కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని మీరు అనుకుంటున్నారా?

మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని మీరు అనుకుంటున్నారా?

మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని మీరు అనుకుంటున్నారా?

ఆంటొన్యో చాలా వ్యాకులపడ్డాడు. ఎందుకంటే తనకు ఎంతో సన్నిహిత స్నేహితుడైన లియోనార్డో అకస్మాత్తుగా తనపట్ల ముభావంగా మారడాన్ని ఆయన గమనించాడు. * పలు సందర్భాల్లో ఆంటొన్యో పలకరించినా ఆయన పట్టించుకోలేదు, ఒకర్నొకరు కలుసుకున్నప్పుడు వారి మధ్య ఏదో అవరోధమున్నట్టుగా ఉంటుంది. తన మాటలనో చర్యలనో ఆయన అపార్థం చేసుకున్నాడేమో అని ఆంటొన్యో చింతించడం మొదలుపెట్టాడు. కానీ అసలు జరిగిందేమిటి?

అపార్థాలు సర్వసాధారణం. చాలామటుకు అవి స్వల్పమైనవిగా, సులభంగా సరిచేసుకోగలిగేవిగా ఉంటాయి. మరి కొన్ని అపార్థాలు, ముఖ్యంగా తప్పుడు అభిప్రాయాలు ఏర్పడి వాటిని తొలగించడానికి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమై ఆ అపార్థాలు అలాగే మనసులో ఉండిపోతే, అవి చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. అసలు అపార్థాలు ఎందుకు ఏర్పడతాయి? వ్యక్తుల మీద అవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? మీరు చేసిన దేన్నైనా ఎవరైనా అపార్థం చేసుకుంటే మీరేమి చేయవచ్చు? ఇంతకూ, ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారన్నది మీకంత ప్రాముఖ్యమా?

తప్పించుకోలేని వాస్తవం

మన ఆలోచనలూ ఉద్దేశాలూ ఇతరులు చదవలేరు కాబట్టి, ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మన మాటలనుగానీ చేతలనుగానీ తప్పుగా అర్థం చేసుకుంటారు. అలాంటప్పుడు అపార్థాలేర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు మన ఆలోచనలను అవసరమైనంత స్పష్టంగా ఖచ్చితంగా వ్యక్తం చేయడంలో విఫలమౌతాం. పరిసరాల్లోని శబ్దాలు, అవధానాన్ని భంగపర్చే ఇతర కారణాల వల్ల మనం చెప్పేదాన్ని ఎదుటివారు సరిగా వినలేకపోవచ్చు.

అపార్థం చేసుకోవడానికి కొందరి పద్ధతులు, స్వభావాలు కూడా కారణమవుతాయి. ఉదాహరణకు బిడియస్థుడైన ఒక వ్యక్తి కలివిడితనంలేని వాడనో, ఉదాసీనుడనో లేక గర్విష్ఠి అనో పొరపాటుగా అంచనా వేయబడవచ్చు. గతంలోని వ్యక్తిగత అనుభవాల వల్ల కొన్ని పరిస్థితుల్లో సహేతుకంగా ప్రతిస్పందించడానికి బదులు భావోద్వేగాలకు గురికావచ్చు. అంతేకాక, సంస్కృతిపరమైన భాషాపరమైన తేడాలు కూడా ఉంటాయి గనుక ఇతరులను అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. తప్పుడు సమాచారాలకూ, పుకార్లకూ తోడు మనమన్న మాటలకు లేక చేసిన పనులకు ఆపాదించబడిన అర్థాలు కొన్నిసార్లు అసలు ఉద్దేశానికి భిన్నంగా ఉండడం మనల్ని ఆశ్చర్యపర్చనక్కరలేదు. నిజమే ఇవన్నీ, అపార్థం చేసుకోబడినవారికి నామమాత్రపు ఓదార్పునే ఇస్తాయి.

