కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వెలుగును ఎంపికచేసుకునే వారికి రక్షణ

వెలుగును ఎంపికచేసుకునే వారికి రక్షణ

వెలుగును ఎంపికచేసుకునే వారికి రక్షణ

“యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును?”​—కీర్తన 27:⁠1.

1. జీవాన్నిచ్చే ఏ ఏర్పాట్లను యెహోవా చేశాడు?

భూమిపైనున్న జీవరాశి మనుగడను సాధ్యం చేస్తున్న సూర్యరశ్మికి మూలం యెహోవాయే. (ఆదికాండము 1:​2, 14) సాతాను లోకపు మరణకరమైన చీకటిని పారద్రోలే ఆధ్యాత్మిక వెలుగుకు కూడా ఆయనే సృష్టికర్త. (యెషయా 60:2; 2 కొరింథీయులు 4:​5, 6; ఎఫెసీయులు 5:8-11; 6:​12) ఆ వెలుగును ఎంపిక చేసుకొనేవాళ్ళు కీర్తనకర్తతోపాటు ఇలా అనగలరు: “యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును?” (కీర్తన 27:1ఎ) అయితే యేసు కాలంలోలానే చీకటిని ఎంపిక చేసుకునేవాళ్ళు అప్రీతికరమైన తీర్పును ఎదురుచూడగలరు.​—⁠యోహాను 1:9-11; 3:19-21, 36.

2. ప్రాచీన కాలాల్లో, యెహోవా వెలుగును తిరస్కరించిన వారికీ, ఆయన మాట విన్నవారికీ ఏం జరిగింది?

2 యెషయా కాలంలో, యెహోవా నిబంధన ప్రజల్లో అనేకమంది వెలుగును తిరస్కరించారు. తత్ఫలితంగా, ఒక జనాంగంగా ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు నాశనమవ్వడాన్ని యెషయా చూశాడు. సా.శ.పూ. 607 లో యెరూషలేము, దాని ఆలయం నాశనం చేయబడ్డాయి; యూదా నివాసులు చెరలోనికి కొనిపోబడ్డారు. అయినప్పటికీ, యెహోవా మాట విన్నవాళ్ళు ఆ కాలంలో ఉన్న మతభ్రష్టత్వాన్ని నిరోధించేలా బలపర్చబడ్డారు. సా.శ.పూ. 607 విషయంలో, తన మాట విన్నవాళ్ళు రక్షించబడతారని యెహోవా వాగ్దానం చేశాడు. (యిర్మీయా 21:​8, 9) నేడు, వెలుగు ప్రేమికులమైన మనం ఆ కాలంలో జరిగిన దాన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.​—⁠ఎఫెసీయులు 5:⁠5.

వెలుగులో ఉన్నవారి సంతోషం

3. నేడు, మనమే నమ్మకాన్ని కల్గివుండొచ్చు, ఏ ‘నీతిగల జనమును’ మనం ప్రేమిస్తాం, ఆ “జనము” ఏ ‘బలమైన పట్టణాన్ని’ కల్గివుంది?

3 “బలమైన పట్టణమొకటి మనకున్నది. రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను [దేవుడు] నియమించియున్నాడు. సత్యము [“విశ్వాసము,” NW] నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి.” (యెషయా 26:1, 2) యెహోవా యందు నమ్మకముంచిన ప్రజల అత్యంతానందభరిత మాటలవే. యెషయా కాలంలోని విశ్వాసులైన యూదులు భద్రతకున్న ఏకైక నిజమైన మూలంగా యెహోవా వైపు చూశారేగానీ తమ తోటి దేశస్థుల అబద్ధ దేవతల వైపు చూడలేదు. నేడు మనకు కూడా అదే విధమైన నమ్మకముంది. అంతేగాక మనం యెహోవా దేవుని “నీతిగల జనము”ను అంటే “దేవుని ఇశ్రాయేలు”ను ప్రేమిస్తాం. (గలతీయులు 6:16; మత్తయి 21:​43, 44) దాని నమ్మకమైన ప్రవర్తననుబట్టి యెహోవా కూడా ఆ జనమును ప్రేమిస్తాడు. ఆయన ఆశీర్వాదంతో దేవుని ఇశ్రాయేలు ఒక ‘బలమైన పట్టణాన్ని’ అంటే మద్దతును, భద్రతను ఇచ్చే ఒక పట్టణాన్ని పోలిన సంస్థను కల్గివుంది.

