కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా నాకెప్పుడూ మంచే చేస్తున్నాడు!”

“యెహోవా నాకెప్పుడూ మంచే చేస్తున్నాడు!”

యెహోవా నాకెప్పుడూ మంచే చేస్తున్నాడు!”

అమెరికాలోని న్యూయార్క్‌లోవున్న యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లోని స్త్రీపురుషులు 1985 మార్చి నెలలోని ఆహ్లాదకరమైన ఒక సాయంకాలం వేళ గమనార్హమైన ఒక విషయాన్ని గ్రహించారు. కార్ల్‌ ఎఫ్‌. క్లైన్‌ పూర్తికాల పరిచర్య చేయనారంభించి అప్పటికి 60 సంవత్సరాలైంది. “యెహోవా నాకెప్పుడూ మంచే చేస్తున్నాడు!” అని సహోదరుడు క్లైన్‌ ఉత్సాహంగా చెప్పాడు. కీర్తన 37:4 తనకు ఇష్టమైన వాక్యము అని ఆయన చెప్పాడు. తర్వాత సెల్లో అనే తన వాయిద్యాన్ని పలికించి అందరినీ పరవశింపజేశాడు.

సహోదరుడు క్లైన్‌ తర్వాతి 15 సంవత్సరాలు, రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో సభ్యుడిగాను యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడిగాను కొనసాగాడు. తర్వాత, 2001 జనవరి 3న, 95 ఏళ్ళ వయస్సులో ఆయన తన భూజీవితాన్ని నమ్మకంగా పూర్తి చేశాడు.

ఆయన జర్మనీలో జన్మించాడు. కానీ వాళ్ళ కుటుంబం అమెరికాకు వెళ్ళిపోవడంతో, ఆయన ఇల్లినోయిస్‌లోని చికాగో నగర శివారులో పెరిగి పెద్దవాడయ్యాడు. చిన్నప్పుడే ఆయనకూ ఆయన తమ్ముడు టెడ్‌కీ బైబిలు మీద చాలా ఆసక్తి కలిగింది. ఆయన 1918 లో బాప్తిస్మం పొందాడు. 1922 లో బైబిలు విద్యార్థుల సమావేశంలో తాను విన్న పులకింపజేసే విషయాలు, క్షేత్రసేవపై తనకు జీవితాంతపు మక్కువను కలిగించాయి. ఒక్క వారం కూడా ప్రకటనా పనిలో పాల్గొనకుండా గడపడం ఆయన ఇష్టపడలేదు. ఆయన తన జీవిత చివరి వారాల్లో కూడా ప్రకటనా పనిలో పాల్గొన్నాడు.

కార్ల్‌ 1925 లో ప్రధానకార్యాలయ సిబ్బందిలో సభ్యుడై, మొదట ముద్రణాలయంలో పనిచేశాడు. ఆయనకు సంగీతం మీద చాలా ఆసక్తి ఉండేది. క్రైస్తవ రేడియో ప్రసారాల్లో వాద్యబృందంతో ఆయన కొన్ని సంవత్సరాలు సెల్లో వాయించాడు. ఆ తర్వాత, ఆయన సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. ముఖ్యంగా దాని పైవిచారణకర్తయైన టీ.జె. సల్లివన్‌తో సన్నిహితంగా పనిచేయడంలో ఆనందించాడు. ఈ మధ్యకాలంలో, టెడ్‌ పెళ్ళి చేసుకుని, తన భార్యయైన డోరస్‌తోపాటు ప్యూర్టోరికోలో మిషనరీ సేవను ఆరంభించాడు.

కార్ల్‌ క్లైన్‌ అర్ధ శతాబ్దంపాటు రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. ఆయన పరిశోధనలు జరపడానికి చాలా ఇష్టపడేవాడు గనుకా, ఆయనకు చాలా లోతైన బైబిలు పరిజ్ఞానం ఉండడం వల్ల, ఆ డిపార్ట్‌మెంట్‌లో ఆయన గణనీయంగా తోడ్పడ్డాడు. 1963 లో, ఆయన మార్గరేటాను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె బొలీవియాలో సేవచేస్తున్న జర్మన్‌ మిషనరీ. పదవీ విరమణ పొందే వయస్సు ఆయనకు వచ్చి చాలా కాలం అయినప్పటికీ ప్రేమపూర్వకంగా ఆమె ఇచ్చిన మద్దతుతో, ప్రాముఖ్యంగా, ఆయనకు ఆరోగ్యసమస్యలు ఎదురైనప్పుడు కూడా ఆయన చాలా ఫలవంతంగా పనిచేయగల్గాడు. సహజంగా నిష్కపటంగా ఉండే ఆయన స్వభావమూ, సంగీతకారునిగా ఆయనకున్న ఉత్సాహమూ, ఆయన సంఘాల్లోను సమావేశాల్లోను మరపురానటువంటి ప్రసంగాలనిచ్చేందుకు దోహదపడ్డాయి. ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందు, న్యూయార్క్‌లో ఉన్న పెద్ద బేతేలు కుటుంబంలోని వారికందరికీ ఎంతో ఆనందాన్నీ ప్రయోజనాన్నీ చేకూర్చే విధంగా ఒక రోజు ఉదయం దినవాక్యాన్ని చర్చించడంలో ఆయన అధ్యక్షత వహించాడు.

అక్టోబరు 1, 1984 సంచికలో ప్రచురించబడిన ఈ సహోదరుని ఆసక్తికరమైన అనుభవాలను గురించి చెబుతున్న ఈయన జీవిత చరిత్ర కావలికోటను క్రమంగా చదివే చాలా మంది పాఠకులకు గుర్తుకువస్తుంది. మీరు ఆ కథను మొదటిసారిగా చదువుతున్నప్పుడు, లేదా మరోసారి చదువుతున్నప్పుడు, ఈ సహోదరుడు మరో ఒకటిన్నర దశాబ్దంపాటు నమ్మకమైన సమర్పించుకున్న క్రైస్తవుడిగా జీవించాడని గుర్తుంచుకోండి.

ప్రభువు యొక్క అభిషిక్తుల్లో ఒకరిగా, సహోదరుడు క్లైన్‌ పరలోకంలో క్రీస్తుతో పరిపాలించాలని పూర్ణహృదయంతో కోరుకున్నాడు. యెహోవా ఆయన కోరికను ఇప్పుడు తీర్చాడని నమ్మేందుకు మనకు అనేక కారణాలున్నాయి.​—⁠లూకా 22:​28-30.

[31వ పేజీలోని చిత్రం]

టీ.జె. సల్లివన్‌, టెడ్‌, డోరస్‌లతో 1943 లో కార్ల్‌

[31వ పేజీలోని చిత్రం]

కార్ల్‌, మార్గరేట, అక్టోబర్‌ 2000 లో