కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా వాక్యము ప్రవర్ధమానమౌతూ వచ్చింది”

“యెహోవా వాక్యము ప్రవర్ధమానమౌతూ వచ్చింది”

“యెహోవా వాక్యము ప్రవర్ధమానమౌతూ వచ్చింది”

“భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే; ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.”కీర్తన 147:15.

1, 2. యేసు తన శిష్యులకు ఏ నియామకాన్నిచ్చాడు, అందులో ఏమేమి ఇమిడి ఉన్నాయి?

బైబిలులో కనిపించే అత్యంత ఆశ్చర్యకరమైన ప్రవచనాల్లో ఒకటి అపొస్తలుల కార్యములు 1:8లో కనిపిస్తుంది. “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు . . . భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని” తాను పరలోకానికి ఆరోహణమయ్యే ముందు తన నమ్మకమైన అనుచరులతో యేసు చెప్పాడు. అది ఎంత మహత్తరమైన విషయంగా నిరూపించబడనుందో!

2 అప్పట్లో ఆయన అనుచరులు వ్రేళ్ళ మీద లెక్కపెట్టగల్గేంత మందే ఉన్నారు గనుక, భూమి అంతటా దేవుని వాక్యాన్ని ప్రకటించమని తమకివ్వబడిన నియామకం గొప్ప సవాలుతో కూడినదిగా వారికి అనిపించి ఉండవచ్చు. ఆ నియామకంలో ఏమేమి ఇమిడివున్నాయో ఆలోచించండి. దేవుని రాజ్య సువార్తను గురించి అర్థం చేసుకునేందుకు వాళ్ళు ప్రజలకు సహాయం చేయవలసి ఉంది. (మత్తయి 24:​14) యేసును గురించి సాక్ష్యమివ్వడంలో, శక్తివంతమైన ఆయన బోధలను ఇతరులతో పంచుకోవడమూ, యెహోవా సంకల్పంలో ఆయన పాత్రను వివరించడం కూడా చేయవలసి ఉంది. అంతేకాక, ప్రజలను శిష్యులనుగా చేసి వారికి బాప్తిస్మమివ్వడం కూడా ఇమిడి ఉంది. అదీ ప్రపంచవ్యాప్తంగా చేయవలసి ఉంది!​—⁠మత్తయి 28:​19, 20.

3. యేసు తన అనుచరులకు ఏ అభయాన్నిచ్చాడు, తమకివ్వబడిన పని విషయంలో వాళ్ళెలా ప్రతిస్పందించారు?

3 అయినప్పటికీ, తానిచ్చిన పనిని నిర్వహించేందుకు పరిశుద్ధాత్మ వారికి తోడుగా ఉంటుందని యేసు తన శిష్యులకు అభయమిచ్చాడు. కనుక, ఆ నియామకం ఎంత విస్తారమైనదైనప్పటికీ, యేసు తొలి శిష్యులను మాట్లాడనివ్వకుండా చేయాలని వారి వ్యతిరేకులు నిర్విరామంగా, ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఆ శిష్యులు ఆయన నిర్దేశించిన పనిని విజయవంతంగా చేశారు. అది ఎవరూ కాదనలేని, చరిత్రలోని వాస్తవం.

4. ఇతరులకు ప్రకటించమని బోధించమని ఇవ్వబడిన ఆదేశంలో దేవుని ప్రేమ ఎలా బయల్పరచబడింది?

