కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాజ్య సువార్త అంటే ఏమిటి?

రాజ్య సువార్త అంటే ఏమిటి?

రాజ్య సువార్త అంటే ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా 235 దేశాల్లో చిన్నలూ పెద్దలూ మొత్తం 60,35,564 మంది, దాన్ని గురించి ఇతరులతో మాట్లాడడానికి 117,12,70,425 గంటలను గత సంవత్సరం వెచ్చించారు. వాళ్ళు దాన్ని నోటి మాట ద్వారా తెలియజేయడమే కాక, దాన్ని ప్రచురించి వివరించేందుకు 70 కోట్ల కన్నా ఎక్కువ సాహిత్యాలను ప్రజల చేతికి అందించారు. దాన్ని ప్రచురించడంలో భాగంగా వేల కొలది ఆడియో క్యాసెట్లను, వీడియో క్యాసెట్లను కూడా పంపిణీ చేశారు. ఇంతకూ, “దాన్ని” అని చెబుతున్నది దేన్ని గురించి?

“దాన్ని” అన్నది దేవుని రాజ్య సువార్త గురించే. నిజమే, “ఈ రాజ్య సువార్త” నేడు మనం చూస్తున్నంత విస్తృతంగా మానవ చరిత్రలో మునుపెన్నడూ ప్రకటించబడలేదు.​—⁠మత్తయి 24:⁠14.

ప్రపంచవ్యాప్తంగా ఈ సువార్తను ప్రకటించే పనినీ బోధించే పనినీ చేస్తున్నవారందరూ స్వచ్ఛంద సేవకులే. లౌకిక దృక్కోణంలో చూస్తే, వాళ్ళు ఆ పనికి అంత యోగ్యులు కానట్లు అనిపించవచ్చు. అయినా, వాళ్ళ ధైర్యానికీ సాఫల్యానికీ కారణం ఏమిటి? రాజ్య సువార్తకున్న శక్తే దానికి మూలకారణం. అది మానవజాతికి రానున్న ఆశీర్వాదాలను గురించిన వార్త. ఆ ఆశీర్వాదాలు ప్రజలందరూ కోరుకునేవి. అవేంటంటే, సంతోషం, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల, మంచి ప్రభుత్వం, శాంతి భద్రతలు. మరొక ఆశీర్వాదం ఆలోచించడానికి కూడా అనేకులు సాహసించనిది​—⁠నిత్యజీవం! జీవిత పరమార్థాన్ని గురించీ ఉద్దేశాన్ని గురించీ అన్వేషిస్తున్న ప్రజలకు ఇది నిజంగా సువార్తే. మీరు రాజ్య సువార్త ప్రకటనకు అనుకూలంగా ప్రతిస్పందించి చర్య తీసుకుంటే ఈ ఆశీర్వాదాలూ, వీటితోపాటు మరెన్నో ఆశీర్వాదాలూ మీకు లభించగలవు.

రాజ్యం అంటే ఏమిటి?

అయితే, సువార్తగా ప్రకటించబడుతున్న రాజ్యం ఏమిటి? “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అన్న సుపరిచితమైన మాటల్లో ప్రార్థించమని లక్షలాదిమందికి నేర్పించబడినది ఈ రాజ్యం గురించే.​—⁠మత్తయి 6:9, 10.

25 శతాబ్దాల కన్నా ఎక్కువ కాలం క్రితం హెబ్రీ ప్రవక్తయైన దానియేలు “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును” అని వ్రాసినది ఈ రాజ్యం గురించే.​—⁠దానియేలు 2:44.

అంటే, ఈ సువార్త దేవుని రాజ్యము లేదా ప్రభుత్వము గురించినది. అది దుష్టత్వాన్నంతటినీ తీసివేసి, భూమ్యంతటినీ శాంతియుతంగా పరిపాలిస్తుంది. మానవజాతిని గురించిన భూమిని గురించిన సృష్టికర్త ఆది సంకల్పాన్ని వాస్తవం చేస్తుంది.​—⁠ఆదికాండము 1:28.

“పరలోకరాజ్యము సమీపించియున్నది”

దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, ఈ రాజ్య సువార్తను బహిరంగంగా మొదట ప్రకటించినది ఒక సమర్పిత వ్యక్తి. ఆ వ్యక్తి బాప్తిస్మమిచ్చే యోహాను. యూదా యాజకుడైన జెకర్యాకు, ఆయన భార్యయైన ఎలిజబెతుకు పుట్టినవాడు. తనకు ముందు ఛాయగా ఉన్న ఏలియాలాగే ఆయన ఒంటె రోమముల వస్త్రమును, మొల చుట్టు తోలు దట్టినీ ధరించాడు. ఆయన రూపమూ ప్రవర్తనా అవధానాన్ని ఆకర్షించేవిగా ఉన్నాయి. కానీ ఆయన చెప్పిన సందేశమే అనేకుల అవధానాన్ని మరెక్కువగా ఆకర్షించింది. “పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని” ఆయన ప్రకటించాడు.​—⁠మత్తయి 3:1-6.

