కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పౌలు పరిశుద్ధుల కోసం సహాయ విరాళాలను వ్యవస్థీకరించడం

పౌలు పరిశుద్ధుల కోసం సహాయ విరాళాలను వ్యవస్థీకరించడం

పౌలు పరిశుద్ధుల కోసం సహాయ విరాళాలను వ్యవస్థీకరించడం

నిజ క్రైస్తవులకు ఆధ్యాత్మిక ఆసక్తులే అత్యంత ప్రాముఖ్యం. అయినప్పటికీ, ఇతరుల భౌతిక సంక్షేమం విషయంలో శ్రద్ధ చూపించడం కూడా వారికి ప్రాముఖ్యమే. వారు కష్టాలను అనుభవించే వారికి తరచూ సహాయాన్ని అందించారు. సహోదర ప్రేమ, క్రైస్తవులను అవసరంలో ఉన్న తోటి విశ్వాసులకు సహాయం చేసేలా ప్రేరేపిస్తుంది.​—⁠యోహాను 13:34, 35.

అపొస్తలుడైన పౌలుకు తన ఆధ్యాత్మిక సహోదర సహోదరీల పట్ల ఉన్న ప్రేమ అకయ, గలతీయ, మాసిదోనియ, ఆసియాలలో ఉన్న సంఘాల్లో విరాళాల సేకరణను వ్యవస్థీకరించేలా ఆయనను కదిలించింది. దాన్ని ఆవశ్యకమైనదిగా చేసిందేమిటి? సహాయ కార్యక్రమం ఎలా వ్యవస్థీకరించబడింది? దానికి ప్రతిస్పందన ఏమిటి? దాని విషయంలో మనం ఎందుకు ఆసక్తిని చూపించాలి?

యెరూషలేము సంఘ పరిస్థితి

సా.శ. 33 పెంతెకొస్తు పండుగకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యూదుల్లో నుంచీ, యూదా మత ప్రవిష్టుల్లో నుంచీ శిష్యులుగా మారిన వాళ్లు, నిజ విశ్వాసాన్ని గురించి మరింత తెలుసుకునేందుకు పెంతెకొస్తు పండుగ తర్వాత కొంతకాలంపాటు యెరూషలేములోనే ఉండిపోయారు. అలా అక్కడ ఉండిపోయిన వారి అవసరాలను తీర్చేందుకు తోటి ఆరాధకులు అవసరమైనప్పుడు సంతోషంగా సహాయం చేశారు. (అపొస్తలుల కార్యములు 2:7-11, 41-44; 4:​32-37) యూదా జాతీయవాదులు తిరుగుబాటునూ మూకుమ్మడి హింసనూ రెచ్చగొట్టినప్పుడు చెలరేగిన అంతర్గత అల్లకల్లోలం మూలంగా మరింత అవసరత ఏర్పడింది. క్రీస్తు అనుచరులెవరూ ఆకలితో అలమటించకూడదని, అనుదినాహారాన్ని అవసరతలో ఉన్న విధవరాండ్రకు పంచిపెట్టే ఏర్పాట్లు చేయడం జరిగింది. (అపొస్తలుల కార్యములు 6:​1-6) హేరోదు స్వయంగా క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి పూనుకున్నాడు. సా.శ. 40వ పడి మధ్యలో యూదయను కరువు పట్టి పీడించింది. యేసు అనుచరుల విషయానికొస్తే, ‘శ్రమలు,’ ‘బాధలు,’ ‘తమ ఆస్తిని కోల్పోవడం’ అని పౌలు పిలిచిన వాటికి ఆ పరిస్థితులన్నీ నడిపించాయి.​—⁠హెబ్రీయులు 10:32-34; అపొస్తలుల కార్యములు 11:27-12:⁠1.

దాదాపు సా.శ. 49 లో ఆ పరిస్థితి తీవ్రంగానే ఉంది. అందుకే, పౌలు తన ప్రకటనా పనిలో అన్యజనాంగంపై శ్రద్ధ చూపిస్తాడని అంగీకరించిన తర్వాత పేతురు యాకోబు యోహానులు “బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని” ఆయనకు ఉద్బోధించారు. పౌలు దాన్ని చేయడానికి కృషి చేశాడు.​—⁠గలతీయులు 2:7-10.

