కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శ్రమల్లో ఉన్న విధవరాండ్రకు సహాయం చేయడం

శ్రమల్లో ఉన్న విధవరాండ్రకు సహాయం చేయడం

శ్రమల్లో ఉన్న విధవరాండ్రకు సహాయం చేయడం

రూతును గురించీ, ఆమె అత్తగారు నయోమిని గురించీ బైబిలు చెబుతున్న కథ, విధవరాండ్ర గురించి చెప్పుకోబడుతున్న కథల్లో ఒకటి. ఆ స్త్రీలిద్దరూ విధవరాండ్రే. అయితే నయోమి తన భర్తనే కాక, తన ఇద్దరు కుమారుల్ని కూడా కోల్పోయింది. ఆ ఇద్దరు కుమారుల్లో ఒకరు రూతు భర్త. వాళ్ళు, ఎక్కువగా మగవాళ్ళ మీద ఆధారపడే వ్యవసాయం చేసుకునే సమాజంలో నివసించారు కాబట్టి వాళ్ళ పరిస్థితి నిజంగానే చాలా దారుణంగా ఉండేది.​—⁠రూతు 1:​1-5, 20, 21.

అయితే, రూతు నయోమిని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి నిరాకరించింది. నయోమికి రూతు మంచి స్నేహితురాలిగా, ఓదార్చే వ్యక్తిగా ఉంది. కొంతకాలానికి, రూతుకు నయోమి మీద ఉన్న గాఢమైన ప్రేమను బట్టే కాక, దేవుని మీద ఆమెకున్న ప్రేమను బట్టి కూడా ఆమె నయోమికి ‘యేడుగురు కుమారులకంటె ఎక్కువ’ అని నిరూపించుకున్నది. (రూతు 4:​15) మోయాబీయులైన తన ఇంటివారి దగ్గరికి స్నేహితుల దగ్గరికి తిరిగి వెళ్ళిపొమ్మని నయోమి తనను కోరినప్పుడు, “నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు; నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక” అని రూతు జవాబిచ్చింది. ఆ జవాబు, హృదయాన్ని స్పృశించే విధంగా లేఖనాల్లో వ్రాయబడిన విశ్వాసంతో నిండిన వ్యక్తీకరణల్లో ఒకటి.​—⁠రూతు 1:​16, 17.

రూతు మనో వైఖరి యెహోవా దేవుని దృష్టిలోకి రాకుండా పోలేదు. నయోమి రూతుల చిన్న కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించాడు, చివరికి రూతు ఇశ్రాయేలీయుడైన బోయజును వివాహం చేసుకుంది. వాళ్ళకు పుట్టిన కుమారుడు యేసుక్రీస్తు పూర్వికుడయ్యాడు. ఆ బిడ్డను నయోమి తన బిడ్డలా పెంచుకుంది. ఈ చరిత్ర, యెహోవాకు దగ్గరై, ఆయన మీద నమ్మకముంచే విధవరాండ్రను ఆయనెలా చూసుకుంటాడనే దానికి ఉదాహరణగా ఉంది. అంతేకాక, శ్రమల్లో ఉన్న విధవరాండ్రకు ప్రేమపూర్వకంగా సహాయం చేసే వారిని విలువైనవారిగా ఆయన ఎంచుతాడని బైబిలు మనకు చెబుతుంది. కాబట్టి, నేడు మన మధ్య ఉన్న విధవరాండ్రకు మనమెలా ఆలంబనగా ఉండగలం?​—⁠రూతు 4:​13, 16-22; కీర్తన 68:⁠5.

నిర్దిష్ట సహాయాన్ని చేయండి, కానీ పెత్తనం చెలాయించకండి

ఒక విధవరాలికి సహాయం చేస్తామని చెప్పినప్పుడు, ఏ సహాయం చేస్తారో స్పష్టంగా చెప్పడం మంచిది, కానీ పెత్తనం చెలాయించకండి. “మీకేమైనా అవసరమైతే నాకు తెలియజేయండి” వంటి వట్టి మాటలు చెప్పకండి. అలా చెప్పడం, “చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని” చలితో బాధపడుతూ ఆకలితోనున్న ఒకరికి కేవలం చెబితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. (యాకోబు 2:​16) చాలా మంది తమకు ఏమైనా అవసరమున్నా అడగరు; మౌనంగా బాధపడుతుంటారు. వాళ్ళ అవసరాలేమిటో గ్రహిస్తూ అలాంటివాళ్ళకు సహాయం చేయాలంటే వివేచన అవసరం. మరొకవైపు మరీ ఎక్కువ చొరవ తీసుకున్నారంటే, అది ఆ విధవరాలి జీవితంలో పెత్తనం చెలాయించడం అవుతుంది, అది ఆమె భావాల్ని గాయపర్చగలదు, మీ మధ్య సంఘర్షణకు దారితీయగలదు. కనుక, మనం ఇతరులతో వ్యవహరించేటప్పుడు సమతుల్యతను పాటించవలసిన అవసరాన్ని బైబిలు నొక్కి చెబుతోంది. ప్రజల మీద నిస్వార్థమైన వ్యక్తిగత ఆసక్తిని చూపాలని అది మనల్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదని కూడా మనకు గుర్తు చేస్తోంది.​—⁠ఫిలిప్పీయులు 2:⁠4; 1 పేతురు 4:⁠15.

