కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నా జీవితకాలమంతా యెహోవాచే పోషించబడ్డాను

నా జీవితకాలమంతా యెహోవాచే పోషించబడ్డాను

జీవిత కథ

నా జీవితకాలమంతా యెహోవాచే పోషించబడ్డాను

ఫరెస్ట్‌ లీ చెప్పినది

పోలీసులు ఇప్పుడే మా గ్రామ్‌ఫోన్లనూ, బైబిలు సాహిత్యాలనూ స్వాధీనం చేసుకున్నారు. యెహోవాసాక్షులు చేసే పని చట్ట వ్యతిరేకమని కెనడా కొత్త గవర్నర్‌ జనరల్‌ ప్రకటించేలా ఆయనను పురికొల్పడానికి యెహోవాసాక్షుల వ్యతిరేకులకు రెండవ ప్రపంచ యుద్ధం ఒక సాకును ఇచ్చింది. ఇది 1940 జూలై 4న జరిగింది.

జరిగిన దానికి నిరుత్సాహపడకుండా, మేము దాచుకున్న స్థలం నుంచి మరిన్ని సాహిత్యాలను తీసుకొని మా ప్రకటనా పనిని కొనసాగించాం. ఆ సందర్భంలో, “దీన్ని మేమంత సులభంగా ఆపము, ప్రకటించమని యెహోవా మాకు ఆజ్ఞాపించాడు” అని చెప్పిన మా నాన్న మాటల్ని నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. చురుగ్గా ఉండే నాకు అప్పుడు పది సంవత్సరాల వయస్సు. పరిచర్యపట్ల మా నాన్నకుండిన పట్టుదలా ఉత్సాహమూ యథార్థవంతులైన తన సేవకులను మన దేవుడైన యెహోవా ఎలా పోషిస్తాడనే దానికి ఈ నాటికీ ఒక స్థిర జ్ఞాపికే.

మరోసారి పోలీసులు మమ్మల్ని ఆపినప్పుడు, ఈ సారి మా సాహిత్యాలను లాక్కోవడమే కాకుండా మా నాన్నను జైలుకు కూడా తీసుకువెళ్ళారు, నలుగురు పిల్లలతో మా అమ్మ ఒంటరిదైపోయింది. అది సెప్టెంబరు 1940 లో సస్కాచెవన్‌లో జరిగింది. దాని తర్వాత కొద్దికాలానికే, నా బైబిలు శిక్షిత మనస్సాక్షి కారణంగా, జెండా వందనం చేయనందుకు, జాతీయ గీతం పాడనందుకు నేను స్కూలు నుంచి బహిష్కరించబడ్డాను. కరస్పాండెన్సు కోర్సు ద్వారా నా విద్యాభ్యాసాన్ని కొనసాగించడం వల్ల, ఒక అనువైన షెడ్యూలును వేసుకోవడానికి వీలైంది, అలా నేను ప్రకటనా పనిలో మరింత ఎక్కువగా పాల్గొనగలిగాను.

కెనడా తూర్పు తీరప్రాంతాలకు వెళ్ళడానికి, యెహోవాసాక్షుల పూర్తికాల సేవకులైన పయినీర్లు కావాలని 1948 లో ఒక పిలుపు వచ్చింది. అప్పుడు హాలిఫాక్స్‌, నోవస్కోటియా, కేప్‌ వుల్ఫ్‌ నగరాల్లోనూ, ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌లోనూ పయినీరు సేవ చేయడానికి నేను వెళ్ళాను. దాని తర్వాతి సంవత్సరం, టొరాంటోలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో రెండు వారాలు పని చేయమని వచ్చిన ఆహ్వానాన్ని నేను అంగీకరించాను. ఆ రెండు వారాలు, ఫలవంతమైన ఆరుకంటే ఎక్కువ సంవత్సరాలు సేవచేసేలా నన్ను నడిపించాయి. కొంతకాలం తర్వాత నేను మిర్నాను కలుసుకున్నాను, యెహోవా మీద నాకున్న ప్రేమను ఆమె పంచుకుంది, మేము డిసెంబరు 1955 లో పెళ్ళి చేసుకున్నాం. మేము ఒంటారియోలోని మిల్టన్‌లో స్థిరపడ్డాం, త్వరలోనే అక్కడ ఒక క్రొత్త సంఘం తయారయ్యింది. మా ఇంటి కింది అంతస్తు రాజ్యమందిరం అయ్యింది.