4 ప్రపంచ వ్యాప్త ప్రకటనా బోధనా కార్యక్రమం అనేది తనను ఎరుగనివారి మీద దేవునికున్న ప్రేమకు వ్యక్తీకరణ. యెహోవాకు సన్నిహితులై తమ పాపాలకు క్షమాపణను పొందే అవకాశాన్ని అది వారికిచ్చింది. (అపొస్తలుల కార్యములు 26:​18) ప్రకటించమని, బోధించమని ఇవ్వబడిన ఆ ఆదేశం, రాజ్య సందేశాన్ని తీసుకువెళ్తున్న వారిపైన కూడా దేవునికున్న ప్రేమను బయలుపరుస్తుంది. అదెలాగంటే, ఆ పని యెహోవా మీద తమకున్న భక్తిని వ్యక్తీకరించేందుకూ తోటి మానవులపై తమకున్న ప్రేమను చూపేందుకూ వారికి అవకాశాన్నిస్తుంది. (మత్తయి 22:​37-39) అపొస్తలుడైన పౌలు క్రైస్తవ పరిచర్యను ఎంతో విలువైనదిగా ఎంచాడు గనుకనే, దాన్ని “ఐశ్వర్యము” అని అన్నాడు.​—⁠2 కొరింథీయులు 4:⁠7.

5. (ఎ) తొలి క్రైస్తవులను గురించిన అత్యంత నమ్మదగిన చరిత్రను ఎక్కడ కనుగొనవచ్చు, అందులో, ఏది ప్రవర్ధమానమవ్వడం గురించి వివరించబడింది? (బి) అపొస్తలుల కార్యములు అనే పుస్తకం నేటి దేవుని సేవకులకు ఎందుకు అర్థవంతమైనదిగా ఉంది?

5 తొలి క్రైస్తవుల ప్రకటనా పనిని గురించిన అత్యంత నమ్మదగిన వృత్తాంతం, శిష్యుడైన లూకా వ్రాసిన అపొస్తలుల కార్యములు అనే దైవప్రేరేపిత పుస్తకంలో ఉంది. అది, దేవుని వాక్యం ఆశ్చర్యకరంగా, శీఘ్రంగా ప్రవర్ధమానమౌతూ వచ్చినదాన్ని గురించిన నివేదిక. దేవుని వాక్య జ్ఞానము ఆ విధంగా ప్రవర్ధమానమవ్వడం, “భూమికి ఆజ్ఞనిచ్చువాడు [యెహోవాయే]. ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును” అని చెబుతున్న కీర్తన 147:⁠15ను గుర్తుచేస్తుంది. పరిశుద్ధాత్మతో శక్తినిపొందిన తొలి క్రైస్తవుల వృత్తాంతం నేడు మనకు చాలా పులకింత కలిగిస్తుంది, అలాగే చాలా అర్థవంతమైనదిగా కూడా ఉంది. యెహోవాసాక్షులు అదే ప్రకటనా పనిలోనూ శిష్యులను చేసే పనిలోనూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మరింత విస్తృతంగా చేస్తున్నారు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు ఎదురైనటువంటి సమస్యలే మనకూ ఎదురవుతున్నాయి. యెహోవా తొలి క్రైస్తవులను ఎలా ఆశీర్వదించి, మరింత శక్తిని ఇచ్చాడో ఆలోచించినప్పుడు, ఆయన మద్దతు మీద మనకున్న విశ్వాసం మరింత బలపడుతుంది.

శిష్యుల సంఖ్యలో పెరుగుదల

6. వాక్యం ప్రవర్ధమానమవ్వడానికి సంబంధించిన ఏ మాట అపొస్తలుల కార్యములు అనే పుస్తకంలో మూడుసార్లు కనిపిస్తుంది, అది దేన్ని సూచిస్తుంది?

6అపొస్తలుల కార్యములు 1:8 లోని మాటల నెరవేర్పును పరిశీలించేందుకు ఒక మార్గం, “యెహోవా వాక్యము ప్రవర్థమానమౌతూ వచ్చింది” అనే మాటను పరిగణనలోకి తీసుకోవడమే. ఈ మాట చిన్న తేడాల్లో కేవలం మూడు సార్లు మాత్రమే బైబిలులో కనిపిస్తుంది, అదీ అపొస్తలుల కార్యములు పుస్తకంలోనే కనిపిస్తుంది. (అపొస్తలుల కార్యములు 6:​7, 12:​24, 19:​20, NW) ఈ వచనాల్లో ఉన్న “యెహోవా వాక్యము” లేక “దేవుని వాక్యము” అనే మాటలు సువార్తను అంటే, దైవిక సత్యాన్ని గురించిన పులకరింత కలుగజేసే సందేశాన్ని, దాన్ని అంగీకరించినవారి జీవితాలను మార్చివేసిన సజీవమైన, శక్తివంతమైన సందేశాన్ని సూచిస్తున్నాయి.​—⁠హెబ్రీయులు 4:12.

