యుద్ధ గాయాలు
యుద్ధ గాయాలు
“యుద్ధంలో గెలుపొందేవారుండరు, నష్టపోయేవాళ్లు మాత్రమే ఉంటారు” అని రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన ఒక మాజీ సైనికుడు వ్యాఖ్యానించాడు. అతనితో అనేకమంది ఏకీభవిస్తారు. యుద్ధం వల్ల వాటిల్లే నష్టం ఘోరంగా ఉంటుంది; అటు గెలిచినవారూ ఇటు ఓడిపోయినవారూ ఇరు పక్షాలూ భయంకరమైన మూల్యాన్ని చెల్లిస్తాయి. ఒక ఆయుధ పోరాటం ముగిసిన తర్వాత కూడా, కోట్లాదిమంది భయంకరమైన యుద్ధ గాయాలతో బాధపడుతున్నారు.
ఎటువంటి గాయాలు? యుద్ధం జనాభాలో పదవవంతు నాశనమయ్యేలా చేయగలదు. అనేకమందిని అనాధలుగానూ, విధవరాండ్రగానూ మారుస్తుంది. యుద్ధంలో నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారిలో అనేకులు, భయంకరమైన గాయాలతోనూ అలాగే మానసిక గాయాలతోనూ బ్రతుకును వెళ్లబుచ్చాల్సిందే. కోట్లాదిమంది దిక్కులేనివారు కావచ్చు లేదా బలవంతంగా శరణార్థులవ్వవచ్చు. అలాంటి యుద్ధాల్లోంచి ప్రాణాలతో బయటపడ్డవారి హృదయాల్లో మెదిలే దుఃఖద్వేషాలను మనం ఊహించగలమా?
విషపూరితమవుతున్న గాయాలు
యుద్ధం నిలిచిపోయి, తుపాకులు మూగబోయి, సైనికులు ఇళ్ళకు తరలి వెళ్ళినా, ప్రజల హృదయాలపై యుద్ధం చేసిన గాయాలు మాత్రం కాలంతోపాటు విషపూరితమౌతూనే ఉన్నాయి. భావి తరాలు ఒకరిపట్ల ఒకరు తీవ్రాతి తీవ్రమైన విద్వేషాన్ని పెంచుకోవచ్చు. ఆ విధంగా ఒక యుద్ధం చేసిన గాయాలు మరో యుద్ధానికి పునాది కావచ్చు.
ఉదాహరణకు, మొదటి ప్రపంచ యుద్ధాన్ని లాంఛనప్రాయంగా నిలిపివేసేందుకు 1919 లో సంతకం చేసిన వర్సైలిస్ శాంతి ఒప్పందం, జర్మనీపై షరతులను విధించింది, అవి కఠినమైనవనీ, ప్రతీకారపూర్వకమైనవనీ జర్మను పౌరులు పరిగణించారు. ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, ఆ ఒప్పందంలోని షరతులు “జర్మన్లలో ఆగ్రహం పెల్లుబకడానికి కారణమయ్యాయి, పగతీర్చుకోవడానికి మార్గాన్ని వెతకడాన్ని ప్రేరేపించేలా దోహదపడ్డాయి.” కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి, “శాంతి ఒప్పందపు ఆ ఆగ్రహమే హిట్లర్‌కు ఒక ఆధారాన్నిచ్చింది,” రెండవ ప్రపంచ యుద్ధానికి నడిపించిన కారకాల్లో ఒకటైంది.
పోలాండ్‌లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధం బాల్కన్ రాష్ట్రాల దాకా వ్యాపించింది. బాల్కన్ రాష్ట్రాల్లోని ఆ యా జాతుల ప్రజలు 1940లలో ఒకరిపై ఒకరు చేసుకున్న యుద్ధ గాయాలు, 1990లలో ఆ రాష్ట్రాల్లో యుద్ధానికి నడిపించాయి. “విద్వేష ప్రతీకారేచ్ఛల విషవలయం సుడిగాలిలా మారి, మన కాలం వరకూ కొనసాగుతూనే ఉంది” అని జర్మన్ దిన పత్రిక దీత్సైత్ వ్యాఖ్యానించింది.
మానవజాతి శాంతియుత వాతావరణంలో జీవించాలంటే, యుద్ధ గాయాలు తప్పకుండా మానిపోవాలి. అవెలా మానగలవు? దుఃఖద్వేషాలను తుడిచివేయడానికి ఏం చేయాలి? యుద్ధ గాయాలను ఎవరు మాన్పగలరు?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
COVER: Fatmir Boshnjaku
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
U.S. Coast Guard photo; UN PHOTO 158297/J. Isaac