కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం సద్గుణాల్ని ఎలా అలవర్చుకోవచ్చు?

మనం సద్గుణాల్ని ఎలా అలవర్చుకోవచ్చు?

మనం సద్గుణాల్ని ఎలా అలవర్చుకోవచ్చు?

నేటి నిఘంటువులు “సద్గుణాన్ని” “నైతిక శ్రేష్ఠత్వము; మంచితనము” అని నిర్వచిస్తున్నాయి. సద్గుణమంటే “సరైన చర్యలు, సరైన ఆలోచనలు; మంచి వ్యక్తిత్వం.” “సద్గుణం” అని అనువదించబడిన గ్రీకు పదానికి ఉన్న అసలు సాంప్రదాయిక భావంలో “ఎటువంటి శ్రేష్ఠత్వమైనా” ఇమిడివుందని నిఘంటుకారుడైన మార్విన్‌ ఆర్‌. విన్సెంట్‌ చెబుతున్నాడు. అందుకనే వివేకం, ధైర్యం, స్వయం-క్రమశిక్షణ, ధర్మం, కనికరం, పట్టుదల, నిజాయితీ, నమ్రత, యథార్థత వంటివి సద్గుణాలుగా అభివర్ణించబడడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. సద్గుణం “సరియైన ప్రమాణాలకు సరితూగడం” అని కూడా నిర్వచించబడింది.

అయితే శ్రేష్ఠత్వం, ఒప్పు, మంచితనం వంటివాటికి సంబంధించి మనం ఎవరి ప్రమాణాలకు సరితూగాలి? “పునర్జాగారణోద్యమం నుంచి పుట్టిన సంశయవాదం తప్పొప్పుల గురించిన తలంపులనన్నింటినీ వ్యక్తిగత అభిరుచికీ, భావోద్వేగ అభిలాషకూ లేదా సాంస్కృతిక ఎంపికకూ మాత్రమే సంబంధించినవిగా చేసిపారేసిందని ఒక ప్రధాన నైతికత్వపు తత్త్వ సిద్ధాంతం తెలియజేస్తుంది” అని న్యూస్‌వీక్‌ పత్రిక చెబుతోంది. కానీ తప్పొప్పుల్ని నిర్ధారించడానికి ఉన్న సంతృప్తికరమైన మార్గం వ్యక్తిగత అభిరుచి లేదా అభిలాష మాత్రమేనా? కాదు. మనం సద్గుణాల్ని అలవర్చుకోవడానికి మనకు మంచి చెడుల విషయంలో​—⁠అంటే బహుశా ఏదైనా ఒక చర్య, ఒకానొక వైఖరి, లేదా లక్షణం మంచిదని గానీ చెడ్డదని గానీ నిర్ణయించే విషయంలో నమ్మదగ్గ ఒక ప్రమాణం అవసరం.

నైతిక ప్రమాణాలకున్న నిజమైన ఏకైక మూలం

నైతిక ప్రమాణాలకున్న నిజమైన ఏకైక మూలం మానవజాతి సృష్టికర్తయైన యెహోవా దేవుడే. తొలి పురుషుడైన ఆదామును సృష్టించిన పిమ్మట యెహోవా దేవుడు ఆ పురుషుడికి ఈ ఆజ్ఞను ఇచ్చాడు: “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెద[వు].” (ఆదికాండము 2:​16, 17) తన సృష్టి ప్రాణులకు ఏది మంచి ఏది చెడు అన్నది నిర్ణయించే హక్కు కేవలం తనకు మాత్రమే ఉన్నదని సూచించడానికి యెహోవా దేవుడు ఆ వృక్షానికి ఆ విశేషమైన పేరు పెట్టాడు. ఆ విధంగా ఒక వ్యక్తి చర్యల్ని, ఆయన వైఖరిని, వ్యక్తిత్వ లక్షణాల్ని తీర్పు తీర్చడానికి, మరో విధంగా చెప్పాలంటే వాటిని మదింపు చేయడానికి మంచి చెడుల విషయంలోని దేవుని ప్రమాణాలు ఆధారమయ్యాయి. అలాంటి ప్రమాణాలు లేకపోతే మనకు మంచేదో చెడేదో సరిగ్గా గుర్తించడం సాధ్యం కాకపోయేది.

మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని గూర్చిన ఆజ్ఞ, ఆదాము హవ్వల ముందు ఒక ఎంపికను ఉంచింది​—⁠అదే విధేయత చూపించడం లేదా చూపించకపోవడం. వారి విషయంలోనైతే, సద్గుణం ప్రదర్శించడం అంటే ఆ ఆజ్ఞకు విధేయత చూపడమే. కొంత కాలం తర్వాత, యెహోవా ఇంకా తనను ఏది ప్రీతిపరుస్తుందో ఏది ప్రీతిపర్చదో తెలియజేశాడు, దీనంతటినీ మనకోసం బైబిలులో నమోదు చేయించాడు కూడా. కాబట్టి సద్గుణాల్ని అలవర్చుకోవడానికి లేఖనాల్లో ఉన్నట్లుగా యెహోవా యొక్క నీతియుక్తమైన ప్రమాణాలకు సరితూగడం అవసరమౌతుంది.

దేవుని ప్రమాణాలతో పూర్తిగా పరిచయం కల్గివుండండి

మంచి చెడుల సంబంధంగా అవసరమైన ప్రమాణాలను యెహోవా దేవుడు నిర్ధారించాడు గనుక, వాటిని బైబిలులో వెల్లడిచేశాడు గనుక మనం వాటితో పూర్తి పరిచయాన్ని కలిగివుండవద్దా? అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”​—⁠2 తిమోతి 3:16, 17.

ఉదాహరణకు, ముందటి ఆర్టికల్‌లో పేర్కొనబడిన కునిహీటో తన దేశంలోని సంస్కృతి దేన్ని వినయంగా దృష్టించిందో దాన్నే చూపించినప్పుడు ఆయనను తప్పుగా అర్థం చేసుకున్న విషయాన్ని గురించి పరిశీలించండి. లేఖనాధార ప్రమాణాలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయనకు అటుతరువాత మరింత సమతుల్యమైన విధానాన్ని అలవర్చుకోవడానికి సహాయం లభించింది. వినయం ఉండాలని బైబిలు ప్రోత్సహిస్తుందనడంలో సందేహం లేదు, అతివిశ్వాసమూ దురహంకారమూ తప్పని కూడా అది సలహా ఇస్తోంది. (సామెతలు 11:⁠2; మీకా 6:⁠8) అయితే, “పై విచారణకర్త పదవి” కోసమైన అర్హతల్ని గురించి చెప్పేటప్పుడు అపొస్తలుడైన పౌలు ఆ ఆధిక్యత కోసం “ముందుకు రావాలని” చెప్పాడు. (1 తిమోతి 3:⁠1, NW) ఈ ‘ముందుకు రావడం’ అనేది డంబాలు పలుకకుండా లేదా దురహంకారాన్ని ప్రదర్శించకుండా ఉండడం ద్వారా మాత్రమే కాదు గానీ, అనవసరంగా తనను తాను తగ్గించుకోకుండా ఉండడం ద్వారా కూడా చేయాలి.