మా పరిచర్యను విస్తరింపజేసుకోవాలనే కోరిక

దానితర్వాతి సంవత్సరాల్లో, మాకు వెంటవెంటనే వరుసగా ఆరుగురు పిల్లలు పుట్టారు. మొదట మా కూతురు మిరియం, తర్వాత చార్మేయిన్‌, మార్క్‌, అన్నెట్‌, గ్రాంట్‌, చివరిగా గ్లెన్‌. తరచుగా, నేను పని నుంచి ఇంటికి వచ్చేసరికి పిల్లలందరూ కుంపటి చుట్టూ నేలమీద కూర్చుని ఉండగా, మిర్నా వారికి బైబిలు వృత్తాంతాలను చదివి వివరిస్తుండేది. తమ హృదయాల్లో యెహోవా మీద నిజమైన ప్రేమను పెంచుకోవడాన్ని ఆమె వారికి నేర్పించింది. ఆమె ఇచ్చిన ప్రేమపూర్వక సహాయంతో మా పిల్లలందరూ వారి బాల్యదశలోనే మంచి బైబిలు జ్ఞానాన్ని సంపాదించుకోగలిగారు.

పరిచర్యపట్ల మా నాన్నగారికున్న ఉత్సాహం నా మనస్సులో, హృదయంలో చెరగని ముద్ర వేసింది. (సామెతలు 22:⁠6) ఆ కారణంగా, 1968 లో ప్రకటనా పనిలో సహాయం చేసేందుకు మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలకు వెళ్ళాలని యెహోవాసాక్షుల కుటుంబాలు ఆహ్వానించబడినప్పుడు మా కుటుంబం ఆ పిలుపుకు అంగీకారాన్ని తెలపాలని కోరుకుంది. అప్పటికి మా పిల్లలు 5 నుంచి 13 ఏళ్ళ మధ్య వయస్సులో ఉన్నారు, మాలో ఏ ఒక్కరికీ స్పానిష్‌ భాష ఒక్క ముక్క కూడా రాదు. నాకివ్వబడిన సలహా ననుసరించి, వివిధ దేశాలకు వెళ్ళి అక్కడి జీవన పరిస్థితులను పరిశీలించాను. నేను తిరిగి వచ్చిన తర్వాత, కుటుంబమంతా కలిసి ప్రార్థనాపూర్వకంగా మా ముందున్న అవకాశాలను పరిశీలించి నికరాగ్వాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం.

నికరాగ్వాలో సేవ చేయడం

అక్టోబరు 1970 నాటికి మేము మా కొత్త ఇంట్లో ఉన్నాం, తర్వాతి మూడు వారాల్లోనే సంఘ కూటంలోని ఒక కార్యక్రమంలో నాకు ఒక చిన్న భాగం ఇవ్వబడింది. నేను దానిని చేసేటప్పుడు నాకొచ్చిన అంతంత మాత్రం స్పానిష్‌తో నానా తంటాలు పడ్డాను, సంఘంలోని వారందరినీ మా ఇంటికి శనివారం ఉదయం 9:30కు సర్వేస కోసం రమ్మని ఆహ్వానిస్తూ ముగించాను. నా ఉద్దేశం ప్రకారం, ప్రాంతీయ సేవ కోసం ఉపయోగించే సర్వీస్యో అన్న పదాన్ని చెప్పాలి, కాని నిజానికి నేను ప్రతి ఒక్కరినీ బీరు తాగడానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లు అర్థమిచ్చే పదాన్ని ఉపయోగించాను. భాష నేర్చుకోవడం నిజంగా ఒక సవాలే!

