నిజమైన సంతోషాన్ని ఎలా పొందవచ్చు?
నిజమైన సంతోషాన్ని ఎలా పొందవచ్చు?
బౌద్ధమత నాయకుడైన దలైలామా “సంతోషాన్ని అన్వేషించడమే మన జీవితానికున్న అసలు ఉద్దేశమని నేను నమ్ముతాను” అని అన్నాడు. మనస్సుకూ హృదయానికీ శిక్షణ లేక క్రమశిక్షణ ఇవ్వడం ద్వారా సంతోషాన్ని పొందవచ్చని నమ్ముతున్నానని ఆయన తర్వాత వివరించాడు. “పూర్తి సంతోషాన్ని పొందడానికి మనక్కావల్సిన ప్రధానమైన పరికరం, మనస్సు” అని కూడా ఆయన అన్నాడు. దేవుని యందు విశ్వాసం అనవసరమని ఆయన భావిస్తున్నాడు. *
దానికి భిన్నంగా, దేవుని యందు ప్రగాఢ విశ్వాసాన్ని కలిగివున్న యేసును చూడండి, ఆయన బోధలు శతాబ్దాలకు పైగా కోట్లమందిని ప్రభావితం చేశాయి. యేసు మానవుల సంతోషంపట్ల ఆసక్తి కలిగివున్నాడు. ఆయన “. . . ధన్యులు” అన్న పదంతో ముగించబడే తొమ్మిది దివ్యాశీస్సులతో ప్రసిద్ధిగాంచిన కొండమీది ప్రసంగాన్ని ప్రారంభించాడు. (మత్తయి 5:1-12) అదే ప్రసంగంలో ఆయన తన శ్రోతలకు వారి మనస్సులను హృదయాలను పరిశీలించుకుని, శుద్ధపరచుకుని దౌర్జన్యం, అనైతికత, స్వార్థపు ఆలోచనల స్థానంలో శాంతియుతమైన, స్వచ్ఛమైన, ప్రియమైన ఆలోచనలను పెంపొందించుకోవడానికి వాటికెలా క్రమశిక్షణనిచ్చుకోవాలో బోధించాడు. (మత్తయి 5:21, 22, 27, 28; 6:19-21) తర్వాత ఆయన శిష్యుడొకాయన ఉద్బోధించిన విధంగా మనం ఏవైతే యోగ్యమైనవో, మెచ్చుకొనదగినవో వాటిలో ‘సత్యమైనవీ, మాన్యమైనవీ, న్యాయమైనవీ, పవిత్రమైనవీ, రమ్యమైనవీ, ఖ్యాతిగలవీ అయిన వాటిమీద ధ్యానముంచాలి.’—ఫిలిప్పీయులు 4:8.
నిజమైన సంతోషంలో ఇతరులతో మనకుండే సంబంధాలు ఇమిడి ఉన్నాయని యేసుకు తెలుసు. మానవులమైన మనం సహజ సిద్ధంగానే సంఘజీవులం, కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వారినుంచి మనల్ని మనం వేరుపరుచుకున్నా లేక వారితో ఎప్పుడూ తగాదాలు పెట్టుకుంటూవున్నా మనం సంతోషంగా ఎంతమాత్రమూ ఉండలేము. మనం ప్రేమించబడుతున్నామని అనిపించినప్పుడూ, మనం ఇతరులను ప్రేమించినప్పుడూ మాత్రమే మనం సంతోషంగా ఉండగలం. అటువంటి సంతోషానికి మూలం దేవునితో మనకుండే సంబంధమని యేసు బోధించాడు. ఇక్కడ యేసు బోధించినది ప్రత్యేకంగా దలైలామా చెప్పిందానికి భిన్నంగా ఉంది. ఎందుకంటే దేవున్నుంచి స్వతంత్రంగా ఉండి మానవులు నిజమైన సంతోషాన్ని పొందలేరని యేసు బోధించాడు. ఎందుకలా?—మత్తయి 4:4; 22:37-39.
మీ ఆధ్యాత్మికావసరాలను గూర్చి ఆలోచించండి
ఇది దివ్యాశీర్వాదాల్లో ఒకటని యేసు అన్నాడు: “ఆధ్యాత్మికావసరాల పట్ల ఆసక్తిగలవారు ధన్యులు.” (మత్తయి 5:3 NW) ఆయన ఎందుకు అన్నాడలా? ఎందుకంటే జంతువులకు భిన్నంగా, మనకు ఆధ్యాత్మికావసరాలు ఉన్నాయి. దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనం, ప్రేమా, న్యాయం, కనికరం, జ్ఞానంలాంటి దైవిక లక్షణాలను ఒక స్థాయివరకు వృద్ధి చేసుకోగలం. (ఆదికాండము 1:27; మీకా 6:8; 1 యోహాను 4:8) మన ఆధ్యాత్మికావసరాల్లో, మన జీవితాలకొక సంకల్పాన్ని కలిగివుండాల్సిన అవసరత కూడా చేరివుంది.