4. మనం ఎటువంటి మానసిక దృక్కోణాన్ని అలవర్చుకోవడం మంచిది?

4 ‘ఎవనిమనస్సు యెహోవా మీద ఆనుకొనునో వానిని ఆయన పూర్ణశాంతిగలవానిగా కాపాడతాడు. ఏలయనగా అతడు ఆయన యందు విశ్వాసముంచి యున్నాడు’ అన్న విషయం ఆ ‘పట్టణం లోపల’ ఉన్న వారికి బాగా తెలుసు. తనయందు నమ్మకముంచి, తన నీతియుక్త సూత్రాలకు అనుగుణంగా జీవించేందుకు మనస్ఫూర్తిగా మ్రొగ్గు చూపించే వారికి యెహోవా మద్దతునిస్తాడు. అందుకే, యూదాలో ఉన్న విశ్వాసులు యెషయా చేసిన ఈ ఉద్బోధను లక్ష్యపెట్టారు: “యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.” (యెషయా 26:3, 4; కీర్తన 9:10; 37:3; సామెతలు 3:⁠5) ఆ మానసిక దృక్కోణాన్ని కల్గివున్న వాళ్ళు ఏకైక ఆశ్రయదుర్గంగా “యెహోవా”వైపు చూస్తారు. వాళ్ళు దేవునితో “పూర్ణశాంతి”ని అనుభవిస్తారు.​—⁠ఫిలిప్పీయులు 1:2; 4:6, 7.

దేవుని శత్రువులకు అవమానం

5, 6. (ఎ) ప్రాచీన బబులోను ఎలా అవమానపర్చబడింది? (బి) ‘మహా బబులోను’ ఏ విధంగా అవమానపర్చబడింది?

5 యెహోవా యందు నమ్మకముంచే వాళ్ళు శ్రమను అనుభవిస్తే అప్పుడేమిటి? వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. కొంతకాలంపాటు యెహోవా అలాంటి శ్రమలను అనుమతిస్తాడుగానీ చివరికి ఆయన ఉపశమనాన్ని తెస్తాడు, శ్రమలకు కారణమయ్యేవాళ్ళు ఆయన తీర్పు పొందుతారు. (2 థెస్సలొనీకయులు 1:4-8; 2 తిమోతి 1:8-10) ఒకానొక “ఎత్తయిన దుర్గము” విషయాన్ని ఆలోచించండి. యెషయా ఇలా అంటున్నాడు: “[యెహోవా] ఉన్నతస్థల నివాసులను ఎత్తయన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను. ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు. కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కుచున్నవి.” (యెషయా 26:5, 6) ఇక్కడ ప్రస్తావించబడిన ఆ ఎత్తయిన దుర్గము బహుశా బబులోను అయివుండవచ్చు. ఆ పట్టణం దేవుని ప్రజలను బాధపెట్టింది. అయితే బబులోనుకు ఏం సంభవించింది? సా.శ.పూ. 539 లో మాదీయులు పారసీకుల చేతిలో అది కుప్పకూలిపోయింది. ఎంతటి దుర్గతి పట్టిందో కదా!

6 మన కాలంలో యెషయా ప్రవచనాత్మక మాటలు, 1919 నుంచీ ‘మహా బబులోనుకు’ సంభవించిన దానిని చక్కగా వర్ణిస్తున్నాయి. యెహోవా ప్రజల్ని వారి ఆధ్యాత్మిక చెరనుండి విడుదల చేసేలా 1919 లో బలవంతపెట్టబడినప్పుడు, ఆ ఎత్తయిన దుర్గము అవమానకరమైన పతనాన్ని అనుభవించింది. (ప్రకటన 14:8) ఆ తర్వాత దానికి మరింత అవమానకరమైన విషయం జరిగింది. క్రైస్తవుల ఈ చిన్నగుంపు, గతంలో తమను చెరపట్టిన దానిని అణగ ద్రొక్కేందుకు పూనుకుంది. ప్రకటన 8:​7-12 వచనాల్లోని నలుగురు దేవదూతల బూరధ్వనుల సందేశాలనూ, ప్రకటన 9:​1–11:⁠15 వచనాల్లో ప్రవచించబడిన మూడు శ్రమల సందేశాలనూ బహిరంగపరుస్తూ, రానైవున్న క్రైస్తవమత సామ్రాజ్య అంతాన్ని గురించి ప్రకటించడం మొదలు పెట్టారు.

“నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును”

7. యెహోవా వెలుగు వైపుకి తిరిగే వాళ్ళు ఏ నిర్దేశాన్ని పొందుతారు, వాళ్ళు ఎవరిపై తమ నిరీక్షణ ఉంచుతారు, దేన్ని ప్రియమైందిగా అంటిపెట్టుకుంటారు?

7 యెహోవా తన వెలుగు వైపుకి తిరిగే వారికి రక్షణను దయచేస్తాడు, యెషయా తర్వాతి మాటలు చూపిస్తున్నట్టుగా వారి మార్గాన్ని ఆయన నిర్దేశిస్తాడు: “నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరళముచేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది.” (యెషయా 26:​7, 8) యెహోవా నీతిమంతుడైన దేవుడు, ఆయనను ఆరాధించేవాళ్ళు ఆయన నీతియుక్త ప్రమాణాలను ఆచరించాలి. వాళ్ళు వాటిని ఆచరించినప్పుడు, యెహోవా వారికి నడిపింపునిచ్చి, వారి త్రోవను సరాళం చేస్తాడు. ఆయన నిర్దేశాన్ని లక్ష్యపెట్టడం ద్వారా, ఈ దీనహృదయులు తాము యెహోవా యందు నిరీక్షణ ఉంచివున్నామనీ, ఆయన నామాన్ని​—⁠అదే ఆయన జ్ఞాపకార్థ నామాన్ని పూర్ణ హృదయంతో ప్రియమైందిగా అంటిపెట్టుకొని ఉన్నామనీ చూపిస్తారు.​—⁠నిర్గమకాండము 3:⁠15.

8. యెషయా ఏ మాదిరికరమైన వైఖరిని చూపించాడు?

8 యెషయా యెహోవా నామాన్ని ప్రియమైందిగా అంటిపెట్టుకున్నాడు. అది ఆయన తర్వాతి మాటల్లో స్పష్టం అవుతుంది: “రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయంచుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.” (యెషయా 26:9) యెషయా ‘తన ప్రాణముతో’ అంటే తన పూర్ణ వ్యక్తిత్వంతో యెహోవాను ఆశించాడు. ప్రవక్త తన అంతరంగ భావాల్ని దేవునికి వ్యక్తపర్చి, ఆయన నడిపింపును కోరుతూ యెహోవాతో ప్రార్థనలో గడిపేందుకు రాత్రిపూట ప్రశాంత సమయాలను ఉపయోగించుకోవడాన్ని చిత్రీకరించుకోండి. ఎంత చక్కని మాదిరో కదా! అంతేగాక, యెహోవా తీర్పు కార్యాల నుంచి యెషయా నీతిని నేర్చుకున్నాడు. ఆ విధంగా, యెహోవా చిత్తాన్ని వివేచించేందుకు మెలకువగా అప్రమత్తంగా ఉంటూ ఉండాల్సిన అవసరముందని ఆయన మనకు గుర్తుచేస్తున్నాడు.

కొందరు చీకటిని ఎంచుకుంటారు

9, 10. తన అవిశ్వాస జనాంగం విషయంలో యెహోవా ఏ దయాపూర్వక కార్యాల్ని చేశాడు, అయితే వారెలా ప్రతిస్పందించారు?

9 యెహోవా యూదాపట్ల గొప్ప ప్రేమపూర్వక దయను చూపించాడుగానీ విచారకరంగా అందరూ ప్రతిస్పందించలేదు. తరచూ, యెహోవా సత్యపు వెలుగును ఎంపికచేసుకోవడానికి బదులు అనేకమంది తిరుగుబాటునూ మతభ్రష్టత్వాన్నీ ఎంపికచేసుకున్నారు. యెషయా ఇలా అన్నాడు: “దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.”​—⁠యెషయా 26:​10.

10 యెషయా కాలంలో అంటే యెహోవా యూదా దేశాన్ని దాని శత్రువుల బారినుంచి కాపాడినప్పుడు అనేకమంది దాన్ని గుర్తించడానికి తిరస్కరించారు. ఆయన తన శాంతిని అనుగ్రహించి వారిని ఆశీర్వదించినప్పుడు ఆ జనాంగం కృతజ్ఞతను చూపించలేదు. ఆ కారణాన్నిబట్టి, ‘వేరు ప్రభువుల’ సేవచేసేలా వారిని యెహోవా విడిచిపెట్టాడు, చివరకు సా.శ.పూ. 607 లో యూదులు బబులోను చెరకు కొనిపోబడేలా అనుమతించాడు. (యెషయా 26:11-13) అయినప్పటికీ, తుదకు వారిలో శేషం మాత్రమే సరిదిద్దబడి, తమ స్వదేశానికి తిరిగి వచ్చింది.

