ఒకే సంపుటిలో బైబిలు
ఒకే సంపుటిలో బైబిలు
బైబిలు ప్రతులను తయారు చేసే విషయానికి వస్తే, కోడెక్స్ ఉపయోగాన్ని మొదలుపెట్టింది తొలి క్రైస్తవులే. కోడెక్స్ అంటే ఒక పుస్తకం, గ్రంథపు చుట్ట కాదు. అయితే, క్రైస్తవులు బైబిలులోని అన్ని పుస్తకాలూ ఉన్న ఏక సంపుటిని వెంటనే తయారు చేయనారంభించలేదు. ఆరవ శతాబ్దంలో ఫ్లేవీయస్ కాసియోడోరస్ చేపట్టిన ప్రాముఖ్యమైన ఒక చర్య, ఒకే సంపుటిలో బైబిళ్ళ తయారీ విస్తృతమయ్యేందుకు దోహదపడింది.
ఆధునిక ఇటలీకి దక్షిణాగ్రమున ఉన్న కలాబ్రీయాలోని ఒక ధనిక కుటుంబంలో సా.శ. 485-490 మధ్యకాలంలో ఫ్లేవీయస్ మాగ్నస్ ఆరేలీయస్ కాసియోడోరస్ జన్మించాడు. మొదట గోత్‌లూ, ఆ తర్వాత బైజాంటిన్‌లూ ఆక్రమించుకుని ఇటలీ చరిత్రలో అత్యంత సంక్షోభాన్ని సృష్టించిన కాలంలో ఆయన జీవించాడు. ఆయనకు దాదాపు 60, 70 ఏండ్ల వయస్సున్నప్పుడు, కలాబ్రీయాలోని స్క్వీలాసేలో తన ఇంటికి సమీపాన వీవేరీయమ్ మఠాన్నీ, గ్రంథాలయాన్నీ స్థాపించాడు.
శ్రద్ధగల బైబిలు సంపాదకుడు
ప్రజలకు బైబిలును ఎలా చేరవేయాలి అన్నదే కాసియోడోరస్‌కు పెద్ద చింతగా ఉండేది. “కాసియోడోరస్ అభిప్రాయం ప్రకారం, ప్రజలకు లేఖనాలు చేరాలంటే లాటిన్ సాహిత్యాలన్నింటినీ ఉపయోగించాలి. ప్రాచీన రచనలను చదివేందుకూ వాటిని నకలు వ్రాసేందుకూ ఇంతకుముందు ఏయే సహాయకాలు ఉపయోగించబడ్డాయో, ఆ సహాయకాలన్నింటినీ, లేఖనాలను అర్థం చేసుకుని, వాటి నకలు సరిగ్గా వ్రాసేందుకు ఉపయోగించాలి. క్రొత్తగా రూపొందిన గ్రహాల వ్యవస్థలాగా, మొత్తం లాటిన్ సంస్కృతి దేవుని వాక్యమనే పెద్ద సూర్యుని చూట్టూ ఉన్న కక్ష్యలో తిరగాల్సి ఉంది” అని చరిత్రకారుడైన పీటర్ బ్రౌన్ వ్రాశాడు.
కాసియోడోరస్, మొత్తం బైబిలు వ్రాతప్రతులన్నింటినీ తీసుకొని వాటిలోని పోలికల్నీ తేడాల్నీ సూక్ష్మంగా పరీక్షించడానికి అనువాదకులను వ్యాకరణకర్తలను వీవేరీయమ్ మఠానికి పిలిపించాడు, ఎంతో శ్రద్ధ అవసరమైన సంపాదకీయ పనిని ఆయన పర్యవేక్షించాడు. విద్యాసంపన్నులైన కొందరికి మాత్రమే ఆ పనిని అప్పగించాడు. ఇంతకు ముందు నకలు చేసినవారు పొరపాట్లు చేశారనుకుని వారు తొందరపడి మార్పులు చేయకూడదు. వ్యాకరణాన్ని గురించి ఒక ప్రశ్న తలెత్తినప్పుడు, జనాదరణగల లాటిన్ ప్రయోగాల కన్నా ప్రాచీన బైబిలు వ్రాతప్రతులనే మరింత ఆధికారికంగా ఎంచాలి. “వ్యాకరణ ప్రత్యేకతలను అలాగే ఉంచాలి, ఎందుకంటే దైవ ప్రేరేపితమని తెలియబడుతున్న మూలపాఠాల్లో పొరబాట్లు చొరబడే అవకాశం లేదు. . . . లాటిన్ ప్రమాణాల ప్రకారం చాలా వింతగా అనిపించినా సరే, బైబిలులో ఉన్న వ్యక్తీకరణ పద్ధతులను, రూపకాలంకారాలను, నుడికారాలను ఉన్నవి ఉన్నట్లుగా అనుకరించాలి. ‘హీబ్రూ’ నామవాచక రూపాలను కూడా తప్పనిసరిగా అలాగే ఉంచాలి” అని కాసియోడోరస్ వాళ్ళకు చెప్పాడు.—ద కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ద బైబిల్.