ఉదాహరణకు, ఆనా తన స్నేహితురాలు లేని సమయంలో ఆమెకున్న మంచిపేరు గురించి నిష్కపటంగా ఓ వ్యాఖ్య చేసింది. ఆనా చేసిన ఆ వ్యాఖ్యకు రెక్కలు వచ్చి, తప్పుడు అర్థంతో ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణించింది. చివరకు ఆమె స్నేహితురాలు, తాను ఫలానా వ్యక్తి ప్రేమను పొందడాన్ని చూసి ఆనా ఓర్వలేక పోతున్నదని కోపంతో ఆమెను నలుగురు ఎదుటా నానా మాటలు అనడంతో ఆనా ఆశ్చర్యాందోళనలకు గురయ్యింది. ఆనా చేసిన వ్యాఖ్య తప్పుగా చేరవేయబడింది, తన స్నేహితురాలికి హాని కలిగించాలనే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని చెప్పడానికి ఆనా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ పరిస్థితి చాలా వేదనకు కారణమైంది, ఆ అపార్థాన్ని పూర్తిగా తొలగించి వారిద్దరి మధ్య పరిస్థితిని తిరిగి మెరుగుపర్చడానికి ఆనాకు చాలాకాలం పట్టింది.

ఇతరులు మీ ఉద్దేశాలను ఏ విధంగా అర్థం చేసుకున్నారన్న దాని మీదనే వాళ్ళు మిమ్మల్ని ఎలా అంచనా వేస్తారన్నది చాలామటుకు ఆధారపడి ఉంటుంది. అందుకే, మీ ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకోబడినప్పుడు మీరు బాధపడడం సహజం. మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి కారణమేమీ లేదని మీకు కోపం కూడా రావచ్చు. మీకు ఆ విమర్శ పక్షపాతంతో కూడినదిగా, ఆక్షేపించేదిగా లేక పూర్తి తప్పుగా అనిపించవచ్చు, మీ మనసును చాలా లోతుగా గాయపర్చవచ్చు. ముఖ్యంగా, సరిగా అంచనా వేయకుండా చెప్పిన అభిప్రాయాలకు మీరు ఎక్కువ విలువిచ్చినప్పుడు అలా జరగవచ్చు.

ప్రజలు మీ గురించి ఏర్పరచుకొన్న అభిప్రాయానికి మీకు బాధనిపించినప్పటికీ, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం సమంజసమైనది. ఇతరుల ఆలోచనలను నిర్లక్ష్యం చేయడం క్రైస్తవ లక్షణం కాదు, మన మాటలు లేక చర్యలు ఇతరులను గాయపరిచే విధంగా ఉండాలని అసలు కోరుకోము. (మత్తయి 7:​12; 1 కొరింథీయులు 8:​12) కాబట్టి ఎవరికైనా మీ గురించి తప్పుడు అభిప్రాయం కలిగితే దాన్ని తొలగించటానికి కొన్నిసార్లు మీరు బాగా శ్రమపడాల్సిరావచ్చు. అయితే అంగీకారాన్ని పొందడానికి అధికంగా చింతించడం దుష్ఫలితాలనిస్తుంది, ఆత్మ గౌరవాన్ని కోల్పోవడానికి దారి తీయవచ్చు లేక తిరస్కరింపబడినట్లు భావించేలా చేయవచ్చు. అయినా మీకున్న నిజమైన విలువ ఇతరులు ఆలోచించే దానిమీద ఆధారపడి ఉండదు కదా.

మరొక ప్రక్కన, మీకు వ్యతిరేకంగా చేయబడిన విమర్శ న్యాయమైనదేనని మీరు గుర్తించవచ్చు. అది కూడా మీకు బాధ కలిగించవచ్చు, కానీ మీరు ఇష్టపూర్వకంగా నిజాయితీతో మీ అపరిపూర్ణతలను ఒప్పుకుంటే, అటువంటి అనుభవాలు, అవసరమైన మార్పులు చేసుకోవడానికి మిమ్మల్ని పురికొల్పుతూ ప్రయోజనకరమైనవిగా ఉండగలవు.

