కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అభిచారమూ నిజమైన ఆధ్యాత్మికత కోసం అన్వేషణా

అభిచారమూ నిజమైన ఆధ్యాత్మికత కోసం అన్వేషణా

అభిచారమూ నిజమైన ఆధ్యాత్మికత కోసం అన్వేషణా

మనకందరికీ ఆధ్యాత్మిక అవసరాలూ అలాగే, భౌతిక అవసరాలూ ఉన్నాయి. అందువల్లే, జీవిత సంకల్పమేమిటి, ప్రజలెందుకు బాధలనుభవిస్తారు, మనం చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది వంటి ప్రశ్నలను అనేక మంది అడుగుతారు. ఈ ప్రశ్నలను ఇలాంటి మరితర ప్రశ్నలను అనేక మంది అమాయకులు చనిపోయినవారితో మాట్లాడవచ్చనే ఆశతో అభిచార సంబంధ కూటాల్లో మధ్యవర్తులను సంప్రదించినప్పుడు అడుగుతుంటారు. అలా సంప్రదించడాన్నే అభిచారం అంటారు.

అభిచారాన్ని అవలంబించేవాళ్ళు అనేక దేశాల్లో ఉన్నారు, వాళ్ళు సంఘాల్లోను చర్చీల్లోను సమకూడుతుంటారు. ఉదాహరణకు, అలన్‌ కార్డెక్‌ అనే మారు పేరుతో ఈపోలీట్‌ లేయోన్‌ డెనిజార్‌ రీవాయ్‌ ఒక పుస్తకంలో క్రోడీకరించి వ్రాసిన బోధలను బ్రెజిల్‌లో అభిచారాన్ని అభ్యసించే 40,00,000 మంది అనుసరిస్తున్నట్లు అంచనా. కార్డెక్‌ 19వ శతాబ్దపు ఫ్రెంచ్‌ విద్యావేత్తా తత్త్వశాస్త్రజ్ఞుడూ. ఆయన మొదటిసారిగా 1854 లో అభిచారం మీద ఆసక్తిని చూపించాడు. తర్వాత, ఆయన అనేక స్థలాల్లో అభిచార మధ్యవర్తులను అనేక ప్రశ్నలు వేసి, ఆ జవాబులను ద బుక్‌ ఆఫ్‌ స్పిరిట్స్‌ అనే పుస్తకంలో వ్రాసి ఉంచాడు, ఆ పుస్తకం 1857 లో ప్రచురించబడింది. ఆయన వ్రాసిన వేరే రెండు పుస్తకాలు: ద మీడియమ్స్‌ బుక్‌, ద గాస్పెల్‌ అకార్డింగ్‌ టు స్పిరిటిజమ్‌.

అభిచారానికీ వూడూ, క్షుద్రవిద్య, ఇంద్రజాలం, లేదా సాతానుమతం మొదలైన మతాచారాలకూ దగ్గరి సంబంధం ఉంది. అయినప్పటికీ, అలన్‌ కార్డెక్‌ బోధలను అనుసరించేవారు తమ నమ్మకాలు వేరని అంటారు. వాళ్ళ ప్రచురణలు తరచూ బైబిలు వచనాలను ఎత్తివ్రాస్తాయి, యేసు “సర్వ మానవాళికి మార్గదర్శి, మాదిరి” అని వాళ్ళు పేర్కొంటారు. యేసు బోధలు “దైవిక ధర్మశాస్త్రం యొక్క అతి స్వచ్ఛమైన వ్యక్తీకరణలు” అని వాళ్ళంటారు. దైవిక ధర్మశాస్త్రంలో దేవుడు మానవాళికి వెల్లడి చేసిన మొదటి భాగం మోషే బోధలు; రెండవది యేసు బోధలు; మూడవది అభిచార రచనలు అని అలన్‌ కార్డెక్‌ దృష్టించాడు.

