కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అద్భుతకార్యాలు చేసేవానిని చూడండి!

అద్భుతకార్యాలు చేసేవానిని చూడండి!

అద్భుతకార్యాలు చేసేవానిని చూడండి!

“ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.”​—యోబు 37:14.

1, 2. ఎటువంటి అద్భుతమైన ఖజానా 1922 లో కనుగొనబడింది, అందుకు ప్రతిస్పందన ఎలా ఉంది?

పురావస్తుశాస్త్రజ్ఞుడైన హోవర్డ్‌ కార్టర్‌, ఆంగ్లేయుడైన లార్డ్‌ కానార్వన్‌లు ఆ ఖజానా కోసం ఎన్నో సంవత్సరాలపాటు కలిసి అన్వేషించారు. చివరికి 1922, నవంబరు 26న ఐగుప్తు ఫరోల సమాధుల స్థలమైన ప్రఖ్యాత వ్యాలీ ఆఫ్‌ ద కింగ్స్‌లో వారు దేనికోసం వెదుకుతున్నారో అది కనబడింది​—⁠అది ఫరో టుటన్‌ఖమెన్‌ సమాధి. ఆ సమాధిలో ఒక ద్వారాన్ని సమీపించి అది గట్టిగా మూయబడి ఉండడంతో వారు దానికి కన్నం పెట్టారు. కార్టర్‌ ఒక క్రొవ్వొత్తిని వెలిగించి లోపలికి చూశాడు.

2 కార్టర్‌ అటుతర్వాత ఇలా వివరించాడు: “ఉత్సుకతను ఇక ఆపుకోలేక లార్డ్‌ కానార్వన్‌ ఆత్రుతగా, ‘లోపలేమైనా కనబడుతోందా?’ అని అడిగారు. అతి కష్టమ్మీద నేను, ‘యస్‌, అద్భుతమైన వస్తువులు కనబడుతున్నాయ్‌’ అని మాత్రం అనగలిగాను.” ఆ సమాధిలోని అతి విలువైన వస్తువుల్లో మేలిమి బంగారంతో చేయబడిన ఒక శవపేటిక కూడా ఉంది. ఆ ‘అద్భుతమైన వస్తువుల్లో’ కొన్నింటిని మీరు ఫొటోల్లోనో లేదా పురావస్తు ప్రదర్శనశాలల్లోనో చూసివుంటారు. కానీ ఆ పురాతన వస్తువులు ఎంత అద్భుతంగా కనబడినా మీ జీవితంలో వాటికంత ప్రాముఖ్యం ఉండకపోవచ్చు. అందుకని మనమిప్పుడు మీ జీవితంలో నిజంగా ప్రాముఖ్యమైన, నిశ్చయంగా అమూల్యమైన వేరే అద్భుతమైన విషయాలను గురించి చర్చిద్దాం.

3. మన జీవితాల్లో అమూల్యమైన అద్భుతకార్యాలను గూర్చిన సమాచారం మనం ఎక్కడ కనుగొనగలము?

3 ఉదాహరణకు, ఎన్నో శతాబ్దాల క్రితం జీవించిన ఒక వ్యక్తిని గురించి ఆలోచించండి​—⁠ఆయన నేటి ఏ సినీ తారకన్నా, గొప్ప క్రీడాకారునికన్నా, రాజవంశీకునికన్నా గమనార్హమైనవాడు. తూర్పు దిక్కు జనులందరిలో ఆయనే గొప్పవాడు అని పిలువబడ్డాడు. ఆయన పేరును మీరు తప్పక గుర్తుపడతారు​—⁠ఆయనే యోబు. ఆయన గురించి బైబిల్లో ఒక పూర్తి పుస్తకమే ఉంది. అయినా, యోబు సమకాలీనుల్లోని ఒకరైన ఎలీహు అనే పేరుగల ఒక యువకుడు యోబును సరిదిద్దాల్సిన అవసరం ఉందని భావించాడు. అందుకే యోబు తనపైనా, తన చుట్టూ ఉన్నవారిపైనా అత్యధికంగా మనస్సు నిలిపాడని ఎలీహు చెప్పాడు. యోబు 37వ అధ్యాయంలో ఇవ్వబడిన నిర్దిష్టమైన, జ్ఞానయుక్తమైన, మనందరికీ ఎంతో విలువైన ఉపదేశాన్ని కనుగొంటాము.​—⁠యోబు 1:1-3; 32:1–33:⁠12.

