కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రతికూల భావాలను తాళుకోవడం ఎలా?

ప్రతికూల భావాలను తాళుకోవడం ఎలా?

ప్రతికూల భావాలను తాళుకోవడం ఎలా?

ఆసాపు ఇలా వాపోయాడు: “నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.”​—కీర్తన 73:13, 14.

బారూకు ఇలా బాధను వ్యక్తంచేశాడు: “కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను.”​—యిర్మీయా 45:⁠3.

నయోమి ఇలా విచారాన్ని వ్యక్తం చేసింది: “సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను . . . నేను సమృద్ధిగల దాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను.”​—రూతు 1:20, 21.

కొన్నిసార్లు నిరుత్సాహ భావాలతో కృంగిపోయిన విశ్వాసులైన యెహోవా ఆరాధకులను గూర్చిన అనేక ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. అపరిపూర్ణ మానవులమైన మనందరికీ కూడా అలాంటి భావాలు అప్పుడప్పుడు వస్తుంటాయన్నది నగ్నసత్యం. విషాదకరమైన అనుభవాల మధ్య జీవించినందున మనలో కొందరు ఇతరులకన్నా ఎక్కువగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉండవచ్చు. బహుశా తనపై తాను జాలి పడొచ్చు కూడా.

ఈ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోతే, అవి ఇతరులతోనూ, యెహోవా దేవునితోనూ మీకున్న సంబంధాన్ని నాశనం చేయగలవు. తనపై తాను జాలిపడుతూ ఉండే ఒక క్రైస్తవ స్త్రీ ఇలా అంగీకరించింది: “సంఘంలో ఉన్న వారితో సహవసించడానికి యోగ్యురాల్ని కాను అని నేను భావించినందున సామాజిక కార్యకలాపాలకు నన్ను రమ్మన్న అనేక ఆహ్వానాల్ని త్రోసిపుచ్చాను.” అలాంటి భావాలు ఒకరి జీవితంపై ఎంత వినాశనకరమైన ప్రభావాన్ని చూపించగలవో కదా! వాటిని త్రిప్పికొట్టడానికి మీరేం చేయగలరు?

యెహోవాను సమీపించండి

కీర్తన 73 లో ఆసాపు తన సందిగ్ధావస్థ గురించి నిజాయితీగా రాశాడు. తన సొంత స్థితిని, వర్ధిల్లుతూ ఉన్న దుష్టులపరిస్థితితో పోల్చినప్పుడు, ఆయన మత్సరపడ్డాడు. భక్తిహీనులు గర్వాంధులుగానూ, బలాత్కారులుగానూ ఉన్నారని ఆయన గమనించాడు, వాళ్ళు శిక్షనొందకుండా తప్పించుకున్నట్టు కనబడింది. అప్పుడు ఆసాపు తాను నీతియుక్తమైన జీవన విధానాన్ని వెంబడించడంలో ఉన్న విలువను గురించిన సందేహాల్ని వ్యక్తపర్చాడు.​—⁠కీర్తన 73:3-9, 13, 14.

తమ చెడు కార్యాల్ని డంబంగా ప్రదర్శించే దుష్టుల పైకి కనిపించే విజయాన్ని ఆసాపులా మీరూ గమనించారా? ఆసాపు తన ప్రతికూల భావాలను ఎలా అధిగమించాడు? ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.” (కీర్తన 73:​16, 17) ప్రార్థనలో యెహోవావైపుకు తిరగడం ద్వారా ఆసాపు అనుకూల చర్యల్ని చేపట్టాడు. అటు తర్వాత అపొస్తలుడైన పౌలు ఉపయోగించిన మాటల్లో చెప్పాలంటే, ఆసాపు “ఆత్మసంబంధియైన” మనుష్యుడ్ని మేల్కొల్పడం ద్వారా “ప్రకృతి సంబంధియైన మనుష్యు[డ్ని]” అణచివేశాడు. పునరుత్తేజపర్చబడిన ఆధ్యాత్మిక దృష్టితో ఆయన యెహోవా దేవుడు చెడుతనాన్ని ద్వేషిస్తాడనీ, తగిన కాలమందు దుష్టులు శిక్షించబడతారనీ తెలుసుకున్నాడు.​—⁠1 కొరింథీయులు 2:14, 15.

