కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజ క్రైస్తవత్వం ప్రబలమౌతోంది!

నిజ క్రైస్తవత్వం ప్రబలమౌతోంది!

నిజ క్రైస్తవత్వం ప్రబలమౌతోంది!

“యెహోవా వాక్యము శక్తివంతమైన విధంగా ప్రవర్ధమానమౌతూ, ప్రబలమౌతూ వచ్చింది.” ​—⁠అపొస్తలుల కార్యములు 19:​20, NW.

1. మొదటి శతాబ్దంలోని క్రైస్తవత్వపు ప్రవర్ధమానాన్ని వర్ణించండి.

తొలి క్రైస్తవులు, పరిశుద్ధాత్మ శక్తితో దేవుని వాక్యాన్ని ఎంతో ఆసక్తిగా ప్రకటించారు, వారి ఆసక్తిని ఎవరూ ఆర్పివేయలేకపోయారు. “క్రైస్తవత్వం రోమా ప్రపంచంలో అతి శీఘ్రంగా వ్యాపించింది. 100వ సంవత్సరం వచ్చేసరికి, మధ్యధరా సరిహద్దుల్లో ఉన్న దాదాపు ప్రతి మండలంలోను ఒక క్రైస్తవ సమాజం ఉండేది” అని ఒక చరిత్రకారుడు వ్రాశాడు.

2. సువార్త ప్రభావాన్ని నిరర్ధకం చేయడానికి సాతాను ఏవిధంగా ప్రయత్నం చేశాడు, అది ఎలా ప్రవచించబడింది?

2 తొలి క్రైస్తవులు సువార్త గురించి మాట్లాడడాన్ని అపవాదియైన సాతాను ఆపలేకపోయాడు. అతడు సువార్త ప్రభావాన్ని నిరర్థకం చేసేందుకు మరొక మాధ్యమాన్ని అంటే భ్రష్టత్వాన్ని ఉపయోగించాడు. అలా జరుగుతుందని గోధుమలు గురుగుల ఉపమానంలో యేసు ముందే సూచించాడు. (మత్తయి 13:​24-30, 36-43) అబద్ధ బోధకులు సంఘంలో నుండే వస్తారనీ, వినాశకరమైన తెగలను సృష్టిస్తారనీ అపొస్తలుడైన పేతురు కూడా హెచ్చరించాడు. (2 పేతురు 2:​1-3) అలాగే, యెహోవా దినము రాక మునుపు భ్రష్టత్వము సంభవిస్తుందని అపొస్తలుడైన పౌలు ప్రత్యేకంగా హెచ్చరించాడు.​—⁠2 థెస్సలొనీకయులు 2:1-3.

3. అపొస్తలులు మరణించిన తర్వాత ఏమి జరిగింది?

3 అపొస్తలుల మరణం తర్వాత, అన్యమత బోధలూ, తత్త్వశాస్త్రాలూ సువార్తను మరుగుచేశాయి. ప్రవచించబడినట్లుగానే, అబద్ధ బోధకులు సత్యమును గురించిన నిర్మలమైన సందేశాన్ని వక్రీకరించి, కలుషితం చేశారు. కాలక్రమేణా, క్రైస్తవ మత సామ్రాజ్యం అనే పేరున పుట్టిన నకిలీ క్రైస్తవత్వం నిజ క్రైస్తవత్వాన్ని మరుగు చేసింది. క్రైస్తవ మతగురువుల వర్గం ఆవిర్భవించి, సాధారణ ప్రజల చేతులకు బైబిలు అందకుండా చేసేందుకు ప్రయత్నించింది. క్రైస్తవులమని చెప్పుకునేవారి సంఖ్య పెరిగినప్పటికీ, వారి ఆరాధన స్వచ్ఛమైనది కాదు. క్రైస్తవమత సామ్రాజ్యం వివిధ ప్రాంతాలకు వ్యాపించి, పాశ్చాత్య సంస్కృతిలో శక్తివంతమైన సంస్థగా మారినప్పటికీ, దానికి దేవుని ఆశీర్వాదం గానీ పరిశుద్ధాత్మ తోడు గానీ లేవు.

