‘మీ నాభికి ఆరోగ్యము’
‘మీ నాభికి ఆరోగ్యము’
భయం, బాధ, ఈర్ష్యా, కోపం, ద్వేషం, అపరాధభావం వంటి భావోద్వేగపరమైన ఒత్తిడులే మానవజాతికి సంభవించే అనేక రుగ్మతలకు మూలమని విశ్వసించబడుతోంది. దీని దృష్ట్యా, “యెహోవాయందలి భయం మీ నాభికి ఆరోగ్యము, మీ యెముకలకు సత్తువ” కల్గిస్తుందని చెప్తున్న బైబిలు వ్యాఖ్యానం ఎంత ఓదార్పునిస్తుందో కదా!—సామెతలు 3:7, 8, NW.
ఎముకలు శరీరానికి ఊతమిచ్చే చట్రం వంటివి. కాబట్టి ప్రాముఖ్యంగా లోతైన భావాలు భావోద్వేగాలతో ప్రభావితమైన ఒకరి అస్థిత్వాన్ని సూచించేందుకు బైబిలు, ‘ఎముకలను’ రూపకాలంకారంగా ఉపయోగిస్తుంది. కానీ యెహోవా యందలి భయం “మీ నాభికి ఆరోగ్యం” ఎలా కాగలదు?
ఈ వాక్యంలో “నాభి” అనే పద ప్రస్తావన గురించి బైబిలు పండితులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. “నాభి” “శరీరంలో కేంద్రస్థానంలో ఉంది” గనుక బహుశా అది అన్ని ముఖ్యమైన అవయవాలకు ప్రాతినిధ్యం వహిస్తుండవచ్చునని ఒక వ్యాఖ్యాత అంటున్నాడు. “నాభి” అనే పదానికి, యెహెజ్కేలు 16:4 నందు ఉపయోగించబడినట్లుగా నాభిసూత్రమని (నాభినాడి అని) భావం కావచ్చునని మరో పండితుడు సూచిస్తున్నాడు. విషయమదే అయితే, నిస్సహాయ స్థితిలో పిండం పోషణ కోసం తన తల్లిపై సంపూర్ణంగా ఆధారపడినట్లు, మనం దేవునిపై పూర్తిగా ఆధారపడవలసిన అవసరాన్ని సామెతలు 3:8 నొక్కిచెప్తుండవచ్చు. మరో తలంపేమిటంటే, “నాభి” ఇక్కడ శరీరంలోని కండరాలను, నరాలను సూచిస్తుండవచ్చు. ఈ వచనపు సందర్భంలో, బహుశా ఆ కారణాన్నిబట్టే వాటిని శరీరంలోని మరింత పటిష్టమైన పదార్థాలైన “ఎముకల”తో పోల్చి తేడాను చూపించడం జరిగింది.
నిర్దిష్టమైన భావం ఏదైనప్పటికీ, ఒక విషయం మాత్రం ఖచ్చితం: యెహోవా పట్ల భక్తితో కూడిన భయాన్ని ప్రదర్శించడం జ్ఞానయుక్తమైనది. దేవుని ప్రమాణాలకు అనుగుణ్యంగా జీవించడం ఇప్పుడు మన శారీరక ఆరోగ్యానికి దోహదపడగలదు. అంతకంటే ఎక్కువగా, అది మనకు యెహోవా అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది తద్వారా మనం రాబోయే ఆయన నూతన లోకంలో శారీరకంగానూ మానసికంగానూ పరిపూర్ణమైన ఆరోగ్యంతో నిరంతర జీవితాన్ని పొందగల్గుతాము.—యెషయా 33:24; ప్రకటన 21:4; 22:2.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Dr. G. Moscoso/SPL/Photo Researchers