అలాంటి ఆధ్యాత్మికావసరాలను మనమెలా తీర్చుకోగలం? అది తాదాత్మ్య చింతనద్వారా లేక ఆత్మ పరిశీలనద్వారా కాదు. బదులుగా, యేసు ఇలా అన్నాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్తయి 4:4) మన జీవానికి ప్రాణాధారమైన “ప్రతిమాట”కు దేవుడు మూలమని యేసు చెప్పినదాన్ని గమనించండి. కొన్ని ప్రశ్నలకు జవాబులను పొందడానికి దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు. ప్రత్యేకంగా, జీవిత సంకల్పాన్ని గురించిన, సంతోషానికి మార్గాలను గురించిన సిద్ధాంతాలు కోకొల్లలుగా పెరిగిపోయిన ఈ రోజున ఆ పరిజ్ఞానం ఎంతో సమయోచితమైనది. ఆరోగ్య సంపదలను గురించీ, సంతోషాన్ని గురించీ పాఠకులకు హామీనిచ్చే పుస్తకాలతో నేడు పుస్తకాల షాపులు నిండిపోయాయి. ఇంటర్‌నెట్‌లో కూడా సంతోషానికి సంబంధించిన వెబ్ సైట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి.
అయినప్పటికీ, ఆ రంగాల్లో మానవ ఆలోచనా సరళి తరచుగా తప్పుదారి పట్టించబడుతోంది. అది స్వార్థపు కోరికలను లేక అహాన్ని సంతృప్తిపరుస్తుంది. అది పరిమితమైన జ్ఞానంపైనా, అనుభవాలపైనా, అతి తరచుగా తప్పుడు సిద్ధాంతాలపైనా ఆధారపడుతుంది. ఉదాహరణకు, స్వయం సహాయక పుస్తక రచయితల్లో పెరుగుతున్న ఒక ట్రెండ్ ఏంటంటే, మానవ భావోద్వేగాలు మానవజాతి పూర్వీకులని భావించబడుతున్న జంతువుల నుండి ఉద్భవించాయని తలంచే “పరిణామవాద మనస్తత్వశాస్త్ర” సిద్ధాంతంపై వారి యోచనలు ఆధారపడడమే. సత్యమేంటంటే, మన సృష్టికర్త పాత్రను నిర్లక్ష్యం చేసే సిద్ధాంతం ఆధారంగా సంతోషాన్ని కనుగొనేందుకు చేసే ఎటువంటి ప్రయత్నమైనా సరే అది నిష్ఫలమౌతుంది, చివరికి నిరాశకు నడిపిస్తుంది. ఒక ప్రాచీన ప్రవక్త ఇలా చెప్పాడు: “జ్ఞానులు అవమానము నొందినవారైరి, . . . వారు యెహోవా వాక్యమును నిరాకరించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు?”—యిర్మీయా 8:9.
మనమెలా నిర్మించబడ్డామో, మనకు ఏది నిజమైన సంతోషాన్నిస్తుందో యెహోవా దేవునికి తెలుసు. తాను మానవుల్ని భూమ్మీద ఎందుకు ఉంచాడో, భవిష్యత్తులో వారికోసం ఏమి వేచివుందో ఆయనకు తెలుసు, బైబిలు ద్వారా ఆ సమాచారాన్ని ఆయన మనతో పంచుకుంటాడు. ఆ ప్రేరేపిత పుస్తకంలో ఆయన బయల్పర్చిన విషయాలు, నిర్ణయించబడిన వ్యక్తులను ప్రతిస్పందింపజేసి సంతోషాన్ని కలిగిస్తాయి. (లూకా 10:21; యోహాను 8:32) యేసు శిష్యుల్లోని ఇద్దరి విషయంలో ఇదే జరిగింది. యేసు మరణం తర్వాత వాళ్ళు నిరుత్సాహం చెందారు. మానవజాతిని రక్షించే దేవుని సంకల్పంలో తన పాత్ర గురించి పునరుత్థానుడైన యేసు నుంచి స్వయంగా విని తెలుసుకున్న తర్వాత, వాళ్ళిలా అన్నారు: “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?”—లూకా 24:32.
