కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తీర్పుదినం ఆసన్నమైంది!

యెహోవా తీర్పుదినం ఆసన్నమైంది!

యెహోవా తీర్పుదినం ఆసన్నమైంది!

“యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.” ​—⁠జెఫన్యా 1:⁠14.

1. జెఫన్యా ద్వారా దేవుడు ఏ హెచ్చరికను జారీ చేశాడు?

యెహోవా దేవుడు దుష్టులకు వ్యతిరేకంగా చర్య తీసుకోబోతున్నాడు. వినండి! ఆయన హెచ్చరిక ఇదే: “మనుష్యుల[ను] . . . నేను ఊడ్చివేసెదను; . . . భూమిమీద ఎవరును లేకుండ మనుష్యజాతిని నిర్మూలము చేసెదను.” (జెఫన్యా 1:⁠3) సర్వాధికారియైన యెహోవా తన ప్రవక్తయైన జెఫన్యా ద్వారా ఆ మాటలను పలికాడు, జెఫన్యా బహుశా విశ్వసనీయుడైన రాజైన హిజ్కియా మునిమనుమడై ఉండవచ్చు. మంచి రాజైన యోషీయా రోజుల్లో చేయబడిన ఆ ప్రకటన యూదా దేశంలోని దుర్జనులకు శుభసూచకంగా లేదు.

2. యెహోవా తీర్పుదినాన్ని యోషీయా చర్యలు ఎందుకు అడ్డగించలేకపోయాయి?

2 జెఫన్యా చేపట్టిన ప్రవచన పని, యూదాలోని అపవిత్ర ఆరాధనను తుడిచిపెట్టాల్సిన అవసరం ఉందన్న యువకుడైన యోషీయా అభిప్రాయాన్ని నిస్సందేహంగా బలపర్చివుండవచ్చు. అయితే, రాజ్యంలోని అబద్ధ మతాన్ని తుడిచిపెట్టడానికి ఈ రాజు తీసుకున్న చర్యలు ప్రజల్లోని దుష్టత్వాన్నంతటినీ తీసివేయలేకపోయాయి, “నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపిన” ఆయన తాతగారైన రాజైన మనష్షే పాపాలకు ప్రాయశ్చిత్తాన్నీ చేయలేకపోయాయి. (2 రాజులు 24:3, 4; 2 దినవృత్తాంతములు 34:3) కాబట్టి, యెహోవా తీర్పుదినం నిశ్చయంగా రానైవుంది.

3. “యెహోవా ఉగ్రత దినము”ను తప్పించుకోవడం సాధ్యమని మనమెలా నిశ్చయత కలిగివుండగలం?

3 అయినా, తీర్పుదినాన్ని తప్పించుకునేవారు ఉంటారు. అందుకే దేవుని ప్రవక్త ఇలా వేడుకుంటున్నాడు: “విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.” (జెఫన్యా 2:​2, 3) యెహోవా తీర్పుదినాన్ని తప్పించుకుంటామనే నిరీక్షణను మనస్సులో ఉంచుకొని, బైబిలు పుస్తకమైన జెఫన్యాలోని ఒక్కొక్క వచనాన్ని పరిశీలిద్దాం. ఈ పుస్తకం సా.శ.పూ. 648కి ముందు యూదాలో వ్రాయబడింది, అది మనందరం పూర్ణహృదయంతో అవధానమివ్వాల్సిన దేవుని “ప్రవచనవాక్యము”లో ఒక భాగం.​—⁠2 పేతురు 1:⁠19.

యెహోవా తన హస్తాన్ని చాపాడు

4, 5. జెఫన్యా 1:1-3 యూదాలోని దుష్టుల పట్ల ఎలా నెరవేరింది?