ప్రతికూలమైన పర్యవసానాలు

అపార్థాలు ప్రమాదకరమైన పర్యవసానాలకు దారి తీయనూవచ్చు, తీయకపోనూవచ్చు. ఉదాహరణకు, ఒక హోటల్లో ఒక వ్యక్తి గట్టిగా మాట్లాడుతుండగా మీరు వింటే, ఆయన అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అనో లేదా తన ఘనతను చాటుకునే వ్యక్తి అనో మీరు అనుకోవచ్చు. కానీ మీరనుకున్నది తప్పయ్యే అవకాశముంది ఎందుకంటే ఆ వ్యక్తి మాట్లాడేది కాస్త చెముడున్న వ్యక్తితో అయ్యుండవచ్చు. మరొక ఉదాహరణ, ఒక సేల్స్‌క్లర్కు ముభావంగా ఉందనిపిస్తుండవచ్చు, కాని ఆమెకు ఒంట్లో నలతగా ఉండడం వల్ల ఆమె అలా ఉందేమో. అలాంటి అపార్థాలు ప్రతికూలమైన అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి దారి తీసినప్పటికీ, అవి గంభీరమైన లేక శాశ్వతమైన పర్యవసానాలకు మాత్రం దారితీయవు. అయితే కొన్నిసార్లు ఈ అపార్థాలే గొప్ప విపత్తులను కలిగించగలవు. ప్రాచీన ఇశ్రాయేలు చరిత్రలోని రెండు వృత్తాంతాలను పరిశీలించండి.

అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోయినప్పుడు, అతని స్థానంలో ఏలుతున్న ఆయన కుమారుడైన హానూనును పరామర్శించడానికి దావీదు దూతలను పంపించాడు. అయితే, దూతలు అమ్మోనీయుల దేశాన్ని తరచి చూడడానికి గూఢచారులుగా వచ్చారని తప్పుగా అర్థం చేసుకోవడం, హానూను మొదట ఆ దూతలను అవమానపరచడానికీ తరువాత ఇశ్రాయేలీయులపై యుద్ధం చేయడానికీ దారితీసింది. దాని ఫలితంగా, కనీసం 47,000 మంది చనిపోయారు, ఇదంతా మంచి ఉద్దేశాలను అపార్థం చేసుకోవడం వల్లనే జరిగింది.​—⁠1 దినవృత్తాంతములు 19:​1-19.

ఇశ్రాయేలీయుల చరిత్రలోని తొలి భాగంలో ఏర్పడిన మరొక అపార్థం, పూర్తి భిన్నంగా పరిష్కరించబడింది. రూబేనీయులు గాదీయులు మనష్షే అర్ధ గోత్రపువారు యొర్దాను నది దగ్గర ఎంతో దూరానికి కూడా స్పష్టంగా కన్పించే ఒక బలిపీఠాన్ని కట్టారు. ఇశ్రాయేలీయుల్లోని మిగతా గోత్రాల వారు అది యెహోవా మీద తిరుగుబాటుగా చేసిన ఒక అవిధేయతా చర్య అని భావించారు. వారితో యుద్ధం చేయడానికి సైన్యాన్ని సమకూర్చుకున్నారు. అయితే వారు ఏదైనా తీవ్రమైన చర్య తీసుకోవడానికి ముందే, తాము విశ్వాసరాహిత్యమని భావించిన చర్యపట్ల తమ ఆగ్రహాన్ని తెలపడానికి వారి దగ్గరకు దూతలను పంపించారు. అలా చేయడం మంచిదయ్యింది, బలిపీఠాన్ని కట్టినవారు తమకు సత్యారాధననుంచి తొలగిపోవాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదని జవాబిచ్చారు. దానికి బదులుగా, ఆ బలిపీఠం యెహోవా పట్ల వారి విధేయతకు స్మారక చిహ్నంగా ఉండాలని వారు కోరుకున్నారు. ఈ అపార్థం రక్తపాతానికి దారితీసేదే, కానీ జ్ఞానయుక్తమైన చర్య అటువంటి విపత్కరమైన పర్యవసానాలనుంచి వారిని తప్పించింది.​—⁠యెహోషువ 22:​10-34.