కోడెక్స్ గ్రాంద్యోర్
లాటిన్‌లో కనీసం మూడు వేర్వేరు బైబిలు ఎడిషన్‌లను తయారు చేయాలని వీవేరీయమ్ మఠంలోని నకలు వ్రాతగాళ్ళకు ఆదేశించబడింది. వాళ్ళు తయారు చేసిన మొదటి ఎడిషన్‌లో తొమ్మిది సంపుటాలున్నాయి. బహుశా, అది పాత లాటిన్ మూలపాఠం నుండి నకలు చేయబడివుండవచ్చు. ఆ బైబిలు రెండవ శతాబ్దపు తుది భాగంలో చేయబడిన ఒక అనువాదం. దాదాపు ఐదవ శతాబ్దపు ఆరంభంలో జెరోమ్ పూర్తి చేసిన లాటిన్ వల్గేట్ నుండి రెండవ ఎడిషన్ నకలు చేయబడింది. మూడవ ఎడిషన్, కోడెక్స్ గ్రాంద్యోర్. “పెద్ద కోడెక్స్” అని దానర్థం. అది మూడు బైబిలు పాఠాంతరాల నుండి నకలు చేయబడింది. చివరి రెండు ఎడిషన్‌లలోను, బైబిలు పుస్తకాలన్నీ ఒకే సంపుటిలో ఉన్నాయి.
లాటిన్ బైబిళ్ళను ఒకే సంపుటిగా మొదట తయారు చేసింది బహుశా కాసియోడోరసే అయ్యుండవచ్చు. ఆయన * బైబిలు పుస్తకాలన్నింటినీ ఒకే సంపుటిగా చేస్తే, నిజంగా ప్రయోజనం ఉంటుందనీ, అనేక సంపుటాలను తెరిచిచూసేందుకు పట్టే సమయం ఆదా అవుతుందనీ ఆయన గుర్తించి ఉంటాడనడంలో సందేహం లేదు.
వాటికి పాండీతీ అని పేరు పెట్టాడు.దక్షిణ ఇటలీ నుండి బ్రిటీష్ ద్వీపాలకు
కాసియోడోరస్ మరణించిన (దాదాపు సా.శ. 583) కొన్నాళ్ళకు, కోడెక్స్ గ్రాంద్యోర్ ప్రయాణం మొదలుపెట్టింది. ఆ కాలంలో, వీవేరీయమ్ గ్రంథాలయంలో కొంత భాగం, రోమ్‌లోవున్న లాటరన్ గ్రంథాలయానికి తరలించబడిందని విశ్వసించబడుతుంది. సా.శ. 678 లో, రోమ్‌లో ఉన్న ఆంగ్లో సాక్సన్ మఠాధికారియైన చేల్‌ఫ్రిత్, బ్రిటీష్ ద్వీపాలకు వెళ్ళేటప్పుడు కోడెక్స్‌ను తనతోపాటు తీసుకెళ్ళాడు. ఇంగ్లాండ్‌లోని ఇప్పటి నార్తంబ్రియాలోని వెర్‌మత్‌లోను, జరోలోను చేల్‌ఫ్రిత్ నడిపిన జంట మఠాలకు అది అలా చేరుకుంది.
కాసియోడోరస్ రూపొందించిన ఏక సంపుటి బైబిలు, చేల్‌ఫ్రిత్‌నీ, ఆయన మఠంలోని ఇతర సన్యాసులనూ ఆకర్షించి ఉంటుంది. దాన్ని ఉపయోగించడం సౌకర్యంగా ఉన్నందువల్లే వాళ్ళు దానికి ఆకర్షితులై ఉంటారు. అందుకే, కేవలం కొన్ని దశాబ్దాల్లోనే, వాళ్ళు మరో మూడు పూర్తి బైబిళ్ళను ఏక సంపుటాలుగా తయారు చేశారు. వాటిలో కోడెక్స్ ఆమ్యాటీనస్ అనే పెద్ద వ్రాతప్రతి మాత్రమే ఇప్పటికీ ఉంది. దానిలో దూడ చర్మంతో చేసిన 2,060 పుటలున్నాయి. ఒక్కొక్క పుట 20 అంగుళాల పొడవూ 13 అంగుళాల వెడల్పూ ఉంది. కవర్ పేజీలతో సహా ఆ వ్రాతప్రతి 10 అంగుళాల మందముండి, 34 కన్నా ఎక్కువ కిలోల బరువుంది. ఇప్పటికీ ఉనికిలో ఉన్న అత్యంత పురాతనమైనటువంటి ఏక సంపుటిలోవున్న పూర్తి లాటిన్ బైబిలది. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ బైబిలు విద్వాంసుడైన ఫెంటన్ జే. ఏ. హార్ట్ ఈ కోడెక్స్‌ను 1887 లో గుర్తించాడు. “ఆధునిక వ్యక్తి అయినా సరే ఈ అసాధారణ వ్రాతప్రతిని చూస్తే తప్పకుండా ఆశ్చర్యచకితుడవుతాడు” అని ఆయన వ్యాఖ్యానించాడు.
