మీరు నిరుత్సాహాన్ని తట్టుకొని నిలబడగలరు!
మీరు నిరుత్సాహాన్ని తట్టుకొని నిలబడగలరు!
జ్ఞానవంతుడైన ఒక వ్యక్తి ఒకసారిలా వ్రాశాడు: “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.” (సామెతలు 24:10) మీరు ఎప్పుడైనా నిరుత్సాహపడి ఉంటే, బహుశా మీరా వ్యాఖ్యానంతో ఏకీభవిస్తుండవచ్చు.
నిరుత్సాహం యొక్క ప్రభావాలకు ఏ ఒక్కరూ అతీతులు కాదు. కొద్దిపాటి నిరుత్సాహం ఒక రోజో రెండు రోజులో ఉండి మెల్లగా తగ్గిపోతుంది. కానీ భావోద్వేగాలు గాయపడితే లేక కోపం నిలిచి ఉంటే సమస్య ఎక్కువ కాలంపాటు కొనసాగవచ్చు. ఎన్నో సంవత్సరాలపాటు నమ్మకంగా ఉండిన కొంతమంది క్రైస్తవులు ఎంతగా నిరుత్సాహపడిపోయారంటే వారు సంఘకూటాలకు హాజరవ్వడం, ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనడం కూడా మానేశారు.
మీకు నిరుత్సాహం కల్గితే అధైర్యపడకండి! గతకాలాలకు చెందిన నమ్మకమైన సేవకులు నిరుత్సాహాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నారు, దేవుని సహాయంతో మీరు కూడా ఎదుర్కోగలరు.
ఇతరులు మీ భావాలను గాయపర్చినప్పుడు
ప్రతి దయలేని మాట నుండి లేక అనాలోచిత చర్య నుండి కాపాడబడాలని మీరు ఆశించకూడదు. అయితే, ఇతరుల అపరిపూర్ణతలు యెహోవాకు మీరు చేసే సేవలో జోక్యం చేసుకునేందుకు మీరు అనుమతించకుండా ఉండవచ్చు. ఎవరైనా మీ భావాలను గాయపరిస్తే, సమూయేలు తల్లియైన హన్నా ఒక నిరుత్సాహకరమైన పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నదో పరిశీలించడం సహాయకరంగా ఉండవచ్చు.
హన్నా పిల్లలు కల్గాలని ఎంతగానో కోరుకుంది, కానీ ఆమె గొడ్రాలు. ఆమె సవతి పెనిన్నా అప్పటికే కుమారులను, కుమార్తెలను కన్నది. హన్నా దురవస్థపట్ల కనికరం చూపించే బదులు పెనిన్నా ఆమెను శత్రువులా దృష్టిస్తూ, హన్నా ‘భోజనము చేయకుండా ఏడ్చేంత’ కఠినంగా ఆమెతో వ్యవహరించింది.—1 సమూయేలు 1:2, 4-7.
ఒకరోజు హన్నా ప్రార్థన చేయడానికి గుడారానికి వెళ్లింది. ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుడైన ఏలీ ఆమె పెదవులు కదలడాన్ని గమనించాడు. హన్నా ప్రార్థిస్తోందని గ్రహించక ఆమె త్రాగి ఉంటుందని ఏలీ భావించాడు. “ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు?” అని ఏలీ అధికారపూర్వకంగా అడిగాడు. ‘నీవు ద్రాక్షారసమును నీయొద్దనుండి తీసివేయుము.’ (1 సమూయేలు 1:12-14) హన్నా ఎలా భావించి ఉంటుందో మీరు ఊహించగలరా? ఆమె ప్రోత్సాహం కోసం గుడారానికి వచ్చింది. ఇశ్రాయేలులో ఎంతో పేరుప్రతిష్టలుగల వ్యక్తి తనను తప్పుగా నిందిస్తాడని ఆమె ఎదురుచూసి ఉండకపోవచ్చు!
