కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వెలుగులో నడిచేవారికి ఆనందం

వెలుగులో నడిచేవారికి ఆనందం

వెలుగులో నడిచేవారికి ఆనందం

“రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.”​—యెషయా 2:⁠5.

1, 2. (ఎ) వెలుగు ఎంత ప్రాముఖ్యమైంది? (బి) చీకటి భూమిని కమ్ముకుంటుందన్న హెచ్చరిక ఎందుకంత ప్రాముఖ్యమైంది?

యెహోవా వెలుగుకు మూలాధారం. ఆయన్ని “పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడు” అని బైబిలు పిలుస్తోంది. (యిర్మీయా 31:35; కీర్తన 8:3) మన సూర్య గ్రహాన్ని సృష్టించింది ఆయనే. అది, శూన్యంలోకి అపారమైన శక్తిని విడుదలచేస్తున్న ఒక న్యూక్లియర్‌ కొలిమి. ఆ శక్తిలో కొంత వెలుతురు, వేడి రూపాల్లో విడుదలవుతుంది. ఆ శక్తిలో అత్యంత తక్కువ శాతం సూర్యరశ్మి రూపంలో ఈ భూమిపైకి చేరుతోంది. అదే భూమ్మీదున్న జీవరాశిని పోషిస్తోంది. సూర్యరశ్మి లేకుండా మనం మనుగడ సాగించలేం. ఈ భూమి నిర్జీవ గ్రహమైపోతుంది.

2 దానిని మనస్సులో ఉంచుకొంటే, యెషయా ప్రవక్త వర్ణించిన ఒక పరిస్థితికున్న ప్రాముఖ్యతను మనం అర్థంచేసుకోగల్గుతాం. ఆయన ఇలా తెలియజేశాడు: “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటికచీకటి జనములను కమ్ముచున్నది.” (యెషయా 60:⁠2) నిజమే, అది భౌతిక భావంలో చీకటిని సూచించడం లేదు. ఒకనాటికి సూర్యచంద్ర నక్షత్రాలు ప్రకాశించడం మానేస్తాయని యెషయా ఉద్దేశం కాదు. (కీర్తన 89:36, 37; 136:​7-9) దానికి భిన్నంగా ఆయన ఆధ్యాత్మిక చీకటి గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆధ్యాత్మిక చీకటి ప్రాణాంతకమైంది. భౌతిక వెలుగు లేకుండా మనమెలా జీవించలేమో అలాగే కాలం గడుస్తుండగా ఆధ్యాత్మిక వెలుగు లేకుండా కూడా మనం జీవించలేం.​—⁠లూకా 1:79.

3. యెషయా మాటల దృష్ట్యా, క్రైస్తవులు ఏం చేయాలి?

3 దాని దృష్ట్యా చూస్తే, యెషయా మాటలు ప్రాచీన కాలంనాటి యూదా విషయంలో నెరవేరినప్పటికీ నేడు మనకాలంలో గొప్ప నెరవేర్పును కల్గివున్నాయని గమనించడం గంభీరమైన విషయం. అవును, మన కాలంలో ఆధ్యాత్మిక చీకటి లోకాన్ని కమ్ముకొంది. అలాంటి అపాయకరమైన పరిస్థితిలో, ఆధ్యాత్మిక వెలుగు అత్యంత ప్రాముఖ్యమైంది. అందుకే క్రైస్తవులు, “మనుష్యు[ల] . . . యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” అన్న యేసు ఉద్బోధనను లక్ష్యపెట్టాలి. (మత్తయి 5:​16) విశ్వాసులైన క్రైస్తవులు దీనహృదయులైన వారికోసం చీకట్లో వెలుగును ప్రకాశింపచేసి, ఆ విధంగా జీవాన్ని పొందే అవకాశాన్ని వారికి ఇవ్వవచ్చు.​—⁠యోహాను 8:⁠12.

ఇశ్రాయేలులో చీకటి కాలాలు

4. యెషయా ప్రవచనాత్మక మాటల మొదటి నెరవేర్పు ఎప్పుడు జరిగింది, అయితే ఆయన జీవించిన కాలంలో ఎటువంటి పరిస్థితి ఉంది?