ఇటలీకి తిరిగివెళ్ళడం
కాసియోడోరస్ ఆదేశం ప్రకారం చేసిన అసలు కోడెక్స్ గ్రాంద్యోర్ ఇప్పుడు లేదు. కానీ దాన్ని అనుకరించి రూపొందించిన ఆంగ్లో సాక్సన్ లాటిన్ కోడెక్స్ అయిన ఆమ్యాటీనస్ ఉంది, అదలా రూపొందించబడిన వెంటనే ఇటలీకి ప్రయాణం మొదలుపెట్టింది. చేల్‌ఫ్రిత్ తాను చనిపోవడానికి కొద్ది కాలం ముందు రోమ్‌కి మళ్ళీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తన దగ్గరున్న మూడు లాటిన్ బైబిలు వ్రాతప్రతుల్లో ఒకదానిని, పోప్ గ్రెగరీ IIకి బహుమతిగా ఇవ్వడానికి తనతోపాటు తీసుకువెళ్ళాడు. చేల్‌ఫ్రిత్ సా.శ. 716 లో, ఫ్రాన్స్‌లోని లాంగ్రెస్‌లో మార్గమధ్యంలోనే చనిపోయాడు. కానీ ఆయన బైబిలు మిగతా ప్రయాణికులతోపాటు ప్రయాణం కొనసాగించింది. ఆ కోడెక్స్ చివరికి, మధ్య ఇటలీలోని మౌంట్ ఆమ్యాట మఠంలోని గ్రంథాలయానికి చేరుకుంది. కోడెక్స్ ఆమ్యాటీనస్ అనే పేరును అదక్కడే పొందింది. 1782 లో, ఇటలీలోని, ఫ్లోరెన్స్‌లోవున్న మెడిసియన్-లారెంషియన్ గ్రంథాలయానికి తరలించబడింది. ఆ గ్రంథాలయంలోని అత్యంత విలువైన ఆస్తుల్లో ఒకటిగా అది ఎంచబడుతోంది.
కోడెక్స్ గ్రాంద్యోర్ మనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? కాసియోడోరస్ కాలం మొదలుకొని, నకలువ్రాతగాళ్ళూ, ముద్రించేవాళ్ళూ ఏక సంపుటిలో బైబిళ్ళను తయారు చేయడానికే ఎక్కువ ఇష్టపడ్డారు. నేటి వరకూ, బైబిలు ఏక సంపుటిలో ఉండడం వల్ల, ప్రజలు దాన్ని సంప్రదించడమూ, తమ జీవితాల్లో అది చూపించగల ప్రభావం నుండి వారు ప్రయోజనం పొందడమూ సులభంగా ఉంది.—హెబ్రీయులు 4:12.
[అధస్సూచి]
^ పేరా 9 గ్రీకు భాషలోని పూర్తి బైబిళ్ళు నాల్గవ శతాబ్దం నుండో ఐదవ శతాబ్దం నుండో పంపిణీ అవ్వడం ప్రారంభమై ఉండవచ్చు.
[29వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
కోడెక్స్ గ్రాంద్యోర్ ప్రయాణం
వీవేరీయమ్ మఠం
రోమ్
జరో
వెర్‌మత్
కోడెక్స్ ఆమ్యాటీనస్ ప్రయాణం
జరో
వెర్‌మత్
మౌంట్ ఆమ్యాట
ఫ్లోరెన్స్
[చిత్రసౌజన్యం]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.
[30వ పేజీలోని చిత్రాలు]
పైన: కోడెక్స్ ఆమ్యాటీనస్ ఎడమవైపున: కోడెక్స్ ఆమ్యాటీనస్‌లో ఎజ్రా చిత్రం
[చిత్రసౌజన్యం]
Biblioteca Medicea Laurenziana, Firenze