యోహాను మాటలను విన్నవారు యూదులు. వారు సత్య దేవుడైన యెహోవా ఆరాధకులమని చెప్పుకునేవారు. ఒక జనాంగముగా, వారు దాదాపు 1,500 సంవత్సరాల క్రితం మోషే ద్వారా ధర్మశాస్త్ర నిబంధనను పొందినవారు. యోహాను కాలంలోను యెరూషలేములో మహిమాన్వితమైన ఆలయం ఉంది, ధర్మశాస్త్రానుసారంగా అక్కడ బలులు అర్పించబడేవి. తమ ఆరాధన దేవుని దృష్టిలో సరైనదేనన్న నమ్మకం యూదులకుండేది.

అయినప్పటికీ, యోహాను చెప్పిన మాటలు విన్న కొందరు ప్రజలు తమ మతం తామనుకున్నట్లు సరైనది కాదని గ్రహించనారంభించారు. గ్రీకు సంస్కృతీ, తత్త్వశాస్త్రమూ యూదా మత బోధల్లో జొరబ్డడాయి. మోషే ద్వారా దేవుని నుండి పొందిన ధర్మశాస్త్రం ఇప్పుడు మానవ కల్పిత నమ్మకాలతో పారంపర్యాచారాలతో అపవిత్రపర్చబడింది, నిరర్థకం కూడా చేయబడింది. (మత్తయి 15:⁠6) కఠిన హృదయులైన, కరుణ లేని మత నాయకులచేత ప్రజలు తప్పుదోవ పట్టించబడ్డారు, ఇక అప్పటి నుండి, వాళ్ళలో ఎక్కువశాతం మంది దేవుడ్ని అంగీకారయోగ్యమైన విధంగా ఆరాధించలేదు. (యాకోబు 1:⁠27) కనుక, వాళ్ళు దేవునికీ ధర్మశాస్త్ర నిబంధనకూ వ్యతిరేకంగా చేసిన పాపాల విషయమై మారు మనస్సు పొందవలసిన అవసరం ఉంది.

ఆ కాలంలో, అనేక మంది యూదులు వాగ్దత్త మెస్సీయ లేదా క్రీస్తు ప్రత్యక్షమవుతాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కొందరు యోహాను గురించి, “ఇతడు క్రీస్తయి యుండునేమో” అని అనుకున్నారు. అయితే, తాను క్రీస్తును కాననీ, క్రీస్తు మరొకరనీ సూచిస్తూ, “ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను” అని యోహాను అన్నాడు. (లూకా 3:​15, 16) యేసును తన శిష్యులకు పరిచయం చేస్తూ, “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని యోహాను ప్రకటించాడు.​—⁠యోహాను 1:29.

అది నిజానికి సువార్త, ఎందుకంటే, యోహాను, జీవానికీ సంతోషానికీ మార్గాన్ని​—⁠“లోకపాపమును మోసికొనిపోవు” యేసును ప్రజలందరికీ చూపిస్తున్నాడు. ఆదాము హవ్వల వారసులుగా, మానవులందరూ పాప మరణాల నిరంకుశ పరిపాలన క్రింద జన్మించారు. “ఒక మనుష్యుని [ఆదాము] అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని [యేసు] విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు” అని రోమీయులు 5:⁠19 వివరిస్తుంది. యేసు, బలిగా అర్పించబడే గొఱ్ఱెపిల్లలాగా ‘పాపములను మోసుకొనిపోయి’ మానవుల దయనీయమైన పరిస్థితి నుండి విడిపించవలసి ఉండింది. ఎందుకంటే, “పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము” అని బైబిలు వివరిస్తుంది.​—⁠రోమీయులు 6:23.

వాస్తవానికి, ఒక పరిపూర్ణ మానవుడిగా, జీవించినవారిలోకెల్లా మహా గొప్ప మనిషియైన యేసు సువార్త ప్రకటనను చేపట్టాడు. “యోహాను చెరపట్టబడిన తరువాత యేసు​—⁠కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను” అని మార్కు 1:14, 15 లోని బైబిలు వృత్తాంతం మనకు చెబుతుంది.

యేసు సందేశానికి ప్రతిస్పందించి, సువార్త మీద విశ్వాసముంచినవారు మెండుగా ఆశీర్వదించబడ్డారు. “[యేసును] ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” అని యోహాను 1:⁠12 చెబుతోంది. దేవుని పిల్లలుగా లేదా కుమారులుగా, వారు నిత్యజీవమనే ప్రతిఫలాన్ని పొందే స్థానంలో ఉన్నారు.​—⁠1 యోహాను 2: 25.

కానీ, రాజ్య ఆశీర్వాదాలను పొందే ఆధిక్యత మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకే పరిమితం కాలేదు. మొదట్లో పేర్కొన్నట్లు, దేవుని రాజ్య సువార్త నేడు భూమ్యంతటా ప్రజలు నివసించే ప్రతిచోటా ప్రకటించబడుతోంది, బోధించబడుతోంది. అలా రాజ్య ఆశీర్వాదాలు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. అలాంటి ఆశీర్వాదాలను పొందేందుకు మీరు తప్పనిసరిగా ఏమి చేయవలసి ఉంటుంది? తర్వాతి ఆర్టికల్‌ దానిని వివరిస్తుంది.