వ్యాపార రంగంలో నైతిక శ్రేష్ఠత్వం గురించి బైబిలు ఏమి చెబుతుంది? ప్రశ్నించదగ్గ పద్ధతుల్ని వినియోగించడమూ లేదా ప్రభుత్వ నియమాల సంబంధంగా పన్ను చట్టాల సంబంధంగా అడ్డదార్లు తొక్కడం వంటివి నేటి వ్యాపార రంగంలో సర్వసాధారణం. అయితే ఇతరులు ఏమి చేసినప్పటికీ బైబిలు ప్రమాణం ఏమిటంటే మనం “[అ]న్ని విషయములలోను యోగ్యముగా [“నిజాయితీగా,” NW] ప్రవర్తిం[చాలన్నదే].” (హెబ్రీయులు 13:​18) అందుకని, మనం మన దగ్గర పనిచేసేవారితో, మన యజమానులతో, వినియోగదారులతో, ఈ లోక ప్రభుత్వాలతో నిజాయితీగా ధర్మంగా ఉండడం ద్వారా సద్గుణాన్ని అలవర్చుకోగలము. (ద్వితీయోపదేశకాండము 25:​13-16; రోమీయులు 13:⁠1; తీతు 2:​9, 10) నిజాయితీ మూలంగా తప్పకుండా నమ్మకమూ మంచి పేరూ వస్తాయి. ఇక ఒప్పందాల విషయానికి వస్తే, వాటిని లిఖితపూర్వకంగా ఉంచితే అటుతర్వాత ‘కాలవశమున’ తలెత్తగల అపార్థాలు, చిక్కులు రాకుండా ఉంటాయి.​—⁠ప్రసంగి 9:​11; యాకోబు 4:13, 14.

మనం సద్గుణాల్ని అలవర్చుకోవల్సిన అవసరం ఉన్న మరో రంగం మన వస్త్రధారణ, కేశాలంకరణ. బట్టల ఎంపిక ఒక్కో సంస్కృతికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, అధునాతన స్టైళ్ళను ఫ్యాషన్‌లను పాటించాలన్న ఒత్తిడి తీవ్రంగా ఉండవచ్చు. కానీ కొత్తగా వచ్చే ప్రతిదాన్ని వేలంవెఱ్ఱిగా ఎందుకు అనుసరించాలి, కొత్తగా వచ్చే ప్రతి ఫ్యాషన్‌నీ మనం ఎందుకు అనుకరించాలి? మనం “ఈ లోక మర్యాదను అనుసరింపక” ఉండాలని బైబిలు ఉద్బోధిస్తుంది. (రోమీయులు 12:⁠2) ఏవో నియమాల్ని పెట్టడానికి బదులుగా అపొస్తలుడైన పౌలు దైవప్రేరేపణతో ఇలా వ్రాశాడు: “స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.” (1 తిమోతి 2:​9, 10) ఈ ప్రాధమిక ప్రమాణం స్త్రీపురుషులందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది. నిజమే, సాంస్కృతిక అభిరుచులు లేదా వ్యక్తిగత ఎంపికల మూలంగా ఆహ్లాదకరమైన రీతిలో స్టైళ్ళలో వైవిధ్యం ఉండడానికి సాధ్యమౌతుంది.

దేవుడు స్పష్టంగా ఖండించే అనైతికమైన ప్రవర్తనను కూడా బైబిలు గుర్తిస్తుంది. 1 కొరింథీయులు 6:​9, 10లలో మనం ఇలా చదువుతాము: “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” మునుపు పేర్కొనబడిన మరీయకు మన సృష్టికర్త పెట్టిన నైతిక శ్రేష్ఠత్వపు ప్రమాణం ప్రకారం హ్వాన్‌తో తాను పెట్టుకున్న సంబంధం తప్పనీ తనపై దేవుని అంగీకారం ఉండాలంటే దాన్ని వెంటనే తెంచేసుకోవాలనీ గ్రహించడానికి ఈ వచనం సహాయపడింది. దీన్ని బట్టి స్పష్టమౌతున్నదేమిటంటే, సద్గుణాల్ని అలవర్చుకోవడానికి మనం యెహోవా ప్రమాణాలతో చాలా సన్నిహితంగా పరిచయం కలిగివుండాలి.