4. దేవుని సంకల్పాన్ని అడ్డగించాలన్న సాతాను పన్నుగడ ఎందుకు సఫలం కాలేదు?

4 అయినప్పటికీ, యెహోవా సంకల్పాన్ని అడ్డగించాలన్న సాతాను పన్నుగడ చిత్తుగా విఫలమైంది. భ్రష్టత్వం ప్రబలిపోయి మునుపెన్నటికన్నా గాఢాంధకారంగా ఉన్న యుగంలో కూడా, నిజక్రైస్తవత్వం కొందరి మధ్య సజీవంగా ఉంది. బైబిలు నకలు వ్రాసినవారు, తప్పులు లేకుండా నకలు వ్రాసేందుకు చాలా శ్రమ తీసుకున్నారు. బైబిలు బోధించే అధికారముందని చెప్పుకున్న అనేకులు దాని సందేశాన్ని వక్రీకరించి వ్యాఖ్యానించినప్పటికీ, బైబిలు మారకుండా అలాగే ఉంది. శతాబ్దాలు గడుస్తుండగా జెరోమ్‌, టిండేల్‌ వంటి పండితులు దేవుని వాక్యాన్ని ధైర్యంగా అనువదించి, పంపిణీ చేశారు. లక్షలాది మంది ప్రజలకు బైబిలూ, నకిలీ క్రైస్తవత్వమూ పరిచయమయ్యాయి. మొత్తానికి ఏదో ఒక విధమైన క్రైస్తవత్వం పరిచయమైంది.

5. “నిజమైన జ్ఞానము” గురించి ప్రవక్తయైన దానియేలు ఏమి ప్రవచించాడు?

5 చివరికి, దానియేలు పుస్తకంలో ప్రవచించబడినట్లు, ‘తెలివి [“నిజమైన జ్ఞానము,” NW] అధికమైంది.’ అది “అంత్యకాలము”లోనే​—⁠మనం జీవిస్తున్న ఈ కాలంలోనే సంభవించింది. (దానియేలు 12:⁠4) పరిశుద్ధాత్మ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్య ప్రేమికులను సత్య దేవుని గురించిన, ఆయన సంకల్పాన్ని గురించిన సరైన జ్ఞానానికి నడిపింది. శతాబ్దాలపాటు భ్రష్ట బోధలు సాగిన తర్వాత కూడా దేవుని వాక్యం ప్రబలమౌతోంది! ఆహ్లాదకరమైన క్రొత్త లోకమనే నిరీక్షణను ప్రజలకు చూపిస్తూ నేడు సువార్త అన్నిచోట్లా ప్రకటించబడుతోంది. (కీర్తన 37:​11) దేవునివాక్యం ఈ ఆధునిక దినాల్లో ప్రవర్ధమానమవ్వడాన్ని గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

నేడు వాక్యం ప్రవర్ధమానమవ్వడం

6. పంతొమ్మిది వందల పద్నాలుగు వచ్చేసరికి, బైబిలు విద్యార్థులు ఏ సత్యాలను అర్థం చేసుకున్నారు?

6 పంతొమ్మిదవ శతాబ్దపు చివరి భాగంలో, బైబిలు సత్యం బైబిలు విద్యార్థుల ఒక చిన్న గుంపుకు పురికొల్పునిచ్చింది. ఆ విద్యార్థులే నేడు యెహోవాసాక్షులు అని పిలువబడుతున్నారు. 1914 వచ్చేసరికి, బైబిలు వారి దృష్టిలో సజీవమైంది. దేవుని సంకల్పాన్ని గురించిన అద్భుతమైన సత్యాలను వాళ్ళు అర్థం చేసుకున్నారు. తన కుమారుడ్ని భూమిమీదికి పంపడం ద్వారా నిత్యజీవానికి మార్గాన్ని తెరిచిన యెహోవా ప్రేమకు వాళ్ళు చాలా కదిలించబడ్డారు. వాళ్ళు దేవుని నామాన్ని గురించీ వ్యక్తిత్వాన్ని గురించీ కూడా తెలుసుకుని ఎంతో మెప్పుదలతో ఉన్నారు. మానవజాతికి ఆశీర్వాదాలను తెచ్చే దేవుని రాజ్య ప్రభుత్వం సమీపించిందన్న విషయాన్ని సూచిస్తూ, “అన్యజనముల కాలములు” ముగిశాయని వాళ్ళు గ్రహించారు. (లూకా 21:​24) అదెంత మహిమాన్వితమైన సువార్త! ఈ శక్తివంతమైన సత్యాలను ప్రతిచోటా ప్రతి ఒక్కరితో పంచుకోవలసి ఉంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి!

