కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని అద్భుతకార్యాలపై మనస్సు నిలపండి

దేవుని అద్భుతకార్యాలపై మనస్సు నిలపండి

దేవుని అద్భుతకార్యాలపై మనస్సు నిలపండి

“యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. . . . నీకు సాటియైనవాడొకడును లేడు.”​—కీర్తన 40:⁠5.

1, 2. దేవుని అద్భుతకార్యాలను గురించిన ఎలాంటి రుజువు మనకు ఉంది, అది మనం ఏమి చేసేలా పురికొల్పాలి?

మీరు బైబిలు చదువుతుండగా ప్రాచీన ఇశ్రాయేలీయులైన తన ప్రజల కోసం దేవుడు అద్భుతకార్యాలు చేశాడని మీరు వెంటనే తెలుసుకుంటారు. (యెహోషువ 3:5; కీర్తన 106:​7, 21, 22) వారి విషయంలో జోక్యం చేసుకున్నట్లుగా ప్రస్తుతం మానవ వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకోనప్పటికీ, ఆయన అద్భుతకార్యాల విషయంలో మాత్రం మన చుట్టూ ఎన్నో రుజువులు మనం కనుగొంటాము. అందుకే “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది” అని చెప్తున్న కీర్తనకారునితో మనం కూడా చెప్పేందుకు మనకు కారణముంది.​—⁠కీర్తన 104:24; 148:1-5.

2 నేడు చాలామంది సృష్టికర్త కార్యాలకుగల అంతటి స్పష్టమైన రుజువుల్ని అలక్ష్యం చేస్తున్నారు లేక తృణీకరిస్తున్నారు. (రోమీయులు 1:​20) అయితే మనం, వాటి గురించి ఆలోచించి మన సృష్టికర్త ఎదుట మనకుగల స్థానానికి సంబంధించి, ఆయనపట్ల మనకుగల బాధ్యతకు సంబంధించి కొన్ని నిర్ధారణలకు రావాలి. అలా చేయడం మనకే మంచిది. అందుకు యోబులోని 38-41 అధ్యాయాలు గొప్ప సహాయకంగా ఉన్నాయి, ఎందుకంటే ఆ అధ్యాయాల్లో తన అద్భుతకార్యాల్లో కొన్ని అంశాలను యెహోవా యోబు దృష్టికి తెచ్చాడు. దేవుడు లేవనెత్తిన కొన్ని యుక్తమైన అంశాలను పరిశీలించండి.

శక్తివంతమైన, అద్భుతమైన కార్యాలు

3. యోబు 38:​22, 23, 25-29 లో నివేదించబడినట్లుగా దేవుడు వేటిని గూర్చి అడిగాడు?

3 ఒక సందర్భంలో యోబును దేవుడు ఇలా ప్రశ్నించాడు: “నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలముకొరకును, యుద్ధముకొరకును, యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?” భూమి మీద అనేక ప్రాంతాల్లో మంచు, వడగండ్లు కురవడం సర్వసాధారణం. దేవుడు ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు: “నిర్మానుష్య ప్రదేశముమీదను, జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును, పాడైన యెడారిని తృప్తిపరచుటకును, లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయంచు వాడెవడు? వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?”​—⁠యోబు 38:22, 23, 25-29.

4-6. మంచు విషయంలో మానవుని జ్ఞానము ఏ విధంగా అసంపూర్ణంగా ఉందని చెప్పవచ్చు?