హృదయపూర్వకంగా నేర్చుకోండి

చెడును నిర్లిప్తంగా నివారించడం మాత్రమే సద్గుణం కాదు. అందులో నైతిక శక్తి కూడా ఇమిడి ఉంది. సద్గుణవంతుని దగ్గర మంచితనం ఉంటుంది. “సద్గుణాల్ని హృదయాన్నీ మనస్సునూ పెట్టి నేర్చుకోవల్సిందే” అని ఒక ప్రొఫెసర్‌ అంటున్నాడు. కాబట్టి సద్గుణాల్ని అలవర్చుకోవడానికి దేవుని వాక్యంతో పూర్తి పరిచయం కల్గివుండడంకన్నా ఎక్కువే అవసరమౌతుంది. అందుకు, ఆ వాక్యంలో ఏమి వ్రాసి ఉందో దానిపై ధ్యానించడం కూడా అవసరం. తద్వారా యెహోవాపట్ల మన హృదయాలు కృతజ్ఞతతో నిండి, లేఖనాధార సూత్రాల్ని మన జీవితాల్లో అన్వయించుకునేందుకు మనం కదిలించబడతాము.

“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది” అని కీర్తనకర్త అన్నాడు. “దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.” (కీర్తన 119:​97) రాజైన దావీదు ఇలా వ్రాశాడు: “పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను; నీ [దేవుని] క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను.” (కీర్తన 143:⁠5) మనం కూడా మన బైబిలు అధ్యయనంలో, బైబిలు ఆధారిత ప్రచురణల అధ్యయనంలో ప్రార్థనాపూర్వకమైన ధ్యానాన్ని అంతర్భాగంగా చేయాలి.

నిజమే, శ్రద్ధాపూర్వకమైన అధ్యయనంతోపాటు ధ్యానం చేయడం కోసం సమయం కనుగొనడం ఒక సవాలే. కానీ సద్గుణాల్ని అలవర్చుకోవడానికి మనం ఇతర కార్యకలాపాల నుండి సమయాన్ని తీసుకోవల్సివుంటుంది. (ఎఫెసీయులు 5:​15, 16) ఏరన్‌ అనే 24 ఏండ్ల యౌవనస్థుడు తానింతకు మునుపు లేచే దానికన్నా 30 నిమిషాలు ముందుగా లేవడం ద్వారా సమయాన్ని కనుగొన్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “మొదట్లో నేనా అరగంటపాటు కేవలం బైబిలును మాత్రమే చదివాను. కానీ ఇటీవలనే నేను ధ్యానించాల్సిన అవసరాన్ని గుర్తించాను. అందుకని ఇప్పుడు నేను ఆ సమయంలో సగంపాటు అప్పుడే చదివిన దానిపై మనస్సు నిలపడానికి ఉపయోగిస్తున్నాను. ఇది చాలా ప్రతిఫలదాయకంగా ఉంది.” మనం ఇతర సమయాల్లో కూడా ధ్యానించవచ్చు. యెహోవాకు కీర్తన పాడుతూ దావీదు ఇలా అన్నాడు: “రాత్రిజాములయందు నిన్ను ధ్యానిం[చెదను].” (కీర్తన 63:⁠4) మరోచోట బైబిలు ఇలా చెబుతుంది: “సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువె[ళ్ళెను].”​—⁠ఆదికాండము 24:⁠63.

సద్గుణాల్ని అలవర్చుకోవడానికి ధ్యానం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే ధ్యానించినప్పుడే మనం యెహోవా భావించిన రీతిలో భావిస్తాము, ఆయన దృక్కోణాల్ని మన స్వంతం చేసుకుంటాము. ఉదాహరణకు దేవుడు జారత్వాన్ని నిషేధిస్తున్నాడని మరీయకు తెలుసు. కానీ “చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని” ఉండడానికి ఆమె కీలకమైన బైబిలు వచనాలను ధ్యానించాల్సిన అవసరం ఏర్పడింది. (రోమీయులు 12:⁠9) ‘మన అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, ధనాపేక్షను చంపివేయాలి’ అని ఉద్బోధిస్తున్న కొలొస్సయులు 3:5ను చదివిన తరువాత తన జీవితంలో మార్పులు చేసుకోవల్సిన అవసరాన్ని ఆమె గ్రహించేలా ఆమెకు సహాయం అందించబడింది. మరీయ తనను తాను ఇలా ప్రశ్నించుకోవల్సివచ్చింది: ‘నేను ఎటువంటి కామాతురతను చంపివేసుకోవాలి? అపవిత్రమైన కోరికల్ని రేకెత్తించే ఎటువంటి విషయాలకు నేను దూరంగా ఉండాలి? నేను పురుషులతో వ్యవహరించే విధానంలో మార్పులు చేసుకోవల్సిన అవసరం ఉందా?’