7. బైబిలు సత్యం ఆధునిక కాలాల్లో ఎలా ప్రబలమైంది?

7 వ్రేళ్ళమీద లెక్కపెట్టగల ఆ కొద్దిమంది ఆత్మాభిషిక్త క్రైస్తవులను యెహోవా ఆశీర్వదించాడు. నేడు నిజ క్రైస్తవత్వాన్ని అవలంబించేవారి సంఖ్య అరవై లక్షలను దాటింది. 235 దేశాల్లో యెహోవాసాక్షులు ఉన్నారు కనుక, దేవుని వాక్యం వివిధ ప్రాంతాలకు వ్యాపించింది కూడా. అంతేకాక, బైబిలు సత్యం, మతపరమైన మరితరమైన అన్ని ఆటంకాలను అధిగమించి ప్రబలమౌతూ శక్తిని ప్రదర్శించింది. ఈ భూగోళవ్యాప్త ప్రకటనా పని యేసు రాజ్యాధికారంలో ఉన్నాడన్న దానికి ఖండించలేని రుజువునిస్తోంది.​—⁠మత్తయి 24:3, 14.

8. యెహోవాసాక్షుల పెరుగుదలను గురించి కొందరు ఏమని చెప్పారు?

8 మొదటి శతాబ్దంలో క్రైస్తవత్వం ఆకస్మికంగా పెరగడాన్ని గురించి చరిత్రకారులు వ్యాఖ్యానించినట్లే, ఆధునిక కాలాల్లో కూడా యెహోవా ప్రజల పెరుగుదలను గురించి అనేక మంది పండితులు వ్యాఖ్యానించారు. “గత 75 సంవత్సరాల్లో యెహోవాసాక్షుల సంఖ్య అసాధారణంగా పెరిగింది. . . . అదీ భూగోళవ్యాప్తంగా పెరిగింది” అని అమెరికాలోని ఇద్దరు పండితులు ఏకగ్రీవంగా వ్రాశారు. “ప్రపంచంలో అత్యంత శీఘ్రంగా పెరుగుతున్న, బైబిలు బోధలను పూర్తిగా అనుసరిస్తున్నందుకు అంతర్జాతీయంగా ఎంతో గౌరవించబడుతున్న మతాల్లో ఒకటి” అని యెహోవాసాక్షుల గురించి ఈస్ట్‌ ఆఫ్రికన్‌ పత్రిక అంది. యూరప్‌లో ప్రచురించబడుతున్న ఒక సాంప్రదాయిక క్యాథలిక్‌ పత్రిక “యెహోవాసాక్షుల పెరుగుదల ప్రబలమవ్వడం” గురించి పేర్కొంది. ఈ పెరుగుదలకు దోహదపడినదేమిటి?

నేడు పరిశుద్ధాత్మ పని చేస్తోంది

9. (ఎ) నేడు దేవుని వాక్యం ప్రబలమవ్వడానికి ఒక ప్రాథమిక కారణమేమిటి? (బి) యెహోవా, ప్రజలను తనవైపుకు ఎలా రప్పించుకుంటాడు?