అభిచారం పొరుగువారిపట్ల ప్రేమనూ, లోకోపకారాలను చేయడాన్నీ నొక్కిచెబుతుంది కనుక, అది అనేకులను ఆకర్షిస్తుంది. “లోకోపకారాలు చేయకుండా రక్షణ కలుగదు” అన్నది ఒక అభిచార నమ్మకం. చాలా మంది అభిచారం చేసేవాళ్ళు ఆసుపత్రులను పాఠశాలలను మరితర సంస్థలను నెలకొల్పేందుకు సహాయపడుతూ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాంటి ప్రయత్నాలు చాలా ప్రశంసనీయమైనవి. అయితే, అభిచారం చేసేవాళ్ళ నమ్మకాలు బైబిలులో నమోదు చేయబడినటువంటి యేసు బోధలను పోలి ఉన్నాయా? రెండు ఉదాహరణలను తీసుకుందాం: ఒకటి మృతుల నిరీక్షణను గురించినది, మరొకటి బాధలకు కారణమేమిటన్న దాన్ని గురించినది.

చనిపోయినవారికి ఎలాంటి నిరీక్షణ ఉంది?

చాలా మంది అభిచారం చేసేవాళ్ళు పునర్జన్మ ఉందని విశ్వసిస్తారు. “పునర్జన్మ సిద్ధాంతం మాత్రమే దైవిక నీతిని గురించిన మన ఆలోచనలకు తగ్గట్లుగా ఉంటుంది; ఈ సిద్ధాంతం మాత్రమే భవిష్యత్తును వివరించి, మన నిరీక్షణలను బలపర్చగలుగుతుంది” అని అభిచార సంబంధ పుస్తకమొకటి చెబుతుంది. సీతాకోక చిలుకకు రెక్కలొచ్చి ఎలాగైతే ప్యూపాను వదిలిపెట్టి ఎగిరిపోతుందో, అలాగే మరణించినప్పుడు, “పునర్జన్మించిన ఆత్మ” శరీరాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది అని అభిచారం చేసేవాళ్ళు వివరిస్తారు. శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మలు పూర్వజన్మలో చేసిన పాపాలను ప్రక్షాళనం చేసుకునేందుకు తర్వాత మానవులుగా జన్మిస్తాయి కానీ, అలా జన్మించిన మానవులకు మునుపటి పాపాలేమీ గుర్తుండవు అని వాళ్ళు నమ్ముతారు. “గతాన్ని కప్పివేయడమే మంచిదని దేవుడు తలంచాడు” అని ద గాస్పెల్‌ అకార్డింగ్‌ టు స్పిరిటిజమ్‌ చెబుతుంది.

“పునర్జన్మను తిరస్కరించడమంటే, క్రీస్తు మాటలను తిరస్కరించడమే” అని అలన్‌ కార్డెక్‌ వ్రాశాడు. అయితే, యేసు, “పునర్జన్మ” అనే మాటను ఎన్నడూ పలుకలేదు, అలాంటి సిద్ధాంతాన్ని ఎన్నడూ పేర్కొనలేదు. (22వ పేజీలో ఉన్న “బైబిలు పునర్జన్మను బోధిస్తోందా?” అనే బాక్సును చూడండి.) కానీ, మృతుల పునరుత్థానాన్ని గురించి ఆయన బోధించాడు. ఆయన తన భూ పరిచర్యలో, ముగ్గురిని​—⁠నాయీననే ఊరిలోని ఒక విధవరాలి కుమారుడ్నీ, సమాజ మందిరపు అధికారి కుమార్తెనూ, తన సన్నిహిత స్నేహితుడైన లాజరునూ పునరుత్థానం చేశాడు. (మార్కు 5:​22-24, 35-43; లూకా 7:​11-15; యోహాను 11:​1-44) ఆ సంఘటనల్లో ఒక దాన్ని పరిశీలిస్తూ “పునరుత్థానం” అన్నప్పుడు యేసు భావం ఏమిటన్నది చూద్దాం.

లాజరు పునరుత్థానం

తన స్నేహితుడైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విన్నాడు. అలా విన్న రెండు రోజుల తర్వాత, “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని” యేసు తన శిష్యులతో చెప్పాడు. ఆయన చెప్పినదేమిటో ఆ శిష్యులకు అర్థం కాలేదు కాబట్టి, “లాజరు చనిపోయెను” అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన లాజరు సమాధికి వెళ్ళేసరికి, లాజరు చనిపోయి అప్పటికి నాలుగు రోజులయ్యింది. అయినప్పటికీ, ఆ సమాధి ద్వారమును మూసివున్న రాయిని ప్రక్కకు జరపమని యేసు ఆజ్ఞాపించాడు. దాన్ని జరిపిన తర్వాత, “లాజరూ, బయటికి రమ్మని” యేసు బిగ్గరగా చెప్పాడు. అప్పుడు, ఒక అద్భుతం జరిగింది. “చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు​—⁠మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.”​—⁠యోహాను 11:⁠5, 6, 11-14, 43, 44.

