కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు ఆనందాన్ని కనుగొంటారు

దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు ఆనందాన్ని కనుగొంటారు

దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు ఆనందాన్ని కనుగొంటారు

“రాజ్య కార్యకలాపాన్ని కొనసాగించేందుకు మనల్ని సిద్ధం చేయడానికి యెహోవా చేసిన ఏర్పాట్లలో ఈ సమావేశం ఒక భాగమని మనం గుర్తిస్తాం” అని “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశం ప్రారంభంలో ఒక ప్రసంగీకుడు అన్నాడు. ఆయనింకా ఇలా కొనసాగించాడు: “సంతోషభరితమైన కుటుంబ జీవితాన్ని గురించి ఉపదేశించబడడానికీ, యెహోవా సంస్థకు సన్నిహితంగా ఉండేలా ప్రోత్సహించబడడానికీ, రాజ్యసేవలో మన ఆసక్తిని కాపాడుకునేలా పురికొల్పబడడానికీ, మెలకువగా ఉండవలసిన అవసరతను గురించి జ్ఞాపకం చేయబడడానికీ మనల్ని మనం సంసిద్ధం చేసుకున్నాం.”

రెండు వేలవ సంవత్సరం మే నెల చివరిభాగం మొదలుకొని, దేవుని వాక్యప్రకారం ప్రవర్తించే లక్షలాదిమంది ప్రజలు, అలాగే వారి స్నేహితులు కీలకమైన బైబిలు విద్యను పొందడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక స్థలాల్లో సమకూడారు. మూడు రోజుల సమావేశంలో వారు నేర్చుకున్నదేమిటి?

మొదటి రోజు​—⁠యెహోవా చేసిన క్రియలను మర్చిపోకుండడం

సమావేశాల్లో యెహోవా ఐక్య ఆరాధన నుండి లభించే ఆశీర్వాదాలను అనుభవించమని ప్రారంభ ప్రసంగంలో చైర్మన్‌ ప్రేక్షకులను ఆహ్వానించాడు. వారందరి విశ్వాసము పెరుగుతుందనీ యెహోవాతో తమ వ్యక్తిగత సంబంధం దృఢపడుతుందనీ హాజరైనవారు హామీని పొందారు.

మనలో ప్రతి ఒక్కరం సంతోషంగా ఉండాలంటే మనకు ఏమి కావాలో “సంతోషంగల దేవునికి” తెలుసు. (1 తిమోతి 1:​11, NW) అందుకనే, యెహోవా వాక్యమైన బైబిలు అతి శ్రేష్ఠమైన జీవన విధానాన్ని గూర్చి వివరిస్తోందని “దేవుని చిత్తాన్ని చేయడం సంతోషాన్ని తెస్తుంది” అనే ప్రసంగం నొక్కిచెప్పింది. (యోహాను 13:​17) ఎంతోకాలంగా యెహోవాసాక్షులుగా ఉన్నవారిలో అనేకమందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, విభిన్నమైన పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం తమ జీవితాలకు అర్థాన్ని చేకూర్చిందని ఆ ఇంటర్వ్యూలు చూపించాయి. “యెహోవా మంచితనాన్ని బట్టి సంతోషించండి” అనే తరువాతి ప్రసంగం “దేవునిపోలి నడుచుకొ”నేవారిగా క్రైస్తవులు తమ జీవితాల్లో “సమస్తవిధములైన మంచితనము”ను ప్రదర్శించాలని నొక్కిచెప్పింది. (ఎఫెసీయులు 5:​1, 9) ఇలా చేయడానికిగల ఒక ఉత్కృష్టమైన మార్గం ఏమిటంటే సువార్తను ప్రకటించి, శిష్యుల్ని చేయడమే.​—⁠కీర్తన 145:⁠7.

“అదృశ్యుడైనవానిని చూస్తున్నట్టు స్థిరబుద్ధిగలవారై కొనసాగండి” అనే అంశంగల ప్రసంగం, మనం అదృశ్యుడైన దేవుణ్ణి “చూడడానికి” బలమైన విశ్వాసం ఎలా సహాయం చేస్తుందో చూపించింది. దేవుని లక్షణాల గురించీ, చివరికి మన తలంపులన్నింటినీ తెలుసుకునే ఆయన సామర్థ్యం గురించీ ఆధ్యాత్మిక ప్రజలు ఎలా ఎరుగుదురో ఆ ప్రసంగీకుడు వివరించాడు. (సామెతలు 5:​21) బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికీ, తమ జీవితాల్లో ఆధ్యాత్మిక ఆసక్తులను ముందుంచడానికీ వారెటువంటి చర్యల్ని చేపట్టారో ఇంటర్వ్యూ చేయబడినవారు తెలియజేశారు.