7. దేవుని వాక్యం ప్రవర్ధమానమవ్వడం అపొస్తలుల కార్యములు 6:⁠7 లో దేనితో ముడిపెట్టబడింది, సా.శ. 33 పెంతెకొస్తునాడు ఏమి జరిగింది?

7 దేవుని వాక్యం ప్రవర్ధమానమవ్వడాన్ని గురించిన మొదటి ప్రస్తావన అపొస్తలుల కార్యములు 6:7 లో కనిపిస్తుంది. ఇక్కడ మనం, “దేవుని వాక్యము ప్రబలమై [“ప్రవర్ధమానమౌతూ వచ్చింది,” NW] శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి” అని చదువుతాం. ఇక్కడ ప్రవర్ధమానం అన్న మాట శిష్యుల సంఖ్యలోని పెరుగుదలతో ముడిపెట్టబడింది. మొదట్లో, అంటే సా.శ. 33 పెంతెకొస్తు రోజున, మేడగదిలో కూడుకున్న దాదాపు 120 మంది శిష్యుల మీద దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అప్పుడు, అపొస్తలుడైన పేతురు ఒక ప్రేరణాత్మక ప్రసంగాన్ని ఇచ్చాడు. అది విన్నవారిలో దాదాపు 3,000 మంది ఆ రోజునే విశ్వాసులయ్యారు. దాదాపు 50 రోజుల క్రితం మ్రానుపై ఒక దోషిగా వ్రేలాడదీయబడిన మానవుడైన యేసు పేరట బాప్తిస్మం పొందేందుకు వేవేల మంది ప్రజలు యెరూషలేములోనూ అలాగే దాని చుట్టు ప్రక్కలనూ ఉన్న తటాకాలకు తరలివెళ్తుండగా అక్కడ ఎంత కోలాహలం చెలరేగి వుండవచ్చు!​—⁠అపొస్తలుల కార్యములు 2:41.

8. సా.శ. 33 పెంతెకొస్తు తర్వాతి సంవత్సరాల్లో శిష్యుల సంఖ్య ఎలా పెరిగింది?

8 అది కేవలం ప్రారంభం మాత్రమే. ప్రకటనా కార్యక్రమాన్ని నిలిపివేయాలని యూదా మత నాయకులు నిర్విరామంగా చేసిన ప్రయత్నాలన్నీ నిరర్థకమైపోయాయి. “ప్రభువు” ఆ నాయకులకు నిరాశను కలిగిస్తూ, ‘రక్షణ పొందుచున్నవారిని [శిష్యులను] అనుదినము చేర్చుచుండెను.’ (అపొస్తలుల కార్యములు 2:​47) త్వరలోనే, “పురుషుల సంఖ్య యించుమించు అయిదు వేలు ఆయెను.” ఆ తర్వాత, “పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.” (అపొస్తలుల కార్యములు 4:⁠4; 5:​14) ఆ తర్వాతి కాలాన్ని గురించి, “యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను” అని చదువుతాం. (అపొస్తలుల కార్యములు 9:​31) కొన్ని సంవత్సరాల తర్వాత, బహుశా ఇంచుమించు సా.శ. 58 లో, ‘విశ్వాసులైనవారు ఎన్నో వేలమంది’ అయ్యారు అని సూచించబడింది. (అపొస్తలుల కార్యములు 21:​20) అప్పటికెల్లా, అనేక మంది అన్యులు కూడా విశ్వాసులయ్యారు.

9. తొలి క్రైస్తవులను మీరు ఎలా వర్ణిస్తారు?

