కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నా అవసరం ఉన్నచోట సేవచేయడం

నా అవసరం ఉన్నచోట సేవచేయడం

జీవిత కథ

నా అవసరం ఉన్నచోట సేవచేయడం

జేమ్స్‌ బి. బెరీ చెప్పినది

అది 1939. ఆర్థిక మాంద్యం మూలంగా అమెరికాలో జీవితం కష్టతరమైపోతోంది, ఐరోపా అంతటిలో యుద్ధం చెలరేగుతోంది. మా తమ్ముడు బెనెట్‌, నేను పని వెతుక్కుంటూ మిస్సిసిప్పీలోని మా ఇంటి నుండి టెక్సాస్‌లోని హౌస్టన్‌కు వెళ్లాము.

వసంతకాలం చివరిలో ఒకరోజు, హిట్లర్‌ సైన్యాలు పోలాండ్‌లోకి ప్రవేశించాయి అనే ప్రకటనను మేము రేడియోలో విన్నాము. “అర్మగిద్దోను ప్రారంభమైంది!” అన్నాడు మా తమ్ముడు. వెంటనే మేము మా ఉద్యోగాలు వదిలేశాము. దగ్గరలో ఉన్న రాజ్యమందిరానికి వెళ్లి మొదటిసారిగా కూటాలకు హాజరయ్యాము. ఎందుకు రాజ్యమందిరానికి? మొదటి నుండి చెప్తానుండండి.

నేను 1915 లో మిస్సిసిప్పీలోని హెబ్రోనులో జన్మించాను. మేము ఒక పల్లె ప్రాంతంలో నివసించేవాళ్ళం. అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలువబడుతున్న యెహోవా సాక్షులు సంవత్సరానికి ఒకసారి ఆ ప్రాంతానికి వచ్చి, ఎవరి ఇంట్లోనైనా ప్రసంగం ఇవ్వడానికి ఏర్పాట్లు చేసేవారు. ఫలితంగా, మా తల్లిదండ్రుల దగ్గర ఎన్నో బైబిలు ప్రచురణలు ఉండేవి. నరకం వేడిగా ఉండదనీ, ఆత్మ మరణిస్తుందనీ, నీతిమంతులు భూమిపై నిరంతరం జీవిస్తారనీ ఆ పుస్తకాలు బోధిస్తున్న విషయాలను బెనెట్‌, నేను నమ్మడం మొదలుపెట్టాము. అయినా, మేము నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉంది. నేను పాఠశాల చదువు ముగించిన తర్వాత కొంతకాలానికి నేను, తమ్ముడు పని వెతుక్కుంటూ టెక్సాస్‌కు వెళ్లాము.

చివరికి మేము అక్కడ సాక్షులను రాజ్యమందిరంలో కలుసుకున్నప్పుడు, మీరు పయినీర్లా అని వారు మమ్మల్ని అడిగారు. పయినీరంటే యెహోవాసాక్షుల పూర్తికాల సేవకుడని మాకు ఏమాత్రం తెలియదు. తర్వాత, ప్రకటించడం మీకు ఇష్టమేనా అని వాళ్లు అడిగారు. “ఇష్టమే!” అని మేము సమాధానమిచ్చాము. ఎలా ప్రకటించాలో చూపించేందుకు వారు ఎవరినైనా మాతో పంపిస్తారని మేము అనుకున్నాము. దానికి బదులు, వాళ్లు మాకు టెరిటరీ కార్డు ఇచ్చి, “అక్కడ పనిచేయండి!” అని చెప్పారు. ఎలా ప్రకటించాలనేది నాకు బెనెట్‌కు ఏమాత్రం తెలియదు, అవమానాలపాలవ్వడం మాకేమాత్రం ఇష్టం లేదు. చివరికి, మేము ఆ టెరిటరీ కార్డును సంఘానికి తిరిగి పంపించి, మిస్సిసిప్పీకి వెళ్లిపోయాము!

