కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సిరిల్‌, మెథోడీయస్‌ వర్ణమాలను రూపొందించిన బైబిలు అనువాదకులు

సిరిల్‌, మెథోడీయస్‌ వర్ణమాలను రూపొందించిన బైబిలు అనువాదకులు

సిరిల్‌, మెథోడీయస్‌ వర్ణమాలను రూపొందించిన బైబిలు అనువాదకులు

“మా దేశం బాప్తిస్మం పొందినా మాకు బోధకుడు లేడు. మాకు గ్రీకుగానీ లాటిన్‌గానీ రాదు . . . లిపీ, దాని భావమూ రెండూ అర్థం కావు; కాబట్టి లేఖనాల పదాలనూ, వాటి భావాన్నీ తెలియజేసే బోధకుల్ని మా కోసం పంపించండి.”​⁠రోస్తిస్లవ్‌, మొరేవియ రాకుమారుడు, సా.శ. 862.

నేడు, స్లావిక్‌ భాషా వర్గానికి చెందిన భాషల్ని మాట్లాడే 43 కోట్ల 50 లక్షలకన్నా ఎక్కువమంది ప్రజలు తమ సొంత భాషలోని బైబిలు అనువాదాన్ని చదువుకోగల్గుతున్నారు. * వారిలో 36 కోట్లమంది సిరిలిక్‌ వర్ణమాలను ఉపయోగిస్తున్నారు. అయినా 12 శతాబ్దాల క్రితం, వారి పూర్వీకులు మాట్లాడిన మాండలిక భాషలకు లిపిగానీ, వర్ణమాలగానీ లేవు. ఆ పరిస్థితిని సంస్కరించడానికి సహాయపడిన పురుషులు, జన్మతా అన్నదమ్ములైన సిరిల్‌, మెథోడీయస్‌లే. ఆ ఇద్దరు సోదరుల సాహసోపేతమైన సాంప్రదాయేతర ప్రయత్నాలు, బైబిల్ని భద్రపర్చి పురోభివృద్ధిపర్చడానికి సంబంధించిన చరిత్రలో ఆసక్తికరమైన ఒక అధ్యాయాన్ని సృష్టించాయని దేవుని వాక్య ప్రేమికులు కనుగొంటారు. ఆ ఇద్దరు సోదరులు ఎవరు, వాళ్ళు ఎటువంటి ఆటంకాల్ని ఎదుర్కొన్నారు?

“తత్వవేత్త,” గవర్నరు

గ్రీసులో ఉన్న థెస్సలొనీక నగరంలోని ఒక ఉన్నత కుటుంబంలో సిరిల్‌ (సా.శ. 827-869, అసలు పేరు కాన్‌స్టంటైన్‌), మెథోడీయస్‌ (సా.శ. 825-885)లు జన్మించారు. అప్పట్లో థెస్సలొనీక ద్విభాషా నగరంగా ఉండేది, అక్కడి నివాసులు గ్రీకునూ, స్లావిక్‌ భాషకు చెందిన మరొక భాషనూ మాట్లాడేవారు. అక్కడ స్లావిక్‌ భాషను మాతృభాషగా మాట్లాడేవారు అధికంగా ఉండడం వల్ల, నగర పౌరులైన గ్రీకులతోనూ స్లావనీయులతోనూ చుట్టుప్రక్కల ఉండే స్లావనీయుల వర్గప్రజలతోనూ సన్నిహిత సహచర్యం కలిగి ఉండడంవల్ల, సిరిల్‌, మెథోడీయస్‌లకు దక్షిణ స్లావనీయుల భాషా పరిజ్ఞానంతో బాగా పరిచయం ఏర్పరచుకోవడానికి అవకాశం లభించి ఉండవచ్చు. వాళ్ళమ్మ కూడా స్లావిక్‌ భాషా కుటుంబానికి చెందినదని మెథోడీయస్‌ జీవితచరిత్రకారుడొకరు పేర్కొన్నారు.

సిరిల్‌ తన తండ్రి చనిపోయిన తర్వాత, బైజాంటేన్‌ సామ్రాజ్యానికి రాజధాని అయిన కాన్‌స్టాంటినోపుల్‌ నగరానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఇంపీరియల్‌ యూనివర్సిటీలో చదివాడు, సుప్రసిద్ధమైన అధ్యాపకులతో సహవాసం చేశాడు. తూర్పు ప్రాంతంలోనే అత్యంత ప్రముఖ చర్చి భవనమైన హగియా సోఫియాకు గ్రంథాలయాధికారి అయ్యాడు. తర్వాత తత్త్వశాస్త్రంలో ప్రొఫెసర్‌ అయ్యాడు. నిజానికి తత్త్వశాస్త్రంలో ఆయన సాధించిన వాటివల్ల తత్త్వవేత్త అనే మారుపేరు ఆయనకు లభించింది.