4 ఉరుకులు పరుగులతో కూడిన సమాజంలో జీవితాల్ని గడుపుతూ, ఎటువంటి ఆటంకాలూ లేకుండా ప్రయాణించాలని కోరుకునేవారు కొందరు మంచు కురిసినప్పుడు దాన్నొక పెద్ద సమస్యగా దృష్టిస్తుంటారు. అయితే మరితరులెంతో మంది మంచు కురిసినప్పుడు, దాని మూలంగా నీరు లభిస్తుందనీ, అలాగే వైవిధ్యభరితమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలతో శీతాకాలపు అద్భుత ప్రపంచాన్ని ముందుంచే ఒక ఆహ్లాదకరమైన సమయంగానూ పరిగణిస్తారు. దేవుడు అడిగిన ప్రశ్నను మనసులో ఉంచుకొని చూస్తే, మంచును గురించిన సునిశితమైన అవగాహన మీకు ఉన్నదా, కనీసం అదెలా ఉంటుందో మీకు తెలుసా? నిజమే, బహుశా ప్రత్యక్షంగా చూడడం వల్లనో లేదా ఫోటోల్లో చూడడం వల్లనో మంచు పర్వతాలు ఎలా ఉంటాయో మీకు తెలిసుండవచ్చు. కానీ ఒక్కొక్క మంచు రేణువు సంగతేమిటి? అవెలా ఉంటాయో మీకు తెలుసా, వాటి జన్మస్థానంలో వాటిని పరీక్షించారా?

5 కొందరు మంచు రేణువుల్ని ఫోటోలు తీయడానికి అధ్యయనం చేయడానికి దశాబ్దాలు వెచ్చించారు. ఒక్కొక్క మంచు రేణువులో 100 చిన్నచిన్న మంచు స్ఫటికాలు ఉంటాయి. అవన్నీ చెప్పలేనంత వైవిధ్యంతో, రమణీయమైన రూపాల్లో ఉంటాయి. అట్మాస్ఫియర్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “మంచు రేణువుల్లోని అనంతమైన వైవిధ్యం సర్వత్రా తెలిసినదే. అవన్నీ ఒకేలా ఉండకుండా ప్రకృతిలోని ఏ నియమమూ అడ్డుకోవడం లేదని శాస్త్రజ్ఞులు నొక్కిచెబుతున్నప్పటికీ, ఒకేలా ఉన్న రెండు మంచు రేణువులు ఇప్పటివరకూ కనబడలేదు. విల్సన్‌ ఎ. బెంట్లీ . . . అసాధారణమైన రీతిలో ఒక విస్తృతమైన పరిశోధనను నిర్వహించాడు. ఆయన 40 సంవత్సరాలకు పైగా మంచు రేణువుల్ని ఫోటోలు తీస్తూ, మైక్రోస్కోపులో వాటిని పరిశీలించాడు, ఏ రెండూ కూడా అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండడం ఆయనకు కనిపించలేదు.” ఏదో అరుదైన సందర్భంలో రెండు కవలల్లా కనిపించినప్పటికీ మంచు రేణువుల గొప్ప వైవిధ్యంపట్ల మనకున్న అద్భుతభావన లేకుండా పోతుందా?

6 దేవుడు వేసిన ప్రశ్నను గుర్తుకు తెచ్చుకోండి: “హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?” చాలామంది మేఘాలను మంచుకు నిధులుగా భావిస్తారు. అలాంటి నిధులలోనికి ప్రవేశించి, అనంతమైన వైవిధ్యాలుగల ఆ మంచు రేణువులను మీరు లెక్కిస్తున్నట్లు ఊహించుకోగలరా? లేదా కనీసం అవెలా ఏర్పడతాయో పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లు ఊహించుకోగలరా? ఒక విజ్ఞానశాస్త్ర సర్వసంగ్రహ నిఘంటువు ఇలా చెబుతోంది: “దాదాపు మైనస్‌ 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ (-40 డిగ్రీ ఫారన్‌హీట్‌) ఉష్ణోగ్రత వద్ద మేఘాల్లోని నీటిబిందువులు ఘనీభవించేలా చేసేందుకు అవసరమైన మంచు పరమాణు కేంద్రకాల స్వభావం, అవి ఏర్పడే విధానం ఇప్పటి వరకూ స్పష్టంగా తెలియదు.”​—⁠కీర్తన 147:16, 17; యెషయా 55:9, 10.