బైబిలు సత్యాన్ని మా స్వంతం చేసుకోవడం

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, దాదాపు ఒక సంవత్సరం పాటు మేము సాక్షుల ప్రచురణలను ప్రతిరోజు చదివాము. మాకు కరెంటు ఉండేది కాదు, కాబట్టి రాత్రి మంట వెలుగులో మేము చదివేవాళ్ళం. ఆ రోజుల్లో జోన్‌ సర్వెంట్లు లేక ప్రయాణ పైవిచారణకర్తలు యెహోవాసాక్షుల సంఘాలను, ఒంటరిగా ఉన్న సాక్షులను ఆధ్యాత్మికంగా బలపర్చేందుకు సందర్శించేవారు. ఆ సేవకుల్లో ఒకరైన టెడ్‌ క్లీన్‌ మా సంఘాన్ని దర్శించి, ప్రకటనా పనికి బెనెట్‌ను నన్ను తనతో తీసుకువెళ్లాడు, తరచూ ఒకేసారి మా ఇద్దరినీ తీసుకెళ్లేవాడు. పయినీరు సేవ అంటే ఏమిటో ఆయన మాకు వివరించాడు.

ఆయనతో సహవసించడం దేవుని సేవలో ఎక్కువగా పాల్గొనడం గురించి మేము ఆలోచించేలా చేసింది. 1940 ఏప్రిల్‌ 18న బెనెట్‌కూ, మా చెల్లి వల్వకూ, నాకూ సహోదరుడు క్లీన్‌ బాప్తిస్మం ఇచ్చాడు. మా అమ్మానాన్నలు మేము బాప్తిస్మం తీసుకునేటప్పుడు అక్కడే ఉన్నారు, వారు మా నిర్ణయాన్ని బట్టి ఎంతో ఆనందించారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు. వారిద్దరూ తమ మరణం వరకూ నమ్మకంగా ఉన్నారు, నాన్నగారు 1956 లో, అమ్మ 1975 లో మరణించారు.

నేను పయినీరు సేవ చేయగలనేమోనని సహోదరుడు క్లీన్‌ నన్ను అడిగినప్పుడు, నాకు ఇష్టమే అని చెప్పాను, కానీ నా దగ్గర డబ్బు, బట్టలు అసలేమీ లేవు. ఆయన, “ఫరవాలేదు వాటి గురించి నేను శ్రద్ధ తీసుకుంటాను” అన్నాడు. నిజంగానే ఆయనలా చేశాడు. మొదట ఆయన పయినీరింగ్‌ కోసం నా అప్లికేషన్‌ పంపించాడు. తర్వాత ఆయన నన్ను తనతోపాటు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూ ఓర్లీన్స్‌కు తీసుకువెళ్లి, రాజ్యమందిరం పైనున్న చక్కని అపార్ట్‌మెంట్లను నాకు చూపించాడు. అవి పయినీర్ల కోసం. త్వరలోనే నేను అక్కడికి వెళ్లి పయినీరు సేవ ప్రారంభించాను. పయినీర్లకు బట్టలు, డబ్బు, ఆహారం ఇవ్వడం ద్వారా న్యూ ఓర్లీన్స్‌లోని సాక్షులు సహాయం చేసేవారు. పగటి సమయంలో సహోదరులు మా కోసం భోజనం తీసుకుని వచ్చి తలుపు దగ్గర వదిలి వెళ్లేవారు లేదా ఫ్రిజ్‌లో పెట్టేవారు. దగ్గరలోనే ఒక హోటల్‌ ఉన్న సహోదరుడు హోటల్‌ను మూసే ముందు వచ్చి ఆ రోజున మిగిలిపోయిన తాజా ఆహారపదార్థాలైన మాంసం, బ్రెడ్‌, చిల్లీ కాన్‌ కార్నె, తీపి పదార్థాలు వంటివాటిని తీసుకువెళ్లమని ఆహ్వానించేవాడు.

