కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మిక పరదైసు అంటే ఏమిటి?

ఆధ్యాత్మిక పరదైసు అంటే ఏమిటి?

ఆధ్యాత్మిక పరదైసు అంటే ఏమిటి?

గుస్తావొ బ్రెజిల్‌లోని ఒక చిన్న నగరంలో పెరిగాడు. * మంచివాళ్ళు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారని చిన్నప్పటి నుంచి ఆయనకు బోధించబడింది. విశ్వసనీయ మానవాళి ఒకరోజు భూపరదైసులో పరిపూర్ణ జీవితాన్ని ఆనందిస్తుందన్న దేవుని సంకల్పం గురించి ఆయనకు ఏ మాత్రం తెలీదు. (ప్రకటన 21:​3, 4) ఆయనకు తెలియని విషయం మరొకటి కూడా ఉంది. ఇప్పుడు కూడా తాను ఒక ఆధ్యాత్మిక పరదైసులో ఉండగలడన్న విషయాన్ని ఆయన గ్రహించలేకపోయాడు.

మీరెప్పుడైనా ఆ ఆధ్యాత్మిక పరదైసు గురించి విన్నారా? అదేమిటో, దాంట్లో భాగమై ఉండడానికి ఏమవసరమో మీకు తెలుసా? ఎవరైనా నిజంగా సంతోషంగా ఉండాలనుకుంటే ఆ పరదైసును గురించి తెలుసుకోవాల్సిన అవసరముంది.

ఆధ్యాత్మిక పరదైసును కనుగొనడం

ఈ రోజు కూడా ఒక వ్యక్తి పరదైసులో జీవించగలడని చెబితే, అది మీకు అసాధ్యమనిపించవచ్చు. ప్రస్తుతపు ఈ లోకం పరదైసులా ఎంతమాత్రం లేదు. ప్రాచీనకాల రాజు వర్ణించినట్లుగా బాధలను అనుభవిస్తున్నవారు ఇక్కడ అనేకమంది ఉన్నారు: “బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.” (ప్రసంగి 4:⁠1) కోట్లమంది భ్రష్ట రాజకీయాల, మతాల, ఆర్థిక వ్యవస్థల క్రింద నలిగిపోతున్నారు, వారికి ఉపశమనమూ లేదు, ‘ఆదరించువాడూ’ లేడు. అనేకమంది ఇతరులు తమ బిల్లులను కట్టుకోవడానికి, పిల్లలను పెంచడానికి, జీవించేందుకు అవసరమైన అనేకమైన వాటి కోసం సతమతమవుతున్నారు. వాళ్లు తాము మోస్తున్న భారాన్ని కాస్తంత తేలిక పర్చే వ్యక్తి ఎవరైనా సరే అతన్ని ఆదరణకర్తగా ఆహ్వానించవచ్చు. అలాంటి వాళ్లందరికీ జీవితం, పరదైసుకు పూర్తి భిన్నంగా వుంది.

అలాంటప్పుడు, ఆధ్యాత్మిక పరదైసు ఎక్కడుంది? “పరదైసు” అనే పదం గ్రీకు, పర్షియన్‌, హెబ్రీ పదాల సంబంధితమైనది, అవన్నీ ఉద్యానవనము లేక తోట, ప్రశాంతంగా విశ్రమించే ఒక స్థలం అనే భావాన్నిస్తాయి. ఈ భూమి ఒకరోజు అక్షరార్థంగా పరదైసులా మారుతుందని, పాపరహిత మానవజాతికి ఒక ఉద్యానవనంలాంటి నివాస స్థలమౌతుందని బైబిలు వాగ్దానం చేస్తోంది. (కీర్తన 37:​10, 11) దీన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఆధ్యాత్మిక పరదైసు అంటే తోటి మానవులతోనూ, దేవునితోనూ సమాధానాన్ని అనుభవిస్తూ, మన కళ్లకు మనోహరాన్నీ, దేహానికి ఉపశమనాన్నీ ఇచ్చే ఒక వాతావరణమే. గుస్తావొ గుర్తించినట్లుగానే నేడు అలాంటి పరదైసు ఉంది, అది దినదినం అధికమౌతున్న ప్రజల్ని తనలో చేర్చుకుంటోంది.