7. వర్షం విషయంలో మానవుని జ్ఞానము ఎంత విస్తృతంగా ఉంది?

7 మరి వర్షం సంగతేమిటి? దేవుడు యోబును ఇలా అడిగాడు: “వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?” అదే విజ్ఞానసర్వస్వం ఇలా చెబుతోంది: “వాయుమండల చలనాలు ఎంతో సంక్లిష్టంగా ఉండడం మూలంగా, గాలిలో తేమ అలాగే రేణువుల మొత్తం చాలా భిన్నంగా ఉండడం మూలంగా మేఘాలు ఎలా ఏర్పడతాయో వర్షం ఎలా కురుస్తుందో చెప్పడానికి, వివరణాత్మకమైన ఒక సిద్ధాంతాన్ని రూపొందించడం అసాధ్యమన్నట్లు కన్పిస్తుంది.” శాస్త్రజ్ఞులు కేవలం వివరణాత్మకమైన సిద్ధాంతాల్ని ప్రతిపాదిస్తున్నారే గానీ వర్షాన్ని గురించి పూర్తిగా వివరించలేకపోతున్నారు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ, మనకు ప్రాణాధారమైన వర్షం కురుస్తూనే ఉంటుందని మీకు తెలుసు. అది భూమిని తడిపి, మొక్కలకు పోషణనిచ్చి, ఇక్కడ జీవం మనగల్గేలా సాధ్యపరుస్తుంది, ఆహ్లాదభరితంగా ఉండేలా చేస్తుంది.

8. అపొస్తలుల కార్యములు 14:⁠17 లో నమోదు చేయబడిన పౌలు మాటలు ఎందుకు యుక్తమైనవి?

8 అపొస్తలుడైన పౌలు చేరుకున్న ముగింపుకే మీరూ చేరుకోరా? ఈ అద్భుతమైన కార్యాల్లో, వాటిని చేస్తున్నవాని గురించిన సాక్ష్యాన్ని చూడమని ఆయన ఇతరులకు ఉద్బోధించాడు. పౌలు యెహోవా దేవుని గురించి ఇలా చెప్పాడు: “ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలే[దు].”​—⁠అపొస్తలుల కార్యములు 14:17; కీర్తన 147:⁠8.

9. దేవుని యొక్క గొప్ప శక్తిని ఆయన అద్భుతకార్యాలు ఎలా ప్రదర్శిస్తున్నాయి?

9 అటువంటి అద్భుతమైన ప్రయోజనాత్మకమైన కార్యాల్ని చేసిన వ్యక్తికి అపారమైన జ్ఞానము, అపరిమితమైన శక్తి ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన శక్తిని గురించి ఒక ఉపమానంగా, దీన్ని గురించి ఆలోచించండి: ప్రతి రోజు 45,000 ఉరుములు మెరుపులతో కూడిన తుపానులు సంభవిస్తుంటాయని చెబుతారు, అంటే సంవత్సరానికి కోటీ 60 లక్షలకు పైగానే. అంటే ఈ క్షణంలోనే ప్రపంచవ్యాప్తంగా 2,000 ఉరుములు మెరుపులతో కూడిన తుపానులు సంభవిస్తూ ఉన్నాయని దీనర్థం. వీటిలో ఒక్క తుపానుకు కారణమౌతున్న మేఘాల్లోని ఒరిపిడి మూలంగా, రెండవ ప్రపంచ యుద్ధంలో వేసిన న్యూక్లియర్‌ బాంబుల్లాంటి పది కన్నా ఎక్కువ బాంబులకు సమానమైన శక్తి విడుదలవుతోంది. ఆ శక్తిలో కొంతభాగాన్ని మీరు మెరుపుల రూపంలో చూస్తారు. అత్యద్భుతంగా కన్పించడమే కాదుగానీ, శక్తివంతమైన ఈ మెరుపులు నిజానికి నత్రజని సమ్మేళనాలు ఉత్పత్తి అయ్యేలా చేసి ఆ సమ్మేళనాలు భూమికి చేరేలా చేస్తాయి. మొక్కలు ఈ నత్రజనిని ప్రకృతి ప్రసాదించిన ఎరువుగా స్వీకరిస్తాయి. కాబట్టి మెరుపులనేవి శక్తికి ప్రదర్శన అని అర్థమౌతుంది, అంతేగాక అవి నిజమైన ప్రయోజనాలను కూడా తీసుకువస్తాయి.​—⁠కీర్తన 104:14, 15.