మూకుమ్మడి దౌర్జన్యాన్ని ఎదుర్కోవడం

కొంతకాలం తర్వాత నన్ను మిస్సిసిప్పీలోని జాక్‌సన్‌లో పయినీరింగ్‌ చేయడానికి పంపించారు. నా సహచరుడు నేను మూకుమ్మడి దౌర్జన్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది, చట్టం అమలు జరిగేలా చూసే స్థానిక ఏజెంట్లు వారికి మద్దతునిస్తున్నట్లు ఉంది! మా తర్వాతి నియామకం మిస్సిసిప్పీలోని కొలంబస్‌. అక్కడ కూడా అలాగే జరిగింది. మేము అన్ని జాతుల, దేశాల ప్రజలకు ప్రకటించేవారం గనుక, కొంతమంది శ్వేతజాతీయులు మమ్మల్ని ద్వేషించేవారు. మేము తిరుగుబాటు చేస్తున్నామని చాలామంది నమ్మేవారు. ఎంతో దేశభక్తిగల సంస్థ అయిన అమెరికన్‌ లీజన్‌కు చెందిన ఒక ఉన్నతాధికారికి ఆ తలంపు ఉండేది. ఆగ్రహం చెందిన మూకలు మాపై దాడిచేసేలా ఆయన అనేకసార్లు ప్రేరేపించాడు.

కొలంబస్‌లో మేము వీధిలో పత్రికలు అందజేస్తుండగా ఆ మూక మాపైకి వచ్చింది. అది మాపై జరిగిన మొదటి దాడి. వాళ్లు మమ్మల్ని అద్దాల దుకాణం కిటికీ మీదికి నెట్టారు. ఏమి జరుగుతుందో చూడడానికి ఒక గుంపు పోగైంది. త్వరలోనే పోలీసులు వచ్చి మమ్మల్ని కోర్టుహౌసుకు తీసుకువెళ్లారు. ఆ మూక మాతోపాటు కోర్టుహౌసుకు వచ్చి, మేము ఫలాని తేదీకల్లా ఆ పట్టణాన్ని విడిచి వెళితేనే సజీవంగా ఉంటామని అక్కడున్న అధికారులందరి ముందూ ప్రకటించారు. ఆ తేదీ తర్వాత మేము వెళ్లాలంటే ప్రాణాలతో వెళ్లలేము! కాబట్టి కొంతకాలంపాటు పట్టణంలో నుండి వెళ్లిపోవడం మంచిదని మేము తలంచాము. కానీ కొన్నివారాల తర్వాత మేము తిరిగి వచ్చి మళ్లీ ప్రకటించడం మొదలుపెట్టాము.

ఆ తర్వాత కొంతకాలానికి ఎనిమిదిమందితో కూడిన ఒక గుంపు మాపైకి వచ్చి మమ్మల్ని తమ రెండు కారుల్లోకి బలవంతంగా ఎక్కించారు. వాళ్లు మమ్మల్ని అడవుల్లోకి తీసుకువెళ్లి మా బట్టలు ఊడదీసి, నా బెల్టు తీసుకొని దానితోనే మా ఇరువురిలో ఒక్కొక్కరినీ 30 దెబ్బలు చొప్పున కొట్టారు! వాళ్ల దగ్గర తుపాకీలు, తాళ్లు ఉన్నాయి, మాకు భయమేసిందనే చెప్పాలి. వాళ్లు మమ్మల్ని కట్టేసి నదిలో పడేస్తారనుకున్నాను. వాళ్లు మా ప్రచురణలను చింపేసి అంతటా వెదజల్లి, మా ఫోనోగ్రాఫ్‌ను ఒక చెట్టు మొద్దుకు గుద్ది పగులగొట్టారు.

మమ్మల్ని కొట్టిన తర్వాత, బట్టలు వేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా అడవిలో నుండి నడిచి వెళ్లిపోమని చెప్పారు. మేము నడుస్తుండగా, మేము తిరిగి వెనక్కి చూసే సాహసం గనుక చేస్తే వాళ్లు తుపాకీతో కాల్చేస్తారని నిజంగానే తలంచాము, అయితే అలాంటిదేమీ జరగలేదు! కానీ కొన్ని నిముషాల తర్వాత, వాళ్లు కార్లలో వెళ్లిపోవడం మాకు వినిపించింది.