ఆ పరిస్థితి హన్నాను ఎంతో నిరుత్సాహపర్చేదే. ఏలీ ప్రధాన యాజకునిగా సేవచేస్తున్నంత వరకూ మళ్లీ ఎప్పుడూ రానని ఒట్టుపెట్టుకొని ఆమె వెంటనే గుడారం వదిలి వెళ్లగలిగేదే. అయితే, హన్నా యెహోవాతో తనకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచిందన్నది స్పష్టం. ఆమె అలాంటి చర్య చేపడితే యెహోవా దాన్ని ఎంతమాత్రం ఇష్టపడడని ఆమెకు తెలుసు. గుడారం స్వచ్ఛారాధనకు కేంద్రం. యెహోవా తన నామమును అక్కడ ఉంచాడు. ఏలీ ఎంత అపరిపూర్ణుడైనప్పటికీ ఆయన యెహోవా ఎంపిక చేసుకున్న ప్రతినిధి.
ఏలీ వేసిన నిందలకు హన్నా ఇచ్చిన భక్తిపూర్వకమైన జవాబు నేడు మనకు చక్కని ఉదాహరణగా ఉంది. ఆమె తనను తప్పుగా నిందించడానికి అనుమతించలేదు, కానీ ఎంతో గౌరవపూర్వకమైన విధంగా ప్రతిస్పందించింది. “అది కాదు, నా యేలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు; అత్యంతమైన కోపకారణమునుబట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటి”నని ఆమె సమాధానమిచ్చింది.—1 సమూయేలు 1:15, 16.
హన్నా తాను చెప్పదలచుకున్నది చెప్పిందా? ఖచ్చితంగా. అయినా ఆమె ఏలీతో ఎంతో నైపుణ్యంతో మాట్లాడింది, అంతేగానీ ఆయన వేసిన తప్పుడు నిందలకు ఆయనను విమర్శించలేదు. దానికి ప్రతిస్పందనగా ఆయన ఆమెకు దయతో ఇలా సమాధానమిచ్చాడు: “నీవు క్షేమముగా 1 సమూయేలు 1:17, 18.
వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక.” ఒకసారి విషయం పరిష్కరించబడిన తర్వాత, హన్నా “తన దారిని వెళ్లిపోయి భోజనము చేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను.”—ఈ వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఒక అపార్థాన్ని సరిచేయడానికి హన్నా త్వరగా చర్య తీసుకుంది, అయితే ఆమె గౌరవంతో ఆ పని చేసింది. తత్ఫలితంగా ఆమె యెహోవాతోనూ, ఏలీతోనూ మంచి సంబంధాన్ని కాపాడుకుంది. మంచి సంభాషణ, కొద్దిపాటి యుక్తి చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలుగా అయిపోకుండా ఎంత తరచుగా కాపాడగలవో కదా!
ఇతరులతో ఉన్న అభిప్రాయబేధాలను సరిచేసుకోవడానికి ఇరువైపుల వారికీ వినయం, పరిస్థితులకు అనుగుణంగా మారే గుణం ఉండాలని గుర్తించడం జరిగింది. ఒక అభిప్రాయబేధాన్ని సరిచేసుకోవాలని మీరు చేసే ప్రయత్నాలకు ఒక తోటి విశ్వాసి ప్రతిస్పందించలేకపోతే, మీరు విషయాన్ని యెహోవా చేతుల్లో వదిలేసి, ఆయన దాన్ని తన స్వంత సమయంలో, తన స్వంత విధానంలో సరిచేస్తాడని నమ్మాలి.
మీరొక సేవాధిక్యతను పోగొట్టుకున్నారా?
దేవుని సేవలో ఎంతో ప్రీతిపాత్రమైన ఆధిక్యతను కోల్పోవలసి వచ్చినందుకు కొందరు ఎంతో నిరుత్సాహపడిపోయారు. తమ సహోదరులకు సేవ చేయడాన్ని వారు ఎంతో ఇష్టపడ్డారు, కానీ ఆ ఆధిక్యతను కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు, తాము ఇక యెహోవాకు గానీ ఆయన సంస్థకు గానీ ఎంత మాత్రం ఉపయోగకరమైన వారం కాదని భావించారు. మీరు కూడా అలా భావిస్తున్నట్లైతే, యోహాను మార్కు అని కూడా పిలువబడిన బైబిలు రచయిత అయిన మార్కు ఉదాహరణను పరిశీలించడం ద్వారా మీరు అంతర్దృష్టిని పొందవచ్చు.—అపొస్తలుల కార్యములు 12:12.
