగా అనేకులు నిరుపేదలయ్యారు. మొజాంబిక్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న 31,725 మంది సహోదరులు, అంగోలాలో ఉన్న 41,222 మంది సహోదరులు ఈ సంఘటనలను బట్టి ప్రభావితమయ్యారు. కాబట్టి, పొరుగునున్న దక్షిణాఫ్రికాలోని సాక్షులు ఆ ప్రాంతాల్లో ఉన్న తమ సహోదరుల పరిస్థితి తీవ్రతను తగ్గించడానికి పెద్ద మొత్తంలో అవసరమైన వస్తువులను పంపించారు. తమ “సమృద్ధి”లో నుంచి అవసరంలో ఉన్న తమ సహోదరులకు విరాళంగా ఇవ్వాలనే వారి సుముఖత వారికున్న ప్రేమను చూపించింది.​—⁠2 కొరింథీయులు 8:8, 13-15, 24.

11 చాలా దేశాల్లోని సహోదరులు బీద దేశాల్లో రాజ్యమందిరాలను, సమావేశ హాళ్లను నిర్మించడానికి విరాళాలు ఇచ్చినప్పుడు కూడా అందులో ప్రేమ కనబడుతోంది. ఒక ఉదాహరణ సాలమన్‌ దీవులు. ఎంతో అల్లకల్లోలం ఉన్నప్పటికీ, సాలమన్‌ దీవులు గత సంవత్సరంలో 1,697 శిఖరాగ్ర సంఖ్యతో, 6 శాతం పెరుగుదలను చవిచూశాయి. వాళ్లకు ఒక సమావేశ హాలు అవసరమైంది. చాలామంది ద్వీప వాసులు దేశాన్ని వదిలి పోతున్నప్పటికీ, హాలు నిర్మాణంలో సహాయం చేసేందుకు ఆస్ట్రేలియా నుండి స్వచ్ఛంద సేవకులు వచ్చారు. చివరికి, స్వచ్ఛంద సేవకులు విడిచి వెళ్లాల్సి వచ్చింది, అయితే వెళ్లే ముందు వారు పునాదులు వేయడాన్ని పూర్తిచేసేలా స్థానిక సహోదరులకు నేర్పించారు. చుట్టు ప్రక్కల అర్థాంతరంగా నిర్మాణంలో నిలిచిపోయిన భవనాలుండగా అదే సమయంలో, ముందే రూపొందించబడి సిద్ధంగా ఉన్న హాలు యొక్క స్టీలు స్ట్రక్చర్‌ను ఆస్ట్రేలియా నుండి తెప్పించి ఆరాధన కోసమైన ఈ చక్కని భవన నిర్మాణాన్ని ముగించడం యెహోవా నామానికీ సహోదరుల ప్రేమకూ ఒక చక్కని సాక్ష్యమయ్యింది.

దేవుని వలే మనం లోకమును ప్రేమిస్తాము

12. మన వంటి విశ్వాసం కల్గిలేని వారిపట్ల మన దృక్పథం విషయంలో యెహోవాను మనమెలా అనుకరించగలము?

12 మన ప్రేమ మన కుటుంబానికీ, మన సహోదరత్వానికే పరిమితమై ఉందా? కాదు, మనం “దేవునిపోలి నడుచు”కునే వారమైతే అలా పరిమితమవ్వదు. యేసు ఇలా అన్నాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (ఎఫెసీయులు 5:1; యోహాను 3:​16) యెహోవా దేవుడు వ్యవహరించినట్లుగానే మనం మన విశ్వాసంలో లేని వారితో సహా అందరిపట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తాము. (లూకా 6:35, 36; గలతీయులు 6:​10) ప్రాముఖ్యంగా ఈ విషయంలో, మనం రాజ్య సువార్తను ప్రకటిస్తాము, దేవుడు వారి కోసం చేపట్టిన గొప్ప ప్రేమపూర్వక చర్య గురించి ఇతరులకు చెప్తాము. ఇది వినే వారెవరికైనా రక్షణను తెస్తుంది.​—⁠మార్కు 13:10; 1 తిమోతి 4:⁠16.