మరో సందర్భంలో, ఆగ్రహంతో ఉన్న ఒక మూక మమ్మల్ని తరమడంతో, తప్పించుకునేందుకు మేము మా బట్టలు మెడకు కట్టుకుని నదిలో ఈత కొడుతూ పారిపోవలసి వచ్చింది. అది జరిగిన కొంతకాలానికే, మేము తిరుగుబాటు నేరంపై అరెస్టు చేయబడ్డాము. విచారణ జరుగక ముందే మేము మూడు వారాలు జైలులో గడిపాము. ఆ సంఘటన కొలంబస్‌ అంతటా బాగా ప్రచారమయ్యింది. దగ్గరలో ఉన్న కాలేజీ విద్యార్థులు ఆ కేసు విచారణను చూడ్డానికి హాజరయ్యేందుకుగానూ క్లాసుల్లో నుండి త్వరగా వెళ్ళడానికి వారిని అనుమతించడం కూడా జరిగింది. ఆ రోజు వచ్చేసరికి, కోర్టు పూర్తిగా నిండిపోయింది, కేవలం నిలబడ్డానికే స్థలముంది! రాష్ట్రం తరఫున సాక్ష్యమిచ్చే వారిలో ఇద్దరు ప్రీచర్లూ, ఒక మేయరు, ఒక పోలీసు ఉన్నారు.

మాకు ప్రాతినిధ్యం వహించడానికి జి. సి. క్లార్క్‌ అనే సాక్షి అయిన న్యాయవాదిని, ఆయన సహచరుడ్ని పంపించారు. తిరుగుబాటు చేశామని మోపబడిన నిందలకు తగినంత సాక్ష్యాధారం లేనందున కేసును కొట్టివేయాలని వారు అడిగారు. సహోదరుడు క్లార్క్‌తో పని చేస్తున్న న్యాయవాది, యెహోవాసాక్షి కాకపోయినప్పటికీ, మా పక్షాన శక్తివంతమైన వ్యాఖ్యానాలు చేశాడు. ఒక సందర్భంలో ఆయన న్యాయమూర్తితో ఇలా అన్నాడు, “యెహోవాసాక్షులు పిచ్చివారని ప్రజలంటారు. పిచ్చివారా? థామస్‌ ఎడిసన్‌ పిచ్చివాడు!” తర్వాత ఆయన ఒక బల్బు వైపు చూపించి, “కానీ ఆ బల్బును చూడండి!” అన్నాడు. బల్బును కనుగొన్న ఎడిసన్‌ను కొందరు పిచ్చివానిగా పరిగణించవచ్చు, కానీ ఆయన సాధించినవాటి గురించి ఎవరూ వాదించలేరు.

సాక్ష్యాధారాన్ని విన్న తర్వాత జడ్జి న్యాయవాదితో ఇలా అన్నాడు: “వాళ్లు తిరుగుబాటు చేశారన్నదానికి మీ దగ్గర చిన్న సాక్ష్యాధారం కూడా లేదు, వాళ్లకు ఈ పని చేసే హక్కు ఉంది. మీ దగ్గర తగిన సాక్ష్యాధారం ఉంటేనే తప్ప, వాళ్లను మళ్లీ ఎప్పుడూ ఈ కోర్టురూములోకి తీసుకువచ్చి రాష్ట్రం సమయాన్ని డబ్బునే గాక నా సమయాన్ని కూడా వ్యర్థం చేయవద్దు!” విజయం మాదే!

అయితే ఆ తర్వాత జడ్జి మమ్మల్ని తన గదిలోకి పిలిచాడు. మొత్తం పట్టణమంతా తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మమ్మల్నిలా హెచ్చరించాడు: “నేను చెప్పింది చట్టం ప్రకారం చెప్పాను, కానీ నేను వ్యక్తిగతంగా మీ ఇద్దరికీ ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి, లేకపోతే వాళ్లు మిమ్మల్ని చంపేస్తారు!” ఆయన చెప్తున్నది నిజమేనని మాకు తెలుసు, కాబట్టి మేము ఆ పట్టణాన్ని విడిచి వెళ్లిపోయాము.