4 జెఫన్యాకు ప్రత్యక్షమైన “యెహోవా వాక్కు” మొదట్లో చెప్పబడినట్లుగా హెచ్చరికతో ప్రారంభమయ్యింది. దేవుడు ఇలా తెలియజేశాడు: “ఏమియు విడవకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను; ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను; భూమిమీద ఎవరును లేకుండ మనుష్యజాతిని నిర్మూలము చేసెదను; ఇదే యెహోవా వాక్కు.”​—⁠జెఫన్యా 1:1-3.

5 అవును, యెహోవా యూదా రాజ్యంలోని ఘోరమైన దుష్టత్వాన్ని అంతమొందించనైవున్నాడు. అయితే, “భూమిమీదనున్న సమస్తమును . . . ఊడ్చి”వేయడానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటాడు? సా.శ.పూ. 659 లో ప్రారంభమైన యోషీయా రాజు పరిపాలనా కాలంలో జెఫన్యా ప్రవచిస్తున్నాడు కనుక, ఆ ప్రవచన మాటలు యూదా, అలాగే దాని ముఖ్య పట్టణమైన యెరూషలేము సా.శ.పూ. 607 లో బబులోనీయుల చేతిలో నాశనం కావడంలో నెరవేరాయి. ఆ సమయంలో యూదాలోని దుష్టులు “ఊడ్చి”వేయబడడం జరిగింది.

6-8. జెఫన్యా 1:4-6 లో ముందుగానే చెప్పబడిందేమిటి, ఆ ప్రవచనం ప్రాచీన యూదా విషయంలో ఎలా నెరవేరింది?

6 అబద్ధ ఆరాధకులపై దేవుడు తీసుకునే చర్యల గురించి ముందుగానే ప్రవచిస్తూ, జెఫన్యా 1:4-6 వచనాలు ఇలా చెప్తున్నాయి: “నా హస్తమును యూదావారిమీదను యెరూషలేము నివాసులందరిమీదను చాపి, బయలుదేవత యొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను. మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలు [“మిల్కోము,” NW] దేవత తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను.”

7 యూదా, యెరూషలేము నివాసులకు విరుద్ధంగా యెహోవా తన హస్తాన్ని చాపాడు. కనానీయుల సంతాన దేవతయైన బయలు ఆరాధకులను నాశనం చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. అనేక స్థానిక దేవతలు బయలులు అని పిలవబడ్డాయి, ఎందుకంటే, వాటిని ఆరాధించేవారు అవి కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల్లో ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతారు. ఉదాహరణకు పెయోరు పర్వతం వద్ద మోయాబీయులు మిద్యానీయులు ఆరాధించిన బయలు ఒకటి ఉంది. (సంఖ్యాకాండము 25:​1, 3, 6) యూదయ అంతటానున్న బయలు అర్చకులనూ, అలాగే అలాంటివారితో సహవసించడం ద్వారా దేవుని శాసనాన్ని ఉల్లంఘించిన అవిశ్వాస యాజకులైన లేవీయులనూ యెహోవా నాశనం చేస్తాడు.​—⁠నిర్గమకాండము 20:2, 3.

8 ‘ఆకాశసమూహములకు మ్రొక్కే’ వారిని అంటే జ్యోతిష్కులను, సూర్యారాధకులను కూడా దేవుడు నాశనం చేస్తాడు. (2 రాజులు 23:11; యిర్మీయా 19:13; 32:29) ‘యెహోవా పేరును బట్టి, మిల్కోము పేరును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయడం’ ద్వారా సత్యారాధనను అబద్ధ మతంతో విలీనం చేయటానికి ప్రయత్నించే వారి మీద కూడా దేవుని ఉగ్రత కుమ్మరించబడనై ఉంది. మిల్కోము బహుశా అమ్మోనీయుల ముఖ్య దేవతయైన మొలెకు అయ్యుండవచ్చు. మొలెకు ఆరాధనలో పిల్లలను బలి ఇవ్వడం ఒక భాగంగా ఉండేది.​—⁠1 రాజులు 11:5; యిర్మీయా 32:⁠35.