అది పునర్జన్మ కాదన్నది స్పష్టం. చనిపోయిన లాజరు నిద్రపోతున్నాడని స్పృహలేకుండా ఉన్నాడని యేసు అన్నాడు. బైబిలు చెబుతున్నట్లు, ‘ఆయన సంకల్పములు నశించాయి.’ ఆయన ‘ఏమియు ఎరుగకుండా ఉన్నాడు.’ (కీర్తన 146:⁠4; ప్రసంగి 9:⁠5) పునరుత్థానం చేయబడిన లాజరు, పునర్జన్మించిన ఆత్మగల మరొక వ్యక్తి కాదు. ఆయనకు అదే వ్యక్తిత్వం ఉంది, అదే వయస్సూ, అవే జ్ఞాపకాలూ ఉన్నాయి. అకాలంగా తన జీవితం ఎక్కడ ఆగిపోయిందో, అక్కడే తిరిగి మొదలుపెట్టాడాయన. తన మరణం మూలంగా దుఃఖాక్రాంతులుగా ఉన్న తన ప్రియమైనవారి దగ్గరికి తిరిగి వెళ్ళాడు.​—⁠యోహాను 12:⁠1, 2.

తర్వాత, లాజరు మళ్ళీ మరణించాడు. మరి ఆయన పునరుత్థానం ఏ సంకల్పాన్ని నెరవేర్చింది? తన నమ్మకమైన సేవకులు, తన నియమిత కాలంలో మరణం నుండి పునరుత్థానం చేయబడతారని దేవుడు చేసిన వాగ్దానం మీద మనకున్న నమ్మకాన్ని యేసు చేసిన ఇతర పునరుత్థానాలతోపాటు ఈ పునరుత్థానం కూడా మరింత బలపరుస్తుంది. యేసు చేసిన ఆ అద్భుతాలు, “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును” అని ఆయన చెప్పిన మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.​—⁠యోహాను 11:⁠25.

“ఆ కాలమున సమాధులలో నున్నవారందరు [నా] శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు” అని భవిష్యత్‌ పునరుత్థానాన్ని గురించి యేసు చెప్పాడు. (యోహాను 5:​28, 29) లాజరు విషయంలో జరిగినట్లు, అది చనిపోయిన ప్రజల పునరుత్థానమై ఉంటుంది. జీర్ణించుకుపోయి, ఇతర జీవుల్లో కలిసి పోయిన శరీరాలే తర్వాత పునరుత్థానం చెంది, చేతనంగా ఉన్న ఆత్మలను తిరిగికలవడం కాదది. అనంతమైన జ్ఞానమూ అపరిమితమైన శక్తీ గల, భూమ్యాకాశముల సృష్టికర్తకు మృతులను పునరుత్థానం చేయడం శక్తికి మించిన పని కాదు.

యేసుక్రీస్తు నేర్పించిన పునరుత్థాన సిద్ధాంతం, వ్యక్తులుగా మానవులపై దేవునికున్న గాఢమైన ప్రేమను వెల్లడిచేయడం లేదా? అయితే, మునుపు పేర్కొన్న రెండవ ప్రశ్న విషయమేమిటి?

బాధలకు కారణమేమిటి?

