పాఠకుల నుండి ప్రశ్నలు
పాఠకుల నుండి ప్రశ్నలు
కొందరు వ్యక్తులు వాణిజ్యపరమైన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ల కాపీలను ఇతరులకు ఇవ్వడం సర్వసాధారణం, ఈ పనిని నిజ క్రైస్తవులు ఎలా దృష్టించాలి?
“ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి” అన్న యేసు మాటల్ని పేర్కొంటూ కొందరు ఇలాంటి పని చేయడానికి ఆధారం ఉందని పొరబాటుగా అనుకుంటుండవచ్చు. అయితే ఇక్కడ యేసు కాపీరైట్ ఉన్న సాహిత్యాన్ని గానీ కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను (సాఫ్ట్‌వేర్) గానీ ఉచితంగా ఇచ్చేయడాన్ని గురించి మాట్లాడడం లేదు, ఎందుకంటే వాటి వినియోగం చట్ట ప్రకారం క్రమబద్ధీకరించబడి ఉంటుంది. ఆయన పరిచర్యలో మన తరపు నుండి ఇచ్చే విషయం గురించి మాట్లాడుతున్నాడు. వేర్వేరు పట్టణాలకు గ్రామాలకు వెళ్తున్న అపొస్తలులకు వారు రాజ్యాన్ని గురించి ప్రకటించాలని, రోగుల్ని స్వస్థపర్చాలని, దయ్యాలను వెళ్ళగొట్టాలని చెప్పాడు. ఇందుకు రుసుము వసూలు చేయడానికి బదులు ‘ఉచితముగా ఇవ్వాల్సివుంది.’—మత్తయి 10:7, 8.
పర్సనల్ కంప్యూటర్ల బిజినెస్ కంప్యూటర్ల సంఖ్య ప్రతి నిమిషానికీ పెరుగుతూ పోతుంది, అందుకని చాలామందికి సాఫ్ట్‌వేర్ అవసరం ఏర్పడింది. సాధారణంగా దీన్ని కొనాల్సివుంటుంది. నిజమే, కొందరు ప్రోగ్రామ్‌లను తయారుచేసి వాటిని ఉచితంగా పంపిణీచేస్తుంటారు, వాటిని కాపీ చేసుకోవచ్చనీ ఇతరులకు ఇవ్వవచ్చనీ
చెబుతుంటారు. కానీ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో అత్యధిక శాతం వాణిజ్యపరంగా అమ్మబడుతుంది. వ్యక్తులు కేవలం తమ కోసం ఉపయోగించుకోవాలనుకున్నా లేక తమ వ్యాపారం నిమిత్తం ఉపయోగించుకోవాలనుకున్నా ఆయా సాఫ్ట్‌వేర్ యూజర్స్ దాన్ని కొనుక్కోవల్సిందే, దానికి డబ్బు చెల్లించాల్సిందే. పుస్తకాల్ని టోకున జిరాక్స్ తీయడం, అలా చేసినవాటిని ఉచితంగా ఎవరికైనా ఇవ్వడం ఎలా చట్టవిరుద్ధమో, ఎవరైనా సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్‌ను డబ్బు చెల్లించకుండా తీసుకున్నా లేదా కాపీ చేసుకున్నా అలాగే చట్టవిరుద్ధం అవుతుంది.అనేక కంప్యూటర్ ప్రోగ్రాములకు (గేమ్‌లతో సహా) లైసెన్సులు ఉంటాయి. వాటి యజమాని/ఉపయోగించేవ్యక్తి వాటికి సంబంధించిన నిర్దిష్టమైన ఏర్పాట్లకు పరిమితులకు అనుగుణంగా వాటిని వినియోగించాల్సివుంటుంది. అలాంటి లైసెన్సుల్లో చాలామట్టుకు కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఆ ప్రోగ్రామ్‌ని ఇన్‌స్టాల్ చేసుకుని ఉపయోగించవచ్చని పేర్కొనబడివుంటుంది—అది ఇంట్లోని కంప్యూటర్ అయినా, వ్యాపారంలోనిదైనా లేక స్కూల్లోనిదైనా సాధారణంగా ఒక్క కంప్యూటర్‌లో మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవల్సివుంటుంది. కొన్ని లైసెన్సులు యూజర్ తన కోసం మాత్రమే ఒక బ్యాక్‌అప్ కాపీ ఉంచుకోవచ్చని చెబుతాయి, కానీ ఆ యూజర్ ఇతరుల కోసం కాపీలను తయారు చేయకూడదు. ఒకవేళ దాని యజమాని పూర్తి ప్రోగ్రామ్‌ను (లైసెన్సుతోపాటు యాజమాన్యపు పత్రాల్ని కూడా) ఎవరికైనా ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేసుకోవచ్చు. అయితే, అలా చేసినప్పుడు ఆయన దాన్ని తిరిగి ఉపయోగించే తన హక్కును కోల్పోతాడు. లైసెన్సులు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి, కాబట్టి ఒక వ్యక్తి ఏదైనా ప్రోగ్రామును కొనుక్కుంటున్నప్పుడు లేదా తనకు ఇవ్వబడినప్పుడు దాని లైసెన్సు ఏమి చెబుతుందో తెలుసుకోవాలి.