అక్కడి నుండి నేను టెన్నెస్సీలోని క్లార్క్స్‌విల్లేలో ప్రత్యేక పయినీర్లుగా సేవచేస్తున్న బెనెట్‌ వల్వలను కలుసుకున్నాను. కొన్ని నెలల తర్వాత, మమ్మల్ని కెంటుకీలోని పారిస్‌కు నియమించారు. ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, మేము అక్కడ ఒక సంఘాన్ని ఇక స్థాపించబోతామనే తరుణంలో, నేను బెనెట్‌ చాలా ప్రత్యేకమైన ఒక ఆహ్వానాన్ని అందుకున్నాము.

మిషనరి సేవకు

బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క రెండవ తరగతికి రమ్మన్న ఆహ్వానాన్ని మేము అందుకున్నప్పుడు, ‘బహుశా వాళ్లు పొరపాటు చేసి ఉంటారు! మిస్సిసిప్పీకి చెందిన ఇద్దరు పేద యౌవనస్థులను ఆ స్కూలుకి వాళ్లు ఎందుకు పిలుస్తారు?’ అనుకున్నాము. బహుశా వాళ్లకు విద్యావంతులైన ప్రజలు కావాలేమో అనుకున్నాము, అయినా మేము వెళ్లాము. ఆ తరగతిలో 100మంది విద్యార్థులు ఉన్నారు, అది ఐదు నెలలపాటు కొనసాగింది. మేము 1944, జనవరి 31న పట్టభద్రులమయ్యాము, మాకు విదేశాల్లో నియామకం లభిస్తుందని మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో, పాస్‌పోర్ట్‌ వీసాల కోసం చాలా సమయం పట్టేది కాబట్టి విద్యార్థులు అమెరికాలోనే తాత్కాలికంగా నియమించబడేవారు. అలబామా, జార్జియాలలో కొంతకాలంపాటు సేవచేసిన తర్వాత, బెనెట్‌, నేను మా మా నియామకాలను పొందాం​—⁠వెస్ట్‌ ఇండీస్‌లోని బార్బడోస్‌కు.

రెండవ ప్రపంచ యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది, యెహోవా సాక్షుల పని, సాహిత్యం బార్బడోస్‌తో సహా చాలా ప్రాంతాల్లో నిషేధించబడింది. అక్కడ కస్టమ్స్‌ దగ్గర అధికారులు మా సామానును తెరిచి తనిఖీ చేసి మేము దాచుకున్న సాహిత్యాన్ని చూశారు. ‘మా పని అయిపోయింది’ అనుకున్నాం. కానీ, ఒక అధికారి మాతో ఇలా అన్నాడు: “మీ సామానును తనిఖీ చేయవలసి వచ్చినందుకు చింతిస్తున్నాము; ఈ సాహిత్యంలో కొంత బార్బడోస్‌లో నిషేధించబడింది.” అయినా, మేము తెచ్చుకున్న సాహిత్యమంతా ఆయన మాతోపాటు తీసుకువెళ్లనిచ్చాడు. తర్వాత మేము ప్రభుత్వ అధికారులకు సాక్ష్యమిచ్చినప్పుడు, సాహిత్యం ఎందుకు నిషేధించబడిందో మాకు తెలియదు అన్నారు. కొన్ని నెలల తర్వాత నిషేధం ఎత్తివేయబడింది.

బార్బడోస్‌లో మా పరిచర్య ఎంతో విజయవంతమైంది. మేమిద్దరం చెరి 15 బైబిలు అధ్యయనాలను నిర్వహించాము, చాలామంది విద్యార్థులు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించారు. కొంతమంది సంఘకూటాలకు కూడా రావడాన్ని చూసి మేము ఎంతగానో సంతోషించాము. అయినప్పటికీ సాహిత్యం కొంతకాలంపాటు నిషేధించబడింది గనుక, కూటాలను ఎలా నిర్వహించాలనేదానిలో సహోదరులకు ప్రస్తుత అవగాహన లేదు. అయితే త్వరలోనే మేము సమర్థులైన చాలామంది సహోదరులకు తర్ఫీదును ఇవ్వగలిగాము. మా విద్యార్థుల్లో చాలామంది క్రైస్తవ పరిచర్యను ప్రారంభించేందుకు సహాయం చేసే, సంఘం అభివృద్ధి చెందటాన్ని చూసే ఆనందం మాకు లభించింది.