9 నేడు దేవుని వాక్యం ప్రబలమవ్వడానికి ఒక ప్రాథమిక కారణం ఏమిటంటే, యెహోవా ఆత్మ మొదటి శతాబ్దంలో పనిచేసినట్లే నేడూ శక్తివంతంగా పనిచేయడమే. “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” అని యేసు చెప్పాడు. (యోహాను 6:​44) సరైనవాటికి మొగ్గు చూపేవారి హృదయాలను ఆకర్షిస్తూ, దేవుడు వారిని నెమ్మదిగా తన వైపుకు ఆకట్టుకుంటాడు అని ఈ మాటలు సూచిస్తున్నాయి. తన సాక్షుల ప్రకటనా పని ద్వారా, “అన్యజనులందరియొక్క యిష్టవస్తువుల”ను అంటే భూమి మీద ఉన్న సౌమ్యతగల గొర్రెలవంటి వారిని తన సేవకు యెహోవా రప్పించుకుంటున్నాడు.​—⁠హగ్గయి 2:6, 7.

10. దేవుని వాక్యానికి ఏయే రకాల ప్రజలు ప్రతిస్పందించారు?

10 పరిశుద్ధాత్మ, దేవుని వాక్యాన్ని భూదిగంతములవరకు తీసుకువెళ్ళడానికి దేవుని ప్రజలకు శక్తినివ్వడమే కాక, సువార్తకు ప్రతిస్పందించేలా అన్ని రకాల ప్రజలను కదిలించింది. నిజమే, దేవుని వాక్యాన్ని హత్తుకున్నవారు, ‘ప్రతి వంశములో నుండీ, ఆయా భాషలు మాటలాడువారిలో నుండీ, ప్రతి ప్రజలో నుండీ, ప్రతి జనములో నుండీ’ వచ్చారు. (ప్రకటన 5:⁠9; 7:​9, 10) వారిలో ధనవంతులూ పేదవాళ్ళూ, ఉన్నత విద్యనభ్యసించినవారూ నిరక్షరాస్యులూ ఉన్నారు. కొందరైతే యుద్ధమూ, క్రూరమైన హింసాకాండా జరుగుతున్న సమయంలో వాక్యాన్ని అంగీకరించగా, మరి కొందరు శాంతీ సమృద్ధీ ఉన్న సమయాల్లో అంగీకరించారు. అన్ని రకాల ప్రభుత్వాల క్రింద జీవిస్తున్నవారు, అన్ని సంస్కృతుల్లోనివారు, కాన్సంట్రేషన్‌ క్యాంపుల్లో ఉన్నవారు మొదలుకొని రాజభవనాల్లో నివసించే స్త్రీపురుషుల వరకు అన్ని రకాల ప్రజలూ సువార్తకు అనుకూలంగా ప్రతిస్పందించారు.

11. దేవుని ప్రజల జీవితాల్లో పరిశుద్ధాత్మ ఎలా పని చేస్తుంది, ఏ తేడా స్పష్టంగా కనిపిస్తుంది?

11 దేవుని ప్రజల మధ్య ఆశ్చర్యకరమైన వైవిధ్యం ఉన్నప్పటికీ, వాళ్ళు ఒకరితోనొకరు ఐక్యంగా జీవిస్తారు. (కీర్తన 133:​1-3) దేవుణ్ణి సేవించేవారి జీవితాల్లో పరిశుద్ధాత్మ పనిచేస్తుందనే దానికి ఇది అదనపు రుజువునిస్తుంది. మంచికి శక్తివంతమైన ప్రేరణ ఆయన పరిశుద్ధాత్మ, అది ప్రేమనూ సంతోషాన్నీ సమాధానాన్నీ దయనూ మరితర ఆకర్షణీయమైన గుణాలనూ కనబరచేందుకు ఆయన సేవకులకు సహాయం చేస్తుంది. (గలతీయులు 5:​22, 23) ఎంతో కాలం క్రితం ప్రవక్తయైన మలాకీ చెప్పిన మాటలను నేడు మనం స్పష్టంగా గ్రహించగలం. “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు . . . కనుగొందురు.”​—⁠మలాకీ 3:18.