ప్రజలు, అవివేకంగా, అనుభవరాహిత్యంతో, చివరికి చెడుగా ప్రవర్తించడమే మానవుల బాధలకు ఎక్కువగా కారణమౌతుంది. అయితే, ప్రజల ప్రమేయం లేకుండానే జరిగే విషాదకరమైన సంఘటనల విషయమేమిటి? ఉదాహరణకు, ప్రమాదాలూ, ప్రకృతి వైపరీత్యాలూ ఎందుకు జరుగుతాయి? కొంతమంది పిల్లలు జన్యుసంబంధమైన లోపాలతో ఎందుకు జన్మిస్తారు? మునుపు చేసిన పాపాలకు శిక్షగా ఇలాంటివి జరుగుతాయని అలన్‌ కార్డెక్‌ దృష్టించాడు. “మనం శిక్షించబడుతున్నామంటే, మనం పాపం చేసి ఉంటామన్నమాట. తప్పిదాన్ని ఈ జన్మలో చేయకపోతే, పూర్వజన్మలో చేసి ఉండవచ్చు” అని ఆయన వ్రాశాడు. “ప్రభువా, నీవు సర్వవిధాలా న్యాయవంతుడవు. నువ్వు నాకు నిర్ణయించిన అనారోగ్యానికి నేను అర్హుడనయ్యే ఉంటాను. . . . దాన్ని నా పూర్వజన్మలోని పాపానికి పరిహారమని, నాకున్న విశ్వాసానికీ స్తోత్రార్హుడవైన నీ చిత్తానికి నేను చూపే విధేయతకూ పరీక్షయని దృష్టిస్తాను” అని ప్రార్థించాలని అభిచారం చేసేవాళ్ళకు నేర్పబడింది.​—⁠ద గాస్పెల్‌ అకార్డింగ్‌ టు స్పిరిటిజమ్‌.

యేసు అలాగే బోధించాడా? లేదు. ‘ఇవన్నీ కాలవశము చేతనూ, అనూహ్యంగానూ జరుగుతున్నాయి’ అన్న బైబిలు ప్రస్తావన గురించి యేసుకు బాగా తెలుసు. (ప్రసంగి 9:​11, NW) కొన్నిసార్లు కీడు అలా జరుగుతుందంతే. అది మన పాపాలకు శిక్ష అయ్యుంటుందనేమీ కాదు.

యేసు జీవితంలో జరిగిన ఈ సంఘటనను పరిశీలించండి: “[యేసు] మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు​—⁠బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా” ఆయన ఇచ్చిన జవాబులో ఎన్నో విషయాలు వెల్లడిచేయబడ్డాయి. “వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి​—⁠నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. . . . వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.”​—⁠యోహాను 9:​1-3, 6, 7.

ఆ మనిషిగానీ, ఆయన తల్లిదండ్రులుగానీ, ఆయన పుట్టు గ్రుడ్డితనానికి బాధ్యులు కారని యేసు మాటలు తెలిపాయి. కాబట్టి, మానవుడు తన పూర్వ జన్మలో చేసిన పాపాలను బట్టి ఇప్పుడు శిక్షించబడుతున్నాడన్న తలంపుకు యేసు ఏ మాత్రం మద్దతునిచ్చినట్టు కాదు. మానవులందరూ పాపాన్ని వారసత్వంగా పొందుతారని యేసుకు తెలుసు. కానీ, వారు ఆదాము చేసిన పాపాన్ని వారసత్వంగా పొందుతారు, తాము పుట్టక మునుపు చేసిన పాపాలను కాదు. ఆదాము పాపం మూలంగా, మానవులందరూ శారీరకంగా అపరిపూర్ణులుగా జన్మించి, రోగానికీ మరణానికీ లోనవుతున్నారు. (యోబు 14:⁠4; కీర్తన 51:⁠5; రోమీయులు 5:​12; 9:​11) నిజానికి ఈ పరిస్థితిని సరిదిద్దేందుకే యేసు ఇక్కడికి పంపించబడ్డాడు. యేసు “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని బాప్తిస్మమిచ్చే యోహాను చెప్పాడు!​—⁠యోహాను 1:​29. *

యేసు భూమ్మీదకు వచ్చి ఏదో ఒక రోజున స్వస్థపరచేలా దేవుడే కావాలని ఆయనను గ్రుడ్డివాడిగా పుట్టించాడని యేసు చెప్పలేదని కూడా గమనించండి. దేవుడలా చేసి ఉంటే అది ఎంతో అహంకారంతోకూడిన క్రూరమైన పనై ఉండేది! అది దేవునికి మహిమను తెచ్చివుండేదా? ఏమాత్రం తెచ్చివుండేది కాదు. బదులుగా, గ్రుడ్డివాడిని అద్భుతమైన రీతిలో యేసు స్వస్థపరచడం వల్ల, ‘దేవుని క్రియలు వానియందు ప్రత్యక్షపరచబడ్డాయి.’ యేసు చేసిన ఇతర అనేక స్వస్థతల్లాగే, ఇది కూడా బాధలననుభవిస్తున్న మానవాళిపై దేవునికున్న హృదయపూర్వకమైన ప్రేమను ప్రతిబింబించింది, సమస్త మానవ రోగాలను బాధలను తన నియమిత కాలంలో అంతమొందిస్తానన్న దేవుని వాగ్దానం నమ్మదగినదని ధృవీకరించింది.​—⁠యెషయా 33:⁠24.