ఉదయకాల సమావేశం ఈ ముఖ్యాంశ ప్రసంగంతో ముగిసింది, “ఆశ్చర్యకార్యములు చేసే యెహోవాను స్తుతించండి.” మనం యెహోవా గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో ఆశ్చర్యకార్యాలు చేసేవానిగా మనం ఆయన్ను స్తుతించడానికి మనకు అంత ఎక్కువగా కారణాలు లభిస్తాయని ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి ఆ ప్రసంగం సహాయం చేసింది. ప్రసంగీకుడు ఇలా అన్నాడు: “మన కోసం దేవుడు ఇప్పుడు చేస్తున్న ఆశ్చర్యకార్యాలతో పాటు ఆయన అద్భుతమైన సృష్టికార్యాల గురించి కూడా మనం ధ్యానిస్తుండగా, హృదయపూర్వకమైన గుణగ్రహణ మనమాయనను స్తుతించేలా మనల్ని పురికొల్పుతుంది. గడిచిన కాలంలో ఆయన తన ప్రజల పక్షంగా చేసిన ఆశ్చర్యకార్యాల గురించి మనం ధ్యానిస్తుండగా, మనమాయనను స్తుతించాలని కోరుకుంటాం. అలాగే యెహోవా ఇంకా చేయనైయున్న ఆశ్చర్యకార్యాల వాగ్దానాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, మన మెప్పును వ్యక్తపర్చగల మార్గాల కోసం మనం అన్వేషిస్తాం.”

మధ్యాహ్న కార్యక్రమం “మేలుచేయడం మానకండి” అనే ప్రసంగంతో ప్రారంభమైంది. ఆ ప్రసంగంలో ఈ లోకం నుండి వస్తున్న ఒత్తిళ్ళు మనం అంతానికి సమీపంలో ఉన్నామని రూఢిపరుస్తున్నాయని హాజరైన వారందరికీ గుర్తుచేసింది. (2 తిమోతి 3:⁠1) అయితే, ఎన్నడూ అపజయాన్ని స్వీకరించకుండా ఉండడం ద్వారా మనం “ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నాము” అని రుజువు చేయగలము.​—⁠హెబ్రీయులు 10:⁠39.

కుటుంబ జీవితాన్ని గురించి ఎటువంటి సలహాలు ఇవ్వబడ్డాయి? సమావేశంలోని “దేవుని వాక్యానికి విధేయులై ఉండండి” అనే మొదటి గోష్ఠి, “వివాహజతను ఎంపిక చేసుకోవడంలో” అనే విషయంతో ప్రారంభమైంది. వివాహజతను ఎంపిక చేసుకోవడం అనేది ఒక వ్యక్తి తీసుకునే అతి గంభీరమైన నిర్ణయాల్లో ఒకటి. అందుకని క్రైస్తవులు వివాహం చేసుకోవడానికి ముందు తాము పరిణతికి ఎదిగేంత వరకు వేచివుండి, “ప్రభువునందు మాత్రమే” వివాహం చేసుకోవాలని కోరుకోవాలి. (1 కొరింథీయులు 7:​39) గోష్ఠిలోని తర్వాతి భాగం, క్రైస్తవ కుటుంబాలన్నీ, దృఢమైన ఆధ్యాత్మిక వ్యవస్థలుగా సఫలీకృతం చెందాలనే యెహోవా కోరికను గురించి చర్చించింది. దీన్నెలా సాధించాలో కూడా అది ఆచరణాత్మకమైన సలహాలను అందించింది. తల్లిదండ్రులు దేవుణ్ణి ప్రేమించమని తమ పిల్లలకు బోధించే ప్రక్రియ, ఆయన పట్ల వారికున్న ప్రేమతో ప్రారంభమౌతుందని చివరి భాగం తల్లిదండ్రులకు గుర్తుచేసింది.