పౌలు బర్నబాలు తమ మొదటి మిషనరీ యాత్రలో వెళ్తున్నప్పుడు మార్కు వారితోకూడా వెళ్లి ప్రయాణం సగం దారిలోనే వారిని వదిలి యెరూషలేముకు తిరిగివచ్చాడు. (అపొస్తలుల కార్యములు 13:13) తర్వాత, బర్నబా మరో ప్రయాణంలో మార్కును తమతో తీసుకు వెళ్లాలని అనుకున్నాడు. అయితే, “పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను” అని బైబిలు చెప్తుంది. బర్నబా అందుకు ఏకీభవించలేదు. దానితో “వారిలో తీవ్రమైన వాదము కలిగినందున [పౌలు, బర్నబా] ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను; పౌలు సీలను ఏర్పరచుకొని” వెళ్లెనని ఆ వృత్తాంతం చెబుతోంది.—అపొస్తలుల కార్యములు 15:36-41.
గౌరవనీయుడైన పౌలుకు తనతో కలిసి పని చేయడం ఇష్టం లేదనీ, తన అర్హతలను బట్టి జరిగిన వాగ్వివాదం మూలంగా పౌలు బర్నబాల మధ్య చీలిక ఏర్పడిందనీ తెలుసుకుని మార్కు ఎంతో కృంగిపోయి ఉంటాడు. అయితే విషయం అంతటితో ముగిసిపోలేదు.
పౌలు సీలలకు ప్రయాణ సహచరుని అవసరం ఇంకా ఉంది. వారు లుస్త్రకు చేరుకున్నప్పుడు, మార్కు స్థానాన్ని తీసుకునేందుకు ఒక వ్యక్తి దొరికాడు, అతడే తిమోతి అనే యౌవనస్థుడు. తిమోతి ఎంపిక చేసుకోబడే సమయానికి బాప్తిస్మం తీసుకుని కేవలం రెండో మూడో సంవత్సరాలు అయ్యుండవచ్చు. మరోవైపున, మార్కు క్రైస్తవ సంఘం ఏర్పడినప్పటి నుండీ అంటే పౌలుకన్నా ముందు నుండీ దానితో సహవసిస్తున్నాడు. అయినప్పటికీ, ఆధిక్యతగల ఆ నియామకాన్ని తిమోతి అందుకున్నాడు.—అపొస్తలుల కార్యములు 16:1-3.
తన స్థానాన్ని యౌవనుడూ, అనుభవంలేనివాడూ అయిన వ్యక్తి తీసుకున్నాడని తెలుసుకున్నప్పుడు మార్కు ఎలా ప్రతిస్పందించాడు? దాన్ని గురించి బైబిలు ఏమీ చెప్పడం లేదు. అయినప్పటికీ, మార్కు యెహోవా సేవలో చురుగ్గా కొనసాగాడని అది సూచించింది. ఆయన తనకు అందుబాటులో ఉన్న ఆధిక్యతల నుండి ప్రయోజనం పొందాడు. పౌలు, సీలలతో కలిసి సేవ చేయలేకపోయినప్పటికీ, బర్నబా స్వంత స్థలమైన కుప్రకు ఆయనతోపాటు వెళ్లగలిగాడు. మార్కు బబులోనులో పేతురుతో కూడా పనిచేశాడు. చివరికి, ఆయనకు రోములో పౌలుతోనూ, తిమోతితోనూ కలిసి పనిచేసే అవకాశం కూడా లభించింది. (కొలొస్సయులు 1:1; 4:10; 1 పేతురు 5:13) తర్వాత, నాలుగు సువార్తల్లో ఒకటి వ్రాయడానికి మార్కు ప్రేరేపించబడ్డాడు.
దీనంతటిలో ఒక విలువైన పాఠం ఉంది. మార్కు తాను పోగొట్టుకున్న ఆధిక్యతను బట్టి, తనకు ఇంకా అందుబాటులో ఉన్న ఆధిక్యతలను విలువైనవిగా ఎంచడంలో విఫలమయ్యేంతగా చింతించలేదు. మార్కు యెహోవా సేవలో నిమగ్నమైపోయాడు, యెహోవా ఆయనను ఆశీర్వదించాడు.
