కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విధేయత బాల్యంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమా?

విధేయత బాల్యంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమా?

విధేయత బాల్యంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమా?

“తమ పిల్లలు కేవలం విధేయులుగా ఉండడం కంటే పరిణతి చెందిన వ్యక్తులుగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు” అని ఒక దినపత్రికలోని ముఖశీర్షిక తెలుపుతోంది. ఈ నివేదిక న్యూజీలాండ్‌లో జరపబడిన ఒక సర్వేలోని ఫలితాల ఆధారంగా ప్రచురించబడింది. ఆ సర్వేలో తెలిసిందేమిటంటే, “పిల్లలకు ఇంట్లోనే విధేయత నేర్పించాలని, సర్వే జరిపిన వారిలో 22 శాతం మంది” మాత్రమే అనుకుంటున్నారు. పిల్లలకు చక్కని మర్యాదలు, స్వేచ్ఛ, బాధ్యత వంటి విషయాల గురించి నేర్పించడం అత్యంత ప్రాముఖ్యమైన విషయమని నేడు తల్లిదండ్రులు నమ్ముతున్నారని కూడా అదే సర్వేలో తెలిసింది.

వ్యక్తివాదం, స్వార్థపరత్వం ఉన్న ఈ యుగంలో విధేయతనూ, పిల్లలకు విధేయత నేర్పించడాన్నీ చాలామంది నిరాకరించడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. కానీ బాల్యంలో చూపించవలసిన విధేయతను పాత ఫ్యాషన్‌ అనో లేక ప్రస్తుత కాలానికి పనికి రానిదనో కొట్టిపారేయవలసిందేనా? లేక పిల్లలు నేర్చుకుని ప్రయోజనం పొందగల ముఖ్యమైన పాఠాల్లో ఇదొకటా? అతి ప్రాముఖ్యంగా, కుటుంబ ఏర్పాటుకు ప్రారంభకుడైన యెహోవా దేవుడు, పిల్లలు తమ తల్లిదండ్రులపట్ల విధేయత చూపించడాన్ని ఎలా దృష్టిస్తాడు? అటువంటి విధేయతవల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?​—⁠అపొస్తలుల కార్యములు 17:​28; ఎఫెసీయులు 3:​14, 15.

“ఇది ధర్మమే”

ఎఫెసులోనున్న మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘానికి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.” (ఎఫెసీయులు 6:⁠1) కాబట్టి, అలాంటి విధేయత చూపించడానికి గల ప్రాథమిక కారణం ఏమిటంటే, ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించే దైవిక ప్రమాణానికి అది అనుగుణంగా ఉండడమే. పౌలు మాటల్లో చెప్పాలంటే “ఇది ధర్మమే.”

దీనికి అనుగుణంగానే, దేవుని వాక్యం తల్లిదండ్రులిచ్చే ప్రేమపూర్వక క్రమశిక్షణను ఒక అందమైన ఆభరణంగా అంటే, ‘మీ తలకు సొగసైన మాలికగానూ, మీ కంఠమునకు హారముగానూ,’ “ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది”గానూ వర్ణించడాన్ని మనం గమనిస్తాం. (సామెతలు 1:⁠8, 9; కొలొస్సయులు 3:​20) దానికి పూర్తి భిన్నంగా, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపించడం దైవిక అనంగీకారానికి నడిపిస్తుంది.​—⁠రోమీయులు 1:​30, 32.

“నీకు మేలు కలుగునట్లు”

“నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది” అని వ్రాసినప్పుడు పౌలు విధేయతకున్న మరొక ప్రయోజనాన్ని కూడా సూచించాడు. (ఎఫెసీయులు 6:⁠2, 3; నిర్గమకాండము 20:​12) తల్లిదండ్రుల పట్ల విధేయత చూపడం ఏయే మార్గాల్లో మేలు కలుగజేస్తుంది?

మొట్టమొదటిగా, తల్లిదండ్రులు వయస్సులోనూ, అనుభవంలోనూ అధికులన్నది వాస్తవం కాదంటారా? కంప్యూటర్ల గురించి లేక స్కూల్లో నేర్పించే ఇతర విషయాల గురించి బహుశా వారికి అంతగా తెలియకపోయినప్పటికీ, జీవితం గురించీ జీవిత సమస్యలను ఎదుర్కోవడం గురించీ వారికి బాగా తెలుసు. మరొక ప్రక్కన, పరిణతి చెందడం వల్ల వచ్చే సమతూకం గల ఆలోచనా విధానం యౌవనస్థుల్లో ఉండదు. అందుకే, వారు నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు చూపిస్తారు, తరచుగా హాని కలిగించే తోటివారి ఒత్తిడికి లొంగిపోతుంటారు, తద్వారా ఎక్కువగా తమకు తాము హాని చేసుకుంటారు. వాస్తవిక దృక్పథంతోనే, బైబిలు ఇలా చెబుతోంది: “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును.” దానికి విరుగుడేమిటి? “శిక్షాదండము దానిని దానిలోనుండి తోలివేయును.”​—⁠సామెతలు 22:​15.

