“భిన్నత్వంలో ఏకత్వం”—భారతదేశం
రాజ్య ప్రచారకుల నివేదిక
“భిన్నత్వంలో ఏకత్వం”—భారతదేశం
భారతదేశంలోని జాతీయ ఐక్యతను వర్ణించేందుకు తరచూ ఉపయోగించే నినాదం, “భిన్నత్వంలో ఏకత్వం.” విభిన్న సంస్కృతులూ, మతాలూ, జాతులూ, వేష భాషలూ, ఆహారపుటలవాట్లూ గల పెద్ద దేశంలో ఐక్యత కలిగివుండడమంటే సామాన్యమైన విషయం కాదు. అయితే, భారతదేశంలోని, యెహోవాసాక్షుల కార్యాలయ నిర్వహణలో అలాంటి ఐక్యత కనిపిస్తుంది. అక్కడే నివసిస్తూ పనిచేస్తున్న స్వచ్ఛంద సేవకులు అనేక రాష్ట్రాల నుండీ, కేంద్రపాలిత ప్రాంతాల నుండీ వచ్చినవారైనప్పటికీ, అనేక భాషల వారైనప్పటికీ, వాళ్ళ మధ్య ఐక్యత కనిపిస్తుంది.
• భారతదేశపు వాయవ్య అగ్రమున ఉన్న పంజాబ్ నుండి వచ్చిన రాజ్‌రాణి అనే యువతి విషయమే తీసుకోండి. ఆమె పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు, ఆమె తోటివిద్యార్థినియైన ఒక అమ్మాయి యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి రాజ్‌రాణీకి కూడా బైబిలు మీద ఆసక్తిని కలిగించడానికి ప్రయత్నించింది. తనకు ఇంగ్లీష్ అంతగా రాదు కనుకా, కావలికోట పంజాబీలో లేదు కనుకా, ఇంగ్లీష్ కావలికోటను చదివి, తనకు పంజాబీలో అనువదించి చెప్పమని రాజ్‌రాణీని కోరేది. కావలికోటలో చదివిన విషయాలు రాజ్‌రాణీపై ఎంతో గట్టి ప్రభావాన్ని చూపగా, తన తల్లిదండ్రులు తనను వ్యతిరేకించినప్పటికీ, ఆమె తన జీవితాన్ని యెహోవా దేవునికి సమర్పించుకునేంతగా ప్రగతిని సాధించారు. నేడు ఆమె బేతేలులో సేవచేస్తున్నారు, సత్యం విషయంలో తన కళ్ళను తెరిచిన అదే పనిని చేస్తున్నారు. అంటే, క్రైస్తవ ప్రచురణలను పంజాబీలోకి అనువదిస్తున్నారు.
• బిజో విషయం కూడా తీసుకోండి. ఆయన, భారతదేశపు నైరృతి భాగంలో ఉండే కేరళ నుండి వచ్చారు. జాతీయ కార్యక్రమాలు జరిగే సమయంలో తటస్థంగా ఉన్నందుకు ఆయనను హైస్కూల్ నుండి బహిష్కరించారు. ఆ విషయమై కోర్టులో కేసు పెట్టి, దీర్ఘకాల ప్రయత్నాల తర్వాత అనుకూలమైన తీర్పును పొందడం ద్వారా స్వచ్ఛారాధన విషయమై గమనార్హమైన గెలుపును సాధించడం జరిగింది. ఆ తర్వాత, ఆయన స్కూల్‌కి మళ్ళీ వెళ్ళారు. * ఆయన కాలేజీకి కూడా వెళ్ళారు. అయినప్పటికీ, అక్కడ నెలకొని ఉన్న అనైతిక వాతావరణం ఆయన మనస్సాక్షిని ఎంతో బాధపెట్టడంతో, ఫస్ట్ టర్మ్ తర్వాత కాలేజీని వదిలిపెట్టారు. ఆయన బేతేలు సేవచేయనారంభించి పది సంవత్సరాలయ్యింది. తాను ఉన్నత విద్యాభ్యాసం చేయడం వల్ల పొందగల్గే ప్రయోజనాల కన్నా, వైవిధ్యాలున్నా ఐక్యతగల బేతేలు కుటుంబ సభ్యుడుగా ఉండడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందినట్లు ఆయన భావిస్తున్నారు.
• నోర్మా, లిల్లీ 70 ఏళ్ళు పైబడినవారే. అనేక సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ విధవరాండ్రే. వాళ్ళిద్దరూ పూర్తికాల సేవ మొదలుపెట్టి 40 కన్నా ఎక్కువ సంవత్సరాలైంది. లిల్లీ, దాదాపు 20 సంవత్సరాలుగా, బ్రాంచ్‌లో తమిళ అనువాదకురాలుగా ఉన్నారు. నోర్మా తన భర్త చనిపోయినప్పుడు, అంటే 13 సంవత్సరాల క్రితం బేతేలుకు వచ్చారు. వీళ్ళిద్దరూ శ్రద్ధగా జాగ్రత్తగా పనిచేయడంలో మంచి మాదిరినుంచడమే కాక, బేతేలు కుటుంబ ఐకమత్యంపై మంచి ప్రభావాన్ని చూపుతారు. వాళ్ళు సందర్శకులకు ఆతిధ్యమివ్వడానికి ఇష్టపడతారు. ఎన్నో సంవత్సరాల క్రైస్తవ జీవితంలోని ఆనందాలను పంచుకుంటూ, కుటుంబంలోని యువ సభ్యుల సహవాసాన్ని ఆనందిస్తారు. యౌవనస్థులు కూడా వారిని తమ గదులకు ఆహ్వానించి, వారి సహవాసాన్ని అనుభవిస్తారు, వాళ్ళకు సహాయమవసరమున్నప్పుడు చేయూతనిస్తారు. వీళ్ళిద్దరూ నిజంగా చాలా చక్కని మాదిరులు!
అనేక ప్రాంతాల్లో ఘర్షణలకూ అనైక్యతకూ కారణమయ్యే భేదభావాలను అధిగమించిన ఈ స్వచ్ఛంద సేవకులు, ఇతరులకు సేవ చేసేందుకు భారతదేశంలోని ఐక్య బేతేలు కుటుంబ సభ్యులుగా సంతోషంగా కలిసి పనిచేస్తారు.—కీర్తన 133:1
[అధస్సూచి]
^ పేరా 5 కావలికోట ఆగస్టు 1, 1988, 28వ పేజీ చూడండి.
[8వ పేజీలోని చిత్రసౌజన్యం]
బ్యాక్‌గ్రౌండ్: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.