ఆసక్తిగల పనివారిలో దేవుని వాక్యం ప్రబలమౌతోంది

12. సువార్త పని గురించి యెహోవాసాక్షులు ఎలా భావిస్తారు, తమ ప్రకటనా పనికి ఎటువంటి ప్రతిస్పందన వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తారు?

12 నేటి యెహోవాసాక్షులు నిష్క్రియలుగా చర్చికి వెళ్ళేవారు కాదు. వాళ్ళు సువార్తపనిలో చురుకుగా పాల్గొంటారు. తొలి క్రైస్తవుల్లాగే, వాళ్ళు దేవుని చిత్తాన్ని చేసేందుకు తమను తాము సుముఖతతో సమర్పించుకుని, యెహోవా రాజ్య వాగ్దానాలను గురించి ఇతరులు తెలుసుకునేలా సహాయపడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు దేవుని తోటి పనివారు, వాళ్ళు యెహోవా పరిశుద్ధాత్మకు అనుగుణ్యంగా ప్రవర్తిస్తూ యెహోవా సేవ చేసేందుకు ఇతరులను సమకూరుస్తున్నారు. వాళ్ళు అలా చేయడంలో, విశ్వసించని మానవజాతిపై యెహోవా చూపే కరుణను ప్రేమను ప్రతిబింబిస్తారు. ఎంతటి నిర్లిప్తతను, హేళనను, హింసాకాండను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ వాళ్ళు ఆ పనిని కొనసాగిస్తారు. సువార్తకు వచ్చే వివిధ ప్రతిస్పందనల విషయమై యేసు తన అనుచరులను సంసిద్ధులను చేశాడు. “దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కా[డు.] . . . లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీమాట కూడ గైకొందురు” అని ఆయన అన్నాడు.​—⁠యోహాను 15:⁠20.

13. క్రైస్తవమత సామ్రాజ్యంలో కొరవడుతున్న ఏ ప్రత్యేకతలు యెహోవాసాక్షుల్లో విరివిగా కనిపిస్తాయి?

13 నేటి యెహోవాసాక్షులకూ, మొదటి శతాబ్దంలో నిజ క్రైస్తవత్వాన్ని అవలంబించినవారికీ మధ్య ఉన్న పోలికలకు మనం తప్పకుండా ముగ్ధులమౌతాం. అయితే నేటి క్రైస్తవ మత సామ్రాజ్యానికీ యెహోవాసాక్షులకూ మధ్య ఉన్న తేడా కూడా గమనార్హమైనదే. ఒక పండితుడు, సువార్త పనిలో తొలి క్రైస్తవులకు ఉన్నటువంటి ఆసక్తిని గురించి వ్రాసిన తర్వాత, “ప్రస్తుత చర్చి పద్ధతులు మారి, బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుడూ, తాను సువార్త పని చేయడానికి నిబద్ధుడై ఉన్నాడని గుర్తించి, దానికి రుజువుగా, అవిశ్వాసులు గడుపుతున్న మేలైన జీవితం కన్నా నాణ్యమైన జీవన శైలిని అవలంబించే వరకూ, చర్చి చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించే అవకాశం లేదు” అని అంటూ తన బాధను వ్యక్తం చేశారు. క్రైస్తవ మత సామ్రాజ్యంలో ఏ ప్రత్యేకతలు కొరవడ్డాయో, అవి యెహోవాసాక్షుల్లో విరివిగా కనిపిస్తాయి! వాళ్ళలో ఉన్న విశ్వాసం సజీవమైనది, యథార్థమైనది, బైబిలు సత్యంపై ఆధారపడినది. కనుక, వినేవారందరితో తాము దాన్ని పంచుకోవాలని వాళ్ళు ప్రేరేపించబడతారు.​—⁠1 తిమోతి 2:3, 4.

14. యేసు తన పరిచర్యను ఎలా ఎంచాడు, ఆయన శిష్యులు నేడు ఎలాంటి దృక్పథాన్ని కనబరుస్తారు?