11, 12. (ఎ) యూదా శత్రువులు ఏ భవిష్యత్తును పొందారు? (బి) యెహోవా అభిషిక్త సేవకుల మునుపటి శత్రువు 1919 లో ఏ భవిష్యత్తును పొందింది?

11 యూదాను చెరపట్టినవారి సంగతేంటి? యెషయా ప్రవచనాత్మకంగా ఇలా జవాబిస్తున్నాడు: “చచ్చినవారు మరల బ్రదుకరు ప్రేతలు [“మరణమందు జవసత్వాన్ని కోల్పోయినవారు,” NW] మరలలేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి వారికను స్మరణకు రాకుండ నీవు వారిని తుడిచి వేసితివి.” (యెషయా 26:​14) అవును, బబులోను సా.శ.పూ. 539 లో కుప్పకూలిపోయిన తర్వాత దానికి భవిష్యత్తనేదే లేకుండా పోయింది. కొంతకాలానికి, ఆ పట్టణం ఉనికిలో లేకుండా పోతుంది. అది ‘పీనుగు’ అవుతుంది, దాని మహా సామ్రాజ్యం చరిత్ర పుస్తకాలకు పరిమితమైపోతుంది. ఈ లోకపు శక్తిమంతులపై ఆశలు పెట్టుకున్న వారికది ఎంత గట్టి హెచ్చరిక!

12 భూమ్మీద ఉన్న తన సేవకులు 1918 లో ఆధ్యాత్మిక చెరలోకి వెళ్ళడానికి దేవుడు అనుమతించి, ఆ తర్వాత 1919 లో వారిని విడిపించినప్పుడు ఆ ప్రవచనంలోని మాటలు నెరవేరాయి. అప్పటి నుంచీ, వారి మునుపటి శత్రువు యొక్క భవిష్యత్తు ముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్య భవిష్యత్తు అంధకారమయమైంది. అయితే యెహోవా ప్రజల కోసం దాచబడిన ఆశీర్వాదాలు ఎన్నెన్నో.

“నీవు జనమును వృద్ధిచేసితివి”

13, 14. యెహోవా అభిషిక్త సేవకులు 1919 నుంచీ ఏ గొప్ప ఆశీర్వాదాలను అనుభవించారు?

13 దేవుడు తన అభిషిక్త సేవకులు చూపించిన పశ్చాత్తాప స్ఫూర్తిని 1919 లో ఆశీర్వదించి, వారికి అభివృద్ధిని అనుగ్రహించాడు. మొదట దేవుని ఇశ్రాయేలులోని చివరి సభ్యులను సమకూర్చడంపై అవధానాన్ని నిలపడం జరిగింది, అటు తర్వాత “వేరేగొర్రెల”కు చెందిన “గొప్పసమూహము”ను సమకూర్చేందుకు అవధానం ఇవ్వబడింది. (యోహాను 10:​16; ప్రకటన 7:9) యెషయా ప్రవచనంలో ఆ ఆశీర్వాదాలు ఇలా ప్రవచించబడ్డాయి: “యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును వృద్ధిచేసితివి. దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారిమీద పడినందున వాళ్ళు విశేషముగా దీనప్రార్థనలు చేసిరి.”​—⁠యెషయా 26:​15, 16.

14 నేడు, దేవుని ఇశ్రాయేలు సరిహద్దులు భూవ్యాప్తంగా విస్తరించాయి, ఇప్పుడు దాదాపు అరవై లక్షలకు చేరుకుంటున్న గొప్పసమూహం సువార్త ప్రకటనాపనిలో ఆసక్తితో భాగంవహిస్తోంది. (మత్తయి 24:14) అది యెహోవా నుంచి వచ్చిన ఎంతటి గొప్ప ఆశీర్వాదమో కదా! అది ఆయన నామానికి ఎంత మహిమను తెస్తుందో కదా! నేడు 235 దేశాల్లో ఆ నామం ప్రకటించబడుతోంది​—⁠అది ఆయన వాగ్దానాన్ని గురించిన ఒక అద్భుతమైన నెరవేర్పు.