మీరే ముగింపుకు చేరుకుంటారు?

10. యోబు 38:​33-38 లో కనుగొనబడుతున్న ప్రశ్నలకు మీరైతే ఎలా సమాధానమిస్తారు?

10 మిమ్మల్ని మీరు యోబు స్థానంలో ఉంచుకోండి, సర్వశక్తిమంతుడైన దేవుడే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడని ఊహించుకోండి. అనేకమంది దేవుని అద్భుతకార్యాలపై ఏమాత్రం అవధానం ఇవ్వరని మీరు తప్పకుండా అంగీకరిస్తారు. యోబు 38:33-38 వచనాల్లో మనం చదువుతున్నట్లుగా యెహోవా మనల్నిలా ప్రశ్నిస్తున్నాడు: “ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలువెళ్లి​—⁠చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు, నీవు వాటిని బయటికి రప్పింపగలవా? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివి నిచ్చినవాడెవడు? జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు?”

11, 12. దేవుడు అద్భుతకార్యాలు చేసేవాడని రుజువు చేసే మరి కొన్ని కార్యాలు ఏవి?

11 ఇప్పటి వరకు మనం ఎలీహు లేవనెత్తిన కేవలం కొన్ని అంశాలను, అలాగే “పౌరుషము తెచ్చుకొని” జవాబివ్వమని యెహోవా యోబును అడిగిన కొన్ని ప్రశ్నలను పరిశీలించాం. (యోబు 38:3) మేము “కొన్ని” అని ఎందుకు అంటున్నామంటే, యోబు 38, 39 అధ్యాయాల్లో, సృష్టిలోని మరితర గమనార్హమైన అంశాలపై యెహోవా దృష్టిని కేంద్రీకరించాడు. ఉదాహరణకు ఆయన ఆకాశంలోని నక్షత్రరాశులను గురించి పేర్కొన్నాడు. వాటి నియమాలన్నీ లేదా కట్టడలన్నీ ఎవరికి తెలుసు? (యోబు 38:31-33) యెహోవా యోబు అవధానాన్ని కొన్ని జంతువుల వైపుకు మరల్చాడు​—⁠సింహము, కాకి, కొండ మేక, అడవి గాడిద, గురుపోతు, నిప్పుకోడి, శక్తివంతమైన గుఱ్ఱము, డేగలను పేర్కొన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే, వీటన్నింటికీ వాటి వాటి లక్షణాలను యోబే ఇచ్చాడా అనీ, అవి జీవిస్తూ వర్ధిల్లేలా యోబే చేశాడా అని దేవుడు యోబును అడిగాడు. ఈ అధ్యాయాలను మీరు ఎప్పుడైనా చదివి ఆనందించవచ్చు, ప్రత్యేకంగా మీరు గుఱ్ఱాలు లేదా ఇతర జంతువులపట్ల ఆకర్షితులైతే మరింత ఆనందిస్తారు.​—⁠కీర్తన 50:10, 11.

12 మీరు యోబు 40, 41 అధ్యాయాలను కూడా పరిశీలించవచ్చు, వాటిలో యెహోవా రెండు జంతువుల గురించి ప్రశ్నిస్తూ జవాబులివ్వమని యోబును మళ్ళీ అడిగాడు. మొదటిది భీకరాకారంతో దృఢమైన దేహంతో ఉన్న నీటి గుఱ్ఱము, రెండోది మహాశక్తి సంపన్నమైన నైలునదీ మొసలి. ఇవి రెండూ సృష్టిలోని అద్భుతాలే, ఇవి మన ఆసక్తిని చూరగొన తగినవే. మనం ఏ ముగింపుకు చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం.

