కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శ్రమలున్నప్పటికీ పూర్ణ మనస్సుతో సేవ చేయడం

శ్రమలున్నప్పటికీ పూర్ణ మనస్సుతో సేవ చేయడం

జీవిత కథ

శ్రమలున్నప్పటికీ పూర్ణ మనస్సుతో సేవ చేయడం

రొడల్ఫొ లొసానొ చెప్పినది

మెక్సికోలోని, దురాంగొ రాష్ట్రంలో ఉన్న గోమెస్‌ పాలాసియో నగరంలో, 1917 సెప్టెంబరు 17న నేను పుట్టాను. మెక్సికన్ల తిరుగుబాటు చాలా తీవ్రంగా ఉన్న రోజులవి. 1920 లో తిరుగుబాటు ముగిసినప్పటికీ, కొన్ని సంవత్సరాల వరకు మేము నివసిస్తున్న ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉండడం వల్ల, జీవించడం కష్టమయ్యేది.

ఒకసారి, తిరుగుబాటుదార్లకు సైన్యానికి మధ్య పోరాటం జరగబోతోందని మా అమ్మకు తెలిసినప్పుడు నన్ను, మా ముగ్గురు అన్నలను, అక్కను, చెల్లిని కొన్ని రోజులపాటు ఇంట్లోనే ఉంచింది. అప్పుడు తినడానికి మా దగ్గర కొద్దిగానే ఉంది, నేనూ మా చెల్లీ మంచం కింద దాక్కోవడం నాకు ఇంకా జ్ఞాపకముంది. దాని తర్వాత, పిల్లలమైన మమ్మల్ని అమెరికా తీసుకువెళ్ళాలని అమ్మ నిర్ణయించుకుంది, తర్వాత మా నాన్నగారు అక్కడికి వచ్చి మాతో కలిశారు.

అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురవ్వడానికి కాస్త ముందు, 1926 లో మేము కాలిఫోర్నియాకు చేరుకున్నాం. మాకు ఎక్కడ పని దొరికితే అక్కడికి అంటే సాన్‌ జొవాక్విన్‌ వాలే, సాంత క్లార, సాలినస్‌, కింగ్‌ సిటీ లాంటి ప్రదేశాలకు మేము తరలివెళ్లేవాళ్లం. మేము పొలాల్లో పని చేయడం, అన్నిరకాల పండ్లనూ, కూరగాయలనూ సమకూర్చడం లాంటి పనులు నేర్చుకున్నాం. నా బాల్యానికి ఆ పని శ్రమతో కూడినదైనప్పటికీ, అది నా జీవితంలో ఎంతో ఆనందదాయకమైన కాలం.

బైబిలు సత్యాన్ని పొందడం

1928 మార్చి నెలలో, అప్పట్లో బైబిలు విద్యార్థి అని పిలువబడే ఒక యెహోవాసాక్షి మమ్మల్ని సందర్శించాడు. ఆయన ఒక వృద్ధుడు, స్పానిష్‌ భాష మాట్లాడతాడు. ఆయన పేరు ఎస్టెబాన్‌ రివర. ఆయన మాకిచ్చిన చిన్న పుస్తకమైన “చనిపోయిన వారు ఎక్కడ ఉన్నారు?” (ఆంగ్లం) నన్ను ఆకట్టుకుంది, దానిలోని విషయాలు కూడా. నేను చిన్నవాడినే అయినప్పటికీ, బైబిలు పఠనాన్ని, బైబిలు విద్యార్థులతో సహవాసాన్ని పట్టుదలగా కొనసాగించాను. కొంతకాలానికి, మా అమ్మా, మా చెల్లెలు అరోరా కూడా ఉత్సాహవంతులైన యెహోవా స్తుతికర్తలు అయ్యారు.