4. యోబు 37:⁠14 లో ఎలీహు అలా ప్రబోధించేందుకు నడిపినదేమిటి?

4 యోబు యొక్క ముగ్గురు బూటకపు స్నేహితులు, యోబు ఆలోచనల్లోనో క్రియల్లోనో తప్పుచేశాడని తమకు అనిపించిన రంగాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. (యోబు 15:1-6, 16; 22:​5-10) ఎలీహు ఆ సంభాషణ ముగిసేంతవరకూ ఓర్పుగా వేచివున్నాడు. ఆ తర్వాత ఆయన అంతర్దృష్టిని, జ్ఞానాన్ని ప్రతిబింబిస్తూ మాట్లాడాడు. ఆయన చెప్పినదంతా అక్షరలక్షలు విలువ చేస్తుంది, ఆయన చెప్పిన ఈ కీలకాంశాన్ని గమనించండి: “యోబూ, ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.”​—⁠యోబు 37:⁠14.

ఆ అద్భుత కార్యాలు చేసినవాడు

5. ఎలీహు చెప్పిన ‘దేవుని అద్భుతక్రియల్లో’ ఏమేమి ఇమిడివున్నాయి?

5 యోబు తనపై తానుగానీ, ఎలీహుపై గానీ, ఏ ఇతర మానవులపై గానీ మనస్సు నిలపాలని ఎలీహు చెప్పడంలేదని గమనించండి. యెహోవా దేవుని అద్భుతకార్యాలపై మనస్సు నిలపమని యోబుకూ, అలాగే మనకూ ఎలీహు జ్ఞానయుక్తంగా ఉద్బోధించాడు. ‘దేవుని అద్భుతక్రియలు’ అన్న మాటలో ఏమేం ఇమిడి ఉన్నాయని మీరనుకుంటున్నారు? మీ ఆరోగ్యం గురించీ మీ ఆర్థిక పరిస్థితి గురించీ మీ భవిష్యత్తు గురించీ మీకిప్పటికే ఉన్న చింతలకు అవధానాన్నివ్వడానికి తోడు, మీ కుటుంబ సభ్యులపై తోటిపనివారిపై పొరుగువారిపై మీరు చూపించే ఆసక్తికి తోడు దేవుని అద్భుతకార్యాలపై కూడా ఎందుకు మనస్సు నిలపాలి? యెహోవా దేవుని అద్భుతకార్యాల్లో ఆయన జ్ఞానం, మన చుట్టూ ఉన్న సృష్టిపై ఆయనకున్న అధికారం చేరివున్నాయన్నది విదితమే. (నెహెమ్యా 9:6; కీర్తన 24:1; 104:24; 136:​5, 6) ఈ విషయాన్ని మరింత స్పష్టపర్చడానికి ఇప్పుడు, బైబిలు పుస్తకమైన యెహోషువలోని ఒక విషయాన్ని గమనించండి.

6, 7. (ఎ) మోషే యెహోషువల దినాల్లో యెహోవా ఏ అద్భుతకార్యాలు చేశాడు? (బి) మోషే యెహషువల కాలంలో ఆ కార్యాలు జరిగిన చోట మీరు ఉండుంటే మీరెలా ప్రతిస్పందించివుండేవారు?

6 యెహోవా ప్రాచీన ఐగుప్తు మీదికి తెగుళ్ళను రప్పించాడు, మోషే ప్రాచీన ఇశ్రాయేలీయులను స్వతంత్రులుగా నడిపించేలా ఆయన ఎఱ్ఱ సముద్రాన్ని పాయలుగా చేశాడు. (నిర్గమకాండము 7:1–14:31; కీర్తన 106:7, 21, 22) యెహోషువ మూడవ అధ్యాయంలో అలాంటిదే మరొక సంఘటన ఉంది. మోషే తరువాతివాడైన యెహోషువ, దేవుని ప్రజలను ఒక నది దాటించి వాగ్దాన దేశంలోకి నడిపించాల్సివుంది. యెహోషువ ఇలా అన్నాడు: “రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొను[డి].” (యెహోషువ 3:5) ఎటువంటి అద్భుతకార్యాలు?