13. దేవుని ప్రశ్నలు యోబుపై ఎంతగా ప్రభావం చూపించాయి, అవే విషయాలు మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి?

13 దేవుని ప్రశ్నలు యోబుపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో యోబు 42వ అధ్యాయం మనకు చూపిస్తుంది. యోబు మొదట తనపైనా తర్వాత ఇతరులపైనా మరీ ఎక్కువ అవధానాన్ని ఉంచాడు. కానీ, దేవుని ప్రశ్నల్లో దాగివున్న దిద్దుబాటును స్వీకరించి యోబు తన ఆలోచనను మార్చుకున్నాడు. ఆయనిలా ఒప్పుకున్నాడు: “[యెహోవా,] నీవు సమస్తక్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని.” (యోబు 42:​2, 3) అవును, దేవుని అద్భుతకార్యాలకు అవధానం ఇచ్చిన తర్వాతనే యోబు ఈ కార్యాలన్నీ తన బుద్ధికి మించినవని చెప్పాడు. మనం క్లుప్తంగా పరిశీలించిన సృష్టిలోని ఈ అద్భుతాలు మన మనస్సులపైన కూడా దేవుని అపారమైన జ్ఞానం, శక్తిల సంబంధంగా అలాంటి ముద్రనే వేయాలి. ఎందుకని? ఆయన అపరిమితమైన శక్తి సామర్థ్యాలను చూసి కేవలం సంభ్రమపడడం కోసమేనా? బదులుగా, కేవలం సంభ్రమ పడిపోవడం మాత్రమే కాక మనం అంతకన్నా ఎక్కువగా కదిలించబడాలా?

14. దేవుని అద్భుతకార్యాలకు దావీదు ఎలా ప్రతిస్పందించాడు?

14 అలాంటి వ్యక్తీకరణనే దావీదు కూడా చెప్పడాన్ని 86వ కీర్తనలో మనం కనుగొంటాము. ఆయన 86కు ముందటి కీర్తనలో ఇలా అన్నాడు: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.” (కీర్తన 19:​1, 2) కానీ దావీదు ఇంకా ముందుకు వెళ్ళాడు. కీర్తన 86:​9, 11 వచనాల్లో ఇలా ఉంది: “ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు. నీ కార్యములకు సాటియైన [అద్భుత]కార్యములు లేవు. యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.” సృష్టికర్త చేసిన అద్భుతకార్యాలకు ప్రతిస్పందనగా దావీదుకు ఆయనపట్ల ఉన్న పూజ్యభావంలో భక్తిప్రపత్తులతో కూడిన భయం కూడా ఇమిడివుంది. అది ఎందుకున్నదో మీరు గ్రహించగలరు. ఆ అద్భుతకార్యాలు చేయగల్గినవానిని అప్రీతిపర్చకూడదని దావీదు కోరుకున్నాడు. మనం కూడా అలానే కోరుకోవాలి.

15. దావీదుకున్న భక్తిప్రపత్తులతో కూడిన భయం ఎందుకు యుక్తమైనది?

15 సర్వశక్తుడైన దేవుని చేతిలో ఉన్న అపారమైన శక్తిని ఆయన నియంత్రిస్తాడు గనుక దైవిక అనుగ్రహానికి అర్హులుకాని వారికి విరుద్ధంగా ఆయన దాన్ని ఉపయోగించగలడని కూడా దావీదు గ్రహించి ఉండివుంటాడు. వారి విషయంలో చూస్తే ఆ శక్తి పరమ భయంకరమైనది. దేవుడు యోబును ఇలా అడిగాడు: “నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలముకొరకును, యుద్ధముకొరకును, యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?” మంచు, వడగండ్లు, తుపానులు, గాలులు, మెరుపులు ఇవన్నీ దేవుని అంబులపొదిలోని అస్త్రాలని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఎంత భీకరమైన ప్రకృతి శక్తులో కదా!​—⁠యోబు 38:22, 23.