నయోమి విషయంలో అలాంటి సమతుల్యమైన దృక్పథాన్ని రూతు కనబరచింది. తాను అత్తగారికి నమ్మకంగా అంటిపెట్టుకుని ఉంటున్నా, ఆమెను ఒత్తిడి చేయడం గానీ, ఆమె మీద అధికారం చెలాయించడం గానీ ఆమె చేయలేదు. తనకూ అత్తగారికీ కావలసిన ఆహారాన్ని సంపాదించుకోవడంలో ఆమె తెలివిగా చొరవ తీసుకుంది, అలాగే, అత్తగారు ఇచ్చిన నిర్దేశాలను పాటించింది కూడా.​—⁠రూతు 2:​2, 22, 23; 3:​1-6.

నిజమే, ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి. ముందు పేర్కొన్న సాండ్ర, “నా కష్ట సమయాల్లో నాకవసరమైందల్లా, నాకెంతో ప్రియమైన స్నేహితులు నన్నెంతో ప్రేమగా చూసుకునే స్నేహితులు నా ప్రక్కన ఉండడమే, అలాగే ఉన్నారు” అని అంటోంది. మరొకవైపు, ముందు పేర్కొన్న ఇలేన్‌ ఏకాంతాన్ని కోరుకుంది. కనుక, మనం ఇతరులకు సహాయకరంగా ఉండాలంటే, వివేచనను ఉపయోగించాలి, ఏకాంతం కావాలన్న ఇతరుల కోరికను గౌరవించడమూ, అవసరమైనప్పుడు మనం వాళ్ళకు అందుబాటులో ఉండడమూ చేస్తూ, సమతుల్యంగా ఉండాలి.

కుటుంబం నుండి మద్దతు

ఒక విధవరాలికి ప్రేమా ఆప్యాయతలుగల కుటుంబం ఉంటే, తన పరిస్థితిని తట్టుకోగలనన్న నమ్మకాన్ని ఆమెకిచ్చేందుకు ఆ కుటుంబం చాలా చేయగలదు. కుటుంబంలోని కొందరు సభ్యులు మిగతావారి కన్నా ఎక్కువ సహాయం చేయగలిగినప్పటికీ, అందరూ తోడ్పడగలరు. “ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది.”​—⁠1 తిమోతి 5:⁠4.

చాలా మందికి, ఆర్థిక మద్దతు లేదా “ప్రత్యుపకారము” అవసరం లేకపోవచ్చు. కొందరు విధవరాండ్రకు, తమ అవసరాలను తీర్చుకునేందుకు కావలసిన డబ్బు ఉండవచ్చు, మరి కొందరికి ప్రభుత్వం నుండి ధనసహాయం లభిస్తుండవచ్చు. కొన్ని దేశాల్లో అది లభ్యమవుతుంది. కానీ, ఏ విధవరాలికైనా ఆర్థిక సహాయం అవసరమున్నట్లయితే, ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు ఆ సహాయం చేయాల్సిందే. ఏ విధవరాలికైనా, మద్దతునిచ్చేందుకు దగ్గరి బంధువులు లేనట్లయితే, లేదా ఉన్నా వాళ్ళు సహాయం చేసే స్థితిలో లేకపోతే, తోటి విశ్వాసులు సహాయపడాలని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి: “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా—దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుట[యే].”​—⁠యాకోబు 1:⁠27.