14 యేసు తన పరిచర్యను గంభీరంగా తీసుకుని, తన జీవితంలో దానికే ప్రథమ స్థానాన్నిచ్చాడు. “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని” అని ఆయన పిలాతుకు చెప్పాడు. (యోహాను 18:​37) దేవుని ప్రజలు యేసు భావించినట్లే భావిస్తారు. తమ హృదయాల్లో బైబిలు సత్యం ఉంది కనుక, వీలైనంత మందితో దానిని పంచుకునే మార్గాలను కనుగొనడం కోసం వాళ్ళు గట్టిగా కృషి చేస్తారు. ఆ మార్గాల్లో కొన్ని, గమనార్హమైన నేర్పును ప్రతిబింబిస్తాయి.

15. సువార్తను ప్రకటించడంలో కొందరు నేర్పును ఎలా చూపించారు?

15 దక్షిణ అమెరికాలోని ఒక దేశంలో, ప్రజలకు సత్యాన్ని చేరవేసేందుకు అమెజాన్‌ నది యొక్క ఉపనది మీదుగా సాక్షులు ప్రయాణం చేసేవారు. అయితే, 1995 లో అంతఃకలహం చెలరేగినప్పుడు, ఆ నది మీదుగా రాకపోకలు నిషేధించబడ్డాయి. ఆసక్తిగలవారికి బైబిలు ప్రచురణలను సరఫరా చేయడాన్ని కొనసాగించాలన్న దృఢ నిశ్చయంతో, సాక్షులు రాజ్య సందేశాన్ని నీటి ప్రవాహం మీదుగా పంపించాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఉత్తరాలను వ్రాసి, కావలికోట, తేజరిల్లు! పత్రికలతో పాటు ఖాళీ ప్లాస్టిక్‌ సీసాల్లో పెట్టి, వాటిని నదిలోకి విసిరేసేవారు. ఆ నది మీదుగా రాకపోకలు మళ్ళీ మొదలయ్యే వరకు, అంటే దాదాపు నాలుగున్నర సంవత్సరాలపాటు వాళ్ళు అలాగే చేశారు. నదీ తీరంలో ఉన్నవారు అలా తమకు సాహిత్యాలను పంపినందుకు సాక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. బైబిలు విద్యార్థినిగా ఉండిన ఒక మహిళ, వాళ్ళను కౌగలించుకుని, “నేను మిమ్మల్నిక కలవలేనని అనుకున్నాను. అయితే, సీసాల్లో సాహిత్యాలు అందనారంభించినప్పుడు, మీరు నన్ను మర్చిపోలేదని నాకు అర్థమైంది!” అని కన్నీళ్ళతో చెప్పింది. ఆ నదీ తీరంలో ఉన్న ఇతరులు, తాము ఆ పత్రికలను మళ్ళీ మళ్ళీ చదువుకున్నామని చెప్పారు. ఆ నదీ తీరంలో సుడులు ఏర్పడేవి. ఆ సుడులు, ఆ నదీ తీరంలో ఉన్న గ్రామాలకు పోస్టాఫీసుల్లా పని చేశాయి. ఎలాగంటే నీళ్ళపై తేలి వచ్చిన వస్తువులు ఆ సుడులలో కాసేపు ఆగేవి. ఆసక్తిగలవాళ్ళు తరచూ అక్కడికి వచ్చి, ఆ నదీ ప్రవాహం మీద “తపాలా” ఏమైనా వచ్చిందా అని చూసే వారు.

16. మనల్ని మనం అందుబాటులో ఉంచుకోవడం, శిష్యులను తయారు చేసే మార్గాన్ని కొన్ని సార్లు ఎలా తెరుస్తుంది?