కాబట్టి మీరు ఒక ఆధిక్యతను కోల్పోతే నిరుత్సాహపడకండి. మీరు అనుకూల దృక్పథాన్ని కల్గివుండి సేవలో కొనసాగుతూ ఉంటే, ఇతర ఆధిక్యతలు మీకు లభిస్తాయి. ప్రభువు పనిలో చేయవలసినది ఎంతో ఉంది.—1 కొరింథీయులు 15:58.
ఒక నమ్మకమైన సేవకుడు నిరుత్సాహపడడం
విశ్వాసం కోసం తీవ్రంగా పోరాడడం సులభం కాదు. కొన్నిసార్లు మీరు నిరుత్సాహపడవచ్చు. అలా నిరుత్సాహపడుతున్నందుకు మీకు అపరాధ భావం కలిగి, దేవుని నమ్మకమైన సేవకుడు ఎన్నడూ అలా భావించకూడదని మీరు అనుకోవచ్చు. ఇశ్రాయేలులోని పేరుపొందిన ప్రవక్తలలో ఒకరైన ఏలీయా గురించి ఆలోచించండి.
బయలు ఆరాధనను పిచ్చిగా పెంపొందింపజేసే ఇశ్రాయేలు రాణియైన యెజెబెలు ఏలీయా బయలు ప్రవక్తలను చంపించాడన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు, ఆయనను చంపేస్తానని ఆమె ప్రమాణం చేసింది. ఏలీయా యెజెబెలు కన్నా గొప్ప శత్రువులను ఎదుర్కొన్నాడు. కాని హఠాత్తుగా ఆయన ఎంతగా నిరుత్సాహపడిపోయాడంటే, తాను చనిపోవాలని కోరుకున్నాడు. (1 రాజులు 19:1-4) అదెలా జరిగి ఉండవచ్చు? ఆయన ఒక విషయం మరిచిపోయాడు.
తన శక్తికి మూలం యెహోవాయని ఏలీయా యెహోవావైపు చూడడం మరిచిపోయాడు. మృతులను తిరిగి లేపడానికీ, బయలు ప్రవక్తలను ఎదుర్కోవడానికీ ఆయనకు ఎవరు శక్తినిచ్చారు? యెహోవాయే. రాణియైన యెజెబెలు ఆగ్రహాన్ని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని కూడా యెహోవాయే ఇవ్వగలడు.—1 రాజులు 17:17-24; 18:21-40; 2 కొరింథీయులు 4:7.
యెహోవా యందు తమకున్న నమ్మకం ఎవరికైనా క్షణికకాలం చలించవచ్చు. ఏలీయాలా, మీరు ఏదైనా ఒక సమస్యను ఎదుర్కోవడానికి “పైనుండివచ్చు జ్ఞానము”ను ఉపయోగించే బదులు కొన్నిసార్లు మానవ దృక్కోణం నుండి దాన్ని చూడవచ్చు. (యాకోబు 3:17) అయినప్పటికీ, ఈ తాత్కాలిక తడబాటుకు యెహోవా ఏలీయాను విడనాడలేదు.
ఏలీయా బయేర్షెబాకు వెళ్లి అక్కడి నుండి తనను ఎవరూ కనుగొనలేరని తాను తలంచిన అరణ్యంలోకి పారిపోయాడు. కానీ యెహోవా ఆయనను కనుగొన్నాడు. ఆయనను ఓదార్చడానికి యెహోవా ఒక దూతను పంపించాడు. ఆ దూత ఏలీయాకు తినటానికి తాజా రొట్టె, త్రాగటానికి స్వచ్ఛమైన నీళ్లు లభించేలా చూశాడు. ఏలీయా విశ్రాంతి తీసుకున్న తర్వాత, దాదాపు 300 కిలోమీటర్లు హోరేబు పర్వతానికి ప్రయాణించమని దూత సూచించాడు, అక్కడ యెహోవా ఆయనను మరింత బలపర్చనైయున్నాడు.—1 రాజులు 19:5-8.