4 భూమిని కమ్ముకున్న చీకటిని గురించి యెషయా తెలియజేసిన మాటలు, యూదా దేశం పాడుబడి, దాని ప్రజలు బబులోనుకు చెరగా కొనిపోబడినప్పుడు నెరవేరాయి. అయినప్పటికీ, అంతకు ముందు కూడా అంటే యెషయా జీవించిన కాలంలోనే ఆ జనాంగంలో అధికభాగం ఆధ్యాత్మిక చీకట్లో కూరుకుపోయిందన్న వాస్తవం తన స్వదేశీయుల్ని ఇలా ప్రేరేపించడానికి ఆయన్ని కదిలించింది: “యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము”!​—⁠యెషయా 2:5; 5:20.

5, 6. యెషయా కాలంలో చీకటికి ఏ యే కారకాలు దోహదపడ్డాయి?

5 “ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో” యెషయా యూదాలో ప్రవచించాడు. (యెషయా 1:1) అది రాజకీయ అలజడి, మత వేషధారణ, న్యాయసంబంధమైన భ్రష్టత్వం, నిరుపేదల అణచివేత వంటివి రాజ్యమేలుతున్న కల్లోలభరితమైన కాలం. యోతాము వంటి నమ్మకమైన రాజుల పరిపాలనా కాలంలో సహితం అనేక పర్వతశిఖరాలపై అబద్ధదేవతల బలిపీఠాలు ఉండేవి. అవిశ్వాసులైన రాజుల పాలనలో పరిస్థితి మరింత దుర్భరంగా ఉండేది. ఉదాహరణకు, దుష్ట రాజైన ఆహాజు తన సంతానాన్ని మొలెకు దేవతకు ఆచారబద్ధమైన బలిగా అర్పించాడు. అది నిజంగా కటిక చీకటి కమ్ముకున్న కాలమే!​—⁠2 రాజులు 15:32-34; 16:2-4.

6 అంతర్జాతీయ పరిస్థితి కూడా అంధకారమయంగానే ఉంది. మోయాబు, ఎదోము, ఫిలిష్తీయ రాజ్యాలు భీతిగొల్పేట్టుగా యూదా సరిహద్దుల్లో మొహరించాయి. ఉత్తరానవున్న ఇశ్రాయేలు రాజ్యం రక్తసంబంధ రాజ్యమైనప్పటికీ అదిప్పుడు యూదాకు ప్రక్కలో బల్లెమై కూర్చుని ఉంది. ఉత్తరాన మరింత దూరంలో ఉన్న సిరియా దేశం యూదా శాంతికి ముప్పువాటిల్లజేసింది. తన అధికార పరిధిని విస్తరింప చేసుకునే అవకాశాల కోసం ఎదురుచూసే క్రూరమైన అష్షూరు మరింత ప్రమాదకారిగా తయారైంది. యెషయా ప్రవచిస్తున్న కాలంలో, అష్షూరు ఇశ్రాయేలును పూర్తిగా జయించి యూదాను దాదాపు నాశనం చేసేంత వరకూ వెళ్ళింది. ఒక సమయంలోనైతే, అష్షూరు యెరూషలేమును తప్ప యూదా రాజ్యంలోని దాదాపు ప్రతి పట్టణాన్నీ తన చేజిక్కించుకుంది.​—⁠యెషయా 1:7, 8; 36:⁠1.

7. ఇశ్రాయేలు యూదాలు ఏ మార్గాన్ని ఎంపికచేసుకున్నాయి, దానికి యెహోవా ఎలా ప్రతిస్పందించాడు?

7 దేవుని నిబంధన ప్రజలైన ఇశ్రాయేలు, యూదాలు యెహోవాపట్ల నమ్మకంగా ఉండనందున అంతటి ఘోరమైన విపత్తులను అనుభవించారు. సామెతల గ్రంథంలో ప్రస్తావించబడిన వ్యక్తుల్లా ‘వారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టారు.’ (సామెతలు 2:⁠13) అయితే, యెహోవా తన ప్రజలపై కోపించినప్పటికీ, ఆయన వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. బదులుగా, ఆ జనాంగంలో విశ్వసనీయంగా యెహోవా సేవచేయాలని కోరుకునేవారు ఎవరైనా ఉంటే వారికి ఆధ్యాత్మిక వెలుగును ఇవ్వటానికి యెహోవా యెషయాను, మరితర ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. ఆ ప్రవక్తల ద్వారా అందించబడిన వెలుగు నిశ్చయంగా అమూల్యమైనది. అది జీవాన్నిచ్చే వెలుగు.