16 సువార్త ప్రకటనా పనికి యెహోవా దేవుడూ, శక్తిమంతులైన ఆయన దూతలూ మార్గదర్శనాన్నిస్తూ మద్దతునిస్తున్నారు. (ప్రకటన 14:⁠6) మనల్ని మనం అందుబాటులో ఉంచుకోవడం వల్ల, శిష్యులను తయారు చేసేందుకు అనుకోని అవకాశాలు వస్తుంటాయి. కెన్యాలోని నైరోబీలో, ఇద్దరు క్రైస్తవ స్త్రీలు క్షేత్ర సేవలో తమకు నియమించబడిన ఇండ్లలో ప్రకటించడం పూర్తి చేశారు. అప్పుడు ఒక యువతి అకస్మాత్తుగా వాళ్ళ దగ్గరికి వచ్చి, “మీలాంటి వారెవరైనా కలవాలని నేను రోజూ ప్రార్థిస్తున్నాను” అని చెప్పింది. చర్చించడానికి తన ఇంటికి వెంటనే రావాలని ఆమె వాళ్ళను బ్రతిమాలింది. అలా అదే రోజున ఆమెతో బైబిలు అధ్యయనం మొదలైంది. ఆ యువతి ఆ ఇద్దరు క్రైస్తవుల దగ్గరికి ఎందుకంత అత్యవసరమున్నట్లుగా వచ్చింది? దాదాపు రెండు వారాల క్రితం, వాళ్ళ పాప చనిపోయింది. “మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?” అనే కరపత్రాన్ని ఒక కుర్రవాడు పట్టుకుని తిరగడం ఆమె చూసింది. అది తనకు కావాలని ఆమె చాలా తపించింది. అది తనకివ్వమని ఆ పిల్లవాడ్ని అడిగింది. ఆ అబ్బాయి, అది ఇవ్వలేదు గానీ, తనకు ఆ కరపత్రాన్నిచ్చిన సాక్షులను చూపించాడు. ఆ యువతి త్వరగానే, ఆధ్యాత్మికంగా చక్కని ప్రగతిని సాధించింది, తన బిడ్డను కోల్పోవడంవలన తనకున్న బాధను మరింత మెరుగ్గా అధిగమించనారంభించింది.

దేవుని ప్రేమ తప్పనిసరిగా ప్రబలమవ్వాలి

17-19. విమోచన క్రయధనం ద్వారా యెహోవా మానవజాతికి ఎలాంటి ప్రేమను చూపాడు?

17 భూమి అంతటా దేవుని వాక్యం ప్రవర్ధమానమవ్వడమనేది, యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధన బలితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంది. విమోచన క్రయధనంలాగే, ప్రకటనా పని కూడా అన్నిచోట్ల ఉన్న ప్రజల మీద యెహోవాకున్న ప్రేమకు వ్యక్తీకరణై ఉంది. “దేవుడు లోకమును [మానవజాతిని] ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని వ్రాసేందుకు అపొస్తలుడైన యోహాను ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడు.​—⁠యోహాను 3:16.

18 విమోచన క్రయధనాన్నివ్వడంలో యెహోవా చూపిన ప్రేమను గురించి ఆలోచించండి. ఆయన ‘తన సృష్టికి ఆది’ అయిన తన ప్రియాతిప్రియమైన ఏకైక కుమారునితో అనేక యుగాలుగా సన్నిహిత సంబంధాన్ని ఆనందంగా అనుభవించాడు. (ప్రకటన 3:​14) యేసు తన తండ్రిని చాలా గాఢంగా ప్రేమిస్తాడు, యెహోవా తన కుమారుడ్ని, “జగత్తు పునాది వేయబడకమునుపే” ప్రేమించాడు. (యోహాను 14:​31; 17:​24) మానవులు నిత్యజీవాన్ని పొందడం కోసం, తానెంతో ప్రేమిస్తున్న తన కుమారుడు మరణించేందుకు యెహోవా అనుమతించాడు. మానవజాతి మీద ఆయనకున్న ప్రేమ ఎంత సంభ్రమాశ్చర్యాలు కలిగేంతగా వ్యక్తీకరించబడింది!

19 “లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు” అని యోహాను 3:⁠17 అంటోంది. అంటే, తీర్పు తీర్చేందుకో లేక ఖండించేందుకో కాక, రక్షణ అనే ప్రేమపూర్వక కార్యం మీదే యెహోవా తన కుమారుడ్ని పంపాడు. “[యెహోవా] యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు”న్నాడని పేతురు చెప్పిన మాటలు దీనికి అనుగుణ్యంగా ఉన్నాయి.​—⁠2 పేతురు 3:⁠9.