హోరేబు పర్వతం వద్ద ఏలీయా తన విశ్వాసాన్ని బలపర్చిన యెహోవా శక్తి ప్రదర్శనను చూశాడు. తర్వాత ప్రశాంతమైన శాంత స్వరంతో, ఆయన ఒంటరివాడు కాదని యెహోవా ఆయనను ఓదార్చాడు. యెహోవా ఆయనతో ఉన్నాడు, ఆయనకు తెలియని 7,000 మంది సహోదరులు ఆయనతో ఉన్నారు. చివరికి, యెహోవా ఆయనకు ఒక పనిని అప్పగించాడు. ఆయన తన ప్రవక్తగా ఏలీయాను తొలగించి వేయలేదు!—1 రాజులు 19:11-18.
సహాయం అందుబాటులో ఉంది
మీరు ఎప్పుడైనా కాస్తంత నిరుత్సాహనికి గురైతే, కాస్త ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటే లేదా పౌష్టికాహారం తీసుకుంటే మీరు కాస్త కుదుటపడినట్టు భావిస్తారు. యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యునిగా, 1977 లో తన మరణం వరకూ సేవచేసిన నేథన్ హెచ్. నార్, పెద్ద పెద్ద సమస్యలు సాధారణంగా రాత్రంతా హాయిగా నిద్రపోయి లేచినప్పుడు చాలా చిన్న సమస్యలుగా కనిపిస్తాయి అన్నాడు. అయితే, సమస్య మరీ విడవనిదైతే, అలాంటి నిద్ర పని చేయకపోవచ్చు, అప్పుడు నిరుత్సాహంతో పోరాడ్డానికి మీకు సహాయం అవసరమౌతుంది.
ఏలీయాను బలపర్చడానికి యెహోవా ఒక దూతను పంపాడు. నేడు, దేవుడు పెద్దల ద్వారా, పరిణతి చెందిన ఇతర క్రైస్తవుల ద్వారా ప్రోత్సాహాన్ని అందజేస్తాడు. పెద్దలు నిజంగా, “గాలికి మరుగైనచోటువలె” ఉండగలరు. (యెషయా 32:1, 2) కానీ వారి నుండి ప్రోత్సాహాన్ని పొందటానికి మీరు చొరవ తీసుకోవలసి ఉంటుంది. ఏలీయా ఎంతో నిరుత్సాహపడినప్పటికీ, యెహోవా నుండి ఉపదేశం పొందటానికి ఆయన హోరేబు పర్వతం వరకు ప్రయాణం చేసి వెళ్లాడు. మనం కూడా క్రైస్తవ సంఘం ద్వారా మనల్ని బలపర్చే ఉపదేశాన్ని పొందుతాము.
మనం సహాయాన్ని స్వీకరించి, భావాలు గాయపడడం లేక ఆధిక్యతలను కోల్పోవడం వంటి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు మనం ఒక ప్రాముఖ్యమైన వివాదాంశంలో యెహోవా పక్షాన అంటిపెట్టుకొని ఉన్నామని ఉన్నతపరుస్తాము. ఏ వివాదాంశం? మానవులు కేవలం స్వార్థంతోనే యెహోవా సేవ చేస్తారని సాతాను ఆరోపించాడు. మన జీవితం అంతా సాఫీగా సాగుతున్నప్పుడు మనం దేవుని సేవ చేయడం మానుకుంటామని సాతాను అనడం లేదు గానీ, మనకు సమస్యలు ఎదురైనప్పుడు మనం దేవుని సేవచేయడం మానుకుంటామని సాతాను అరోపిస్తున్నాడు. (యోబు 1, 2 అధ్యాయాలు) నిరుత్సాహం కల్గినప్పటికీ నిశ్చలంగా యెహోవా సేవలో కొనసాగడం ద్వారా, అపవాది యొక్క నిందలకు జవాబు ఇచ్చేందుకు మనం సహాయం చేయగల్గుతాము.—సామెతలు 27:11.
హన్నా, మార్కు, ఏలీయా అందరికీ తమ ఆనందాన్ని తాత్కాలికంగా దోచేసిన సమస్యలు ఉన్నాయి. అయితే, వారు వాటిని ఎదుర్కొని ఫలదాయకమైన జీవితాలను గడిపారు. యెహోవా సహాయంతో, మీరు కూడా నిరుత్సాహాన్ని తట్టుకొని నిలబడగలరు.