9 ముఖ్యంగా, అనేకులు తమ మతాన్ని మార్చుకోవడం మూలంగానే శిష్యుల సంఖ్య పెరిగింది. ఆ మతం క్రొత్తదే అయినా, చాలా క్రియాశీలంగా ఉండేది. నిష్క్రియులైన చర్చి సభ్యుల్లా ఉండే బదులు, యేసు శిష్యులు యెహోవాకూ ఆయన వాక్యానికీ తమను తాము పూర్తిగా సమర్పించుకున్నారు. కొందరైతే, తీవ్రంగా హింసించబడినవారి నుండి సత్యాన్ని నేర్చుకుని శిష్యులయ్యారు. (అపొస్తలుల కార్యములు 16:​23, 26-33) వాళ్ళు సహేతుకంగా తర్కించుకుని, విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుని క్రైస్తవత్వాన్ని అంగీకరించారు. (రోమీయులు 12:⁠1) దేవుని మార్గాల్లో వారికి విద్యా బోధన జరిగింది; సత్యం వాళ్ళ మనస్సుల్లోను హృదయాల్లోను నాటుకుపోయింది. (హెబ్రీయులు 8:​10, 11) తాము విశ్వసించినదాని కోసం వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు.​—⁠అపొస్తలుల కార్యములు 7:51-60.

10. తొలి క్రైస్తవులు ఏ బాధ్యతను తీసుకున్నారు, దాన్ని పోలిన దేనిని నేడు మనం కనుగొనగలం?

10 క్రైస్తవ బోధను సంతోషంగా అంగీకరించినవారు ఆ సత్యాన్ని ఇతరులతో పంచుకోవాల్సిన బాధ్యత ఉందని గ్రహించారు. శిష్యుల సంఖ్య మరింత పెరిగేందుకు అది నేరుగా దోహదపడింది. “విశ్వాసాన్ని తెలియజేయడం అనేది ఆసక్తిగల లేదా ఆధికారికంగా నియమించబడిన సువార్తికునికి మాత్రమే చెందిన హక్కుగా ఎంచబడలేదు. సువార్తపని చర్చి సభ్యుల్లోని ప్రతి ఒక్కరి ఆధిక్యతగా కర్తవ్యముగా ఉండేది. . . . మొత్తం క్రైస్తవ సమాజం అకస్మాత్తుగా సుదూరానికి వ్యాపించడంతో, ఈ ఉద్యమానికి దాని ఆరంభంలోనే గొప్ప ప్రేరణ లభించింది” అని ఒక బైబిలు పండితుడు చెప్పాడు. “సువార్తపని తొలి క్రైస్తవుల జీవరక్తంగా ఉండేది” అని కూడా ఆయన వ్రాశాడు. నేటి యథార్థ క్రైస్తవుల విషయంలో కూడా అది నిజం.

అనేక ప్రాంతాలకు వ్యాపించడం

11. అపొస్తలుల కార్యములు 12:24 లో ఎటువంటి ప్రవర్ధమానాన్ని గురించి వర్ణించబడింది, అదెలా జరిగింది?