ఈ బైబిలు సూత్రాలను ఆచరించేవారు, నిజముగా ‘విధవరాండ్రను సన్మానిస్తారు.’ (1 తిమోతి 5:⁠3) ఒక వ్యక్తిని సన్మానించడం అంటే, ఆ వ్యక్తికి గౌరవం చూపించడమే. సన్మానించబడే వ్యక్తులు తమ అభిప్రాయానికి విలువిస్తున్నట్లు, తమను ప్రియమైనవారిగా ఎంచుతున్నట్లు, గౌరవిస్తున్నట్లు అనుభూతిని పొందుతారు. ఇతరులు ఇక తప్పదన్నట్లు తమకు సహాయం చేస్తున్నారని వాళ్ళకనిపించదు. తాను కూడా కొంతకాలం విధవరాలుగా ఉన్నప్పటికీ రూతు, నయోమి యొక్క శారీరక భావోద్వేగ అవసరాలను ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా తీరుస్తూ నయోమిని నిజంగా సన్మానించింది. నిజానికి, రూతు మనోవైఖరి, ఆమెకు త్వరలోనే మంచి పేరును సంపాదించి పెట్టింది. కనుకనే ఆమెకు కాబోయే వరుడు, “నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు” అని చెప్పగలిగాడు. (రూతు 3:​11) అదే సమయంలో, నయోమికి దేవుని మీద ఉన్న ప్రేమ, అర్థంచేసుకునే స్వభావమూ, తన కోసం రూతు చేస్తున్న విషయాలపట్ల ఆమెకున్న ప్రగాఢమైన మెప్పుదలా, రూతు ఆమెకు సహాయం చేయడంలో ఆహ్లాదాన్ని పొందేలా చేశాయనడంలో సందేహం లేదు. నేటి విధవరాండ్రకు నయోమి ఎంత చక్కని మాదిరిగా ఉంది!

దేవునికి సన్నిహితులు కండి

వివాహజత మరణం మూలంగా ఏర్పడిన శూన్యతను కుటుంబ సభ్యులూ, స్నేహితులూ పూడ్చలేరన్నది నిజమే. అందుకే, వైధవ్యం వల్ల బాధపడుతున్నవారు, ‘కనికరము చూపు తండ్రియు, శ్రమలలో ఉన్న మనలను ఆదరించు సమస్తమైన ఆదరణను అనుగ్రహించువాడును అయిన దేవునికి’ దగ్గరవ్వడం చాలా ప్రాముఖ్యం. (2 కొరింథీయులు 1:​3, 4) యేసు జన్మించినప్పుడు 84 ఏండ్లున్న భక్తురాలైన అన్న అనే విధవరాలి మాదిరిని పరిశీలించండి.

పెళ్లయిన ఏడేండ్లకే భర్త చనిపోయినప్పుడు, అన్న ఓదార్పు కోసం యెహోవా వైపుకు మళ్ళింది. “[ఆమె] దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.” (లూకా 2:​36, 37) అన్న దైవ భక్తికి యెహోవా ప్రతిస్పందించాడా? ప్రతిస్పందించాడు! పెరిగి పెద్దై లోక రక్షకుడుగా మారనున్న శిశువును చూసే అవకాశాన్ని ఆమెకివ్వడం ద్వారా ఆమె మీద తనకున్న ప్రేమను ఆయన ప్రత్యేకమైన విధంగా చూపించాడు. ఇది ఆమెకు ఎంతో పులకింతతోపాటు ఎంతో ఊరట కలిగించి ఉంటుంది! “యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును” అని చెబుతున్న కీర్తన 37:4 లోని సత్యాన్ని ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకోగల్గిందన్నది స్పష్టం!

దేవుడు తోటి క్రైస్తవుల ద్వారా సహాయం చేస్తాడు

“డేవిడ్‌ చనిపోయిన చాలా కాలం వరకు, నాకు ఒళ్ళు నొప్పులుండేవి. నా ప్రక్కటెముకల్లో కత్తిపెట్టి త్రిప్పినటువంటి నొప్పి కలిగేది. అది అజీర్తేమో అనుకున్నాను. ఒక రోజు ఆ నొప్పి చాలా తీవ్రమైంది, ఇక నేను డాక్టరు దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాను. వివేచనగల ఆధ్యాత్మిక సహోదరీ స్నేహితురాలూ అయిన ఒకరు, నా దుఃఖమే దానికి కారణమై ఉండవచ్చు అని చెప్పి, సహాయం కోసం ఓదార్పు కోసం యెహోవాను వేడుకోమని నన్ను ప్రోత్సహించింది. ఆమె ఇచ్చిన సలహాను అప్పుడే అక్కడే పాటించాను, ఈ దుఃఖాన్ని తాళుకునేందుకు నాకు సహాయం చేయమని కోరుతూ మౌనంగానే అయినా హృదయపూర్వకంగా యెహోవాకు ప్రార్థించాను. ఆయన నాకు సహాయం చేశాడు!” అని ఇలేన్‌ చెబుతుంది. ఇలేన్‌ కాస్త ఉపశమనాన్ని పొందనారంభించింది, తర్వాత త్వరలోనే ఆమెకు ఒళ్ళు నొప్పులు తగ్గాయి.