7 యెహోవా వారి ముందునుండి మళ్ళీ నీటి అడ్డంకిని, అంటే యొర్దాను నదీప్రవాహాన్ని తొలగించాడని ఆ వృత్తాంతం తెలియజేస్తుంది. అలా, వేలాదిమంది స్త్రీలు, పురుషులు, పిల్లలు ఆరిన నేలమీద ఆవలికి నడిచారు. (యెహోషువ 3:7-17) మనం గనుక అక్కడ ఉండివుంటే, కళ్ళముందున్న నదీ ప్రవాహం నిలిచిపోయి, నదీశయ్య ఆరిపోగా ఆ ప్రజలందరూ క్షేమంగా ఆవలికి చేరుకోవడం చూసి, నిస్సందేహంగా, ఆహా, ఎంత అద్భుతం అని అనకుండా ఉండేవాళ్లమా! అది ఈ సృష్టిపై దేవునికి ఉన్న శక్తిని ప్రదర్శించింది. అయినప్పటికీ​—⁠ఇప్పుడు కూడా మన జీవితకాలంలో అలాంటి అద్భుతాలే సంభవిస్తున్నాయి. అలాంటివి కొన్ని ఏమిటో, మనం వాటిపై ఎందుకు మనస్సు నిలపాలో చూడడానికి మరలా యోబు 37:5-7ను పరిశీలిద్దాం.

8, 9. యోబు 37:5-7 వచనాలు ఏ అద్భుతకార్యాలను గూర్చి తెల్పుతున్నాయి, వాటిని గురించి మనమెందుకు ఆలోచించాలి?

8 ఎలీహు ముందు ఇలా అన్నాడు: “దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన చేయును.” దేవుడు “ఆశ్చర్యముగా” చేసే క్రియలను గురించి ఎలీహు మనస్సులో ఏం ఉంది? ఎలీహు మంచును గురించీ కుండపోతగా కురిసే వర్షం గురించీ తర్వాత పేర్కొంటున్నాడు. ఇవి రెండూ పొలంలో పనిచేసే వ్యవసాయదారుని పనిని ఆపుజేస్తాయి. తద్వారా దేవుని క్రియల్ని గురించి ధ్యానించడానికి ఆ వ్యవసాయదారునికి సమయమూ కారణమూ లభిస్తాయి. మనం వ్యవసాయదారులం కాకపోవచ్చు. అయినా, వర్షము మంచు మనపై ప్రభావం చూపుతుండవచ్చు. మనం భూమిపై ఏ ప్రాంతంలో జీవిస్తున్నామన్న దాన్నిబట్టి అటు మంచు పడినప్పుడుగానీ, ఇటు వర్షం కురిసినప్పుడుగానీ మన పనులకు కూడా భంగం వాటిల్లవచ్చు. అటువంటి అద్భుతాల వెనుక ఎవరున్నారో, దీనంతటికీ అర్థమేమిటో ధ్యానించడానికి మనం సమయం వెచ్చిస్తామా? మీరు ఎప్పుడైనా అలా చేశారా?

9 మనం 38వ అధ్యాయంలో చదువుతున్నట్లుగా, యెహోవా దేవుడే సరిగ్గా ఆ దిశలోనే ఒక ఆలోచనను ప్రవేశపెట్టడం గమనార్హం, దేవుడు అర్థవంతమైన ప్రశ్నల్ని యోబుపైకి సంధించాడు. మన సృష్టికర్త ఈ ప్రశ్నల్ని మొదట యోబునే అడిగినప్పటికీ, అవి మన మనోవైఖరిపైనా మన ఉనికిపైనా మన భవిష్యత్తుపైనా గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకని దేవుడు ఏమని ప్రశ్నిస్తున్నాడో, అలాగే దాని భావమేమిటో మనం చూద్దాం. అవును, యోబు 37:⁠14 ఏమి ఉద్బోధిస్తుందో అది చేద్దాం.

10. యోబు 38వ అధ్యాయం మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అది ఏ ప్రశ్నలను ఉదయింపజేస్తుంది?