గుస్తావొకు 12 ఏళ్ళ వయసప్పుడు తాను రోమన్‌ క్యాథలిక్‌ ప్రీస్ట్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తల్లిదండ్రుల అనుమతితో ఒక మఠంలో చేరాడు. అక్కడ యువతను ఆకట్టుకోవడానికి చర్చి ప్రతిపాదించిన సంగీతం, నాటకరంగం, రాజకీయాల్లో ఆయన నిమగ్నమయ్యాడు. ఒక ప్రీస్ట్‌ తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసుకోవాలనీ, వివాహం చేసుకోలేడనీ ఆయనకు తెలుసు. అయినప్పటికీ, గుస్తావొకు తెలిసినవారిలో కొందరు ప్రీస్టులూ, బోధకులూ అనైతిక అలవాట్లున్న వారున్నారు. అలాంటి పరిసరాల్లో ఉన్న గుస్తావొ త్వరలోనే అమితంగా త్రాగడం ప్రారంభించాడు. ఆయనింకా ఆధ్యాత్మిక పరదైసును కనుగొనలేదన్నది విదితమౌతోంది.

ఒకరోజు, భూపరదైసు గురించి చెబుతున్న ఒక బైబిలు కరపత్రాన్ని గుస్తావొ చదివాడు. జీవితపు సంకల్పాన్ని గురించి అది ఆయనను ఆలోచింపజేసింది. “నేను క్రమంగా బైబిలును చదవడం ప్రారంభించాను, కాని నాకది అర్థం కాలేదు. దేవునికి పేరుందని కూడా నేను చూడలేదు” అని ఆయనన్నాడు. తర్వాత ఆయన మఠాన్ని వదిలేశాడు, బైబిలును అర్థం చేసుకోవడానికి సహాయాన్ని కోరుతూ యెహోవాసాక్షుల దగ్గరకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన చాలా వేగంగా పురోభివృద్ధి చెందాడు, త్వరలోనే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. గుస్తావొ ఆధ్యాత్మిక పరదైసు గురించి నేర్చుకున్నాడు.

దేవుని పేరుకోసం ఒక జనం

ఒక బైబిలు విద్యార్థికి దేవుని పేరు యెహోవా అని తెలుసుకోవడం కేవలం ఒక వార్త కాదని గుస్తావొ తెలుసుకున్నాడు. (నిర్గమకాండము 6:⁠3) సత్యారాధనలో అదొక ప్రధానమైన అంశం. ప్రార్థించడాన్ని గురించి యేసు తన అనుచరులకిలా నేర్పించాడు: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్తయి 6:⁠9, 10) క్రైస్తవులుగా మారిన అన్యుల గురించి మాట్లాడుతూ యేసు శిష్యుడైన యాకోబు ఇలా అన్నాడు: “అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని . . . మొదట కటాక్షించె[ను].” (అపొస్తలుల కార్యములు 15:​14) మొదటి శతాబ్దంలో “తన నామముకొరకు ఒక జనము”గా ఉన్నది క్రైస్తవ సంఘమే. నేడు దేవుని పేరు నిమిత్తం అలా ఒక జనముందా? అవును ఉంది, యెహోవాసాక్షులే ఆ జనమని గుస్తావొ గుర్తించాడు.

యెహోవాసాక్షులు 235 దేశాల్లోను, ప్రాంతాల్లోను చురుగ్గా పరిచర్యలో పాల్గొంటున్నారు. వారు దాదాపు 60 లక్షలమంది ఉన్నారు. మరో 80 లక్షలమంది ఆసక్తిగలవారు వీరి కూటాలకు హాజరవుతున్నారు. తాము చేసే బహిరంగ పరిచర్యనుబట్టి ప్రసిద్ధి చెందిన వీరు, యేసు చెప్పిన ఈ మాటలను నెరవేరుస్తున్నారు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.” (మత్తయి 24:​14) అయినా, యెహోవాసాక్షుల సహవాసంలో ఆధ్యాత్మిక పరదైసును కనుగొన్నానని గుస్తావొ ఎందుకు భావించాడు? ఆయనిలా అంటున్నాడు: “లోకంలో నేను చూసినదాన్ని, ముఖ్యంగా మఠంలో చూసినదాన్ని యెహోవాసాక్షుల మధ్య నేను కనుగొన్నదానితో పోల్చి చూశాను. ఎంతో గొప్ప వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం సాక్షుల మధ్య ఉన్న ప్రేమే.”