అదే సమయంలో మెథోడీయస్‌ తన తండ్రిలాగే తానూ రాజకీయ వ్యవహార నిర్వహణా వృత్తిని చేపట్టాడు. అలా ఆయన బైజాంటేన్‌ సరిహద్దుల్లోని ఒక జిల్లాకు గవర్నరు అయ్యేంతవరకు ఎదిగాడు, అక్కడ అనేకమంది స్లావనీయులు నివసిస్తుండేవారు. అయినప్పటికీ, ఆయన ఆసియా మైనరులోని బితినియ దేశమందున్న మతనిష్ఠగల క్రైస్తవ సన్యాసులు నివసించే ఒక మఠంలో చేరాడు. సా.శ. 855 లో సిరిల్‌ ఆయనతో చేరాడు.

సా.శ. 860 లో, కాన్‌స్టాంటినోపుల్‌ బిషప్పు ఆ సోదరులిద్దరినీ ఒక ముఖ్యమైన పనిమీద విదేశానికి పంపించాడు. నల్లసముద్రానికి ఈశాన్య దిక్కున నివసిస్తున్న, ఇస్లాం యూదా క్రైస్తవ మతాల్లో దేనిని నిర్ణయించుకోవాలనే సందిగ్ధావస్థలో ఉన్న ఖాజర్‌ అనే ప్రజల దగ్గరికి వాళ్ళు పంపించబడ్డారు. సిరిల్‌ తన మార్గమధ్యంలో కొంతకాలం క్రైమియాలోని కెర్సొనీస్‌లో ఉన్నాడు. ఆయన అక్కడ హీబ్రూ, సమరియ భాషలను నేర్చుకున్నాడనీ, హీబ్రూ వ్యాకరణాన్ని ఖాజర్‌ భాషలోకి అనువదించాడనీ కొంతమంది పండితులు నమ్ముతారు.

మొరేవియ నుంచి పిలుపు

సా.శ. 862 లో, మొరేవియ (నేటి తూర్పు చెకియా, పశ్చిమ స్లొవాకియా, పశ్చిమ హంగేరీలు) రాకుమారుడు రోస్తిస్లవ్‌, ఈ ఆర్టికల్‌ ప్రారంభ పేరాలో కనబడుతున్న, లేఖన బోధకులను పంపించమనే వినతి పత్రాన్ని బైజాంటేన్‌ చక్రవర్తియైన మైఖేల్‌ IIIకు పంపించాడు. మొరేవియలో స్లావిక్‌ భాషను మాట్లాడే పౌరులకు తూర్పు ఫ్రాంకిష్‌ (ఇప్పుడు జర్మనీ, ఆస్ట్రియాలు) రాజ్యాన్నుంచి వచ్చిన మిషనరీల ద్వారా చర్చి బోధలు అప్పటికే పరిచయమయ్యాయి. అయితే రోస్తిస్లవ్‌ జర్మనీ తెగల రాజకీయ, మత ప్రభావాల పట్ల శ్రద్ధ కల్గివున్నాడు. కాన్‌స్టంటినోపుల్‌తో మత సంబంధాలు పెట్టుకోవడం, రాజకీయపరంగానూ, మతపరంగానూ తన దేశాన్ని స్వయం ప్రతిపత్తిగల దేశంగా ఉంచుతుందని ఆయన ఆశించాడు.

సిరిల్‌, మెథోడీయస్‌ సోదరులను మొరేవియకు పంపించాలని చక్రవర్తి నిర్ణయించుకున్నాడు. పాండిత్యపరంగా, విద్యాపరంగా, భాషాపరంగా ఆ సోదరులిద్దరూ మంచి దిట్టలు, అలాంటి కార్యాన్ని సాధించగలరు. ఆ సోదరులిరువురినీ మొరేవియకు వెళ్లమని ప్రొత్సహించేటప్పుడు “మీరు థెస్సలొనీకకు చెందినవారు, అలాగే థెస్సలొనీయులు అందరూ స్వచ్ఛమైన స్లావిక్‌ భాషను మాట్లాడతారు” అని ఆ చక్రవర్తి తర్కించాడని తొమ్మిదవ శతాబ్దపు జీవితచరిత్రకారుడొకరు మనకు చెబుతున్నారు.