క్రైస్తవమత సామ్రాజ్య పతనం సమీపంగా ఉంది!

9. (ఎ) క్రైస్తవమత సామ్రాజ్యం దేని విషయంలో అపరాధి? (బి) యూదాలోని విశ్వాసఘాతకుల వలే కాక మనం ఏమి చేయాలని నిశ్చయపరచుకోవాలి?

9 అబద్ధ ఆరాధనలోను, జ్యోతిష్యంలోను కూరుకుపోయి ఉన్న క్రైస్తవమత సామ్రాజ్యాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. మతనాయకుల మద్దతుతో సాగిన యుద్ధమనే బలిపీఠము మీద కోట్లాదిమందిని బలిగొనడంలో దానికివున్న పాత్ర నిశ్చయంగా హేయమైనది! ‘యెహోవాను అనుసరించక’ ఆయనను విసర్జించి, ఆయన దగ్గర విచారణ చేయని, లేదా ఆయన నడిపింపు కోసం ఎదురుచూడని అవిశ్వాసులైన యూదావారివలె మనం ఎన్నడూ తయారుకాకుందము. దానికి భిన్నంగా, దేవునిపట్ల యథార్థతతో మనం కొనసాగుదాం.

10. జెఫన్యా 1:7 లోని ప్రవచనాత్మక ప్రాముఖ్యాన్ని మీరెలా వివరించగలరు?

10 ప్రవక్త పలికిన తర్వాతి మాటలు యూదాలో చెడుపనులు చేసేవారికీ, మన దినాల్లోని దుష్టులకూ వర్తిస్తాయి. జెఫన్యా 1:7 ఇలా చెప్తుంది: “ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.” ‘పిలవబడిన వారు’ యూదా శత్రువులైన కల్దీయులని స్పష్టమౌతుంది. “బలి” యూదా, అలాగే దాని ముఖ్య పట్టణమూను. అలా యెరూషలేమును నాశనం చేయాలన్న దేవుని సంకల్పాన్ని జెఫన్యా ప్రకటించాడు, ఈ ప్రవచనం క్రైస్తవమత సామ్రాజ్య నాశనాన్ని కూడా సూచిస్తుంది. వాస్తవానికి దేవుని తీర్పుదినం ఇంత సమీపంలో ఉంది గనుక, ‘ప్రభువైన యెహోవా ఎదుట’ సర్వలోకం ‘మౌనంగా ఉండాలి,’ యేసు అభిషిక్త అనుచరులైన ‘చిన్న మంద’ ద్వారా, వారి సహచరులైన ‘వేరే గొఱ్ఱెల’ ద్వారా ఆయన చెబుతున్న దాన్ని వినాలి. (లూకా 12:32; యోహాను 10:​16) అలా విననివారికీ, తద్వారా దేవుని రాజ్య పరిపాలనకు విరుద్ధంగా ఉండేవారికీ వేచివున్నది సర్వనాశనమే.​—⁠కీర్తన 2:1, 2.

అంగలార్పు దినం​—⁠త్వరలోనే!

11. జెఫన్యా 1:​8-11 క్లుప్తంగా ఏమి చెబుతుంది?

11 యెహోవా దినము గురించి జెఫన్యా 1:8-11 వచనాలు ఇంకా ఇలా అంటున్నాయి: “యెహోవా యేర్పరచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థులవలె వస్త్రములు వేసికొనువారినందరిని నేను శిక్షింతును. మరియు ఇండ్ల గడపలు దాటివచ్చి యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపువారిని ఆ దినమందు నేను శిక్షింతును. ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదనశబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు. కనానీయులందరు నాశ[న]మైరి, ద్రవ్యము సమకూర్చుకొనిన వారందరును నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా, అంగలార్చుడి.”

12. “అన్యదేశస్థుల వలె వస్త్రములు” ధరిస్తున్నట్టు కొందరు ఎలా కనుగొనబడ్డారు?