1930 మధ్యకాలంలో, సాన్‌ జోస్‌లో ఇంగ్లీష్‌ మాట్లాడే సంఘం కోసం ఒక రాజ్యమందిరం నిర్మించబడింది. అనేకమంది హిస్పానిక్‌లు, ఆ ప్రాంతంలోని పొలాల్లో పనిచేసేవారు కాబట్టి మేము వారికి ప్రకటించడం ప్రారంభించాం, కావలికోట పఠనాన్ని నిర్వహించాం. అక్కడినుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరాన ఉన్న శాన్‌ ఫ్రాన్సిస్కోలోని హిస్పానిక్‌ సాక్షుల సహాయంతో మేమది చేయగలిగాం. కాలక్రమేణా, సాన్‌ జోస్‌ రాజ్యమందిరంలోనే స్పానిష్‌ భాషా కూటాలకు దాదాపు 60 మంది హాజరయ్యేవారు.

చివరకు, 1940 ఫిబ్రవరి 28న, సాన్‌ జోస్‌లో జరిగిన సమావేశంలో యెహోవాకు నా సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించాను. దాని తర్వాతి సంవత్సరం నేను యెహోవాసాక్షుల పూర్తికాల సేవకుడిగా అంటే పయినీరుగా నియమించబడ్డాను. 1943 ఏప్రిల్‌లో, అక్కడినుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో గల స్టాక్‌టన్‌ నగరంలో స్పానిష్‌ భాషా సంఘాన్ని రూపొందించడానికి ఆహ్వానించబడ్డాను. ఆ సమయంలో, నేను సాన్‌ జోస్‌లోని ఇంగ్లీష్‌ సంఘంలో సంఘ పైవిచారణకర్తగా సేవచేస్తున్నాను, అక్కడున్న స్పానిష్‌ మాట్లాడే సాక్షులను కూడా పర్యవేక్షిస్తుండేవాడిని. ఆ బాధ్యతలను వేరేవారికి అప్పగించిన తరువాత నేను స్టాక్‌టన్‌కు వెళ్ళాను.

యథార్థత పరీక్షకు గురైంది

1940 నుంచి నన్ను అనేకసార్లు డ్రాఫ్ట్‌ బోర్డ్‌ (నిర్భంద సైనిక సేవ కోసం ఎంపికచేసే బృందం) ఎదుటికి పిలవడం జరిగింది, కాని నా మనస్సాక్షి ఒప్పుకోని కారణంగా సైనికసేవకు ఇష్టపడని వ్యక్తిగా నా స్థానాన్ని ప్రతిసారీ గౌరవించారు. 1941 డిసెంబరులో, అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రవేశించిన తరువాత కొద్దికాలానికే డ్రాఫ్ట్‌ బోర్ట్‌ నుంచి ఒత్తిడి అధికమైంది. చివరికి 1944 లో నన్ను జైల్లో వేశారు. తీర్పు కోసం వేచి ఉండగా, నన్ను భూగర్భంలోవున్న ఒక జైల్లో నేరస్థులతో పాటు ఉంచారు. నేను ఒక యెహోవాసాక్షినని తెలుసుకున్న నేరస్థుల్లోని చాలామంది, దేవుని ఎదుట తమ స్థానంపై తాము చేసిన నేరాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయని నన్ను అడిగారు.

కేసు విచారణ పెండింగులో ఉన్నంత వరకు నేను విడుదలయ్యేలా సాన్‌ జోస్‌లోని సాక్షులు డబ్బుకట్టి నాకు బెయిలు ఇప్పించారు. లాస్‌ఏంజెల్స్‌లో పౌర హక్కుల కేసుల్లో ప్రతివాదుల తరపున వాదించే ఒక న్యాయవాది ఫీజు తీసుకోకుండా నా కేసును వాదించడానికి ఒప్పుకున్నాడు. నేను పయినీరింగ్‌ చేయడం మానేసి, లౌకిక ఉద్యోగం చేపట్టి, ప్రతి నెలా ఫెడరల్‌ అధికారుల ముందు హాజరవ్వాలన్న షరతుపై నన్ను విడుదల చేస్తానని జడ్జి తీర్మానించాడు. నేను ఆ తీర్మానాన్ని ఒప్పుకోనందువల్ల, వాషింగ్‌టన్‌ రాష్ట్రంలోని మక్‌నీల్‌ ద్వీపంలో రెండు సంవత్సరాలపాటు కారాగారశిక్ష విధించారు. అక్కడ నా సమయాన్ని అధికంగా బైబిలు పఠనం కోసం ఉపయోగించాను. నేను టైపు చేయడం కూడా నేర్చుకున్నాను. నా మంచి ప్రవర్తనవల్ల, రెండు సంవత్సరాలు కాకముందే విడుదలయ్యాను. నేను పయినీరు సేవను కొనసాగించడానికి వెంటనే ఏర్పాట్లు చేసుకున్నాను.