యెహోవాసాక్షుల గురించి ఇతరులు కూడా అలాగే వ్యాఖ్యానించారు. మిరియం అనే ఒక బ్రెజిలియన్‌ యువతి ఇలా అంది: “సంతోషంగా ఎలా ఉండాలో నాకు తెలిసేది కాదు, మా కుటుంబంలోని వాళ్ళక్కూడా తెలీదు. ప్రేమను క్రియారూపంలో నేను మొదటిసారిగా యెహోవాసాక్షుల మధ్యనే చూశాను.” క్రిస్ట్యాన్‌ అనే పేరుగల ఒక వ్యక్తి ఇలా చెప్పాడు: “నేను అప్పుడప్పుడు అభిచారంలో పాల్గొనేవాడిని, కానీ మతమంటే నాకు పెద్ద పట్టింపు లేదు. సమాజంలో నా హోదాకూ, ఒక ఇంజనీరుగా నా ఉద్యోగానికీ ఎక్కువ విలువనిచ్చేవాడిని. అయినప్పటికీ, నా భార్య యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం ప్రారంభించాక, నేను ఆమెలో మార్పును చూశాను. ఆమెను సందర్శించడానికి వచ్చే క్రైస్తవ స్త్రీలలోని ఆనందాన్నీ, ఆసక్తినీ చూసి కూడా నేను ముగ్ధుడ్నయ్యాను.” యెహోవాసాక్షుల గురించి ప్రజలు ఎందుకలా అంటున్నారు?

ఆధ్యాత్మిక పరదైసు అంటే ఏమిటి?

యెహోవాసాక్షులను ప్రత్యేకించే ఒక విషయమేమిటంటే బైబిలు జ్ఞానానికి వారిచ్చే ఉన్నతమైన విలువే. బైబిలు సత్యమనీ అది దేవుని వాక్యమనీ వాళ్ళు నమ్ముతారు. అందుకే వాళ్ళు కేవలం తమ మతపు మూలసూత్రాలను తెలుసుకోవడంతోనే తృప్తి చెందరు. వారికి బైబిలు చదవడమూ, వ్యక్తిగతంగా అధ్యయనం చేయడమూ వంటి నిరంతరం కొనసాగే ఒక కార్యక్రమం ఉంది. ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా యెహోవాసాక్షులతో సహవాసం చేస్తే, అంత ఎక్కువగా దేవుని గురించీ, దేవుని చిత్తం గురించీ బైబిల్లో ఏ విధంగా బయల్పర్చబడిందో నేర్చుకుంటాడు.

అటువంటి జ్ఞానం, సంతోషాన్ని హరింపజేసే మూఢనమ్మకాలనుంచీ, హానికరమైన ఆలోచనలనుంచీ యెహోవాసాక్షులను విముక్తుల్ని చేస్తుంది. యేసు ఇలా అన్నాడు: “సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయు[ను].” యెహోవాసాక్షులు అది నిజమని కనుగొన్నారు. (యోహాను 8:​32) ఒకప్పుడు అభిచారంలో పాల్గొంటుండే ఫెర్నాండొ ఇలా అంటున్నాడు: “నా తల్లిదండ్రులుగానీ నేనుగానీ చనిపోతామేమోనని భయపడుతుండే నాకు, నిరంతర జీవితం గురించి తెలుసుకోవడం వల్ల అపరిమితమైన ఉపశమనం కలిగింది.” క్షుద్ర లోకం, పునర్జన్మల భయాల నుంచి ఫెర్నాండొను సత్యం విడుదల చేసింది.

బైబిల్లో, పరదైసుతో దేవుని జ్ఞానానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ప్రవక్తయైన యెషయా ఇలా అన్నాడు: “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశము చేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.”​—⁠యెషయా 11:⁠9.