11 దేవుని వాక్యం ప్రవర్ధమానమవ్వడాన్ని గురించిన రెండవ ప్రస్తావన, అపొస్తలుల కార్యములు 12:24 లో, “దేవుని [“యెహోవా,” NW] వాక్యము ప్రబలమై [“ప్రవర్ధమానమౌతూ,” NW] వ్యాపించుచుండెను” అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ మాట దేవుని వాక్యం వివిధ ప్రాంతాలకు వ్యాపించడంతో ముడిపడి ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ, ప్రకటనా పని వర్ధిల్లుతూనే ఉండింది. పరిశుద్ధాత్మ మొదట యెరూషలేములో కుమ్మరించబడింది, అక్కడి నుండి వాక్యం చుట్టుప్రక్కలకు శీఘ్రంగా వ్యాపించింది. ఆ కాలంలో యెరూషలేములో జరిగిన హింసాకాండ శిష్యులను యూదయ సమరయ ప్రాంతాల్లోకి చెదరిపోయేలా చేసింది. దాని ఫలితం ఏమిటి? “చెదరిపోయినవారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి.” (అపొస్తలుల కార్యములు 8:​1, 4) ఫిలిప్పు ఒక వ్యక్తికి సాక్ష్యమిచ్చేలా నడిపించబడ్డాడు. ఆ వ్యక్తి బాప్తిస్మం పొంది, ఆ తర్వాత రాజ్య సందేశాన్ని ఐతియొపీయాకు తీసుకువెళ్ళాడు. (అపొస్తలుల కార్యములు 8:​26-28, 38, 39) త్వరలోనే సత్యం, లుద్దలోను, షారోను సమతల ప్రాంతంలోను, యొప్పేలోను స్థిరపరచబడింది. (అపొస్తలుల కార్యములు 9:​35, 42) తర్వాత, అపొస్తలుడైన పౌలు అనేక మధ్యధరా దేశాల్లో సంఘాలను స్థాపిస్తూ, సముద్రం పైనా నేల మీదా వేలాది మైళ్ళు ప్రయాణించాడు. అపొస్తలుడైన పేతురు బబులోనుకి వెళ్ళాడు. (1 పేతురు 5:​13) పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన 30 సంవత్సరాల్లోనే, సువార్త, “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడిన”దని పౌలు వ్రాశాడు. ఆ మాటలు బహుశా, మొత్తం ప్రపంచంగా ఆ కాలంలో పరిగణించబడిన భూభాగాన్ని సూచిస్తుండవచ్చు.​—⁠కొలొస్సయులు 1:23.

12. క్రైస్తవత్వపు వ్యతిరేకులు, దేవుని వాక్యం వివిధ ప్రాంతాలకు వ్యాపించిందని ఎలా ఒప్పుకున్నారు?

12 క్రైస్తవత్వాన్ని వ్యతిరేకించినవాళ్ళు సహితం, దేవుని వాక్యం రోమా సామ్రాజ్యమంతటా వ్రేళ్ళూనినట్లు ఒప్పుకున్నారు. ఉదాహరణకు, ఉత్తర గ్రీసులోని థెస్సలొనీకలోని వ్యతిరేకులు, “భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చి యున్నారు” అని అన్నట్లు అపొస్తలుల కార్యములు 17:6 చెబుతుంది. అంతేకాక, రెండవ శతాబ్దపు ప్రారంభంలో, ప్లైనీ ద యంగర్‌, బేతనియ నుండి రోమా చక్రవర్తియైన ట్రాజన్‌కు ఉత్తరం వ్రాశాడు. ఆయన, క్రైస్తవత్వాన్ని గురించి ఫిర్యాదు చేస్తూ, “[ఇది] నగరాలకు మాత్రమే పరిమితం కాలేదు, దీని వ్యాధి పొరుగు గ్రామాల్లోను పల్లెల్లోను వ్యాపించింది” అని అన్నాడు.

13. దేవుని వాక్యం వివిధ ప్రాంతాలకు వ్యాపించడం మానవజాతిపై దేవునికున్న ప్రేమను ఎలా ప్రతిబింబించింది?

13 సువార్త ఇలా వివిధ ప్రాంతాలకు వ్యాపించడం, విమోచించదగిన మానవులపై యెహోవా చూపే ప్రగాఢమైన ప్రేమకు వ్యక్తీకరణగా ఉంది. అపొస్తలుడైన పేతురు, అన్యుడైన కొర్నేలీ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడడం చూసినప్పుడు, “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని అన్నాడు. (అపొస్తలుల కార్యములు 10:​34, 35) అవును, సువార్త అప్పుడూ ఇప్పుడూ అందరి కోసమైన ఒక సందేశంగా ఉంది. దేవుని వాక్యం వివిధ ప్రాంతాలకు వ్యాపించడం, దేవుని ప్రేమకు స్పందించే అవకాశాన్ని అన్ని చోట్లా ఉన్న ప్రజలకు ఇచ్చింది. ఈ 21వ శతాబ్దంలో, దేవుని వాక్యం అక్షరార్థంగా అన్ని భూభాగాలకు వ్యాపించింది.