నేటి చీకటికాలాలు

8, 9. నేడు లోకం చీకట్లో ఉండడానికి ఏ కారకాలు దోహదపడుతున్నాయి?

8 యెషయా కాలంలో ఉన్న పరిస్థితిని పోలిన పరిస్థితులే నేడు కూడా ఉన్నాయి. మన కాలంలో మానవ నాయకులు యెహోవానూ, సింహాసనాసీనుడైన ఆయన రాజగు యేసుక్రీస్తునూ తిరస్కరించారు. (కీర్తన 2:​2, 3) క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు తమ మందలను మోసగించారు. అలాంటి నాయకులు తాము దేవుని సేవచేస్తున్నామని చెప్పుకుంటారుగానీ నిజానికి వారిలో అనేకమంది అబద్ధ మత సిద్ధాంతాలను బోధించడంతోపాటు ఈ లోకపు దేవుళ్ళను అంటే జాతీయవాదం, సైనికవాదం, సంపద, ప్రముఖ వ్యక్తులు వంటివాటిని జనాదరణ పొందేటట్టు చేస్తారు.

9 ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతంలో, జాతి ప్రక్షాళననూ మరితర భీకర సంఘటనలనూ సూచించే యుద్ధాల్లోనూ అంతర్గత పోరాటాల్లోనూ క్రైస్తవమత సామ్రాజ్య మతాల ప్రమేయం ఉంది. బైబిలు ఆధారిత నైతికత విషయంలో ఒక స్థానాన్ని తీసుకోవడానికి బదులు అనేక చర్చీలు వ్యభిచారం, సలింగ సంయోగం వంటి అనైతిక విషయాలను చూసీచూడనట్టు ఊరుకుంటున్నాయి, లేక వాటికి చురుకుగా మద్దతునిస్తున్నాయి. బైబిలు ప్రమాణాలను అలా తిరస్కరించడం మూలంగా క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన సభ్యులు, “జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు” అని ప్రాచీన కీర్తనకర్త చెప్పిన వ్యక్తులను పోలి ఉన్నారు. (కీర్తన 82:⁠5) నిజమే, ప్రాచీన యూదావలే క్రైస్తవమత సామ్రాజ్యం కటిక చీకట్లో ఉంది.​—⁠ప్రకటన 8:⁠12.

10. నేడు చీకటిలో వెలుగు ఎలా ప్రకాశిస్తోంది, దానినుండి దీనహృదయులు ఎలా ప్రయోజనం పొందుతారు?

10 అటువంటి చీకటిలో, దీనహృదయుల కోసం యెహోవా వెలుగును ప్రకాశింప చేస్తున్నాడు. దాని కోసం ఆయన తన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ తరగతిని అంటే భూమిపైనున్న తన అభిషిక్త సేవకులను ఉపయోగించుకుంటున్నాడు. వారు “లోకమందు జ్యోతులవలె” ప్రకాశిస్తున్నారు. (మత్తయి 24:​45; ఫిలిప్పీయులు 2:​14-16) లక్షలాదిమంది “వేరే గొఱ్ఱెల” మద్దతుతో ఆ దాసుని తరగతి దేవుని వాక్యమైన బైబిలు ఆధారంగా ఆధ్యాత్మిక వెలుగును ప్రసరింపజేస్తుంది. (యోహాను 10:​16) కటిక చీకటిగల ఈ లోకంలో, ఆ వెలుగు దీనహృదయులకు నిరీక్షణనిస్తుంది, దేవునితో సంబంధం ఏర్పరచుకునేందుకు వాళ్ళకు సహాయం చేస్తుంది, ఆధ్యాత్మిక ప్రమాదాలను తప్పించుకునేందుకు వారికి తోడ్పడుతుంది. అది అమూల్యమైంది, జీవాన్ని అనుగ్రహించేది.

“నీ నామమును స్తుతించెదను”

11. యెషయా కాలంలో యెహోవా ఎటువంటి సమాచారాన్ని అందుబాటులో ఉంచాడు?