15. ఏ సూచనార్థక పునరుత్థానం 1919 లో జరిగింది?

15 బబులోను చెరలోనుంచి తప్పించుకోవడానికి యూదాకు యెహోవా సహాయం అవసరమైంది. వాళ్ళు తమంతట తాము చెరనుంచి విడుదలై ఉండేవాళ్ళు కారు. (యెషయా 26:17, 18) అదేవిధంగా, 1919 లో దేవుని ఇశ్రాయేలు విడుదల యెహోవా మద్దతుకి రుజువుగా ఉంది. ఆయన సహాయంలేకుండా అది జరిగి ఉండేది కాదు. వాళ్ళున్న పరిస్థితిలో వచ్చిన మార్పు ఎంత అద్భుతంగా ఉందంటే, యెషయా దాన్ని పునరుత్థానంతో పోలుస్తున్నాడు: “మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు. భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును [“భూమి మరణమందు జవసత్వాలను కోల్పోయినవారిని కూడా కంటుంది,” NW].” (యెషయా 26:19; ప్రకటన 11:​7-11) అవును, మరణమందు జవసత్వాలను కోల్పోయినవారు పునరుత్తేజిత క్రియాశీలత కోసం అలంకారిక భావంలో మరలా జన్మిస్తారు!

అపాయకరమైన కాలాల్లో కాపుదల

16, 17. (ఎ) సా.శ.పూ. 539 లో బబులోను నాశనం నుంచి రక్షించబడేందుకు యూదులు ఏం చేయవలసి వచ్చింది? (బి) బహుశా నేడు ‘అంతఃపురాలు’ ఏమైవున్నాయి, అవి మనకెలా ప్రయోజనకరమౌతాయి?

16 యెహోవా సేవకులకు ఎల్లప్పుడూ ఆయన కాపుదల అవసరం. త్వరలోనే ఆయన చివరిసారిగా తన చేతిని సాతాను లోకానికి విరుద్ధంగా చాపబోతున్నప్పటికీ, ఇంతకుముందు ఎన్నడూ అవసరంకాని విధానంలో ఆయన సహాయం ఆయన ఆరాధకులకు అవసరమౌతుంది. (1 యోహాను 5:​19) అపాయకరమైన ఆ కాలం గురించి, యెహోవా మనల్నిలా హెచ్చరిస్తున్నాడు: “నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చుచున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్ళి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.” (యెషయా 26:20, 21; జెఫన్యా 1:​14) ఆ హెచ్చరిక, సా.శ.పూ. 539 లో జరిగిన బబులోను నాశనం నుంచి ఎలా తప్పించుకోవాలో యూదులకు చూపించింది. దాన్ని లక్ష్యపెట్టినవాళ్ళు, తమ ఇళ్ళల్లోనే దాగివుండి, వీధుల్లో స్వైరవిహారం చేస్తున్న సైనికుల చేతుల్లో నుంచి తప్పించుకుని ఉంటారు.

17 నేడు, ఆ ప్రవచనంలోని ‘అంతఃపురములు,’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజల వేలాది సంఘాలకు చిత్రీకరణగా ఉన్నాయి. అలాంటి సంఘాలు ఇప్పుడు కూడా ఒక కాపుదలగా ఉన్నాయి; అక్కడ క్రైస్తవులు పెద్దల ప్రేమపూర్వక శ్రద్ధ క్రింద, తమ సహోదరుల మధ్య సురక్షితంగా ఉన్నట్టు కనుగొంటారు. (యెషయా 32:1, 2; హెబ్రీయులు 10:​24, 25) అది, ఈ విధానాంతం సమీపిస్తున్న ఈ సమయంలో విశేషంగా వాస్తవమైవుంది ఎందుకంటే ఈ విధానాంతంలో రక్షణ విధేయతపై ఆధారపడి ఉంటుంది.​—⁠జెఫన్యా 2:⁠3.

18. యెహోవా త్వరలోనే “సముద్రముమీదనున్న మకరమును” ఎలా చంపుతాడు?