దిగ్భ్రాంతి కల్గించే సంఘటనలు సంభవించినప్పటికీ, మనం సంచలనాత్మకమైన నివేదికల్ని విన్నప్పుడు బుద్ధిహీనంగా కాక జ్ఞానయుక్తంగా ప్రతిస్పందించాలని గ్రహించేందుకు “పుకార్లు, ఊసుపోని కబుర్ల విషయమై జాగ్రత్త” అనే ప్రసంగంలో అందించబడిన విషయాలు మనకందరికీ సహాయం చేశాయి. క్రైస్తవులు సత్యమని తమకు తెలిసిన దాని గురించి​—⁠రాజ్యసువార్తను గురించి మాట్లాడడం వారికి ఉత్తమం. “‘శరీరంలోని ముల్లును’ తాళుకోవడం” అనే తరువాతి ప్రసంగం ఎంతో ఆదరణనిచ్చినట్లుగా, ఉత్తేజాన్నిచ్చినట్లుగా చాలామందికి అనిపించింది. మనం అవిశ్రాంతంగా ఎన్ని శ్రమల్ని ఎదుర్కొంటున్నా, యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా, తన వాక్యం ద్వారా, మన క్రైస్తవ సహోదరత్వం ద్వారా మనల్ని బలపర్చగలడని గ్రహించడానికి అది సహాయం చేసింది. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు వ్యక్తిగత అనుభవాల నుండి ఎంతో ప్రోత్సాహకరమైన వ్యాఖ్యానాలు చేయబడ్డాయి.​—⁠2 కొరింథీయులు 12:​7-10; ఫిలిప్పీయులు 4:11, 13.

మొదటి రోజు “యెహోవా సంస్థతో సమంగా అడుగు వేయడం” అనే ప్రసంగంతో ముగిసింది. దేవుని సంస్థ ప్రాముఖ్యంగా ముందుకు కొనసాగిన మూడు రంగాల్ని పరిశీలించడం జరిగింది: (1) యెహోవా నుండి వచ్చిన ఆధ్యాత్మిక వెలుగును అవగాహన చేసుకోవడంలో అభివృద్ధి, (2) దేవుడు మనకు అప్పగించిన పరిచర్య, (3) సంస్థాగతమైన పద్ధతుల్లో సమయానుకూలమైన మార్పులు. అటుతరువాత ప్రసంగీకుడు, “భవిష్యత్‌ ఉత్తరాపేక్షల్ని గురించి ఉత్తేజంతో ఉన్నాం” అని ఎంతో నమ్మకంతో అన్నాడు. ఆయనిలా అడిగాడు: “మనకు మొదట్లో ఉన్న విశ్వాసాన్నే చివరి వరకూ కాపాడుకునేందుకు మనకు ప్రతి కారణమూ ఉందనడంలో సందేహమేమైనా ఉండగలదా?” (హెబ్రీయులు 3:​13, 14) దానికి జవాబు స్పష్టం. దానితో మీరు దేవుని స్నేహితులు కాగలరు! అనే బ్రోషూరు విడుదల చేయబడింది. పరిమితమైన విద్య ఉన్నవారికి లేదా చదివే సామర్థ్యం తక్కువగా ఉన్నవారికి యెహోవాను గురించి నేర్చుకోవడానికి అదొక శక్తివంతమైన బోధనా ఉపకరణంగా ఉంటుంది.

