మీరు మీ ‘సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా?’
మీరు మీ ‘సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా?’
“దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని మొదటి శతాబ్దపు క్రైస్తవులకు సలహా ఇచ్చాడు. (ఎఫెసీయులు 5:15, 16) ఈ సలహా అవసరమైనదేనా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే, ఆ ప్రాచీన నగరంలో క్రైస్తవులకు ఎదురైన పరిస్థితులను గురించి తెలిసి ఉండాలి.
ఎఫెసు, దాని సిరిసంపదలతోపాటు, అనైతికతకూ, విశృంఖలమైన నేరాలకూ, వివిధ అతీంద్రియ శక్తుల కార్యకలాపాలకూ పేరుగాంచింది. అంతేకాక, సమయాన్ని గురించి అక్కడ ప్రబలంగా ఉన్న తాత్త్విక నమ్మకాలను అక్కడున్న క్రైస్తవులు ఎదిరించవలసి ఉంది. ఎఫెసులో ఉన్న క్రైస్తవేతరులైన గ్రీకులు, సమయం ఒకే దిశలో పయనిస్తుందంటే నమ్మేవారు కాదు. జీవితం అనంతమైన చక్రాల్లో పునరావృత్తమౌతుందని, ఒక వ్యక్తి తన సమయాన్ని ఒక జీవిత చక్రంలో ఖర్చుచేస్తే, మరొక జీవిత చక్రంలో దాన్ని తిరిగి పొందవచ్చని గ్రీకు తత్త్వశాస్త్రం వారికి బోధించింది. ఈ విధమైన ఆలోచనాసరళి, దైవిక తీర్పుతో సహా, అనేక సంఘటనలకు సంబంధించిన దేవుని సమయపట్టికను ఎఫెసులోని క్రైస్తవులు పట్టించుకోకుండా ఉండేలా ఒప్పించి ఉంటుంది. కనుక, ‘సమయాన్ని సద్వినియోగం చేసుకొమ్మని’ పౌలు ఇచ్చిన సలహా సముచితమైనదే.
పౌలు, సమయాన్ని గురించి మామూలు అర్థంలో మాట్లాడడం లేదు. ఆయన ఉపయోగించిన గ్రీకు మాట, ఒక నిర్దిష్ట ఉద్దేశానికి నియమించబడిన అనుకూలమైన సమయాన్ని సూచిస్తుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అప్పుడు అనుభవిస్తున్న దైవ కృప గల ఆ సమయం ముగియక ముందే, దైవిక కరుణా, రక్షణను గురించిన ప్రతిపాదనా వెనక్కి తీసుకోబడక ముందే వాళ్ళు ఆ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించాలని పౌలు వాళ్ళకు ఉపదేశించాడు.—రోమీయులు 13:11-13; 1 థెస్సలొనీకయులు 5:6-11.
మనం కూడా అలాంటి అనుకూల సమయంలోనే జీవిస్తున్నాం. మళ్ళీ రాని కృపా సమయాన్ని ఈ లోకం అందించే తాత్కాలిక ఆనందాల వెంట వెళ్ళడం ద్వారా వృథా చేసుకునే బదులు, “భక్తి” క్రియలను చేసేందుకు ఉపయోగించి, తద్వారా తమ సృష్టికర్తయైన యెహోవా దేవునితో తమకున్న సంబంధాన్ని బలపరచుకునే క్రైస్తవులు జ్ఞానవంతులు.—2 పేతురు 3:11; కీర్తన 73:28; ఫిలిప్పీయులు 1:10.