12 రాజైన యోషీయా తరువాత యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను రాజ్యమేలుతారు. ఆ తర్వాత సిద్కియా పరిపాలన వస్తుంది, ఆయన కాలంలోనే యెరూషలేము నాశనం చేయబడుతుంది. అలాంటి విపత్కర పరిస్థితులు వాళ్లకు ఎదురైనా, కొందరు “అన్యదేశస్థుల వలె వస్త్రములు” ధరించి ఇరుగు పొరుగునున్న జనాంగాల అంగీకారాన్ని పొందడానికి ప్రయత్నించారని స్పష్టమౌతుంది. అలాగే నేడు అనేకమంది, తాము యెహోవా సంస్థకు చెందినవారంకామని అనేక రీతుల్లో చూపించుకుంటారు. అలాంటి వారు సాతాను సంస్థలో భాగంగా స్పష్టంగా కనబడతారు గనుక వారు శిక్షించబడతారు.

13. బబులోనీయులు యెరూషలేముపై దాడి చేసినప్పుడు జెఫన్యా ప్రవచనానికి అనుగుణంగా ఏం జరగాల్సివుంది?

13 యూదా లెక్క అప్పజెప్పవలసిన ‘ఆ దినము,’ దుష్టత్వాన్ని అంతం చేయడానికీ, తన సర్వాధికారాన్ని చాటి చెప్పుకోవడానికీ తన శత్రువులపై తీర్పును అమలుపర్చే యెహోవాదినాన్ని సూచిస్తుంది. బబులోనీయులు యెరూషలేముపై దాడి చేసినప్పుడు, మత్స్యపు గుమ్మమునుండి రోదన వినబడుతుంది. ఆ గుమ్మం చేపల బజారుకు దగ్గరలో ఉన్నందువల్ల బహుశా దానికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. (నెహెమ్యా 13:16) బబులోనీయులు పట్టణపు దిగువ భాగమని పిలవబడే ప్రాంతంలోకి జొరబడతారు, “కొండల దిక్కునుండి గొప్ప నాశనము,” సమీపిస్తున్న కల్దీయులు చేస్తున్న శబ్దాన్ని సూచిస్తుండవచ్చు. మక్తేషు నివాసుల ‘అంగలార్పు’ వినబడుతుంది, బహుశా వారు ఎగువ టైరోపియన్‌ లోయ ప్రాంతపువారై ఉండవచ్చు. వారెందుకు అంగలారుస్తారు? ఎందుకంటే, ‘ద్రవ్యము సమకూర్చుకొనే వారందరి’ పనులు, వ్యాపార లావాదేవీలు అన్నీ నిల్చిపోతాయి.

14. తన ఆరాధకులమని చెప్పుకొనే వారిపై దేవుని పరిశీలన ఎంత నిశితంగా ఉండగలదు?

14 తన ఆరాధకులమని చెప్పుకొనే వారిని యెహోవా ఎంత నిశితంగా పరిశీలించగలడు? ప్రవచనం ఇలా కొనసాగుతుంది: “ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై​—⁠యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురముండరు, ద్రాక్షతోటలు నాటుదురు గాని వాటి రసమును పానముచేయరు.”​—⁠జెఫన్యా 1:12, 13.

15. (ఎ) యెరూషలేములోని భ్రష్టులైన యాజకులకు ఏమి సంభవించనైవుంది? (బి) నేడు అబద్ధమతాన్ని అనుసరిస్తున్న వారికి ఏమి సిద్ధంగా ఉంది?