11 యెషయా జీవించిన కాలంలో ఉన్న చీకటి దినాల్లోనూ, అటు తర్వాత బబులోనీయులు యెహోవా జనాంగాన్ని చెరకొనిపోయినప్పటి కటిక చీకటి దినాల్లోనూ యెహోవా ఎటువంటి నిర్దేశాన్నిచ్చాడు? నైతిక నిర్దేశాన్ని ఇవ్వడంతోపాటు, తన ప్రజలకు సంబంధించిన తన సంకల్పాలను తానెలా నెరవేర్చబోతాడో కూడా ముందుగానే స్పష్టంగా తెలియజేశాడు. ఉదాహరణకు, యెషయా 25 నుంచి 27 అధ్యాయాల్లో ఉన్న అద్భుతమైన ప్రవచనాల్ని పరిశీలించండి. ఆ అధ్యాయాల్లోని మాటలు, యెషయా కాలంలోని పరిస్థితులతో యెహోవా మునుపు ఎలా వ్యవహరించాడో, మన కాలంలోని పరిస్థితులతో ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నాడో మనకు చూపిస్తాయి.

12. యెషయా ఏ హృదయపూర్వక భావ ప్రకటనను చేశాడు?

12 మొదట, యెషయా ఇలా ప్రకటిస్తున్నాడు: “యెహోవా, నీవే నా దేవుడవు. నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించెదను.” ఎంతటి హృదయపూర్వకమైన స్తుతోగదా! అలాంటి ప్రార్థనను చేయడానికి ప్రవక్తను కదిలించిందేమిటి? దానికిగల ప్రముఖకారణం, అదే వచనంలోని రెండవ భాగంలో వెల్లడౌతుంది. అక్కడ మనమిలా చదువుతాం: “[యెహోవా] నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి.”​—⁠యెషయా 25:⁠1.

13. (ఎ) యెహోవాపట్ల యెషయాకున్న మెప్పుదలను ఏ జ్ఞానం బలపర్చింది? (బి) యెషయా మాదిరి నుంచి మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు?

13 యెషయా కాలంనాటికే ఇశ్రాయేలీయుల కోసం యెహోవా అనేక అద్భుత కార్యాలను చేశాడు, అవి గ్రంథస్థం చేయబడ్డాయి. వాటితో యెషయాకు పరిచయమున్నదన్న విషయం సుస్పష్టం. ఉదాహరణకు, ఐగుప్తులో దాస్యమందు మగ్గిపోతున్న తన ప్రజలను యెహోవా విడిపించుకొని తీసుకొచ్చాడనీ, ఎర్ర సముద్రం దగ్గర ఫరో సైనిక శక్తి ఉగ్రతనుంచి వారిని కాపాడాడనీ ఆయనకు తెలుసు. యెహోవా తన ప్రజలను అరణ్యంలో నడిపించాడనీ, వాళ్ళను వాగ్దాన దేశంలోకి తీసుకొచ్చాడనీ ఆయనకు తెలుసు. (కీర్తన 136:​1, 10-26) అలాంటి చారిత్రక వృత్తాంతాలు యెహోవా నమ్మకమైన వాడనీ, నమ్ముకొనదగిన దేవుడనీ చూపించాయి. ఆయన “ఆలోచనలు” అంటే ఆయన సంకల్పించినవన్నీ నెరవేరుతాయి. దైవికంగా అందించబడిన ఖచ్చితమైన జ్ఞానం, వెలుగులో నడుస్తూనే ఉండేలా యెషయాను బలపర్చింది. అందుకే, ఆయన మనకు ఒక చక్కని మాదిరిగా ఉన్నాడు. మనం దేవుని లిఖితపూర్వక వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ దాన్ని జీవితంలో అన్వయించుకుంటూవుంటే, మనం కూడా వెలుగులో నడుస్తూనే ఉండగల్గుతాం.​—⁠కీర్తన 119:105; 2 కొరింథీయులు 4:⁠5,6.

ఒక పట్టణం నాశనం చేయబడింది

14. ఒక పట్టణాన్ని గురించి ఏం ప్రవచించబడింది, అది ఏ పట్టణం?

14 దేవుని ఆలోచనలకొక ఉదాహరణ, యెషయా 25:2 లో ఉంది. అక్కడ మనమిలా చదువుతాం: “పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి, అది మరలా ఎన్నడును కట్టబడకుండ చేసితివి.” ఇది ఏ పట్టణం? యెషయా ప్రవచనార్థకంగా బబులోనును గురించి మాట్లాడుతుండవచ్చు. నిజానికి, కాలప్రవాహంలో బబులోను పట్టణం కేవలం రాళ్ళకుప్పగా మారిన సమయం కూడా వచ్చింది.

