కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మేమొక జట్టుగా ఉండేవాళ్ళం

మేమొక జట్టుగా ఉండేవాళ్ళం

జీవిత కథ

మేమొక జట్టుగా ఉండేవాళ్ళం

మెల్బా బ్యారీ చెప్పినది

మా పెళ్ళయ్యాక 57 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు హాజరైనట్లే, 1999 జూలై 2న కూడా నేనూ, నా భర్త లాయిడ్‌, యెహోవాసాక్షుల ఒక పెద్ద సమావేశానికి హాజరయ్యాం. లాయిడ్‌, జిల్లా సమావేశంలో శుక్రవారం రోజు చివరి ప్రసంగం ఇస్తూ, హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఆయనను స్పృహలోనికి తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది, ఆయన చనిపోయారు. *

ఆ విషాద పరిస్థితిని తట్టుకోవడానికి నా చుట్టూ గుంపుగాచేరి సహాయం చేసిన హవాయిలోని ఆ క్రైస్తవ సహోదర సహోదరీలు నాకు ఎంత ప్రియమైనవారో! వారిలోని అనేకమంది జీవితాలతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది జీవితాలను లాయిడ్‌ ప్రభావితం చేశారు.

ఆయన చనిపోయి దాదాపు రెండు సంవత్సరాలవుతున్నప్పటికీ విదేశాల్లో మిషనరీలుగానూ, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోనున్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలోనూ మేమిద్దరము కలిసి పనిచేసిన అమూల్యమైన గత సంవత్సరాలను అనేకసార్లు మననం చేసుకున్నాను. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గడిపిన నా బాల్యజీవితాన్నీ, రెండవ ప్రపంచ యుద్ధపు తొలి కాలంలో లాయిడ్‌ నేనూ పెళ్ళి చేసుకోవడానికి ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. అయితే, ముందు నేను ఎలా యెహోవాసాక్షినయ్యానో, 1939 లో లాయిడ్‌ను ఎలా కలుసుకున్నానో నన్ను చెప్పనీయండి.

నేనొక యెహోవాసాక్షి అయిన విధానం

జేమ్స్‌, హెన్రియెట్టా జోన్స్‌ ప్రేమా శ్రద్ధలు చూపించే నా తల్లిదండ్రులు. 1932 లో నేను స్కూలు విద్య ముగించేసరికి నాకు కేవలం 14 ఏళ్ళు. ప్రపంచమంతటా అప్పుడు గొప్ప ఆర్థిక మాంద్యం ఏర్పడివుంది. ఇద్దరు చెల్లెళ్ళున్న మా కుటుంబానికి చేయూతనివ్వడానికి నేను పని చేయడం ప్రారంభించాను. కొన్ని సంవత్సరాల్లోనే నాకు మంచి జీతంతోపాటు అక్కడ పనిచేసే కొందరు యువతులపై పర్యవేక్షణా బాధ్యతలు కూడా లభించాయి.

అదే సమయంలో అంటే 1935 లో, అమ్మ ఒక యెహోవాసాక్షి నుంచి బైబిలు సాహిత్యాలను తీసుకుంది, త్వరలోనే తాను సత్యాన్ని కనుగొన్నానని ఆమె గ్రహించింది. మిగతా కుటుంబ సభ్యులందరం ఆమెకు పిచ్చి పట్టిందా అన్నట్టు చూశాం. అయితే ఒకరోజు, చనిపోయిన వారు ఎక్కడున్నారు? (ఆంగ్లం) అనే పేరుగల ఒక బుక్‌లెట్‌ను నేను చూశాను, ఆ పుస్తకం పేరు నాలో ఆసక్తిని రేకెత్తించింది. దాన్ని నేను రహస్యంగా చదివాను. అదే నా జీవితంలో ఒక మలుపు. వెంటనే, వారం మధ్యలో జరిగే మాదిరి అధ్యయనం అని పిలవబడే కూటానికి అమ్మతోపాటు నేనూ వెళ్ళడం ప్రారంభించాను. మాదిరి అధ్యయనం (ఆంగ్లం) అనే పేరుగల ఆ బుక్‌లెట్‌లో ప్రశ్నలూ జవాబులతోపాటు, జవాబులకు ఆధారంగా లేఖనాలు ఉంటాయి. అలాంటి మూడు బుక్‌లెట్ల ఆధారంగా ఆ అధ్యయనం జరుగుతుండేది.