యెషయా ద్వారా చెప్పబడిన శాంతిని పొందడానికి కేవలం జ్ఞానం మాత్రమే సరిపోదు. ఒక వ్యక్తి తను నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టాలి. ఫెర్నాండొ ఇలా వ్యాఖ్యానించాడు: “ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మఫలాలను వృద్ధి చేసుకుంటాడో, అప్పుడాయన ఆధ్యాత్మిక పరదైసుకు తోడ్పడతాడు.” ఒక క్రైస్తవుడు వృద్ధి చేసుకోవాల్సిన మంచి లక్షణాలు “ఆత్మ ఫ[లాలు]” అని చెప్పిన అపొస్తలుడైన పౌలు మాటలను ఫెర్నాండొ ఇక్కడ సూచిస్తున్నాడు. పౌలు వాటినిలా పేర్కొన్నాడు: “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.”​—⁠గలతీయులు 5:​22-24.

అలాంటి లక్షణాలను అలవర్చుకోవడానికి కృషి చేస్తున్న వ్యక్తుల సముదాయంతో సహవాసం చేయడం నిజంగా పరదైసులో ఉన్నట్టుగా ఎందుకు ఉంటుందన్న విషయాన్ని మీరు గ్రహించారా? ప్రవక్తయైన జెఫన్యా ప్రవచించిన ఆధ్యాత్మిక పరదైసు ఇలాంటి ప్రజల మధ్యనే ఉంటుంది. ఆయనిలా చెప్పాడు: “వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతిగలవారై అన్నపానములు పుచ్చుకొందురు;”​—⁠జెఫన్యా 3:​13.

ప్రేమ యొక్క ప్రముఖ పాత్ర

పౌలు పేర్కొన్న ఆత్మఫలాల్లో మొదటిది ప్రేమ అని మీరు గమనించేవుంటారు. బైబిలు ఎక్కువగా మాట్లాడే లక్షణమిది. యేసు ఇలా అన్నాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు[రు].” (యోహాను 13:​35) నిజమే, యెహోవాసాక్షులు పరిపూర్ణులు కాదు. యేసు అపొస్తలుల మధ్య ఉండినట్లే కొన్నిసార్లు వాళ్ళ మధ్య కూడా భేదాభిప్రాయాలు వస్తుంటాయి. కాని వాళ్ళు ఒకర్నొకరు నిజంగా ప్రేమించుకుంటారు, ఆ లక్షణాన్ని వృద్ధి చేసుకుంటూ పరిశుద్ధాత్మ మద్దతు కోసం ప్రార్థిస్తారు.

దాని ఫలితంగా, వారి సాంగత్యం సాటిలేనిదిగా ఉంటుంది. వారి మధ్య వర్గభేదం లేక జాతీయతాభావ అనైక్యత అనేవి ఉండవు. వాస్తవానికి, 20వ శతాబ్దపు చివరి సంవత్సరాల్లో జరిగిన జాతి ప్రక్షాళనా, జాతి విద్వేష పోరాటాల్లో అనేకమంది సాక్షులు తమ ప్రాణాలకు తెగించి ఒకర్నొకరు కాపాడుకున్నారు. వాళ్ళు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి”నప్పటికీ, వారంతా ఒకే ఐక్యతను అనుభవిస్తున్నారు, అది మీరూ అనుభవిస్తేనే తప్ప అర్థంచేసుకోవడం కష్టం.​—⁠ప్రకటన 7:⁠9.

దేవుని చిత్తం చేసేవారి మధ్య పరదైసు

ఆధ్యాత్మిక పరదైసులో దురాశ, అనైతికత, స్వార్థాలకు తావుండదు. క్రైస్తవులకిలా చెప్పబడింది: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమీయులు 12:⁠2) మనం నిష్కళంకంగా నైతికంగా జీవించినప్పుడు, ఇతర విధాలుగా దేవుని చిత్తం చేసినప్పుడు, ఆధ్యాత్మిక పరదైసును నిర్మించడానికి తోడ్పడిన వారమౌతాము, అలాగే మన సంతోషాన్నీ అధికం చేసుకోగలుగుతాము. అది నిజమేనని కార్లా కనుగొంది. ఆమె ఇలా అంటోంది: “ఆర్థికంగా ఎవరిమీదా ఆధారపడకుండా ఉండాలంటే కష్టపడి పనిచేయాలని మా నాన్నగారు నాకు నేర్పించారు. నా విశ్వవిద్యాలయపు చదువులు నాకు కాస్త భద్రతా భావాన్ని ఇచ్చినప్పటికీ, కేవలం దేవుని వాక్య జ్ఞానం మాత్రమే మనకివ్వగల కుటుంబ ఐక్యతా సంరక్షణలను నేను కోల్పోయాను.”