18 ఆ సమయాన్ని గురించి యెషయా ఇలా ప్రవచిస్తున్నాడు: “ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును.” (యెషయా 27:⁠1) ఆధునికకాల “మకరము” ఏమైవుంది? అది, “ఆది సర్పమైన” సాతానే అంటే దేవుని ఇశ్రాయేలుకు విరుద్ధంగా యుద్ధం చేయడానికి వాడు ఉపయోగిస్తున్న దుష్ట విధానంతోపాటు వాడిని సూచిస్తున్నట్టు కనబడుతోంది. (ప్రకటన 12:9, 10, 17; 13:​14, 16, 17) ఆ మకరం 1919 లో దేవుని ప్రజలపై తన పట్టును కోల్పోయింది. కొంతకాలానికి, అది పూర్తిగా కనుమరుగైపోతుంది. (ప్రకటన 19:19-21; 20:1-3, 10) కాబట్టి, “సముద్రముమీదనున్న మకరమును” యెహోవా చంపుతాడు. ఈలోగా యెహోవా ప్రజలకు విరుద్ధంగా ఆ మకరం చేసే ఏ ప్రయత్నమైనా సరే దానికి శాశ్వత విజయాన్ని చేకూర్చదు. (యెషయా 54:​17) ఆ హామీ ఎంత ఓదార్పునిచ్చేదిగా ఉందో కదా!

“నురుగులతో ఉన్న ద్రాక్షమద్యంగల ద్రాక్షవనము”

19. నేడు శేషం పరిస్థితి ఏమిటి?

19 యెహోవా నుంచి వచ్చిన ఆ వెలుగంతటినిబట్టి ఆనందించడానికి మనకు తగినన్ని కారణాలు లేవంటారా? నిశ్చయంగా ఉన్నాయి! “ఆ దినమున మనోహరమగు [“నురుగులతో ఉన్న ద్రాక్షమద్యం గల,” NW] ఒక ద్రాక్షవనముండును దానిగూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను” అని రాస్తూ యెషయా యెహోవా ప్రజల ఆనందాన్ని ఎంతో రమ్యంగా వర్ణిస్తున్నాడు. (యెషయా 27:​2, 3) యెహోవా తన “ద్రాక్షవనము”ను అంటే శేషించబడిన దేవుని ఇశ్రాయేలునూ, కష్టించి పనిచేస్తున్న వారి సహవాసులనూ సంరక్షించాడు. (యోహాను 15:​1-8) కాబట్టే, వాళ్ళు తన నామానికి మహిమను తెచ్చే, భూమిపై ఉన్న తన సేవకుల్లో గొప్ప ఆనందానికి కారణమయ్యే ఫలాల్ని ఫలించారు.

20. క్రైస్తవ సంఘాన్ని యెహోవా ఎలా కాపాడతాడు?

20 మొదట్లో యెహోవాకు తన అభిషిక్త సేవకులపై వచ్చిన క్రోధాన్నిబట్టే ఆయన 1918 లో ఆధ్యాత్మిక చెరలోనికి వారు కొనిపోబడడానికి అనుమతించాడు, ఆ క్రోధం తగ్గిపోవడాన్ని చూసి మనం పులకరించిపోవచ్చు. యెహోవాయే స్వయంగా ఇలా అంటున్నాడు: “నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధానపడవలెను.” (యెషయా 27:​4, 5) తన ద్రాక్షవనం సమృద్ధికరమైన ‘నురుగలతో ఉన్న ద్రాక్ష మద్యాన్ని’ ఉత్పన్నం చేసేలా నిశ్చయపర్చుకునేందుకు, వాటిని పాడుచేయగల్గే బలురక్కసి చెట్లను యెహోవా తీసివేసి కాల్చివేస్తాడు. కాబట్టి, క్రైస్తవ సంఘ సంక్షేమాన్ని ఎవ్వరూ పాడుచేయలేరు! ఆయన అంగీకారాన్నీ, కాపుదలనూ అర్థిస్తూ అందరూ ‘యెహోవాను ఆశ్రయించుదురుగాక’! అలా చేయడం ద్వారా, మనం దేవునితో సమాధానపడతాం​—⁠అదంత ప్రాముఖ్యమైంది గనుకనే యెషయా దాన్ని రెండుసార్లు ప్రస్తావించాడు.​—⁠కీర్తన 85:1, 2, 8; రోమీయులు 5:⁠1.

21. ఫలభరితమైన భూమి ఏ విధంగా ‘ఫలభరితమైన’ వాటితో నింపబడింది?