10యోబు 38వ అధ్యాయం ఇలా ప్రారంభమౌతుంది: “అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను​—⁠జ్ఞానములేని మాటలు చెప్పి​—⁠ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.” (యోబు 38:1-3) ఒక విధంగా, ఈ మాటలు తాను తరువాత చెప్పబోయేదానికి ఉపోద్ఘాతంగా ఉన్నాయి. ఈ విశ్వానికే సృష్టికర్త అయిన వ్యక్తి ఎదుట తాను నిలుస్తున్నాననే వాస్తవానికి అనుగుణంగా, ఆ దేవునికి తాను జవాబుదారిననే వాస్తవానికి అనుగుణంగా యోబు తన ఆలోచనా విధానాన్ని సరిదిద్దుకోవడానికి ఇది సహాయం చేసింది. మనమూ, మన సమకాలీనులు కూడా అలానే చేయడం మంచిది. ఇంతకు మునుపు ఎలీహు ప్రస్తావించినలాంటి వాటినే దేవుడు పేర్కొంటున్నాడు. “నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. . . . దాని మూలరాతిని వేసినవాడెవడు?”​—⁠యోబు 38:4-7.

11. యోబు 38:4-6 వచనాలు మనం ఏ విషయాల్ని గ్రహించడానికి నడిపించాలి?

11 ఈ భూమి ఉద్భవించినప్పుడు యోబు ఎక్కడున్నాడు​—⁠నిజానికి మనమెక్కడ ఉన్నాం? అప్పుడు మనం ఆర్కిటెక్టులుగానో లేదా జూనియర్‌ ఆర్కిటెక్టులుగానో ఉండి, మన భూమికి నమూనాల్ని వేస్తూ ఉన్నామా, ఒక రూళ్ళకర్ర చేతపట్టుకుని దానికి కొలతలు గీస్తూ ఉన్నామా? లేము, మనమప్పుడు ఎక్కడా లేము! మానవులు అప్పుడు ఉనికిలోనే లేరు. మన భూమిని ఒక పెద్ద భవంతితో పోలుస్తూ దేవుడు, “దాని మూలరాతిని వేసినవాడెవడు?” అని అడుగుతున్నాడు. మనం భూమిమీద జీవిస్తూ వర్ధిల్లడానికి వీలుగా, మన భూమి సూర్యుడి నుండి ఖచ్చితమైన దూరంలో ఉంచబడిందని మనకు తెలుసు. దాని పరిమాణం కూడా సరైనదే. మన గ్రహం మరింత పెద్దదిగా ఉన్నట్లైతే, హైడ్రోజన్‌ వాయువు భూ వాతావరణం నుండి బయటికి వెళ్ళేది కాదు, తద్వారా భూమిపై జీవం మనగల్గివుండేదీ కాదు. ఎవరో “దాని మూలరాతిని” సరైన స్థానంలో వేశారన్నది స్పష్టం. దానికి ఘనత యోబుకు దక్కాలా? మనకు దక్కాలా? లేక యెహోవా దేవునికి దక్కాలా?​—⁠సామెతలు 3:19; యిర్మీయా 10:⁠12.

ఏ మానవుని దగ్గర సమాధానాలు ఉన్నాయి?

12. యోబు 38:6 లో లేవనెత్తబడిన ప్రశ్న మనం దేని గురించి ఆలోచించేలా చేస్తుంది?

12 దేవుడు ఇలా కూడా ప్రశ్నించాడు: “దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము?” ఇది చాలా మంచి ప్రశ్న కదూ! యోబుకు తెలియని గురుత్వాకర్షణ శక్తి అనే ఒక మాట మనకు తెలుసు. ఎంతో గొప్ప ద్రవ్యరాశి ఉన్న సూర్యుని గురుత్వాకర్షణ శక్తి మన భూమిని దాని స్థానంలో ఉంచుతుందని మనలో చాలామందికి తెలుసు. అలంకారికంగా చెప్పాలంటే దాని స్తంభాల పాదులు కట్టబడ్డాయి. అయినా, మనలో గురుత్వాకర్షణ శక్తిని పూర్తిగా అర్థం చేసుకున్నవారెవరు?

13, 14. (ఎ) గురుత్వాకర్షణ గురించి ఏమి గ్రహించాలి? (బి) యోబు 38:6 లో ఉన్నతపర్చబడిన పరిస్థితికి మనం ఎలా ప్రతిస్పందించాలి?