15 యెరూషలేములోని భ్రష్టులైన యాజకులు యెహోవా ఆరాధనను అన్యమత ఆరాధనతో మిళితం చేస్తున్నారు. తాము సురక్షితంగా ఉన్నామని వాళ్లు భావించినప్పటికీ, వాళ్లు ఆశ్రయించిన ఆధ్యాత్మిక అంధకారాన్ని పారద్రోలగల ప్రకాశమానమైన దీపాలతో యెహోవా వాళ్లను వెదికి పట్టుకొంటాడు. దేవుని తీర్పు ప్రకటించబడడాన్నీ, అది అమలు చేయబడడాన్నీ ఎవ్వరూ తప్పించుకోలేరు. ఉల్లాసంతో ఉన్న ఆ మతభ్రష్టులు ద్రాక్షారసపు బానల అడుగున పేరుకుపోయిన మడ్డిలా స్థిరపడిపోయారు. మానవ కార్యకలాపాల్లో దేవుడు జోక్యం చేసుకుంటాడన్న ప్రకటనవల్ల కలతచెందడం వాళ్లకిష్టంలేదు, అయితే వారిపై దేవుని తీర్పు అమలు చేయబడినప్పుడు వారెంతమాత్రం తప్పించుకోలేరు. నేడు అబద్ధమతాన్ని అనుసరిస్తున్న వారు అంటే ప్రాముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యంలో ఉన్నవారూ, అలాగే యెహోవా ఆరాధన నుండి తొలగిపోయి భ్రష్టులైన వారూ తప్పించుకోలేరు. ఇవి “అంత్యదినము”లన్న విషయాన్ని నిరాకరిస్తూ, “యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని” వాళ్లు తమ మనస్సుల్లో అనుకుంటున్నారు. కానీ వాళ్లు ఎంత పొరబడుతున్నారో కదా!​—⁠2 తిమోతి 3:1-5; 2 పేతురు 3:3, 4, 10.

16. యూదా మీద దైవికతీర్పు అమలు చేయబడినప్పుడు ఏమి జరగాల్సివుంది, దీన్ని గురించిన గ్రహింపు మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాలి?

16 బబులోనీయులు ఆస్తిని కొల్లగొడతారనీ, ఇండ్లను పాడుచేస్తారనీ, ద్రాక్షతోటల ఫలసాయాన్ని తీసుకుపోతారనీ యూదా మతభ్రష్టులకు హెచ్చరిక చేయబడింది. యూదా మీద దైవికతీర్పు అమలు చేయబడినప్పుడు వస్తుసంపదలకు విలువ లేకుండా పోతుంది. ప్రస్తుత విధానంపై యెహోవా తీర్పుదినం విరుచుకుపడినప్పుడు కూడా అదే సంభవిస్తుంది. కాబట్టి, మనం ఆధ్యాత్మిక దృష్టిని కల్గివుండి, మన జీవితాల్లో యెహోవా సేవకు ప్రథమస్థానం ఇవ్వడం ద్వారా ‘పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుందాము’!​—⁠మత్తయి 6:19-21, 33.

“యెహోవా మహా దినము సమీపమాయెను”

17. జెఫన్యా 1:14-16 ప్రకారం యెహోవా తీర్పుదినం ఎంత సమీపంగా ఉంది?

17 యెహోవా తీర్పుదినం ఎంత సమీపంగా ఉంది? జెఫన్యా 1:14-16 వచనాల ప్రకారం దేవుడు ఈ అభయాన్నిస్తున్నాడు: “యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధకారమును కమ్ముదినము. ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును.”

18. యెహోవా తీర్పుదినం చాలా దూరంలో ఉందన్న ముగింపుకు మనమెందుకు రాకూడదు?