రెండవ రోజు​—⁠దేవుని ఆశ్చర్యకార్యాల గురించి మాట్లాడుతూ ఉండండి

దినవచనాన్ని పరిశీలించిన పిమ్మట సమావేశపు రెండవ రోజు “దేవుని వాక్య పరిచారకులు” అనే గోష్ఠితో ముందుకు కొనసాగింది. మొదటి భాగంలో మన భూగోళవ్యాప్త ప్రకటనా పనిలోని విజయాలవైపు అవధానం మళ్ళించబడింది. అయితే మన ఈ పనిలో సహనం కనపర్చడాన్ని రాజ్య సందేశాన్ని తిరస్కరిస్తున్న అనేకమంది సవాలుచేస్తున్నారు. ఉదాసీనత లేదా వ్యతిరేకత అనే సవాళ్ళ విషయంలో తమ మనస్సులనూ హృదయాలనూ దృఢపర్చుకోవడం ద్వారా తాము తమ పరిచర్యలో ఎలా ఆనందాన్ని కనుగొంటున్నారో ఎంతోకాలంగా ప్రచారకులుగా ఉన్న అనేకమంది వివరించారు. యెహోవాసాక్షులు అన్ని ప్రాంతాల్లోని ప్రజల్నీ నియతంగాను అనియతంగాను చేరడానికి కృషి చేస్తున్నారని సమావేశమైనవారికి రెండవ భాగం గుర్తుచేసింది. క్రైస్తవులందరూ తమ వ్యక్తిగత పరిచర్యను విస్తరింపజేసుకోగలిగే అనేక మార్గాల్ని చివరి భాగం వివరించింది. ఇలా చేయడానికి గాను, మనం దేవుని రాజ్యానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలనీ, అలా చేయడంలో మనకు అసౌకర్యం కలిగినా, తనను తాను ఉపేక్షించుకోవాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలనీ ప్రసంగీకుడు నొక్కిచెప్పాడు.​—⁠మత్తయి 6:19-21.

వస్తుసంపదలంటే తీరని దాహం ఉన్న దైవభక్తిలేని లోకంలో మనం జీవిస్తున్నాము గనుక “సంతుష్టి సహితమైన దైవభక్తిని అలవర్చుకోండి” అనే ప్రసంగం చాలా సమయానుకూలమైనది. ప్రసంగీకుడు తాను చేసిన కొన్ని వ్యాఖ్యానాలను 1 తిమోతి 6:​6-10, 18, 19 వచనాల ఆధారంగా క్రైస్తవులు ధనంపట్ల ప్రేమను నివారించడానికి దైవభక్తి ఎలా సహాయపడుతుందో చూపించాడు, అటువంటి ప్రేమ వారిని విశ్వాసమునుండి తొలగిపోయేలా చేసి, ఎన్నో బాధలకు గురిచేస్తుంది. మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మన ఆనందం, యెహోవాతో మనకుగల సంబంధంపైనా, మన ఆధ్యాత్మిక సంక్షేమంపైనా ఆధారపడివుంటుందని ఆయన నొక్కిచెప్పాడు. “దేవుడు సిగ్గుపడేలా చేయకండి” అనే ప్రసంగంలో అందించబడిన అంశాలను బట్టి అనేకమంది మనస్సులు ఎంతగానో కదిలించబడ్డాయి. యెహోవా విశ్వసనీయులైన తన సాక్షుల్ని ఎన్నడూ మర్చిపోడన్న వాస్తవం నొక్కిచెప్పబడింది. ‘నిన్న, నేడు, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉన్న’ యేసుక్రీస్తు ఉంచిన అసమానమైన మాదిరి జీవన పరుగుపందెంలో సహనంతో పరుగెత్తుతూ ఉండేలా అనేకమందికి సహాయపడుతుంది.​—⁠హెబ్రీయులు 13:⁠8.

ఉదయకాల కార్యక్రమ ముగింపులో బాప్తిస్మ ప్రసంగం ఇవ్వబడింది, ఇది యెహోవాసాక్షుల పెద్ద సమావేశాల్లో ఎప్పుడూ ఒక ఉన్నతాంశంగా ఉంటుంది. క్రొత్తగా సమర్పించుకున్నవారు నీటి బాప్తిస్మం పొందడం ద్వారా యేసు అడుగుజాడల్ని అనుసరిస్తుండడం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా! (మత్తయి 3:​13-17) ఈ చర్యను చేపట్టిన వారందరూ ఆ బాప్తిస్మం సమయానికే దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారిగా ఎంతో సాధించారు. అంతేగాక, బాప్తిస్మం పొందినప్పుడు వారు సువార్త పరిచారకులుగా నియుక్తులయ్యారు, తాము యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చడంలో భాగం వహిస్తున్నామని గ్రహించి వారెంతో ఆనందాన్ని పొందుతున్నారు.​—⁠సామెతలు 27:⁠11.