ధ్యానంలో ఒక చర్యకు ఏర్పడగల ఫలితాన్ని గురించి ఆలోచించడం ఇమిడివుంది. క్రైస్తవులు జారత్వాన్ని విసర్జించాలనీ, “[ఎ]వడును అతిక్రమించి తన సహోదరునికి మోసము [“తన సహోదరుని హక్కులను అతిక్రమించరాదు,” NW] చేయకుండ” ఉండేలా ఆశానిగ్రహాన్ని పెంపొందించుకోవాలనీ పౌలు ఉద్బోధించాడు. (1 థెస్సలొనీకయులు 4:​3-7) ఇక్కడ మనం ఈ మంచి ప్రశ్నల గురించి ఆలోచించడం యుక్తం: ‘నేనీ చర్యను చేస్తే నాకై నేనూ, అలాగే నా కుటుంబానికీ లేదా ఇతరులకూ ఎటువంటి చెరుపును చేసినట్లౌతుంది? ఆధ్యాత్మికంగా, భావోద్రేకంగా, శారీరకంగా నాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? గతంలో దేవుని చట్టాల్ని అతిక్రమించిన వారికి ఎలాంటి పరిణామాలు కలిగాయి?’ అలాంటి ప్రశ్నల్ని గురించి మరీయ కూడా తలంచడం ద్వారా ఆమె హృదయం బలపర్చబడింది, మనం కూడా అలా చేయడం సాధ్యమే.

మాదిరుల నుండి నేర్చుకోండి

సద్గుణాల్ని తరగతిగదిలో నేర్పించడం సాధ్యమా? ఈ ప్రశ్న వేలాది సంవత్సరాలుగా ఆలోచనకర్తల్ని పీడించింది. గ్రీకు తత్త్వవేత్త అయిన ప్లేటో అది సాధ్యమేనన్న తలంపు వైపుకి మొగ్గాడు. మరోవైపు అరిస్టాటిల్‌ సద్గుణాల్ని ఆచరణలో పెట్టడం ద్వారా మాత్రమే నేర్చుకోవడం సాధ్యమౌతుందని తర్కించాడు. ఒక విలేఖరి ఈ వివాదాంశాన్ని ఈ మాటల్లో క్లుప్తీకరించాడు: “ఒక్కమాటలో చెప్పాలంటే, సద్గుణాల్ని గూర్చిన నీతిశాస్త్రాన్ని స్వంతంగా నేర్చుకోవడం సాధ్యంకాదు. అలాని దాన్ని పాఠ్యపుస్తకాల్లో నుండి నేర్పించడమూ సాధ్యంకాదు. మంచి వ్యక్తిత్వం అనేది సద్గుణాల్ని ప్రోత్సహించడం, ప్రతిఫలాన్నివ్వడం వంటివి ఉండే . . . సమాజాలతో సహజీవనం చేయడం ద్వారా వస్తుంది.” మరైతే మనం నిజంగా సద్గుణవంతులైన వ్యక్తుల్ని ఎక్కడ కనుగొనగలం? అత్యధిక సంస్కృతుల్లో కనీసం పురాణాల్లోని వీరుల గురించిన కథల్లో అయినా సద్గుణాల సంబంధంగా ఏవో కొన్ని మాదిరులు ఉన్నప్పటికీ, బైబిల్లో మాత్రం వాస్తవికమైన మాదిరులు సమృద్ధిగా ఉన్నాయి.