విస్తృత కార్యకలాపం

1947 చలికాలంలో, టెక్సాస్‌ రాష్ట్రమందున్న స్పానిష్‌ మాట్లాడే కొలరాడొ నగర ప్రజల మధ్య ఒక పయినీరు సహచరునితో కలిసి పనిచేయడానికి నేను నియమించబడ్డాను. కానీ అక్కడ చలి ఎక్కువగా ఉన్నందున వెచ్చని వాతావరణమున్న సాన్‌ ఆంటొనియో నగరానికి వెళ్ళాం. అయితే అక్కడ వర్షం బాగా కురవడం వల్ల మా ఇంటింటి పరిచర్యకు ఆటంకం ఏర్పడింది. త్వరలోనే మా దగ్గరున్న డబ్బంతా అయిపోయింది. కొన్ని వారాల పాటు మేము పచ్చి క్యాబేజి సాండ్‌విచ్‌లు, అల్ఫల్ఫ అనే ఒకజాతి బీన్స్‌తో చేసిన టీలతోనే జీవించాం. నా సహచరుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు, నేను మాత్రం అక్కడే ఉండిపోయాను. నా భౌతికావసరాల గురించి ఇంగ్లీషు మాట్లాడే సాక్షులకు తెలియగానే, వారు నాకు సహాయం చేయడం ప్రారంభించారు.

తరువాతి వసంత కాలంలో, కొలరాడొలోని నా నియామకానికి నేను తిరిగి వెళ్ళాను, చివరకు స్పానిష్‌ మాట్లాడే ఒక చిన్న సంఘం రూపొందింది. అటు తర్వాత నేను టెక్సాస్‌నందున్న స్వీట్‌వాటర్‌ నగరానికి వెళ్ళాను, అక్కడ స్పానిష్‌ మాట్లాడే మరొక సంఘం రూపొందడానికి సహాయం చేశాను. నేను స్వీట్‌వాటర్‌లో ఉండగానే, 1950 ఫిబ్రవరి 22న ప్రారంభించబోయే మిషనరీ శిక్షణ కోసం వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 15వ తరగతికి నన్ను ఆహ్వానిస్తున్న ఒక ఉత్తరాన్ని అందుకున్నాను. ఆ వేసవి కాలంలో న్యూయార్క్‌ పట్టణమందున్న యాంకీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ సమావేశమందు గ్రాడ్యుయేషన్‌ జరిగిన తరువాత, బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో మూడు నెలలు ఉండిపోయాను. అక్కడ, మెక్సికో బ్రాంచి కార్యాలయమందు నా నియామకానికి కావలసిన శిక్షణను పొందాను.

మెక్సికోలో పని

1950, అక్టోబరు 20న నేను మెక్సికో నగరానికి చేరుకున్నాను. దాదాపు రెండు వారాల తర్వాత, నేను బ్రాంచి పైవిచారణకర్తగా నియమించబడ్డాను. ఆ నియామకంలో నాలుగున్నర సంవత్సరాలు కొనసాగాను. పయినీరు సేవలో, చెరసాలలో, గిలియడ్‌ స్కూలులో, బ్రూక్లిన్‌లో నేను పొందిన అనుభవం ఎంతో ప్రయోజనకరమైనదని రుజువైంది. మెక్సికో చేరుకున్నాక, మన మెక్సికన్‌ సహోదర, సహోదరీల ఆధ్యాత్మికతను పెంపొందించాల్సిన అవసరముందని నేను వెంటనే గమనించాను. అక్కడ ప్రత్యేకంగా, దేవుని వాక్యమందున్న ఉన్నతమైన నైతిక ప్రమాణాలను పాటించడానికి వారికి సహాయం చేయాల్సిన అవసరముంది.