20. సువార్త ప్రకటన పనికి రక్షణతో ఎలాంటి సంబంధం ఉంది?

20 యెహోవా గొప్ప నష్టాన్ని సహిస్తూ, రక్షణకు నియమబద్ధమైన ఆధారాన్ని ఇచ్చాడు గనుక, ఎంత మందికి వీలైతే అంతమంది దాని నుండి ప్రయోజనం పొందాలనే ఆయన కోరుకుంటున్నాడు. “ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.​—⁠రోమీయులు 10:13, 14.

21. ప్రకటన పనిలో పాల్గొనే అవకాశాన్ని గురించి మనమెలా భావించాలి?

21 భూగోళవ్యాప్తంగా ప్రకటించే బోధించే ఈ పనిలో పాల్గొనడం ఎంత అద్భుతమైన ఆధిక్యత! అది అంత సులభమైన పని కాకపోయినప్పటికీ, తన ప్రజలు నమ్మకంగా సత్యానికి అనుగుణ్యంగా జీవించడాన్నీ, సువార్తను ఇతరులతో పంచుకోవడాన్నీ చూసినప్పుడు యెహోవా ఎంత ఆనందిస్తాడు! కనుక, మీ పరిస్థితులు ఏమైనప్పటికీ, దేవుని ఆత్మా, మీ హృదయంలో ఉన్న ప్రేమా మీరు ఈ పనిలో పాల్గొనేలా మిమ్మల్ని పురికొల్పనివ్వండి. ప్రపంచవ్యాప్తంగా సాధించబడుతున్న కార్యాలను మనం చూస్తున్నాం. అవి, “నీతి నివసించు” మహిమాన్విత ‘క్రొత్త ఆకాశములు క్రొత్త భూమిని’ తీసుకు వస్తానని తాను చేసిన వాగ్దానాన్ని యెహోవా దేవుడు త్వరలోనే నెరవేరుస్తాడనే దానికి ఒప్పించే రుజువులుగా ఉన్నాయని గుర్తుంచుకోండి.​—⁠2 పేతురు 3:13.

మీకు జ్ఞాపకమున్నాయా?

• భ్రష్టత్వం సువార్తను ప్రకటించేవారిని ఎందుకు అణచివేయలేకపోయింది?

• నేడు దేవుని వాక్యం ఎలా ప్రబలమైంది?

• నేడు దేవుని ఆత్మ ఏ యే విధాలుగా పనిచేస్తోంది?

• విమోచన క్రయధనం, సువార్త ప్రకటనతో ఎలా ముడిపడి ఉంది?

[అధ్యయన ప్రశ్నలు]

[16వ పేజీలోని గ్రాఫు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

20వ శతాబ్దంలో రాజ్య ప్రచారకుల సంఖ్యలో పెరుగుదల

ప్రచారకుల సరాసరి సంఖ్య (లక్షల్లో)

60

55

50

45

40

35

30

25

20

15

10

5

1900 1910 1920 1930 1940 1950 1960 1970 1980 1990 2000

[15వ పేజీలోని చిత్రాలు]

జెరోమ్‌

టిండేల్‌

గుటన్‌బర్గ్‌

హస్‌

[చిత్రసౌజన్యం]

గుటన్‌బర్గ్‌, హస్‌: From the book The Story of Liberty, 1878

[15వ పేజీలోని చిత్రం]

1920లలో సువార్తను ప్రకటిస్తున్న బైబిలు విద్యార్థులు

[16, 17వ పేజీలోని చిత్రాలు]

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సువార్తకు ప్రతిస్పందిస్తున్నారు

[18వ పేజీలోని చిత్రం]

దేవుని ప్రేమను యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి ఉన్నతపరచినట్లే ప్రకటనా పని కూడా ఉన్నతపరుస్తుంది