18 పాపులైన యూదా యాజకులకూ, అధిపతులకూ, ప్రజలకూ “యెహోవా మహా దినము సమీపమాయెను” అని హెచ్చరించడం జరిగింది. యూదాకు ‘యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వస్తుంది.’ అలాగే మన కాలంలో కూడా, యెహోవా దుష్టులకు విధించే తీర్పు ఎప్పుడో భవిష్యత్తులో సంభవిస్తుందిలే అని ఎవ్వరూ తలంచకూడదు. బదులుగా, యూదా విషయంలో దేవుడు త్వరగా చర్య తీసుకున్నట్లుగానే, నాశనదినాన్ని కూడా ఆయన ‘శీఘ్రముగా’ తీసుకువస్తాడు. (ప్రకటన 16:​14-16) తన సాక్షుల ద్వారా తెలియజేయబడిన యెహోవా హెచ్చరికలను అలక్ష్యం చేసిన వారందరికీ, ఎవరైతే నిజ ఆరాధనను హత్తుకోవడంలో విఫలమవుతారో వారందరికీ ఎంతటి బాధాకరమైన సమయంగా ఉంటుందో!

19, 20. (ఎ) యూదా, యెరూషలేములపై దేవుని ఉగ్రత కుమ్మరించబడే కొన్ని విధానాలేమిటి? (బి) విచక్షణారహితంగా కాక ఈ విధానంలో ఎంపిక చేయబడినవారిపైకే నాశనం వస్తున్న దృష్ట్యా, ఏ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి?

19 ప్రాచీన యూదా, యెరూషలేములపై దేవుని ఉగ్రత కుమ్మరించబడినప్పుడు, అది “శ్రమయు ఉపద్రవమును” సంభవించే దినంగా ఉంది. బబులోను ఆక్రమణదారులు యూదా నివాసులను అనేక రకాలుగా హింసించడమే గాక, మరణ నాశనాల వల్ల కల్గే మానసిక వ్యధ అంటే ఏమిటో తెలిసేలా చేస్తారు. ‘మహానాశనము, అంధకారము కమ్మే’ ఆ దినం అంధకారం, మేఘాలు, గాఢాంధకారములతో కూడినదై ఉంటుంది, సూచనార్థకంగా మాత్రమే గాక, అక్షరార్థంగా కూడా అంధకారం కమ్మే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రతిచోట పొగ అలుముకుంటుంది, వధ జరుగుతుంటుంది. అది “యుద్ధ ఘోషణయు బాకానాదమును” వినబడే దినం, అయినా ఆ ఘోషణలు నిరుపయోగమే అవుతాయి.

20 కోటగోడలను పడగొట్టే బబులోనీయుల యుద్ధసాధనాలు “ఎత్తయిన గోపురముల”ను కూలద్రోయడంతో యెరూషలేములోని కావలివారు నిస్సహాయులౌతారు. దేవుడు తీసుకువచ్చే నాశనం అందరిపైకి విచక్షణారహితంగా కాక ఎంపికచేయబడిన వారిపైకే వస్తుంది, ఆ నాశనంలో దేవుడు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్న ఆయన పరలోకపు ఆయుధాగారంలోని ఆయుధాల ముందు, ప్రస్తుత దుష్ట విధానంలోని గోపురాలు దుర్గాలు ఎందుకూ కొరగాకుండా పోతాయి. దాన్నుంచి తప్పించబడాలని మీరు నిరీక్షిస్తారా? ‘తన్ను ప్రేమించువారినందరిని కాపాడి, భక్తిహీనులనందరిని నాశనము చేసే’ యెహోవా పక్షాన నిలబడేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారా?​—⁠కీర్తన 145:20.

21, 22. జెఫన్యా 1:17, 18 మన దినాల్లో ఎలా నెరవేరుతుంది?

21జెఫన్యా 1:17, 18 వచనాల్లో ఎంత భయంకరమైన తీర్పుదినం ప్రవచించబడిందో కదా! “జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి” అంటున్నాడు యెహోవా దేవుడు, “గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును, వారి మాంసము పెంటవలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్ని చేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశ[న]ము చేయబోవుచున్నాడు.”