మొదట, నేనొక ప్రెజెంటేషన్‌ను నా చేతిమీద రాసుకున్నాను, వెళ్ళే దారిలో దాన్ని రిహార్సల్‌ చేసుకున్నాను. నేనిలా చెప్పేవాడిని: “పుస్తకంతో ఉచితంగా ఒక కుటుంబ బైబిలు అధ్యయనం వస్తుంది.” నా అందింపును అంగీకరించిన ఒక వ్యక్తి తర్వాత చెప్పిందేమిటంటే, నేను ఏం చెప్పడానికి ప్రయత్నించానో తెలుసుకోవడానికి ఆయన మా కూటానికి రావాల్సి వచ్చిందట. ఆయనిప్పుడొక యెహోవాసాక్షి అయ్యాడు. అపొస్తలుడైన పౌలు కూడా అంగీకరించినట్లుగా, దీనుల హృదయాల్లో నాటబడిన సత్యపు విత్తనాలను దేవుడే వృద్ధి చేస్తాడనడానికి ఇది ఎంత చక్కటి రుజువు!​—⁠1 కొరింథీయులు 3:⁠7.

రాజధాని నగరమైన మనాగ్వాలో దాదాపు రెండు సంవత్సరాలు గడిపిన తర్వాత, మమ్మల్ని నికరాగ్వా యొక్క దక్షిణ ప్రాంతానికి వెళ్ళమన్నారు. అక్కడ మేము రివాసులోని సంఘంతో, పొరుగునున్న ఆసక్తిగలవారి ఐసోలేటెడ్‌ గ్రూపులతో కలిసి పనిచేశాం. మేము గ్రూపులను సందర్శించేటప్పుడు పేద్రో పేన్యా అనే విధేయతగల ఒక వృద్ధ సాక్షి నాకు తోడుగా వచ్చేవాడు. ఒక గ్రూపు, లేక్‌ నికరాగ్వాలోని అగ్నిపర్వతమున్న ఒక ద్వీపంలో ఉండేది, అక్కడ యెహోవాసాక్షుల ఒకే ఒక కుటుంబం ఉండేది.

ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, మా సందర్శనం పట్ల మెప్పుదలను చూపించేందుకు వాళ్ళు ఎంతగానో కృషిచేశారు. మేమక్కడికి చేరుకున్న సాయంత్రం, మా కోసం భోజనం సిద్ధంగా ఉంది. మేమక్కడ ఒక వారం రోజులున్నాం, అక్కడ బైబిలును ప్రేమించే అనేకమంది ప్రేమగల ప్రజలు మాతో తమ ఆహారాన్ని పంచుకున్నారు. ఆదివారంరోజు బహిరంగ బైబిలు ప్రసంగానికి 101 మంది హాజరవ్వడం చూసి మేము పులకరించిపోయాం.

మరొక సందర్భంలో, కోస్టా రికా సరిహద్దుకు దగ్గర్లోని పర్వత ప్రాంతాల్లో ఉండే ఆసక్తిగల ప్రజలున్న ఒక గుంపును మేము సందర్శించాల్సి వచ్చినప్పుడు యెహోవా యొక్క పోషించే శక్తి ప్రస్ఫుటమైంది. మేము వెళ్ళాల్సిన రోజున, నన్ను తీసుకువెళ్ళడానికి పేద్రో నా దగ్గరకు వచ్చాడు, కానీ నేను మలేరియాతో పడుకుని ఉన్నాను. “నేను రాలేను పేద్రో” అని అన్నాను. ఆయన తన చేతిని నా నుదుటి మీదపెట్టి “నీకు జ్వరం చాలా తీవ్రంగా ఉంది, కానీ నీవు రావాల్సిందే! సహోదరులు నీ కోసం ఎదురు చూస్తున్నారు” అన్నాడు. అప్పుడాయన హృదయపూర్వకంగా ఒక ప్రార్థన చేశాడు. నేను అప్పటి వరకూ విన్న చక్కని ప్రార్థనల్లో అది ఒకటి.

తర్వాత, “వెళ్ళి ఒక ఫ్రెస్కో (పళ్ళ రసం) తీసుకో. పది నిమిషాల్లో రెడీ అవుతాను” అన్నాను. మేము సందర్శించిన ప్రాంతంలో సాక్షుల కుటుంబాలు రెండున్నాయి, వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. నేను జ్వరంతో ఇంకా బలహీనంగానే ఉన్నప్పటికీ, మరుసటి రోజున మేము వాళ్ళతో కలిసి ప్రకటించడానికి వెళ్ళాం. మా ఆదివారపు కూటంలో వందమందికి పైగా హాజరైన వారిని చూడడం ఎంతటి ఉత్సాహాన్ని పుట్టించే సంఘటనో కదా!