విరాళాల సేకరణను వ్యవస్థీకరించడం

పౌలు యూదయలో, బీద క్రైస్తవుల కోసం ఒక నిధిని పర్యవేక్షించేవాడు. దాదాపు సా.శ. 55 లో ఆయన కొరింథీయులకు ఇలా చెప్పాడు: “పరిశుద్ధులకొరకైన చందావిషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. . . . ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. . . . [అప్పుడు] మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును.” (1 కొరింథీయులు 16:​1-3) సహాయ విరాళాలను ఇవ్వడంలో మాసిదోనియ, అకయలలో ఉన్న క్రైస్తవులు భాగంవహించారని ఓ సంవత్సరం తర్వాత పౌలు చెప్పాడు. ఉపకార ద్రవ్యాన్ని యెరూషలేముకు పంపించినప్పుడు, ఆసియా నుంచి వచ్చిన వారు కూడా అక్కడ ఉండడం ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలు కూడా విరాళాలను ఇచ్చి ఉంటారన్న విషయాన్ని సూచిస్తున్నట్టు కనబడుతోంది.​—⁠అపొస్తలుల కార్యములు 20:4; 2 కొరింథీయులు 8:1-4; 9:1, 2.

తాను ఇవ్వగల్గినదానికన్నా ఎక్కువ ఇవ్వాలని ఎవరూ బలవంతపెట్టబడలేదు. దానికి బదులుగా, యూదా యెరూషలేముల్లో ఉన్న పరిశుద్ధుల్లో ఒకరి సమృద్ధి మరొకరి అక్కరను తీర్చేలా అది సమానత్వానికి సంబంధించిన విషయం. (2 కొరింథీయులు 8:​13-15) “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” అని పౌలు తెలియజేశాడు.​—⁠2 కొరింథీయులు 9:⁠7.

ఉదారంగా ఉండడానికి గల మంచి కారణాన్ని కొరింథీయులకు అపొస్తలుడు తెలియజేశాడు. యేసు, వాళ్లు ఆధ్యాత్మికంగా ‘ధనవంతులు కావలెనని, వారి నిమిత్తము దరిద్రుడయ్యాడు.’ (2 కొరింథీయులు 8:⁠9) ఇవ్వడంలో ఆయన చూపించిన స్ఫూర్తిని అనుకరించాలని నిశ్చయంగా వాళ్లు కోరుకుంటారు. అంతేగాక, “ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు” దేవుడు వారిని ధనవంతుల్ని చేస్తున్నాడు గనుక, వాళ్లు పరిశుద్ధుల అవసరాలకు సహాయం చేయడం సరియైనదే.​—⁠2 కొరింథీయులు 9:10-12.

విరాళాలిచ్చేవారి వైఖరి

మొదటి శతాబ్దంలోని పరిశుద్ధుల కోసమైన సహాయ కార్యక్రమంలో భాగంవహించే వారి దృక్పథాన్ని పరిశీలించడం ద్వారా స్వచ్ఛందంగా ఇవ్వడం గురించి మనం ఎంతో నేర్చుకోవచ్చు. విరాళాల సేకరణ, నిరుపేదలైన తోటి యెహోవా ఆరాధకుల పట్ల ఉన్న శ్రద్ధకన్నా ఇంకా ఎక్కువే తెలియజేసింది. యూదా క్రైస్తవులకూ, అన్య క్రైస్తవులకూ మధ్య సహోదర బంధం ఉందన్న విషయాన్ని అవి చూపించాయి. విరాళాలను ఇవ్వడం పుచ్చుకోవడం అనేది యూదా క్రైస్తవులకూ, అన్య క్రైస్తవులకూ మధ్య ఉన్న సమైక్యతనూ, స్నేహాన్నీ సూచించింది. భౌతికమైన వాటినీ, ఆధ్యాత్మికమైనవాటినీ వారు పంచుకున్నారు.​—⁠రోమీయులు 15:​26, 27.

పౌలు మొదట్లో ఈ సహాయ కార్యక్రమంలో భాగంవహించమని మాసిదోనియ క్రైస్తవులను ఆహ్వానించి ఉండకపోవచ్చు​—⁠ఎందుకుంటే వారు కూడా నిరుపేదలే. అయితే వాళ్లు “పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములో” అంటే ఇచ్చే ఆధిక్యత కోసం ‘మనఃపూర్వకముగా వేడుకొన్నారు.’ వాళ్లు “బహు శ్రమవలన పరీక్షింప”బడినప్పటికీ, తమ “సామర్థ్యముకంటె ఎక్కువగా” ఆనందంతో ఇచ్చారు! (2 కొరింథీయులు 8:​1-4) వారి బహు శ్రమలో, రోమన్ల చట్టానికి విరుద్ధమైన ఒక మతాన్ని ఆచరిస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కోవడం చేరివుంది. అందునుబట్టి, అదే విధమైన కష్టాల్ని అనుభవిస్తున్న తమ యూదా సహోదరులపట్ల తదనుభూతి వారికి ఉంటుందన్న విషయం అర్థం చేసుకొనదగినదే.​—⁠అపొస్తలుల కార్యములు 16:20, 21; 17:5-9; 1 థెస్సలొనీకయులు 2:⁠14.