ఒక వర్ణమాల, ఒక బైబిలు అనువాదం ఆవిర్భవించాయి

వారక్కడికి బయలుదేరడానికి కొన్ని నెలలకు ముందుగానే, సిరిల్‌ స్లావనీయుల కోసం ఒక లిపిని రూపొందించడం ద్వారా తమ కార్యానికి సంసిద్ధమయ్యాడు. ఆయనకు చురుకైన స్వరవివేచన ఉందని చెప్పబడుతుంది. ఆ విధంగా, గ్రీకు హీబ్రూ అక్షరాలను ఉపయోగించి, స్లవానిక్‌ భాషలో మాట్లాడే ప్రతిమాట యొక్క ధ్వనికి ఒక్కొక్క అక్షరాన్ని రూపొందించడానికి ప్రయత్నించాడు. * కొందరు పరిశోధకులు, ఆ వర్ణమాలను రూపొందించే పనికి పునాది వేయడంలో ఆయన అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిపాడని నమ్ముతారు. సిరిల్‌ రూపొందించిన వాస్తవ వర్ణమాల విషయంలో ఇప్పటికీ సందేహం ఉంది.​—⁠“సిరిలికా లేక గ్లగొలిటికా?” బాక్సు చూడండి.

అదే సమయంలో, సిరిల్‌ బైబిలు అనువాదానికి ఒక చురుకైన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తాను క్రొత్తగా రూపొందించిన వర్ణమాలను ఉపయోగించి గ్రీకు నుంచి స్లవానిక్‌లోకి సాంప్రదాయ ప్రకారం, యోహాను సువార్తలోని మొదటి పదబంధాన్ని అనువాదం చేయడం ద్వారా ప్రారంభించాడు: “ఆదియందు వాక్యముండెను . . .” అలా మొదలుపెట్టిన సిరిల్‌ నాలుగు సువార్తల్నీ, అపొస్తలుడైన పౌలు వ్రాసిన లేఖలనూ, కీర్తనల గ్రంథాన్నీ అనువదించేశాడు.

ఆయన ఒంటరిగానే పనిచేశాడా? ఆ కార్యాన్ని పూర్తిచేయడంలో బహుశా మెథోడీయస్‌ సహాయం చేసివుంటాడు. అంతేగాక, ద కేంబ్రిడ్జ్‌ మెడియెవల్‌ హిస్టరీ అనే పుస్తకం ఇలా తెలియజేస్తోంది: “[సిరిల్‌కు] ఇతరులు, అంటే గ్రీకు విద్యాభ్యాసం చేసిన స్థానిక స్లావనీయులు సహాయపడి ఉంటారని సులభంగానే ఊహించవచ్చు. ప్రాచీన అనువాదాలను గనుక మనం పరిశీలిస్తే, . . . ఉన్నతంగా రూపుదిద్దుకున్న స్లవానిక్‌ భాషా భావజాలాన్ని గూర్చిన శ్రేష్ఠమైన రుజువు వాటిలో మనకు కనబడుతుంది, ఆ ఘనత స్లావనీయులైన దాని సహకారులకే చెందాలి.” అటుతర్వాత మెథోడీయస్‌ బైబిల్లోని మిగతా భాగాలను అనువదించడం పూర్తిచేశాడు.

రెచ్చిపోయిన కుక్కల్లా

సిరిల్‌, మెథోడీయస్‌ సోదరులు మొరేవియకు హృదయపూర్వకంగా ఆహ్వానించబడ్డారు, అక్కడే వారు తమ పనిని సా.శ. 863 లో ప్రారంభించారు. వారి పనిలో బైబిలు మూలపాఠాలనూ, సాంప్రదాయ సంబంధిత పాఠాలనూ అనువదించడంతోపాటు స్థానిక ప్రజల ఒక గుంపుకు క్రొత్తగా రూపొందించిన స్లవానిక్‌ లిపిని నేర్పించడం కూడా ఇమిడివుంది.