1938 ఏప్రిల్‌ నెలలో, యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంనుంచి ప్రతినిధిగా జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌ సిడ్నీకి వచ్చారు. నేను విన్న మొట్ట మొదటి బహిరంగ ప్రసంగం ఆయనదే. సిడ్నీ టౌన్‌ హాల్లో ఇవ్వాల్సిన ఆ ప్రసంగం వ్యతిరేకులు ఆటంకపర్చినందువల్ల అంతకంటే ఎంతో పెద్దదయిన సిడ్నీ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌లో ఇవ్వడం జరిగింది. వ్యతిరేకతవల్ల జరిగిన అదనపు పబ్లిసిటీ కారణంగా ఆశ్చర్యంగొలిపేలా ఆ ప్రసంగానికి దాదాపు 10,000 మంది హాజరయ్యారు, ఆ సమయంలో ఆస్ట్రేలియాలో ఉండిన కేవలం 1,300 మంది సాక్షులతో పోలిస్తే అది నిజంగా చాలాపెద్ద సంఖ్యే.

తర్వాత కొద్దికాలానికే, ఎటువంటి శిక్షణ లేకుండానే నేను మొదటిసారిగా పరిచర్యలో పాల్గొన్నాను. మా గ్రూపు పరిచర్య ప్రాంతానికి చేరుకోగానే, నాయకత్వం వహిస్తున్న సహోదరుడు “అదిగో ఆ ఇల్లు మీరు చేయండి” అని చెప్పాడు. నేనెంత కంగారు పడిపోయానంటే, ఆ ఇంటావిడ తలుపు తీయగానే “దయచేసి టైమెంతయిందో చెబుతారా?” అని అడిగాను. ఆమె లోపలికి వెళ్ళింది, టైం చూసి తిరిగి వచ్చి నాకు చెప్పింది. అంతే! నేను కారు దగ్గరకు తిరిగి వచ్చేశాను.

అయితే, నేను అంతటితో విడిచిపెట్టానని కాదు, త్వరలోనే నేను రాజ్య సందేశాన్ని ఇతరులతో క్రమంగా పంచుకోవడం మొదలెట్టాను. (మత్తయి 24:​14) యెహోవాకు నేను చేసుకున్న సమర్పణకు సూచనగా, 1939 మార్చి నెలలో, మా పక్కింటివారైన డొరొతి హచింగ్స్‌ వాళ్ళ స్నానపు తొట్టిలో నేను బాప్తిస్మం పొందాను. అప్పుడు సహోదరులు అందుబాటులో లేరు కాబట్టి సాధారణంగా క్రైస్తవ సహోదరులు నిర్వహించే సంఘ బాధ్యతలను నేను బాప్తిస్మం తీసుకున్న వెంటనే నాకప్పగించారు.

సాధారణంగా మేము మా కూటాలను ఇండ్లలోనే జరుపుకునే వాళ్ళం, కానీ బహిరంగ ప్రసంగాల కోసం కొన్నిసార్లు హాలు అద్దెకు తీసుకునే వాళ్ళం. ఒకసారి మా బ్రాంచి కార్యాలయమైన బేతేలునుంచి ఒక అందమైన సహోదరుడు ప్రసంగమివ్వడానికి మా చిన్ని సంఘానికి వచ్చారు. నా గురించి తెలుసుకోవాలన్నది ఆయన అక్కడికి రావడానికి గల మరో కారణమని నాకు అప్పుడు తెలియదు. అవును, ఆ విధంగా నేను లాయిడ్‌ను కలుసుకోవడం జరిగింది.

లాయిడ్‌ కుటుంబాన్ని కలుసుకోవడం

త్వరలోనే, పూర్తికాలం యెహోవా సేవ చేయాలనే కోరిక నాకు కలిగింది. అయితే, నేను పయినీరు సేవ (పూర్తికాల ప్రకటనా పని) చేయడానికి దరఖాస్తు పూరించినప్పుడు, నీకు బేతేలులో సేవ చేయడమిష్టమేనా అని నన్నడిగారు. అలా రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయిన 1939 సెప్టెంబరు నెలలో నేను సిడ్నీ నగరప్రాంతమైన స్ట్రత్‌ఫీల్డ్‌లోనున్న బేతేలు కుటుంబంలో సభ్యురాల్నయ్యాను.

డిసెంబరు నెల, 1939 లో, నేను న్యూజీలాండ్‌లో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు ప్రయాణమయ్యాను. లాయిడ్‌ న్యూజీలాండ్‌ వాస్తవ్యుడు కాబట్టి ఆయన కూడా అక్కడికే వెళ్తున్నాడు. మేమిద్దరం ఒకే ఓడలో ప్రయాణం చేశాం, ఒకర్నొకరం బాగా తెలుసుకోవడానికి వీలు కలిగింది. నేను వెల్లింగ్టన్‌లోని సమావేశంలో, వాళ్ళ అమ్మా నాన్నలనూ ఇద్దరు చెల్లెళ్ళనూ కలుసుకునేందుకూ, ఆ తర్వాత క్రైస్ట్‌చర్చ్‌లోనున్న వాళ్ళింటికి వెళ్ళడానికీ లాయిడ్‌ ఏర్పాట్లు చేశారు.