ప్రవర్ధమానమౌతూ ప్రబలమైంది

14. అపొస్తలుల కార్యములు 19:20 లో ఎటువంటి ప్రవర్ధమానం గురించి వర్ణించబడింది, దేవుని వాక్యం దేన్ని అధిగమించి ప్రబలమైంది?

14 దేవుని వాక్యం ప్రవర్ధమానమవ్వడాన్ని గురించిన మూడవ ప్రస్తావన అపొస్తలుల కార్యములు 19:​20, NWలో, “యెహోవా వాక్యము శక్తివంతమైన విధంగా ప్రవర్ధమానమౌతూ, ప్రబలమౌతూ వచ్చింది” అని కనిపిస్తుంది. ఇక్కడ “ప్రబలమౌతూ” అని అనువదించబడిన తొలి గ్రీకు పదం, “బలాన్ని ఉపయోగిస్తూ” అనే భావాన్నిస్తుంది. ఎఫెసులోని అనేకులు విశ్వాసులయ్యారనీ, మంత్రవిద్యలను అభ్యసించిన అనేకులు తమ పుస్తకాలను అందరి ఎదుట కాల్చేశారనీ ముందటి వచనాలు చెబుతున్నాయి. అలా దేవుని వాక్యం అబద్ధ మత విశ్వాసాలను అధిగమించి ప్రబలమైంది. హింసాకాండ వంటి ఆటంకాలను కూడా తట్టుకుంటూ సువార్త ప్రబలమైంది. ఏదీ దాన్ని ఆపలేకపోయింది. ఈ విషయం కూడా మన కాలంలోని నిజ క్రైస్తవత్వాన్ని పోలి ఉందని మనం కనుగొంటాం.

15. (ఎ) తొలి క్రైస్తవుల గురించి ఒక బైబిలు చరిత్రకారుడు ఏమని చెప్పాడు? (బి) శిష్యులు తమ సాఫల్యతను ఎవరికి ఆపాదించారు?

15 అపొస్తలులూ మరితర తొలి క్రైస్తవులూ దేవుని వాక్యాన్ని ఎంతో ఆసక్తిగా ప్రకటించారు. “వ్యక్తులు తమ ప్రభువును గూర్చి మాట్లాడాలనుకుంటే అందుకు మార్గాల కొరతేమీ ఉండదు. నిజానికి ఆ స్త్రీపురుషులు అనుసరించిన పద్ధతుల కన్నా వారిలో ఉన్న ఉత్సాహం మనల్ని ఎక్కువ ఆకర్షితులను చేస్తుంది” అని వారి గురించి ఒక బైబిలు చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ, తమ పరిచర్యలో సాఫల్యం అనేది తమ ప్రయత్నాల మీదే ఆధారపడి లేదని ఆ తొలి క్రైస్తవులు గ్రహించారు. తమ పనిని కొనసాగించేందుకు వారికి దైవిక ఆదేశం ఉంది, దానిని పూర్తి చేయడానికి వారికి దైవిక మద్దతూ ఉంది. ఆధ్యాత్మిక ప్రవర్ధమానం దేవుని మూలంగానే జరుగుతుంది. అపొస్తలుడైన పౌలు ఆ విషయాన్ని కొరింథులోని క్రైస్తవులకు వ్రాసిన లేఖలో ఒప్పుకున్నాడు. “నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే. మేము దేవుని జతపనివారమై యున్నాము” అని ఆయన వ్రాశాడు.​—⁠1 కొరింథీయులు 3:6, 9.

పరిశుద్ధాత్మ పనిచేసింది

16. శిష్యులు ధైర్యంగా మాట్లాడేందుకు పరిశుద్ధాత్మ వారికి శక్తినిచ్చిందని ఏమి చూపిస్తుంది?