16, 17. దేవుడు సంభ్రమాశ్చర్యాల్ని కల్గించే శక్తిని కలిగివున్నాడని ఏ దృష్టాంతం చూపిస్తుంది, ఆ శక్తిని గతంలో ఆయన ఎలా ఉపయోగించాడు?

16 వీటిలో ఒకదాని మూలంగా, మీ ప్రాంతంలో ఏదైనా విపత్తు సంభవించడం మీకు గుర్తుండే ఉంటుంది​—⁠అది తుపాను అయినా గాలివానయైనా, వడగండ్ల దాడియైనా, లేక వరదయైనా కావచ్చు. ఉదాహరణకు, 1999వ సంవత్సరాంతంలో, నైరృతి యూరప్‌ గొప్ప తుపాను తాకిడికి గురైంది. వాతావరణ నిపుణులు సహితం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈదురుగాలులు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచాయి, వేలాది గృహాల పైకప్పులను ఎగరగొట్టేశాయి, పెద్ద పెద్ద కరెంటు స్తంభాలను పెకిలించివేశాయి, లారీలను బోల్తాకొట్టించేశాయి. మీ మనస్సులో దీనిని చిత్రీకరించుకోండి: తుపాను మూలంగా, దాదాపు 27 కోట్ల చెట్లు పెకిలించబడ్డాయి, సగానికి విరిగిపోయాయి, పారిస్‌కి వెలుపలనున్న ఒక్క వెర్సైల్స్‌ పార్క్‌లోనే 10,000 చెట్లు నాశనమైన వాటిలో ఉన్నాయి. లక్షలాది గృహాల్లో విద్యుత్తు లేకుండా పోయింది. మృతుల సంఖ్య 100కు చేరుకుంది. దీనంతటికీ కేవలం కొద్దిసేపు వీచిన తుపాను గాలులే కారణం. ఎంతటి శక్తి!

17 ఒక వ్యక్తి తుపానులను అనిర్దిష్టమైన, అనియంత్రితమైన సంఘటనలు అనవచ్చు. అయితే, మహాశక్తి సంపన్నుడైనవాడు, అద్భుతకార్యాలు చేసేవాడు ఒకవేళ అటువంటి శక్తుల్ని నిర్దిష్టంగా, నియంత్రితంగా నిర్దేశిస్తే ఏం జరుగవచ్చు? ఆయన సర్వలోకానికి తీర్పు తీర్చే వ్యక్తి అని తెలుసుకున్న అబ్రాహాము కాలంలో అలాంటి పనిని చేశాడు, సొదొమ గొమొఱ్ఱాలనే రెండు నగరాల దుష్టత్వాన్ని దేవుడు త్రాసులో తూచిచూశాడని అబ్రాహాము గ్రహించాడు. ఆ నగరాలు ఎంతగా భ్రష్టుపట్టిపోయాయంటే వాటిని గురించిన కేకలు దేవునికి చేరాయి. అప్పుడాయన ఆ నగరాల నుండి తప్పించుకొనేలా నీతిమంతులందరికీ సహాయం చేశాడు. చరిత్ర ఇలా చెబుతుంది: “అప్పుడు యెహోవా, . . . యెహోవాయొద్దనుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి” ఆ నగరాలను నేలమట్టం చేశాడు. నీతిమంతుల్ని కాపాడి, ఎటువంటి నిరీక్షణా లేని దుష్టుల్ని నాశనం చేయడమనేది కూడా దేవుని అద్భుతకార్యాల్లో ఒకటే.​—⁠ఆదికాండము 19:24.

18. యెషయా 25వ అధ్యాయం ఏ అద్భుతకార్యాలను గురించి తెలియజేస్తుంది?