మెక్సికోతోపాటు లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో, చట్టబద్ధంగా పెళ్ళి కాకుండానే స్త్రీ పురుషులు కలిసి జీవించే అలవాటుండేది. క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన మతాలు, ముఖ్యంగా రోమన్‌ క్యాథలిక్‌ చర్చి లేఖన విరుద్ధమైన ఈ అలవాటు ప్రబలమవ్వడానికి అనుమతించింది. (హెబ్రీయులు 13:⁠4) అందువల్ల, కొందరు చట్టరీత్యా పెళ్ళికానప్పటికీ యెహోవాసాక్షుల సంఘాల్లో సభ్యులైవున్నారు. అలాంటి వారికోసం ఒక పథకం ఏర్పాటు చేసి, విషయాలను సరిదిద్దుకోడానికి ఆరు నెలల సమయమిచ్చారు. అలా సరిదిద్దుకోకపోతే వాళ్లు ఇకముందు యెహోవాసాక్షులుగా గుర్తించబడరు.

చాలామందికి విషయాలను చక్కదిద్దుకోవడం సులభమైంది. పెళ్లి చేసుకోవడం ద్వారా తమ సంబంధాన్ని చట్టబద్ధం చేసుకోవడం మాత్రమే వారికి అవసరం. కొంతమందికి చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. ఉదాహరణకు, చట్టరీత్యా విడాకులు పొందకుండానే కొందరు రెండు మూడుసార్లు పెళ్ళి చేసుకున్నారు. చివరికి, యెహోవా ప్రజల వైవాహిక పరిస్థితులు దేవుని వాక్య బోధలకు అనుగుణంగా అయినప్పుడు వారు సంఘాల్లో చక్కని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అనుభవించారు.​—⁠1 కొరింథీయులు 6:​9-11.

ఆ రోజుల్లో మెక్సికోలో లౌకిక విద్యా స్థాయి సాధారణంగా తక్కువ. 1950 లో నేను అక్కడికి చేరుకోవడానికి ముందే బ్రాంచి కార్యాలయం, సంఘాల్లో వ్రాయడం చదవడం కోసం తరగతులను సంస్థీకరించనారంభించింది. ఇప్పుడు ఈ తరగతులను పునఃసంస్థీకరించడం జరిగింది, ప్రభుత్వ గుర్తింపును పొందడానికి వాటిని రిజిష్టర్‌ చేయించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. సాక్షులు నిర్వహించిన తరగతుల్లో 1946 నుంచీ అంటే రికార్డులను భద్రపర్చడం ప్రారంభించినప్పటి నుంచీ మెక్సికోనందు 1,43,000 కన్నా ఎక్కువ మంది చదవడం, వ్రాయడం నేర్చుకున్నారు.

మెక్సికోలో మతానికి సంబంధించిన చట్టాలు చాలా కఠినంగా ఉండేవి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో, ఈ విషయంలో ప్రముఖమైన మార్పులు జరిగాయి. 1992 లో, మత వ్యవహారాలపై ఒక క్రొత్త చట్టాన్ని జారీ చేయడం జరిగింది, ఆ విధంగా 1993 లో మెక్సికోలోని యెహోవాసాక్షులు ఒక మత సంబంధమైన ఆర్గనైజేషన్‌గా రిజిష్టర్‌ చేయబడ్డారు.