మా పనిని నిషేధించడం

జనవరి 18, 1941 శనివారంరోజు దాదాపు అర డజను నల్లని లిమొజీన్‌ కార్లలో కామన్‌వెల్త్‌ అధికారులు బ్రాంచ్‌ కార్యాలయానికి స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. బేతేలు ముఖద్వారం దగ్గరనున్న చిన్న గార్డ్‌రూములో నేను పని చేస్తున్నాను కాబట్టి వాళ్ళను నేనే ముందు చూశాను. సుమారు 18 గంటల ముందే ఆ నిషేధం గురించి బేతేలులో తెలిసింది, మేము వెంటనే ఇంచుమించు సాహిత్యాలన్నింటినీ, ఫైళ్ళనూ కార్యాలయంనుంచి ఖాళీ చేసేశాం. దాని తర్వాతి వారం, లాయిడ్‌తోపాటు అయిదుగురు బేతేలు కుటుంబ సభ్యులను జైల్లో వేశారు.

జైల్లో ఉన్న సహోదరులకు ఎక్కువ అవసరమయ్యేది ఆధ్యాత్మికాహారమేనని నాకు తెలుసు. లాయిడ్‌కు ధైర్యమిస్తూ “ప్రేమ లేఖలు” వ్రాయాలని నేను నిర్ణయించుకున్నాను. అలాంటి లేఖలను ఎలా వ్రాస్తారో అలాగే ప్రారంభించేదాన్ని, కాని తర్వాత కావలికోట నుంచి మొత్తం ఆర్టికల్‌లన్నింటినీ కాపీ చేసి ఆఖరున నిన్ను ప్రేమించే వ్యక్తి అని సంతకం చేసి పంపించేదాన్ని. నాలుగున్నర నెలల తర్వాత లాయిడ్‌ విడుదల చేయబడ్డారు.

వివాహం, పూర్తికాలసేవలో కొనసాగడం

లాయిడ్‌ వాళ్ళ అమ్మ 1940 లో ఆస్ట్రేలియాకు వచ్చింది, మేము పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నామని లాయిడ్‌ ఆమెతో చెప్పారు. ఈ లోక విధానం ముగింపు చాలా దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తోంది కాబట్టి ఆమె పెళ్ళి చేసుకోవద్దని సలహా ఇచ్చింది. (మత్తయి 24:​3-14) ఆయన తన ఉద్దేశాలను తన స్నేహితులతో కూడా చెప్పారు, కాని అలా చెప్పిన ప్రతిసారీ వాళ్ళు పెళ్ళి చేసుకోవద్దనే ఆయనకు చెప్పేవారు. చివరికి, 1942 ఫిబ్రవరిలో ఒకరోజు లాయిడ్‌ నన్నూ, ఎవరికీ చెప్పకూడదని మాట తీసుకుని మరో నలుగురు యెహోవాసాక్షులనూ రిజిష్టర్‌ ఆఫీసుకు రహస్యంగా తీసుకువెళ్ళారు, అక్కడే మేము రిజిస్టర్‌ వివాహం చేసుకున్నాం. అప్పట్లో ఆస్ట్రేలియాలో యెహోవాసాక్షులకు వివాహాలు చేయడానికి ప్రభుత్వ అనుమతి ఉన్న సహోదరులెవ్వరూ లేరు.

వివాహిత జంటగా మేము బేతేలు సేవలో కొనసాగడానికి అనుమతించకపోయినప్పటికీ, ప్రత్యేక పయినీరు సేవ చేస్తారా అని మమ్మల్ని అడిగారు. అందుకు మేము ఆనందంగా ఒప్పుకోగానే, వగ్గా వగ్గా అనే పేరుగల పట్టణంలో నియమించబడ్డాం. మన ప్రకటనా పని ఇంకా నిషేధంలో ఉంది, మాకు ఆర్థికంగా ఎటువంటి సహాయమూ లేదు, మేము నిజంగా మా భారాన్ని యెహోవామీద మోపాల్సి వచ్చింది.​—⁠కీర్తన 55:​22.

మేము టాండెమ్‌ సైకిల్‌ (ఒకే సైకిలు మీద ఇద్దరూ ఒకరి వెనుక ఒకరు కూర్చుని, ఇద్దరూ తొక్కడానికి వీలయ్యే విధంగా రెండు సీట్లుండే సైకిల్‌) మీద గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళాం, అక్కడ మేము చాలా చక్కని ప్రజల్ని కలుసుకుని చాలాసేపు వాళ్ళతో మాట్లాడాం. బైబిలు అధ్యయనం చేయడానికి ఎక్కువమంది అంగీకరించలేదు. అయినప్పటికీ, ఒక స్టోర్‌ కీపర్‌ మేము చేసే పనిని ఎంతో విలువైనదిగా యెంచి, ప్రతివారం మాకు పళ్ళనూ, కూరగాయలనూ అందజేసేవాడు. మేము వగ్గా వగ్గాలో ఆరు నెలలు గడిపిన తర్వాత బేతేలుకు రమ్మని పిలుపునందుకున్నాం.