13, 14. వ్యక్తిగతంగా ఎంతో అసౌకర్యాన్ని అనుభవిస్తూ కూడా సాక్షులు కాని వారిపట్ల ప్రేమ చూపించిన సహోదరులకు ఎదురైన కొన్ని అనుభవాలు ఏవి?

13 నేపాల్‌లోని నలుగురు ప్రత్యేక పయినీర్‌ పరిచారకులను పరిశీలించండి. వారు ఆ దేశంలోని నైరుతి దిశలో ఉన్న ఒక నగరానికి నియమించబడ్డారు, ఆ నగరంలోనూ పరిసర గ్రామాల్లోనూ గత ఐదు సంవత్సరాలుగా సహనంతో సాక్ష్యమివ్వడం ద్వారా వారు తమ ప్రేమను చూపించారు. ఆ ప్రాంతాన్ని పూర్తి చేయడానికి గానూ వారు తరచూ 40 కన్నా ఎక్కువ డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో ఎన్నో గంటలపాటు సైకిళ్ల మీద ప్రయాణించేవారు. వారి ప్రేమా, “సత్‌ క్రియను ఓపికగా” చేయడమూ, అక్కడి గ్రామాల్లో ఒకదానిలో ఒక పుస్తక పఠన గుంపు ఏర్పడినప్పుడు చక్కని ఫలితాలను తీసుకువచ్చాయి. (రోమీయులు 2:⁠7) ప్రయాణ పై విచారణకర్త ఇస్తున్న బహిరంగ ప్రసంగాన్ని వినడానికి 2000 మార్చిలో, 32 మంది వచ్చారు. గత సంవత్సరం నేపాల్‌లో ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య 430, అది 9 శాతం పెరుగుదల. ఆ ప్రాంతంలోని సహోదరుల ఆసక్తినీ, ప్రేమనూ యెహోవా స్పష్టంగా ఆశీర్వదిస్తున్నాడు.

14 కొలంబియాలో తాత్కాలిక ప్రత్యేక పయినీర్లు వైయూ ఇండియన్‌ల మధ్య ప్రకటించడానికి వెళ్లారు. అలా చేసేందుకు, వారు ఒక క్రొత్త భాషను నేర్చుకోవలసి వచ్చింది, కానీ భారీ వర్షం కురుస్తున్నా 27 మంది బహిరంగ ప్రసంగానికి హాజరైనప్పుడు వారి ప్రేమపూర్వక ఆసక్తికి తగిన ప్రతిఫలం లభించింది. ఈ పయినీర్లు చూపించినటువంటి ప్రేమపూర్వకమైన ఆసక్తి కొలంబియాలో 5 శాతం అభివృద్ధికి, ప్రచారకుల 1,07,613 శిఖరాగ్ర సంఖ్యను చేరుకోవడానికి దోహదపడింది. డెన్మార్క్‌లో ఒక వృద్ధ సహోదరి ఇతరులతో సువార్త పంచుకోవాలని కోరుకుంది, కానీ ఆమె అశక్తురాలు. అయినప్పటికీ వెనుక తీయక ఆమె ఆసక్తిగల వారికి ఉత్తరాలు వ్రాయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆమె 42 మందితో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ, 11 బైబిలు పఠనాలు నిర్వహిస్తోంది. గత సంవత్సరం డెన్మార్క్‌లో నివేదించిన శిఖరాగ్ర సంఖ్యయైన 14,885 మంది ప్రచారకుల్లో ఆమె ఒకరు.

మీ శత్రువులను ప్రేమించండి

15, 16. (ఎ) మన ప్రేమ ఎంత మేరకు విస్తృతమై ఉండాలని యేసు చెప్పాడు? (బి) యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా తప్పుడు నిందలు వేసిన ఒక వ్యక్తితో బాధ్యతగల సహోదరులు ప్రేమపూర్వకమైన విధంగా ఎలా వ్యవహరించారు?