కుటుంబాన్ని పెంచుకోవడం

బార్బడోస్‌లో దాదాపు 18 నెలలు గడిపిన తర్వాత నాకు శస్త్రచికిత్స చేయించుకోవలసిన అవసరం ఏర్పడటంతో అమెరికాకు తిరిగి వచ్చాను. నేను ఎవరితోనైతే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపానో ఆమెను అక్కడ ఉండగా వివాహం చేసుకున్నాను. తర్వాత నేనూ నా భార్యా ఫ్లొరీడాలోని టల్లాహసీలో పయినీరు సేవ చేశాము, కానీ ఆరు నెలల తర్వాత కెన్‌టుకీలోని లౌస్‌విల్లేకు మారాము, అక్కడ ఒక సాక్షి నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. మా తమ్ముడు బెనెట్‌ చాలా సంవత్సరాలపాటు బార్బడోస్‌లో సేవచేశాడు. ఆ తర్వాత అతడు తోటి మిషనరీని వివాహం చేసుకుని, ద్వీపాల్లో ప్రయాణపని చేశాడు. చివరికి ఆరోగ్య కారణాలను బట్టి వారు అమెరికాకు తిరిగి రావలసి వచ్చింది. తన 73 ఏళ్ల వయస్సులో 1990 లో బెనెట్‌ మరణించేంత వరకూ వారు ప్రయాణపనిలో స్పానిష్‌ భాషా సంఘాల్లో తమ సేవను కొనసాగించారు.

1950 లో మాకు మొదటి బిడ్డ జన్మించింది, ఆమెకు మేము డారిల్‌ అని పేరుపెట్టాము. చివరికి మాకు ఐదుగురు పిల్లలు కలిగారు. మా రెండవ బిడ్డ, డెరిక్‌, స్పైనల్‌ మెనిన్‌జైటిస్‌తో రెండున్నర సంవత్సరాలకే చనిపోయాడు. అయితే 1956 లో లెస్‌లీ, తర్వాత 1958 లో ఎవరెట్‌ పుట్టారు. డోరతీ నేను మా పిల్లలను బైబిలు సత్యమార్గంలో పెంచగలిగాము. మేము ఎప్పుడూ వారపు బైబిలు పఠన కార్యక్రమాన్ని కల్గివుండడానికీ, పిల్లలందరికి ఆసక్తికరమైనదిగా ఉండేలా చేయడానికీ ప్రయత్నించేవాళ్లము. డారిల్‌, లెస్లీ, ఎవరెట్‌లు ఇంకా చిన్న వయస్సులో ఉండగానే మేము వాళ్లకు ప్రతివారం ప్రశ్నలు ఇచ్చి పరిశోధన చేసి తర్వాతి వారం జవాబులు చెప్పాలని చెప్పేవాళ్లము. వాళ్లు ఇంటింటి పరిచర్య చేయడాన్ని ప్రదర్శించి చూపేవారు. ఒకరు క్లోసెట్‌లోకి (బట్టలు ఉండే గది) వెళ్లి గృహస్థునిలా నటించేవాడు. మరొకరు బయట నిలబడి తలుపు కొట్టేవాడు. ఒకరినొకరు తమాషా చేసుకునేవారు, కానీ ప్రకటనా పని పట్ల ప్రేమను పెంచుకోవడానికి ఇది వారికి సహాయం చేసింది. మేము వాళ్లతోపాటు క్రమంగా ప్రకటించేవాళ్లము.