విరాళాలను ఇవ్వడంలో కొరింథీయులు మొదట చూపించిన ఆసక్తిని మాసిదోనియన్లను ప్రోత్సహించేందుకు పౌలు ఉపయోగించినప్పటికీ, అటు తర్వాత కొరింథీయుల్లో ఉత్సాహం సన్నగిల్లింది. ఇప్పుడు కొరింథీయులను ప్రేరేపించేందుకు మాసిదోనీయుల ఉదారతను అపొస్తలుడు ప్రస్తావించాడు. ఒక సంవత్సర కాలం ముందు వాళ్లు ప్రారంభించిన సహాయ విరాళాల సేకరణ పనిని ముగించడానికి సమయం ఆసన్నమైందన్న విషయాన్ని వాళ్లకు జ్ఞాపకం చేయడం అవసరమని ఆయన భావించాడు. ఏం జరిగింది?​—⁠2 కొరింథీయులు 8:10, 11; 9:1-5.

కొరింథులోని విరాళాల సేకరణకు తీతు చొరవ తీసుకున్నా కొన్ని సమస్యలు తలెత్తడంతో అతని ప్రయత్నాలకు బహుశా ఆటంకం ఏర్పడి ఉంటుంది. మాసిదోనియలో ఉన్న పౌలుతో సంప్రదించిన తర్వాత, కొరింథులో ఉన్న సంఘాన్ని బలపర్చి, విరాళాల సేకరణ పనిని ముగించేందుకు తీతు మరి ఇద్దరితో కల్సి తిరిగి వెళ్లాడు. పౌలు కొరింథీయులను దోచుకోవడానికి ప్రయత్నించాడని కొంతమంది పరోక్షంగా సూచించి ఉండవచ్చు. బహుశా అందుకే కాబోలు ఆయన విరాళాల సేకరణ పనిని పూర్తి చేసేందుకు ముగ్గురు పురుషులను పంపించాడు, వారిలో ప్రతీ ఒక్కరినీ సిఫారసు చేశాడు. “మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై యున్నాము గనుక దానినిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా చూచుకొను[చున్నాము.] . . . ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.”​—⁠2 కొరింథీయులు 8:6, 18-23; 12:⁠18.

విరాళాలను చేరవేయడం

సా.శ. 56 వసంతకాలం నాటికి, యెరూషలేముకు తీసుకెళ్లడానికి చందా డబ్బు సిద్ధంగా ఉంది. విరాళాలు ఇచ్చిన వాళ్లు ఎంపికచేసుకున్న ప్రతినిధి వర్గంతోపాటు పౌలు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 20:4 ఇలా చెబుతోంది: “పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితోకూడ వచ్చిరి.” లభ్యమౌతున్న రుజువుల ఆధారంగా చూస్తే, ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులకు ప్రాతినిధ్యంవహించిన లూకా కూడా వారిలో ఉన్నాడు. కాబట్టి, ఆ కార్యంపై కనీసం తొమ్మిదిమంది పురుషులు వెళ్లి ఉంటారు.

“సమకూర్చబడిన సహాయ విరాళాల మొత్తం చెప్పుకోదగినంతగా ఉండవచ్చు, అలాకాకపోయివుంటే, పౌలు మరనేక మంది ప్రతినిధులూ చేరివున్న చివరి ప్రయత్నాలు వాళ్లు ఎదుర్కొన్న కష్టాలకూ పెట్టిన ఖర్చులకూ తగ్గట్టుగా ఉండివుండేవి కావు” అని డీటర్‌ జేర్జీ అంటున్నారు. ఆ బృందం భద్రతనిచ్చేదిగా పనిచేయడం మాత్రమే కాదుగానీ తన నిజాయితీని ప్రశ్నించే ఏ ఆరోపణల నుంచైనా పౌలును కాపాడే ఒక కవచంలా కూడా పనిచేసింది. పంపబడిన వారు, యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల ఎదుట అన్య సంఘాలకు ప్రాతినిధ్యం వహించారు.

