కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శాంతి నూతన సహస్రాబ్ది కోసమా?

శాంతి నూతన సహస్రాబ్ది కోసమా?

శాంతి నూతన సహస్రాబ్ది కోసమా?

శాంతి సంస్కృతి కోసం ఉద్దేశించబడిన అంతర్జాతీయ సంవత్సరాన్ని, 1999, సెప్టెంబరు 14వ తారీఖున పారిస్‌, న్యూయార్క్‌ నగరాల్లో లాంఛనప్రాయంగా ప్రారంభించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ దాన్ని 2000వ సంవత్సరం కోసం ప్రకటించింది. ఆ సందర్భంలో యునెస్కో మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఫెడెరికొ మేయర్‌, “శాంతి సంస్కృతి, అహింసల కోసమైన ఒక భౌగోళికోద్యమాన్ని సృష్టించేందుకు” ఒక ఆలోచనాపూర్వక విజ్ఞప్తిని చేశారు.

“యుద్ధాలు మానవ మనస్సు నుంచే ప్రారంభమయ్యాయి గనుక, శాంతి సంరక్షణ మానవ మనస్సులోనే నిర్మించబడి ఉండాలి” అనే సూక్తి యునెస్కో దగ్గరవుంది. ఆ సూక్తికి అనుగుణంగానే, ఈ సంస్థ, “విద్య, భావ వినిమయం, పరస్పర సహకారం” వంటివాటి ద్వారా శాంతి సంస్కృతిని పెంపొందించాలని సంకల్పిస్తోంది. “శాంతంగా ఉండడం, యుద్ధ వ్యతిరేకులుగా ఉండడం మాత్రమే సరిపోదుగానీ సమాధానకర్తలుగా ఉండాలి” అని మేయర్‌గారు వ్యాఖ్యానించారు.

విషాదకరంగా, 2000వ సంవత్సరం శాంతికి చాలా దూరంగా ఉండిపోయింది. యథార్థంగా కృషిచేసినప్పటికీ యుద్ధం, దౌర్జన్యం వంటి వాటిని అరికట్టడంలో విఫలుడైన మానవుని అసమర్థతను 2000వ సంవత్సరంలో జరిగిన సంఘటనలతోపాటు ఆధునిక చరిత్ర నొక్కి చెప్పింది.

అయితే, శాంతిని విద్యతో ముడిపెట్టడం గుర్తించదగిన విషయం. దాదాపు 2,700 సంవత్సరాల క్రితం ప్రవక్తయైన యెషయా ఇలా ప్రవచించాడు: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.” (యెషయా 54:⁠13) (ఇటాలిక్కులు మావి) అదే ప్రవక్త, అన్ని దేశాల ప్రజలు యెహోవా దేవుని మార్గాలను తెలుసుకోవడానికి ఆయన స్వచ్ఛారాధన వైపుకు ప్రవాహంలా వచ్చే ఒక సమయాన్ని ముందే చూశాడు. ఎటువంటి ఫలితంతో? “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.” (యెషయా 2:​2-4) (ఇటాలిక్కులు మావి) ఆ ప్రవచనానికి అనుగుణంగానే, అనేక యుద్ధాలకు మూల కారణాలైన జాతీయవాదాలను, జాతిపర ద్వేషాలను అధిగమించడంలో ఇప్పటికే లక్షలాది మందికి సహాయం చేసిన ప్రపంచవ్యాప్త విద్యాపనిలో యెహోవాసాక్షులు నిమగ్నమైవున్నారు.

చివరికి దేవుని రాజ్యం క్రింద ఇంకెన్నటికీ యుద్ధాలుండవు. ఆ రాజ్యం ఈ భూమికి శాశ్వతమైన శాంతి భద్రతలను తీసుకువస్తుంది. (కీర్తన 72:⁠7; దానియేలు 2:​44) అప్పుడు, “యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.” అన్న కీర్తనల రచయిత మాటలు నెరవేరతాయి.​—⁠కీర్తన 46:⁠8, 9.