16 దేవుని వాక్యం ప్రవర్ధమానమవ్వడంలో, పరిశుద్ధాత్మ ఒక పాత్రను నిర్వహిస్తుందనీ, అది తన శిష్యులకు ప్రకటనా పనిలో శక్తినిస్తుందనీ యేసు అభయమిచ్చాడన్న విషయాన్ని గుర్తుచేసుకోండి. (అపొస్తలుల కార్యములు 1:⁠8) అదెలా? పెంతెకొస్తు రోజున, శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఎంతో కాలం కాకముందే, పేతురు యోహానులు ఆ దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన యూదుల మహా సభ ఎదుట మాట్లాడేందుకు పిలువబడ్డారు. దానిలోని న్యాయమూర్తులే యేసుక్రీస్తు మరణ దండనకు బాధ్యులు. ఎంతో భయంకరమైన శత్రుభావం గల న్యాయమూర్తులున్న సభ ఎదుట అపొస్తలులు భయంతో వణికిపోయారా? లేదు! పరిశుద్ధాత్మ శక్తినిచ్చినందువల్ల, పేతురు యోహానులు ఎంత ధైర్యంగా మాట్లాడారంటే, వారి వ్యతిరేకులు వాళ్ళ మాటలు విని ఎంతో ఆశ్చర్యపోయి, ‘వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తించారు.’ (అపొస్తలుల కార్యములు 4:​8, 13) స్తెఫను కూడా ఆ మహాసభ ఎదుట ధైర్యంగా సాక్ష్యమిచ్చేలా పరిశుద్ధాత్మ సహాయం చేసింది. (అపొస్తలుల కార్యములు 6:​12; 7:​55, 56) మునుపు, ధైర్యంగా ప్రకటించేలా పరిశుద్ధాత్మ శిష్యులను కదిలించింది. “వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి” అని లూకా నివేదిస్తున్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 4:31.

17. పరిశుద్ధాత్మ, మరే విధాల్లో శిష్యులకు వారి పరిచర్యలో సహాయం చేసింది?

17 యెహోవా, పునరుత్థానం చేయబడిన యేసుతోపాటు, తన శక్తివంతమైన పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటనా పనికి నడిపింపునిచ్చాడు. (యోహాను 14:​28; 15:​26) కొర్నేలీపై ఆయన బంధువులపై, ఆయన దగ్గరి స్నేహితులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందేందుకు అన్యులు యోగ్యులు కాగలరని అపొస్తలుడైన పేతురు గ్రహించాడు. (అపొస్తలుల కార్యములు 10:​24, 44-48) తర్వాత, బర్నబాను సౌలును (అపొస్తలుడైన పౌలు) మిషనరీ పనికి నియమించడంలోనూ, వాళ్ళెక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో నిర్దేశించడంలోనూ పరిశుద్ధాత్మ కీలక పాత్రను నిర్వహించింది. (అపొస్తలుల కార్యములు 13:​2, 4; 16:​6, 7) యెరూషలేములోని అపొస్తలుల, పెద్దల నిర్ణయాలకు అది మార్గదర్శనమిచ్చింది. (అపొస్తలుల కార్యములు 15:​23, 28, 29) క్రైస్తవ సంఘంలోని పైవిచారణకర్తల నియామకాన్ని కూడా పరిశుద్ధాత్మ నిర్దేశించింది.​—⁠అపొస్తలుల కార్యములు 20:28.

18. తొలి క్రైస్తవులు ప్రేమను ఎలా కనబరచారు?