15 సమరయుడ్ని పొరుగువానిగా దృష్టించవచ్చునని యేసు ధర్మశాస్త్రోపదేశకునికి చెప్పాడు. తాను కొండమీద ఇచ్చిన ప్రసంగంలో, “నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి” అని చెప్పినప్పుడు యేసు మరింత ముందుకు వెళ్లాడు. (మత్తయి 5:​43-45) ఎవరైనా మనల్ని వ్యతిరేకిస్తే, మనం “మేలు చేత కీడును జయించ”టానికి ప్రయత్నిస్తాము. (రోమీయులు 12:​19-21) సాధ్యమైతే, మనకు అత్యంత అమూల్యమైన సొత్తు అయిన సత్యాన్ని మనం వారితో పంచుకుంటాము.

16 యుక్రేయిన్‌లో, క్రెమెన్‌చుక్‌ హెరాల్డ్‌ అనే వార్తాపత్రికలోని ఒక ఆర్టికల్‌ యెహోవాసాక్షులు ఒక ప్రమాదకరమైన తెగ అన్నట్లు మాట్లాడింది. ఇది చాలా గంభీరమైన విషయం ఎందుకంటే సాక్షుల కార్యకలాపాలను అరికట్టాలని లేక నిషేధించాలని ప్రజలను ఒప్పించేందుకు యూరప్‌లో కొంతమంది యెహోవాసాక్షుల గురించి ఇలా మాట్లాడతారు. కాబట్టి, ఆ పత్రిక ఎడిటర్‌ను సమీపించి, ఆ ఆర్టికల్‌ను సరిచేస్తూ ఒక ప్రెస్‌ రిలీజ్‌ను ప్రచురించమని అడగడం జరిగింది. ఆయన దానికి అంగీకరించాడు, గానీ ఆ రిలీజ్‌తో పాటు, ఆయన ఆ మొదటి ఆర్టికల్‌ వాస్తవాలపై ఆధారపడినదని ఒక వ్యాఖ్యానాన్ని కూడా ముద్రించాడు. కాబట్టి బాధ్యతగల సహోదరులు మరింత సమాచారంతో ఆయన దగ్గరికి మళ్లీ వెళ్లారు. ఆ మొదటి ఆర్టికల్‌ తప్పని చివరికి ఆ ఎడిటర్‌ గుర్తించి, ఉపసంహరించుకుంటూ ఒక లేఖను ప్రచురించాడు. ఆయనతో సూటిగా, దయగా వ్యవహరించడం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకైన ఒక ప్రేమపూర్వక విధానం; అది మంచి ఫలితాలను తెచ్చింది.

మనం ప్రేమను ఎలా అలవర్చుకోవచ్చు?

17. ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరించడం ఎల్లప్పుడూ అంత సులభం కాకపోవచ్చునని ఏది సూచిస్తుంది?

17 ఒక బిడ్డ జన్మించినప్పుడు, తల్లిదండ్రులు ఆ బిడ్డ పుట్టడంతోనే ఎంతగానో ప్రేమిస్తారు. అయితే పెద్దవారితో అలా ప్రేమపూర్వకంగా వ్యవహరించడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. బహుశా అందుకే కావచ్చు బైబిలు మనకు ఒకరినొకరు ప్రేమించుకోవాలని పదే పదే చెప్తుంది, అది వృద్ధి చేసుకోవడానికి మనం కృషి చేయాలి. (1 పేతురు 1:⁠22; 4:⁠8; 1 యోహాను 3:​11) మనం మన సహోదరుడ్ని “డెబ్బది ఏళ్ల మారులమట్టు”కు క్షమించాలని యేసు చెప్పినప్పుడు మన ప్రేమ పరీక్షించబడుతుందని ఆయనకు తెలుసు. (మత్తయి 18:​21, 22) పౌలు కూడా “ఒకని నొకడు సహించుచు” అని ఉద్బోధించాడు. (కొలొస్సయులు 3:​12, 13) “ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి” అని మనకు చెప్పబడిందంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. (1 కొరింథీయులు 14:⁠1) దీన్ని మనమెలా చేయగలం?