“‘మేలు కీడుల్ని వివేచించడానికి’ పరిణతి అవసరం” అనే ప్రసంగంలో సూటియైన సలహాలు ఇవ్వబడ్డాయి. తప్పొప్పుల సంబంధంగా ఈ లోకంలో ప్రమాణాలు చాలా ఘోరంగా ఉన్నాయి. అందుకని మనం యెహోవా ప్రమాణాలపై ఆధారపడతాము. (రోమీయులు 12:⁠2) దేవుని మార్గాల గురించి సంపూర్ణమైన అవగాహనను పొందడానికీ పరిణతికి ఎదగడానికీ ఎంతో కష్టపడాలని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించబడ్డారు. అటు తరువాత, మంచి అభ్యాసం చేయడం ద్వారా మన గ్రహణశక్తులు “మేలు కీడులను వివేచించుటకు” సాధకము చేయబడతాయి.​—⁠హెబ్రీయులు 5:11-14.

అటు తరువాత “ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి శ్రమించండి” అనే గోష్ఠి వచ్చింది. నిజ క్రైస్తవులు ఆధ్యాత్మికతను పెంపొందించుకొని దాన్నలాగే కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. ఇందుకు గట్టి శ్రమ అవసరం అవుతుంది​—⁠చదవడం, అధ్యయనం చేయడం, ధ్యానించడం వంటివి అవసరం. (మత్తయి 7:​13, 14; లూకా 13:​24) ఆధ్యాత్మిక ప్రజలు “ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను” కూడా చేస్తారు. (ఎఫెసీయులు 6:​18) మన ప్రార్థనలు మన విశ్వాసానికీ మన భక్తికీ ఉన్న లోతునూ, మన ఆధ్యాత్మికతా స్థాయినీ, అలాగే మనం వేటిని మరి “శ్రేష్ఠమైన కార్యముల”ని దృష్టిస్తామన్న విషయాన్నీ వెల్లడిచేస్తాయి. (ఫిలిప్పీయులు 1:​9, 10) దయాపూర్వకమైన ఒక తండ్రిపట్ల విధేయతగల ఒక పిల్లవాడికి ఉన్నట్లుగా, యెహోవాతో మనం ఒక హృదయపూర్వకమైన, ప్రేమపూర్వకమైన సంబంధాన్ని పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యాన్ని కూడా నొక్కిచెప్పడం జరిగింది. నిజమైన మతమే అయినా మనం కేవలం ఒక మతాన్ని కల్గినవారం మాత్రమే కాదుగానీ​—⁠మనం ‘దేవుణ్ణి చూస్తున్నట్లుగా’ బలమైన విశ్వాసాన్ని నిర్మించుకోవాలని కోరుకునే వారం.​—⁠హెబ్రీయులు 11:​6, 27.

ఆధ్యాత్మిక పురోగతి అనే విషయం “మీ అభివృద్ధిని తేటగా కనబడనివ్వండి” అనే ప్రసంగంలో మరింతగా చర్చించబడింది. అటువంటి అభివృద్ధిని సాధించాల్సిన మూడు రంగాలు పరిశీలించబడ్డాయి: (1) జ్ఞానం, వివేచన, బుద్ధి వంటివాటిలో ఎదగడం, (2) దేవుని ఆత్మ ఫలాల్ని ఫలించడం, (3) కుటుంబ సభ్యులుగా మన బాధ్యతల్ని నిర్వహించడం.

“దేవునివాక్య ప్రగతిశీల వెలుగులో నడుచుకోవడం” అనే చివరి ప్రసంగం ముగింపులో సమావేశితులు యెషయా ప్రవచనము​—⁠సర్వమానవాళి కోసమైన వెలుగు I (ఆంగ్లం) అనే క్రొత్త పుస్తకాన్ని పొందడానికి ఎంతో ఆనందించారు. బైబిలు పుస్తకమైన యెషయాలోని ఒక్కొక్క అధ్యాయాన్నీ చర్చిస్తున్న రెండు సంపుటిలలో ఇది మొదటిది. “యెషయా గ్రంథంలో నేడు మన కోసం ఒక సందేశం ఉంది” అని ప్రసంగీకుడు అన్నాడు. ఆయనింకా ఇలా కొనసాగాడు: “అవును, దానిలోని అనేక ప్రవచనాలు యెషయా కాలంలో నెరవేరాయి. . . . అయితే, యెషయా ప్రవచనాల్లో అనేకం నేడు నెరవేరుతున్నాయి, మరికొన్ని దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకంలో నెరవేరుతాయి.”