దుఃఖిస్తున్న విధవరాండ్రకు, ముఖ్యంగా సంఘ పెద్దలు, దయాపూర్వకంగా స్నేహాన్ని చూపవచ్చు. విధవరాండ్రు శ్రమల్లో ఉన్నప్పటికీ యెహోవాకు సన్నిహితంగా ఉండేందుకుగాను పెద్దలు వారికి క్రమమైన ఆధ్యాత్మిక మద్దతును లౌక్యంగా, వివేచనాపూర్వకంగా ఇవ్వడం ద్వారా సహాయపడగలరు. అవసరమైతే, వస్తుపరమైన మద్దతునిచ్చే ఏర్పాటు చేయడం ద్వారా కూడా పెద్దలు సహాయపడగలరు. సానుభూతీ, వివేచనా గల పెద్దలు అలా నిజంగా “గాలికి మరుగైనచోటువలె” ఉంటారు.​—⁠యెషయా 32:2; అపొస్తలుల కార్యములు 6:1-3.

క్రొత్త భూరాజు నుండి శాశ్వత ఓదార్పు

దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం వృద్ధురాలైన అన్న ఎవరిని చూసి ఆనందించిందో ఆ బాలుడు ఇప్పుడు, దేవుని పరలోక రాజ్యపు మెస్సీయ రాజు అయ్యాడు. ఆ ప్రభుత్వం, మరణంతో సహా దుఃఖానికి కారణమయ్యే వాటన్నింటిని త్వరలోనే తీసివేస్తుంది. ప్రకటన 21:⁠3, 4 దీన్ని గురించి చెబుతూ, “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, . . . ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని” అంటున్నాయి. ఈ వచనాలు, “మనుష్యుల” గురించి పేర్కొంటున్నాయని మీరు గమనించారా? అవును, మానవులు మరణం నుండి, దాని వల్ల కలిగే సమస్త బాధల నుండి వేదనల నుండి విడిపించబడతారు.

అయితే సువార్త అంతటితో ముగియలేదు! మృతుల పునరుత్థానాన్ని గురించి కూడా బైబిలు వాగ్దానం చేస్తోంది. “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.” (యోహాను 5:​28, 29) యేసు పునరుత్థానం చేసిన లాజరులాగే, వాళ్ళు ఆత్మ ప్రాణులుగా కాక, మానవులుగా బయటికి వస్తారు. (యోహాను 11:​43, 44) పునరుత్థానం తర్వాతికాలంలో “మేలుచేసినవారు” మానవ పరిపూర్ణతకు తీసుకురాబడతారు, యెహోవా, ‘తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచు’నప్పుడు, తండ్రిగా ఆయన చూపే శ్రద్ధను ప్రత్యక్షంగా అనుభవిస్తారు.​—⁠కీర్తన 145:⁠16.

మరణం మూలంగా తనకు ప్రియమైన వ్యక్తిని కోల్పోయినవారూ, ఈ నిశ్చయమైన నిరీక్షణను విశ్వసించేవారూ, ఈ నిరీక్షణను బట్టి చాలా ఊరటను పొందుతారు. (1 థెస్సలొనీకయులు 4:​13) మీరొక విధవరాలు అయితే, ఓదార్పునూ, మీకున్న అనేక బాధ్యతలను నిర్వర్తించేందుకు అనుదినం అవసరమైన సహాయాన్నీ పొందేందుకు మీరు తప్పనిసరిగా “యెడతెగక ప్రార్థనచేయుడి.” (1 థెస్సలొనీకయులు 5:​17; 1 పేతురు 5:⁠7) దేవుని వాక్యాన్ని చదివేందుకు ప్రతిరోజూ కొంత సమయాన్ని తీసుకోండి, అలా దేవుని తలంపులు మీకు సాంత్వననివ్వగలవు. మీరు ఈ విధంగా చేస్తే, విధవరాలిగా మీకు ఎన్నో శ్రమలూ సవాళ్ళూ ఎదురైనప్పటికీ, మీరు మనశ్శాంతిని పొందేందుకు యెహోవా ఎలా సహాయం చేస్తాడో మీరే చూడగల్గుతారు.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

సహాయకరంగా ఉండడమంటే, ఇతరుల ఏకాంతానికి గౌరవమిస్తూనే, అవసరమైనప్పుడు మనం వారికి అందుబాటులో ఉంటూ సమతుల్యతను పాటించడమని అర్థం

[7వ పేజీలోని చిత్రం]

వృద్ధురాలూ విధవరాలూ అయిన అన్నను దేవుడు ఆశీర్వదించాడు