జీవిత వాస్తవంపై కేంద్రీకరించేలా మీకు సహాయపడేందుకు బైబిల్ని మీరు అనుమతించడం ఎంత ప్రాముఖ్యమో కదా! దుష్టులు చేసే పనులు తనకు కనబడకుండా పోవడం లేదని యెహోవా మనకు గుర్తు చేస్తున్నాడు. బైబిలు ఇలా బోధిస్తోంది: “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. . . . మేలుచేయుట యందు విసుకక యుందము.” (గలతీయులు 6:7-9) యెహోవా దుష్టులను ‘కాలుజారు చోటనే ఉంచాడు,’ ఆయన వారిని ‘నశించునట్లు పడేస్తాడు.’ (కీర్తన 73:​18) చివరకు దైవిక న్యాయమే ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది.

యెహోవా బల్ల దగ్గర దొరికే నిరంతర ఆధ్యాత్మిక భోజన కార్యక్రమమూ, దేవుని ప్రజలతో చేసే క్షేమాభివృద్ధికరమైన సహవాసమూ మీ విశ్వాసాన్ని బలపర్చుకొని నిరుత్సాహాన్నీ మరితర ప్రతికూల భావాల్నీ అధిగమించుకొనేందుకు మీకు సహాయపడతాయి. (హెబ్రీయులు 10:​24, 25) ఆసాపులానే, దేవునికి సన్నిహితంగా ఉండడం ద్వారా మీరూ యెహోవా దేవుని ప్రేమపూర్వక మద్దతును అనుభవించగలరు. ఆసాపు ఇంకా ఇలా అంటున్నాడు: “నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను. నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు.” (కీర్తన 73:​23, 24) తాను చిన్న పిల్లగా ఉన్నప్పుడే అత్యాచారానికి గురైన ఒక క్రైస్తవురాలు ఆ మాటల్లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకొంది. “సంఘంతో సన్నిహితంగా సహవసించడం, జీవితానికి ఉన్న విభిన్నమైన మరో కోణాన్ని నాకు చూపించింది. క్రైస్తవ పెద్దలు ప్రేమగలవారనీ వాళ్లు పోలీసులు కాదుగాని కాపరులనీ నేను ఎంతో స్పష్టంగా గ్రహించాను” అని ఆమె అంటుంది. అవును, వాత్సల్యపూరితులైన క్రైస్తవ పెద్దలు వినాశనకరమైన భావోద్వేగాల్ని త్రిప్పికొట్టడంలో ఓ ప్రముఖమైన పాత్రను నిర్వహిస్తారు.​—⁠యెషయా 32:1, 2; 1 థెస్సలొనీకయులు 2:7, 8.

యెహోవా సలహాను అంగీకరించండి

యిర్మీయా ప్రవక్తకు కార్యదర్శిగా ఉన్న బారూకు, తన నియామకంలో ఉన్న భావోద్వేగపు ఒత్తిడిని బట్టి మూలిగాడు. అయినా, యెహోవా బారూకు అవధానాన్ని వాస్తవికతపైకి ఎంతో దయాపూర్వకంగా మళ్లించాడు. “నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.”​—⁠యిర్మీయా 45:2-5.

బారూకు స్వార్థపూరిత ఆలోచనలే ఆయన నిరుత్సాహానికి మూలమని యెహోవా నిర్మొహమాటంగా వివరించాడు. దేవుడు తనకు ఇచ్చిన నియామకంలో బారూకు ఆనందాన్ని కనుగొనలేకపోయాడు; అదే సమయంలో తన కోసం గొప్పవాటిని వెదకుతున్నాడు. నిరుత్సాహాన్ని అధిగమించే దిశలో తీసుకునే ప్రతిఫలదాయకమైన చర్య ఏమిటంటే, అంతరాయాలు కలగకుండా జాగ్రత్త వహించి, దైవిక సంతృప్తి నుంచి వచ్చే సమాధానకరమైన మనస్సును హత్తుకోవడమేనని మీరు కూడా తెలుసుకోవచ్చు.​—⁠ఫిలిప్పీయులు 4:6, 7.