మూడవ రోజు​—⁠యెహోవా వాక్యప్రకారం ప్రవర్తించేవారై ఉండండి

సమావేశం చివరి రోజు దినవచన చర్చతో ప్రారంభమైంది. అటుతరువాత “దేవుని చిత్తప్రకారం ప్రవర్తించేవారి కోసం జెఫన్యా చేసిన అర్థవంతమైన ప్రవచనం” అనే గోష్ఠి వచ్చింది. యూదా రాజ్యం పెడదారిపట్టిన కాలంలో యెహోవా చేసినట్లే, ఆయన ఇచ్చే హెచ్చరికను ఇప్పుడు పెడచెవినపెడుతున్న వారిపైకి విపత్తులను తీసుకువస్తాడని ఈ గోష్ఠిలోని మూడు ప్రసంగాలు చూపించాయి. వారు దేవునికి విరుద్ధంగా పాపం చేశారు గనుక వారికి విడుదల లభించక అంధుల్లా నిస్సహాయంగా నడుస్తారు. అయితే క్రైస్తవులు విశ్వసనీయంగా యెహోవాను హత్తుకుని కొనసాగుతున్నారు, గనుక వారు దేవుని ఉగ్రత దినాన రక్షించబడతారు. అంతేగాక వారిప్పుడే ఎన్నో ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు. వారికి బైబిలు సత్యం యొక్క “స్వచ్ఛమైన భాష” మాట్లాడే ఆశీర్వాదం ఉంది. (జెఫన్యా 3:​9, NW) ప్రసంగీకుడు ఇలా అన్నాడు: “స్వచ్ఛమైన భాషను మాట్లాడడంలో మనం సత్యాన్ని నమ్మి, దానిని ఇతరులకు బోధించడం మాత్రమే కాదుగానీ, మన ప్రవర్తన దేవుని శాసనాలతోనూ సూత్రాలతోనూ పొందిక కల్గివుండేలా జాగ్రత్త వహించడం కూడా ఇమిడివుంది.”

“మన కాలానికి హెచ్చరికా మాదిరులు” అనే నాటకం కోసం సమావేశితులు ఎంతో ఉత్సుకతతో వేచివున్నారు. పూర్తి కాస్ట్యూమ్‌లతో కూడిన ఈ నాటకం వాగ్దాన దేశానికి చేరడానికి ముందు వేలాదిమంది ఇశ్రాయేలీయులు ఎలా తమ ప్రాణాల్ని కోల్పోయారో చూపిస్తుంది. ఎందుకలా జరిగిందంటే వాళ్లు యెహోవాను మర్చిపోయి, అన్య స్త్రీల మోహంలో పడి, వారితో వ్యభిచరించి అబద్ధారాధనలో మునిగిపోయారు. నాటకంలోని ప్రధాన పాత్రధారుల్లో ఒకడైన యామీను తొలుత మోయాబు స్త్రీల మోహానికీ యెహోవా పట్ల భక్తికీ మధ్య నలిగిపోయాడు. దైవభక్తిలేని జిమ్రీ చేసిన తప్పుడు తర్కం, మోసకరమైన ఆలోచనా విధానం స్పష్టం చేయబడ్డాయి, అలాగే ఫీనెహాసు విశ్వాసమూ భక్తీ కూడా ఉన్నతపర్చబడ్డాయి. యెహోవాను ప్రేమించనివారితో చేరడంలోని ప్రమాదం ఏమిటో స్పష్టంగా చిత్రీకరించబడింది.

నాటకం, “విని మరిచేవారిగా తయారుకావద్దు” అనే తరువాతి ప్రసంగానికి రంగం సిద్ధం చేసింది. నూతన లోకంలో స్వాస్థ్యాన్ని పొందడానికి మనకు గల యోగ్యతను నిర్ధారించడానికి యెహోవా మన విధేయతను పరీక్షిస్తాడని 1 కొరింథీయులు 10:​1-10 వచనాల విశ్లేషణ చూపించింది. కొందరి విషయంలో ఇప్పుడు కూడా, నూతన విధానంలోకి ప్రవేశించడానికి ఇంత సమీపంగా ఉన్న ఈ కాలంలో కూడా శారీరక కోరికలు ఆధ్యాత్మిక లక్ష్యాల్ని అణగద్రొక్కేస్తున్నాయి. ‘యెహోవా విశ్రాంతిలో’ ప్రవేశించే అవకాశాన్ని కోల్పోవద్దని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించబడ్డారు.​—⁠హెబ్రీయులు 4:⁠1.