విషయాలను ప్రేమపూర్వకమైన స్ఫూర్తితో స్పష్టపర్చుకోండి

ఈ రెండు వృత్తాంతాలను పోల్చిచూసి మనమొక పాఠాన్ని నేర్చుకోవచ్చు. నిస్సందేహంగా, ఒక విషయాన్ని స్పష్టపరుచుకోవడమనేది తెలివైన పనే. ఇంతకు ముందు చర్చించిన వృత్తాంతంలో, ఇరువైపుల వాళ్ళు కేవలం మాట్లాడుకోవడం మూలంగా ఎన్ని ప్రాణాలు దక్కాయో ఎవరికి తెలుసు? చాలా సందర్భాల్లో, ఇతరుల ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో మీరు విఫలమైతే ప్రాణాపాయాలు ఉండకపోవచ్చు కానీ మీ స్నేహం ప్రమాదంలో పడవచ్చు. అందుకే మీ పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించారని మీకనిపించినప్పుడు, పరిస్థితిని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా, లేక తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? అవతలి వ్యక్తి ఉద్దేశాలేమై ఉన్నాయి? ఆయనను అడిగి తెలుసుకోండి. మిమ్మల్ని అపార్థం చేసుకున్నారనిపించిందా? దాని గురించి మాట్లాడండి. మాట్లాడటానికి అహంభావం అడ్డు వచ్చేందుకు అనుమతించకండి.

అపార్థాలను పరిష్కరించుకోవడానికి యేసు ఈ చక్కని ప్రేరణాత్మకమైన సలహానిచ్చాడు: “కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.” (మత్తయి 5:​23, 24) యుక్తమైన పని ఏమిటంటే, విషయం ఇతరులకు వెల్లడి చేయకుండా ఏకాంతంగా ఆ వ్యక్తిని మీరు కలుసుకోవడమే. తప్పుచేసిన వ్యక్తి మీ అభియోగాన్ని ముందుగా వేరే ఎవరినుంచైనా వింటే సమస్య ఇంకా జటిలం అవుతుంది. (సామెతలు 17:⁠9) ప్రేమపూర్వకమైన స్ఫూర్తితో సమాధానాన్ని ఏర్పర్చుకోవడమే మీ లక్ష్యమై ఉండాలి. స్పష్టంగా, సుళువుగా గ్రహించే పదాలతో, నిందించే పదాలు లేకుండా ప్రశాంతంగా సమస్యను వివరించండి. ఆ పరిస్థితి మీరెలా భావించేలా చేసిందో వివరించండి. తర్వాత అవతలి వ్యక్తి ఉద్దేశాన్ని పక్షపాతం లేకుండా వినండి. తొందరపడి తప్పుడు ఉద్దేశాలను ఆరోపించకండి. అవతలి వ్యక్తికి దురుద్దేశమేమీ లేదని నమ్మకంతో ఉండండి. ప్రేమ “అన్నిటిని నమ్మును” అని గుర్తుంచుకోండి.​—⁠1 కొరింథీయులు 13:⁠7.

నిజమే, అపార్థాలను తేటతెల్లం చేసుకున్నప్పటికీ, బాధకలిగించే భావాలూ ప్రతికూల పర్యవసానాలూ బహుశా ఉండవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైనప్పుడు, మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడంతోపాటు సమస్యను పరిష్కరించుకోవడానికి సహేతుకమైన ఎలాంటి చర్య అయినా తీసుకోవడం సమంజసమైన పని. అయితే ఇలాంటి అన్ని పరిస్థితుల్లోనూ, అన్యాయానికి గురయన వారు ఈ ప్రేరణాత్మకమైన సలహాను పాటించాలి: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”​—⁠కొలొస్సయులు 3:​13, 14; 1 పేతురు 4:⁠8.

మనం అపరిపూర్ణులుగా ఉన్నంత కాలం, అపార్థాలూ బాధకలిగించే భావాలూ ఉంటాయి. ఎవరైనా, భావానుభూతులు లేనట్లనిపించే ఒక పొరపాటు చేయవచ్చు లేక కర్కశంగా మాట్లాడవచ్చు. అదే విషయాన్ని బైబిలిలా సూచిస్తోంది: “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.” (యాకోబు 3:⁠2) ఈ విషయం యెహోవా దేవునికి బాగా తెలుసు కాబట్టే ఆయన మనకీ సూచనలనిచ్చాడు: “ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము. నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసియున్నది గదా.”​—⁠ప్రసంగి 7:⁠9, 21, 22.

“యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు”

ఒకరి మనసులో మీ గురించి ఏర్పడిన చెడు అభిప్రాయాన్ని తొలగించడం అసాధ్యమనిపించినప్పుడు ఏం చేయాలి? ఆశ వదలకండి. మీకు సాధ్యమైనంత వరకు క్రైస్తవ లక్షణాలను అలవర్చుకుని, వాటిని వ్యక్తపరుస్తూ ఉండండి. మీరు అవసరమైన విషయాల్లో మెరుగుపర్చుకునేందుకు యెహోవాను సహాయమడగండి. ఒక వ్యక్తిగా మీ నిజమైన విలువను చివరకు నిర్ణయించేది ఇతరులు కాదు. కేవలం యెహోవా మాత్రమే ఖచ్చితంగా “హృదయములను పరిశీలన చేయువాడు.” (సామెతలు 21:⁠2) యేసు కూడా మనుష్యులచేత తక్కువగా పరిగణించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, కానీ యెహోవా ఆయననెలా పరిగణించాడనేదానిపై అది ఎటువంటి ప్రభావమూ చూపలేదు. (యెషయా 53:⁠3) కొందరు మిమ్మల్ని తప్పుగా అంచనా వేసినప్పటికీ, మీరు యెహోవా సన్నిధిలో “మీ హృదయములు కుమ్మరించుడి,” ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుంటాడని నమ్మకముంచండి ఎందుకంటే, “మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; . . . మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” (కీర్తన 62:⁠8; 1 సమూయేలు 16:⁠7) మీరు మంచి చేయడంలో పట్టుదలతో కొనసాగితే, మీ మీద చెడు అభిప్రాయం ఏర్పరచుకున్నవారు, చివరికి తమ తప్పు తెలుసుకుని వారి అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు.​—⁠గలతీయులు 6:⁠9; 2 తిమోతి 2:⁠15.

ఈ ఆర్టికల్‌ ప్రారంభంలో ప్రస్తావించబడిన ఆంటొన్యో మీకు గుర్తున్నాడా? లేఖనాధార సలహాను పాటించడానికి ఆయన ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు, బాధ కలిగించేలా ఏం చేశానని తన స్నేహితుడు లియోనార్డోను అడిగాడు. దాని ఫలితమేమిటి? లియోనార్డో ఆశ్చర్యచకితుడయ్యాడు. తనను బాధపెట్టేలా ఆంటొన్యో ఏమీ చేయలేదనీ, ఆంటొన్యో పట్ల మరోలా ప్రవర్తించాలన్నది తన ఉద్దేశం కాదనీ నమ్మకం కలిగేలా ఆయన చెప్పాడు. ఒకవేళ తను ముభావంగా ఉన్నట్లు కనిపిస్తే దానికి కారణం బహుశా తానేదో ఆలోచనల్లో ఉండడం కావచ్చుననీ చెప్పాడు. తనకు తెలియకుండానే తన స్నేహితుని మనసు నొప్పించినందుకు లియోనార్డో క్షమాపణలు చెప్పాడు, ఆ విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. భవిష్యత్తులో అలాంటి అభిప్రాయం ఇతరులకు కలుగకుండా జాగ్రత్తగా ఉంటానని కూడా చెప్పాడు. వారి మధ్యనున్న అపార్థం తొలగిపోయింది, తిరిగి ఇద్దరూ ఎప్పటిలాగే సన్నిహిత స్నేహితులైపోయారు.

మనల్నెవరైనా అపార్థం చేసుకోవడం ఎంతమాత్రం సంతోషకరమైన విషయం కాదు. అయినప్పటికీ, సమస్యను పరిష్కరించడానికి వీలైన చర్యలన్నీ మీరు తీసుకుంటే, ప్రేమా క్షమాపణల లేఖన సూత్రాలను అన్వయించుకుంటే, మీరు కూడా అలాగే మంచి ఫలితాలను తప్పకుండా పొందుతారు.

[అధస్సూచి]

^ పేరా 1 ఈ ఆర్టికల్‌లోని కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[23వ పేజీలోని చిత్రాలు]

విషయాలను ప్రేమా క్షమాపణల స్ఫూర్తితో స్పష్టపర్చుకుంటే సంతోషకరమైన ఫలితాలు లభిస్తాయి