21 ఆ ఆశీర్వాదాలు ఇంకా ఇలా కొనసాగుతున్నాయి: “రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.” (యెషయా 27:⁠6) 1919 నుంచీ ఈ వచనం నెరవేరుతూ, యెహోవా శక్తిని గురించి అద్భుతమైన రుజువును ఇస్తోంది. అభిషిక్త క్రైస్తవులు భూమిని “ఫలభరిత”మైన వాటితో అంటే పౌష్ఠికమైన ఆధ్యాత్మికాహారంతో నింపేశారు. అవినీతితో నిండిన లోకంలో వాళ్ళు, దేవుని ఉన్నత ప్రమాణాలను ఆనందంతో కాపాడతారు. యెహోవా వారిని అభివృద్ధి పథంలో పయనించేలా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. తత్ఫలితంగా, వారి సహవాసులైన లక్షలాదిమంది వేరే గొఱ్ఱెలు “రాత్రింబగళ్ళు . . . [దేవునిని] సేవించుచున్నారు.” (ప్రకటన 7:​15) “ఫలభరిత”మైన వాటిలో భాగం వహించే, వాటిని ఇతరులతో పంచుకునే గొప్ప ఆధిక్యతను మనమెన్నటికీ విస్మరించకూడదు!

22. వెలుగును అంగీకరించేవారికి ఏ యే ఆశీర్వాదాలు వస్తాయి?

22 ఈ క్లిష్ట కాలాల్లో అంటే భూమిని చీకటి కమ్ముకుంటున్న, జనాంగాలను కటిక చీకటి కమ్ముకుంటున్న ఈ కాలాల్లో యెహోవా తన ప్రజలపై ఆధ్యాత్మిక వెలుగును ప్రసరింపచేస్తున్నందుకు మనం కృతజ్ఞులం కామా? (యెషయా 60:2; రోమీయులు 2:19; 13:​12) దాన్ని అంగీకరించే వారందరికీ అలాంటి వెలుగంటే ఇప్పుడు సమాధానకరమైన మనస్సనీ ఆనందమనీ, భవిష్యత్తులో నిత్యజీవమనీ భావం. కాబట్టి, సకారణంగానే వెలుగు ప్రేమికులమైన మనం యెహోవాను స్తుతించడంలో మన హృదయాలను పురికొల్పుదాం, కీర్తనకర్తతోపాటు ఇలా అందాం: “యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? . . . యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము; ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.”​—⁠కీర్తన 27:1బి, 14.

మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటారా

• యెహోవా ప్రజలను అణచివేసేవారికి ఉన్న భవిష్యత్తు ఏమిటి?

• యెషయా గ్రంథంలో ఏ అభివృద్ధి ప్రవచించబడింది?

• ఏ ‘అంతఃపురాల్లో’ మనం దాక్కొని ఉండాలి, ఎందుకు?

• యెహోవా ప్రజల పరిస్థితి ఆయనకు స్తుతిని ఎందుకు తీసుకువస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[22వ పేజీలోని బాక్సు]

క్రొత్త ప్రచురణ

ఈ రెండు అధ్యయన ఆర్టికల్స్‌లో చర్చించబడిన సమాచారంలో అధికభాగం, 2000/2001 కోసమైన జిల్లా సమావేశమందు ఇవ్వబడిన ఒక ప్రసంగంలో చర్చించడం జరిగింది. ఆ ప్రసంగం చివర్లో, యెషయా ప్రవచనం​—⁠సర్వమానవాళి కోసమైన వెలుగు I (ఆంగ్లం) అనే ఒక క్రొత్త ప్రచురణను విడుదల చేయడం జరిగింది. 416 పేజీలుగల ఈ పుస్తకంలో యెషయా గ్రంథంలోని మొదటి 40 అధ్యాయాలలో ఉన్న వచనాలన్నింటినీ ఒక వచనం తర్వాత మరొక వచనంగా చర్చించడం జరిగింది.

[18వ పేజీలోని చిత్రం]

యెహోవా దేవుని ‘బలమైన పట్టణము’లోనికి అంటే ఆయన సంస్థలోనికి నీతిమంతులు మాత్రమే అనుమతించబడతారు

[19వ పేజీలోని చిత్రం]

యెషయా యెహోవాను ‘రాత్రివేళ’ వెదికాడు

[21వ పేజీలోని చిత్రం]

యెహోవా తన ‘ద్రాక్షవనమును’ కాపాడి, దాన్ని ఫలభరితం చేస్తున్నాడు