నిజమే, ఆధ్యాత్మిక పరదైసును ఆనందించడం వల్ల జీవితంలోని భౌతిక సమస్యలు తొలిగిపోవు. ఇప్పటికీ క్రైస్తవులు అనారోగ్యానికి గురౌతారు. వాళ్ళు నివసిస్తున్న దేశం అంతఃకలహాలతో అల్లకల్లోలమై ఉండవచ్చు. అనేకమంది పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అయినప్పటికీ, ఆధ్యాత్మిక పరదైసుకు అత్యంత ప్రధాన విషయమైన యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడమంటే ఆయనిచ్చే మద్దతు కోసం ఎదురు చూడడమని అర్థం. నిజానికి, ఆయన ‘మన భారాన్ని తనపై మోపమని’ మనల్ని ఆహ్వానిస్తున్నాడు, తాము అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనెలా అద్భుతమైన రీతిలో మద్దతునిచ్చాడో అనేకమంది రూఢిపరచగలరు. (కీర్తన 55:​22; 86:​16, 17) “గాఢాంధకారపు లోయలో”నైనా దేవుడు తన ఆరాధకులతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తన 23:⁠4) మనకు మద్దతునిచ్చేందుకు దేవుడు చూపే సంసిద్ధతపై మనముంచే నమ్మకం, ఆధ్యాత్మిక పరదైసుకు కీలకమైన ‘మన హృదయములకును తలంపులకును కావలియుండే దేవుని సమాధానమును’ కాపాడుకోవడానికి సహాయపడుతుంది.​—⁠ఫిలిప్పీయులు 4:⁠7.

ఆధ్యాత్మిక పరదైసుకు తోడ్పడడం

ఒక ఉద్యానవనం లేక తోటను సందర్శించడానికి చాలామంది ఇష్టపడతారు. వాళ్ళు దాంట్లో నడవాలని లేక బహుశా ఒక బెంచీమీద కూర్చుని పరిసరాలను చూస్తూ ఆనందించాలని కోరుకుంటారు. అదేవిధంగా, యెహోవాసాక్షులతో సహవసించడాన్ని అనేకమంది ఆనందిస్తారు. వారి సాంగత్యం ఉపశమనాన్నీ, శాంతినీ, శక్తినీ ఇస్తుందని వారు కనుగొన్నారు. అయినప్పటికీ, ఒక అందమైన తోటను పరదైసులా కొనసాగించాలంటే మంచి పోషణ అవసరం. అదేవిధంగా, అనేక కష్టాలతో, సమస్యలతో నిండివున్న ఈ లోకంలో ఆధ్యాత్మిక పరదైసు ఉందంటే, దానిక్కారణం యెహోవాసాక్షులు దానికి కృషి చేస్తుండడమే, దేవుడు వారి ప్రయత్నాలను ఆశీర్వదించడమే. ఆ పరదైసుకు అర్థవంతమైన తోడ్పాటును ఒక వ్యక్తి ఎలా ఇవ్వగలడు?

మొదట, మీరు యెహోవాసాక్షుల సంఘంతో సహవాసం చేయాల్సిన అవసరముంది, వారితో బైబిలు అధ్యయనం చేయండి, ఆధ్యాత్మిక పరదైసుకు మూలమైన బైబిలు జ్ఞానాన్ని ఆర్జించండి. “ఆధ్యాత్మిక ఆహారం లేనిదే ఆధ్యాత్మిక పరదైసు లేదు” అని కార్లా పేర్కొంది. దాంట్లో దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడం, చదివినదాని గురించి ఆలోచించడం ఇమిడి ఉన్నాయి. మీరు ఆర్జించిన జ్ఞానం మిమ్మల్ని యెహోవా దేవునికి దగ్గర చేస్తుంది, అప్పుడు మీరు ఆయనను ప్రేమించడం ప్రారంభిస్తారు. మీరు ఆయనతో ప్రార్థనలో మాట్లాడడం, ఆయన నడిపింపును అడగడం, ఆయన చిత్తాన్ని చేస్తుండగా మీకు మద్దతును ఇచ్చేందుకు ఆయన పరిశుద్ధాత్మను అడగడం కూడా నేర్చుకుంటారు. మనకు ప్రార్థనలో పట్టుదల ఉండాలని యేసు చెప్పాడు. (లూకా 11:​9-13) అపొస్తలుడైన పౌలు “యెడతెగక ప్రార్థనచేయుడి” అని చెప్పాడు. (1 థెస్సలొనీకయులు 5:​15) ప్రార్థనలో దేవునితో మాట్లాడడం ఒక ఆధిక్యత. మీ ప్రార్థనలను దేవుడు వింటాడన్న పూర్తి నమ్మకంతో ప్రార్థించడం కూడా ఆధ్యాత్మిక పరదైసులో ఒక ప్రముఖమైన భాగం.