కొరింథు నుంచి సిరియకు సముద్ర మార్గాన ప్రయాణిస్తూ, ఆ ప్రతినిధుల బృందం పస్కాపండుగ నాటికి యెరూషలేమును చేరుకుని ఉండేది. అయితే, పౌలును చంపాలని యూదులు కుట్ర పన్నడాన్ని గూర్చిన వార్త, వారి ప్రణాళికలో మార్పుల్ని తీసుకొచ్చింది. (అపొస్తలుల కార్యములు 20:⁠3) బహుశా ఆయన శత్రువులు ఆయన్ని సముద్రం దగ్గర చంపాలని ఉద్దేశించి ఉంటారు.

పౌలుకు ఇతర చింతలు కూడా ఉన్నాయి. తాను అక్కడ నుంచి వెళ్లడానికి ముందు, ఆయన ‘యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసియున్న తన పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు’ ప్రార్థించమని రోములోని క్రైస్తవులకు రాశాడు. (రోమీయులు 15:​30-32) పరిశుద్ధులు నిస్సందేహంగా ప్రగాఢమైన కృతజ్ఞతతో విరాళాలను స్వీకరిస్తారు, కానీ తన రాక యూదా ప్రజానీకం మధ్య తీసుకొచ్చే కలత గురించి పౌలు బహుశా చింతించి ఉంటాడు.

అపొస్తలుని మనస్సులో నిశ్చయంగా బీదలు ఉన్నారు. ఎప్పుడు విరాళాలు అందించబడ్డాయన్న విషయాన్ని గురించి లేఖనాలు చెప్పకపోయినప్పటికీ, వాటి అందింపు ఐక్యతను పెంపొందించి, అన్య క్రైస్తవులు తమ తోటి యూదా క్రైస్తవుల నుంచి తాము పొందిన ఆధ్యాత్మిక ఐశ్వర్యం పట్ల కృతజ్ఞతను చూపించేలా చేసింది. యెరూషలేముకు వచ్చి ఎంతో కాలం గడవక ముందే పౌలు ఆలయంలోకి వెళ్లడం దొమ్మీ జరగడానికి దారితీసింది, చివరకు ఆయన్ని బంధించారు. కానీ అది చివరకు ఆయన అధిపతుల ఎదుటా, రాజుల ఎదుటా సాక్ష్యమిచ్చేందుకు అవకాశాల్ని ఇచ్చింది.​—⁠అపొస్తలుల కార్యములు 9:15; 21:17-36; 23:11; 24:1-26:⁠32.

నేటి మన విరాళాలు

మొదటి శతాబ్దానికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఎంతో మార్పు ఉంది​—⁠కానీ అంతర్లీనంగా ఉండే సూత్రాల్లో మాత్రం మార్పు లేదు. క్రైస్తవులకు సరియైన రీతిగానే ఆర్థికావసరాలను గురించి తెలియజేయడం జరుగుతోంది. అవసరతలో ఉన్న వారి కోసం వాళ్లు ఇచ్చే ఏ విరాళాలైనా సరే అవి స్వచ్ఛందంగా ఇచ్చేవై ఉండాలి, దేవునిపట్లా, తోటి మానవుల పట్లా ఉన్న ప్రేమనుబట్టి ప్రేరేపించబడినవై ఉండాలి.​—⁠మార్కు 12:28-31.

మొదటి శతాబ్దంలోని పరిశుద్ధుల తరపున తీసుకోబడిన సహాయక చర్యలు, అలాంటి విరాళాల నిర్వహణ చక్కగా వ్యవస్థీకరించబడాలనీ, పూర్తి నిజాయితీతో వ్యవహరించబడాలనీ చూపిస్తాయి. నిజమే, అవసరాలను గురించి యెహోవా దేవునికి తెలుసు, కష్టాలున్నప్పటికీ తన సేవకులు ఇతరులతో రాజ్య సువార్తను పంచుకోవడంలో కొనసాగగల్గేలా వారి కోసం ఆయన ఏర్పాట్లు చేస్తాడు. (మత్తయి 6:​25-34) అయినప్పటికీ, మన ఆర్థిక స్థోమత ఏదైనప్పటికీ మనమంతా మన వంతు మనం చేయగలం. ఆ విధంగా, ‘హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగులదు, తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాదు.’​—⁠2 కొరింథీయులు 8:⁠14, 15.