1973 లో మా చిన్న కుమారుడు ఎల్టన్‌ జన్మించినప్పుడు, డోరతికి దాదాపు 50 ఏళ్లు నాకు 60 ఏళ్లు. సంఘంలో అందరూ మమ్మల్ని అబ్రాహాము, శారా అన్నారు! (ఆదికాండము 17:​15-17) పెద్ద అబ్బాయిలు ఎల్టన్‌ను తమతోపాటు పరిచర్యకు తీసుకువెళ్లేవారు. అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులూ పిల్లలు ఇలా కుటుంబాలు కలిసి పని చేయడం, ఇతరులతో బైబిలు సత్యాలను పంచుకోవడం శక్తివంతమైన సాక్ష్యమని మేము భావించాము. ఎల్టన్‌ అన్నలు అతడిని ఎత్తుకుని తీసుకువెళ్తూ, అతని చేతికి బైబిల్‌ ట్రాక్ట్‌ ఇచ్చేవారు. ప్రజలు తలుపు తెరిచి, అన్న భుజం మీదున్న తమ్ముని ముద్దులొలికించే ముఖాన్ని చూసినప్పుడు సాధారణంగా ఎప్పుడూ వినేవారు. సంభాషణ ముగిసిన తర్వాత ఆ ట్రాక్ట్‌ను ఆ వ్యక్తి చేతికిచ్చి, తాము నేర్పించినవి ఏవైనా కొన్ని మాటలు చెప్పమని పిల్లలు ఎల్టన్‌ను అడిగేవారు. అలా వాడు ప్రకటించడం మొదలుపెట్టాడు.

సంవత్సరాలు గడుస్తుండగా, ఇతరులు యెహోవాను తెలుసుకునేందుకు మేము సహాయం చేయగలిగాము. అవసరంలో ఉన్న సంఘంలో సేవచేయడానికి మేము, 1970ల చివరిలో లౌస్‌విల్లే నుండి కెంటుకీలోని షెల్‌బైవిల్లేకు మారాము. అక్కడ ఉన్నప్పుడు, మేము సంఘంలో అభివృద్ధిని చూడడం మాత్రమేగాక రాజ్య మందిరం కోసం ఒక స్థలాన్ని చూసి, దాన్ని నిర్మించడంలో కూడా సహాయం చేశాము. ఆ తర్వాత అక్కడికి దగ్గరలోనే ఉన్న మరో సంఘంలో సేవ చేయమని మమ్మల్ని అడగడం జరిగింది.

కుటుంబ జీవితపు అనిశ్చయతలు

మా పిల్లలంతా యోహోవా మార్గంలోనే ఉన్నారని నాకు చెప్పాలని ఉంది కానీ అలా జరగలేదు. వాళ్లు పెద్దవాళ్లై ఇంట్లో నుండి బయటికి వెళ్లిన తర్వాత, బ్రతికివున్న మా నలుగురు పిల్లల్లో ముగ్గురు సత్యమార్గాన్ని విడిచిపెట్టారు. అయితే, మా కుమారుడు ఎవరెట్‌ మాత్రం నాలాగే పూర్తికాల పరిచర్యలో ప్రవేశించాడు. అతడు ఆ తర్వాత న్యూయార్క్‌లో అంటే యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో సేవచేశాడు, తర్వాత 1984 లో 77వ గిలియడ్‌ తరగతికి ఆహ్వానించబడ్డాడు. పట్టభద్రుడైన తర్వాత అతనికి పశ్చిమాఫ్రికాలోని సియార్‌ లియోన్‌లో నియామకం లభించింది. అతడు 1988 లో బెల్జియమ్‌కు చెందిన పయినీర్‌ అయిన మారియన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి వారిద్దరూ మిషనరీలుగా సేవచేస్తున్నారు.

ఇప్పుడు సంతృప్తినిచ్చేదీ, భవిష్యత్తులో పరదైసు భూమిపై నిత్యజీవ నిరీక్షణనిచ్చేదీ అయిన జీవ మార్గాన్ని మా ముగ్గురు పిల్లలు వదిలి వెళ్లడం, ఏ తల్లిదండ్రులైనా ఊహించగల్గినట్లుగానే మాకు ఎంతో వేదనను కల్గించింది. కొన్నిసార్లు నన్ను నేను నిందించుకున్నాను. యెహోవా ఎన్నడూ పొరపాట్లు చేయకుండా ప్రేమతోనూ కృపతోనూ క్రమశిక్షణలో పెట్టినా ఆయన ఆత్మకుమారుల్లో అంటే దేవదూతల్లో కొందరు సహితం ఆయన సేవ చేయడం మానుకున్నారని తెలుసుకుని నేను కొంత ఊరట పొందాను. (ద్వితీయోపదేశకాండము 32:4; యోహాను 8:44; ప్రకటన 12:​4, 9) తల్లిదండ్రులు తమ పిల్లలను యెహోవా మార్గంలో పెంచడానికి ఎంత తీవ్రంగా కృషి చేసినప్పటికీ, కొందరు సత్యాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తారని నేను గ్రహించేలా అది చేసింది.