15. ఏ ‘మహాపట్టణము’ నేడు ఉనికిలో ఉంది, దానికి ఏమౌతుంది?

15 యెషయా ప్రస్తావించిన పట్టణానికి సారూప్యంగా నేడు ఏదైనా ఉందా? ఉంది. “భూరాజులనేలు . . . మహాపట్టణ”మును గురించి ప్రకటన గ్రంథం మాట్లాడుతోంది. (ప్రకటన 17:​18) ఆ మహాపట్టణమే, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను.” (ప్రకటన 17:5) నేడు, మహా బబులోనులోని ప్రముఖభాగం క్రైస్తవమత సామ్రాజ్యం. దాని మతనాయకులే ప్రాముఖ్యంగా యెహోవా ప్రజల రాజ్యప్రకటనా పనిని వ్యతిరేకించడంలో నాయకత్వం వహిస్తున్నారు. (మత్తయి 24:​14) అయితే ప్రాచీన బబులోనులానే మహాబబులోను కూడా త్వరలోనే నాశనం చేయబడుతుంది, అది ఇక మరెన్నడూ పైకిరాలేదు.

16, 17. ప్రాచీన కాలాల్లోనూ, ఆధునిక కాలాల్లోనూ యెహోవా శత్రువులు ఆయనను ఎలా మహిమపర్చారు?

16 ఆ ‘ప్రాకారముగల పట్టణాన్ని’ గురించి యెషయా ఇంకా ఏమి ప్రవచించాడు? యెహోవాను సంబోధిస్తూ యెషయా ఇలా చెబుతున్నాడు: “బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు, భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు.” (యెషయా 25:⁠3, 4) విరోధభావంగల ఆ “భీకరజనముల” పట్టణం యెహోవానెట్లు ఘనపరుస్తుంది? శక్తిమంతుడైన బబులోను రాజగు నెబుకద్నెజరుకు ఏం జరిగిందో జ్ఞప్తికి తెచ్చుకోండి. తన బలహీనతలను ఎత్తి చూపించే ఒక ఆలోచింపచేసే అనుభవాన్ని పొందిన తర్వాత, ఆయన యెహోవా దేవుని మహోన్నతత్వాన్నీ, సర్వశక్తినీ ఒప్పుకునేలా చేయబడ్డాడు. (దానియేలు 4:​34, 35) యెహోవా తన శక్తిని ప్రదర్శించినప్పుడు, ఆయన శక్తివంతమైన కార్యాలను అయిష్టంగానైనా సరే అంగీకరించేలా ఆయన శత్రువులు బలవంతపెట్టబడ్డారు.

17 యెహోవా శక్తివంతమైన కార్యాలను గుర్తించేలా మహాబబులోను ఎప్పుడైనా బలవంతపెట్టబడిందా? అవును. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, యెహోవా అభిషిక్త సేవకులు శ్రమలను అనుభవిస్తూ ప్రకటించారు. నడిపింపునిచ్చే వాచ్‌ టవర్‌ సొసైటీ ఆఫీసర్లు జైళ్ళలో వేయబడినప్పుడు 1918 లో వాళ్ళు ఆధ్యాత్మిక చెరలోనికి కొనిపోబడ్డారు. సంస్థీకరించబడిన ప్రకటనా పని దాదాపుగా నిలిచిపోయింది. అటు తర్వాత, 1919వ సంవత్సరంలో యెహోవా వారిని పునరుద్ధరించి, తన ఆత్మతో వారిని పునరుత్తేజితుల్ని చేశాడు, ఫలితంగా వాళ్ళు భూనివాసులందరికీ సువార్తను ప్రకటించాలనే నియామకాన్ని నెరవేర్చనారంభించారు. (మార్కు 13:​10) ఇదంతా ప్రకటన గ్రంథంలో ప్రవచించబడింది, దాంట్లో ఉన్నట్టుగానే వాళ్ళ శత్రువులపై దాని ప్రభావం ఉంది. ఆ శత్రువులు “భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.” (ప్రకటన 11:​3, 7, 11-13) వాళ్ళంతా మత మార్పిడి చేసుకోలేదుగానీ వాళ్ళు యెషయా ప్రవచించినట్టుగానే ఈ సందర్భంలో యెహోవా చేసిన శక్తివంతమైన కార్యాన్ని గుర్తించేలా బలవంతపెట్టబడ్డారు.