కాబట్టి, అదంత సునాయాసంగా జరగలేదు. స్లవానిక్‌ భాష వాడకాన్ని మొరేవియలోని ఫ్రాంకిష్‌ మతనాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారు ఆరాధనలో ఉపయోగించటానికి కేవలం లాటిన్‌, గ్రీకు, హీబ్రూ భాషలు మాత్రమే అంగీకారయోగ్యమైనవని చెప్తూ త్రిభాషా సిద్ధాంతాన్ని పాటించేవారు. కొత్తగా రూపొందించిన ఈ లిపికి పోప్‌ మద్దతును సంపాదించాలని ఆశిస్తూ, సోదరులిద్దరూ సా.శ. 867 లో రోముకు బయల్దేరారు.

మార్గమధ్యంలోని వెనిస్‌ నగరంలో, సిరిల్‌, మెథోడీయస్‌ సోదరులు త్రిభాషా సిద్ధాంత లాటిన్‌ మతనాయకుల గుంపుతో మరొక ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. స్థానిక బిషప్పులూ, పాదిరీలూ, క్రైస్తవ సన్యాసులూ మూకుమ్మడిగా సిరిల్‌ మీదకి రెచ్చిపోయిన కుక్కల్లా ఎగబడ్డారని మధ్యయుగాల్లోని సిరిల్‌ జీవితచరిత్రకారుడు చెప్తున్నాడు. ఆ వృత్తాంతం ప్రకారం, “బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడుచున్నట్టుందురు” అని చెప్తున్న 1 కొరింథీయులు 14:​8, 9 వచనాలను పేర్కొనడం ద్వారా సిరిల్‌ వాళ్ళ నోళ్ళు మూయించాడు.

చివరికి సోదరులిద్దరు రోముకు చేరుకున్నప్పుడు, పోప్‌ అడ్రియన్‌ II స్లవానిక్‌ భాషను ఉపయోగించడానికి వారికి పూర్తి ఆమోదాన్నిచ్చాడు. కొన్ని నెలల తర్వాత, వాళ్ళింకా రోములోనే ఉన్నప్పుడు సిరిల్‌ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. అటు తర్వాత రెండు నెలలు కాకముందే ఆయన తన 42వ యేట మరణించాడు.

పోప్‌ అడ్రియన్‌ II, మొరేవియలోనూ నేటి స్లొవాకియా అయిన నిత్రా నగర చుట్టుపక్కల్లోనూ పనిని తిరిగి ప్రారంభించడానికి మెథోడీయస్‌ను ప్రోత్సహించాడు. ఆ ప్రాంతంలో పోప్‌ తన పలుకుబడిని బలపర్చుకోవాలనే ఉద్దేశంతో, స్లవానిక్‌ భాషను ఉపయోగించడానికి అనుమతిస్తున్నట్టుగానూ ఆయనను ఆర్చ్‌బిషప్పుగా నియమిస్తున్నట్టుగానూ మెథోడీయస్‌కు లేఖలనిచ్చాడు. అయినప్పటికీ, సా.శ. 870 లో ఫ్రాంకిష్‌ బిషప్పు హెర్మాన్‌రిక్‌, నిత్రా రాకుమారుడైన స్వతోప్లుక్‌ సహాయంతో మెథోడీయస్‌ను అరెస్ట్‌ చేయించాడు. ఆగ్నేయ జర్మనీలోని ఒక మఠంలో రెండున్నర సంవత్సరాలు ఆయన బంధించబడ్డాడు. చివరికి అడ్రియన్‌ II తర్వాతి పోప్‌ అంటే పోప్‌ జాన్‌ VIII మెథోడీయస్‌ను విడుదల చేశాడు. తిరిగి ఆయనకు ఆర్చ్‌బిషప్పు స్థానాన్నిచ్చి స్లవానిక్‌ భాషను ఆరాధనలో ఉపయోగించడానికి పాపల్‌ మద్దతును పునఃధృవపర్చాడు.

కానీ, ఫ్రాంకిష్‌ మతనాయకులనుంచి వ్యతిరేకత కొనసాగింది. చర్చి సిద్ధాంతాలకు విరోధి అని తనపై వేయబడిన ఆరోపణలనుంచి మెథోడీయస్‌ తనను తాను విజయవంతంగా కాపాడుకున్నాడు. చివరికాయన పోప్‌ జాన్‌ VIII నుంచి, చర్చిలో స్లవానిక్‌ భాషను ఉపయోగించడాన్ని అనుమతించే పాపల్‌ మద్దతు పత్రాన్ని సంపాదించాడు. ప్రస్తుతమున్న పోప్‌ జాన్‌ పాల్‌ II ఒప్పుకున్నట్లుగా మెథోడీయస్‌ జీవితం “ప్రయాణాలూ లేమితనమూ బాధలూ ప్రతికూలతా హింసలతోనే గడిచింది, . . . కొంతకాలం కఠిన కారాగార శిక్ష కూడా అనుభవించాడు.” హాస్యాస్పదమైన విషయమేంటంటే, ఇదంతా రోమువైపు మ్రొగ్గు చూపించే బిషప్పుల, రాకుమారుల చేతుల్లోనే జరిగింది.