అనేక దేశాలు కాపీరైట్ అగ్రీమెంట్‌లలో పార్టీలుగా చేరతాయి, ఈ అగ్రీమెంట్‌లు కంప్యూటర్ ప్రోగ్రామ్‌ల వంటి “మేధాపరమైన ఆస్తి”ని కాపాడుతూ కాపీరైట్ చట్టాల్ని అమలుపర్చడానికి ప్రయత్నిస్తుంటాయి. ఉదాహరణకు, “జర్మనీ, డెన్మార్క్ దేశాల పోలీసులు” కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను గేమ్‌లను కాపీ చేసి పంపిణీ చేసే వాటిలో కొన్నింటిని చివరికి ఇంటర్నెట్‌పై అమ్మే “సాఫ్ట్‌వేర్ పైరసీ చేస్తున్న ఒక పెద్ద గ్యాంగ్ అని తాము వర్ణించిన దానికి చెందిన సభ్యుల్ని అరెస్టు చేశారు” అని 2000, జనవరి 14వ తేదీ ద న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
ఈ విషయంలో క్రైస్తవ సంఘం స్థానం ఏమిటి? యేసు ఇలా అన్నాడు: “కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించు[డి].” (మార్కు 12:17) అందుకు క్రైస్తవులు ఆయా దేశాల చట్టాలు దేవుని నియమాలకు విరుద్ధంగా లేనంతవరకు వాటికి విధేయంగా ఉండాల్సివుంటుంది. ప్రభుత్వాల గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ వలెను; . . . అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.”—రోమీయులు 13:1, 2.
ఏదో కాపీరైట్ చట్టాలకు భాష్యం చెప్పి వాటిని అమల్లో పెట్టే అధికారం తమకున్నట్లు, ఇతరుల కంప్యూటర్లను తనిఖీచేసే బాధ్యత క్రైస్తవ సంఘంలోని పెద్దలకు లేదు. కానీ క్రైస్తవులు తమకు చెందనివాటిని తీసుకోకూడదనీ, చట్టబద్ధంగా నడుచుకోవడానికి కృషిచేయాలనీ వారు నమ్ముతారు, అదే బోధిస్తారు కూడా. ఇది చట్టాన్ని ధిక్కరించినవారిగా శిక్షించబడకుండా క్రైస్తవుల్ని కాపాడుతుంది, అలాగే వారు దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగివుండేందుకు కూడా సహాయపడుతుంది. పౌలు ఇలా వ్రాశాడు: “కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము.” (రోమీయులు 13:5) అదేవిధంగా నిజ క్రైస్తవుల కోరికను పౌలు ఇలా వ్యక్తం చేశాడు: “మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాము.”—హెబ్రీయులు 13:18.
[29వ పేజీలోని బాక్సు]
కొన్ని వ్యాపార సంస్థలు, స్కూళ్ళు బహుళ-వినియోగదారుల కోసమైన లైసెన్సులను కొంటాయి. ఆ లైసెన్సుల్లో ఆ ప్రోగ్రామ్ యూజర్ల సంఖ్యలో గరిష్ఠ పరిమితి ఎంతో ఉంటుంది. 1995 లో యెహోవాసాక్షుల సంఘాలు ఈ సలహా ఉన్న ఒక ఆర్టికల్‌ను చర్చించాయి:
“కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను సిద్ధంచేసి విక్రయించే అనేక కంపెనీలు వీటిని కాపీరైట్ చేసి . . . చట్టపరంగా ప్రోగ్రామ్‌లను ఎలా ఉపయోగించాలో తెలియజేసే ఒక లైసెన్సు . . . ఇస్తాయి. ప్రోగ్రామ్ యొక్క కాపీలను యజమాని ఇతరులకు ఇవ్వకూడదని ఆ లైసెన్స్ తెలియజేస్తుంది; నిజానికి అంతర్జాతీయ కాపీరైట్ల చట్టం అలా చేయడాన్ని చట్టవిరుద్ధమైనదిగా చేస్తుంది. . . . కొన్ని పెద్ద కంపెనీలు ప్రీఇన్‌స్టాల్డ్ లైసెన్స్‌డ్ ప్రోగ్రామ్‌లున్న కంప్యూటర్లను అమ్ముతాయి. అయితే, కొన్ని కంప్యూటర్ దుకాణాలు లైసెన్సులను ఇవ్వవు, ఎందుకంటే వారు ప్రీఇన్‌స్టాల్ చేసినవన్నీ చట్టవిరుద్ధమైన కాపీలే, అంటే ఆ ప్రోగ్రామ్‌లను ఉపయోగించే వినియోగదారుడు చట్టాన్ని అతిక్రమిస్తున్నాడన్నమాట. దీనికి సంబంధించి క్రైస్తవులు ఎలక్ట్రానిక్ బులెటిన్ బోర్డులపై కాపీరైట్ చేయబడిన సమాచారాన్ని (సొసైటీ ప్రచురణల వంటివి) పెట్టడం లేక దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం, యజమానుల నుండి చట్టపరమైన అనుమతి లేకుండానే కాపీ చేసుకోవడం నివారించాలి.”