13 ఇటీవల విశ్వం వివరించబడింది (ఆంగ్లం) అనే ఆకర్షణీయమైన పేరుతో ముద్రించబడిన గ్రంథం, ‘గురుత్వాకర్షణ శక్తి అనేది అందరికీ తెలిసిన ఒక ప్రకృతి శక్తి, కానీ దాని గురించి ప్రజలకు అతి తక్కువగా తెలుసు’ అని ఒప్పుకుంటుంది. ఈ పుస్తకం ఇంకా ఇలా అంటుంది: “గురుత్వాకర్షణ శక్తి శూన్య విశ్వం గుండా తక్షణమే ప్రయాణిస్తున్నట్లు కన్పిస్తుంది, అది కూడా ఎటువంటి మాధ్యమమూ లేకుండానే. అయితే గురుత్వాకర్షణ శక్తి గ్రావిటాన్లు అని పిలువబడిన కణాలతో రూపొందిన తరంగాలద్వారా ప్రయాణిస్తుండవచ్చని ఇటీవలి సంవత్సరాల్లో భౌతికశాస్త్రవేత్తలు ఊహాకల్పనలు చేయడం ప్రారంభించారు . . . కానీ అవి ఉనికిలో ఉన్నాయని మాత్రం ఎవ్వరూ అంత ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.” దానర్థం ఏమిటో ఒక్కసారి ఆలోచించండి.

14 యెహోవా యోబును ఆ ప్రశ్నలు అడిగినప్పటి నుండి విజ్ఞానశాస్త్రం 3,000 సంవత్సరాల అభివృద్ధిని సాధించింది. అయినా, ఇటు మనం గానీ అటు ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్తలు గానీ గురుత్వాకర్షణ శక్తిని గురించి వివరించలేకపోతున్నారు, కానీ మన భూమి దాని సరైన కక్ష్యలో పరిభ్రమిస్తోంది కనుకనే మనం ఇక్కడ జీవితాన్ని ఆనందంతో సాగించగలుగుతున్నాము. (యోబు 26:7; యెషయా 45:18) మేము ఇదంతా చెప్తున్నది మీరిప్పుడు గురుత్వాకర్షణ శక్తి మర్మాలేమిటో శోధించడానికి మీ తలలు బద్దలుకొట్టుకోవాలని కాదు. బదులుగా, దేవుని అద్భుతకార్యాల్లోని కేవలం ఈ ఒక్క అంశంపై మనస్సు నిలపడం కూడా, మీరాయన్ని దృష్టించే విధానాన్ని ప్రభావితం చేయాలనే చెప్తున్నాం. అది, ఆయనను గురించిన, ఆయన జ్ఞానము, పరిజ్ఞానముల బాహుళ్యాన్ని గురించిన మీ సంభ్రమాన్ని పెంచుతుందా, మనం ఆయన చిత్తాన్ని నేర్చుకోవల్సిన అవసరం ఎందుకుందన్న విషయంలో మీ స్పృహను పెంచుతుందా?

15-17. (ఎ) యోబు 38:​8-11 దేనిపై దృష్టిసారిస్తుంది, ఏ ప్రశ్నలకు నడిపిస్తుంది? (బి) సముద్రాలను గూర్చిన, భూగోళంపై వాటి విస్తరణను గూర్చిన పరిజ్ఞానం మూలంగా ఏమి ఒప్పుకోవాల్సివుంది?

15 మన సృష్టికర్త తన ప్రశ్నల పరంపరను ఇలా కొనసాగిస్తున్నాడు: “సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు​—⁠నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?”​—⁠యోబు 38:​8-11.

16 సముద్రాల్ని తలుపులచేత మూయడం అనే ప్రక్రియలో ఖండాలు, మహాసముద్రాలు, ఆటుపోటులు వంటి విషయాలు చేరివున్నాయి. మనుష్యుడు వీటిని ఎంత కాలంగా గమనిస్తూ అధ్యయనం చేస్తూ ఉన్నాడు? వేలాది సంవత్సరాలుగా చేస్తూవున్నాడు​—⁠గత కొన్ని శతాబ్దాలుగానైతే మరింత తీవ్రతరంగా అధ్యయనం చేస్తున్నాడు. వీటిని గురించి తెలియాల్సినదంతా ఇప్పటికే తెలిసి ఉండాల్సిందని మనం అనుకోవడం సులభమే. అయినప్పటికీ, ఈ 2001వ సంవత్సరంలో మీరీ విషయాన్ని గూర్చి లోతుగా పరిశోధిస్తే, లోకంలోని అతిపెద్ద గ్రంథాలయాల్లోని పరిశోధనా సౌకర్యాల్లో అత్యాధునిక సమాచారం కోసం పరిశీలిస్తే మీకేం తెలుస్తుంది?