మొదట్లో అసంభవం అనుకున్న నాకు, ఈ మార్పులు గొప్ప సంతోషానికి మూలమయ్యాయి. అనేక సంవత్సరాలకుపైగా నేను, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరిగాను, అపనమ్మకమైన వైఖరినే ఎదుర్కొన్నాను. ఏది ఏమైనా, వాటిని మన బ్రాంచి కార్యాలయంలో ఉన్న లీగల్‌ డిపార్ట్‌మెంటు చక్కగా నిర్వహించిన విధానం చూస్తే ఆనందం కలుగుతుంది. అలా మేమిప్పుడు ప్రకటనా పనిలో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువగా ఎదుర్కొంటున్నాం.

మిషనరీ అయిన భార్యతో కలిసి సేవ చేయడం

నేను మెక్సికో చేరుకునేసరికి, అంతకు ముందు గిలియడ్‌ తరగతుల్లో పట్టభద్రులైన అనేకమంది అప్పటికే అక్కడ ఉన్నారు. వారిలో ఒకరు ఎస్తెర్‌ వర్తానియన్‌. ఆమె 1942 లో కాలిఫోర్నియా రాష్ట్రమందున్న వల్లెయొ నగరంలో పయినీరు సేవ ప్రారంభించిన ఒక ఆర్మేనియన్‌ సాక్షి. మేము 1955 జూలై 30న పెళ్ళి చేసుకున్నాం, అప్పటి నుంచి మెక్సికోలో మేము మా నియామకాలలో కొనసాగాం. ఎస్తెర్‌ మెక్సికోలో మిషనరీ పనిలో ఉండిపోయింది, నా సేవను కొనసాగించిన బ్రాంచిలో మేము నివసించాం.

1947 లో ఎస్తెర్‌, తన మొదటి మిషనరీ నియామకంతో మెక్సికోలోని న్యూవో లేయోన్‌ రాష్ట్రమందున్న మాంటెరే నగరానికి చేరుకుంది. అక్కడ 40 మంది సాక్షులతో కేవలం ఒక్క సంఘం మాత్రమే ఉండేది, కాని 1950 లో ఆమె మెక్సికో నగరానికి బదిలీ అయ్యేటప్పటికి, అక్కడ నాలుగు సంఘాలు అయ్యాయి. ఎస్తెర్‌ మాంటెరేలో సేవచేసేటప్పుడు బైబిలు పఠనం చేసిన కుటుంబాలకు బంధువులైన ఇద్దరు యౌవనులు, మెక్సికో నగరానికి దగ్గరున్న మా బ్రాంచిలో ప్రస్తుతం ఉన్నారు.

గత 1950 లో నగరంలోని చాలా భాగం, మెక్సికోలోని మిషనరీల ప్రకటనా ప్రాంతంలో ఉండేది. వారు తమ నియామక ప్రాంతానికి కాలినడకనగానీ, జనంతో కిక్కిరిసి ఉండే పాత బస్సుల్లోగానీ వెళ్లేవారు. నేను 1950 చివర్లో రంగంలోకి దిగేసరికి, అక్కడ ఏడు సంఘాలు ఉండేవి. అవి ఇప్పుడు, మెక్సికో నగరంలో 90,000కు పైగా ఉన్న రాజ్య ప్రచారకులతో దాదాపు 1,600 సంఘాలకు పెరిగాయి. గత సంవత్సరం క్రీస్తు మరణ దిన జ్ఞాపకార్థానికి అక్కడ 2,50,000 మందికి పైగా హాజరయ్యారు! అనేక సంవత్సరాలుగా, ఎస్తెర్‌ నేను వీటిలోని అనేక సంఘాల్లో సేవచేసే ఆధిక్యతను పొందాం.

ఎస్తెర్‌, నేను బైబిలు పఠనం ప్రారంభించేటప్పుడు, కుటుంబంలో తండ్రి ఆసక్తిని కనపరిచేలా చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించేవాళ్ళం, అలా కుటుంబ సభ్యులందరూ పఠనంలో భాగం వహించేవారు. ఆ విధంగా అనేక పెద్ద కుటుంబాలు యెహోవాను సేవించడానికి ముందుకు రావడం మేము చూశాం. మెక్సికోలో సత్యారాధన అంత వేగంగా వృద్ధి చెందడానికి గల కారణాల్లో, కుటుంబాలన్నీ తరచుగా సత్యారాధనలో ఐక్యంగా కలుసుకోవడం ఒకటని నేను నమ్ముతాను.