విధేయత చూపించడం వల్ల కలిగే ప్రయోజనాలు తల్లిదండ్రులు-పిల్లల సంబంధాలకు మాత్రమే పరిమితం కావు. మానవ సమాజం నిరాటంకంగా, సమర్థవంతంగా కొనసాగాలంటే పరస్పర సహకారముండాలి, దానికి కొంత విధేయత అవసరం. ఉదాహరణకు, వైవాహిక బంధంలో, అవతలి వ్యక్తి హక్కులను భావాలను పట్టించుకోకుండా అధికంగా ఆశించేవారిగా ఉండడం కంటే, అవసరమైన విధంగా మారడానికి సుముఖత గలవారిగా ఉండడమే శాంతి సామరస్య సంతోషాలు ఏర్పడడానికి తోడ్పడుతుంది. పని స్థలంలో, ఏ పనైనా లేక ఏ ప్రాజెక్ట్‌ అయినా సఫలమవడానికి ఉద్యోగులు విధేయత చూపించడం అవసరం. ప్రభుత్వ నియమాలకు సూత్రాలకు సంబంధించి, విధేయత చూపించడం కేవలం శిక్షనుంచి తప్పించడమే కాకుండా, కొంతవరకు భద్రతా రక్షణలను కూడా కలిగిస్తుంది.​—⁠రోమీయులు 13:​1-7; ఎఫెసీయులు 5:​21-25; 6:​5-8.

పై అధికారులకు విధేయత చూపించని యౌవనస్థులు సాధారణంగా సమాజానికి పనికిరానివారిగా తయారౌతారు. దానికి భిన్నంగా, బాల్యంలో నేర్చుకున్న విధేయతా పాఠం ఒకరి జీవితకాలమంతటినీ ఫలదాయకంగా చేస్తుంది. అటువంటి పాఠాన్ని బాల్యంలోనే నేర్చుకోవడం ఎంత లాభదాయకం!

విధేయతకు గొప్ప బహుమతి

విధేయత కేవలం సంతోషకరమైన కుటుంబ సంబంధాలనూ జీవితపర్యంతం ఉండే ఇతర ప్రయోజనాలనూ చేకూర్చడమే కాక, అన్నింటికన్నా అతి ప్రాముఖ్యమైన సంబంధానికి, అంటే ఒక వ్యక్తి తన సృష్టికర్తతో ఏర్పరచుకోగల సంబంధానికి పునాది వేస్తుంది. “జీవపు ఊట”కు మూలమైన యెహోవా దేవుడు “సృష్టికర్త”గా మన పూర్తి విధేయతను పొందడానికి న్యాయంగా అర్హుడు.​—⁠ప్రసంగి 12:​1, 2; కీర్తన 36:⁠9.

“విధేయత” అనే పదం బైబిల్లో వివిధ రూపాల్లో అనేకసార్లు ప్రస్తావించబడింది. అంతేగాక విధేయత చూపాల్సిన వందలాది దేవుని నియమాలు, ఆదేశాలు, ఆజ్ఞలు, న్యాయవిధులు, కట్టడలు బైబిల్లో ఉన్నాయి. మనం దేవుని అంగీకారాన్ని పొందాలంటే ఆయనకు విధేయత చూపించడాన్ని ఆయన అత్యావశ్యకమైనదిగా దృష్టిస్తాడని స్పష్టమౌతుంది. అవును, యెహోవాతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి విధేయత ఎంతో ఆవశ్యకం. (1 సమూయేలు 15:​22) విషాదకరమైన విషయమేమిటంటే, మానవుడు సహజంగా విధేయత చూపించడం కన్నా అవిధేయత చూపించడానికే మొగ్గుచూపుతాడు. “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 8:​21) అందువల్ల, విధేయత చూపించడాన్ని బాల్యంలో మాత్రమే కాదుగానీ జీవితకాలమంతా నేర్చుకోవాలి. అలా చేయడం ఒక గొప్ప బహుమతిని తీసుకువస్తుంది.

అపొస్తలుడైన పౌలు వ్రాసిన విధంగా తల్లిదండ్రుల పట్ల విధేయత చూపాలన్న ఆజ్ఞ రెండు వాగ్దానాలను కలిగివుందని గుర్తుంచుకోండి, అవేమిటంటే, “నీకు మేలు కలుగు[తుంది], . . . నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు.” ఈ వాగ్దానాలకు ధ్రువీకరణ, మనకు సామెతలు 3:1, 2 లో కనబడుతుంది: “నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును.” విధేయత చూపించేవారికి, ఇప్పుడు యెహోవాతో వ్యక్తిగత సంబంధం, శాంతికరమైన నూతన లోకంలో అనంతకాల జీవితం గొప్ప బహుమతులుగా లభిస్తాయి.​—⁠ప్రకటన 21:⁠3, 4.

[30, 31వ పేజీలోని చిత్రాలు]

విధేయత, కుటుంబంలోనూ పని స్థలంలోనూ యెహోవాతోనూ సంతోషకరమైన సంబంధాలను ఏర్పరుస్తుంది