18 అటుతర్వాతి కాలంలో, ప్రాచీన నగరమైన బబులోనుకు విరుద్ధంగా యెహోవా ఒక న్యాయనిర్ణయాన్ని తీసుకున్నాడు. బహుశ యెషయా 25వ అధ్యాయంలో ఉన్నది దీని గురించే కావచ్చు. అక్కడ బబులోను నిర్మానుష్యమైన పాడుదిబ్బగా మారిపోతుందని దేవుడు ప్రవచించాడు: “నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారముగల పట్టణము పాడుగాను, అన్యులనగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.” (యెషయా 25:⁠2) ఈ ఆధునిక కాలంలో ఆ ప్రాచీన బబులోను నగరాన్ని సందర్శించే పర్యాటకులు ఇది నిజంగా జరిగిందని ధ్రువీకరిస్తారు. ఇది చరిత్రలో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనా? ఎంతమాత్రం కాదు. బదులుగా, మనం యెషయా నిర్ధారణతో ఏకీభవించవచ్చు: “యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను. నీ నామమును స్తుతించెదను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి.”​—⁠యెషయా 25:⁠1.

భవిష్యత్తులో అద్భుతకార్యాలు

19, 20. యెషయా 25:6-8 లోని ఏ నెరవేర్పును మనం ఎదురుచూడవచ్చు?

19 పైనున్న ప్రవచనాన్ని యెహోవా గతంలో నెరవేర్చాడు, భవిష్యత్తులో కూడా ఆయన అద్భుతకార్యాలు చేస్తాడు. దేవుడు “అద్భుతములు” చేస్తాడని పేర్కొంటున్న ఈ సందర్భంలోనే, ఇంకా నెరవేరని ఒక నమ్మదగ్గ ప్రవచనం కూడా మనకు కనిపిస్తుంది. అది తప్పకుండా నెరవేరుతుంది, బబులోనుపై ప్రవచనాత్మక తీర్పు నెరవేరినట్లే అదీ నెరవేరుతుంది. ఎటువంటి “అద్భుతమును” గురించిన వాగ్దానమది? యెషయా 25:6వ వచనం ఇలా చెబుతుంది: “ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును, మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును, మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును, మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.”

20 దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకంలో ఈ ప్రవచనం తప్పకుండా నెరవేరుతుంది. ఆ లోకం ఎంతో సమీపంలో ఉంది. ఆ కాలంలో, ప్రస్తుతం అనేకమందిని క్రుంగదీస్తున్న సమస్యల నుండి మానవజాతికి విముక్తి లభిస్తుంది. నిజానికి, యెషయా 25:7, 8 లోని ప్రవచనం దేవుడు సృష్టించగలిగే తన శక్తిని ఉపయోగించి, మున్నెన్నడూ ఎరుగనంతటి ఒక అద్భుతకార్యాన్ని చేస్తాడని హామీ ఇస్తుంది: “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.” అపొస్తలుడైన పౌలు ఇదే వృత్తాంతం నుండి ఆ తర్వాత ఉల్లేఖించి దేవుడు, మరణించిన వారిని జీవానికి తిరిగి తీసుకువస్తాడనీ మృతులను పునరుత్థానం చేస్తాడని వ్రాశాడు. అదెంతటి అద్భుతకార్యమై ఉంటుందో గదా!​—⁠1 కొరింథీయులు 15:51-54.

21. మరణించిన వారి విషయంలో దేవుడు ఏ అద్భుతకార్యాలను చేయబోతున్నాడు?