బేతేలు కుటుంబం, 1942 మే నెలలో స్ట్రత్‌ఫీల్డ్‌ కార్యాలయం నుంచి ఖాళీచేయబడి స్వంత ఇండ్లలోకి మారింది. తమ ఆచూకీ తెలియకుండా ఉండాలని ప్రతి రెండు వారాలకు ఒక్కో ఇంట్లోకి మారేవాళ్ళు. ఆగస్టులో నేనూ లాయిడ్‌ బేతేలుకు తిరిగి వెళ్ళినప్పుడు అలాంటి ఒక ఇంట్లోనే మేము వాళ్ళతో పాటు చేరాము. అండర్‌గ్రౌండులో స్థాపించబడిన ముద్రణా కార్యాలయాల్లోని ఒక దాంట్లో పగటిపూట పనిచేయడం మా నియామకం. చివరికి 1943 జూన్‌లో నిషేధం ఎత్తివేయబడింది.

విదేశాల్లో మిషనరీ సేవకు సిద్ధపాటు

అమెరికాలోని న్యూయార్క్‌నందున్న సౌత్‌ లాన్సింగ్‌లోనున్న వాచ్‌టవర్‌ బైబిలు గిలియడ్‌ పాఠశాలలో చేరడానికి 1947 ఏప్రిల్‌ నెలలో మేము దరఖాస్తులిచ్చాము. ఈ లోగా ఆస్ట్రేలియాలోని సంఘాలను ఆధ్యాత్మికంగా బలపర్చడానికి వారిని సందర్శించే నియామకం మాకివ్వబడింది. కొన్ని నెలల తర్వాత గిలియడ్‌ స్కూలు 11వ తరగతికి హాజరుకమ్మంటున్న ఆహ్వానాన్ని మేము అందుకున్నాం. అందుకవసరమైన పనులు పూర్తిచేసుకోవడానికీ, మా సామాన్లు సర్దుకోవడానికీ మూడు వారాలు పట్టాయి. మా కుటుంబాన్నీ, స్నేహితులనూ వదిలిపెట్టి 1947 డిసెంబరులో మేము న్యూయార్క్‌కు బయల్దేరాం. ఆస్ట్రేలియా నుంచి అదే తరగతికి ఆహ్వానించబడ్డ మరో 15 మంది కూడా మాతో వచ్చారు.

గిలియడ్‌ స్కూల్లో కొన్ని నెలలు చాలా తొందరగా గడిచిపోయాయి, మాకు జపానులో మిషనరీ నియామకం ఇవ్వబడింది. జపానుకు వెళ్ళడానికి కావలసిన పేపర్లు సిద్ధం చేయడానికి సమయం పడుతుంది కాబట్టి, ఈలోగా లాయిడ్‌ మరొకసారి యెహోవాసాక్షుల ప్రయాణ పైవిచారణకర్తగా నియమించబడ్డారు. మేము సందర్శించాలని నియమించబడ్డ సంఘాలు లాస్‌ ఏంజెల్స్‌ నగరం నుంచి దిగువకు మెక్సికన్‌ సరిహద్దుల వరకు ఉన్నాయి. మాకు కారు లేదు కాబట్టి అక్కడి సాక్షులు ప్రేమతో మమ్మల్ని ప్రతివారం ఒక సంఘం నుంచి మరో సంఘానికి దిగబెట్టేవారు. అప్పుడు మేము పూర్తి చేసిన ఆ విస్తారమైన ప్రాంతం, ఇప్పుడు మూడు ఇంగ్లీష్‌, మూడు స్పానిష్‌ జిల్లాలుగా విభజించబడింది, ఒక్కో జిల్లాలో పది సర్క్యూట్‌లు ఉన్నాయి.

అక్టోబరునెల, 1949 లో, సైనికులను చేరవేయడానికి ఉపయోగించే ఒక ఓడలో మేము జపాన్‌కు బయలుదేరాం. ఆ ఓడలో ఒక ప్రక్క మగవాళ్ళకూ, మరొక ప్రక్క ఆడవాళ్ళకూ పిల్లలకూ కేటాయించారు. యొకొహామ నగరానికి చేరుకోవడానికి ఇంకా ఒకరోజు ఉందనగా హఠాత్తుగా తుపాను చెలరేగింది. ఆ తర్వాత మేఘాలన్నీ తేలిపోయాయి, మరుసటిరోజు అక్టోబరు 31వ తేదీన సూర్యోదయమయ్యేసరికి మా ఎదుట ఫ్యూజీ పర్వతం ఠీవిగా విరాజిల్లుతూ కనబడింది. మా కొత్త నియామకానికి అది ఎంత గొప్ప స్వాగతమో కదా!