18. ఇతరుల పట్ల ప్రేమను వృద్ధి చేసుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

18 మొదటిగా, మనం ఎల్లప్పుడూ యెహోవా దేవుని పట్ల మనకున్న ప్రేమను మనస్సులో ఉంచుకోవాలి. మన పొరుగువారిని ప్రేమించటానికి ఇది ఒక బలమైన ప్రేరకం. ఎందుకు? ఎందుకంటే మనం అలా చేసినప్పుడు, అది మన పరలోక తండ్రికి మంచి పేరును, ఆయనకు ఘనతను, స్తుతిని తెస్తుంది. (యోహాను 15:8-10; ఫిలిప్పీయులు 1:​9-11) రెండవదిగా మనం విషయాలను యెహోవా చూసినట్లుగా చూడగల్గుతాము. మనం పాపం చేసిన ప్రతిసారి, యెహోవా ఎదుట పాపం చేస్తాము; అయినప్పటికీ, ఆయన మనల్ని పదే పదే క్షమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. (కీర్తన 86:⁠5; 103:​2, 3; 1 యోహాను 1:⁠9; 4:​18) మనం యెహోవా దృక్కోణాన్ని అలవర్చుకుంటే, ఇతరుల్ని ప్రేమించగల్గుతాము, వారు మన పట్ల చేసిన తప్పిదములను క్షమించగల్గుతాము. (మత్తయి 6:​12) మూడవదిగా, ఇతరులు మనతో ఎలా వ్యవహరించాలని మనం కోరుకుంటామో అలా మనం ఇతరులతో వ్యవహరించగల్గుతాము. (మత్తయి 7:​12) మనం అపరిపూర్ణులం గనుక, మనకు తరచూ క్షమాపణ అవసరం. ఉదాహరణకు, మనం నోటి ద్వారా ఇతరులకు బాధ కల్గించినప్పుడు, ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి తమ నాలుకతో పాపం చేస్తారన్న విషయాన్ని వాళ్లు కూడా గుర్తుంచుకుంటారని మనం ఆశిద్దాం. (యాకోబు 3:⁠2) ఇతరులు మనతో ప్రేమపూర్వకంగా వ్యవహరించాలని మనం కోరుకుంటే, మనం వారితో ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి.

19. ప్రేమను వృద్ధి చేసుకోవడంలో మనం పరిశుద్ధాత్మ సహాయాన్ని ఎలా పొందవచ్చు?

19 నాలుగవదిగా, ఆత్మఫలాల్లో ఒకటి ప్రేమ గనుక మనం పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరవచ్చు. (గలతీయులు 5:​22, 23) స్నేహాలు, కుటుంబ భావాలు, అనురాగపూరితమైన ప్రేమ ఇవన్నీ తరచూ స్వాభావికంగానే వస్తాయి. అయితే యెహోవాకున్నటువంటి ప్రేమను, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను వృద్ధి చేసుకోవడానికి మనకు యెహోవా ఆత్మ సహాయం అవసరం. ప్రేరేపిత బైబిలును చదవడం ద్వారా మనం పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరవచ్చు. ఉదాహరణకు, మనం యేసు జీవితాన్ని అధ్యయనం చేస్తే, ఆయన ప్రజలతో ఎలా వ్యవహరించాడో చూస్తాము, మనం ఆయనను అనుకరించడాన్ని నేర్చుకోవచ్చు. (యోహాను 13:​34, 35; 15:​12) అంతేగాక, ప్రేమపూర్వకంగా వ్యవహరించడం మనకు కష్టమైపోయేలాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ కోసం మనం యెహోవాను కోరవచ్చు. (లూకా 11:​13) చివరిగా, మనం క్రైస్తవ సంఘానికి సన్నిహితంగా ఉండడం ద్వారా ప్రేమను వెంబడించవచ్చు. ప్రేమగల సహోదర సహోదరీలతో ఉండడం ప్రేమను వృద్ధి చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.​—⁠సామెతలు 13:⁠20.

