కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు నిజంగా సంతోషంగా ఉండగలరా?

మీరు నిజంగా సంతోషంగా ఉండగలరా?

మీరు నిజంగా సంతోషంగా ఉండగలరా?

జార్జ్‌ అందర్నీ నవ్వుతూ పలకరించేవాడు. ఆయనకైతే జీవితమనేది ఆనందించేందుకైన ఒక అమూల్యమైన బహుమతిలాంటిది. వృద్ధాప్యం వల్ల ఎన్నో కష్టాలననుభవించాల్సివచ్చినా, సంతోషం, ఆశావాదాలు ఆయనకు ట్రేడ్‌మార్కుల్లాంటివి. మరణించే రోజువరకూ ఆయనొక సంతోషకరమైన వ్యక్తిగానే అందరికీ తెలుసు. మీరూ జార్జ్‌లాగే సంతోషంగా ఉండే వ్యక్తేనా? ప్రతి నూతనదినాన్ని ఆనందించడానికొక బహుమతిగా మీరు దృష్టిస్తారా? లేక రాబోయే ఒక నూతన దినం మిమ్మల్ని ఉదాసీనులుగా చేస్తుందా, మీకు ఆందోళన కలిగిస్తుందా? మీ సంతోషాన్ని ఏదైనా హరింపజేస్తోందా?

సంతోషమనీ లేక ధన్యతనీ అనువదించబడిన ఆంగ్ల పదాన్ని సాపేక్షికంగా చూస్తే శాశ్వతమైన ఒక క్షేమకరమైన స్థితి అని నిర్వచించడం జరిగింది. అది సంతృప్తి చెందడం నుంచి ప్రగాఢమైన, అత్యంతానందం వరకూ ఉన్న భావోద్వేగాలుగా, క్షేమకరమైన స్థితిలో ముందుకు సాగాలనే ఒక సహజసిద్ధమైన కోరికగా వర్ణించబడింది. అలాంటి సంతోషం నిజంగా ఉందా?

ప్రజల దగ్గర కావల్సినంత డబ్బున్నప్పుడు మాత్రమే వాళ్లు సంతోషంగా ఉంటారనే అభిప్రాయాన్ని నేడు సమాజం పెంపొందిస్తోంది. ధనవంతులయ్యేందుకు తాము చేసే విపరీతమైన ప్రయత్నాలవల్ల కోట్లమంది ప్రజలు ఊపిరి సలపనంతటి హడావుడితో గడుపుతున్నారు. అలా గడపడంలో, అనేకమంది తమ జీవితంలోని ఇతర ముఖ్యమైన వాటితోపాటు వ్యక్తిగత బాంధవ్యాలను కూడా కోల్పోతున్నారు. చీమల పుట్టమీది చీమల్లాగా, ఎడతెరిపి లేకుండా అటూ ఇటూ ధనం కోసం పరుగులు పెడుతున్నారు. తాము చేసే దానిని గురించిగానీ, ఇతరుల గురించిగానీ ఆలోచించడానికి వారికి ఉన్న సమయం అంతంత మాత్రమే. సహేతుకంగానే, “కృంగుదలకు గురైనవారిగా నిర్ధారించబడిన ప్రజల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది, చాలా చిన్నవయస్సు నుంచే ప్రజలు దానికి [కృంగుదలకు] గురౌతున్నారు. . . . ఏంటిడిప్రెషన్‌కు సంబంధించిన [కృంగుదల నివారణ] మందులు బాగా అమ్ముడు పోతున్నాయి” అని లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ పత్రికలోని ఒక నివేదిక తెలియజేస్తోంది. కోట్లాదిమంది తమ సమస్యలనుంచి ఉపశమనం పొందడం కోసం నిషేధించబడిన మందులకు లేక విపరీతమైన త్రాగుడుకు బానిసలవుతున్నారు. కొంతమంది కృంగుదలకు గురైనప్పుడు డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు. ఒక సర్వేలో “స్త్రీలు షాపింగ్‌ చేయడంలో మునిగి తేలేందుకు అధికంగా మొగ్గు చూపుతున్నట్లుగా కనబడింది, కృంగుదలకు గురైనప్పుడు స్త్రీలు మగవాళ్లకన్నా మూడురెట్లు ఎక్కువగా షాపింగ్‌ చేశారు” అని బ్రిటిష్‌ దినపత్రిక ద గార్డియన్‌ నివేదిస్తోంది.

అయినప్పటికీ, నిజమైన సంతోషం షాపులోగానీ, సీసాలోగానీ, మాత్రలోగానీ, సిరంజిలోగానీ బ్యాంకు అక్కౌంటులోగానీ దొరకదు. సంతోషం అమ్మబడదు; అది ఉచితంగా లభ్యమౌతుంది. అలాంటి అమూల్యమైన బహుమతి మనకెక్కడ దొరుకుతుంది? దాని గురించి మనం దీని తర్వాతి ఆర్టికల్‌లో చర్చిద్దాం.