నయోమి మోయాబులో తన భర్తనూ, ఇద్దరు కుమారులనూ మరణమందు పోగొట్టుకోవడం వల్ల కృంగుదలకు గురైంది. ఆ కృంగుదల ఆమెను మోయాబు నుంచి తరలి రాకుండా ఆపలేకపోయింది. అయినప్పటికీ, తనకూ, తన ఇద్దరు కోడళ్లకూ సంబంధించిన విషయంలో కొంతకాలం వరకూ ఆమెకు బాధపడినట్లు కనబడుతోంది. తన కోడళ్లను సాగనంపుతూ నయోమి “యెహోవా నాకు విరోధియాయెను; అది మిమ్మును నొప్పించినంతకంటె నన్ను మరి యెక్కువగా నొప్పించినదని” అన్నది. నయోమి బేత్లెహేముకు చేరుకున్న తర్వాత ఆమె “సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి [“ఆహ్లాదము”] అనక మారా [“చేదు”] అనుడి” అని పట్టు పట్టింది.​—⁠రూతు 1:13, 20.

అయితే, యెహోవా నుంచీ ఆయన ప్రజల నుంచీ దూరమైపోయి శోక గుడారాల్లో ఒంటరితనంతో నయోమి మ్రగ్గిపోలేదు. మోయాబులో ఆమె, “వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించె”నన్న విషయాన్ని విన్నది. (రూతు 1:⁠6) తనకు ఎంతో శ్రేష్ఠమైన స్థలము యెహోవా ప్రజలతో ఉండడమేనని ఆమె అర్థం చేసుకుంది. తన కోడలైన రూతుతో కలిసి నయోమి యూదాకు తిరిగి చేరుకొంది; తమ సమీప బంధువు, తన కోడల్ని విడిపించువాడు అయిన బోయజుతో రూతు ఎలా ప్రవర్తించాలనే విషయంలో ఆమెకు సమర్థవంతమైన నడిపింపును ఇచ్చింది.

అదే విధంగా నేడు, మరణమందు తమ జతలను పోగొట్టుకున్న యథార్థపరులు క్రైస్తవ సంఘంలో తమను తాము బిజీగా ఉంచుకోవడం ద్వారా భావోద్వేగ ఒత్తిళ్లను విజయవంతంగా తట్టుకొని నిలబడుతున్నారు. నయోమిలానే, వాళ్ళు దేవుని వాక్యాన్ని అనుదినం చదువుతూ ఆధ్యాత్మిక విషయాలను తమ జీవితాల్లో అన్వయించుకుంటున్నారు.

దైవిక జ్ఞానాన్ని అన్వయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఈ బైబిలు వృత్తాంతాలు ఒకరు తన ప్రతికూల భావాల ప్రభావాన్ని తట్టుకొని ఎలా నిలబడగలరనే విషయంలో అంతర్దృష్టిని అందిస్తాయి. ఆసాపు యెహోవా పరిశుద్ధ స్థలంలో సహాయాన్ని అర్థించి, యెహోవా కోసం సహనంతో వేచివున్నాడు. బారూకూ తనకు ఇవ్వబడిన సలహాకు ప్రతిస్పందించి, వస్తుసంబంధమైన అవరోధాన్ని విడనాడాడు. నయోమి యెహోవా ప్రజల మధ్య చురుగ్గా పనిచేస్తూ, యౌవన స్త్రీయైన రూతు సత్య దేవుని ఆరాధనలో పొందబోయే ఆధిక్యతల కోసం ఆమెను సిద్ధపర్చింది.​—⁠1 కొరింథీయులు 4:7; గలతీయులు 5:26; 6:⁠4.

యెహోవా తన ప్రజలకు వ్యక్తులుగానూ, ఒక గుంపుగానూ అనుగ్రహించిన దైవిక విజయాలను ధ్యానించడం ద్వారా మీరు నిరుత్సాహాన్నీ, ప్రతికూల భావాల్నీ అధిగమించవచ్చు. ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి, మీ కోసం విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేయడంలో యెహోవా చేసిన అత్యంత ప్రేమపూర్వకమైన కార్యాన్ని ధ్యానించండి. అంతర్జాతీయ క్రైస్తవ సహోదరత్వపు యథార్థమైన ప్రేమను గుణగ్రహించండి. త్వరలో రానైవున్న దేవుని నూతన లోకంలో మీరు పొందబోయే జీవితంపై దృష్టి కేంద్రీకరించండి. బహుశా ఆసాపులానే మీరూ ఇలా ప్రతిస్పందిస్తారు: “నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.”​—⁠కీర్తన 73:⁠28.