జపనీయులతో కలిసి పనిచేయడం

మేము ఓడరేవుకు చేరుకునే సరికి అక్కడ నల్లని జుట్టుగల వందలకొలది జనం కనిపించారు. విపరీతమైన రణగొణ ధ్వని వినిపించగానే అదేదో పళ్ళాలు క్రింద పడ్డ శబ్దంలా అనిపించి, ‘ఏమిటింత గందరగోళం మనుషులు!’ అనుకున్నాం. ప్రతి ఒక్కరూ కొయ్య చెప్పులు వేసుకుంటారు, వాళ్లు చెక్కతో నిర్మించబడిన రేవు మీద నడుస్తుంటే టకటకమని పెద్ద శబ్దం వస్తుంది. యొకొహామలో ఒకరాత్రి గడిపిన తర్వాత, మా మిషనరీ నియామకమైన కోబే నగరానికి రైల్లో వెళ్ళాం. మాకన్నా కొన్ని నెలల ముందు అక్కడికి చేరుకున్న మాతోటి గిలియడ్‌ విద్యార్థి డాన్‌ హస్లెట్‌ ఒక మిషనరీ హోమ్‌ను అద్దెకు తీసుకుని ఉన్నారు. రెండంతస్థులు గల వెస్టర్న్‌ స్టైల్లో ఉన్న అందమైన పెద్ద బంగళా అది, అయితే దాంట్లో ఫర్నీచర్‌ ఏమీ లేదు.

ఇంటి చుట్టూ ఉన్న పొడవైన గడ్డి కోసుకువచ్చి నేలమీద పరుపులాగ పరుచుకుని పడుకున్నాము. మా స్వంత సామాను కొంత తప్ప ఇంకేమీ లేకుండా మా మిషనరీ జీవితం ప్రారంభమైంది. వెచ్చదనానికీ, వంట చేసుకోవడానికీ మేము హిబాచి అని పిలువబడే చిన్న బొగ్గు పొయ్యిలను సంపాదించాం. ఒకరాత్రి, పర్సీ, ఇల్మ ఇస్లబ్‌ అనే ఇద్దరు మిషనరీలు పొగవల్ల స్పృహ తప్పి పడిపోయి ఉండడం లాయిడ్‌ చూశారు. కాస్త చల్లని తాజాగాలి రావడానికి కిటికీలు తెరవడం ద్వారా లాయిడ్‌ వారికి ఉపశమనం కలిగేలా చేయగలిగారు. బొగ్గు పొయ్యి మీద వంటచేస్తూ నేనుకూడా ఒకసారి స్పృహ తప్పిపోయాను. కొన్నింటికి అలవాటు పడడానికి కాస్త సమయం పట్టింది.

భాష నేర్చుకోవడానికి చాలా ప్రాధాన్యతనిచ్చాము, మేము ఒక నెలపాటు, రోజుకు 11 గంటల చొప్పున జపనీస్‌ భాషను నేర్చుకున్నాం. ఆ తర్వాత, మొదలు పెట్టడానికి సహాయకరంగా ఉంటుందని మేము ఒకటి రెండు వాక్యాలు రాసుకుని పరిచర్యకు బయలుదేరాము. మొదటిరోజే, మియో టకాగి అనే ఒక చక్కని స్త్రీని నేను కలిశాను, ఆమె నన్ను ఆదరంతో ఆహ్వానించింది. ఒక మంచి బైబిలు అధ్యయనం వృద్ధి అయ్యేంతవరకు, పునర్దర్శనాల్లో జపనీస్‌-ఇంగ్లీష్‌ డిక్షనరీలతో మేము కుస్తీపట్లు పట్టాం. 1999 లో జపానులో విస్తరింపజేయబడిన బ్రాంచి కార్యాలయ డెడికేషన్‌కు హాజరైనప్పుడు, మియోనూ, నేను అధ్యయనం చేసిన ఇతర ప్రియమైనవారినీ మళ్ళీ చూశాను. యాభై సంవత్సరాలు గడిచాయి, కానీ వాళ్ళు ఇప్పటికీ ఆసక్తి గల రాజ్య ప్రచారకులే, యెహోవా సేవలో చేయగలిగినంత చేస్తున్నారు.