యెహోవా పనిని ఆశీర్వదించాడు

1950 నుంచి మెక్సికోలో, సంఖ్యాపరమైన పెరుగుదల, సంస్థాపరమైన మార్పులు ఈ రెండు విషయాల్లో పనిలో పురోభివృద్ధి గుర్తించదగినవిధంగా జరిగింది. అతిథి ప్రియులూ, సంతోషకరమైనవారూ అయిన అటువంటి ప్రజలతో కలిసి పనిచేస్తూ, ఆ పెరుగుదలకు కొద్దిగా తోడ్పడ్డం నిజంగా ఆనందకరమైన విషయం.

యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యుడిగా సేవ చేస్తున్న కార్ల్‌ క్లేయిన్‌, ఆయన భార్య మార్గరెట్‌లు సెలవుల్లో కొన్ని సంవత్సరాల క్రితం మెక్సికో వచ్చినప్పుడు మమ్మల్ని సందర్శించారు. సహోదరుడు కార్ల్‌ క్లేయిన్‌ మా మెక్సికన్‌ ప్రాంతంలో జరిగే పనితీరు చూడాలని, ఆయన భార్య మార్గరెట్‌తో కలిసి, మేము అప్పుడు హాజరవుతున్న మెక్సికో నగరానికి దగ్గరలో ఉన్న సాన్‌ వేన్‌ తెజొంట్ల సంఘానికి వచ్చారు. మా రాజ్య మందిరం చిన్నగా ఉండేది, దాదాపు 15 అడుగుల వెడల్పు, 18 అడుగుల పొడవు ఉండేది. మేము చేరుకునేసరికి అప్పటికే 70 మంది హాజరైవున్నారు, నిలబడ్డానికి మాత్రం కాస్త స్థలముంది. వయసు మళ్ళిన వాళ్ళు కుర్చీల్లో, యువతీ యువకులు బెంచీలమీద, చిన్న పిల్లలు ఇటుకలమీదా, నేలమీదా కూర్చొని ఉన్నారు.

సహోదరుడు క్లేయిన్‌ చాలా ప్రభావితుడయ్యాడు, ఎందుకంటే పిల్లలందరూ తమ తమ బైబిళ్ళను సిద్ధంగా ఉంచుకుని, ప్రసంగీకుడితోపాటు బైబిలు లేఖనాలను చూస్తున్నారు. బహిరంగ ప్రసంగం తర్వాత, సహోదరుడు క్లేయిన్‌ మత్తయి 13:​19-23 వచనాలపై మాట్లాడాడు, మెక్సికోలో యేసు ప్రస్తావించిన “మంచి నేల” చాలా ఉందని చెప్పాడు. ఆ రోజు హాజరైన వారిలో ఏడుగురు పిల్లలు, ప్రస్తుతం మెక్సికో నగరానికి దగ్గర్లో బ్రాంచిని విస్తరింపజేసే చాలా పెద్ద ప్రాజెక్టులో పని చేస్తున్నారు. మరొకరు బేతేలులో, మరితరులు పయినీరులుగా సేవచేస్తున్నారు!

నేను మెక్సికో నగరానికి వచ్చినప్పుడు మా బ్రాంచిలో 11 మంది సభ్యులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు మేము 1,350 మందిమి పని చేస్తున్నాం, వారిలో దాదాపు 250 మంది క్రొత్త బ్రాంచి బిల్డింగులు కట్టే పనుల్లో ఉన్నారు. బహుశా 2002వ సంవత్సరానికి ఈ పనులన్నీ పూర్తయితే, క్రొత్త బిల్డింగుల్లో మేము మరో 1,300 మందికి వసతి కల్పించగలుగుతాం. 1950 లో, దేశం మొత్తం మీద 7,000 కంటె తక్కువ రాజ్య ప్రచారకులుండేవాళ్ళం, కానీ ఇప్పుడు మేము 5,00,000కన్నా ఎక్కువ మందే ఉన్నాం! యెహోవాను స్తుతించడానికి ఎంతగానో కష్టించి పనిచేస్తున్న అణుకువగల మా మెక్సికన్‌ సహోదరుల ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించిన విధానాన్ని చూసి నా హృదయం ఆనందంతో గంతులువేస్తోంది.