మళ్ళీ తరలి వెళ్ళడం

1975 లో మాకు ఏడవ సంతానంగా వోన్‌ పుట్టాడు. దాని తర్వాతి సంవత్సరం, ఆర్థిక కారణాలవల్ల మేము కెనడాకు తిరిగి రావాల్సివచ్చింది. మేము నికరాగ్వాను వదిలి రావడం అంత సులభమేమీ కాలేదు, ఎందుకంటే మేము అక్కడున్నంత కాలం యెహోవా యొక్క పోషించే శక్తిని నిజంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. మేము అక్కడి నుంచి వచ్చే సమయానికి, మా సంఘ సేవా ప్రాంతంలో ఉన్న వారిలో 500 కన్నా ఎక్కువమంది వ్యక్తులు కూటాలకు హాజరవుతుండేవారు.

అంతకుముందు మా కూతురు మిరియం, నేనూ నికరాగ్వాలో ప్రత్యేక పయినీర్లుగా నియమించబడినప్పుడు, మిరియం నన్నిలా అడిగింది: “నాన్నా, మీరొకవేళ కెనడాకు తిరిగి వెళ్ళాల్సి వస్తే, నన్ను ఇక్కడే ఉండడానికి అనుమతిస్తారా?” అప్పుడు నాకు నికరాగ్వాను వదిలి వెళ్ళే ఆలోచనే లేదు కాబట్టి, “ఓ, తప్పకుండా” అన్నాను. ఆ కారణంగా, మేము నికరాగ్వాను వదిలి వచ్చేటప్పుడు, మిరియం తన పూర్తికాల పరిచర్యను కొనసాగిస్తూ అక్కడే ఉండిపోయింది. తర్వాత, ఆమె ఆండ్రు రీడ్‌ను పెళ్ళి చేసుకుంది. అప్పట్లో న్యూయార్క్‌నందున్న బ్రూక్లిన్‌లోని యెహోవాసాక్షుల మిషనరీ స్కూల్లో, 1984 లో జరిగిన 77వ గిలియడ్‌ తరగతికి వాళ్ళు హాజరయ్యారు. మిరియం ఇప్పుడు తన భర్తతోపాటు డొమినికన్‌ రిపబ్లిక్‌లో సేవ చేస్తోంది, నికరాగ్వాలోని శ్రేష్ఠమైన మిషనరీల ద్వారా ఆమెలో కలిగిన కోరికను ఆ విధంగా నెరవేర్చుకుంటోంది.

అదే సమయంలో, “దీన్ని మేమంత సులభంగా ఆపము” అన్న నాన్న మాటలు ఇప్పటికీ నా హృదయాన్ని దహిస్తున్నాయి. అందుకే మధ్య అమెరికాకు తిరిగి వెళ్ళడానికి సరిపడేంత డబ్బును కూడబెట్టుకున్న తర్వాత, 1981 లో మేము మళ్ళీ మా నివాసాన్ని మార్చాం, ఈసారి కోస్టా రికాకు వెళ్ళాం. మేమక్కడ సేవ చేస్తుండగా అక్కడి కొత్త బ్రాంచ్‌ కట్టడపు పనుల్లో సహాయం చేయడానికి మేము ఆహ్వానించబడ్డాం. కానీ, 1985 లో మా అబ్బాయి గ్రాంట్‌కు వైద్యం చేయించడానికి మేము కెనడాకు తిరిగి వచ్చేశాం. బ్రాంచ్‌ నిర్మాణపు పథకంపై పని చేయడానికి గ్లెన్‌, ప్రత్యేక పయినీరు సేవ చేయడానికి ఆనెట్‌, చార్మేయిన్‌లూ కోస్టా రికాలోనే ఉండిపోయారు. కోస్టా రికాను వదిలి వచ్చిన మేము, అక్కడికి తిరిగి వెళ్ళలేమని కలలో కూడా అనుకోలేదు.