కోబేలో 1950 ఏప్రిల్‌ 1న క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దిన ఆచరణకు 180 మంది హాజరయ్యారు. మాకు ఆశ్చర్యం కలిగేలా, మరుసటి రోజు ఉదయం 35 మంది ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనడానికి వచ్చారు. ఒక్కో మిషనరీ ముగ్గురు లేక నలుగురు కొత్తవాళ్ళను తమవెంట పరిచర్యకు తీసుకువెళ్ళారు. గృహస్థులు జపాను భాష సరిగారాని నాతో మాట్లాడలేదు గానీ జ్ఞాపకార్థ దినానికి హాజరై నాతో వచ్చిన జపనీయులతో మాట్లాడారు. వాళ్ళతో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి, నాకైతే వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఎంతమాత్రం అర్థం కాలేదు. ఆ క్రొత్త వారిలో కొందరు జ్ఞానాభివృద్ధి పొంది ఈ రోజు వరకూ ప్రకటనా పనిని కొనసాగిస్తున్నారని చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది.

అనేక ఆధిక్యతలూ, నియామకాలూ

లాయిడ్‌కు 1952 లో టోక్యో బ్రాంచి కార్యాలయపు పర్యవేక్షణా బాధ్యతలను అప్పగించేంత వరకు, మేము కోబేలో మా మిషనరీ సేవను కొనసాగించాం. కాలక్రమేణా ఆయన నియామకాలు మేము జపానంతటినీ ఇతర దేశాలనూ తిరిగేలా చేశాయి. తర్వాత ప్రపంచ ప్రధాన కార్యాలయం నుంచి నేథన్‌ హెచ్‌. నార్‌ ఒకసారి టోక్యోకు వచ్చినప్పుడు, నాతో ఇలా అన్నారు: “అవును గానీ, మీ భర్త తదుపరి జోన్‌ ట్రిప్‌కు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా? ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లకు వెళ్తున్నారు, మీ ఖర్చులు మీరు భరించేటట్లయితే మీరు కూడా వెళ్ళవచ్చు.” ఎంత ఆనందకరమైన విషయం! ఎంతైనా మేము ఇల్లు వదిలి తొమ్మిది సంవత్సరాలు దాటాయి.

వెంటనే మా కుటుంబాలకు ఉత్తరాలు వ్రాశాం. నా టికెట్టు కోసం మా అమ్మ నాకు సహాయం చేసింది. నేనూ లాయిడ్‌ ఇన్నాళ్ళూ మా నియామకాల్లో చాలా బిజీగా ఉండిపోయాం, మా కుటుంబాలను చూసిరావడానికి సరిపడేంత డబ్బుకూడా లేని మాకు, ఇది నా ప్రార్థనలకు జవాబుగానే అనిపించింది. మా అమ్మ నన్ను చూసి ఎంత ఆనందించిందో మీరు ఊహించవచ్చు. “మూడు సంవత్సరాల్లో నీవు మళ్ళీ రావడానికి నేను టికెట్టు డబ్బులు కూడబెడతాను” అని అమ్మ అంది. అది మనసులో పెట్టుకుని మేము అక్కడినుంచి విడిపోయాం, కానీ విషాదకరంగా తర్వాతి జూలై నెలలోనే ఆమె చనిపోయింది. నూతన లోకంలో అమ్మను తిరిగి కలుసుకుంటానని నా నిరీక్షణ, నిజంగా అది ఎంత అద్భుతమైన కలయికై ఉంటుందో కదా!

నేను 1960 వరకు కేవలం మిషనరీ సేవ మాత్రమే చేస్తున్నాను, ఆ సంవత్సరంలోనే నాకు ఒక ఉత్తరం వచ్చింది, అందులో “బేతేలు కుటుంబమంతటి బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసే బాధ్యత ఈ రోజు నుంచి మీదే” అని ఉంది. అప్పుడు మా బేతేలు కుటుంబంలో ఉన్నది దాదాపు పన్నెండు మంది మాత్రమే కాబట్టి నేను మిషనరీ నియామకంతోపాటు ఆ పని కూడా చేయగలిగాను.

మేముండే జపాను పద్ధతిలోనున్న ఇంటిని 1962 లో కూలగొట్టించి, తర్వాతి సంవత్సరం అక్కడే ఒక క్రొత్త ఆరంతస్థుల బేతేలు హోమ్‌ను నిర్మించారు. క్రొత్తగా వచ్చిన యువ సహోదరులకు, వాళ్ళ గదులను వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడంలో వారికి సహాయం చేయడానికి నేను నియమించబడ్డాను. సాంప్రదాయం ప్రకారం, జపానులో అబ్బాయిలకు ఇంటి పనులేవీ నేర్పించరు. లౌకిక విద్యాభ్యాసానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, వాళ్ళకు వాళ్ళ అమ్మలే అన్ని పనులూ చేసిపెట్టేవారు. నేను వాళ్ళమ్మల్లా అన్ని పనులూ చేయనని త్వరలోనే వాళ్లు గ్రహించారు. కొద్దికాలంలోనే, సంస్థలో బాధ్యతాయుతమైన క్రొత్త నియామకాలను చేపట్టగలిగేలా వాళ్ళలో అనేకులు అభివృద్ధి సాధించారు.