మన పరలోక తండ్రి మన బాధలకు కారణమయ్యే బదులు, “మంచి యీవుల”నిస్తాడని తెలుసుకోవడం ఎంతో ఊరటనివ్వడం లేదా? (మత్తయి 7:⁠11) గ్రుడ్డివారి కళ్ళు తెరువబడినప్పుడు, చెవిటివారి చెవులు నిరాటంకంగా విన్నప్పుడూ, కుంటివాళ్ళు నడిచినప్పుడు, గంతులు వేసినప్పుడు, పరుగెట్టినప్పుడు మహోన్నతునికి ఎంత మహిమ కలుగుతుందో!​—⁠యెషయా 35:⁠5, 6.

మన ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకోవడం

“మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును” అని యేసు ప్రకటించాడు. (మత్తయి 4:⁠4) అవును, మనం దేవుని వాక్యమైన బైబిలును చదివినప్పుడు, దానికి అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మన ఆధ్యాత్మిక అవసరాలు తీరుతాయి. అభిచార మధ్యవర్తులను సంప్రదించడం ఆధ్యాత్మిక అవసరాలను నిజంగా తీర్చలేదు. నిజానికి, అలా చేయడాన్ని, దైవిక ధర్మశాస్త్రంలో దేవుడు మొదట వెల్లడి చేసినదని అలన్‌ కార్డెక్‌ పేర్కొన్న భాగం ఖచ్చితంగా ఖండిస్తోంది.​—⁠ద్వితీయోపదేశకాండము 18:10-13.

దేవుడే అత్యున్నతుడు, నిత్యుడు, అంతం లేని పరిపూర్ణుడు, దయామయుడు, మంచివాడు, న్యాయవంతుడు అని అభిచారం చేసేవాళ్ళతో సహా అనేకులు గుర్తిస్తారు. అయితే, బైబిలు ఆయన గురించి ఇంకా అంతకన్నా ఎక్కువగా తెలియజేస్తుంది. ఆయనకు యెహోవా అనే వ్యక్తిగత నామం ఉందని, యేసు చేసినట్లు మనం కూడా ఆ నామాన్ని ఘనపరచాలని అది చూపిస్తుంది. (మత్తయి 6:⁠9; యోహాను 17:⁠6) దేవుడు నిజమైన వ్యక్తియనీ, మానవులు ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండగలరనీ అది చూపిస్తుంది. (రోమీయులు 8:​38, 39) దేవుడు కరుణామయుడనీ, ఆయన “మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు” అని బైబిలును చదివి తెలుసుకుంటాం. (కీర్తన 103:​10) సర్వాధిపతియు ప్రభువునైన యెహోవా తన ప్రేమనూ, తన ఔన్నత్యాన్నీ, సహేతుకతనూ తన లిఖిత వాక్యం ద్వారా వెల్లడి చేస్తున్నాడు. విధేయతగల మానవులకు మార్గనిర్దేశమిచ్చేవాడూ, వారిని కాపాడేవాడూ ఆయనే. యెహోవానూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే “నిత్యజీవము.”​—⁠యోహాను 17:⁠3.

దేవుని సంకల్పాలను గురించి మనకు అవసరమైన సమాచారాన్నంతటినీ బైబిలు ఇస్తుంది, ఆయనను ప్రీతిపర్చాలంటే మనం తప్పకుండా చేయాల్సినవాటిని కూడా చెబుతుంది. బైబిలును జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, మన ప్రశ్నలకు సంతృప్తికరమైన నిజమైన జవాబులు లభిస్తాయి. ఏది సరైనది, ఏది తప్పు అన్న విషయంలో బైబిలు మనకు మార్గదర్శకమౌతుంది, దృఢమైన నిరీక్షణను మనకిస్తుంది. సమీప భవిష్యత్తులో, దేవుడు “[మానవుల] కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపో[తాయి]” అని మనకు అభయమిస్తోంది. (ప్రకటన 21:​3, 4) మానవులను వారు వారసత్వంగా పొందిన పాపం నుండీ, అపరిపూర్ణత నుండీ యెహోవా యేసుక్రీస్తు ద్వారా విడిపిస్తాడు, విధేయతగల మానవులు పరదైసు భూమిపై నిత్యజీవాన్ని వారసత్వంగా పొందుతారు. ఆ సమయంలో, శారీరక, ఆధ్యాత్మిక అవసరాలు సంపూర్ణముగా తీర్చబడుతాయి.​—⁠కీర్తన 37:10, 11, 29; సామెతలు 2:​21, 22; మత్తయి 5:⁠5.