దుస్థితిని ఎదుర్కోవడం

సెప్టెంబరు 17, 1993న తొలి సంధ్యవేళ సూర్యకాంతి ప్రకాశవంతంగా ఉంది. మా పెద్దబ్బాయి మార్కు, నేను కొయ్యపలకలతో ఇంటి కప్పువేస్తున్నాం. మేం కలిసి పనిచేస్తూ, అలవాటుగా ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అనుకోకుండా నాకు బ్యాలన్స్‌ తప్పింది, కప్పుమీది నుంచి దొర్లుకుంటూ కిందపడ్డాను. తర్వాత, నేను స్పృహలోకి వచ్చేసరికి, కనిపించిందల్లా ప్రకాశవంతమైన లైట్లూ తెల్ల బట్టలు ధరించిన మనుష్యులూ మాత్రమే. అది హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డు.

బైబిలు చెబుతున్న దానిని బట్టి, నేను వెంటనే “రక్తం వద్దు, రక్తం వద్దు” అని చెప్పాను. (అపొస్తలుల కార్యములు 15:​28, 29) ఆ సమయంలో, “ఫరవాలేదు నాన్నా, మేమంతా ఇక్కడే ఉన్నాం” అన్న చార్మేయిన్‌ మాటలు నాకెంతో ధైర్యాన్నిచ్చాయి. నా మెడికల్‌ డాక్యుమెంటును డాక్టర్లు చూశారనీ, రక్తాన్ని ఉపయోగించాలన్న ప్రసక్తే రాలేదనీ నాకు తర్వాత తెలిసింది. నా మెడ విరిగిన కారణంగా శరీరమంతా పక్షవాతానికి గురైంది, కనీసం నాకు నేను శ్వాస కూడా పీల్చుకోలేను.

చలనంలేని నాకు మరింత ఎక్కువగా యెహోవాచే పోషించబడాల్సిన అవసరమేర్పడింది. ఊపిరాడ్డం కోసం, శ్వాసనాళానికి రంధ్రంచేసి ఒక రెస్పిరేటర్‌ ట్యూబును జొప్పించడానికి చేసిన ప్రయత్నం, నా స్వరతంత్రులకు గాలి అందకుండా నాళాన్ని మూసేసింది. నేను మాట్లాడలేకపోయేవాడిని. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అర్థం చేసుకోవడానికి ఎదుటివాళ్ళు నా పెదవుల కదలికను చదవాల్సివచ్చేది.

ఖర్చులు బాగా పెరిగిపోయాయి. నా భార్యతోపాటు నా పిల్లల్లో చాలామంది పూర్తికాల సేవలోనే ఉన్నారు, ఈ ఆర్థిక బాధ్యతల వల్ల వాళ్ళు ఆ సేవను వదలాల్సి వస్తుందేమోనని నేను కలవరపడ్డాను. కానీ, మార్కు ఒక ఉద్యోగం సంపాదించగలిగాడు, అది మూడు నెలల్లోనే పెరిగిన ఖర్చుల భారాన్ని చాలా వరకు తట్టుకునేలా సహాయపడింది. తత్ఫలితంగా, నేనూ నా భార్యా తప్ప అందరూ పూర్తికాల సేవలోనే ఉండగలిగారు.

ఆరు వేర్వేరు దేశాలనుంచి వచ్చిన వందలాది గ్రీటింగ్‌ కార్డులూ, ఉత్తరాలతో హాస్పిటల్‌లో నేనుండే గది గోడలు నిండిపోయాయి. యెహోవా నన్ను నిజంగా పోషిస్తున్నాడు. సంఘం కూడా, నేను ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్న అయిదున్నర నెలలు నా కుటుంబానికి ఆహార పదార్థాలను అందించి సహాయం చేసింది. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక్కో పెద్ద నాతో గడిపేవారు, బైబిలునూ, బైబిలు సాహిత్యాలనూ చదివి వినిపించడంతోపాటు, ప్రోత్సాహకరమైన అనుభవాలను కూడా ఆ పెద్దలు చెప్పేవారు. నా కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ప్రతీ సంఘ కూటానికి నాతోపాటు కలిసి సిద్ధపడేవారు, ఆ విధంగా, ప్రాణాధారమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని నేను ఎన్నడూ కోల్పోలేదు.

నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు జరిగిన ఒక ప్రత్యేక సమావేశానికి నేను హాజరవ్వడానికి ఏర్పాటు చేయబడింది. ఆ రోజంతా నాతోపాటు ఒక నర్సు, ఒక రెస్పిరేటరీ టెక్నీషియన్‌ ఉండేలా హాస్పటల్‌ వాళ్ళు ఏర్పాటు చేశారు. నా క్రైస్తవ సహోదర సహోదరీలతో తిరిగి కలిసి ఉండడం ఎంత ఆనందకరమో కదా! నన్ను పరామర్శించడానికి వందలాది మంది వరుసగా నిలబడి తమవంతు కోసం ఎదురు చూడడాన్ని నేను ఎన్నటికీ మరిచిపోలేను.

ఆధ్యాత్మికతను కాపాడుకోవడం

24 గంటలూ నన్ను కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ, నాకు ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు సంవత్సరానికి, నేను నా కుటుంబంతో మా ఇంటికి తిరిగి వెళ్ళగలిగాను. నా చికిత్సకు సంబంధించిన పరికరాలతో ఉన్న ఒక ప్రత్యేక వ్యాను మూలంగా నేను కూటాలకు హాజరవ్వడానికి వీలు కలిగింది, నేను ఎప్పుడోగానీ కూటాలకు వెళ్లకుండా ఉండేవాడిని కాదు. అయినా, హాజరుకావడానికి దృఢనిశ్చయం అవసరమౌతుందని నేను ఒప్పుకుంటాను. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచీ అన్ని జిల్లా సమావేశాలకూ హాజరవ్వగలిగాను.

ఫిబ్రవరి 1997 నాటికి, నేను కొద్దికొద్దిగా మాట్లాడే స్థాయి వరకు కోలుకోగలిగాను. నా నర్సుల్లో కొందరు, నా బైబిలు ఆధారిత నిరీక్షణను వారితో పంచుకున్నప్పుడు శ్రద్ధగా వినేవారు. ఒక నర్సు యెహోవాసాక్షులు​—⁠దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకం మొత్తం, దాంతోపాటు ఇతర వాచ్‌టవర్‌ ప్రచురణలను నాకు చదివి వినిపించింది. నేను ఒక కఱ్ఱను ఉపయోగించి కంప్యూటర్‌ ద్వారా ఇతరులకు ఉత్తరప్రత్యుత్తరాలను జరుపుతుంటాను. అలా కఱ్ఱతో టైపు చేయడం చాలా అలసట పుట్టించేదిగా ఉన్నప్పటికీ, పరిచర్యలో నిమగ్నమై ఉండగలగడం ఆశీర్వాదకరమే.

నరాల నొప్పితో నేను చాలా బాధపడ్డాను. కాని బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకునేటప్పుడు లేక ఇతరులు నాకు చదివి వినిపించినప్పుడు కాస్త ఉపశమనం అనిపించేది. మద్దతునిచ్చే నా భార్యతో కలిసి అప్పుడప్పుడు నేను వీధి సాక్ష్యమివ్వడానికి వెళ్ళేవాడిని, అవసరమైనప్పుడు నా మాటలను ఆమె వివరించి చెప్పేది. కొన్ని సందర్భాల్లో నేను సహాయ పయినీరుగా సేవ చేయగలిగాను. క్రైస్తవ పెద్దగా సేవ చేయడం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది, ప్రత్యేకంగా కూటాల్లో లేక మా ఇంట్లో నన్ను కలవడానికి సహోదరులు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వారికి సహాయం చేయగలిగినా, వారిని ప్రోత్సహించగలిగినా ఎంతో ఆనందం కలిగేది.