కాలం గడుస్తుండగా, మీరు నేర్చుకున్న వాటిద్వారా, మీ జీవితంలో మంచి మార్పులు కలగడాన్ని మీరు చూడగలుగుతారు, చివరికి మీరు దాని గురించి ఇతరులతో మాట్లాడాలని కోరుకుంటారు. అప్పుడు మీరు యేసు ఆజ్ఞకు విధేయత చూపించగలుగుతారు: “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” (మత్తయి 5:​16) యెహోవా దేవుని గూర్చిన, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం, వారు మానవజాతిపట్ల చూపించిన గొప్ప ప్రేమను కీర్తించడం ఎంతో సంతోషాన్ని తెస్తుంది.

ఈ భూగోళమంతా ఒక భౌతిక పరదైసులా, విశ్వసనీయ మానవాళికి చక్కని నివాస స్థలంలా కాలుష్యం లేని ఒక అందమైన ఉద్యానవనంలా మారే సమయం దగ్గరకు వస్తోంది. ఈ “అపాయకరమైన కా[లాల్లో]” ఆధ్యాత్మిక పరదైసు ఉనికి, దేవుని శక్తికీ దేవుడు భవిష్యత్తులో ఏం చేయగలడు ఏమి నెరవేరుస్తాడు అనే వాటికీ రుజువు లాంటిది.​—⁠2 తిమోతి 3:⁠1.

ఇప్పుడు కూడా, ఎవరైతే ఆ ఆధ్యాత్మిక పరదైసును ఆనందిస్తున్నారో వాళ్ళు యెషయా 49:10వ లేఖనంలోని ఒక ఆధ్యాత్మిక నెరవేర్పును అనుభవిస్తారు: “వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.” అది నిజమని జోస్‌ రూఢిపరుచుకున్నాడు. ఒక గొప్ప సంగీతకారుడవ్వాలని ఆయన కలలు కన్నాడు, కానీ క్రైస్తవ సంఘంతో కలిసి దేవుని సేవించడంలో ఆయన ఎక్కువ సంతృప్తిని కనుగొన్నాడు. ఆయనిలా అంటున్నాడు: “ఇప్పుడు నేను ఒక అర్థవంతమైన జీవితాన్ననుభవిస్తున్నాను. క్రైస్తవ సౌభ్రాతృత్వంలో నేను భద్రంగా ఉన్నానని నమ్ముతున్నాను, మనం నమ్మగల ఒక ప్రేమగల తండ్రిగా యెహోవా నాకు తెలుసు.” జోస్‌ పొందిన సంతోషం, ఆధ్యాత్మిక పరదైసులో ఉన్న ఆయనలాంటి లక్షలాదిమంది ఇతరులు పొందిన సంతోషం కీర్తన 64:10 లో చక్కగా వర్ణించబడింది: “నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు.” ఆధ్యాత్మిక పరదైసును గూర్చిన ఎంత చక్కని వర్ణన అది!

[అధస్సూచి]

^ పేరా 1 ఇందులో పేర్కొనబడ్డ కొందరు వ్యక్తుల పేర్లు మార్చబడ్డాయి.

[10వ పేజీలోని చిత్రం]

ఆధ్యాత్మిక పరదైసులో ఆనందిస్తూ, అది విస్తరించడానికి మనం తోడ్పడాలి!