పెనుగాలులకు ఇటు అటు ఊగిపోయే చెట్టులా, మన మార్గంలో వచ్చే వివిధ కష్టాలను, సమస్యలను తట్టుకునేందుకు తగిన విధంగా మనం వంగాల్సి ఉంటుంది. సంవత్సరాలు గడుస్తుండగా, క్రమ బైబిలు అధ్యయనం, కూటాలకు హాజరుకావడం అలా వంగడానికీ, ఆధ్యాత్మికంగా తట్టుకుని నిలవడానికీ కావలసిన బలాన్ని నాకు ఇచ్చినట్లు నేను గ్రహించాను. నాకు వయస్సు పైబడుతూ నేను గతంలో చేసిన పొరపాట్లను చూడగల్గుతున్నప్పుడు నేను వాటి మరో కోణాన్ని కూడా చూడటానికి ప్రయత్నిస్తాను. ఎంతైనా మనం నమ్మకంగా ఉంటే, అలాంటి అనుభవాలు మన ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడతాయి. వాటి నుండి మనం నేర్చుకుంటే, జీవితంలోని కొన్ని ప్రతికూల అంశాలకు కొన్ని అనుకూల అంశాలు తప్పక ఉండగలవు.​—⁠యాకోబు 1:2, 3.

ఇప్పుడు నాకూ డోరతీకీ యెహోవా సేవలో మేము చేయాలనుకునేంతగా చేయడానికి కావాల్సినంత ఆరోగ్యంగానీ బలంగానీ లేవు. కానీ మా ప్రియ క్రైస్తవ సహోదర సహోదరీల మద్దతుకు మేము కృతజ్ఞులము. దాదాపు ప్రతి కూటములోనూ, మేము అక్కడ ఉండడాన్ని తాము ఎంతగా మెచ్చుకుంటున్నారో సహోదరులు మాకు చెప్తారు. ఇంటికి, కారుకు రిపేర్లు చేయడంతో సహా మాకు సాధ్యమైన విధంగా సహాయం చేయడానికి వారు ముందుకు వస్తారు.

అప్పుడప్పుడూ మేము సహాయ పయినీరు సేవ చేస్తాము, ఆసక్తి ఉన్నవారితో బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తాము. మేము ఎంతో ఆనందించే విషయం ఆఫ్రికాలో సేవచేస్తున్న మా కుమారుని నుండి సమాచారాన్ని అందుకోవడమే. ఇప్పటికీ మేము మా కుటుంబ అధ్యయనం చేసుకుంటున్నాము, అయితే ఇప్పుడు కేవలం మేము ఇద్దరమే. యెహోవా సేవకు ఎన్నో సంవత్సరాలు వెచ్చించగల్గినందుకు మేము ఆనందిస్తున్నాము. ఆయన ‘మా పనిని, తన నామమును బట్టి మేము చూపిన ప్రేమను’ మరువనని హామీ ఇస్తున్నాడు.​—⁠హెబ్రీయులు 6:⁠10.

[25వ పేజీలోని చిత్రం]

1940, ఏప్రిల్‌ 18న వల్వకు, బెనెట్‌కు, నాకు టెడ్‌ క్లీన్‌ బాప్తిస్మం ఇవ్వడం

[26వ పేజీలోని చిత్రాలు]

నా భార్య డోరతీతో, 1940ల తొలి సంవత్సరాల్లో, 1997 లో

[27వ పేజీలోని చిత్రం]

బార్బడోస్‌లోని ఒక సిటీ బస్సు మీద “ద ప్రిన్స్‌ ఆఫ్‌ పీస్‌” అనే బహిరంగ ప్రసంగాన్ని ప్రచారం చేయడం

[27వ పేజీలోని చిత్రం]

మిషనరీ హోమ్‌ ఎదుట ఉన్న మా తమ్ముడు బెనెట్‌