17 ఒక ప్రఖ్యాత రిఫరెన్సు గ్రంథం ఈ విధంగా ఒప్పుకోవడం మీరు గమనిస్తారు: “భూగోళ ఉపరితలంపై, ఖండాల విస్తరణా మహాసముద్రాల విస్తరణా, భూమ్మీది మరితర రూపురేఖల విస్తరణా ఎంతోకాలంగా వైజ్ఞానిక పరిశోధనలోనూ వైజ్ఞానిక సిద్ధాంతాల స్థాపనలోనూ అత్యంత ఆసక్తికరమైన సమస్యలుగా ఉన్నాయి.” అలా అన్న తర్వాత, వీటిని వివరించడానికి బహుశా నాలుగు రకాల వివరణలున్నాయని ఆ విజ్ఞానసర్వస్వం పేర్కొంటుంది, కానీ ఇవి కూడా “అనేకమైన పరికల్పనల్లో కొన్ని” మాత్రమేనని అది చెబుతుంది. మీకు తెలిసినట్లుగా పరికల్పన అనే పదం “తాత్కాలిక వివరణనే తప్పించి తగినన్ని సాక్ష్యాధారాలను ఇవ్వలేదనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది.”

18. యోబు 38:​8-11 మిమ్మల్ని ఏ ముగింపుకు నడిపిస్తుంది?

18యోబు 38:​8-11 వచనాల్లో మనం చదివే ప్రశ్నలు ఎంత సమయోచితమో అది ఉన్నతపర్చడం లేదంటారా? భూమిపైని ఈ రూపురేఖలన్నింటినీ ఏర్పాటు చేసినందుకు ఘనత, మనకు చెందాల్సింది కాదన్న విషయం ఒప్పుకోవాల్సిందే. తన ఆకర్షణశక్తి ద్వారా సముద్రాల్లో ఆటుపోట్లను సృష్టించేలా చంద్రుణ్ణి ఆకాశంలో పెట్టింది మనం కాదు. ఈ ఆటుపోటులు తీరాల్ని పూర్తిగా దాటిరావు, మనల్ని వెల్లువలా ముంచెత్తవు కూడాను. ఇవన్నీ ఎవరు చేశారో మీకు తెలుసు, అద్భుతకార్యాలు చేసేవాడు కాదూ!​—⁠కీర్తన 33:⁠7; 89:⁠9; సామెతలు 8:​29; అపొస్తలుల కార్యములు 4:​24; ప్రకటన 14:⁠7.

యెహోవాకు చెందాల్సిన ఘనతను ఆయనకే ఇవ్వండి

19. యోబు 38:12-14 లో వివరించబడిన కవితారూపమైన వ్యక్తీకరణలు ఏ భౌతిక వాస్తవాల వైపుకు మన అవధానాన్ని త్రిప్పుతున్నాయి?

19 భూభ్రమణం అనే ప్రక్రియకు ఘనత మానవులకు చెందాల్సింది కాదు. ఇది యోబు 38:12-14 వచనాల్లో సూచించబడింది. అతి తరచుగా అద్భుతమైన అందంతో ప్రతి రోజు అరుణోదయం జరగడానికి ఈ భూభ్రమణమే కారణం. మెత్తని బంకమన్నుపైన ఒక మూసవుంచి నెమ్మదిగా తీసినప్పుడు ఆ బంకమన్ను ఆకృతి ఎలా మారుతుందో అలా, తూర్పున సూరీడు ఉదయిస్తుండగా, మన భూగోళంపైని ఆకృతులు, రూపురేఖలు మరింత స్పష్టం అవుతూ ఉంటాయి. మనం భూభ్రమణంపై కొంచెంసేపు మనస్సును నిలిపినా భూమి మరీ అంత వేగంగా ఏమీ తిరగడం లేదని గ్రహించి ఎంతో విస్మయం చెందాల్సిందే, అలా తిరిగినట్లైతే సర్వనాశనమే జరుగుతుంది. అదే సమయంలో అది మరీ నెమ్మదిగా కూడా తిరగడం లేదు; అలాగే గనుక జరిగినట్లైతే, పగటి సమయము రాత్రి సమయము మరింత ఎక్కువగా ఉండి అటు విపరీతమైన వేడి ఇటు విపరీతమైన చలి ఉండడంతో మానవ జీవనమే అసాధ్యమైపోయుండేది. నిజాయితీగా ఆలోచించండి, మనుష్యులు కాక దేవుడే భూభ్రమణ వేగాన్ని నిర్ణయించినందుకు మనం ఎంతో సంతోషించాలి.​—⁠కీర్తన 148:1-5.