మొత్తం బైబిలు అనువాదం చేయబడింది

ఎడతెగని ప్రతిఘటనలను ఎదుర్కొన్నప్పటికీ, షార్ట్‌హ్యాండ్‌ రాసే కొందరి సహాయంతో మెథోడీయస్‌ బైబిలు మిగతా భాగాన్ని స్లవానిక్‌ భాషలోకి అనువదించడం పూర్తిచేశాడు. సాంప్రదాయ ప్రకారం, ఆయనకు అప్పగించబడిన ఆ బృహత్కార్యాన్ని కేవలం ఎనిమిది నెలల్లో పూర్తిచేశాడు. అయితే, ఆయన మకబీయుల అప్రమాణిక గ్రంథాలను అనువదించలేదు.

నేడు, సిరిల్‌, మెథోడీయస్‌లు చేసిన అనువాదపు శ్రేష్ఠతను ఖచ్చితంగా అంచనా వేయడం అంత సులభమేమీ కాదు. తొలి అనువాదం జరిగిన కాలానికి దగ్గరగా తేదీలున్న మానుస్క్రిప్టుల కాపీలు కేవలం కొన్ని మాత్రమే ఈనాడు ఉనికిలో ఉన్నాయి. అపూర్వమైన ఆ తొలి నమూనాలను పరిశీలించడం ద్వారా భాషాశాస్త్రవేత్తలు, ఆ అనువాదం ఖచ్చితమైనదనీ ఆ భాష సహజపరిమళాన్ని గుభాళిస్తుందనీ గమనించారు. మా స్లావిక్‌ బైబిలు (ఆంగ్లం) అనే సాహితీకృతి, ఆ సహోదరులిద్దరూ “అనేకమైన కొత్త పదాలనూ, పదబంధాలనూ సృష్టించాల్సి వచ్చింది . . . వాళ్ళు అదంతా అమోఘమైన ఖచ్చితత్వంతో చేసి, స్లవానిక్‌ భాషను అంతవరకూ తెలియని ఉన్నతమైన పదజాలాలతో సమృద్ధమయ్యేలా చేశారు” అని పేర్కొంది.

శాశ్వత వారసత్వం

సా.శ. 885 లో మెథోడీయస్‌ మరణించిన తర్వాత ఫ్రాంకిష్‌ వ్యతిరేకులు మొరేవియనుంచి ఆయన శిష్యులను వెళ్ళగొట్టారు. వాళ్ళు బొహెమియా, దక్షిణ పోలాండ్‌, బల్గేరియాల్లో శరణార్థులయ్యారు. ఆ విధంగా సిరిల్‌, మెథోడీయస్‌ల పని ముందుకు కొనసాగింది, నిజానికి వ్యాపించింది. ఆ సోదరులిద్దరు రూపొందించిన శాశ్వతమైన స్లవానిక్‌ భాషా లిపి, వర్ధిల్లి వృద్ధిచెందింది, తర్వాత విభిన్న రూపాంతరాలు చెందింది. నేడు స్లావిక్‌ భాషా వర్గం 13 విభిన్న భాషలనూ, అనేక మాండలిక భాషలనూ కలిగివుంది.

అంతేగాక, సిరిల్‌, మెథోడీయస్‌ సోదరుల సాహసోపేతమైన బైబిలు అనువాదపు ప్రయత్నాలు, నేడు అందుబాటులో ఉన్న అనేక స్లావిక్‌ అనువాదాలుగా పరిణమించాయి. ఈ భాషలు మాట్లాడే కోట్లమంది ప్రజలు దేవుని వాక్యాన్ని తమ సొంతభాషలో కలిగివుండడం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ, “మన దేవుని వాక్యము నిత్యము నిలుచును” అనే మాటలు ఎంత నిజం!​—⁠యెషయా 40:⁠8.