[అధస్సూచి]

^ పేరా 19 పాపమూ మరణమూ ఎలా ఆవిర్భవించాయన్న చర్చ కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని 6వ అధ్యాయాన్ని చూడండి.

[22వ పేజీలోని బాక్సు]

బైబిలు పునర్జన్మను బోధిస్తోందా?

పునర్జన్మ సిద్ధాంతానికి బైబిలు లేఖనాలేవైనా మద్దతునిస్తున్నాయా? ఈ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు ఉపయోగించిన కొన్ని లేఖనాలను పరిశీలించండి:

“యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను. . . . రాబోవు ఏలీయా యితడే.”​—మత్తయి 11:​13, 14.

ఏలీయానే బాప్తిస్మమిచ్చే యోహానుగా పునర్జన్మించాడా? “నీవు ఏలీయావా?” అని తనను అడిగినప్పుడు, ‘కాదు’ అని యోహాను స్పష్టంగా జవాబు చెప్పాడు. (యోహాను 1:​21) అయితే, యోహాను, “ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై” మెస్సీయ కన్నా ముందే వస్తాడని ప్రవచించబడింది. (లూకా 1:​17; మలాకీ 4:​5, 6) మరో మాటలో చెప్పాలంటే ఏలీయా చేసినటువంటి పనితో పోల్చగల పనిని చేశాడనే అర్థంలో బాప్తిస్మమిచ్చే యోహాను ఏలీయాగా ఉన్నాడు.

“ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.”​—యోహాను 3:⁠3, 7.

“మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, . . . ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను” అని అపొస్తలులలో ఒకరు తర్వాత వ్రాశారు. (1 పేతురు 1:⁠3, 4; యోహాను 1:​12, 13) యేసు పేర్కొన్న క్రొత్త జన్మ ఆయన అనుచరులకు వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే కలిగే ఆధ్యాత్మిక అనుభవాన్ని సూచిస్తుంది గానీ భవిష్యత్తు పునర్జన్మను సూచించడం లేదని స్పష్టమవుతుంది.

“ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, శాశ్వతకాలం జీవిస్తాడు: భూమి మీద నేను ఉండే రోజులు ముగిసినప్పుడు, నేను తిరిగి వస్తానని తెలుసుకుని ఎదురుచూస్తాను.”​—ద గాస్పెల్‌ అకార్డింగ్‌ టు స్పిరిటిజమ్‌లో వ్రాయబడిన యోబు 14:⁠14 యొక్క “గ్రీకు అనువాదము.”

ఈ వచనాన్ని తెలుగు పరిశుద్ధ గ్రంథము ఇలా అనువదిస్తుంది: “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును.” ఈ వచనం యొక్క సందర్భాన్ని చూడండి. మృతులు తమ “విడుదల” కోసం సమాధుల్లో ఎదురు చూస్తారని మీరు గ్రహిస్తారు. (13వ వచనం) వాళ్ళు అలా ఎదురుచూస్తున్నప్పుడు ఉనికిలో ఉండరు. “చనిపోయిన మనిషి ఇక లేనట్లే; మర్త్యుడి ప్రాణం పోయినప్పుడు అతడిక ఉనికిలో ఉండడు.”​—⁠యోబు 14:​10, బగ్‌స్టర్స్‌ సెప్టువజింట్‌ వర్షన్‌.

[21వ పేజీలోని చిత్రం]

పునరుత్థాన నిరీక్షణ మనలో ప్రతి ఒక్కరి మీద దేవునికున్న శ్రద్ధను వెల్లడి చేస్తుంది

[23వ పేజీలోని చిత్రాలు]

మానవుల బాధలన్నింటినీ దేవుడు అంతమొందిస్తాడు