“దేవుని ఆశ్చర్యకార్యాలపై ఎందుకు మనస్సు నిలపాలి?” అనేది బహిరంగ ప్రసంగాంశం. యెహోవా ‘అద్భుతక్రియలు’ ఆయన జ్ఞానాన్నీ, మన చుట్టూ ఉన్న భౌతిక సృష్టిపై ఆయనకున్న అధికారాన్నీ ప్రదర్శిస్తున్నాయి. (యోబు 37:​14) యోబు మనస్సుపై సర్వశక్తిమంతుడైన సృష్టికర్త శక్తిని గురించి గట్టి ముద్ర వేయడానికి యెహోవా నుండి బయలువెడలిన లోతైన ప్రశ్నలు సరిపోయాయి. యెహోవా విశ్వసనీయులైన తన సేవకుల పక్షాన భవిష్యత్తులో కూడా “ఆశ్చర్యకార్యాలు” చేస్తాడు. ప్రసంగీకుడు ఇలా ముగించాడు: “యెహోవా గతంలో ఏమి చేశాడో, ఇప్పుడు మన చుట్టూ ఉన్న సృష్టి అంతట్లో ఏమి చేస్తున్నాడో, సమీప భవిష్యత్తులో ఏమి చేస్తానని వాగ్దానం చేశాడో​—⁠ఈ ఆశ్చర్య కార్యాలన్నింటిపై మనం మనస్సు నిలిపేందుకు తగిన కారణాలు సమృద్ధిగా ఉన్నా[యి].”

ఆ వారం కోసమైన కావలికోట అధ్యయన సారాంశం తరువాత సమావేశపు చివరి ప్రసంగం అందించబడింది. “దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించే ఆధిక్యతను ఘనంగా ఎంచండి” అనే ఆ అద్భుతమైన ప్రసంగం దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారిగా ఉండడం ఒక ఘనత అని నొక్కిచెప్పింది. (యాకోబు 1:​22) దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారముగా మనకున్న ఆధిక్యత విశేషమైనదని ప్రేక్షకులకు గుర్తుచేయబడింది, అంతేగాక మనం ఎంత ఎక్కువగా ఆ ఆధిక్యతను ఉపయోగిస్తామో అంత ఎక్కువగా దాన్ని ఉన్నతంగా ఎంచుతాము. సాధ్యమైనంత పూర్తిగా దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారిగా ఉండాలన్న వారి కోరికను ప్రయోజనకరమైన రీతిలో పురికొల్పినటువంటి ఈ జిల్లా సమావేశంలో లభించిన అంశాలపై ధ్యానంచేయమని హాజరైన వారందరూ ప్రోత్సహించబడ్డారు. అత్యానందాన్ని పొందడానికి అదొక్కటే మార్గం.

[25వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీరు దేవుని స్నేహితులు కాగలరు! *

శుక్రవారం మధ్యాహ్నం మీరు దేవుని స్నేహితులు కాగలరు! అనే బ్రోషూరు విడుదల చేయబడింది. ప్రపంచంలోని అనేక భాగాల్లో సరళీకృతమైన బైబిలు విద్యా అవసరం ఎంతగానో ఉంది, ఈ బ్రోషూరు ఆ అవసరాన్ని తీర్చడానికి ఉపయోగించబడుతుంది. పరిమితమైన విద్య కలిగివున్న లేదా చదివే సామర్థ్యం పరిమితంగా ఉన్న ప్రజలకు ఇదెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది.

[అధస్సూచి]

^ పేరా 28 ఈ బ్రోషూరు ప్రస్తుతం ఇండియాలో లభ్యం కావడం లేదు.

[26వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

యెషయా ప్రవచనము​—⁠సర్వమానవాళి కోసమైన వెలుగు

రెండు సంపుటిల్లో మొదటి సంపుటి అయిన యెషయా ప్రవచనము—⁠సర్వమానవాళి కోసమైన వెలుగు I (ఆంగ్లం) పుస్తకాన్ని పొందడానికి సమావేశితులు ఎంతగానో ఉత్తేజితులయ్యారు. ఈ ప్రచురణలో మన కాలంలో యెషయా ప్రవచనం ఎంత ఆచరణాత్మకమైనదన్నదానిపై ఎక్కువ అవధానం కేంద్రీకరించబడింది.