‘బీదలకు శరణ్యంగా ఉండడం’

18, 19. (ఎ) యెహోవా ప్రజల యథార్థతను విచ్ఛిన్నం చేయడంలో శత్రువులు ఎందుకు విఫలులయ్యారు? (బి) “బలాత్కారుల జయకీర్తన” ఎలా అణచివేయబడుతుంది?

18 వెలుగులో నడుచుకునే వారితో యెహోవా చేసిన దయాపూర్వక వ్యవహారాల వైపుకి తన అవధానాన్ని మళ్ళిస్తూ, యెషయా యెహోవాతో ఇలా అంటున్నాడు: “భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగులకుండ నీడగాను ఉంటివి. . . . ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.”​—⁠యెషయా 25:​3, 5.

19 సత్యారాధకుల యథార్థతను విచ్ఛిన్నం చేయడానికి నిరంకుశ పాలకులు 1919 నుంచి అన్ని విధాల ప్రయత్నించినప్పటికీ, వాళ్ళు విఫలులయ్యారు. ఎందుకు? ఎందుకంటే యెహోవా తన ప్రజలకు శరణ్యంగానూ, ఆశ్రయంగానూ ఉన్నాడు. హింసాగ్ని జ్వాలల వేడి తగలకుండా ఆయన వారికి చల్లని నీడనిస్తూ వ్యతిరేకత అనే గాలివాన తగలకుండా బలమైన గోడవలె నిలబడతాడు. దేవుని వెలుగులో నడిచే మనం నిరంకుశుల అంటే ‘బలాత్కారుల జయకీర్తన అణచివేయబడే కాలం’ కోసం దృఢ నమ్మకంతో ఎదురుచూస్తాం. అవును, యెహోవా శత్రువులు ఇక ఉండని రోజు కోసం ఆశతో అపేక్షిస్తాం.

20, 21. యెహోవా ఏ విందును ఇస్తున్నాడు, నూతన లోకమందు ఆ విందులో ఏమి చేరివుంటుంది?

20 యెహోవా తన సేవకుల్ని కాపాడటం కంటే ఇంకా ఎక్కువే చేస్తాడు. ప్రేమగల తండ్రిగా ఆయన వారికి అన్నీ సమకూరుస్తాడు. ఆయన తన ప్రజలను 1919 లో మహా బబులోను నుంచి విడుదల చేసిన తర్వాత, వారి ఎదుట విజయోత్సాహపు విందును అంటే పుష్కలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఉంచాడు. అది యెషయా 25:6 లో ముందుగానే చెప్పబడింది, అక్కడ మనమిలా చదువుతాం: “ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.” ఆ విందులో పాలిభాగం పొందడానికి మనమెంతగా ఆశీర్వదించబడ్డామో కదా! (మత్తయి 4:⁠4) “ప్రభువు బల్ల,” తినడానికి మధురమైన వాటితో నిజంగానే అమర్చబడి ఉంది. (1 కొరింథీయులు 10:​21) “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన” దాసుని ద్వారా ఆధ్యాత్మిక భావంలో చెప్పాలంటే మనకు కావలసినవన్నీ ఇవ్వబడుతున్నాయి.

21 దేవుడు అనుగ్రహించే ఈ విందులో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆధ్యాత్మిక విందు, దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకంలో లభ్యంకాగల పుష్కలమైన భౌతికాహారాన్ని మనకు గుర్తుచేస్తుంది. అప్పుడు ‘క్రొవ్వినవాటితో చేసిన విందులో’ పుష్కలమైన భౌతిక ఆహారం కూడా చేరివుంటుంది. ఏ ఒక్కరూ భౌతికంగాగానీ, ఆధ్యాత్మికంగాగానీ ఆకలితో అలమటించరు. యేసు ప్రత్యక్షతా ‘సూచనలో’ భాగంగా ప్రవచించబడిన “కరవు” కారణంగా ఇప్పుడు బాధలననుభవిస్తున్న మన ప్రియ విశ్వాసులకు అదెంత ఉపశమనమో గదా! (మత్తయి 24:​3, 8) వారికి కీర్తనకర్త మాటలు నిజంగా ఎంతో ఓదార్పునిస్తాయి. ఆయనిలా తెలియజేశాడు: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”​—⁠కీర్తన 72:16.