20. యోబు 38:16, 18 లోని ప్రశ్నలకు మీరెలా ప్రతిస్పందిస్తారు?

20 ఇప్పుడు, దేవుడు మీపై మరిన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు ఊహించుకోండి. “సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?” సముద్ర శాస్త్రజ్ఞుడు కూడా వీటికి సంపూర్ణమైన జవాబుల్ని ఇవ్వలేడు! “భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసినయెడల చెప్పుము.” (యోబు 38:16, 18) మీరు భూమ్మీది ప్రతి ప్రదేశాన్నీ సందర్శించి పరిశోధించారా​—⁠లేక కనీసం అందులో కొంత భాగాన్నైనా పరిశీలించారా? మన భూగ్రహంలోని అందమైన ప్రదేశాలపై, అందులోని అద్భుతాలపై మనస్సు నిలపడానికి ఎన్ని జీవితకాలాలు వెచ్చించవలసి వస్తుంది? అవెన్ని జీవితకాలాలైనా సరే, ఎంత అత్యద్భుతంగా గడిచిపోతాయో కదా!

21. (ఎ) యోబు 38:​19, 20 లోని ప్రశ్నలు ఏ శాస్త్రీయ దృక్కోణాల్ని చర్చలోకి తీసుకువస్తాయి? (బి) కాంతిని గూర్చిన వాస్తవాలు మనం ఏమి చేయడానికి మనల్ని నడిపించాలి?

21 ఇప్పుడు 19, 20 వచనాల్లోని లోతైన ప్రశ్నల్ని కూడా పరిశీలించండి: “వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?” కొలనులోని నీటి అలల్లా, కాంతి ఒక తరంగం రూపంలో పయనిస్తుందని వైజ్ఞానికులు ఎంతో కాలంగా భావించారన్న విషయం మీకు తెలుసు. చివరికి 1905వ సంవత్సరంలో, కాంతి శక్తి పొట్లాలుగా, అంటే శక్తి కణాలుగా ప్రవర్తిస్తుందని అల్బర్ట్‌ ఐన్‌స్టైన్‌ సిద్ధాంతీకరించాడు. ఐన్‌స్టైన్‌ వివరణలే సంపూర్ణమా? ఇటీవల ప్రచురించబడిన ఒక విజ్ఞానసర్వస్వం, “వెలుగు ఒక తరంగమా లేక ఒక కణమా?” అని ప్రశ్నించింది. అది ఇలా సమాధానమిస్తుంది: “[కాంతి] అటు తరంగమూ ఇటు కణము రెండూ అయివుండదనే అన్పిస్తుంది, ఎందుకంటే [తరంగము, కణముల] రెండు నమూనాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. దీనికి అతి శ్రేష్ఠమైన జవాబేమిటంటే, కాంతి ఖచ్చితంగా రెండూ కాదన్నదే.” ఈ విషయంలో మానవుడు దేవుని హస్తకృత్యాల్ని పూర్తిగా వివరించలేకపోతున్నప్పటికీ, మనం (ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా) సూర్యరశ్మి వెచ్చదనాన్ని ఆనందిస్తుంటాం. చెట్లు కాంతికి ప్రతిస్పందించడం ద్వారా, అవి ఉత్పత్తి చేసే ఆహారము ప్రాణవాయువులను మనం తీసుకుంటుంటాము. కాంతి మూలంగానే మనం ఏదైనా చదవగలుగుతాం, మన ప్రియ స్నేహితుల ముఖారవిందాల్ని ఆనందంతో తిలకించగలుగుతాం, సూర్యాస్తమయాల్ని వీక్షించగలుగుతాం, ఇంకా ఎన్నెన్నో పనుల్ని చేయగలుగుతాం. ఇవన్నీ చేస్తూవుండగా, మనం దేవుని అద్భుతకార్యాలను గుర్తించవద్దా?​—⁠కీర్తన 104:1, 2; 145:5; యెషయా 45:7; యిర్మీయా 31:⁠35.