ఒక పెద్ద సవాలును ఎదుర్కోవడం

నేను ఇటీవల ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్ళలో ఒకటి అనారోగ్యం. సాధారణంగా నేను ఆరోగ్యవంతుడ్నే. కానీ 1988 నవంబరులో నాకు స్ట్రోక్‌ వచ్చింది, అది నా శారీరక బలంపై చాలా ప్రభావాన్ని చూపించింది. వ్యాయామంతో పాటు కొన్ని చికిత్సల ద్వారా నేను కొంతవరకు కోలుకున్నాను, అందుకు యెహోవాకు ధన్యవాదాలు. కానీ నేను కోరుకున్నట్టు నా అవయవాలు స్పందించవు. ఇప్పటికీ నాకు వచ్చే తీవ్రమైన తలనొప్పిని, స్ట్రోక్‌ మూలంగా వచ్చిన ఇతర పర్యవసానాలను తొలగించుకోవడానికి నేను వైద్యం చేయించుకుంటున్నాను.

నేనిప్పుడు చేయాలనుకున్నంత చేయలేకపోతున్నప్పటికీ, అనేకమంది యెహోవా సంకల్పాలను తెలుసుకుని ఆయన సమర్పిత సేవకులవడానికి సహాయం చేయగలిగినందుకు నాకు సంతృప్తిగా ఉంది. మా బ్రాంచిని సందర్శించడానికి వచ్చిన క్రైస్తవ సహోదర సహోదరీలలో సాధ్యమైనంత ఎక్కువ మందితో మాట్లాడడంలో కూడా నేను ఆనందిస్తాను; అలా మేము పరస్పరం ప్రోత్సహించబడతామని నేను భావిస్తాను.

మనం యెహోవాకు చేసే సేవను ఆయన ప్రశంసిస్తాడనీ, మనం చేసినదేది వ్యర్థం కాదనీ తెలుసుకోవడం నాకెంతో బలాన్ని కలిగించింది. (1 కొరింథీయులు 15:​58) నాకు పరిమితులు, అనారోగ్యం ఉన్నప్పటికీ, నేను కొలొస్సయులు 3:​23,24 లో ఉన్న ఈ మాటలను నా హృదయంలోకి తీసుకున్నాను: “ప్రభువువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.” ఈ ఉద్బోధకు అనుగుణంగా నాకు శ్రమలున్నప్పటికీ యెహోవాను పూర్ణమనస్సుతో సేవించడం నేర్చుకున్నాను.

[24వ పేజీలోని చిత్రం]

1942 లో నేను పయినీరుగా ఉన్నప్పుడు

[24వ పేజీలోని చిత్రం]

నా భార్య మెక్సికోలో 1947 లో మిషనరీ నియామకాన్ని ప్రారంభించినప్పుడు

[24వ పేజీలోని చిత్రం]

ఎస్తెర్‌తో నేడు

[26వ పేజీలోని చిత్రాలు]

ఎడమప్రక్క పైన: 1952 లో, ముందర ఉన్న నాతో మా మెక్సికో బేతేలు కుటుంబం

ఎగువ: ఈ మెక్సికో సిటీ స్టేడియంనందు 1999 లో జిల్లా సమావేశం కోసం 1,09,000లకు మందికి పైగా సమావేశమయ్యారు

ఎడమప్రక్క క్రింద: త్వరలో పూర్తికానున్న మా క్రొత్త బ్రాంచి సౌకర్యాలు