20, 21. యెహోవాసాక్షులు 2000 సేవా సంవత్సరంలో ప్రేమను ఎంత విశేషమైన విధంగా ప్రదర్శించారు?

20 గత సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య 60,35,564. సువార్త గురించి ఇతరులకు చెప్పడానికి యెహోవాసాక్షులు మొత్తం 117,12,70,425 గంటలు వెచ్చించారు. వారు ఈ పనిని నిర్వర్తిస్తుండగా ఎండనూ, వాననూ, చలినీ తట్టుకునేలా వారికి సహాయం చేసింది ప్రేమే. తోటి విద్యార్థులతోనూ, తోటి పనివారితోనూ మాట్లాడడానికీ, వీధుల్లోనూ ఇతర స్థలాల్లోనూ తాము బొత్తిగా క్రొత్త వారితో మాట్లాడడానికీ వారిని పురికొల్పింది కూడా అదే ప్రేమ. సాక్షులు ఎవరినైతే కలిశారో వారిలో చాలామంది ఉదాసీనంగా ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించారు. అయితే కొంతమంది ఆసక్తి చూపించారు, అందుకే 43,34,54,049 పునర్దర్శనాలు చేయబడ్డాయి, 47,66,631 బైబిలు పఠనాలు నిర్వహించబడ్డాయి. *

21 యెహోవాసాక్షులకు తమ దేవుని పట్ల, తమ పొరుగువారి పట్ల గల ప్రేమను ఇదంతా ఎంత చక్కగా ప్రదర్శించిందో కదా! ఆ ప్రేమ ఎన్నడూ చల్లబడిపోదు. మానవజాతికి మరింత గొప్పగా సాక్ష్యం ఇవ్వడాన్ని 2001 సేవా సంవత్సరం చూస్తుందని మేము నిశ్చయత కల్గివున్నాము. ‘తమ కార్యకలాపాలు ప్రేమతో జరిగించేందుకు’ యథార్థవంతులూ ఆసక్తిపరులూ అయిన యెహోవా సేవకులు కృషి చేస్తుండగా ఆయన ఆశీర్వాదం వారికి లభిస్తూనే ఉండును గాక!​—⁠1 కొరింథీయులు 16:⁠14.

[అధస్సూచి]

^ పేరా 20 2000 సేవా సంవత్సర రిపోర్టు పూర్తి వివరాల కోసం, 18-21 పేజీల్లో ఉన్న చార్ట్‌ని చూడండి.

మీరు వివరించగలరా?

• మనం మన పొరుగువారిని ప్రేమించినప్పుడు మనం ఎవరిని అనుకరిస్తాము?

• మన ప్రేమ ఎంత విస్తృతమైనదై ఉండాలి?

• క్రైస్తవ ప్రేమను చూపించే కొన్ని అనుభవాలు ఏవి?

• మనం క్రైస్తవ ప్రేమను ఎలా పెంపొందింపజేసుకోగలము?

[అధ్యయన ప్రశ్నలు]

[18-21వ పేజీలోని చార్టు]

ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2000 సేవా సంవత్సరపు నివేదిక

(బౌండ్‌ వాల్యూమ్‌ చూడండి)

[15వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవ ప్రేమ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచగలదు

[17వ పేజీలోని చిత్రాలు]

మన నిరీక్షణను ఇతరులతో పంచుకోవడానికి ప్రేమ మనల్ని కదిలిస్తుంది