బైబిలు సత్యం మన జీవితాన్ని నడిపించడానికి మనం అనుమతించినప్పుడు అటువంటి ఆనందం అధికమౌతుంది. ఈ విషయంలో సంతోషాన్ని ఒక వర్షధనుస్సుతో పోల్చవచ్చు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అది కనబడుతుంది, కాని పరిస్థితులు సరిగ్గా తగినవిధంగా ఉన్నప్పుడు అది రెండు వర్షధనుస్సుల్లాగా ద్విగుణీకృతమైన ప్రకాశంతో కనబడుతుంది. బైబిలు బోధలను అన్వయించుకోవడం మన సంతోషాన్ని ఎలా అధికం చేయగలదో మనమిప్పుడు కొన్ని ఉదాహరణలను చూద్దాం.
మీ జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోండి
మొదటిగా, ఆడంబరం గురించి యేసు చెప్పిన సలహాను గమనించండి. జీవితంలో ధనసంపాదననే ప్రధానాంశంగా చేసుకోవడానికి వ్యతిరేకంగా సలహా చెప్పినతర్వాత ఆయనొక అసాధారణమైన మాటన్నాడు. ఆయనిలా అన్నాడు: “నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగుమయమై యుండును.” (మత్తయి 6:19-22) ముఖ్యంగా, మనం అత్యాశతో డబ్బు అధికారం లేక ప్రజలు తమకోసం పెట్టుకునే వేరే ఇతర లక్ష్యాల కోసం తీవ్రంగా పాటుపడితే, అతి ప్రాముఖ్యమైనవాటిని కోల్పోతాం. ఎందుకంటే యేసు మరొక సందర్భంలో చెప్పినట్లుగా, “ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కా[దు].” (లూకా 12:15) మనం నిజంగా ప్రధానమైన విషయాలకు అంటే దేవునితో మన సంబంధం, కుటుంబ అవసరాలు, వాటికి సంబంధించిన ఇతర విషయాలు వంటివాటికి ప్రాధాన్యతనిస్తే, అప్పుడు మన “కన్ను తేటగా” నిర్మలంగా ఉంటుంది.
యేసు కఠోర నియమాలను లేక వైరాగ్యాన్ని సిఫార్సు చేయడం లేదని గమనించండి. అయినా, యేసు వైరాగి కాదు. (మత్తయి 11:19; యోహాను 2:1-11) బదులుగా, జీవితాన్ని కేవలం ధనార్జన కోసం దొరికిన సదవకాశంగా భావించేవారు ఆ జీవితాన్నే కోల్పోతారని ఆయన బోధించాడు.
అమెరికానందున్న సాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక సైకోథెరపిస్ట్, జీవితంలోని తొలిదశలోనే ధనవంతులైన కొందరి గురించి వ్యాఖ్యానిస్తూ వారి డబ్బు వారి “ఒత్తిడికి, అయోమయానికి మూలం. రెండు లేక మూడు ఇండ్లను, ఒక కారును ఖరీదు చేస్తారు, ఇతర వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అది ఏమీ చేయలేకపోయినప్పుడు [అంటే, అది వారికి సంతోషాన్ని తీసుకురాలేక పోయినప్పుడు], వారు కృంగిపోతారు నిరుత్సాహపడిపోతారు, జీవితంలో ఏం చేయాలో తోచని అయోమయానికి గురౌతారు” అని ఆయనన్నాడు. దానికి భిన్నంగా, జీవితాన్ని నిరాడంబరంగా గడుపుతూ, ఆధ్యాత్మిక విషయాలకు సరైన సమయమిమ్మన్న యేసు సలహాను ఎవరైతే చెవిన పెడతారో వారు నిజమైన సంతోషాన్ని కనుగొంటారు.
టోమ్ అనే ఇండ్లు కట్టే ఒక కంట్రాక్టరు హవాయిలో ఉన్నాడు. ఆయన, పసిఫిక్ ద్వీపాల్లో పేద ప్రజలున్న చోట ఆరాధనా స్థలాలను నిర్మించడంలో స్వచ్ఛంద సహాయాన్నందించడానికి ముందుకు వచ్చాడు. అణకువగల అక్కడి ప్రజల్లో ఆయన ఒక విషయాన్ని గమనించాడు. ఆయనిలా అన్నాడు: “ఈ ద్వీపాల్లోని నా క్రైస్తవ సహోదర సహోదరీలు నిజంగా సంతోషంగా ఉన్నారు. డబ్బు, సంపదలు సంతోషానికి కీలకం కావని మరింత స్పష్టంగా చూడడానికి వారు నాకు సహాయం చేశారు.” ఆ ద్వీపాల్లో తనతోపాటు స్వచ్ఛందంగా పనిచేసిన వారిని ఆయన గమనించాడు, వారు ఎంత సంతృప్తిగా ఉండేవారో కూడా ఆయన గుర్తించాడు. “వారు కావాలంటే ఎంతో డబ్బు సంపాదించుకోగలిగేవారు, కాని వారు ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమ స్థానాన్నిచ్చి, నిరాడంబరమైన జీవనశైలిని ఎన్నుకున్నారు” అని టోమ్ అన్నాడు. అలాంటి మాదిరులతో కదిలించబడిన టోమ్, కుటుంబ విషయాలకు ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగేలా తన సొంత జీవితాన్ని నిరాడంబరంగా చేసుకున్నాడు, ఆ మార్పుకు ఆయనెంత మాత్రం పశ్చాత్తాపపడడంలేదు.