22 జెఫన్యా దినాల్లో చేసినట్లే, తన హెచ్చరికను లక్ష్యపెట్టడానికి నిరాకరించే ‘భూనివాసులందరిపైకి’ యెహోవా త్వరలోనే ఉపద్రవాన్ని తీసుకువస్తాడు. దేవునికి వ్యతిరేకంగా వాళ్లు పాపం చేసినందువల్ల విడుదల పొందలేక, వాళ్లు గ్రుడ్డివారివలె నిస్సహాయ స్థితిలో పడిపోతారు. యెహోవా తీర్పుదినమున వాళ్ల రక్తం విలువలేనిదిగా “దుమ్మువలె” పారవేయబడుతుంది. భూమి మీదనున్న ఈ దుష్టుల శరీరాలను​—⁠వారి పేగులను సహితం​—⁠దేవుడు “పెంటవలె” పారవేయనైవున్నాడు కనుక, వారికిది నిజంగా అవమానకరమైన అంతమై ఉంటుంది.

23. “యెహోవా ఉగ్రత దినమున” తప్పు చేసేవారు తప్పించుకోలేనప్పటికీ జెఫన్యా ప్రవచనం ఎలాంటి నిరీక్షణను మనకిస్తుంది?

23 యెహోవాకు, ఆయన ప్రజలకు వ్యతిరేకంగా పోరాడేవారిని ఎవ్వరూ కాపాడలేరు. యూదాలోని దుష్టులను వెండి కానీ, బంగారం కానీ తప్పించలేకపోయాయి, అలాగే, క్రైస్తవ మతసామ్రాజ్యంపైకి మిగిలిన దుష్టవిధానంపైకి “యెహోవా ఉగ్రత దినము” వచ్చినప్పుడు, వారు కూడబెట్టుకున్న ధనం కానీ, ఇవ్వజూపే లంచాలు కానీ వారిని కాపాడలేవు. నిర్ణయాత్మకమైన ఆ దినాన దుష్టులను ఆయన సమూలంగా నాశనం చేయనైవుండగా, ‘భూమి అంతా’ దేవుని అత్యాసక్తి అనే అగ్నిచేత దహించి వేయబడుతుంది. మనకు దేవుని ప్రవచనవాక్యంపై విశ్వాసముంది గనుకనే, “అంత్యకాలము” యొక్క అంతంలో ఉన్నామని మనం ఒప్పించబడ్డాము. (దానియేలు 12:⁠4) యెహోవా తీర్పుదినం సమీపంలో ఉంది, అతిత్వరలో తన శత్రువులపై తన పగను తీర్చుకుంటాడు. అయితే, తప్పించుకునే నిరీక్షణ ఉందని జెఫన్యా ప్రవచనం తెల్పుతోంది. కాబట్టి, యెహోవా ఉగ్రత దినమున దాచబడాలంటే మనం ఏమి చేయాల్సిన అవసరముంది?

మీరెలా ప్రతిస్పందిస్తారు?

• యూదా యెరూషలేములపై జెఫన్యా ప్రవచనం ఎలా నెరవేరింది?

• క్రైస్తవమత సామ్రాజ్యానికి మన దినాల్లోని దుష్టులకు ఏమి వేచివుంది?

• యెహోవా తీర్పుదినం ఎప్పుడో భవిష్యత్తులో సంభవిస్తుందని మనం ఎందుకు తలంచకూడదు?

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

యెహోవా తీర్పుదినం సమీపంలోనే ఉందని జెఫన్యా ధైర్యంతో ప్రకటించాడు

[చిత్రసౌజన్యం]

From the Self-Pronouncing Edition of the Holy Bible, containing the King James and the Revised versions

[15వ పేజీలోని చిత్రం]

సా.శ.పూ. 607 లో బబులోనీయుల చేతిలో యూదా యెరూషలేములపైకి యెహోవా దినము వచ్చింది

[16వ పేజీలోని చిత్రం]

యెహోవా దుష్టులను నాశనం చేస్తున్నప్పుడు దాన్నుంచి తప్పించబడాలని మీరు నిరీక్షిస్తారా?