18 అంతేకాక, క్రైస్తవుల్లో ప్రేమ వంటి దైవిక గుణాలను ఉత్పన్నంచేయడం ద్వారా కూడా పరిశుద్ధాత్మ బయల్పరచబడింది. (గలతీయులు 5:​22, 23) తమకున్నవాటిని ఒకరితోనొకరు పంచుకునేందుకు ప్రేమ శిష్యులను పురికొల్పింది. ఉదాహరణకు, సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత, యెరూషలేములో ఉన్న శిష్యుల భౌతిక అవసరాలను తీర్చేందుకు కావలసిన నిధిని సేకరించడం మొదలుపెట్టారు. “భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను” అని బైబిలు వృత్తాంతం చెబుతుంది. (అపొస్తలుల కార్యములు 4:​34, 35) ఈ ప్రేమ కేవలం తోటి విశ్వాసులకు మాత్రమే కాక, సువార్తను పంచడం ద్వారా, మరితర దయతోకూడిన చర్యల ద్వారా ఇతరులకు కూడా చూపబడింది. (అపొస్తలుల కార్యములు 28:​8, 9) స్వయంత్యాగపూరిత ప్రేమ తన అనుచరులకు గుర్తింపు చిహ్నంగా ఉంటుందని యేసు చెప్పాడు. (యోహాను 13:​34, 35) ప్రేమ అనే ప్రాముఖ్యమైన గుణం ప్రజలను దేవునివైపుకు ఆకర్షించి, నేటిలాగే మొదటి శతాబ్దంలో కూడా దేవుని వాక్యం ప్రవర్ధమానమవ్వడానికి దోహదపడిందన్నది నిశ్చయము.​—⁠మత్తయి 5:14, 16.

19. (ఎ) మొదటి శతాబ్దంలో యెహోవా వాక్యం ఏ మూడు విధాల్లో ప్రవర్ధమానమయ్యింది? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి చూస్తాము?

19 “పరిశుద్ధాత్మ” అనే మాట అపొస్తలుల కార్యములు అనే పుస్తకంలో మొత్తం 15 సార్లు కనిపిస్తుంది. కాబట్టి, మొదటి శతాబ్దంలోని యథార్థ క్రైస్తవుల ప్రవర్ధమానానికీ పరిశుద్ధాత్మ శక్తికీ అదిచ్చిన మార్గనిర్దేశానికీ ఎంతో సంబంధం ఉందని స్పష్టమవుతుంది. అందుకే, శిష్యుల సంఖ్య పెరిగింది, దేవుని వాక్యం విస్తృతంగా వ్యాపించింది, అది ఆ యుగానికి చెందిన మతాలను తత్త్వశాస్త్రాలను అధిగమించి ప్రబలమైంది. మొదటి శతాబ్దంలోలాగే నేడు యెహోవాసాక్షుల పని కూడా ప్రవర్ధమానమౌతూనే ఉంది. తర్వాతి ఆర్టికల్‌లో, ఆధునిక కాలాల్లో దేవుని వాక్యం ఇలాగే గమనార్హమైన విధంగా ప్రవర్ధమానమవ్వడాన్ని పరిశీలిద్దాం.

మీకు జ్ఞాపకమున్నాయా?

• తొలి శిష్యుల సంఖ్య ఎలా పెరిగింది?

• దేవుని వాక్యం వివిధ ప్రాంతాలకు ఎలా వ్యాపించింది?

• దేవుని వాక్యం మొదటి శతాబ్దంలో ఎలా ప్రబలమైంది?

• దేవుని వాక్యం ప్రవర్ధమానమవ్వడంలో పరిశుద్ధాత్మ ఏ పాత్రను నిర్వహించింది?

[అధ్యయన ప్రశ్నలు]

[12వ పేజీలోని చిత్రం]

ఫిలిప్పు ఐతియోపీయునికి ప్రకటించాడు, అలా సువార్త వివిధ ప్రాంతాలకు వ్యాపించింది

[13వ పేజీలోని చిత్రం]

యెరూషలేములోని అపొస్తలులను పెద్దలను పరిశుద్ధాత్మ నడిపించింది

[10వ పేజీలోని చిత్రసౌజన్యం]

పైన కుడివైపున: Reproduction of the City of Jerusalem at the time of the Second Temple - located on the grounds of the Holyland Hotel, Jerusalem