సంతోషం, ఆత్మగౌరవం
హుందాతనం లేక ఆత్మగౌరవ భావం సంతోషానికి ఆవశ్యకం. మానవ అపరిపూర్ణత కారణంగా, దాని వల్ల వచ్చిన బలహీనతల కారణంగా కొందరు తమ గురించి తాము ప్రతికూలమైన దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు, అనేకమందికి అలాంటి భావాలు చిన్నప్పటినుంచి ఉంటాయి. మనసులో నాటుకు పోయిన అలాంటి భావాలను జయించడం కష్టమైనప్పటికీ, అసంభవమేమీ కాదు. దానికి పరిష్కారమార్గం దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడమే.
మన గురించి సృష్టికర్త ఎలా భావిస్తున్నాడో బైబిలు వివరిస్తుంది. మానవ దృష్టికంటే, మన సొంత దృష్టికంటే కూడా దేవుని దృష్టి ప్రాముఖ్యమైనది కాదా? ప్రేమా స్వరూపి అయిన దేవుడు పక్షపాతం లేక ద్వేషాలు లేకుండా మనవైపు చూస్తాడు. మనం ఏమై ఉన్నామో, ఏమై ఉండగలమో దాన్ని బట్టే ఆయన మనల్ని చూస్తాడు. (1 సమూయేలు 16:7; 1 యోహాను 4:8) వాస్తవానికి, ఆయనను ప్రీతిపర్చాలనుకునే వారి అపరిపూర్ణతలు ఏవైనప్పటికీ కూడా ఆయన వారిని అమూల్యమైన వారిగా, అవును ప్రియమైన వారిగా దృష్టిస్తాడు.—దానియేలు 9:23; హగ్గయి 2:7.
దేవుడు మన బలహీనతలను, అలాగే మనం చేసే ఏ పాపాలనైనా ఉపేక్షించడనేదీ నిజమే. సరైనదాన్ని చేయడానికి మనం గట్టిగా ప్రయత్నించాలని ఆయన మననుండి కోరుకుంటాడు. మనమలా చేసేటప్పుడు మనకు మద్దతునిస్తాడు. (లూకా 13:24) అయినా బైబిలు ఇలా చెబుతోంది: “తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.” అది ఇలా కూడా చెబుతోంది: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.”—కీర్తన 103:13; 130:3, 4.
అందుకే మిమ్మల్ని మీరు దేవుని దృష్టితో చూడడం నేర్చుకోండి. తనను ప్రేమించేవారిని ఆయన తన ప్రియమైనవారిగా దృష్టిస్తాడనీ, వారిపై ఆయనకు నమ్మకముందనీ తెలుసుకోవడం, ఒక వ్యక్తి తనను తాను అయోగ్యునిగా దృష్టించుకున్నప్పటికీ, ఆయన సంతోషాన్ని అధికం చేయడానికి ఎంతో దోహదపడగలదు.—1 యోహాను 3:19, 20.
నిరీక్షణ—సంతోషానికి కీలకం
పాజిటివ్ సైకాలజీ అని ఇటీవల ప్రాచుర్యం పొందిన సిద్ధాంతం, అనుకూల ఆలోచనల ద్వారా, వ్యక్తిగత ప్లస్ పాయింట్లపై [బలాధిక్యతలపై] దృష్టి నిలపడం ద్వారా అలవర్చుకునే ఆశావాదం సంతోషానికి నడిపించగలదన్న అభిప్రాయాన్ని కల్గివుంది. జీవితంపై, భవిష్యత్తుపై గల ఆశావాదపు దృక్పథం మన సంతోషాన్ని అధికం చేస్తుందనే విషయాన్ని ఎవరో గానీ నిరాకరించరు. అయినప్పటికీ, అలాంటి ఆశావాదం వాస్తవం మీద ఆధారపడివుండాలి గానీ కేవలం ఇష్టానుసారమైన ఆలోచనల మీద మాత్రం కాకూడదు. ఎంతటి ఆశావాదమున్నా లేక ఎన్ని అనుకూల ఆలోచనలున్నా అవి, నేడు అనేకమంది సంతోషాన్ని హరింపజేసే యుద్ధం, ఆకలి, వ్యాధి, కాలుష్యం, వృద్ధాప్యం, అనారోగ్యం, లేక మరణం వంటివాటిని మాత్రం తొలగించలేవు. అయినప్పటికీ, ఆశావాదం తగినట్టుగానే దాని స్థానంలో అదుంది.