కృంగిపోవడం చాలా సులభమని నేను ఒప్పుకుంటాను. అయితే ఎప్పుడైనా నాకు నిరుత్సాహం అనిపించినప్పుడు, సంతోషం కలగడానికి వెంటనే ప్రార్థించేవాడిని. నన్ను యెహోవా పోషిస్తూనే ఉండాలని రాత్రింబగళ్ళు ప్రార్థించేవాడిని. ఒక ఉత్తరం వచ్చినా లేక ఎవరైనా నన్ను సందర్శించినా ప్రతిసారీ ఉల్లాసం పొందేవాడిని. కావలికోట లేక తేజరిల్లు! పత్రికలను చదవడం కూడా నా మనసును ప్రోత్సాహవంతమైన ఆలోచనలతో నింపేది. కొన్నిసార్లు వేర్వేరు నర్సులు ఈ పత్రికలను నాకు చదివి వినిపించేవారు. నాకు ప్రమాదం జరిగినప్పటినుంచి, నేను బైబిలు మొత్తాన్ని ఆడియో క్యాసెట్ల ద్వారా ఏడుసార్లు విన్నాను. ఇవన్నీ యెహోవా నన్ను పోషించిన విభిన్న మార్గాలు.​—⁠కీర్తన 41:⁠3.

నా పరిస్థితుల్లోని ఈ మార్పు, మన అత్యున్నత బోధకుడైన యెహోవా మనం జీవించడానికి మనల్నెలా విద్యావంతుల్ని చేస్తాడో ధ్యానించడానికి చాలా సమయాన్ని ఇచ్చింది. ఆయన మనకు తన చిత్తాన్నీ సంకల్పాన్నీ గురించిన, అర్థవంతమైన పరిచర్యను గురించిన, కుటుంబ సంతోషానికి గల రహస్యంపై సలహాలను గురించిన, ఆపత్కాలాల్లో ఏం చేయాలో వివేచించడానికి అవసరమైన నిర్దిష్టమైన జ్ఞానాన్నిస్తాడు. యెహోవా నన్ను యథార్థతగల ఒక అద్భుతమైన భార్యతో ఆశీర్వదించాడు. నా పిల్లలు కూడా నాకెంతో సహాయంగా ఉన్నారు, వాళ్ళందరూ పూర్తికాల సేవలో ఉండడం నాకెంతో ఆనందాన్నిస్తుంది. మార్చి 11, 2000 రోజున మా అబ్బాయి మార్కు, ఆయన భార్య అలీసన్‌ గిలియడ్‌ స్కూలు 108వ తరగతిలో గ్రాడ్యుయేషన్‌ అయ్యాక నికరాగ్వాలో సేవచేయడానికి నియమించబడ్డారు. వారి గ్రాడ్యుయేషన్‌కు నా భార్యా నేనూ హాజరవ్వగలిగాం. విపత్తు నా జీవితాన్ని మార్చింది కానీ నా హృదయాన్ని కాదని నేను నిజంగా చెప్పగలను.​—⁠కీర్తన 127:3, 4.

నేను పొందిన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని నా కుటుంబానికి అందజేయగలిగేలా యెహోవా నాకు వివేచననిచ్చాడు. అందుకాయనకు నా కృతజ్ఞతలు. “దీన్ని మేమంత సులభంగా ఆపము, ప్రకటించమని యెహోవా మాకు ఆజ్ఞాపించాడు” అని చెప్పిన మా నాన్నకున్న వైఖరితో నా పిల్లలు తమ సృష్టికర్తను సేవించడం చూసి నేను నిజంగా బలపర్చబడ్డాను, ప్రోత్సహించబడ్డాను. నిజమే, నా జీవితకాలమంతా యెహోవా నన్నూ నా కుటుంబాన్నీ పోషించాడు.

[24వ పేజీలోని చిత్రం]

మా నాన్న, అక్కా, అన్నయ్యలతో, కుడి పక్కన నేను. మా ఇంటి పక్కనున్న ఆ కారే మేము పయినీరింగ్‌ చేసిన రోజుల్లో ఉపయోగించాం

[26వ పేజీలోని చిత్రం]

నా భార్య మిర్నాతో

[26వ పేజీలోని చిత్రం]

ఇటీవలి మా కుటుంబ చిత్రం

[27వ పేజీలోని చిత్రం]

ఇప్పటికీ నేను ఉత్తరాల ద్వారా ప్రకటిస్తాను