ఎండాకాలంలో చాలా వేడిగా ఉన్న ఒకరోజు, బ్రాంచి సౌకర్యాలను చూడ్డానికి ఒక బైబిలు విద్యార్థిని వచ్చింది. నేను స్నానాల గదులను రుద్దుతూ కడగడం చూసి “దయచేసి మీ మేనేజరు ఎవరో చెప్పండి, నేను మీకు బదులుగా పని చేయడానికి ఒక పనిమనిషి ఖర్చులు ఇస్తాను” అని ఆమె అంది. ఆమె దయాపూర్వకమైన ఆలోచనకు కృతజ్ఞతలు తెలుపుతూ, యెహోవా సంస్థలో ఏ పనైనా నేను చేయడానికి చాలా ఇష్టపడుతున్నాను అని ఆమెకు వివరించాను.

ఆ సమయంలో, నేనూ లాయిడ్‌ 39వ గిలియడ్‌ తరగతికి హాజరుకమ్మంటున్న ఒక ఆహ్వానాన్ని అందుకున్నాం. నా 46వ యేట, 1964 లో మళ్ళీ స్కూలుకు వెళ్ళడం ఎంత గొప్ప ఆధిక్యతో! ఆ కోర్సు ప్రత్యేకంగా బ్రాంచి కార్యాలయాల్లో సేవ చేసేవారికి, వారి బాధ్యతల్ని నెరవేర్చడానికి సహాయపడేలా రూపొందించబడింది. పది నెలల కోర్సు తర్వాత, మమ్మల్ని మళ్ళీ జపానులో సేవచేయడానికి నియమించారు. అప్పటికి ఆ దేశంలో 3,000 మంది రాజ్య ప్రచారకులున్నారు.

అభివృద్ధి ఎంత వేగంగా జరిగిందంటే, 1972 నాటికి 14,000 కంటే ఎక్కువమంది సాక్షులున్నారు, టోక్యోకు దక్షిణాన నూమాజులో అయిదంతస్థుల ఒక క్రొత్త బ్రాంచి కార్యాలయం కూడా కట్టబడింది. మా బిల్డింగుల్లోనుంచి, ఫ్యూజి పర్వతం చాలా అద్భుతంగా కనబడుతుంది. క్రొత్త రోటరీ ప్రింటింగ్‌ ప్రెస్‌తో నెలకు 10 లక్షలకు పైగా జపాను భాషా పత్రికలను ముద్రించడం ప్రారంభించారు. కానీ దగ్గరలోనే మాకోసం ఒక మార్పు ఎదురు చూస్తోంది.

బ్రూక్లిన్‌లోనున్న యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయం నుంచి పరిపాలక సభలో సేవ చేయడానికి ఆహ్వానిస్తున్న ఒక ఉత్తరాన్ని, 1974 చివరిలో లాయిడ్‌ అందుకున్నారు. మొదట నేనిలా ఆలోచించాను: ‘మేము కలిసి జీవించడానికి ఇదే ముగింపు కావచ్చు. లాయిడ్‌కు పరలోక నిరీక్షణా నాకు భూ నిరీక్షణా ఉన్నాయి కాబట్టి, ఎప్పుడో ఒకప్పుడు మేము విడిపోవాల్సిందే. బహుశా లాయిడ్‌ ఒక్కరే బ్రూక్లిన్‌కు వెళ్లాలేమో.’ కానీ త్వరలోనే నేను నా ఆలోచనలను సరిదిద్దుకుని 1975 మార్చిలో లాయిడ్‌తో ఇష్టపూర్వకంగా వెళ్ళాను.

ప్రధాన కార్యాలయంలో ఆశీర్వాదాలు

బ్రూక్లిన్‌ వెళ్ళిన తర్వాత కూడా లాయిడ్‌ మనసు జపాను క్షేత్రంపైనే ఉండేది, అక్కడ మేము పొందిన అనుభవాల గురించే ఎప్పుడూ మాట్లాడుతుండేవారు. కాని ఇప్పుడు మరింత ఎక్కువమందితో పరిచయం ఏర్పర్చుకోవడానికి అవకాశాలున్నాయి. లాయిడ్‌ తన జీవితంలోని గత 24 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేయాల్సి వచ్చే జోన్‌ వర్క్‌లో ఎక్కువగా పనిచేశారు. నేను ఆయనతో పాటు పలుమార్లు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేశాను.

