కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సద్గుణాల్ని ఎందుకు అలవర్చుకోవాలి?

సద్గుణాల్ని ఎందుకు అలవర్చుకోవాలి?

సద్గుణాల్ని ఎందుకు అలవర్చుకోవాలి?

జపాను దేశస్థుడైన కునిహీటో అనే ఒక మధ్య వయస్కుడు ఇటీవల అమెరికాకి వలసవెళ్ళాడు. * అక్కడికి వెళ్ళిన కొన్ని వారాలకే ఆయన తన కెరీర్‌ను దెబ్బతీసే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కునిహీటో ఇలా చెబుతున్నాడు: “నా అమెరికన్‌ సూపర్‌వైజర్‌ నన్నొక బాధ్యతను చేపట్టమని అడిగాడు, దాన్ని స్వీకరించగలనని నాకు గట్టి నమ్మకమే ఉంది. కానీ వినయం మనకుండాల్సిన ఒక సద్గుణమని నా పెంపకం నాకు నేర్పించింది, అందుకని ‘నేను చేయగలనని నాకంత నమ్మకం లేదు, కానీ నాకు సాధ్యమైనంత వరకూ ప్రయత్నిస్తాను’ అన్నాను. దాంతో ఆ పై అధికారి, నేనంత సమర్థుణ్ణి కాననీ, నాకు ఆత్మవిశ్వాసం లేదనీ అర్థం చేసుకున్నాడు. నాకీ విషయం తెలిసినప్పుడు నేను కొన్ని మార్పుల్ని చేసుకోవల్సిన అవసరం ఉందని గ్రహించాను.”

న్యూయార్క్‌లో నివసించే మరీయ తన క్లాసులో చాలా తెలివైన విద్యార్థిని, తన తోటి విద్యార్థులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆమె క్లాసులోని హ్వాన్‌ అనే విద్యార్థి మరీయ సహాయాన్ని తరచుగా కోరుతుండేవాడు. అయితే ఆయన స్త్రీపట్ల పురుషునికి ఉండే ఆసక్తిని కూడా ప్రదర్శించాడు, ఆమెను మెప్పించడానికి ప్రయత్నించేవాడు. నైతికంగా పవిత్రంగా ఉండాలని మరీయ కోరుకున్నప్పటికీ హ్వాన్‌ అవినీతికరమైన ప్రతిపాదనలకు ఆమె లొంగిపోయింది, లైంగిక దుష్ప్రవర్తనలో పాల్గొంది.

భిన్నమైన సంస్కృతులూ, నైతిక భ్రష్టత్వమూ ఉన్న నేటి లోకంలో సద్గుణాన్ని ప్రదర్శించడం నిజంగానే ఒక సవాలు. కాబట్టి అసలు సద్గుణాన్ని ఎందుకు అలవర్చుకోవాలి? ఎందుకంటే, సద్గుణవంతమైన ప్రవర్తన దేవుణ్ణి ప్రీతిపరుస్తుంది గనుక, మనలో అధికశాతం మంది ఆయన అనుగ్రహాన్ని తప్పక కోరుకుంటాము గనుక.

దేవుని వాక్యమైన బైబిలు తన పాఠకులు సద్గుణాన్ని అలవర్చుకోవాలని ఉద్బోధ చేస్తుంది. ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాస్తున్నాడు: “యే యోగ్యతయైనను [“సద్గుణమైనను,” NW] మెప్పైనను ఉండినయెడల వాటిమీద ధ్యానముంచుకొనుడి.” (ఫిలిప్పీయులు 4:⁠8) ‘మన విశ్వాసానికి సద్గుణాన్ని అమర్చుకో’వడంలో తీవ్రంగా ప్రయత్నించాలని అపొస్తలుడైన పేతురు మనకు ఉద్బోధిస్తున్నాడు. (2 పేతురు 1:⁠5) కానీ ఈ సద్గుణం అంటే ఏమిటి? అదేదైనా తరగతి గదిలో నేర్పించదగిందా? దాన్ని మనమెలా అలవర్చుకోగలం?

[అధస్సూచి]

^ పేరా 1 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.