21 శోకంతో కన్నీళ్ళు కార్చే పరిస్ధితి ఇక ఉండదనేందుకు మరొక కారణం ఏమిటంటే, మానవుల శారీరక రుగ్మతలన్నీ తీసివేయబడతాయి. యేసు భూమ్మీద ఉన్నప్పుడు అనేకమందిని స్వస్థపర్చాడు​—⁠అంధులకు దృష్టినిచ్చాడు, చెవిటివారికి వినికిడి శక్తినిచ్చాడు, వికలాంగులకు సత్తువనిచ్చాడు. యోహాను 5:5-9 వచనాల్లో 38 సంవత్సరాలుగా కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తిని ఆయన స్వస్థపర్చడం గురించి మనం చదువుతాము. అది చూసినవారు అదొక అద్భుతం అనుకున్నారు, ఆశ్చర్యకార్యం అనుకున్నారు. కాదు మరి! కానీ అంతకన్నా అద్భుతకరమైన విషయాన్ని గురించి యేసు మాట్లాడాడు: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు, తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.”​—⁠యోహాను 5:​28, 29.

22. బీదలుగాను పీడితులుగాను ఉన్నవారు నిరీక్షణతో ఎందుకు ఎదురు చూడవచ్చు?

22 అది సంభవించడం తథ్యం, ఎందుకంటే దానిని వాగ్దానం చేసినవాడు యెహోవా. ఆయన తన మహా శక్తిని ఉపయోగించినప్పుడు, దాన్ని జాగ్రత్తగా నిర్దేశించినప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయని మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఆయన తన కుమారుడు, రాజు అయిన యేసు క్రీస్తు ద్వారా చేయబోయే వాటి గురించి 72వ కీర్తన చెబుతుంది. అప్పుడు నీతిమంతులు ఉద్భవిస్తారు. శాంతిసమాధానాలు వర్ధిల్లుతాయి. మునుపు బీదలుగాను పీడితులుగాను ఉన్న వారిని దేవుడు విడిపిస్తాడు. ఆయనిలా వాగ్దానం చేశాడు: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట [ప్రాచీన] లెబానోను వృక్షములవలె తాండవమాడుచుండును. నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు.”​—⁠కీర్తన 72:16.

23. ఏమి చేయడానికి దేవుని అద్భుతకార్యాలు మనలను కదిలించాలి?

23 యెహోవా గతంలో ఏమి చేశాడో, ఇప్పుడు మన చుట్టూ ఉన్న సృష్టి అంతట్లో ఏమి చేస్తున్నాడో, సమీప భవిష్యత్తులో ఏమి చేస్తానని వాగ్దానం చేశాడో​—⁠ఈ అద్భుతకార్యాలన్నింటిపై మనం మనస్సు నిలిపేందుకు తగిన కారణాలు అనేకమున్నాయన్నది స్పష్టం. “దేవుడైన యెహోవా, ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్‌, ఆమేన్‌.” (కీర్తన 72:​18, 19) మన బంధువులతోనూ ఇతరులతోనూ చేసే అత్యుత్సాహవంతమైన మన చర్చల్లో అదే క్రమమైన చర్చగా ఉండాలి. అవును, ‘అన్యజనులలో ఆయన మహిమను, . . .సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురిద్దాం.’​—⁠కీర్తన 78:3, 4; 96:3, 4.

[అధ్యయన ప్రశ్నలు]

మీరెలా ప్రతిస్పందిస్తారు?

• యోబుకు వేయబడిన ప్రశ్నలు మానవ జ్ఞానం పరిమితమని ఎలా తెలియజేస్తున్నాయి?

యోబు 37-40 అధ్యాయాల్లో ఉన్నతపర్చబడిన దేవుని అద్భుతకార్యాల్లోని ఏ ఉదాహరణలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి?

• దేవుని అద్భుతకార్యాల్లోని కొన్నింటిని పరిశీలించిన తర్వాత మనం ఎలా ప్రతిస్పందించాలి?

[10వ పేజీలోని చిత్రాలు]

మంచు రేణువుల్లోని అనంతమైన వైవిధ్యం, మెరుపుల్లోని అద్భుతమైన శక్తిని గురించి మీరే ముగింపుకు చేరుకుంటారు?

[చిత్రసౌజన్యం]

snowcrystals.net

[13వ పేజీలోని చిత్రాలు]

మీ సంభాషణలలో క్రమంగా దేవుని అద్భుతకార్యాలు ఉండాలి