ఇతర దేశాల్లో ఉన్న మన క్రైస్తవ సహోదరులను కలుసుకోవడం, అనేకమంది ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో, పనిచేస్తున్నారో అర్థం చేసుకోవడానికి సహాయపడింది. ఉత్తర ఆఫ్రికాలో నేను కలుసుకున్న ఎంటెలియా అనే ఒక పదేళ్ళ అమ్మాయి ముఖాన్ని నేను ఎప్పుడూ మరిచిపోను. ఆమె యెహోవా పేరును ప్రేమించింది, క్రైస్తవ కూటాలకు హాజరుకావడానికి గంటన్నర సేపు నడిచి వచ్చేది. ఆమె కుటుంబం నుంచి తీవ్రమైన హింసలెదురైనప్పటికీ ఎంటెలియా యెహోవాకు తనను తాను సమర్పించుకుంది. మేము వాళ్ళ సంఘాన్ని సందర్శించినప్పుడు అక్కడ కేవలం ఒక్క బల్బు మాత్రమే వేలాడదీసి ఉండేది, ప్రసంగీకుని నోట్సుమీద తప్ప మిగతా స్థలమంతా చీకటిగా ఉండేది. అంత చీకటిలోనైనా సహోదరులూ సహోదరీలూ చక్కగా పాడుతుంటే శ్రవణానందకరంగా ఉండేది.

డిసెంబరు నెల 1998 లో క్యూబాలో జరిగిన “దైవిక జీవిత మార్గం” జిల్లా సమావేశాలకు నేనూ లాయిడ్‌ హాజరవ్వడం మా జీవితాల్లో ప్రాముఖ్యమైన విషయం. బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయంనుంచి కొందరు వారిని సందర్శించడానికి వచ్చినందుకు అక్కడి సహోదర సహోదరీలు ఎంతో కృతజ్ఞతానందాలను వ్యక్తం చేయడం చూసి నేను చాలా ముగ్ధురాలినయ్యాను! ఉత్సాహంతో గట్టిగా యెహోవాకు కీర్తనలు పాడుతున్న ప్రియమైన వారిని కలుసుకున్న అనేకమైన జ్ఞాపకాలను నేనెంతో విలువైనవిగా ఎంచుతున్నాను.

హాయిగా దేవుని ప్రజలతో

నా స్వదేశం ఆస్ట్రేలియా అయినప్పటికీ, యెహోవా సంస్థ మమ్మల్ని ఎక్కడికి పంపించినా నేను అక్కడి ప్రజలను ప్రేమించాను. జపానులో అది నిజమైంది, ఇప్పుడు 25 సంవత్సరాలకు పైగా అమెరికాలో ఉంటున్నాను, ఇక్కడ కూడా అలాగే ఉంది. నేను నా భర్తను కోల్పోయినప్పుడు, ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళాలని కాకుండా యెహోవా నన్నెక్కడ నియమించాడో అక్కడే అంటే బ్రూక్లిన్‌ బేతేలులోనే ఉండాలని అనుకున్నాను.

నేనిప్పుడు నా 80వ పడిలో ఉన్నాను. పూర్తికాల సేవలో 61 సంవత్సరాలు గడిపిన తర్వాత, నేను ఎక్కడ సేవ చేయడం సముచితమని యెహోవా భావిస్తే అక్కడే ఆయన సేవ చేయడానికి నేను ఇప్పటికీ ఇష్టపడుతున్నాను. ఆయన నిజంగా నా గురించి బాగా శ్రద్ధ తీసుకున్నాడు. యెహోవాను ప్రేమించిన ఒక ప్రియమైన సహచరునితో నా జీవితాన్ని పంచుకున్న 57 కన్నా ఎక్కువ సంవత్సరాల జ్ఞాపకాలను ఎంతో విలువైనవిగా ఎంచుతాను. యెహోవా ఆశీర్వాదాలు మా పై నిరంతరం ఉంటాయని నాకు గట్టి నమ్మకముంది. మేము చేసిన సేవనూ ఆయన నామం పట్ల మేము చూపిన ప్రేమనూ ఆయన మరిచిపోడని నాకు తెలుసు.​—⁠హెబ్రీయులు 6:​10.

[అధస్సూచి]

^ పేరా 4 కావలికోట అక్టోబరు 1, 1999, 16, 17 పేజీలను చూడండి.

[25వ పేజీలోని చిత్రం]

అమ్మతో 1956వ సంవత్సరంలో

[26వ పేజీలోని చిత్రం]

లాయిడ్‌, జపనీస్‌ ప్రచారకుల ఒక గుంపుతో 1950ల తొలి భాగంలో

[26వ పేజీలోని చిత్రాలు]

జపానులో, నా మొదటి బైబిలు విద్యార్థిని మియో టకాగితో, 1950ల తొలి భాగంలో, 1999 లో

[28వ పేజీలోని చిత్రం]

జపానులో లాయిడ్‌తో పత్రికలు పంచే సేవలో