ఆసక్తికరంగా, బైబిలు ఆశావాదమనే పదాన్ని ఉపయోగించడంలేదు; అది చాలా శక్తివంతమైన పదాన్ని ఉపయోగిస్తుంది అదే—నిరీక్షణ. వైన్స్ కంప్లీట్ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ బైబిల్లో ఉపయోగించబడిన “నిరీక్షణ” అనే పదాన్ని “అనుకూలమైన, నమ్మకమైన నిరీక్షణ, . . . మంచి కోసమైన సంతోషకరమైన ఊహ” అని నిర్వచిస్తుంది. బైబిలు వ్యవహారికంలో నిరీక్షణ అనేది, ఒక పరిస్థితి యొక్క ఆశావాదపు దృష్టికంటే ఎక్కువ. ఒకరి నిరీక్షణ దేనిమీదుందో దాన్ని కూడా అది సూచిస్తుంది. (ఎఫెసీయులు 4:4; 1 పేతురు 1:3, 4) ఉదాహరణకు, దీని ముందరి పేరాలో పేర్కొన్న అప్రీతికరమైన విషయాలన్నీ అతి త్వరలోనే తొలగింపబడతాయన్నది క్రైస్తవ నిరీక్షణ. (కీర్తన 37:9-11, 29) అయితే నిరీక్షణలో ఇంకెంతో ఇమిడివుంది.
క్రైస్తవులు, భూపరదైసులో నమ్మకమైన మానవాళి పరిపూర్ణ జీవితాన్ని పొందే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. (లూకా 23:42, 43) ఆ నిరీక్షణను విశదీకరిస్తూ, ప్రకటన 21:3, 4 ఇలా చెబుతోంది: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, . . . ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను].”
ప్రస్తుత పరిస్థితులు కోరుకున్నంత అనుకూలంగా లేకపోయినప్పటికీ, అటువంటి భవిష్యత్తు కావాలని ఎదురుచూసే ఎవరికైనా సంతోషంగా ఉండడానికి ఎన్నో కారణాలున్నాయి. (యాకోబు 1:12) కాబట్టి బైబిల్ని పరిశీలించి, దాన్ని ఎందుకు నమ్మగలరన్న విషయాన్ని మీరెందుకు తెలుసుకోగూడదు. ప్రతిరోజు బైబిలును చదవడంలో సమయం గడపడం ద్వారా మీ నిరీక్షణను బలపరుచుకోండి. అలా చేయడంవల్ల మీ ఆధ్యాత్మికత వృద్ధి చెందుతుంది, ప్రజల సంతోషాన్ని హరింపజేసే విషయాలను నివారించడానికి సహాయపడుతుంది, మీలోని సంతృప్తి భావాన్ని పెంచుతుంది. అవును, నిజమైన సంతోషానికి చివరి రహస్యం దేవుని చిత్తాన్ని చేయడమే. (ప్రసంగి 12:13) బైబిలు ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా నిర్మించుకున్న జీవితమే సంతోషకరమైన జీవితం, ఎందుకంటే యేసు ఇలా చెప్పాడు: “దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యు[లు]”—లూకా 11:28.
[అధస్సూచి]
^ పేరా 1 ఒక బౌద్ధమతస్థునికి దేవుని యందు విశ్వాసం అవసరంలేదు.
[5వ పేజీలోని చిత్రాలు]
ధనార్జన ద్వారా, అందరినుంచి వేరుగా ఉండడం ద్వారా, లేక పరిమితమైన మానవ జ్ఞానాన్ని నమ్మడం ద్వారా సంతోషాన్ని పొందలేము
[6వ పేజీలోని చిత్రం]
దేవుని వాక్యానికి విధేయత చూపించడంపై ఆధారపడ్డ జీవితమే సంతోషకరమైన జీవితం
[7వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ నిరీక్షణ ఒక వ్యక్తిని సంతోషపరుస్తుంది