[అధస్సూచీలు]

^ పేరా 1 స్లావిక్‌ భాషల్ని తూర్పు, మధ్య ఐరోపాల్లో మాట్లాడతారు, వాటిలో రష్యన్‌, యుక్రేనియన్‌, సెర్బియన్‌, పోలిష్‌, జెక్‌, బల్గేరియన్‌ అలాంటి మరికొన్ని ఇతర భాషలు చేరివున్నాయి.

^ పేరా 13 ఈ ఆర్టికల్‌లో ఉపయోగించిన “స్లవానిక్‌” పదం, సిరిల్‌, మెథోడీయస్‌ సోదరులు తమ కర్తవ్యంలోనూ, సాహిత్యపు పనిలోనూ ఉపయోగించిన స్లావిక్‌ మాండలిక భాషను సూచిస్తోంది. నేడు కొందరు దీనికి “పాత స్లవానిక్‌” లేక “పాత చర్చి స్లవానిక్‌” అనే పదాలను ఉపయోగిస్తారు. సా.శ. 9వ శతాబ్దంలో స్లావనీయులందరూ సమష్టిగా మాట్లాడే ఒకే ఒక భాషంటూ ఏదీలేదని భాషాశాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు.

[29వ పేజీలోని బాక్సు]

సిరిలికా లేక గ్లగొలిటికా?

భాషాశాస్త్రవేత్తలకు సిరిల్‌ రూపొందించింది ఏ వర్ణమాలో సరిగ్గా అర్థం కాకపోవడంవల్ల, అది చాలా వివాదాలను లేపింది. సిరిలిక్‌ అని పిలవబడే వర్ణమాలకు గ్రీకు వర్ణమాలకు చాలా సామీప్యతవుంది. స్లవానిక్‌ మాటల ధ్వనులను సూచించడానికి గ్రీకు వర్ణమాలలో దొరకని దాదాపు పన్నెండు అక్షరాలు మాత్రమే అదనంగా రూపొందించబడ్డాయి. అయినా, కొన్ని తొలి స్లవానిక్‌ మానుస్క్రిప్టుల్లో, పూర్తి భిన్నమైన గ్లగొలిటిక్‌ అని గుర్తించబడిన లిపిని వాడారు, దాన్నే చాలామంది విద్వాంసులు సిరిల్‌ రూపొందించిన లిపి అని నమ్ముతారు. గ్లగొలిటిక్‌ లిపిలోని కొన్ని అక్షరాలు గ్రీకు లేక హీబ్రూ భాషల గొలుసుకట్టు రాతలోంచి వచ్చినట్టు కనిపిస్తాయి, కొన్ని పదాలు మధ్యయుగాల్లోని డయాక్రిటిక్స్‌నుంచి [ధ్వని సంకేతాల నుంచి] వచ్చుండవచ్చు, కానీ అధికంగా మౌలికమైనవీ సంకీర్ణంగా సృష్టించబడినవే. గ్లగొలిటిక్‌లో పూర్తి భిన్నత్వముండడమేగాక అది పూర్తిగా ఒక కొత్త సృష్టిగా కనబడుతుంది. అయినా నేటి రష్యన్‌, యుక్రేనియన్‌, సెర్బియన్‌, బల్గేరియన్‌, మాసిడోనియన్‌ లిపులనూ, స్లవానిక్‌ భాషకు చెందని వాటితో పాటు మరో 22 భాషలనూ సిరిలికే అభివృద్ధి చేసింది.

[Artwork—Cyrillic and Glagolitic characters]

[31వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

బాల్టిక్‌ సముద్రం

(పోలాండ్‌)

(బొహెమియ) (జెకియ)

మొరేవియ (తూర్పు జెకియ, పశ్చిమ స్లవోకియ, పశ్చిమ హంగరీ)

నిత్రా

తూర్పు ఫ్రాంకిష్‌ సామ్రాజ్యం (జర్మనీ, ఆస్ట్రియా)

ఇటలీ

వినీసి

రోమ్‌

మధ్యధరా సముద్రం

బల్గేరియ

గ్రీస్‌

థెస్సలొనీక

(క్రిమియ)

నల్ల సముద్రం

బితినియ

కాన్‌స్టాంటినోపుల్‌ (ఇస్తాన్‌బుల్‌)

[31వ పేజీలోని చిత్రాలు]

సిరిలిక్‌ లిపిలో ఉన్న 1581 నాటి ఒక స్లావనిక్‌ బైబిలు

[చిత్రసౌజన్యం]

Bible: Narodna in univerzitetna knjiz̆nica-Slovenija-Ljubljana