22. దేవుని అద్భుతకార్యాలకు దావీదు ఎలా ప్రతిస్పందించాడు?

22 దేవుని అద్భుతకార్యాలను ధ్యానించడానికి గల లక్ష్యం మనమేదో గొప్పగా ప్రభావితం అయిపోవడమేనా, వాటిని చూసి మనం అవాక్కయిపోయి విస్మయం చెందడమేనా? ఎంతమాత్రం కాదు. ప్రాచీన కీర్తనకర్త దేవుని కార్యాలన్నింటినీ ఆకళింపు చేసుకుని వాటిపై వ్యాఖ్యానించడం అసాధ్యమని అంగీకరించాడు. దావీదు ఇలా వ్రాశాడు: “యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలు . . . బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి.” (కీర్తన 40:⁠5) కానీ ఈ అత్యద్భుతమైన కార్యాల విషయంలో మనం మౌనంగా ఉండాలని మాత్రం ఆయన ఉద్దేశం కాదు. కీర్తన 9:1 లో వ్యక్తం చేయబడిన తన కృత నిశ్చయం ద్వారా దావీదు దీన్ని రుజువుచేశాడు: “నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివరించెదను.”​—⁠కీర్తన 9:⁠1.

23. దేవుని అద్భుతకార్యాల పట్ల మీ ప్రతిస్పందన ఏమిటి, మీరు ఇతరులకు ఎలా సహాయం చేయగలరు?

23 మనం కూడా అలానే కదిలించబడవద్దా? దేవుని అత్యద్భుత కార్యాల పట్ల మనలో విస్మయంతో కూడిన భావన కలిగి, ఆయన గురించీ ఆయన చేసిన వాటి గురించీ, ఆయన చేయబోయే వాటి గురించీ ఇతరులతో మాట్లాడేందుకు మనం కదిలించబడవద్దా? జవాబు సుస్పష్టం​—⁠మనం తప్పకుండా ‘అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించాలి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించాలి.’ (కీర్తన 96:​3-5) అవును, దేవుని గురించి మనం నేర్చుకున్న వాటిని ఇతరులతో పంచుకోవడం ద్వారా ఆయన చేసిన అద్భుతకార్యాల పట్ల నమ్రతతో కూడిన మన మెప్పుదలను ప్రదర్శించగలము. ఆ ఇతరులు, సృష్టికర్తను విసర్జించిన సంస్కృతిలో పెరిగిన వారైనప్పటికీ మన అనుకూలమైన, సమాచారాత్మకమైన వ్యాఖ్యానాలు దేవుణ్ణి గుర్తించేలా వారిని మేల్కొల్పవచ్చును. అంతకంటే ముఖ్యంగా, “సమస్తమును సృష్టించి”న వానిని గురించీ, అద్భుతకార్యాలు చేసినవానిని గురించీ వారు నేర్చుకుని ఆయనను సేవించేలా కదిలించగలవు.​—⁠ప్రకటన 4:​10, 11.

మీరెలా ప్రతిస్పందిస్తారు?

యోబు 37:14 లో చేయబడిన ప్రబోధం దేవుని ఏ కార్యాలను గూర్చి ఆలోచించేందుకు నడిపిస్తుంది?

యోబు 37, 38 అధ్యాయాల్లో ఉన్నతపర్చబడిన ఏ కొన్ని అంశాలను విజ్ఞానశాస్త్రం ఇంకా పూర్తిగా వివరించలేకపోతోంది?

• దేవుని అద్భుతకార్యాలను గూర్చి మీరు ఏమని భావిస్తున్నారు, అవి ఏమి చేయడానికి మిమ్మల్ని కదిలిస్తున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[7వ పేజీలోని చిత్రం]

సముద్రానికి హద్దులు ఏర్పరచి, దాన్ని ముందుకు రానీయకుండా చేసినవారెవరు?

[7వ పేజీలోని చిత్రం]

దేవుడు సృజించిన ఈ భూమ్మీది అతి సుందరమైన ప్రదేశాలన్నింటినీ ఎవరు సందర్శించారు?