22, 23. (ఎ) ఏ “తెర” అంటే ఏ “ముసుకు” తీసివేయబడుతుంది, ఎలా? (బి) ‘యెహోవా ప్రజల నింద’ ఎలా తొలగించబడుతుంది?

22 మరింత అద్భుతమైన వాగ్దానాన్ని ఇప్పుడు ఆలకించండి. పాప మరణాలను “తెర” అంటే “ముసుకు”తో పోలుస్తూ యెషయా ఇలా చెబుతున్నాడు: “సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద [యెహోవా] తీసివేయును.” (యెషయా 25:7) ఒక్కసారి ఆలోచించండి! ఊపిరి సలపకుండా చేసే కంబళిలా మానవుల మీద పరచబడివున్న పాపమరణాలు ఇక ఉండవు. విధేయులైన, విశ్వసనీయులైన మానవులకు యేసు విమోచనా క్రయధన బలి ప్రయోజనాలు సంపూర్ణంగా అన్వయించబడే ఆ రోజు కోసం మనమెంతగా ఆశతో ఎదురుచూస్తున్నామో కదా!​—⁠ప్రకటన 21:3, 4.

23 ఆ అద్భుతమైన కాలాన్ని సూచిస్తూ, ప్రేరేపిత ప్రవక్త మనకిలా హామీ ఇస్తున్నాడు: “మరెన్నడును ఉండకుండ మరణమును [దేవుడు] మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.” (యెషయా 25:⁠8) సహజ కారణాల మూలంగా ఎవరూ మరణించరు లేదా తమ ప్రియమైన వారిని కోల్పోయామని ఎవ్వరూ ప్రలాపించరు. ఎంత దీవెనకరమైన మార్పోగదా! అంతేకాకుండా, దేవుడూ ఆయన సేవకులూ ఎంతోకాలం నుండి సహిస్తూ వస్తున్న నిందలు, అబద్ధ ప్రచారం భూమిమీద ఇక ఎక్కడా వినబడవు. ఎందుకు వినబడవు? ఎందుకంటే వాటికి మూలకారకుడూ, అబద్ధానికి జనకుడూ అయిన అపవాదియగు సాతాన్నీ, వాడి సంతానాన్నీ యెహోవా దేవుడు నిర్మూలిస్తాడు.​—⁠యోహాను 8:⁠44.

24. వెలుగులో నడిచే వారు తమకోసం యెహోవా చేసిన శక్తివంతమైన కార్యాలకు ఎలా ప్రతిస్పందిస్తారు?

24 యెహోవా శక్తిని తెలియజేసే అలాంటి అద్భుత కార్యాలను తలపోయడం మూలంగా, వెలుగులో నడిచేవారు ఇలా అనేలా పురికొల్పబడతారు: “ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు. మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.” (యెషయా 25:⁠9) త్వరలోనే నీతియుక్తమైన మానవాళి ఆనందించడానికి ప్రతీ కారణం ఉంటుంది. చీకటి పూర్తిగా పారద్రోలబడుతుంది, విశ్వసనీయులు యెహోవా వెలుగులో నిత్యమూ తేజోస్నానం చేస్తారు. దానిని మించిన గొప్ప నిరీక్షణ ఏదైనా ఉండగలదా? ఉండనే ఉండదు!

మీరు వివరించగలరా?

• వెలుగులో నడవడం నేడు ఎందుకు ప్రాముఖ్యం?

• యెషయా యెహోవా నామాన్ని ఎందుకు స్తుతించాడు?

• శత్రువులు దేవుని ప్రజల యథార్థతను ఎందుకు విచ్ఛిన్నం చేయలేరు?

• వెలుగులో నడిచేవారి కోసం ఎటువంటి గొప్ప ఆశీర్వాదాలు వేచివున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[12, 13వ పేజీలోని చిత్రం]

యూదా నివాసులు పిల్లల్ని మోలెకు దేవతకు బలి అర్పించేవారు

[15వ పేజీలోని చిత్రాలు]

యెహోవా దేవుని బలమైన కార్యాలను గురించిన జ్ఞానం, యెహోవా నామాన్ని స్తుతించేలా యెషయాను ప్రేరేపించింది

[16వ పేజీలోని చిత్రం]

నీతిమంతులు యెహోవా వెలుగులో నిరంతరం తేజోస్నానం చేస్తారు