సద్గుణాల సంబంధంగా అతి గొప్ప మాదిరి యెహోవాయే. ఆయనెల్లప్పుడు సద్గుణవంతంగానే చర్య తీసుకుంటాడు, ఆయన చేసేదెల్లప్పుడు నీతియుక్తమైనది మంచిదీను. మనం “దేవునిపోలి నడుచు”కోవడం ద్వారా సద్గుణాల్ని అలవర్చుకోగలం. (ఎఫెసీయులు 5:⁠1) దేవుని కుమారుడైన యేసుక్రీస్తు “తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు [మనకు] మాదిరియుంచిపోయెను.” (1 పేతురు 2:​21) అంతేగాక, బైబిల్లో అబ్రాహాము, శారా, యోసేపు, రూతు, యోబు, దానియేలు, ఆయన తోడి ముగ్గురు హెబ్రీయులు వంటి విశ్వసనీయులైన వ్యక్తుల వృత్తాంతాలున్నాయి. ఆధునిక దినాల్లో సద్గుణవంతులైన యెహోవా సేవకుల మాదిరులను మనం విస్మరించరాదు.

మనం సఫలం కాగలం

మనం దేవుని దృష్టిలో సద్గుణవంతంగా ప్రవర్తిస్తూ మనం నిజంగా సఫలులం కాగలమా? అపరిపూర్ణత్వాన్ని వారసత్వంగా పొందినందున కొన్నిసార్లు మనలో మన మనస్సుకూ మన శరీరానికీ మధ్య గొప్ప యుద్ధం చెలరేగుతుండవచ్చు​—⁠అంటే ఒకవైపు సద్గుణవంతంగా ప్రవర్తించాలనీ మరోవైపు పాపభరిత ప్రవృత్తిని అనుసరించాలనీ పోరాటం జరుగుతుండవచ్చు. (రోమీయులు 5:​12; 7:​13-23) కానీ ఆ పోరాటాన్ని దేవుని సహాయంతో జయించవచ్చు. (రోమీయులు 7:​24, 25) యెహోవా మనకు తన వాక్యాన్నీ బైబిలు ఆధారిత ప్రచురణల్నీ అందజేస్తున్నాడు. లేఖనాల్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం ద్వారా, ప్రార్థనాపూర్వకంగా వాటిని ధ్యానించడం ద్వారా మనం హృదయ నిర్మలత్వాన్ని సంపాదించగలము. అలాంటి నిర్మలమైన హృదయంలో నుండే సద్గుణవంతమైన ఆలోచనలు, మాటలు, చర్యలు ఉద్భవిస్తాయి. (లూకా 6:​45) యెహోవా దేవుని, యేసుక్రీస్తు యొక్క మాదిరుల ఆధారంగా మనం కూడా దైవిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగలము. అంతేగాక, నేడు దేవుణ్ణి విశ్వసనీయంగా సేవిస్తున్న వ్యక్తుల నుండి మనం నిశ్చయంగా ఎంతో నేర్చుకోవచ్చు.

సద్గుణం మీదా, ప్రశంసనీయమైన మరితర విషయాల మీదా “ధ్యానముంచుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు తన పాఠకులకు ఉద్బోధించాడు. అలా చేసినప్పుడు మనకు తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు లభిస్తాయి. (ఫిలిప్పీయులు 4:⁠8, 9) యెహోవా సహాయంతో మనం సద్గుణాల్ని అలవర్చుకోవడంలో సఫలులం కాగలము.

[6వ పేజీలోని చిత్రం]

మీ బైబిలు అధ్యయనంలో భాగంగా ధ్యానించండి

[7వ పేజీలోని చిత్రం]

క్రీస్తుయేసును అనుకరించడం ద్వారా దైవిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోండి